1. ఎంతో దయతో, ప్రేమతో దగ్గరకు తీసి ఆదరించిన బాబా
2. ఎవరెలా పిలిచినా పలికి వారి సమస్యలు తీరుస్తారు బాబా
ఎంతో దయతో, ప్రేమతో దగ్గరకు తీసి ఆదరించిన బాబా
సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం! నేను ఒక బాబా భక్తురాలిని. బాబా లీలలు ఏమని చెప్పగలను? ఇంజనీరింగ్ చదివేరోజుల్లో నేను బాబాకు చాలా మంచి భక్తురాలిని. ఇంటినుండి దూరంగా ఉన్న ఆ సమయంలో నాకు ఏ కాస్త డల్‌గా అనిపించినా వెంటనే మా రూముకి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్లి అన్నీ బాబాతో చెప్పుకునేదాన్ని. అలా బాబాతో పంచుకోవడం వల్ల నా మనసుకి చాలా సంతోషంగా ఉండేది. ఆ విధంగా బాబాతో నాకు మంచి అనుబంధం ఉండేది. నాకు పెళ్ళయ్యాక మొదటిసారి నేను నా భర్తతో కలిసి శిరిడీ వెళ్ళాను. ఆ తరువాత మేము యు.ఎస్.ఏ.కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇండియాలో ఉన్న కొంతమంది వలన, కొన్ని విషయాల వలన, ‘నా తప్పు లేకున్నా బాబా నాకు మద్దతునివ్వలేద’ని బాబాపై కోపం తెచ్చుకుని, అలిగి ఆయనను పూజించటం మానేశాను. (కానీ ఆరోజు ఆ విధంగా జరగకపోయివుంటే నేను ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది.) నేను బాబాను పూజించడం మానేసింది ఏవో కొన్ని నెలలే అయివుంటుందని మీరు అనుకోకండి. అక్షరాలా దాదాపు 13 సంవత్సరాలు నేను బాబాను పూజించలేదు. ఇంట్లో బాబా విగ్రహం ఉన్నా కనీసం గురువారమైనా బాబాను ప్రత్యేకించి పూజించేదాన్ని కాదు. రోజూ అందరి దేవుళ్లతో పాటు, అంతే! మునుపటిలా బాబాకు ఏమీ చెప్పుకునేదాన్ని కాదు. అంతలా నేను బాబాను అలక్ష్యం చేశాను. "నన్ను క్షమించండి బాబా". తరువాత ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ తిరిగి బాబాను ఆశ్రయిస్తే, ఆయన నన్ను ఎంతలా ఆదరిస్తున్నారో చూడండి!
నేను గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ నిరుత్సాహంతో మధ్యలో గ్యాప్ తీసుకోవటం, మళ్ళీ ప్రయత్నించడంతో నాకు ఏ దారీ కనపడేది కాదు. ప్రయత్నాలన్నీ చివరివరకు వచ్చి తప్పిపోయేవి. కొన్నైతే వెరిఫికేషన్స్ అన్నీ పూర్తయ్యాక కూడా ఆగిపోయాయి. నేను బాబాతో మళ్ళీ కనెక్ట్ అయ్యే ముందు కూడా కొన్ని ఇలానే చివరిలో ఏదో ఒక వంకతో తప్పిపోయాయి. అప్పుడు నాకు అర్థం అయింది, 'దేవుని జోక్యం లేకుండా నాకు ఉద్యోగం రాదు' అని. అయితే అప్పుడు నేనున్న స్థితిలో ఉద్యోగం చేయకుంటే నా జీవితం వృథా, బ్రతకటం దండగ. అటువంటి పరిస్థితుల్లో ఒక గురువారంనాడు (2021, ఏప్రిల్ 29) బాబాతో, "బాబా! దేవుని ప్రమేయం లేనిదే నాకింక ఉద్యోగం రాదని అర్థమైంది. 'నాకు ఉద్యోగం ఇవ్వమ'ని నేను అందరి దేవుళ్ళని అడిగాను. కానీ నాకు ఉద్యోగం రాలేదు. నువ్వు అసలు నాతో ఇంకా కనెక్టయి ఉన్నావా, లేదా? ఉంటే నాకు నిదర్శనం చూపించు" అని అన్నాను. తరువాత మే నెల ఒకటవ తేదీ, శనివారంనాడు మొదటిసారి నాకు మహాపారాయణ గురించి తెలిసింది. నా ఫ్రెండ్ నాతో, "మహాపారాయణ గ్రూపు ఉంది, నేను నిన్ను జాయిన్ చేయిస్తా" అని చెప్పింది. నేను తనతో, "నాకు ఉద్యోగం వస్తుందా?" అని అడిగాను. అందుకు తను, "పారాయణ మొదలుపెట్టి, బాబాను అడుగు, ఉద్యోగం వస్తుంది" అని చెప్పింది. ఆ విషయం ప్రక్కన పెడితే, 'ఈ రీతిన బాబా నాతో ఇంకా కనెక్టయి ఉన్నానని సంకేతమిచ్చార'ని నేను చాలా సంతోషించాను.
మంగళవారం నన్ను మహాపారాయణ గ్రూపులో చేర్చారు. నేను పారాయణ మొదలుపెట్టడానికి చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాను. అంతలో గురువారంనాడు ఒక ఇంటర్వ్యూ ఉందని నిర్ధారణ అయింది. నేను అది బాబా దయ అనీ, ఖచ్చితంగా నాకు ఆ ఉద్యోగం వస్తుందనీ అనుకున్నాను. అయితే నేను గురువారం ఉదయం నిద్రలేచి నా మొబైల్లో మెసేజ్ చూశాక నాకు చాలా బాధగా అనిపించింది. కారణం, మహాపారాయణ గ్రూపు కెప్టెన్ నేను చదవాల్సిన అధ్యాయాలను వేరే వాళ్ళచేత చదివించేసింది. నేను ఆమెతో ‘యు.ఎస్.ఏ సమయం ప్రకారం ఉదయం పారాయణ చేస్తాన’ని చెప్పాను. కానీ ఆమె ఇండియా టైం ప్రకారం మధ్యాహ్నమే నా అధ్యాయాలు చదివించేసింది. ఆ మెసేజ్ చూసినప్పుడే నాకు నేను ఆశపడ్డ ఆ ఉద్యోగం రాదని అర్థం అయింది. అయినా కూడా నేను నాకు కేటాయించబడిన అధ్యాయాలు చదవాలని అనుకున్నాను. అలాగే, ఇక్కడ యు.ఎస్.ఏ.కి చెందిన గ్రూపులో జాయిన్ అవ్వాలనుకుని, ఇక్కడ మహాపారాయణ గ్రూప్ కెప్టెన్‌ను సంప్రదించి, "వాలంటీర్ కావాలంటే చెప్పండి, నేను చదువుతాను" అన్నాను. అప్పుడు సమయం ఉదయం సుమారు 6.30 అయింది. ఆ కెప్టెన్‌కి ఉదయం సుమారు 5.30 అయుంటుంది. ఆమె రిప్లై ఇచ్చేలోపు నేను నా పూజ పూర్తిచేసి నాకు ఇవ్వబడిన అధ్యాయాలు చదువుదామనుకున్నాను. కానీ నేను రోజువారీ పూజ పూర్తిచేసి బాబాకోసం ప్రత్యేకించి చేసిన నైవేద్యం తీసుకుని రావటానికి వెళ్ళగానే నా ఫోనులో మెసేజ్ సౌండ్ వచ్చింది. చూస్తే, యు.ఎస్.ఏ మహాపారాయణ గ్రూపు కెప్టెన్ వాలంటీర్‌గా నాకు అధ్యాయాలు కేటాయించారు. దాంతో, ‘పోనీలే, బాబాకు నా మీద కోపం లేదు’ అనుకున్నాను. దాంతో ముందు అనిపించిన బాధ కాస్త తగ్గింది. ఆ గురువారం గడిచాక నేను ఇండియా గ్రూపు కెప్టెన్‌తో, "టైమింగ్స్ వలన నా అధ్యాయాలను మీరు వేరే వాళ్ళచేత చదివించడం వల్ల నాకు బాధకలిగింది. నేను అమెరికా గ్రూపులో చేరుతాన"ని చెప్పాను.
నేను యు.ఎస్.ఏ మహాపారాయణ గ్రూపులో మే 13న జాయిన్ అయి, అదే నా అసలైన మహాపారాయణగా భావించి (ఎందుకంటే, నాకు కేటాయించిన అధ్యాయాలను నేను చదవబోతున్నాను), "బాబా! నేను ఇప్పుడు నిస్సహాయస్థితిలో ఉన్నాను. జీవితం మీద విరక్తితో బ్రతుకుతున్నాను. నేను అన్ని ప్రయత్నాలూ చేశాను. ఇక దేవుని దయలేనిదే ఉద్యోగం రాదని అర్థమై చివరి ప్రయత్నంగా నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తే అది మీ దయే అని నమ్ముతాను" అని బాబాతో చెప్పుకుని పారాయణ పూర్తిచేశాను. మరుసటిరోజు, అంటే మే 17కి ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. మే 20న, అంటే పారాయణ మొదలుపెట్టిన మరుసటి వారానికి మొదటి రౌండులో ఎంపిక అయ్యాననీ, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ మే 21న ఉంటుందనీ తెలిసింది. మే 21న సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ పూర్తయి, నాకు ఆ ఉద్యోగం వచ్చింది. బాబా దయ నామీద ఎంత ఉందంటే, రెండు ఇంటర్వ్యూలు కూడా ఫోనులోనే జరిగాయి, అది కూడా చాలా సులువుగా. ఈ రోజుల్లో కేవలం ఫోన్ ఇంటర్వ్యూ, అది కూడా 30 నిమిషాలే అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇదంతా ఒక మిరాకిల్. అంతా బాబా దయ. తరువాత వెరిఫికేషన్ ప్రక్రియలో ఏ సమస్య వచ్చినా నేను 'బాబా' అని తలచుకున్నంతనే అదేరోజు రెస్పాన్స్ వచ్చేది. అలా బాబా ఆ ప్రక్రియనంతా దగ్గరుండి పూర్తిచేయించారు.
ఇక నేను ఉద్యోగంలో జాయినయ్యాక మొదటివారంలో గురువారంనాడు బాబాను, "బాబా! నాకు ఉద్యోగం కొత్త, కాబట్టి భయంగా ఉంది. కొత్త టీమ్‌లో నా గౌరవాన్ని పెంపొందించండి" అని వేడుకున్నాను. ఆరోజు మా మేనేజర్ నన్ను ఒకతనికి సహాయం చేయమని చెప్పింది. నేను, "బాబా ప్లీజ్, నాకు సహాయం చేయండి" అని బాబాతో చెప్పుకుని అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించాను. కానీ ఆ సిస్టంలో అన్నీ యాక్సెస్ చేసే వెసులుబాటు లేని కారణంగా నేను ఆ సమస్యను ఫిక్స్ చేయలేకపోయాను. నాకు బాధగా అనిపించింది. బాబాతో చెప్పుకుని అన్నీ మర్చిపోయి నా పనిలో పడ్డాను. ఆరోజు సాయంత్రం స్టేటస్ మీటింగులో మా మేనేజర్ నన్ను, "అతనికి హెల్ప్ చేశావా?" అని అడిగింది. అందుకు నేను, "సమస్య ఎక్కడో తెలుసు. కానీ అతని సిస్టంలో రాలేదు" అన్నాను. అంతలో ఒకతను, "ఫైల్ అక్కడ ఉంది. మీరు ప్రయత్నించొచ్చు" అని అన్నాడు. ఒకప్రక్క స్టేటస్ మీటింగ్ మిగతావాళ్ళతో జరుగుతుండగానే నేను నా సిస్టంలో సమస్యను పరిష్కరించి, "అప్లోడ్ చేయాలా?" అని అడిగాను. మా సీనియర్ లీడ్, "సమస్య పరిష్కారమైందా?" అని అడిగారు. నేను "అయింద"ని అన్నాను. "అయితే, స్క్రీన్ షేర్ చేసి చూపించు" అన్నారతను. వెంటనే అందరిముందు నేను స్క్రీన్ షేర్ చేసి చూపించాను. అది చూసి ఆ లీడ్ మా వైస్ ప్రెసిడెంట్ ముందు నన్ను మెచ్చుకున్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీటింగ్ పూర్తయిన తరువాత మా వైస్ ప్రెసిడెంట్, 'ఆ లీడ్ ఎవ్వరినీ మెచ్చుకోడు. అతను మెచ్చుకోవటం అనేది చాలా కష్టం. వెల్ డన్' అని మెసేజ్ పెట్టింది. అది చూసి నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. మరుసటిరోజు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ "నిన్న మీరు లీడ్‌ని డీల్ చేసిన వైనం చాలా బాగుంది. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. అతను అలా మెచ్చుకోవటం చాలా అరుదు. చాలా బాగా వర్క్ చేసి అతన్ని ఇంప్రెస్ చేశావు. గుడ్ జాబ్" అన్నారు. ఇదంతా కేవలం బాబా దయవల్లనే జరిగింది. లేదంటే, అస్సలు ఉద్యోగ వాతావరణం అలవాటే లేని నాకు అంత గౌరవం దక్కేది కాదు. అది కూడా గురువారంనాడు. అడిగినంతనే బాబా అనుగ్రహించారు.
నేను ఉద్యోగంలో చేరిన రెండవ గురువారం నా వలన ఒక ముఖ్యమైన ఫైల్ పొరపాటున డిలీట్ అయింది. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. "బాబా! నన్ను కాపాడి ఆ ఫైల్ తిరిగి వచ్చేలా చేయండి. అలా జరిగితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా నన్ను ఆ సమస్య నుండి బయటపడేశారు. బాబా లీలలు అమోఘం.
ఎన్నోరకాలుగా ప్రయత్నించి, వైఫల్యం చెంది, ఉద్యోగం లేదని జీవితం మీద విరక్తి కలిగిన సమయంలో నాకు అండగా నిలిచి ఉద్యోగం చేయాలన్న నా చిరకాల కోరికను నెరవేర్చి, సంఘంలో, కుటుంబంలో నా గౌరవాన్ని నిలబెట్టారు బాబా. నాతోనే ఉంటూ అన్నిరకాలుగా సహాయం చేస్తున్నారు బాబా. అన్ని సంవత్సరాలపాటు వదిలేసి, తీరా నా అవసరం కోసమే నేను బాబాను పిలిచినా కూడా ఎంతో దయతో, ప్రేమతో నన్ను దగ్గరకు తీసి మహాపారాయణ గ్రూపులో చేర్చి నన్ను అంతలా ఆదరించారు బాబా. నా జీవితంలో మొదటిసారి నేను కోరుకున్నది జరిగింది. "బాబా! మీ దయ అమోఘం తండ్రీ. మీ సహాయానికి నేను ఎలా ఋణం తీర్చుకోగలను? నన్ను, మా అన్నయ్యను చేయిపట్టుకుని నడిపించు తండ్రీ. నాన్న లేని లోటు తీర్చు తండ్రీ. ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మల్ని కాపాడుతూ సదా సన్మార్గంలో నడిపించు తండ్రీ. మీ మీద ప్రేమ, అనురాగం, నమ్మకం ఎన్నడూ చెదిరిపోకుండా ఇలానే ఉండేలా కరుణించు తండ్రీ. ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళవద్దు బాబా. కోపగించుకోక రక్షించు తండ్రీ. ఏమైనా తప్పులు జరిగివుంటే క్షమించు తండ్రీ. మీరు ప్రసాదించిన అనుగ్రహాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని మీతో చెప్పుకున్నట్లే ఇప్పుడు పంచుకున్నాను. చివరిగా, అందరినీ చల్లగా చూడు తండ్రీ". మళ్ళీ మరో బాబా లీలతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్తే!
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఎవరెలా పిలిచినా పలికి వారి సమస్యలు తీరుస్తారు బాబా
నా పేరు సంధ్య. మాది జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా. బాబాతో మాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. మా అమ్మగారు బాబాను ఒక దైవంగా కాకుండా మాతో కలిసివుండే ఒక వ్యక్తిలా చూస్తారు. ఆమె ఎప్పుడు ఏ వంట చేసినా దాన్ని బాబాకు నైవేద్యంగా సమర్పిస్తారు. బాబా గురించి చెప్పాలంటే ఏదో ఒక్క విషయంతో సరిపోదు. ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బాబా సర్వాంతర్యామి. అన్ని రూపాల్లోనూ ఉన్నారు. ఆయన అన్నట్లుగానే పిలిస్తే పలికే దైవం. ఎవరు ఏ పేరుతో పిలిచినా అలాగే పలికి వారి సమస్యలు తీరుస్తారు. ఆయన మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
ఒకరోజు మా నాన్నగారు స్కూటీపై రాజమండ్రి వెళ్లి, తిరిగి వస్తుండగా ఎవరో కారుతో మా నాన్న స్కూటీని ఢీకొట్టారు. ఆయన ఒళ్ళంతా రక్తం కారసాగింది. చుట్టుప్రక్కల అందుబాటులో ఒక్క హాస్పిటల్ కూడా లేదు. బాబా దయవల్ల ఆయన ఎలాగో నెమ్మదిగా మా ఊరు చేరుకుని చికిత్స చేయించుకున్నారు. ఆరోజు మా నాన్నగారి స్థితిని చూసి నాకు చాలా భయం వేసి బాబాను ఒక్కటే అడిగాను: "నాన్న మళ్ళీ మామూలు మనిషై మునుపటిలా మాతో సరదాగా ఉండాలి. అలా ఉంటే గనుక మీకు 108 కొబ్బరికాయలు కొడతాను" అని. బాబా కృపవలన కాలం గడిచేకొద్దీ ఏదో అద్భుతం చేసినట్లు నాన్నగారికి పూర్తిగా నయమైంది. బాబాకు మాటిచ్చినట్టు నేను మ్రొక్కు తీర్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
Baba please save my husband,he got fever and he got cough.please test result must come negative.please bless him. Please cure him. Om sai ram❤❤❤
ReplyDelete🙏om sai, me too prayed for u. Baba will save you defenitely
DeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteSainadha!!! Nenu adigina Job nuvuu inka invavu na life lo edhi nenu anujunattu jaragadhu eppudhu kashtalu mataluu .
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
812 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🌼🕉🙏😊
ReplyDeleteBaba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh life bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete