సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 899వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప ఉంటే ఏదైనా సంభవమే!
2. బాబాతో చెప్పుకోవడం - అంతలోనే ఆ కష్టం తీరడం
3. చల్లని బాబా దీవెన

బాబా కృప ఉంటే ఏదైనా సంభవమే!


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ఇదివరకు నేను నాలుగు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. నాకు పెళ్ళైన తరువాత మా అత్తగారు నా దగ్గర, మరికొంతమంది దగ్గర మా అమ్మని టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటూ ఉండేవారు. అవి విని నేను తట్టుకోలేకపోయేదాన్ని. నాకు చాలా బాధ కలిగేది, కోపం కూడా వచ్చేది. కానీ ఏం చేయలేక మౌనంగా ఉండేదాన్ని. ఆ మాటలు చిన్నవా, పెద్దవా అని ప్రక్కన పెడితే, నా తల్లిదండ్రులని పరోక్షంగా ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేను. కారణం, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఒకరి గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడే స్వభావం లేనివాళ్ళు. అలాంటివాళ్ళని పరోక్షంగా అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండటం వల్ల నేను మానసికంగా ఒత్తిడికి లోనయ్యేదాన్ని. నిజానికి మా అత్తావాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు. కేవలం మా వాళ్ళని మాత్రం అలా అంటూ ఉండటం వల్ల నేను చాలా ఆందోళన చెందేదాన్ని. ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఎప్పుడైనా మా అమ్మావాళ్ళు మా ఇంటికి వస్తానంటే నాకు భయం వేసేది. కానీ వాళ్ళు ఎప్పుడూ రాలేదు. ఇలా ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది. తర్వాత నేను గర్భవతిని అయ్యాను. ఐదవ నెలలో దొంగ చలిమిడి పెట్టడానికి మా అమ్మ ఖచ్చితంగా వచ్చి చిన్న ఫంక్షన్ చేయాలి. దానికోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇక నా భయం చూడాలి. దాంతో నేను పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరం తర్వాత మొదటిసారి బాబాను ప్రార్థించాను. "బాబా! మా అమ్మావాళ్లు వచ్చి ఫంక్షన్ బాగా చేయాలి. మా అత్తగారు మెచ్చుకోవాలి. మెచ్చుకోకపోయినా పర్వాలేదు గానీ, చెడుగా మాత్రం అనుకోకూడదు. ప్లీజ్ బాబా! మా అత్తగారు, మా అమ్మావాళ్ళు ఒకరి మీద ఒకరికి ఎలాంటి అసూయా ద్వేషాలు లేకుండా మంచి అభిప్రాయం కలిగి ఉండేలా చూడు తండ్రీ. అలా గనుక ఫంక్షన్ హ్యాపీగా జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత 2021, జూలై 14న చలిమిడి ఫంక్షన్ ఎలాంటి గొడవలు, మాటపట్టింపులు లేకుండా సంతోషంగా, చాలా బాగా జరిగింది. మా అమ్మ, అత్తగారు చాలా బాగా కలిసిపోయారు. మర్యాదలు కూడా బాగా జరిగాయి. నాకైతే చాలా చాలా సంతోషంగా, ఎంతో ఉపశమనంగా అనిపించింది. ఇదంతా బాబా దయ. "అన్నిటికీ థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే సెప్టెంబర్ లో సీమంతము వేడుక కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా జరిగితే, మరలా నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను".


మరో అనుభవం: నేను చిన్నప్పటినుండి చాలా భయస్థురాలిని. అంటే, బాగా దగ్గరవాళ్ళతో మాట్లాడినంత ధైర్యంగా క్రొత్తవాళ్లతో మాట్లాడలేకపోయేదాన్ని. అందరూ నన్ను సైలెంట్ అనేవాళ్ళు. పెళ్ళికి ముందు అది బాగానే ఉండేది. కానీ, పెళ్ళైన తర్వాత అందరూ నన్ను ‘తను సైలెంట్, పాపం’ అంటుంటే నాకే ఏదోలా అనిపించి, పిరికిదాన్ని అయ్యానని బాధపడేదాన్ని. పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత, "బాబా! నాకు వాక్చాతుర్యాన్ని ప్రసాదించండి"అని బాబాను ప్రార్థించాను. అదే సమయంలో నేను మహాపారాయణ గ్రూపులో చేరాను. తరువాత అద్భుతంగా నాకు మంచి మాటకారితనం వచ్చింది. ఇప్పుడు నేను అందరితో వ్యవహరించగలుగుతున్నాను. పెద్ద తరహా పనులు, మాటలు అన్నీ బాగా నేర్చుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. నిజంగా ఇలా మాట్లాడగలనని నేను కలలో కూడా ఊహించలేదు. బాబా వల్లే నాకు వాక్చాతుర్యం వచ్చింది. "బాబా! మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. థాంక్యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ బాబా. మా తప్పులను క్షమించి, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి బాబా. మా మనసులను శుభ్రపరచి ఎల్లప్పుడూ మీ ధ్యాసలో, ధ్యానంలో ఉండేటట్టు అనుగ్రహించండి".


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.


బాబాతో చెప్పుకోవడం - అంతలోనే ఆ కష్టం తీరడం


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగును నిర్వహించే సాయికి బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆనాడు హేమాడ్‌‌పంతు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారి అనుగ్రహాన్ని పొందిన ఎంతోమంది భక్తుల అనుభవాలను సేకరించి ‘శ్రీసాయిసచ్చరిత్ర’ రూపంలో మనకు అందించారు. అయితే, అందులో లేని మరెందరో భక్తుల అనుభవాలను, బాబా లీలలను సేకరించి మనకు అందిస్తున్న ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్’ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ పరిచయం అయినప్పటినుండి ఏ కష్టమొచ్చినా ‘నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాతో చెప్పుకోవడం, అంతలోనే బాబా అనుగ్రహంతో ఆ కష్టం తీరడం, నేను సాటి సాయిబంధువులతో బాబా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడం జరుగుతోంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే..


నా పేరు శ్రీదేవి. నాకు కట్నంగా ఇచ్చిన భూమి ఇప్పటికీ మా అమ్మ పేరు మీదనే ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఏ నగదైనా అమ్మ అకౌంటులోకే వస్తాయి. అయితే ఈమధ్య రైతు భరోసా పథకం విషయంగా అమ్మ వేలిముద్రలు కోసం వాలంటరీ ఇంటి వద్దకే వచ్చారు. కానీ అమ్మ వేలిముద్రలు పడలేదు. అందువల్లా, మరికొన్ని కారణాలవల్లా అమ్మ ఆ పొలానికి సంబంధించి ప్రక్కఊరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆరోగ్యం అంతగా సహకరించకపోవడం వల్ల అమ్మ ఊరు వెళ్ళే పరిస్థితిలో లేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "బాబా! అమ్మ ప్రక్కఊరికి వెళ్లే పనిలేకుండా ఇక్కడే భూమికి సంబంధించిన పని జరిగేలా అనుగ్రహించు తండ్రీ. అలా జరిగితే నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని మనసులో అనుకుని అమ్మకి ఫోన్ చేశాను. బాబా ఎంతటి కరుణామయులంటే, అప్పటికే తమ అనుగ్రహాన్ని చూపించారు. అమ్మ నాతో, "ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా పని పూర్తయింది" అని చెప్పింది. "ధన్యవాదాలు సాయితండ్రీ. ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడండి బాబా".


2021, ఆగస్టు 15న మా మరిది ఆరోగ్యం బాగాలేక కొన్ని పరీక్షలు చేయాల్సి వచ్చింది. వాటి ఫలితాలు ఆగస్టు 17న వస్తాయని డాక్టరు చెప్పారు. ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు 'శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించడం, దాంతో ఆ సమస్య తీరడం గురించి ఈ బ్లాగులో ప్రచురితమైన భక్తుల అనుభవాలలో నేను చదివాను. నేను, నా చెల్లెలు కూడా ఆ మంత్రాన్ని రిపోర్టులు వచ్చేదాకా జపించాము. బాబా దయవల్ల, "పెద్ద ప్రాబ్లం ఏమీ లేదని, చిన్న సమస్యలేన"ని డాక్టర్ చెప్పారు. ఇదంతా బాబా నామం యొక్క మహిమ వల్లే సాధ్యమైంది. "బాబా! ఇలాగే మీ అనుగ్రహాన్ని చెల్లెలి కుటుంబంపైనా, సాయిబంధువులందరిపైనా ఉండేలా దయచూపండి".


చల్లని బాబా దీవెన


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నా నమస్కారములు. సాయినాథుడు నాకు చేసిన మేలుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేయటంలో కాలయాపన చేసినందుకు ఆ సాయిదేవుడు నన్ను క్షమించగలరని ప్రార్థన. నా పేరు సామ్రాజ్యం. నేను టీచరుగా పనిచేస్తున్నాను. గత ఏప్రిల్, మే నెలల్లో మా పాపకు, తరువాత మావారికి, పిమ్మట నాకు కరోనా సోకింది. సర్వదేవతా ప్రార్థనలతో కరోనా తగ్గింది. అయితే, కరోనా తగ్గిన తరువాత సైడ్ ఎఫెక్ట్స్‌గా నాకు పైల్స్ సమస్య వచ్చింది. మందులు వాడిన తర్వాత కొంచెం పర్వాలేదనిపించి మందులు వాడటం ఆపేశాను. ఆ సమయంలో నిద్ర సరిగా పట్టేది కాదు. దాంతో వేడి వలన పైల్స్ బాగా ఎక్కువైపోయి నిలబడలేక, కూర్చోలేక ఎంతో బాధను అనుభవించాను. మరలా డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే, అదివరకు నేను చూపించుకున్న డాక్టర్ సెలవులో ఉన్నారని చెప్పారు. అప్పుడు నేను బాధని తట్టుకోలేక ఆ సాయినాథుని మనస్పూర్తిగా ప్రార్థించి, "తండ్రీ! నాకు సరైన డాక్టరుని చూపించండి" అని వేడుకుని హాస్పిటల్‌కి వెళ్లాను. ఆశ్చర్యం! సెలవులో ఉన్నారన్న డాక్టర్, సెలవు రద్దు చేసుకుని వచ్చారని తెలిసింది. వెంటనే ఆ డాక్టరుని సంప్రదించి, తను సూచించిన మందులు వాడాను. దాంతో నాకు నయమైంది. ఆ సాయిదేవుని మహిమతో మామూలు స్థితికి రాగలిగాను. ఇకపోతే, ఈమధ్య వచ్చిన 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో మా పాపలిద్దరికీ 10 పాయింట్లు వచ్చి, A గ్రేడు వచ్చింది. "పిల్లల చదువు విషయంలో చల్లగా దీవించినందుకు ధన్యవాదాలు బాబా. మీ కృప ఎల్లవేళలా ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను తండ్రీ".


10 comments:

  1. Om sai ram ������

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Please slow my health issues

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  5. Baba ee gadda tondarga karginchu thandri

    ReplyDelete
  6. Baba karthik, santosh health bagundali thandri

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🌺🌼😊🌹🌸🥰😀

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo