బాబా హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందిన పరమ భక్తురాలు
1916లో 35 సంవత్సరాల వయస్సులో రాధాకృష్ణమాయి మరణించింది. ఆకస్మికంగా సంభవించిన ఆమె మరణం మాత్రం పలు అనుమానాలకు, అపోహలకు దారితీసి ఆమెపై లేనిపోని కళంకాన్ని ఆపాదించింది. ఆమెపై ఏర్పడ్డ కళంకం గురించి, అందులోని పూర్వాపరాల గురించి మాట్లాడుకునేవారికి బాబా ఇచ్చిన సమాధానాన్ని, అన్నిటికీ మించి తమనే అనన్యంగా అంటిపెట్టుకున్న పరమభక్తురాలైన ఆయీని బాబా ఎలా అనుగ్రహించారోననే విషయాన్ని సాయిభక్తుడు యం.బి.రేగే ఎంతో వివరంగా ఈవిధంగా తెలియజేశారు:
"రాధాకృష్ణమాయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆ బిడ్డ చనిపోయింది, అలాగే ఆయీ కూడా" అన్న సమాచారాన్ని నేను మొదట నార్వేకర్ పంపిన లేఖ ద్వారా తెలుసుకున్నాను. అయితే, ఆయీ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి నాకేమీ తెలియదు. వాస్తవానికి ఆయీ మరణించడానికి రెండు నెలల ముందు నేను, నా భార్య కొన్నిరోజులపాటు ఆమెతో శిరిడీలో ఉన్నాము. అప్పుడు ఆయీ గర్భవతి అన్న ఆనవాలు మాకేమీ కనిపించలేదు. మేము ఆమెను చూసుకున్నాంగానీ, ఆమె పరిస్థితిని కాకపోయి ఉండొచ్చు. బహుశా బయటవాళ్ళని/గ్రామస్థులను కలవని కారణంగా నేను ఆమె గురించి ఎటువంటి వదంతులూ వినలేదు.
అప్పుడొకరోజు మసీదు శుభ్రపరిచిన తరువాత ఆయీ బయటికి వచ్చి, బాబా ప్రతిరోజూ ఉదయం తమ కాళ్ళుచేతులు, ముఖం కడుక్కొనే మసీదు అరుగుపై తన తలను ఆనించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి బాబా లెండీ నుండి తిరిగి వచ్చి, ఆయీ వెన్నుతట్టి, "రామక్రిష్నీ, నేనుండగా ఎందుకు బాధపడుతున్నావు?" అని అన్నారు. వెంటనే ఆయీ తన ఇంటికి పరుగుతీసింది. బాబా ఆమెతో ఏదైనా మాట్లాడటం నేను చూసిన సందర్భం అదొక్కటే. కానీ బాబాకు, ఆమెకు మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉన్నట్లు నేను చాలా సందర్భాలలో గుర్తించాను.
ఆయీ మరణించిన రెండునెలల తరువాత నేను శిరిడీ వెళ్ళాను. అప్పుడు ఎక్కడ బస చేయాలో తెలియక నేరుగా మసీదుకు వెళ్ళాను. బాబా నన్ను, "దీక్షిత్ వాడాకు వెళ్ళమ"ని చెప్పారు. వారి ఆదేశం మేరకు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ శ్రీమాధవరావు దేశ్‌పాండే తదితరులు ఆయీ మరణం గురించి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, 'ఇది శిరిడీలో జరిగి ఉండకూడదు" అని అన్నారు. అందుకు నేను, "ఆ విషయంపై చర్చించడం నాకు ఇష్టం లేదు. ఆమె నాకు తల్లి. ఆమె విషయంలో తప్పు ఉన్నప్పటికీ నేను ఇలాగే ఉంటాను. భగవద్గీతలోని 9వ అధ్యాయం, 30వ శ్లోకంలో, 'మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగున'ని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు" అని బదులిచ్చాను. ఇలా సంభాషణ జరుగుతుండగా నాతోపాటు వాడాలో ఉన్న అందర్నీ మసీదుకు రమ్మని బాబా వద్ద నుండి సందేశం వచ్చింది. వెంటనే మేము మసీదుకు వెళ్ళాము. బాబా, "దేని గురించి మీరు మాట్లాడుతున్నారు?" అని మాధవరావు దేశ్‌పాండేని అడిగారు. అంతేకాదు, నేనేమి చెప్పానని కూడా అడిగారు. విషయం చెప్పాక బాబా నాతో, "ఈ మూర్ఖులకు ఏం తెలుసు? ఆమె నీకు, నాకు తల్లి. ఆమె తన కర్మబంధనాల నుండి విముక్తి కోరిందనీ, నేను ఆమెకు హామీ ఇచ్చాననీ నీకు తెలుసు! ఒక రాత్రి ఆమె నా వద్దకొచ్చి, 'నేను ఇంక వేచి ఉండలేన'ని చెప్పి, నా కఫ్నీ పైకెత్తి, (బాబా తమ హృదయాన్ని చూపిస్తూ) ఇక్కడికి చేరింది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఆమెను ఇక్కడ చూడవచ్చు" అని అన్నారు. దైవసమానురాలైన నా తల్లి ఇప్పుడు సద్గురువు(బాబా)లో ఐక్యమైంది. ప్రజలు తమకు తోచినట్లు ఊహించుకోనీ. నేను మాత్రం ఆమెకు ఋణపడి ఉన్నానని ఎన్నటికీ మరువను".
బాబా అంత స్పష్టంగా చెప్పినప్పటికీ చెడుకే ఆకర్షితమయ్యే మనసు యొక్క సహజ స్వభావాన్ని అనుసరించి నాటి ప్రజల మనస్సులో ఆమెపై ఏర్పడ్డ కళంకం అలాగే ఉండిపోయింది, ఇప్పటికీ ఆ మరకలు పోనంతగా! 1936లో బి.వి.నరసింహస్వామి బాబాను సశరీరులుగా దర్శించిన ఎంతోమంది భక్తులను నేరుగా కలిసి ముఖాముఖీ ఇంటర్వ్యూ చేసి వాటిని యథాతథంగా 'డీవోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీసాయిబాబా' అనే పుస్తక రూపంలో సాయిభక్తులకు అందించారు. అందులో సాయిభక్తుడు హెచ్.వి.సాఠే స్వయంగా చెప్పిన ఒక సంఘటన ఈవిధంగా ఉంది: "ఒకసారి నేను శిరిడీలో ఉన్నప్పుడు కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. అక్కడికి వెళ్లేముందు బాబా నాతో, “నువ్వు ఫలానా చోటికి వెళ్ళావా?” అని అడిగారు. అక్కడి ప్రదేశాల గురించి నాకు అంతగా తెలియనందున బాబా అడిగిన ప్రశ్నలో మర్మమేమిటో నాకు అర్థంకాక మౌనంగా ఉండిపోయాను. బాబా కూడా ఇంకేమీ మాట్లాడలేదు. తరువాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతుండగా చెడు ఆలోచనలు నా మనస్సుపై దాడిచేయడం మొదలుపెట్టాయి. అంతలో అకస్మాత్తుగా ఆ ఇంటి గుమ్మం వద్ద బాబా ప్రత్యక్షమై, మూసి ఉన్న తలుపులను తోసి, 'ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు?' అనే అర్థం వచ్చే రీతిలో ఏవో సైగలు చేసి అంతర్థానమయ్యారు. ఆ చెడు ఆలోచనలు నా మనస్సులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే బాబా సమయానికి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకుని వెంటనే అక్కడినుండి వెనుతిరిగి వచ్చేశాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. ఆ తరువాత, నేను వెళ్లిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆరోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇలా బాబా తరచూ నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడుకు సంబంధించిన ఆలోచనలకు, చర్యలకు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేశారు". ఇదే విషయాన్ని బి.వి.నరసింహస్వామిగారు 'లైఫ్ ఆఫ్ సాయిబాబా' పేరుతో ప్రచురించిన మరో పుస్తకంలో, “నువ్వు ఫలానా చోటుకి వెళ్ళావా?” అని బాబా అడిగిన వాక్యంలో 'ఫలానా' అనే పదం స్థానంలో 'శాల' అనే పదాన్ని ఉపయోగించారు. 'రాధాకృష్ణమాయి ఇంటి'ని బాబా 'శాల' అని సంబోధించేవారని ముందే చెప్పుకున్నాము. కాబట్టి ‘శాల’ అనే పదప్రయోగం వలన సాఠే చెడు తలంపుతో ఆయీ ఇంటికి వెళ్లినట్లుగా ఆ వాక్యార్థం మారిపోయింది. చాలావరకు సాయిచరిత్ర గ్రంథాలకు బి.వి.నరసింహస్వామి గారి రచనలే ఆధారం కావడం వలన ఆ విషయం ఇప్పటికీ అలాగే ప్రచురితమవుతూ వచ్చింది. అదే నిజమైతే సాఠే స్పష్టంగా ఇంటర్వ్యూలో చెప్పేవాడే. కానీ అతనలా చెప్పలేదు. మరి బి.వి.నరసింహస్వామి ఆ పదాన్ని ఎందుకు ప్రస్తావించారని ఆలోచిస్తే, బహుశా జరిగిన సంఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలియని అతను నాటి ప్రజల మాటలను నమ్మి ఉండవచ్చు. అది సహజమే కదా! సమాజంలో చాలా విషయాలు ఇలాగే ఉంటాయి. నిజానిజాలను ఎవరూ పట్టించుకోరు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడో ఏళ్ళ క్రిందట జరిగినవాటి గురించి వేరే చెప్పాలా?
అయినా, పరమభక్తురాలు, సేవాతత్పరురాలైన రాధాకృష్ణమాయి విషయంలో ఇలాంటి విమర్శలు కేవలం ఆమె మరణంతోనే మొదలు కాలేదు. ఆమె సజీవంగా ఉన్నప్పుడే తోటి భక్తుల నుండి విమర్శలు ఎదుర్కొంది. వాటి గురించి సాయిభక్తుడు యం.బి.రేగే ఇలా చెప్పాడు: "నేను శిరిడీలో కలుసుకున్న భక్తులలో భక్తి గురించి వారి వారి స్వంత అభిప్రాయాలు ఉండేవి. వాళ్లలో ప్రతి ఒక్కరూ లేదా ప్రతి వర్గంవారూ తమ స్వంత మార్గమే సరైనదని భావిస్తూ, చాలా తరచుగా ఇతరుల అభిప్రాయాలపట్ల అసహనానికి గురవుతూ ఉండేవారు. తిరుమల, మధుర, ద్వారక, పండరిపురం వంటి పవిత్రక్షేత్రాలలో భగవంతునికి చేసే పూజలు, అలంకారాలు; పల్లకీ, రథము మొదలైన సేవలను శిరిడీలోని తన సద్గురువైన సాయిబాబాకు కూడా జరిపించాలని రాధాకృష్ణఆయీ అభిప్రాయం. కానీ, ‘సాయిబాబా ఫకీరు అనీ, ఇటువంటి హంగులూ, ఆర్భాటాలు ఆయన సాంప్రదాయానికి విరుద్ధమనీ’ దాసగణు మహరాజ్, హేమాద్పంతు వంటి కొంతమంది ప్రముఖ సాయిభక్తుల అభిప్రాయం. అదీ నిజమే! ఒకసారి ఒక భక్తుడు శ్రీసాయిబాబాకు ఒక మఖమల్ అంగరఖా సమర్పించగా, బాబా దానిని ధరించటానికి నిరాకరిస్తూ, “గోడకు ఒక మేకు కొట్టి దానికి ఇవన్నీ అలంకరించండి” అని అన్నారు. అదలా ఉంచితే, అంతిమ సమయంలో ఆయీపై మోపబడ్డ కళంకం అటువంటి వ్యక్తుల మనస్సును పూర్తిగా విరిచేసింది. సాయిచరిత్రకు సంబంధించిన రచనలు ఎక్కువగా వారిచే రచింపబడినందున వాటిలో ఆయీ గురించిన ప్రస్తావనను ఊహించలేము".
బహుశా అందువలనేనేమో, ఇంత గొప్ప సాయిభక్తురాలి గురించిన సమాచారం సాయిభక్తులకు అంతగా అందుబాటులో లేకుండా పోయింది. చాలామంది సాయిచరిత్రకారులు ఆయీపై మోపబడిన కళంకం నేపథ్యంగా ఆమెపట్ల వ్యతిరేకభావంతో తమ రచనలలో ఆమె గురించి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. అంతటి భక్తురాలి గురించి కేవలం ‘బాబా నడిచే దారులను శుభ్రపరిచేది’ అంటూ ఒకటి రెండు మాటల్లో క్లుప్తంగా చెప్పారు. అంతేకాదు, స్త్రీ వ్యామోహాన్ని పరీక్షించటానికే బాబా తమ భక్తులను ఆయీ ఇంటికి పంపేవారని కూడా ఆ రచయితలు ప్రస్తావించారు. అది ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఎందుకంటే, భక్తులను పరీక్షించడానికి వారిని ఒక స్త్రీ వద్దకు పంపవలసిన అవసరంగానీ, అగత్యంగానీ బాబాకు లేదు. సర్వజ్ఞులైన బాబాకు మనలోని బలహీనతలు తెలియనివా? అంతేకాదు, ఆయీ ఇంటికి బాబా పంపిన భక్తులలో శ్రీమతి తారాబాయి తర్ఖడ్, భికూబాయి వంటి స్త్రీలు కూడా ఉన్నారు. మరి వారిని ఆయీ ఇంటికి బాబా ఎందుకు పంపినట్లు? ఆయీ వద్ద విలువైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని, వాటిని సాధన చేసి ఉన్నతమైన గమ్యాన్ని చేరుకుంటారనే బాబా తమ భక్తులను ఆయీ ఇంటికి పంపేవారు. ఆయీ ఇంటిని బాబా ‘శాల’(పాఠశాల) అని పిలవడంలోని అంతరార్థమిదే!
ఇకపోతే, రేగే చెప్పినదానిలో వాస్తవం లేకపోలేదు. ఒకసారి దాసగుణు మహరాజ్ 'బాబా గురించి ఆర్భాటంగా ప్రచారం చేస్తోంద'ని రాధాకృష్ణమాయిని తీవ్రంగా విమర్శించాడు. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆయీని విమర్శించినందుకు బాబా దాసగణును మందలించి, "హరికథల ద్వారా నువ్వు మాత్రం చేస్తున్నదేమిటి? ముందు అనవసరమైన విమర్శలు చేసినందుకు వెళ్లి ఆయీకి క్షమాపణ చెప్పు" అని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం దాసగణు ఆయీ వద్దకు వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని తనను క్షమించమని కోరాడు. నిజానికి దాసగణు గొప్ప భక్తుడు. అతని కీర్తనలలో మనం గోపికల ప్రేమ(మధురభక్తి)ను చూడవచ్చు. కానీ అటువంటి ప్రేమ శ్రీకృష్ణునికి తగినదే కానీ ఫకీరుకి తగినది కాదని బహుశా అతను భావించి ఉంటాడు. అందుకే రాధాకృష్ణమాయి యొక్క మధురభక్తిని ఆమె జీవించి ఉన్న కాలంలో దాసగణు అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె మరణానంతరం చాలా సంవత్సరాల తరువాత అతనొకసారి ఇండోర్ వెళ్లి రేగే ఇంటిలో బస చేశాడు. అప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకొని రేగేతో, "బాబాసాహెబ్, మధురభక్తితో అత్యున్నత స్థితిలో ఉన్న భక్తురాలితో కలిసి జీవించిన గొప్ప అదృష్టవంతుడివి నువ్వు. నేను మీరాబాయి, జానాబాయి, కన్హాపాత్ర మరియు గోపికల కీర్తనలు చేస్తాను. ఆ సమయంలో నా కళ్ళనుండి కన్నీళ్లు ధారపాతమవుతాయి. కానీ నేను నిజజీవితంలో రాధాకృష్ణమాయి మధురభక్తిని అభినందించలేకపోయాను" అని చాలా బాధపడ్డాడు. అంతేకాదు, ఆయీ విచారకరమైన ముగింపు గురించి ప్రస్తావిస్తూ, "లైంగిక సంపర్కం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతాలు పురాణాలలో ఉన్నాయి" అని అన్నాడు. దాసగణు చెప్పింది బాబా అపార అనుగ్రహం వలన సిద్ధురాలైన రాధాకృష్ణమాయి విషయంలో సంభవమే కావచ్చు. కానీ, ‘ఆత్మహత్య చేసుకుంద’నీ, 'బిడ్డకు జన్మనిచ్చింద'నీ ఆ మహాభక్తురాలికి లేనిపోని కళంకాన్ని అంటగట్టినవారికి అది ఎలా అర్థమవుతుంది?
ఏదేమైనా బాబా సంరక్షణలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించిన రాధాకృష్ణమాయి ఆత్మహత్యకు పాల్పడేటంత అవివేకురాలు ఎంత మాత్రమూ కాదు. తన చేతివేలు రాయిక్రిందపడి నలిగిపోయినా, రాగద్వేషాలకు లోనై సాటి భక్తులే తనను విమర్శించినా చలించని ఆ ధీశాలి ఏ కష్టానికి వెరచి అంతటి ఘాతుకానికి పాల్పడి తన ఆత్మోన్నతికి తానే విఘాతం కలిగించుకుంటుంది? ఒకవేళ ఆమె అందుకు పూనుకున్నా, భక్తోద్ధరణే ధ్యేయంగా అవతరించిన బాబా అలా జరిగేందుకు అనుమతిస్తారా? వారి భక్తుడు అంబాడేకర్ ఏడు సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు శిరిడీ దర్శించినా అవి తొలగలేదు. చివరికి అతను ‘బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మైనా బాగుండవచ్చ’ని తలచి 1916లో శిరిడీ చేరాడు. అతడు దీక్షిత్ వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే, సగుణమేరూనాయక్ అతనికొక పుస్తకమిచ్చాడు. దానిని తెరవగానే వచ్చిన ఘట్టమిది: అక్కల్కోటస్వామి భక్తుడొకడు కష్టాలకు ఓర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి, "అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి. పూర్వజన్మ కర్మ అయిన కుష్టువ్యాధిని గానీ, ఇతర రోగాల బాధలను గానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తికాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో. ఆత్మహత్య చేసుకోకు!" అన్నారు. ఆ తర్వాత అంబాడేకర్ మసీదు చేరగానే, "నీవు అక్కల్కోటస్వామి చెప్పినదానినే అనుసరించు" అన్నారు బాబా. అలా ఆ భక్తుణ్ణి ఆత్మహత్య నుండి కాపాడినట్లే ఆయీని కూడా బాబా తప్పకుండా కాపాడేవారు.
వచ్చేవారం తరువాయి భాగం....
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm sairam
Om sairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌹😊🌼
ReplyDeleteOm sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sairam
ReplyDelete