సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాధాకృష్ణమాయి - ఐదవ భాగం



ఆయీ గృహమొక ఆధ్యాత్మిక కేంద్రము:

బాబా రాధాకృష్ణమాయి ఇంటిని 'శాల' అనేవారు. మరాఠీలో ‘శాల’ అనే పదానికి అర్థం ‘పాఠశాల’ అని. పాఠశాల అంటే జ్ఞానాన్ని ప్రసాదించే చోటు. ఆయీ ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ఉన్నత స్థితిని పొందిన భక్తురాలు, జ్ఞానసంపన్నురాలు. అందుకే బాబా, "శాలకి వెళ్ళమ"ని ఆదేశించి తమ భక్తులను ఆమె ఇంటికి పంపుతుండేవారు. అలాగని బాబా అందరినీ అక్కడికి పంపేవారు కాదు. రేగే, శరణానంద, పురంధరే వంటి ఆధ్యాత్మికంగా పరిణతి చెందవలసిన కొంతమంది భక్తులను మాత్రమే పంపేవారు. బాబా తన వద్దకు పంపేవారినందరినీ ఆయీ ఎటువంటి భేదభావమూ చూపక తన గురుబంధువులుగా భావించి మాతృప్రేమతో ఆదరించేది. వాళ్లు కూడా ఆమెను తల్లిగానూ, సోదరిగానూ పవిత్రభావంతో చూసి, ఆమె చూపే ప్రేమాదరాలకు ఎంతో ఆనందించి తృప్తిపడేవారు. శిరిడీ వచ్చేనాటికే కొన్ని సిద్ధులు పొందిన ఆయీ, నిరంతర సాయి స్మరణ, సేవల ద్వారా సద్గురు సాయి అనుగ్రహ విశేషంతో ఆధ్యాత్మికంగా మరింత పరిణతి చెందినందువలన ఆమెకు కొన్ని అతీంద్రియ శక్తులు సంప్రాప్తించాయి. అందువలన తాను మసీదుకు వెళ్ళకపోయినా అక్కడ జరిగేవన్నీ ఆమెకు తెలుస్తుండేవి. తన దగ్గరకు వచ్చేవారి ఆలోచనలను ఆమె ముందుగానే పసిగట్టి వాళ్ళు తనవద్దకు రాగానే వారి గురించి, వారి ఆలోచనల గురించి తెలుపుతుండేది. వాళ్ళు ఆమె ద్వారా 'సాయి సందేశాల'ను, ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతుండేవారు. వాళ్ళచేత బాబా సేవ చేయిస్తూ, ఆధ్యాత్మికంగా ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఆమె ఎంతో హితాన్ని చేకూరుస్తుండేది. అందువలన ఆయీ ఇంటిని ‘ఆధ్యాత్మిక పాఠశాల’ అనడం ఎంతైనా సమంజసం.

ఆయీతో అనుబంధాన్ని కలిగివున్న భక్తుల స్మృతుల ద్వారా ఆమె ఔన్నత్యం, సిద్ధత్వం, ఇంకా బాబా వాళ్ళను ఆమె వద్దకు పంపడంలోని పరమార్థం మరింతగా అవగతమవుతాయి. కాబట్టి అందుబాటులో ఉన్న కొంతమంది భక్తుల అనుభవాలను పరిశీలిద్దాం:

1915 ప్రాంతంలో ఒకసారి సదాశివ తర్ఖడ్ దంపతులు శిరిడీ వెళ్ళినప్పుడు బాబా వాళ్ళను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం వాళ్ళు ఆయీ ఇంటికి వెళ్ళి తమకు వసతి కల్పించమని అడిగారు. కానీ ఆమె ‘తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తాన’ని షరతు పెట్టింది. అందుకు శ్రీమతి తారాబాయి తర్ఖడ్ అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుండేది. కానీ పనిలో ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా ఆయీ చాలా పరుషంగా మాట్లాడేది. దాంతో శ్రీమతి తర్ఖడ్, ‘మాకెందుకు ఇటువంటి కఠిన పరిస్థితిని బాబా కల్పించారు? దీని పర్యవసానం ఏమిటి?’ అని చింతించసాగింది. కానీ రానురానూ ఆయీ గురించి తెలుసుకున్నకొద్దీ ఆమె మనసు సమాధానపడి, బాబా తమను ఆధ్యాత్మిక శిక్షణ పొందటం కోసమే అక్కడికి పంపారని తెలుసుకున్నది. ఆమె తన అనుభవాలలో ఇలా చెప్పింది: “రాధాకృష్ణఆయీ ఒక బ్రాహ్మణ వితంతువు. ఆమెకు సాయిబాబాపై అమితమైన భక్తిశ్రద్ధలుండేవి. ఆమె బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. కానీ, పరుషమైన ఆమె మాటతీరు వల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. ఆయీకి కొన్ని దివ్యశక్తులుండేవి. ఎదుటివారి మనస్సును ఆమె చదవగలిగేది. ఆమె నా గతచరిత్రంతా పూసగ్రుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు, ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి, వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సు చదివి, నేనివ్వదలచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. బహుశా మాలో సహనాన్ని పెంపొందించేందుకు బాబా మమ్మల్ని ఆయీ ఇంటికి పంపించి ఉండవచ్చు”.

శ్రీమతి తర్ఖడ్ చెప్పినట్లు కొన్ని సందర్భాలలో రాధాకృష్ణమాయి ప్రవర్తన చాలా విచిత్రంగా, అస్థిరంగా ఉండేది. ఒకసారి బాబా దర్శనానికి వచ్చిన ఒక భక్తుడిని ఆమె అవమానపరిచింది. దాంతో బాబాకు కోపమొచ్చి, "శిరిడీ వచ్చి ఈ మసీదు మెట్లెక్కే వారెవరైనా వారు నా వారు. నా భక్తులకు అవమానం జరిగితే నేను సహించను" అంటూ ఆమెను గట్టిగా మందలించారు.

పురందరే మొదటిసారి బాబాను దర్శించినప్పుడు బాబా అతనిని 'శాల'కి వెళ్ళమని చెప్పారు. శాల అంటే ఏమిటో పురందరేకి అర్థం కాలేదు. 'శాల' అంటే ‘రాధాకృష్ణమాయి ఇల్లు’ అని దీక్షిత్ అతనితో చెప్పాడు. వెంటనే పురందరే ఆయీ ఇంటికి వెళ్ళాడు. ఆమె తలుపు తీయకుండానే, "ఎవరు వచ్చారు? ఏమి కావాలి?" అని లోపలినుండే అడిగింది. అతను బాబా ఆదేశాన్ని ఆమెతో చెప్పాడు. కానీ ఆయీ అతనిని ఇంటి లోపలికి రానీయలేదు. పదినిమిషాలు అక్కడే వేచి చూశాక పురందరే మసీదుకు తిరిగి వెళ్ళాడు. బాబా అతనిని, "శాలకు వెళ్ళావా, లేదా?” అని అడిగారు. అందుకతను, "వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేద"ని బదులిచ్చాడు. “మళ్ళీ వెళ్ళు” అని బాబా ఆదేశించారు. బాబా ఆదేశానుసారం పురందరే మళ్ళీ ఆయీ ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఆమె తలుపు తీసి అతని కాళ్ళపై పడి ఏడవసాగింది. ఆమె ప్రవర్తన అర్థంకాని పురందరే కలవరపడ్డాడు. ఆరోజు నుండి ఆయీ తాను చనిపోయేంతవరకు అతనిని తల్లిలా ప్రేమించింది. అతనికి కూడా ఆమె సర్వస్వం అయింది. ఆయీ ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ శిరిడీలో ఉన్న ప్రతిక్షణం అతను బాబా సేవలో గడిపేవాడు. బాబా సేవలో భాగంగా ఆయీ అతనితో రోజంతా ఎక్కువగా తన ఇంట్లోనూ, అప్పుడప్పుడు మసీదులోనూ, ఇంకా ఇతర చోట్లా పనిచేయిస్తుండేది. ఆయీ గురించి పురందరే ఇలా చెప్పాడు: "ఆయీది విచిత్రమైన స్వభావం. ఆమె భక్తిపారవశ్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది లేదా గద్గదస్వరంతో పాడుతుండేది లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది".

1915వ సంవత్సరంలో ఒకసారి పురందరే శిరిడీ వెళ్తూ కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్‌లో దిగాడు. టాంగావాలా హసన్ అతనిని కలిసి ‘రాధాకృష్ణమాయి చాలా అనారోగ్యంతో ఉందనీ, బాబా కూడా అస్వస్థతగా ఉన్నారనీ’ సమాచారం ఇచ్చాడు. అది విని పురందరే ఎంతో కలత చెంది కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను శిరిడీ చేరుకునేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది. అతను నేరుగా మసీదుకు వెళ్లి, బాబా వద్ద చాలామంది భక్తులు కూర్చొని ఉండటం చూశాడు. అతను మసీదు మెట్లు ఎక్కుతుండగా బాబా చూసి, "భావూ, రా! నిన్నిక్కడ చూసి నాకు ఆనందంగా ఉంది. నేను అనారోగ్యంతో చాలా ఇబ్బందిపడుతున్నాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళకు. ఇక్కడే ఉండు. మూడు నాలుగు రోజులుగా నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను. కాకాసాహెబ్‌ను రాధాకృష్ణమాయి ఇంట్లో ఉండమని చెప్పాను. నీవు కూడా అక్కడికి వెళ్ళు, కానీ నా నుండి దూరంగా వెళ్ళకు" అని అన్నారు. బాబా ఆదేశానుసారం పురందరే వెంటనే రాధాకృష్ణమాయీని చూడటానికి వెళ్ళాడు. ఆమె పరిస్థితి బాబా పరిస్థితి కన్నా దారుణంగా ఉంది.

తరువాత పురందరే బాబా వద్దకు వెళ్ళాడు. బాబా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడుతూ ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. ఆహారం తీసుకోవడం మానివేసినందున బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినప్పటికీ బాబా దినచర్యలో ఏ మార్పూ లేదు. ఇద్దరు ముగ్గురి సహాయం తీసుకుంటేగానీ నడవలేని స్థితిలో కూడా బాబా ఎప్పటిలాగే భిక్ష కోసం వెళ్తున్నారు. ఆ స్థితిలో బాబాను చూసి పురందరే కన్నీటిపర్యంతమై, "బాబా, నేను మిమ్మల్ని నా వీపుపై మోసుకొని వెళ్తాను" అని అన్నాడు. “అరె భావూ, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు బాబా. పురందరే కన్నీళ్ళతో, “మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా” అని బావురుమన్నాడు. బాబా అతనిని ఓదారుస్తూ, “భయపడకు. మూడు నాలుగు రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు. వారు ఇచ్చినదాన్ని నేను స్వీకరించాలి. వారే మళ్ళీ దీనిని తగ్గిస్తారు. మంచి, చెడు కాలాలు ఒకటి తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. దానికి భయపడటమెందుకు? నువ్వు ఏడవకు! గత రెండు మూడు రోజులుగా నువ్వే జ్ఞాపకం వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు వ్రాయమని కాకాతో చెప్పాను” అన్నారు. (నిజానికి దీక్షిత్ జాబు వ్రాసేలోపే మళ్ళీ బాబా, “అతనే వస్తున్నాడు, జాబు వ్రాయనవసరం లేదు" అని అన్నారు.) అప్పుడు పురందరే ‘రాధాకృష్ణమాయి అనారోగ్యానికి మందేదైనా ఇవ్వమ’ని బాబాను అడిగాడు. బాబా "ఆమె కోలుకుంటుంది" అని చెప్పారు. కానీ మరుసటిరోజుకి ఆయీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోవడంతో పురందరే మళ్ళీ బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా మందు తయారుచేసి అతనికి ఇచ్చారు. ఆ తరువాత నడవలేని స్థితిలో కూడా బాబా లేచి నిచ్చెన సాయంతో రాధాకృష్ణమాయి ఇంటిపైకి ఎక్కి, "ఎవరైనా నాకు సహాయం చెయ్యండి, నేను ఇక్కడినుండి బయటపడలేకపోతున్నాను" అని అరవడం ప్రారంభించారు. అక్కడే ఉన్న తాత్యా, "నేను మీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా మీరు నాకేమిస్తారు?" అని అడిగాడు. "పది రూపాయలిస్తాను" అని బదులిచ్చారు బాబా. అప్పుడు తాత్యా, "అది సరే, అసలు మీరెందుకు పైకి వెళ్ళారు?" అని అడిగాడు. అప్పుడు బాబా, "కొంతమంది నాపై దాడిచేసి చంపాలని అనుకుంటున్నారు. అందుకే నేను భయపడి పైకి ఎక్కాను" అని అన్నారు. తరువాత బాబా అక్కడినుండి దిగడానికి ప్రయత్నిస్తుండగా ఒకతను వచ్చి వారిని ఎత్తుకొని క్రిందికి తీసుకొచ్చాడు. బాబా అతనికి మూడు నాలుగు రూపాయలిచ్చి, “మనము ఎవరి కష్టాన్నీ ఉచితంగా పొందకూడదు” అని భక్తులతో చెప్పారు. ఈ సంఘటన తరువాత రాధాకృష్ణమాయి ఆరోగ్యం కుదుటపడింది.

సాయిభక్తుడు యం.బి.రేగే మొదటిసారి బాబాను దర్శించినప్పుడు బాబా అతనితో, "రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లి, అక్కడుండు. ఆమె నీకు, నాకు తల్లి" అని చెప్పారు. బాబా ఆదేశానుసారం రేగే అప్పటినుండి ఆయీ మరణించేంతవరకు ఎప్పుడు శిరిడీ వెళ్లినా ఆమె ఇంటనే బసచేస్తుండేవాడు. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయమంతా రేగే ఆయీ ఇంటనే గడిపేవాడు. రేగే తన స్మృతులలో ఇలా చెప్పాడు: "రాధాకృష్ణమాయితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఆమెకు ఎంతో ఋణపడివున్నాను. 'ఆయీ' అంటే తల్లి. మొదటినుండి నేను ఆమెను నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. ఆయీ ఎంతో ఔదార్యం గల ప్రేమమూర్తి, ఎంతో దయామయి, నిష్కపట స్వభావి. బాబా ఆమెను 'రామకృష్ణీ' అని పిలిచేవారు. ఆయీకి బాబాయందు ప్రగాఢమైన భక్తి. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా ఇచ్చే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, సకల కార్యాలను నిర్వహిస్తూ, బాబాకు కావలసినవన్నీ సమకూరుస్తూ అందులోనే ఆనందాన్ని పొందుతుండేది. ప్రతిరోజూ బాబా ఆమెకు ఒక రొట్టెను పంపించేవారు. ఆ రొట్టెతోనే ఆమె తన జీవితాన్ని గడిపేది. నేను శిరిడీలో ఉన్నప్పుడు బాబా అదనంగా మరొక రొట్టెను పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు! నేను శిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి రొట్టె అదనంగా వచ్చిందంటే, ‘నేను దారిలో ఉన్నాననీ, కొద్దిసేపట్లో శిరిడీ చేరుకుంటాన’నీ ఆయీ గ్రహించేది. బాబా ఆదేశం, సహాయం ఆయీ ద్వారా నాకు ప్రత్యేకరీతిలో అందేవి. మొదటిరోజు నుండి నేను ఆయీతో నా అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైన అన్ని విషయాలనూ పంచుకునేవాడిని. ఆయీ కూడా తన ఆలోచనలను, ప్రణాళికలను నాతో చెప్పేది. 'ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందని విధంగా మనం వ్యవహరించాలనీ, ఆధ్యాత్మిక సాధనా సాఫల్యానికి గోప్యత అవసరమ'నీ ఆయీ నాతో చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే!

ఆయీ ‘శ్రీరామకృష్ణ పరమహంసకు ‘తంత్ర’ విద్యలో శిక్షణ ఇచ్చిన యోగిని వంటి యోగమాయ’ అని చెప్పడానికి నా మనస్సులో ఎటువంటి సందేహం లేదు. ఆమె గోపికల మధురభక్తికి ప్రతీక. కాటన్ చాదర్(చాప), దుప్పటి, ఒక జత బట్టలు, ఒక లోటా, ఏకనాథ భాగవతం, శ్రీతుకారాం అభంగాలు మరియు ఒక శ్రీకృష్ణుని విగ్రహం.. ఇవే ఈ ప్రపంచంలో ఆయీకున్న ఆస్తి. ఆమె ఆ విగ్రహాన్ని ‘చాహాబీ’ అని పిలిచేది. ఆ విగ్రహాన్ని బిడ్డలా చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఆరాధిస్తుండేది. ప్రతిరోజూ బాబా లెండీకి వెళ్ళే దారిని రాధాకృష్ణమాయి ఎంతో శ్రద్ధగా శుభ్రపరిచేది. ఊడ్చిన ప్రదేశంలో తన అడుగు కూడా పడకూడదనే ఉద్దేశంతో ఆమె ఊడుస్తూ వెనక్కి వెనక్కి వెళ్ళేది. శిరిడీ వెళ్ళినప్పుడల్లా నేను, రాధాకృష్ణమాయి మరో ఇద్దరు భక్తులు కలిసి బాబా లెండీకి వెళ్లే సమయంలో మశీదు నేలను శుభ్రపరిచేవాళ్ళం. బాబా ఆదేశానుసారం నేను ఆయీ వద్ద ఉండటం ద్వారా గొప్ప సాహచర్యాన్ని పొందానని అభిప్రాయపడుతున్నాను. సాయిభక్తులు శ్రీమహల్సాపతి, శ్రీహెచ్.ఎస్.దీక్షిత్‌లు కూడా ఆయీపట్ల ఎంతో గౌరవం కలిగి ఉండేవారు. ఆయీ శ్రావ్యమైన కంఠంతో ఎంతో మధురంగా పాడేది. కొన్నిసార్లు ఆమె భజన గీతాలు పాడుతూ సమాధిస్థితి పొంది బాహ్యస్మృతి కోల్పోయేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించేది. నాకు కూడా సంగీతం పట్ల చాలా మక్కువ ఉండేది. ఆమె పాటలు వింటున్నప్పుడు, ఆ భక్తిపారవశ్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది.

ఒకరోజు నేనూ, ఆయీ ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందనే విషయంపై చర్చించుకొని, ‘భజనలు, కీర్తనలు ఒకవిధంగా మంచివే అయినా అవి బయటివాళ్ళ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి ఆ పద్ధతి మా పురోగతికి సరిపోద’ని అనుకున్నాము. దాంతో, ‘జపమైతే మా సాధనకు బాగుంటుంద’ని భావించాము. అప్పుడు ‘ఏ నామజపం చేయాల’న్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు ఆయీ నాతో, "ఎక్కువమంది రామనామం, విఠలుని నామం జపిస్తారు. కానీ నాకు బాబానే దైవం కాబట్టి, వారి నామం నాకు చాలు. నువ్వు కావాలంటే విఠలుని నామం చేసుకోవచ్చు" అని చెప్పింది. అందుకు నేను, "నేను విఠలుని చూడలేదు. మీకేది మంచిదైతే నాకూ అదే మంచిది. నేను కూడా బాబా నామమే జపిస్తాను" అని చెప్పాను. తరువాత మేమిద్దరమూ ఎదురెదురుగా కూర్చుని ఒక గంటసేపు సాయి నామజపం చేశాము. అదేరోజు బాబా నన్ను రమ్మని కబురుపెట్టారు. నేను వెళ్లి వారిని దర్శించగానే, 

బాబా: ఉదయం ఏం చేశావు?

నేను: నామజపం చేసుకుంటూ గడిపాను.

బాబా: ఎవరి నామం జపించావు?

నేను: నా దేవుడి నామం. 

బాబా: ఎవరు నీ దేవుడు?

నేను: నా దేవుడెవరో మీకు తెలుసు.

బాబా చిరునవ్వుతో ‘సరే’ అన్నారు. దాంతో, నేరుగా తెలియజేయకున్నా నామజపం చేయడానికి నాకు, ఆయీకి స్ఫూర్తినిచ్చింది బాబానేననీ, నామజపమే నాకు సాధనగా ఆయన ఆమోదించారనీ నేను గ్రహించాను”.

రేగే చెప్పిన దానిని బట్టి, మొదటినుండి కృష్ణభక్తురాలు, నిరంతరం ‘రాధాకృష్ణ’ అనే పవిత్ర నామాన్ని ఉచ్ఛరించే ఆయీ శిరిడీ చేరిన అనతికాలంలోనే ‘బాబానే దైవం, వారి నామస్మరణే తనకు చాలు’ అన్న స్థితికి ఎదిగిందని మనకు అవగతమవుతుంది. నిరంతర దైవారాధన వల్ల, సమయం ఆసన్నమైనప్పుడు ఆ దైవమే తన భక్తునికి సద్గురువుని చూపుతాడనీ, ఆ క్షణం నుండి భక్తునికి సద్గురువే దైవం, వారి నామస్మరణే సాధన అవుతాయనీ ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెళకువలు తెలిసిన వివేకి గనుకనే తాను అనన్యంగా ఉపాసించిన శ్రీకృష్ణుడే తనకు శ్రీసాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి, సేవలను ప్రసాదించారని గ్రహించిన ఆయీ అనుక్షణమూ దానిని గుర్తుంచుకొని జీవించింది.

తరువాయి భాగం వచ్చేవారం ... 

source: రేగే లెటర్స్,
శిరిడీఁచే సాయిబాబా బై గావంకర్,
డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అఫ్ సాయిబాబా బై బి.వి నరసింహస్వామి.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



6 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊

    ReplyDelete
  2. ఆయీది ఎంతటి నిరాడంబర జీవితం!తన జీవితాన్ని పూర్తిగా బాబా సేవలోనే అంకితం చేసుకున్న ధన్యురాలు🙏 బాబా నడిచే మార్గాన్ని శుభ్రం చేయడంలో ఎంతటి శ్రద్ధ!మార్గాన్ని శుభ్రం చేశాక, బాబా నడిచే లోపు తన అడుగు కూడా పడకూడదని వెనక్కి నడుస్తూ ఊడవటం.. బాబా పట్ల ఎంతటి అపారమైన ప్రేమ🙏.. రాధాకృష్ణమాయి గురించిన సమాచారాన్ని సేకరించి మా అందరికీ పంచుతున్న సాయికి మనసారా ధన్యవాదాలు 🙏

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo