సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాధాకృష్ణమాయి - పదవ భాగం



గమనిక:- చక్కటి అవగాహన కొరకు వీలైతే ఈ భాగాన్ని చదివేముందు ముందు భాగాన్ని ఒకసారి చదవవలసిందిగా మనవి. అందుకోసం ముందు భాగం యొక్క లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాము. 


https://saimaharajsannidhi.blogspot.com/2021/08/blog-post_29.html



బాబా హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందిన పరమ భక్తురాలు - రెండవ భాగం... 


(ఇకపోతే,) "నా భక్తులను పతనం కానివ్వను" అని బాబా స్వయంగా చెప్పారు. మోహంలో పడి పతనం కాబోతున్న సాఠే విషయంలో ఆ వాగ్దానాన్ని బాబా ఎలా నిలుపుకున్నారో ఇంతకుముందు తెలుసుకున్నాము. ఒక సాధారణ భక్తుని విషయంలోనే అంతటి బాధ్యత వహిస్తే, శిరిడీ వచ్చింది మొదలు సర్వమూ తామేనని నమ్మి, పారమార్థికంగా ఎంతో ఎదిగిన తమ పరమ భక్తురాలి విషయంలో బాబా ఎంతటి బాధ్యత వహిస్తారో మనం ఊహించవచ్చు. కాబట్టి ఆయీ ఆత్మహత్యకు పాల్పడినా లేక మరోరకంగా పతనం వైపు అడుగులు వేసినా బాబా చూస్తూ ఊరుకోరు. ‘మరి అంతటి భక్తురాలికి అటువంటి ముగింపు ఏమిటి?’ అని అంటే, అది ఎప్పటికీ బదులు దొరకని ప్రశ్న. అయినా కొంచెం వివేచన చేసే ప్రయత్నం చేసినట్లైతే, "ఆమె తన కర్మబంధనాల నుండి విముక్తి కోరింది, నేను ఆమెకు హామీ ఇచ్చాను" అని బాబా ఆయీని ఉద్దేశించి అన్న మాటలను బట్టి ఆమె అన్ని బంధనాల నుండి విముక్తి కోరుకుందని అర్థమవుతోంది. అయితే, సమస్తాన్నీ విడిచి సద్గురు చరణాలను ఆశ్రయించినందువల్ల అయినవాళ్లతో ఆమెకు ఎటువంటి కర్మబంధనాలు లేకపోయుండొచ్చునేమోగానీ తల్లిలా, సోదరిలా స్వచ్ఛమైన ప్రేమను, ఆదరణను సాటి సాయిభక్తులపై చూపినందువల్ల ఆమెకు, వారికి మధ్య నిస్సందేహంగా ఋణానుబంధం ఏర్పడివుంటుంది. ఆ ఋణానుబంధం తొలగిపోనిదే ఆమె కోరుకునే కర్మబంధనాల నుండి విముక్తి ఆమెకు లభ్యం కాదు. భక్తోద్ధరణే తమ అవతారకార్యంగా అవతరించిన సద్గురుమూర్తి అలా జరగనిస్తారా?! ఆయీకిచ్చిన తమ హామీని నెరవేర్చడానికి ఆమె జీవించి ఉండగానే బాబా ప్రయత్నించారు. అయితే, ఈ విషయాన్ని బాబా నేరుగా చెప్పక, పలు సంఘటనల ద్వారా భక్తులను ఆమెకు దూరంగా ఉంచే యత్నం చేసేవారని తోస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ సాయిశరణానంద చెప్పిన కొన్ని సంఘటనలు మాత్రం ఇక్కడ ప్రస్తావనార్హం. శరణానంద తన స్మృతులలో ఇలా చెప్పాడు:


"బాపూసాహెబ్ జోగ్, బూటీలకు కిళ్ళీలంటే చాలా ఇష్టం. అందుకని రాత్రి భోజనం తరువాత రాధాకృష్ణమాయి వారికి కిళ్ళీలిచ్చేది. ఒకసారి నేను కూడా వారివద్దనే ఉన్నాను. నాక్కూడా కిళ్ళీ ఇచ్చారు. దాన్ని నమలడం వల్ల నా పెదవులు పండాయి. ఆయీ నా పెదవులపై చిటికేసి, 'బాగా పండింది' అన్నది. తరువాత నేను బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా నాతో, "కిళ్ళీ ఎందుకేసుకున్నావు? ఇంకెప్పుడూ వేసుకోవద్దు'" అని అన్నారు. మర్నాడు భోజనానంతరం రాధాకృష్ణమాయి నాకు కిళ్ళీ ఇవ్వబోతే నేను, "బాబా వద్దన్నారు” అన్నాను. అప్పుడు ఆయీ, “అవునవును, బాబా ప్రతి విషయంలోనూ ఏది సరియైనదో, ఏది సరియైనదికాదో నీకు చెప్తారు కదూ!' అన్నది. నేనందుకు సమాధానమివ్వలేదు. ఆ తరువాత నేనెప్పుడూ కిళ్ళీ వేసుకోలేదు”.


“శిరిడీలో ఆదివారంనాడు సంత పెట్టటం అప్పుడప్పుడే క్రొత్తగా ప్రారంభమవుతోంది. ఒకసారి రాధాకృష్ణమాయి నాతో, 'వామన్, నీవు సంతకు వెళ్ళి నీకిష్టమైన కూరగాయలు తీసుకురా" అన్నది. ఆయీ ఆదేశానుసారం నేను కూరగాయలు తెచ్చాను. తరువాత డా౹౹పిళ్ళే వచ్చాడు. రాధాకృష్ణమాయి ఆయనతో, 'ఈరోజు వామన్‌ని పంపించి కూరగాయలు తెప్పించాను. సాయంత్రం నేను స్వయంగా రొట్టెలు, కూర చేసి నీకూ, అతనికీ భోజనం పెడతాను" అన్నది. డా౹౹పిళ్ళే అందుకు ఆనందంగా అంగీకరించాడు. ఆ రాత్రి నియమానుసారం నేను మసీదుకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అప్పుడు బాబా నాకు రెండు వేరుశనగగింజలు ఇచ్చారు. ఆ గింజలు తినగానే నా ఆకలి తీరి కడుపు పూర్తిగా నిండినట్లు అనిపించింది. మసీదు నుండి తిరిగి వెళుతున్నప్పుడు బాబా నాతో, "వెళ్ళు! ఇప్పుడు వెళ్ళి నీ గదిలో కూర్చో, బయటకు రావద్దు" అన్నారు. కడుపు నిండివుండటం, అదీకాక గదిలోనే కూర్చోమని బాబా గట్టిగా ఆజ్ఞాపించటంతో రాధాకృష్ణమాయి ఆహ్వానంపై లభించే భోజనం (రొట్టెలు) తినవద్దని బాబా చెప్పారని నాకు స్పష్టమైంది. అందువలన రాధాకృష్ణమాయి పిలిచినప్పటికీ, 'నేను రాలేను' అని సమాధానమిచ్చాను. తరువాత చావడిలో శేజారతికి సిద్ధమయ్యేటప్పుడు రాధాకృష్ణమాయి నన్ను గట్టిగా పిలిచింది. కానీ నేను బాబా ఆజ్ఞని దృఢంగా పట్టుకుని బయటకు రాలేదు. చావడి ఉత్సవం రోజున సామాన్యంగా పల్లకీని భుజాలపై మోయడంగానీ, బాబా సమక్షంలో చామరం వీచటంగానీ లేదా నెమలిపింఛాల విసనకర్రతో విసరటంగానీ చేసేవాణ్ణి. చాలాసార్లు దండాన్ని కూడా పట్టుకొనేవాణ్ణి. బాపూసాహెబ్ జోగ్ బాబాకు ఆరతి ఇస్తున్నప్పుడు ఎన్నోసార్లు కర్పూరం బిళ్ళలు సరైన సమయంలో అందిస్తుండేవాణ్ణి. ఆ సేవలను ఆరోజు నేను చేయలేకపోయాను. మర్నాడు బాబా దర్శనార్థం మసీదుకి వెళ్లినప్పుడు బాబా నాతో, "నిన్న రాత్రి పిలిచి పిలిచి అలసిపోయాను. 'నేను గోడను పిలుస్తున్నానా? అనిపించింది. ఈ గోడలాగే నువ్వు కూడా కొంచెమైనా వినిపించుకోలేదు” అని అన్నారు. దాంతో నేను సందిగ్ధంలో పడిపోయాను. వేరుశనగపప్పు ఇచ్చినవారూ బాబానే, గదిలోనుంచి బయటకు రావద్దని ఆదేశించినవారూ ఆయనే. మరి, వాళ్ళంతా పిలిచినప్పుడు బాబా ఆజ్ఞను మన్నించి నేను బయటకు రాకపోతే అందులో నా దోషం ఏముంది? అయితే బయటకు రావద్దన్న బాబా ఆదేశం రాధాకృష్ణమాయి భోజనం వరకే ఉన్నది. సాటి సాయిభక్తులు పిలిచినప్పటికీ చావడికి వెళ్ళకపోవటం, బాబా సేవను తప్పించుకోవటం, బాబా సేవను విసర్జించటమనే తప్పు నా అజ్ఞానం వల్ల జరిగింది. బాబా ఆజ్ఞ ఒక పరిమితకాలం వరకే ఉంది. ప్రయోజనం అయిపోయాక కూడా దాన్ని నేను వ్యర్థంగా పట్టుకుని ఉన్నాను. భగవంతుని సేవను తప్పించుకోవటంతోపాటు బాబా ఆజ్ఞను ధిక్కరించటం కూడా జరిగింది”.


“ఇకపోతే, బాబా చావడిలో గానీ లేక మసీదులో గానీ పడుకునేటప్పుడు నేను నా పడక మీద నుండే మంగళ ఆరతి ఇచ్చేవాడిని. ఒకసారి వేసవిలో రాధాకృష్ణమాయి తన గుమ్మం ముందున్న అరుగుపై పడుకుని ఉంది. నేను నా గది బయట ఉన్న మట్టి అరుగుపై పడుకుని ఉన్నాను. ఆరతి సమయంలో, 'ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురు చరణకమలధావా' (బాబా, లేవండి సాయినాథ గురూ! మీ చరణ కమలాలను చూపండి) అనే తృతీయ భూపాలిలోని, "ఉఘడూనీ నేత్రకమలా దీనబంధూ రమాకాంతా పాహిబా కృపాదృష్టీ బాలకా జసీ మాతా" (హే దీనబంధూ, రమాకాంతా, నేత్రకమలాలను తెరచి తల్లి తన బిడ్డను ఎలా చూస్తుందో అలా కృపాదృష్టితో చూడండి) అనే పదాన్ని పాడుతూ నేను పక్కమీదే పడుకుని ఉన్నాను. అదే సమయంలో రాధాకృష్ణమాయి కళ్ళు తెరచి నా వైపు చూసింది. అప్పుడు, 'రాధాకృష్ణమాయి, బాబా ఒక్కరేననీ, ఆమె రూపంలో బాబా నాపై కృప చూపించార'నీ నాకనిపించింది. మనసులో ఈ ఆలోచన మెదిలిన మరుక్షణంలో మశీదులోంచి బాబా బిగ్గరగా, “నీ తల్లి ----” అంటూ చాలా చెడ్డగా తిట్టారు. దాంతో ఆయీ రూపంలో బాబా నా ప్రార్థన స్వీకరించారనే నా కల్పన తప్పని నేను తెలుసుకున్నాను. రాధాకృష్ణమాయి ప్రార్థన భావం వల్ల తను తాదాత్మ్యం చెందిందంతే. అందువల్ల బాబా స్థానంలో ఆమెను ఉంచడం యోగ్యం కాదని ఆ విధంగా బాబా సూచించారు”.


మనం కూడా సాటి సాయిభక్తులలో ఎవరైనా బాబా గురించి నాలుగు ముక్కలు మంచిగా చెప్పినా, బాబా సేవలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నా వారిని గొప్పగా చూడటం, గౌరవించడం, కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి వాళ్ళని గురువని సంబోధించడం చూస్తుంటాం. సామాన్య భక్తుల విషయంలోనే అలా ఉంటే, ఆయీతో శరణానందకు ఎంతో అనుబంధముంది, ఆమె అతనిచేత ఎన్నో సేవలు చేయించింది. అన్నిటికీమించి ఎన్నో ప్రత్యక్ష అనుభవాలు (ఇదివరకు చదువుకున్నాము) ఉన్నాయి. ఆ అనుభవాల ద్వారా ఆమె ఎంతటి సిద్ధురాలో చూసిన అతనికి 'రాధాకృష్ణమాయి, బాబా ఒక్కరే' అని అనిపించడం సహజమే కదా మరి! అటువంటి భావాలు, అంతటి సాన్నిహిత్యం అటు ఆయీకి, ఇటు సాయిభక్తులకు కూడా పారమార్థిక ప్రగతిలో ప్రతిబంధకాలయ్యే నేపథ్యంలో, పైన చెప్పుకున్నటువంటి సంఘటనల ద్వారా బాబా పరోక్షంగా తగు జాగ్రత్తలు తీసుకునేవారని తోస్తుంది. ఇకపోతే, "సాయిభక్తులైన శ్రీమహల్సాపతి, శ్రీహెచ్.ఎస్.దీక్షిత్‌లు ఆయీపట్ల ఎంతో గౌరవం కలిగివుండేవారు" అని రేగే తన లెటర్స్‌లో ప్రస్తావించారు. శరణానంద చెప్పిన ఈక్రింది సంఘటనను బట్టి కూడా ఆనాటి సాయిభక్తులలో చాలామందికి ఆయీపట్ల గొప్ప ఆరాధనాభావం ఉండేదని అర్థమవుతుంది.


"ఒకసారి సాయంకాలం మసీదులో అందరూ సమావేశమయ్యే సమయంలో నేను వెళ్ళి కఠడా బయట కూర్చున్నాను. ఆ సమయంలో బాబా కొంచెం కోపంగా ఉన్నట్లు కనిపించారు. కాసేపటికి కాకాసాహెబ్ తదితర సాయిభక్తులు కొంతమంది బాబా సమక్షంలో కూర్చోవటానికి మసీదు మెట్లెక్కి పైకి వచ్చారు. కానీ బాబా వాళ్ళను అక్కడ కూర్చోనివ్వక నన్నొక్కడినే ఒంటరిగా కూర్చోబెట్టుకొని, “వీరంతా ఆమెను (రాధాకృష్ణమాయిని) తీసుకొచ్చి నా ఎడమచేతి ముందు కూర్చోపెట్టాలనుకుంటున్నారు. కానీ ఆమెను నేనిక్కడ కూర్చోనివ్వను. ముంబాయి వాళ్ళందరూ అలిగారు. అందరూ కేవలం స్త్రీనే చూస్తున్నారు. స్త్రీలకే మనుషులు బానిసలవుతున్నారు” అని అన్నారు".


పై బాబా మాటలలో వారి ఆంతర్యమేమిటో పూర్తిగా మన అవగాహనకు రాకపోయినప్పటికీ కాస్త నిశితంగా పరిశీలించినట్లైతే, బాబా ఆయీని మసీదులోకి అనుమతించకపోవడం పట్ల సాయిభక్తుల మనసుల్లో, ముఖ్యంగా ముంబాయికి చెందిన సాయిభక్తుల మనసుల్లో ఏదో వెలితి ఉండేదనీ, ఆమెను బాబా మసీదులోకి అనుమతించాలని వాళ్ళు కోరుకుంటున్నారనీ అర్థమవుతుంది. ప్రథమ దర్శనంలోనే బాబా సన్నిధి ముందు, వారి కృపాకటాక్షవీక్షణాల ముందు లౌకిక సుఖాలు అత్యల్పమనిపించి వాటన్నింటినీ ఉపేక్షించి శిరిడీనే తన నివాసంగా చేసుకున్న కాకాసాహెబ్ దీక్షిత్ వంటి భక్తులు సైతం ఆయీపై ఉన్న గౌరవంతో తమ అభిమతానికి విరుద్ధంగా ఆమెను మసీదులోకి అనుమతించాలని కోరుకోవడాన్ని ఉద్దేశించే బాబా కాస్త వ్యంగ్య ధోరణిలో, "అందరూ కేవలం స్త్రీనే చూస్తున్నారు. స్త్రీలకే మనుషులు బానిసలవుతున్నార"ని అని ఉండవచ్చు.  


ఏదేమైనా ఆయీపట్ల సాటి సాయిభక్తులకు ఆరాధనాభావం ఉండటం స్పష్టం. కాబట్టి, ఆయీకిచ్చిన తమ హామీననుసరించి, తమ భక్తులలో ఆయీపై ఉన్న ఆ ఆరాధనాభావాన్ని తొలగించడం ద్వారా ఆ కర్మబంధనాల నుండి ఆమెకు విముక్తిని ప్రసాదించడానికే అంతిమసమయంలో ఆమెకు అటువంటి పరిస్థితిని బాబా కల్పించి ఉండవచ్చు. దానివల్ల, భక్తులు ఆమెపై ఏర్పడిన కళంకాన్ని లక్ష్యపెట్టక మునుపటిలా ఆయీపై ఆరాధనాభావంతో ఉండలేరు. అలాగని ఆమెపై ఏర్పడిన కళంకానికి విలువనిచ్చి అంతవరకూ ఆమెపై ఉన్న ఆరాధనాభావాన్ని కోల్పోయి ద్వేషాన్నీ పెంచుకోలేరు. అందుకే అటువంటి తటస్థస్థితిని కల్పించి బాబా ఆయీకి విముక్తిని ప్రసాదించి ఉండవచ్చునని అనిపిస్తుంది. అయితే, ఇది కొంత విశ్లేషణ మాత్రమే, ఇదే వాస్తవమని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే, "నా చర్యలు అగాధాలు" అని బాబా స్వయంగా చెప్పిన మాట. కాబట్టి ఆ అగాధాల లోతు మనం ఎన్నటికీ తెలుసుకోలేము. ఏమి చెప్పినా అది మన కల్పనే అవుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం. బాబాను దర్శించి వారి అనుగ్రహంతో ఎందరో భక్తులు ఎన్నో రీతుల శ్రేయస్సును పొందారు. బాబాను నమ్మి పతనమైనవారు ఎవరూ లేరు. కాబట్టి బాబా ఏం చేసినా ఆయీ పారమార్థిక ప్రగతి కోసమే చేసివుంటారు. బాబా తమ హృదయాన్ని చూపుతూ, "ఆమె ఇక్కడ చేరింది" అని అన్నారు. నిజమైన సద్గురు భక్తులు స్వర్గలోకప్రాప్తినో, ముక్తినో, మోక్షాన్నో కోరుకోరు. వాళ్ళు సదా తమ గురువు యొక్క పాదాలను అంటిపెట్టుకొని ఉండాలని కోరుకుంటారు. అలాంటిది, ఆయీ తన సద్గురువైన బాబా హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. అంతకుమించిన భాగ్యం ఏ సాయిభక్తునికైనా మరేముంటుంది? కాబట్టి ఆయీ ధన్యురాలు. తనవారినందరినీ విడిచిపెట్టి, బాబానే అంటిపెట్టుకొని, క్షణమైనా వృధాచేయక అహర్నిశలూ వారి సేవలో, స్మరణలో గడిపి చివరికి వారిలోనే ఐక్యమైన గొప్ప భక్తురాలు ఆయీ.


మరణానంతరం బాబా సేవలో:


అవస్తే ఒకరోజు పూణేలోని తన ఇంట్లో పూజ పూర్తిచేసిన తర్వాత ఆ గదంతా గులాబీల పరిమళంతో నిండిపోయింది. అకస్మాత్తుగా ఆ పరిమళం ఎలా వచ్చిందో అతనికి అంతు చిక్కలేదు. అతను తన ఇంటి చుట్టూరా పరిశీలించినప్పటికీ అందుకు కారణం తెలుసుకోలేకపోయాడు. ఆ పరిమళం దాదాపు ఒక గంటసేపు అలాగే ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత రాధాకృష్ణమాయి కన్నుమూసినట్లు అతనికి శిరిడీ నుండి ఒక లేఖ వచ్చింది. తరచి చూస్తే, ఆయీ మరణించినరోజు, తన ఇంటి పూజగదిని గులాబీల పరిమళం ఆవరించినరోజు ఒకటేనని స్పష్టమైంది.


కొన్ని నెలల తరువాత 1918లో అవస్తే తన భార్యతో కలిసి శిరిడీ సందర్శించాడు. ముందుగా అతను బాబా దర్శనం చేసుకొని, తరువాత వారి ఆదేశం మేరకు ఎప్పటిలాగే రాధాకృష్ణమాయి నివాసముండిన కుటీరంలో బసచేశాడు. అతని భార్య బాబా కోసం నైవేద్యం తయారుచేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే, బొగ్గులు తడిగా ఉన్నందున ఆమె ఎంత ప్రయత్నించినా అవి రాజుకోలేదు. అంతలో, ఆమె చూస్తుండగానే అకస్మాత్తుగా రాధాకృష్ణమాయి వచ్చి బొగ్గులపొయ్యిని వెలిగించడమే కాకుండా బాబాకు నైవేద్యం తయారుచేయడంలో ఆమెకు సహాయం చేసి వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం అవస్తే భార్య తమతోపాటు భోజనం చేయడానికి రాధాకృష్ణమాయి వస్తుందని ఎదురుచూసినప్పటికీ ఆయీ రాలేదు. బహుశా ఆమె ఏదైనా పనిలో నిమగ్నమై ఉండవచ్చని భావించిన అవస్తే భార్య ఆయీ కోసం వెతికింది. కానీ ఆయీ ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఆమె పొరుగువారిని విచారించగా, ఆయీ 1916లోనే మరణించినట్లు తెలిసి ఆమె నిర్ఘాంతపోయింది. నిజానికి ఆ విషయం ఆమెకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు రాధాకృష్ణమాయి ప్రత్యక్షంగా కనిపించేసరికి ఆమె ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయి ఆయీ బ్రతికే ఉందనే భావనలో ఉండిపోయింది. ఈ సంఘటన ద్వారా, మరణానంతరం కూడా ఆయీ బాబా సేవలో నిమగ్నమై ఉందనీ, దేహం అదృశ్యమైనా ఆమె ఆత్మ తన సద్గురువైన బాబా సన్నిధిని వీడిపోలేదనీ అర్థమవుతుంది.


రాధాకృష్ణమాయి ఫోటో లేకపోవడానికి కారణం:


శిరిడీలోని శ్రీసాయిబాబా సమాధిమందిరంలో మనకు ఎంతోమంది ఆనాటి సాయిభక్తుల ఫోటోలు దర్శనమిస్తాయి. కానీ ఆ సాయిభక్తుల ఫోటోల మధ్య శిరిడీ సంస్థాన్ వైభవానికి ముఖ్య కారకురాలైన రాధాకృష్ణమాయి ఫోటో లేకపోవడానికి, అసలు ఆమె ఫోటో ఎక్కడా లభ్యం కాకపోవడానికి గల కారణాన్ని రేగే ఇలా వివరించాడు: "ఒకసారి ముంబాయికి చెందిన ఒక పెద్దమనిషి రాధాకృష్ణమాయికి తెలియకుండా ఆమె ఫోటోలు కొన్ని తీశాడు. ఆ విషయం ఎలాగో అమ్మకి తరువాత తెలిసింది. అయితే, అప్పటికే అతను శిరిడీ విడిచి టాంగాలో ప్రయాణమయ్యాడు. వెంటనే అమ్మ పరుగు పరుగున ఒక మైలు దూరం వెళ్లి, టాంగాను ఆపించి, ఆ పెద్దమనిషి వద్ద నుండి కెమెరా లాక్కొని విరగగొట్టింది. బాబాకు ఆత్మీయ భక్తుడైన తాత్యాకోతేపాటిల్ ఈ విషయాన్ని నాకు అమ్మ సమక్షంలోనే చెప్పాడు. అంతలా ఆయీ ప్రచారాన్ని అసహ్యించుకొనేది".


 సమాప్తం.

source: రేగే లెటర్స్, 'దేవుడున్నాడు లేడంటావేమి?' బై విమలాశర్మ.

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


6 comments:

  1. Jai Sairam
    Jai sairam

    Tq very much fir this article on Mai. Very very nice leela

    ReplyDelete
  2. Om Sairam!

    ReplyDelete
  3. Om Sree Sachidananda Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌸😊🌼🌹🌺

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo