సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- రెండవ భాగం


1914వ సంవత్సరంలో నాచ్నే శిరిడీలో డాక్టర్ సామంత్‌ను కలిశాడు. ఇద్దరూ సాయిభక్తులు కావడంతో ఒకరి సాహచర్యాన్ని మరొకరు చాలా ఆనందించారు. అప్పట్లో నాచ్నే కుర్లాలో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో పాటు అక్కడే నివాసముండేవాడు. కుటుంబం కుర్లాలో ఉన్నంతవరకు నాచ్నే తన కుటుంబసభ్యులతో కలిసి క్రమంతప్పకుండా తరచూ డాక్టర్ సామంత్ ఇంటికి వెళ్తుండేవాడు. అందరూ డాక్టర్ సామంత్‌ని 'డాక్టర్ భావూ' అని పిలిచేవారు. అతను గణేశుని గొప్ప భక్తుడు. అతనింట్లో గణేశుని ఫోటో ఒకటి, శ్రీసాయిబాబా ఫోటో ఒకటి ఉండేవి. అతను ప్రతి గురువారం తనింటిలో పూజలు నిర్వహిస్తుండేవాడు. నాచ్నే కుటుంబసభ్యులంతా ఆరోజున అతనింటికి వెళ్లి సాయిబాబా పూజలో పాల్గొని ఎంతో ఆనందిస్తూండేవారు. భావూ నాచ్నేను ఎంతో గౌరవించేవాడు. డాక్టర్ అన్నాసాహెబ్ గవాంకర్, శ్రీమాధవరావు దేశ్‌పాండే, దేవి, డాక్టర్ భావూ, నాచ్నే కలిసి కూర్చుని ముచ్చటించుకుంటూ ఆనందకరమైన సమయాన్ని గడిపేవారు.

ఒకసారి నాచ్నేతో పాటు పక్కింట్లో నివసించే శ్రీఆనందరావు కృష్ణచౌబాల్ తన తల్లిని తీసుకుని శిరిడీ వచ్చాడు. చౌబాల్ తల్లి చాలా సమర్థురాలు, తెలివైనది. ఆమె బాబాకు ఎనిమిది అణాలు (50 పైసలు) దక్షిణ ఇద్దామని అనుకొని తన కుమారుడితో ఒక రూపాయికి చిల్లర తెప్పించింది. అతను 50 పైసల నాణెమొకటి, 25 పైసల నాణేలు రెండు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. అయితే ఆమె బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక్క పావలా కాసు మాత్రం బాబాకిచ్చి వెనక్కు మళ్ళింది. బాబా ఆమెను వెనక్కి పిలిచి, "మిగతా ఆ పావలా ఇవ్వకుండా ఎందుకమ్మా ఈ పేద బ్రాహ్మణుణ్ణి  మోసగిస్తావ్?” అని అన్నారు. ఆమె సిగ్గుపడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది.

1915, మార్చి 31న నాచ్నేపట్ల బాబాకున్న దయ, ఆయన రక్షణ తెలియజేసే మరొక సంఘటన జరిగింది. ఆరోజు రాత్రి నాచ్నే, శాంతారామ్ మోరేశ్వర్ ఫన్సే, మరికొంతమంది రాన్‌షెట్ కనుమ సమీపంలో ఉన్న దట్టమైన అటవీప్రాంతంలో ఎడ్లబండిలో ప్రయాణిస్తున్నారు. అది పులులు సంచరించే ప్రాంతమని అంటారు. ఒకచోటుకు రాగానే అకస్మాత్తుగా ఎద్దులు భయంతో వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తూ ఆ ఇరుకైన రహదారిలో అవి బండిని ప్రక్కకి లాగలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే బండితో సహా అందరూ అగాధమైన లోయలో పడి చనిపోయేవారు. అంతలో ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని శాంతారామ్ చూపించాడు. వాళ్ళ బండి ఎదురుగా కాస్త దూరంలో రోడ్డు మీద ఒక పులి పడుకుని వాళ్ళ వైపు చూస్తోంది. చీకటిలో దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి ఎద్దులు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో అర్థమైంది. ఫన్సే బండి లోయలో పడిపోకుండా కాపాడాలని అనుకున్నాడు. అందువల్ల అతడు నెమ్మదిగా కిందకి దిగి బండి చక్రాలకు అడ్డంగా పెద్ద రాయిగానీ, కర్రగానీ పెట్టాలన్న తలంపుతో ఎద్దుల పగ్గాలు పట్టుకోమని నాచ్నేతో చెప్పాడు. నాచ్నే పగ్గాలు పట్టుకుని, "సాయిబాబా! పరుగున వచ్చి మమ్మల్ని కాపాడండి" అని ఎలుగెత్తి అరిచాడు. బండిలోని మిగతావాళ్ళు కూడా అలాగే సాయిబాబాను ప్రార్థిస్తూ పెద్దగా అరిచారు. ఆ శబ్దానికి ఆ పులి భయపడి బండి ప్రక్కనుండి పారిపోయింది. ఆవిధంగా సాయిబాబా వారందరినీ పులి బారినుండి కాపాడారు. బాబాపట్ల వారికున్న విశ్వాసమే వారిని ఆ ప్రమాదం నుండి రక్షించింది.

1915లో మరోసారి నాచ్నే శిరిడీ వెళ్తున్నప్పుడు అతని స్నేహితుడు సామంత్ అతనికి ఒక కొబ్బరికాయ, రెండు అణాలు ఇచ్చి, ఆ రెండు అణాలతో కలకండ కొని బాబాకు సమర్పించమని చెప్పాడు. నాచ్నే శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని, ఆయనకు కొబ్బరికాయ సమర్పించాడు. కానీ, రెండణాల విషయం పూర్తిగా మరచిపోయాడు. తరువాత అతను ఇంటికి తిరిగి వెళ్లడానికి బాబా అనుమతి కోరినప్పుడు, "అలాగే, చితలీ మీదుగా వెళ్ళు. కానీ ఆ పేద బ్రాహ్మణుడిచ్చిన రెండు అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు?" అని అడిగారు బాబా. వెంటనే సామంత్ ఇచ్చిన రెండు అణాల సంగతి అతనికి గుర్తుకొచ్చి వాటిని బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా, "ఏ పనైనా చేస్తానని ఒప్పుకుంటే దాన్ని బాధ్యతాయుతంగా చేయి, లేదంటే ఒప్పుకోకు" అని అన్నారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోని అన్ని అంశాలకు వర్తించే చాలా విలువైన సూచన.

ఒకసారి నాచ్నే స్నేహితుడైన శంకరరావు తల్లి ముందుగా శిరిడీ దర్శించి తరువాత పండరీపురం వెళ్లాలనుకున్నది. అనుకున్నట్లుగానే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంది. బాబా ఆమెకు ఊదీ ఇచ్చి, ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పారు. దాంతో ఆమె తన పండరి ప్రయాణాన్ని మానుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లోవారికి బాబా ప్రసాదం పంచుదామని, పెట్టె తీసి ఊదీ పొట్లం విప్పేసరికి ఆ పొట్లంలో ఊదీ లేదు! దానికి బదులు పండరి క్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే సువాసనతో కూడిన 'బుక్కా' ఉంది. ఆ పొడిని చూసి ఆమె ఆశ్చర్యపోతుంటే నాచ్నే, "అమ్మా! నువ్వు పండరిపురం సందర్శించాలని అనుకున్నావు కదా, కాబట్టి బాబా నీకు సరైన ప్రసాదమే ఇచ్చారు" అని అన్నాడు.

బాబా త్రికాలజ్ఞతకు అద్దంపట్టే మరో సంఘటన గురించి తెలుసుకుందాం... 

ఒకసారి శంకరరావు బాలకృష్ణ వైద్యతో కలిసి శిరిడీ వెళ్ళాడు నాచ్నే. బాబా వైద్యను 16 రూపాయల దక్షిణ అడిగారు. అందుకతను తనవద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపాగి ఆయన మళ్ళీ అతనిని రూ.32 దక్షిణ అడిగారు. అతడు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపాగి ఆయన మళ్ళీ 64 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగారు. అప్పుడతను, "బాబా! మేమంత ధనవంతులం కాదు. అంత పెద్ద మొత్తం మా దగ్గర ఎలా ఉంటుంది?" అని అన్నాడు. "అయితే ఆ మొత్తాన్ని వసూలు చేసి ఇవ్వండి" అన్నారు బాబా. కొంతకాలం తరువాత 1916వ సంవత్సరంలో బాబా అనారోగ్యానికి గురయ్యారు. బాబాకు ఆరోగ్యం చేకూరాలని భక్తులు పెద్ద ఎత్తున నామసప్తాహం ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ అన్నసంతర్పణ కూడా చేయాలని సంకల్పించారు. అందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది. దభోల్కర్ ఆదేశానుసారం వైద్య, నాచ్నేలు కూడా చందాలు వసూలు చేశారు. వాళ్ళు సేకరించి శిరిడీ పంపిన మొత్తం సరిగ్గా 64 రూపాయలే!

ఒకప్పుడు రాయ్ అనే గ్రామంలో ఉన్న నాచ్నే స్నేహితుడు రావూజీ సఖారాం వైద్య కుమారుడు 'మోరు' ప్లేగుతో అనారోగ్యం పాలయ్యాడు. నాచ్నే సఖారాం వైద్యకు బాబా ఊదీని ఇచ్చి, అతని కుమారునికి పెట్టమని చెప్పాడు. బాబా మహిమతో అతను పూర్తిగా కోలుకున్నాడు.

దహనులో పరశురామ్ అప్పాజీ నాచ్నే తలాఠీగా(గ్రామ ముఖ్యాధికారి) ఉండేవాడు. అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. అతనొక వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతుండేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానమున్న నాచ్నే తండ్రి, మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. అతని మనుగడపై వైద్యులు ఆశ వదులుకున్నారు. ఆ పరిస్థితుల్లో అతను ప్రతిరోజూ బాబా పటం ముందు అఖండ నేతి దీపం, అగరుబత్తీలు వెలిగించి బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడు. కొన్నిరోజుల్లో అతనికి ఆ వ్యాధి పూర్తిగా నయమైంది. మరోసారి అతను తీవ్రమైన కీళ్లనొప్పులతో అనారోగ్యం పాలయ్యాడు. చికిత్సలేవీ పనిచేయలేదు. అతను తన తల్లితో బాబా పటం ముందు దీపం, అగరుబత్తీలు వెలిగించి, ఆయనను ప్రార్థించమని చెప్పాడు. ఆమె బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి, తన కొడుకుకు నయమైతే ఖచ్చితంగా శిరిడీ వస్తానని వాగ్దానం చేసింది. త్వరలోనే అతను పూర్తిగా కోలుకున్నాడు.

1915లో నాచ్నే, ఎస్.బి.వైద్య బాబా దర్శనానికి వెళ్లారు. వైద్య తనతోపాటు వెండిపాదుకలను తీసుకెళ్లాడు. వాటిని బాబాకు సమర్పించి, వారి చేతుల మీదుగా తిరిగి తీసుకుని పూజించుకోవాలని అతని ఉద్దేశ్యం. కానీ బాబా వాటిని నాచ్నేకు బహుకరించారు. వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికే ఇచ్చేశాడు నాచ్నే. కానీ మాధవరావు దేశ్‌పాండే జోక్యంతో అవి తిరిగి మళ్లీ నాచ్నే వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరో జత వెండిపాదుకలు కూడా ఉన్నాయి. బాబా వాటిని స్వయంగా అడిగి తీసుకుని వాటిని కూడా నాచ్నేకి బహూకరించి, “వీటిని నీవద్ద ఉంచుకుని పూజించుకో” అని అన్నారు. "బాబా! ఇవి వైద్య చేయించినవి. అవి అతనికే చెందాలి" అని అన్నాడు నాచ్నే. అప్పుడు బాబా, "ప్రస్తుతానికి ఇవి నీ దగ్గర ఉంచుకో, తరువాత అతనికి ఇవ్వవచ్చు" అని అన్నారు. నాచ్నే కొంతకాలం వాటిని తన దగ్గర ఉంచుకున్న తరువాత ఒక జతను వైద్యకు ఇచ్చాడు.
బాబా తమ భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారు. బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే ఒక సంఘటన ఇది.

1915, మే నెలలో నాచ్నే తన అత్తగారిని తీసుకుని మరికొంతమందితో కలిసి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు సాఠేవాడాలో (తరువాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడాగా మారింది) బస చేశారు. ఆ వాడాలోని ఒక భాగంలో దాదాకేల్కర్ నివాసముంటున్నారు. ఒకరోజు నాచ్నే అత్తగారు వంటచేస్తూ ఉల్లిపాయలు తరుగుతున్నారు. సనాతన బ్రాహ్మణుడైన దాదాకేల్కర్ ఉల్లిపాయలపట్ల అసహ్యతతో ఆమెను దూషించాడు. అతని మాటలకు ఆమె మనస్సు నొచ్చుకుంది. కొన్ని గంటల తరువాత దాదాకేల్కర్ మనవరాలు తీవ్రమైన కళ్ళనొప్పితో ఏడవసాగింది. కేల్కర్ బాబా దగ్గరకు వెళ్లి, తన మనవరాలికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించమని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు బాబా "ఉల్లిపాయతో కాపడం పెట్టు" అని అన్నారు. అందుకతను, "ఉల్లిపాయను నేను ఎక్కడనుండి తెచ్చేది?" అని అడిగాడు. బాబా వద్ద ఎల్లప్పుడూ ఉల్లిపాయలుంటాయి గనక వారే వాటిని ఇస్తారని అతని ఉద్దేశ్యం. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. ఆయన తమ కఫ్నీ చేతులు పైకెత్తి నాచ్నే అత్తగారిని చూపిస్తూ అతనితో, "ఈ ఆయి(తల్లి) వద్ద నుండి తీసుకో" అని అన్నారు. చెడుకి బదులుగా మంచి చేయడం అనే గొప్ప ప్రతీకార చర్యతో ఆమె తన మనస్సులో అణిచిపెట్టుకున్న బాధనుండి ఉపశమనం పొందే అవకాశాన్ని బాబా ఇస్తున్నారు. 

ఆమె బాబాతో, "ఈరోజు ఉదయం నేను భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉల్లిపాయలు తరుగుతుంటే దాదా నన్ను దూషించాడు. అందుకే అతనికేదీ ఇవ్వాలని లేదు. కానీ అతనికి ఉల్లిపాయలు ఇవ్వమని మీ ఆదేశమైనట్లయితే అలానే చేస్తాను" అని చెప్పింది. అప్పుడు బాబా ఇవ్వమని ఆదేశించడంతో ఆమె కేల్కర్‌కు ఉల్లిపాయలిచ్చింది.

నాచ్నే దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు పుట్టినప్పటికీ కొద్దిమంది పురిటిలో, మరికొంతమంది చాలా చిన్న వయస్సులోనే మరణించారు.  అందువల్ల వారికి సంతానం ప్రసాదించమని నాచ్నే అత్తగారు బాబాను వేడుకున్నది. ఆమె కోరిక మేరకు మాధవరావు దేశ్‌పాండే నాచ్నే భార్యను బాబా వద్దకు తీసుకెళ్ళి, ఒక కొబ్బరికాయను ఆమె చీర చెంగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. బాబా ఆమెకు కొబ్బరికాయ ఇస్తున్నప్పడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తరువాత బాబా నాచ్నేను తమ వద్ద కూర్చుని, తమ పాదాలొత్తమని ఆదేశించారు.  వారి ఆదేశం మేరకు నాచ్నే బాబా పాదాలొత్తుతుండగా బాబా అతని వీపుపై ప్రేమగా నిమిరారు. బాబా తనపై చూపుతున్న కరుణకు అతడు కృతజ్ఞతలు తెలుపుతూ, "నన్ను చంపడానికి పిచ్చివాడు వచ్చినప్పుడు ఫోటో రూపంలో మీరు నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డాను బాబా" అని అన్నాడు. బాబా, “భగవంతుడే యజమాని (అల్లాహ్ మాలిక్ హై). అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి" అని అతనిని ఆలింగనం చేసుకున్నారు.

బాబా తమ భక్తులందరిపట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేగాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు చెప్పబోయే సంఘటనే అందుకు నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపునొప్పిగా ఉందని చెప్పారు. మావ్‌సీబాయి  ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తికడుపుపై పెట్టింది. పది నిమిషాలపాటు దానినలాగే ఉంచి తరువాత తీసివేసింది. ఆ సమయంలో బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నాచ్నే ఆమె చేస్తున్నది క్రూరమైన చికిత్స అనుకున్నాడు. ఆమె ఇటుక తీసిన తరువాత తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూసి నాచ్నే తట్టుకోలేక, "కాస్త నెమ్మదిగా ఒత్తు, బాబాకు బాధ కలుగుతుంది" అని ఆమెతో చెప్పాడు. వెంటనే బాబా "ఫో అవతలకి" అంటూ అతనిపై కోప్పడ్డారు. దాంతో అతను అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఆరోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో నాచ్నే మసీదుకి వెళ్లి తనకు ఉపదేశమిమ్మని బాబాను ప్రార్థిస్తూ, "ఏ జపం చేసుకోమంటారు?" అని అడిగాడు. అందుకు బాబా, "దేవపూర్ (కోపర్‌గాఁవ్ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం) వెళ్లి, అక్కడ మీ పూర్వీకులచే పూజింపబడిన శిలలను పూజించుకో" అని అన్నారు.

అతను శిరిడీ నుండి  దహనులోని తన ఇంటికి చేరుకున్న తరువాత తన తండ్రిని బాబా మాటలకు అర్థమేమిటని అడిగాడు. అప్పుడు అతని తండ్రి దేవ్‌పూర్‌లో తమ పూర్వీకులు కొన్ని విగ్రహాలను పూజించేవారని దాని వివరాలు ఇలా చెప్పాడు: "ఐదు తరాల ముందు మా పూర్వీకుడైన బాబాప్రయాగ్‌కు 60 సంవత్సరాల వయస్సు వరకు సంతానం లేదు. ఏకనాథ్ మహారాజ్ శిష్యుడైన బాబాభగవత్ అనే మహాత్ముని కృపతో కొంతమందికి సంతానం కలిగిందని, వారు అరుదుగా త్రయంబకంలోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తుంటారని ఆయనకి తెలిసింది. అలా వచ్చినప్పుడు బాబాప్రయాగ్ సంతానం కొరకు ఆ మహాత్ముని దర్శించాడు. ఆయన ఆశీర్వదించి కొబ్బరికాయను ప్రసాదించారు. తరువాత 61 సంవత్సరాల వయస్సులో బాబాప్రయాగ్‌కు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు కృష్ణారావు అని నామకరణం చేశారు. ఏడాది వయస్సున్నప్పుడు ఆ బిడ్డను బాబాభగవత్ దేవ్‌పూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించారు. ఆ వ్రాతప్రతి ఎంత మహిమగలదంటే దాన్ని బయటకు తీసినప్పుడల్లా కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయి. అప్పటినుండి మా కుటుంబీకులు బాబాభగవత్ గురుపరంపరలోని వారి వద్ద నుండి ఉపదేశం తీసుకుంటుండేవారు".

ఒకసారి నాచ్నే, గణేష్ వైద్యలు సాయిబాబా గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో గణేష్ వైద్య తన సొంత అనుభవాలు చెప్తున్నాడు. ఒకప్పుడు అతను పెళ్ళీడుకొచ్చిన తన చిన్న కుమార్తెకు తగిన వరునికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఎటువంటి ప్రయోజనం కనపడక అతడు దిగులుగా ఉన్న సమయంలో ఒకరోజు బాబా అతని కలలో కనిపించి"నువ్వు ఎందుకు ఆత్రుత పడుతున్నావు? కేశవ్ దీక్షిత్ కుమారుడు ఉన్నాడు" అని చెప్పి, ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. కానీ అతనెప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు, కలలో బాబా చూపించిన అబ్బాయిని ఎక్కడా చూసినట్లు కూడా అతనికి అనిపించలేదు. అతను ఆ పేరుగల వ్యక్తికోసం వెతకడం ప్రారంభించాడు. ఒకరోజు అతను తన కుమారునితో తనకు వచ్చిన కల గురించి చెప్పగా, అతడు తన కార్యాలయంలో ఆ లక్షణాలతో దీక్షిత్ అనే అబ్బాయి ఉన్నాడని, అతని తండ్రి పేరు కేశవ్ అని చెప్పాడు. ఆ అబ్బాయి అచ్చం కలలో బాబా చూపించినట్లే ఉన్నాడు. తరువాత వైద్య అతని గురించి పూర్తి విచారణ చేసి తన కుమార్తెనిచ్చి ఆ అబ్బాయితో వివాహం జరిపించారు. ఆవిధంగా బాబా అతని కుమార్తె పెళ్లి సమస్యను పరిష్కరించారు.

1916లో నాచ్నే బాబా అనుగ్రహంతో జలసమాధి కాకుండా రక్షింపబడ్డాడు. నాచ్నే రోజూ తన ఆఫీసుకు వెళ్లేందుకు ఒక సముద్రపుపాయను దాటవలసి వచ్చేది. ఒకరోజు అతను తన ఆఫీసు నుండి చాలా ఆలస్యంగా బయలుదేరాడు. ఆ సమయంలో పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. అందువల్ల ఒక పిల్లవాడు తెడ్డు వేస్తుండగా అతను దోనెలో ఆ సముద్రపుపాయను దాటుతున్నాడు. నాచ్నే ఒక వైపుకు ఒరగడంతో ఆ దోనె తలక్రిందులైంది. దానితో ఇద్దరూ నీటిలో పడిపోయారు. నాచ్నే తనని కాపాడమని సాయిబాబాను ఆర్తిగా ప్రార్థించాడు. ఆ పిల్లవాడు గజ ఈతగాడు, చురుకైనవాడు. అతను నీటిపై తేలుతున్న తాడును (దూరంగా ఉన్న ఓడ యొక్క లంగరు వేసే తాడు) పట్టుకోమని నాచ్నేతో చెప్పాడు. నాచ్నే వెంటనే ఆ తాడు అందుకున్నాడు. దాని సహాయంతో అతడు తన తల నీటిలో మునగకుండా కాపాడుకోగలిగాడు. అంతలో ఆ పిల్లవాడు ఓడ వద్దకు వెళ్లి వారి సహాయం అర్థించాడు. వాళ్ళు ఒక పడవను పంపి నాచ్నేను కాపాడారు. అలా బాబా అతనికి జీవితాన్నిచ్చారు.

source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.



నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

సాయిభక్తుల అనుభవమాలిక 334వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా
  2. బాబా నా కొడుకును తన ఒడిలో తీసుకున్నారు

నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా

ఆస్ట్రేలియా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తుల కుటుంబంలో జన్మించాను. బాల్యంనుండే బాబా మహిమను చవిచూస్తున్న అదృష్టవంతురాలిని. నేను ఎప్పుడూ ఆయన సంరక్షణలో ఉన్నాను. ఆయన దయ నా కుటుంబసభ్యులపై సదా ఉంది. నేనిప్పుడు మీతో పంచుకోబోయే అనుభవం శిరిడీ సందర్శించాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి బాబా ఎలా సహాయం చేస్తారో తెలియజేస్తుంది.

బాబా ఆశీస్సులతో నేను 2015, సెప్టెంబరులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబుకి రెండున్నర నెలల వయసు వచ్చేవరకు నేను నా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉన్నాను. ఒకరోజు మా నాన్న ఇంట్లో బొద్దింకలను నిర్మూలన చేసే ప్రయత్నంలో ఇల్లంతా హిట్ స్ప్రే చేశారు. దురదృష్టవశాత్తు, ఆయన మోతాదుకు మించి స్ప్రే చేసేశారు. ఇల్లంతా విషపూరిత పొగలతో నిండిపోయింది. మా అందరికీ ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా మారింది. మా పరిస్థితే ఇలా ఉంటే చిన్నవాడైన నా బిడ్డ పరిస్థితి ఏమిటని నాలో భయం చోటుచేసుకుని చాలా ఆందోళనపడ్డాను. నేను కళ్ళు మూసుకుని, "నా బిడ్డను కాపాడమ"ని బాబాను వేడుకుంటూ, "కుటుంబంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటే, నా బిడ్డతోపాటు శిరిడీ సందర్శిస్తాన"ని బాబాకు మాట ఇచ్చాను. ఎప్పుడూ మా సంరక్షకుడిగా నిలిచే బాబా క్షణాల్లో పరిస్థితిని చక్కబరిచారు. అయితే నేను నా వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తానో అనే ఆత్రుతలో పడ్డాను. ఎందుకంటే, "నా బిడ్డతో శిరిడీ వెళ్ళడానికి బాబాపట్ల నమ్మకం లేని నా భర్త ఎప్పటికైనా అంగీకరిస్తారా?" అని భయపడ్డాను. కానీ చేసేదిలేక నా చింతను బాబాకు వదిలేసి, "శిరిడీయాత్ర చేసేలా ఎలాగైనా మీరే చేయండి" అని ప్రార్థించాను.

రోజులు గడుస్తూ 2016 ఆగస్టు వచ్చింది. దురదృష్టవశాత్తూ అనుకోకుండా నా కొడుకు చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తను డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కి గురయ్యాడు. దానితోపాటు జ్వరంకూడా వచ్చింది. సమయం గడుస్తున్నా జ్వరం తగ్గే సూచనలు కనపడలేదు. చివరికి తనని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. తను కోలుకోవడానికి సుమారు 2 రోజులు పట్టింది. నేను, నా భర్త మా బాబు గురించి చాలా ఆందోళనపడుతూ మా ఇష్టదేవతలను ప్రార్థిస్తూనే ఉన్నామని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. బాబా నా బిడ్డని చల్లగా చూసుకున్నారు. ఆయన అనుగ్రహం వలన 4 రోజుల్లో మునుపటిలా తను చురుకుగా, ఉల్లాసంగా తయారై ఇంటికి తిరిగి వచ్చాడు. మా బాబు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకసారి మేము బయటికి వచ్చినప్పుడు నా భర్త నాతో, "మనం శిరిడీ వెళ్ళాలి" అని అన్నారు. నా భర్త  మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా పెళ్ళైన కొన్ని సంవత్సరాల తరువాత 2012లో మేము శిరిడీ సందర్శించినప్పుడు ఆయన నాతో, "ఈ మందిరం నుండి నాకు సానుకూలమైన వైబ్రేషన్స్ (సంకేతాలు) రాలేదు, కాబట్టి నేను మళ్ళీ ఎప్పటికీ ఈ మందిరాన్ని సందర్శించడానికి రాను" అని గట్టిగా చెప్పారు. అందువలన నేను, 'ఆకస్మికంగా ఈ మార్పుకు కారణమేమిట'ని ఆయనను అడిగాను. అందుకాయన, "నేను మన బిడ్డ ఆరోగ్యం విషయంలో చాలా బాధపడ్డాను. తను కోలుకుంటే శిరిడీ సందర్శిస్తానని బాబాకు మాట ఇచ్చాను" అని చెప్పారు. ఆ మాటలు వింటూనే నా ఆనందానికి అవధుల్లేవు. తరువాత మేము శిరిడీ వెళ్లి మా వాగ్దానాలను మేము నెరవేర్చగలిగాము. బాబా మమ్మల్ని చక్కటి దర్శనంతో అనుగ్రహించారు. "బాబా! మీ దయకు, ఆశీర్వాదాలకు చాలా చాలా ధన్యవాదాలు. నా బిడ్డను సదా రక్షిస్తున్నందుకు, మా జీవితాలలో చేస్తున్న ప్రతిదానికీ నా ధన్యవాదాలు".

బాబా నా కొడుకును తన ఒడిలో తీసుకున్నారు

ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటాను.

నేను కడుపుతో ఉన్న సమయంలో దాదాపు ప్రతి వారాంతంలో మా ఇంటి సమీపంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మేము సందర్శిస్తుండేవాళ్ళము. బిడ్డ జన్మించాక తనని వెంకటేశ్వరునికి చూపించాలని నేను చాలా ఆసక్తిగా ఉండేదాన్ని. అందువల్ల నా కొడుకుకి నెలల వయస్సున్నప్పుడు నేను, నా భర్త తనని తీసుకుని మొదటిసారి ఆలయానికి తీసుకువెళ్ళాము. నేను నా కొడుకును ఆలయ పూజారి చేతికందించి స్వామి పాదాల చెంత పెట్టించాలని ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు నా భర్త అందుకు అంగీకరించలేదు. నేను చాలా నిరాశచెందాను. కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను.

కొన్నివారాల తరువాత నూతన సంవత్సర సందర్భంగా అలవాటు ప్రకారం నా తల్లిదండ్రులు హైదరాబాదులోని దిల్‌షుఖ్‌నగర్ సాయిబాబా మందిరానికి వెళ్ళారు. వాళ్లతోపాటు నేను నా 3 నెలల కొడుకుతో వెళ్ళాను. ఆలయం చాలా రద్దీగా ఉంది. ఆ జనసందోహానికి నా కొడుకు ఎక్కడ ఇబ్బందిపడి ఏడుస్తాడోనని నేను భయపడ్డాను. కానీ అలా జరగలేదు. వాడు పండుగ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాడు. అక్కడ ఉండటం చాలా సంతోషంగా అనిపించింది. ఈలోగా బాబాను దర్శిస్తూ పాదుకలకు నమస్కరించుకోవడానికి నావంతు వచ్చింది. హఠాత్తుగా అక్కడి పూజారి నా చేతుల్లోనుండి నా కొడుకును తీసుకుని బాబా ఒడిలో ఉంచాడు. నా కొడుకు బాబావైపు చూసిన తీరును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఆనందకరమైన క్షణాలను నేనెప్పటికీ మరువలేను. నాకు ఒక్కసారిగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అక్కడ నెరవేరని నా కోరికను ఇక్కడ ఇలా అనూహ్యరీతిలో నెరవేర్చి తమకు వెంకటేశ్వరుడికి భేదం లేదని బాబా నిరూపించారు. ఆరోజునుండి నా కొడుకు దేవాలయాలు సందర్శించే సమయంలో చాలా సంతోషంగా ఉంటున్నాడు. తను చూపించే భక్తి చాలా స్వచ్ఛమైనది, నేను కూడా అదేవిధమైన భక్తిని కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. "బాబా! దయచేసి నా బిడ్డ జీవితాంతం ఈ స్వచ్ఛమైన భక్తిని కలిగివుండాలని ఆశీర్వదించండి. తనని మీ ఒడిలోకి తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా కోరికలను ఎప్పుడూ వింటున్నందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా!".

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....


శాంతారాం బల్వంత్ నాచ్నే- మొదటి భాగం


శాంతారాం బల్వంత్ నాచ్నే థానే జిల్లాలోని దహను గ్రామ నివాసి. అతని తండ్రి శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నే, తల్లి శ్రీమతి రమాబాయి బల్వంత్ నాచ్నే. శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నేకి సంబంధించి చెప్పుకోదగ్గ ఒక విశేషమేమిటంటే, అతను 1850వ సంవత్సరంలో పవిత్రమైన విజయదశమి రోజున జన్మించి, 1929లో అదే విజయదశమి రోజున మరణించాడు. అతను నాడిని చూసి వ్యాధిని నిర్ధారించగల గొప్ప నైపుణ్యం గలవాడు. అతనికి మూలికా వైద్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది. అతనెప్పుడు తన పంటపొలాలకు వెళ్ళినా వివిధ రకాలైన ఔషధ మూలికలను సేకరించి, వాటిని నూరి, ద్రావకాలను తయారుచేసేవాడు. అతను పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం చేస్తుండేవాడు. ఎప్పుడూ ఎవరి వద్ద నుండి ధనాన్ని స్వీకరించేవాడు కాదు. అతనిచ్చిన మందులు చాలా ప్రభావవంతంగా పనిచేసేవి. దహనులోనే కాక చుట్టుపక్కల గ్రామాలలో కూడా అతను గొప్ప హస్తవాసి గల వైద్యునిగా ప్రసిద్ధిగాంచాడు. అతని భార్య శ్రీమతి రమాబాయి కూడా అవసరంలో ఉన్న పేద ప్రజలకు సహాయం చేస్తుండేది. అలా సహాయం చేయడంలో ఆమె ఆనందం పొందేది. ఆమె ఎల్లప్పుడూ పూజాపునస్కారాలలో నిమగ్నమై ఉండేది. సాధు సత్పురుషులను తమ ఇంటికి ఆహ్వానించి, వారికి సేవ చేస్తుండేది. ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం. కుమారులు: ఆనంద్, శాంతారాం, జనార్థన్, రఘునాథ్, బాలచంద్ర. కుమార్తెలు: గులాబ్, బైజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే సుమారు 1889లో జన్మించాడు. అతనిని తన కుటుంబసభ్యులతో సహా అందరూ 'నానా' అని పిలిచేవారు. నాచ్నే కూడా తన తల్లిదండ్రుల మాదిరిగా మంచిపనులలో, ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటుండేవాడు. అతను తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి ముందే దహనులోని మామల్తదార్ కార్యాలయంలో ఉద్యోగం పొందాడు. అతనెప్పుడూ తన కుటుంబసభ్యులకు, తనను కలిసే వ్యక్తులకు సాయిబాబాతో తనకు గల అనుభవాలను పంచుకుంటూ ఉండేవాడు.

1909వ సంవత్సరంలో శాంతారాం బల్వంత్ నాచ్నేకు బాబా అద్భుతమైన అనుభవం ఇచ్చారు. నిజానికప్పటికి శ్రీసాయిబాబా గురించి అతనికి ఏమీ తెలీదు. ఆ సంవత్సరంలో నాచ్నే అన్నగారికి ముంబాయిలోని బజేకర్ ఆసుపత్రిలో గొంతు దగ్గర ఒక శస్త్రచికిత్స జరుగుతోంది. అతని తండ్రి అతనికి సహాయంగా అక్కడ ఉన్నాడు. మరోవైపు మిగతా కుటుంబసభ్యులంతా దహనులో శస్త్రచికిత్స గురించి ఆందోళనపడుతూ ఉన్నారు. నాచ్నే కూడా ఇంటిలోనే ఉన్నాడు. ఆ సమయంలో అతని వద్దకు ఒక సాధువు వచ్చి "రెండు రొట్టెముక్కలు పెట్టమ"ని అడిగాడు. కుటుంబసభ్యులు అతన్ని లోపలికి ఆహ్వానించి భోజనం పెట్టారు. నాచ్నే వదినగారు అతనికి అన్ని పదార్థాలు వడ్డించింది కానీ, బెండకాయ కూర సాధువులకు వడ్డించ తగినది కాదని దాన్ని మాత్రం వడ్డించలేదు. ఆశ్చర్యకరంగా ఆ సాధువు తనంతట తానుగా "నాకు బెండకాయ కూర కావాలి" అని అడిగి దాన్ని పెట్టించుకుని తిన్నాడు. తరువాత ఆ సాధువు వారందరినీ ఆశీర్వదించి, ముంబాయి ఆసుపత్రిలో ఆపరేషన్ సురక్షితంగా జరిగిందని, రోగికి ప్రాణాపాయమేమీ లేదని చెప్పాడు. తరువాత అదేరోజు నాచ్నే స్నేహితుడు హరిభావు మోరేశ్వర్ ఫన్సే వారి ఇంటికి వచ్చి మాటల సందర్భంలో, 'శ్రీసాయిబాబా' దయతో ఆపరేషన్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నాన"ని అన్నాడు. అదే మొదటిసారి నాచ్నే "సాయిబాబా" గురించి వినడం. అదేరోజు సాయంత్రం ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన అతని తండ్రి తన కుటుంబసభ్యులతో, "ఆపరేషన్ చక్కగా జరిగింది, ఎటువంటి ప్రమాదం లేదు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఒక సాధువు రోగి వద్దకు వచ్చి, ఆపరేషన్ జరిగిన శరీరభాగంపై తన హస్తాన్నుంచి 'అంతా బాగుంటుంద'ని చెప్పి వెళ్లారు" అని చెప్పాడు. కొద్దిరోజుల్లో నాచ్నే సోదరుడు పూర్తిగా కోలుకున్నాడు.

1909వ సంవత్సరంలో ఒకసారి శ్రీదాసగణు చేసిన కీర్తనకు నాచ్నే తండ్రి హాజరయ్యాడు. ఆ కీర్తనలో దాసగణు శ్రీసాయిబాబా సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామయులని అభివర్ణించాడు. తరువాత 1911లో నాచ్నే తండ్రి తన కుమారుడి ఉద్యోగానికి సంబంధించిన పనిమీద బాంద్రాలో ఉన్న శ్రీఅన్నాసాహెబ్ దభోల్కర్‌ని కలవడానికి వెళ్ళాడు. అక్కడ అతడు అందమైన శ్రీసాయిబాబా ఫోటోను చూశాడు. ఆ ఫోటో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ ఫోటో ఎవరిదని తన పక్కన ఉన్న వ్యక్తిని అడగగా, అది శ్రీసాయిబాబా ఫోటో అని అతడు చెప్పాడు. తరువాత అతను ఒక సాయిబాబా ఫోటో తెచ్చుకుని, ప్రతిరోజూ సాంబ్రాణికడ్డీలు వెలిగించి పూజించడం ప్రారంభించాడు.

1912లో నాచ్నే మొదటిసారి శిరిడీ సందర్శించాడు. అక్కడికి వెళ్ళడానికి ముందు అతను రెవెన్యూ సబార్డినేట్ పదవికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. దాని ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఆ సమయంలో అతడు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత దాతే అను ఇద్దరు స్నేహితులతో కలిసి శిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్ళు రైలులో కోపర్‌గాఁవ్ చేరుకున్నారు. వాళ్ళు శిరిడీ వెళ్తున్నారని విన్న అక్కడి స్టేషన్ మాస్టర్, సాయిబాబా తన గారడీ విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని విమర్శించాడు. అతని వ్యాఖ్యలను విన్న నాచ్నే మనస్సు కలత చెందింది. "సాయిబాబా నిజంగా గొప్ప మహాత్ములేనా? ఆయన దర్శనానికి వెళ్లడం సమంజసమేనా?" అన్న సందేహాలు తలెత్తి శిరిడీ పోవడానికి సంశయించాడు. కానీ చివరికి ఎలాగో సమాధానపడి ముగ్గురూ శిరిడీ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి సాయిబాబా లెండీనుండి మసీదుకొస్తూ దారిలో వాళ్ళకి ఎదురయ్యారు. ముగ్గురూ ఆయనకు నమస్కరించుకున్నారు. బాబా నాచ్నేను చూస్తూ, "ఏమిటి? మామల్తదార్ అనుమతి తీసుకోకుండా ఇక్కడికి వచ్చావా?" అని అడిగారు. ఆ విషయం గురించి బాబాకెలా తెలుసునని ఆశ్చర్యపోతూ 'అవున'ని బదులిచ్చాడు నాచ్నే. అప్పుడు బాబా అతనితో, "అలా ఎప్పుడూ చేయకు" అని అన్నారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నాచ్నే మనస్సులో ఏర్పడిన సందేహాలన్నీ బాబా మాటలతో తొలగిపోయాయి. బాబా సర్వజ్ఞులని అతనికి అర్థమైంది. బాబా అంతర్యామి అనీ, ఆయనకన్నీ తెలుసునని అతను గ్రహించాడు. వాళ్ళు మూడురోజులు శిరిడీలో బసచేశారు. ఆ మూడురోజులలో నాచ్నే పొందిన అనుభవాలకి ఇది ఆరంభం మాత్రమే. అతనికి కలిగిన ప్రతి అనుభవమూ బాబా మహిమను, భక్తులపై వారికి గల వాత్సల్యాన్ని తెలియజేసాయి. మూడురోజులు ముగిసేసరికి బాబా నిజంగా దత్తావతారమని అతనికి పూర్తి నమ్మకం ఏర్పడింది.

రెండవరోజు బాబా తమ ఆశీస్సులు నాచ్నే కుటుంబమంతటిపై ఉన్నాయని నిరూపణ ఇచ్చారు. ఆరోజు నాచ్నే బాబా సమక్షంలో కూర్చుని ఉండగా ఆయన తమ వేలితో అతని వైపు చూపుతూ కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ జోగ్, అన్నాసాహెబ్ దభోల్కర్ మొదలైన భక్తులతో, "ఒకప్పుడు నేను ఇంతనింటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయకూర వడ్డించలేదు" అని అన్నారు. ఆ మాటలు వింటూనే 3 సంవత్సరాల క్రితం భోజనం కోసం వచ్చిన సాధువును గుర్తుచేసుకున్నాడు నాచ్నే. బాబానే ఆ సాధువు రూపంలో వచ్చి తన సోదరుడికి ఆపరేషన్ బాగా జరిగిందని భరోసా ఇచ్చి, కుటుంబమంతటినీ ఆశీర్వదించారని గ్రహించాడు. అప్పుడు నాచ్నే తాను ఇటీవల వ్రాసిన డిపార్ట్‌మెంటల్ పరీక్షా ఫలితాల గురించి బాబాను అడిగాడు. బాబా "అల్లా మాలిక్ హై" అని తమ వరదహస్తాన్ని అతని తలపై ఉంచి ఆశీర్వదించారు. తరువాత ఆ పరీక్షలో నాచ్నే ఉత్తీర్ణత సాధించాడు. ఆ తరువాత దీక్షిత్, జోగ్, దాభోల్కర్‌లతో దహనులో తన ఇంటికి సాధువు వచ్చినప్పుడు తన వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని తెలియజేశాడు నాచ్నే. 

ఆ విషయం గురించి శ్రీబి.వి.నరసింహస్వామితో నాచ్నే ఇలా చెప్పాడు: "చిత్రమైన విషయమేమంటే, ఆరోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు, బాబాకు ఎలాంటి పోలికలూ లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతో ఉన్న హిందూ సాధువు. అతను సాయిబాబావలె కాక, మీవలె (బి.వి. నరసింహస్వామి వలే) ఉన్నాడు. అంతేగాక ఆపరేషన్ జరిగిన రెండు, మూడురోజుల తరువాత దహనులో నేను అతనిని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా! కొన్నిరోజుల తరువాత అతను దహను నుండి వెళ్ళిపోయినట్టున్నాడు, నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి, బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారు ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిరారణ అయింది!"

బాబా నాచ్నేపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. ఆయన స్వయంగా అతని చేతిలోని ఊదీ తీసి అతని నుదుటన పెట్టారు. అది అందరికీ లభించే భాగ్యం కాదు. చాలా తక్కువమంది భక్తులు మాత్రమే బాబా నుండి అటువంటి అభిమానాన్ని పొందారు.

తరువాత ఆరతి సమయానికి భక్తులందరూ మశీదు చేరుకుంటున్నారు. వాళ్లలో నాచ్నే కూడా ఒకడు. బాబా అతన్ని చూసి, "వాడాకి వెళ్లి భోజనం చేసిరా!" అన్నారు. అందుకతడు, "బాబా! ఈరోజు ఏకాదశి" అని బదులిచ్చాడు. చాలామంది ఉపవాసం ఉండే పవిత్ర దినమది. సాధారణంగా అయితే నాచ్నే ఆరోజు ఉపవాసం ఉండడు. కానీ తన స్నేహితులిద్దరూ ఉపవాసముండగా తాను మాత్రమే తినడం బాగుండదని అతను కూడా ఉపవాసముంటున్నాడు. బాబా ఎన్నడూ ఉపవాసాలను ప్రోత్సహించేవారు కాదు. ఆయన అతని స్నేహితులను చూపిస్తూ, "వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్లి భోజనం చేసిరా!" అని అన్నారు. సరేనని అతడు భోజనం కోసం వాడాకు వెళ్లగా, భోజనం వడ్డించే వ్యక్తి చికాకుపడి 'ఏకాదశిరోజున కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నావే!' అని గొణుక్కుంటూ, "ఆరతి అయ్యాకనే భోజనం పెడతాన"ని మశీదుకు బయలుదేరాడు. అందువల్ల నాచ్నే భోజనం చేయకుండానే మసీదుకు తిరిగి వచ్చాడు. బాబా అతనిని "భోజనం చేశావా?" అని అడిగారు. అందుకతను, "లేదు బాబా, ఆరతి అయిన తరువాత భోజనం చేస్తాను" అని బదులిచ్చాడు. కానీ బాబా పట్టుబట్టి, "ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే ఆరతి మొదలవుతుంది" అని చెప్పి, "ఉపవాసంతో భగవంతుని కనుగొనలేవు" అని అన్నారు. ఇక తప్పనిసరై భోజనశాల అతను నాచ్నేకు వడ్డించాడు. నాచ్నే భోజనం చేసి తిరిగి మశీదుకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి మావ్‌సీబాయి (పిన్నమ్మ లేక పెద్దమ్మ) బాబాకు తాంబూలం సమర్పించింది. ఆయన అందులో సగం నాచ్నేకిచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధమని అతను సంశయిస్తుంటే, బాబా మళ్ళీ "తిను" అని అన్నారు. దాంతో అతను తాంబూలం వేసుకున్నాడు. తరువాత ఆరతి ప్రారంభమైంది.

ఆరతి తరువాత బాబా నాచ్నే వద్దనుండి 4 రూపాయలు, వైద్య వద్దనుండి 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. కానీ దాతేను బాబా దక్షిణ అడగలేదు. కారణం, అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టంలేదు. అప్పుడొక  మార్వాడీ బాలిక బాబా వద్దకొచ్చి తనకు నారింజపండు కావాలని మారాం చేసింది. దాతే కొన్ని నారింజపండ్లను వాడాలో దాచుకుని మిగిలినవి మాత్రమే మశీదుకు తీసుకొచ్చి తమకు సమర్పించాడని తెలిసిన బాబా, వాటిని తీసుకుని రమ్మని అతనితో అన్నారు. తాను వాటిని ఏకాదశినాడు అల్పాహారంగా తినడానికి దాచుకున్నాని చెప్పి, వాటిని తెచ్చివ్వడానికి నిరాకరించాడు దాతే. ఆపై వాటిని తెమ్మని బాబా అడగలేదు.

మూడవరోజు నాచ్నే, అతని స్నేహితులు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవడానికి సన్నద్ధమవుతున్నారు. అంతవరకూ బాబాపట్ల నాచ్నే మనసులో ముద్రించుకుపోయిన సద్భావనలు చెదిరిపోతాయేమో అనిపించే సంఘటన ఆరోజు జరిగింది. ఆరోజు ఉదయం మశీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఆయన కనులు ఎర్రబారిపోయాయి. మశీదులో ఉన్నవారంతా అక్కడినుండి పారిపోయారు. బాబా దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. 15 నిమిషాలపాటు బాబా అందరినీ భయభ్రాంతులను చేశారు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు ఆయన పిచ్చివారేమో అన్న అనుమానం నాచ్నేకు కలిగింది. కానీ కాసేపటికి బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. నాచ్నే, అతని స్నేహితులు బాబా దగ్గరకెళ్ళి శిరిడీ నుంచి వెళ్ళడానికి అనుమతి కోరారు. బాబా ఊదీ ఇచ్చి, వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.

ఆ సమయంలో నాచ్నే బాబా నుండి మరో అనుభవాన్ని పొందాడు. అతను దహనులో పనిచేస్తూ ఉండేవాడు. ఆరోజుల్లో గ్రామప్రాంతాల నుండి నగరాలకు బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. అతను తనకి ముంబాయికి బదిలీ కావాలని ఆశపడుతుండేవాడు. ఆ విషయం అతడు బాబాతో చెప్పకపోయినప్పటికీ బాబా తమంతట తాముగా, "ఉద్యోగానికి ముంబాయి రా" అని అన్నారు. బాబా నోటివెంట వచ్చిన ఆ మాట ఆరు సంవత్సరాల తరువాత నిజమైంది. బాబా ఆశీర్వాద ప్రభావం వల్ల నాచ్నేకు 1918లో ముంబాయి పరిసరప్రాంతమైన బాంద్రాకు బదిలీ అయ్యింది.

నాచ్నే అతని స్నేహితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. బాబా కృప వలన 'అనుమతి లేకుండా తన ఉద్యోగ విధులకు గైర్హాజరైన' విషయంలో నాచ్నేని అతని పైఅధికారి, మామల్తదారు అయిన బి.వి.దేవ్ ఏ విధమైన శిక్ష వేయకుండా ఇంకోసారి ఇలా చేస్తే చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించి వదిలేశాడు.

నాచ్నే శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత, అతని స్నేహితుడు గోపాల్ కేశవ్ వైద్య శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. అతడు శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత తన అన్నగారైన ఆత్మారాం కేశవ్ వైద్యకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించమని చెప్పాడు. ఆత్మారాం గారికి 42 సంవత్సరాలు, అతని భార్య వయసు 38 ఏళ్ళు. కొన్ని సమస్యల కారణంగా ఆమె అప్పటివరకు తన భర్త ముఖాన్ని చూడలేదు. దంపతుల మధ్య సమస్యలు తొలగించడానికి ఇరు కుటుంబసభ్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె పుట్టింటిని విడిచి వెళ్ళడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. గోపాల్ కేశవ్ వైద్య శిరిడీ ప్రసాదాన్ని ఆమెకు పంపించాడు. అవి చేరిన వెంటనే ఆమె తన భర్త ఇంటికి వచ్చేసింది. ఆమె తన మరిదితో, "ఇదే నా నిజమైన ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది?" అని అన్నది. ఆమె మాటలు విన్న అతను ఆశ్చర్యపోయాడు. అప్పటినుండి ఆ దంపతులు సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. బాబా అనుగ్రహంతో వాళ్లకు చక్కని సంతానం కూడా కలిగింది.

నాచ్నే మొదటిసారి 1912లో బాబాను దర్శించినప్పటినుండి తరచూ శిరిడీ వెళ్లి బాబాను దర్శిస్తూ ఉండేవాడు. 1913లో ఒకసారి అతను శిరిడీ ప్రయాణమవుతున్నప్పుడు అతని స్నేహితుడు హెచ్.ఎం.ఫన్సే అతన్ని కలిశాడు. అతడు నాచ్నేతో, 'ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాననే నేరంపై తనను దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, జామీనుపై తనని విడుదల చేశార'ని చెప్పాడు. అంతేకాదు, 'తాను కోర్టులో అప్పీలు చేసుకున్నానని, అది ఒకటి రెండు రోజుల్లో విచారణకొస్తుంద'ని చెప్పి, తాను నిర్దోషినని, ఇబ్బందుల్లో ఉన్న తనకు సహాయం చేయమని తన తరపున బాబాను ప్రార్థించమని చెప్పాడు. నాచ్నే తెల్లవారుఝామున శిరిడీ చేరుకునేసరికి చావడిలో కాకడ ఆరతి జరుగుతోంది. ఆ సమయంలో బాబా చాలా కోపంగా ఉన్నారు. అయినప్పటికీ నాచ్నేను చూస్తూనే బాబా, "ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అతనితో చెప్పు. అతను అప్పీలు మీద నిర్దోషిగా ప్రకటించబడతాడు" అని చెప్పారు. అదే జరిగింది. నాచ్నే శిరిడీ నుండి తిరిగి వెళ్లి ఫన్సేతో ఆ విషయం చెప్పేసరికే అతను అప్పీలు మీద నిర్దోషిగా విడుదలై ఉన్నాడు. బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరిందన్న మాట.

అదే సంవత్సరంలో ఒకసారి నాచ్నే శిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనితో, "పిచ్చివాళ్ళను నమ్మకూడదు" అని అన్నారు. అది అందరినీ ఉద్దేశించి చెప్పినదేగానీ తనకు ప్రత్యేకించి చెప్పినది కాదని నాచ్నే అనుకున్నాడు. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, బాబా తనకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అతడు గ్రహించాడు. 1914లో నాచ్నే దహనులో కోశాధికారిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు అతను తన రోజువారీ అలవాటు ప్రకారం బాబా మరియు ఇతర దేవతామూర్తుల పూజలో నిమగ్నమై ఉన్నాడు. రామకృష్ణ బల్వంత్ ఫన్సే అనే మానసికరోగి పూజగదికి కొంత దూరంలో ఉన్న తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. అతను ఎవరికీ ఏ హానీ తలపెట్టేవాడు కాదు. అందువలన నాచ్నే అతన్ని పట్టించుకోలేదు. అకస్మాత్తుగా అతడు నాచ్నే మీద పడి రెండు చేతులతో నాచ్నే మెడ పట్టుకుని, "నేను నీ రక్తం తాగుతాను" అని అరుస్తూ నాచ్నే గొంతు కొరికే ప్రయత్నం చేశాడు. క్షణం పాటు నాచ్నేకు ఏమీ అర్థం కాలేదు. బాబా దయవల్ల మరుక్షణంలో అతనికొక ఆలోచన స్ఫురించి ఉద్ధరణి తీసుకుని ఫన్సే గొంతులో గుచ్చాడు. దానితోపాటు అతని నోట్లోకి వెళ్లిన నాచ్నే వేళ్ళను ఆ పిచ్చివాడు గట్టిగా కొరకసాగాడు. నాచ్నే మరో చేత్తో తన మెడను అతని పట్టునుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గోళ్ళు నాచ్నే మెడలోకి గుచ్చుకుపోయాయి. అంతలో నాచ్నే తల్లి పరుగున వచ్చి ఆ పిచ్చివాడి పట్టునుండి విడిపించడానికి సహాయం చేసింది. అప్పటికే నాచ్నే స్పృహ కోల్పోయాడు. తరువాత ఏవో చికిత్సలు చేశాక అతను కోలుకున్నాడు. కానీ నాచ్నే మెడ భాగంలో లోతుగా గుచ్చుకుపోయిన ఆ పిచ్చివాడి చేతిగోర్ల గుర్తులు పోవడానికి చాలాకాలం పట్టింది. నాచ్నే దాదాపు చావు అంచుల వరకు వెళ్ళాడు, కానీ బాబా ఆశీస్సుల వలన అదృష్టవశాత్తూ బ్రతికి బయటపడ్డాడు. ఆ తరువాత నాచ్నే శిరిడీ వెళ్ళినప్పుడు, బాబా అతని వైపు చూపిస్తూ అణ్ణాచించణీకర్‌తో, "అణ్ణా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉన్నా ఇతడు చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతును నులిమేసేవాడు. కానీ, నేను అతని బారినుండి ఇతనిని విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు?" అని అన్నారు. బాబా యొక్క ఈ మాటలు ఆయనకు తమ భక్తులపట్ల ఎనలేని దయ, ప్రేమను సూచిస్తున్నాయి. తమను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంతో అప్రమత్తంగా ఉంటారనడానికి నిదర్శనమే ఈ అనుభవం.

 source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.




తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.





సాయిభక్తుల అనుభవమాలిక - 333వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు
  2. బాబా కృపతో తీరిన చింత

బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు

సాయిభక్తురాలు బీబీ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

జై సాయిరామ్! నేను ప్రతిదానికీ బాబాను నమ్ముతాను. ఆయన పేరే తలచుకుంటూ ఉంటాను. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా క్వశ్చన్&ఆన్సర్ (https://www.yoursaibaba.com/) వెబ్‌సైట్ ద్వారా నేను బాబా నుండి సమాధానాలు పొందుతున్నాను. అటువంటి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం: 

నేను నా ఇంజనీరింగ్ పూర్తిచేసి, మా బంధువుల ఇంట్లో ఉండి ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు గురుపౌర్ణమి వచ్చింది. ఆరోజు నేను నా పారాయణ పూర్తిచేసి, 'నా జీవితం ఎలా సాగబోతోంద'ని బాబాను అడిగాను. అప్పుడు, "త్వరలో నువ్వు శిరిడీ సాయిని సందర్శిస్తావు" అని బాబా సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. పదిరోజుల తరువాత మా బంధువులు అకస్మాత్తుగా శిరిడీ యాత్ర ప్లాన్ చేశారు. నన్ను కూడా వాళ్లతో తీసుకుని వెళ్లారు. అలా నేను బాబా చెప్పినట్లుగానే శిరిడీ సందర్శించాను.

రెండవ అనుభవం: 

ఒకసారి నేను, "బాబా, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?" అని అడిగాను. అప్పుడు, “నువ్వు ఉత్తర దిశగా వెళ్తావు” అని బాబా చెప్పారు. ఆ సమయంలో నేను బెంగళూరులో ఉన్నాను. 10 రోజుల్లో నాకు పూణేలోని హెచ్‌ఎస్‌బిసి సాఫ్ట్‌వేర్ సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఉద్యోగం నాకు రావడంతో నేను పూణే వెళ్ళాను.

మూడవ అనుభవం: 

ఒకసారి నా మనసు ఏమీ బాగాలేక బాబా సమాధానం కోసం చూశాను. అప్పుడు, "త్వరలో నువ్వు శిరిడీ సందర్శిస్తావు" అని వచ్చింది. 20 రోజుల తరువాత నా రూమ్మేట్ తనతో శిరిడీ రమ్మని నన్ను పిలిచింది.

నాల్గవ అనుభవం: 

3వ అనుభవంలో బాబా చెప్పినట్లుగా నేను శిరిడీ సందర్శించి వచ్చిన తరువాత నా రూమ్మేట్ తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇటు రూములో, అటు ఆఫీసులో ఆమె సహచర్యం లేక నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ క్రొత్త ఫ్రెండ్ కోసం బాబాను అడిగాను. అప్పుడు బాబా సమాధానంగా, "నువ్వు పూణేలో ఒక వ్యక్తిని కలుస్తావు" అని వచ్చింది. ఎప్పటిలాగే ఆయన మాటలు నిజమయ్యాయి. ఆ ఒంటరితనంలో ఉన్న సమయంలో ఒకసారి నేను నా స్వగ్రామానికి వెళ్ళాను. అప్పుడు నాకొక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అంతా సక్రమంగా సాగి నెలలోనే నిశ్చితార్థం, వివాహం జరిగిపోయాయి. అతను పూణేలో పనిచేస్తున్నాడు.

ఐదవ అనుభవం: 

మొదటిసారి నేను గర్భం దాల్చినపుడు నాకు గర్భస్రావం జరిగింది. నేను దిగులుపడుతూ, “బాబా! నేను గర్భవతినని మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది?” అని అడిగాను. అప్పుడు, "త్వరలో ఒక మగపిల్లవాడికి జన్మనిస్తావు" అని ఆయన హామీ లభించింది. తరువాత కొద్దిరోజుల్లోనే నేను గర్భం దాల్చి, 2019, ఏప్రిల్ 25న ఆరోగ్యకరమైన చక్కటి మగబిడ్డకు జన్మనిచ్చాను.

ఆరవ అనుభవం: 

ఒకసారి నేను యథాలాపంగా వెబ్‌సైట్ తెరచి నెంబర్‌ 42 ఎంచుకున్నాను.  అందులో, "మత పుస్తకాలను చదవడం, వ్రాయడం జరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలు జరుగుతాయి. మంచి విషయాలు జరుగుతాయి" అని ఉంది. సరిగ్గా 10 రోజుల తరువాత నా కజిన్ తనకి తెలిసిన వాళ్ళకి నా నంబర్ ఇచ్చారు. వారు నాకు ఫోన్ చేసి మహాపారాయణలో చేరమని అడిగారు. ఆనందంగా మహాపారాయణలో చేరాను.

ఇలా నా ప్రతి సమస్యకు బాబా నాతో మాట్లాడుతున్నారు. "సదా నాకు అండగా ఉంటున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2565.html?m=0

బాబా కృపతో తీరిన చింత

సాయిభక్తురాలు శ్రీమతి అనుపమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నమస్కారం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు. నా పేరు అనుపమ. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. గత సంవత్సరం నవంబరులో మా అమ్మాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. మరో రెండు రోజులలో మేము శివపార్వతుల కళ్యాణం చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాం. మా అమ్మాయికి అలా ఉంటే తనని వదిలి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అదే విషయం బాబాకి చెప్పుకున్నాను. "బాబా! మా అమ్మాయికి జ్వరం తగ్గి తను ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. తనకు జ్వరం తగ్గిపోతే నా అనుభవాన్ని 'సాయిమహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపతో మరుసటిరోజుకే మా అమ్మాయికి జ్వరం తగ్గిపోయింది. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

అలాగే ఇంకో అనుభవం కూడా మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఒకసారి లాకర్ తాళంచెవులు ఎక్కడో పెట్టి మరచిపోయాను. ఆ సమయంలో నేను ఎంత వెతికినా అవి దొరకలేదు. మావారు నన్ను ఏమైనా అంటారేమోనని నాకు చాలా భయమేసింది. వెంటనే, "లాకర్ తాళంచెవులు దొరికితే 21 డాలర్లు దక్షిణ మరియు ఒక టెంకాయ సమర్పిస్తాను బాబా. అంతేకాదు, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను ముందురోజు వెతికినప్పుడు తాళంచెవులు నా హ్యాండ్‌బ్యాగులో లేవు. ఆశ్చర్యంగా తరువాతిరోజు అవి నా హ్యాండ్‌బ్యాగులోనే కనిపించాయి. నిజంగా ఆ క్షణంలో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇదంతా బాబా కృపే అని నాకు ఖచ్చితంగా తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నాకున్న ఇంకో కోరికని కూడా బాబా తొందరలోనే తీరుస్తారని అనుకుంటున్నాను. అది తీరాక మరలా ఆ అనుభవంతో మీ ముందుకి వస్తాను. "ఇంత ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు మన్నించండి బాబా!"

ఓం సాయిరామ్!!!


సాయిభక్తుల అనుభవమాలిక - 332వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మహాపారాయణతో మనోపరివర్తన
  2. నిందారోపణ నుండి బాబా కాపాడారు

మహాపారాయణతో మనోపరివర్తన

ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి నా పేరు చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. 

గత 3 సంవత్సరాలుగా నేను బాబాకు భక్తురాలిని. అంతకుముందు కూడా నేను బాబా గుడికి వెళ్ళేదాన్ని. కానీ బాబా గురించి తెలుసుకొని బాబాని పూజించడం మొదలుపెట్టి ఆయనకు దగ్గరవుతున్నది మాత్రం 3 సంవత్సరాలుగానే. ప్రతి గురువారం నేను ఆరతి సమయానికి బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. బాబా అనుగ్రహంతో ఈమధ్యే నేను మహాపారాయణ గ్రూపులో చేరాను. 

నేను ఇప్పుడు మావారి విషయంలో బాబా చూపిన మహిమను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మావారు చాల మంచి మనిషి. కానీ ఆయన కూడా తప్పు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మావారు ఒక తప్పు చేశారు. (అదేమిటన్నది నేను చెప్పలేను.) కానీ నాకు ఎప్పుడూ ఆ విషయంలో ఆయన మీద అనుమానం రాలేదు.

నేను మహాపారాయణ గ్రూపులో చేరిన తరువాత మావారిని కూడా మహాపారాయణ గ్రూపులో చేరమని చెప్పడంతో ఆయన కూడా చేరారు. పారాయణ చేయడం మొదలుపెట్టిన నాలుగు వారాలలోగా మావారికి తను చేస్తున్నది తప్పు అని తెలిసి, తన తప్పును నా దగ్గర ఒప్పుకొని, నన్ను క్షమించమని ప్రాధేయపడ్డారు. అంతేకాకుండా ఎప్పుడు నాతో గుడికి వచ్చినా విసుక్కునే మనిషి బాబా ఆరతికి వచ్చి, పల్లకి సేవలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మావారు బాబాను ఎంతగానో నమ్ముతున్నారు.

బాబానే మావారి చేత పారాయణ చేయడం మొదలుపెట్టించి, తన తప్పు తనే తెలుసుకొనేలా చేసి, తనని సరైన మార్గంలో నడిపించి మా మధ్య మనస్పర్థలు రాకుండా చేశారని ఎంతో ఆనందించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ఇంకోసారి మీకు చాలా చాలా ధన్యవాదులు బాబా! ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని ఇలాగే రక్షించండి".

సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

నిందారోపణ నుండి బాబా కాపాడారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను బాబా భక్తురాలినని చెప్పుకోవడానికే చాలా ఇబ్బందిపడుతున్నాను. ఎందుకంటే, జులై నెలలో నేను 3-4 వారాలపాటు బాబా విషయంలో కలత చెంది, ఆయనపై కోపంగా ఉన్నాను. అయినప్పటికీ నేను ఆయననే ప్రార్థిస్తూ ఉండేదాన్ని. (నిజం చెప్పాలంటే, అంతకుముందు ఉన్నంత తీవ్రత లేదు.) దానికి కారణం ప్రతిరోజూ బాబా పేరు తలవకపోతే అంతా శూన్యంగా అనిపించేది.

31.7.2019, బుధవారంనాడు నా భర్త తను పనిచేస్తున్న సంస్థలో తన ప్రాజెక్టుకు సంబంధించిన డేటాను వేరే డొమైన్‌లో ఉన్న ఒక సహోద్యోగితో (ఇటీవలే కంపెనీలో చేరాడు) పంచుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఒక అభియోగం తనపై వచ్చింది. ఆ ప్రాజెక్టుపై నా భర్త ఎంతోకాలంగా పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిందే ఆయన. అలాంటిది తనపై ఆ సహోద్యోగి ఆరోపణలు చేస్తూ మేనేజరుకి ఇ-మెయిల్ పంపాడు. ఆ ప్రాజెక్టును ప్రారంభించింది నా భర్త అని, ఆయన తప్ప మరెవరూ దానిపై పనిచేయడం లేదని తెలిసిన మావారి మేనేజర్ వివరాలను తెలుసుకోవడానికి మావారిని సంప్రదించాడు. నా భర్త తానేమీ చేయలేదని ఎంతలా చెప్పినప్పటికీ, అతను "నీకు మాత్రమే ప్రాజెక్ట్ వివరాలు తెలుసు, మరి నువ్వుకాక ఎవరు గోప్యమైన డేటాను అతనికి పంచుతార"ని నా భర్త మాటను నమ్మలేదు. దాదాపు మూడుగంటలు ఈ టెన్షన్ అనుభవించాక నా భర్త నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా టెన్షన్‌గా ఉన్నారు. తనైతే పూర్తిగా ఆశను కోల్పోయి తనపై ఏదైనా చర్య తీసుకోవచ్చు అన్న స్థితికి వచ్చేశారు. తన ఉద్యోగాన్ని కోల్పోతానని భయపడుతున్నారు. నేను తనని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ, నేను కూడా లోలోపల టెన్షన్ పడ్డాను. అయితే నా భర్త అలాంటి పని చేయరని నా హృదయం నాకు చెప్తోంది. నేను బాబాపై అలిగి ఉన్నప్పటికీ, "బాబా! ఈ సమస్యను పరిష్కరించి, నా భర్త ప్రతిష్ఠను కాపాడండి" అని బాబాను ప్రార్థించాను. మరుక్షణంలో బాబా అనుగ్రహించారు. ఆయన నాకు ఒక ఆలోచన ఇచ్చారు. వెంటనే నేను నా భర్తకు ఫోన్ చేసి, "ఇ-మెయిల్ హిస్టరీని, ప్రాజెక్టు కోసం మీరు మూడేళ్ళలో సేకరించిన డేటా వివరాలను చూపించమ"ని చెప్పాను. నా భర్త ఇ-మెయిల్ కమ్యూనికేషన్ల హిస్టరీని సాక్ష్యంగా ఉపయోగించి, ప్రాజెక్టు స్థాపనలో తన కీలకపాత్ర గురించి తన మేనేజరుకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. వెంటనే ఆ మేనేజర్ అది తప్పుడు ఆరోపణ అని నిర్ధారించి, ఆ సహోద్యోగిని నా భర్తకు క్షమాపణ చెప్పమని చెప్పారు. ఆ సహోద్యోగికి పెద్ద దెబ్బ పడింది. ఇప్పటివరకు అతను మళ్ళీ ఇ-మెయిల్ చేసి నా భర్తను సంప్రదించలేదు. ఇది నిజంగా బాబా ఆశీర్వాదం. ఈ అనుభవం ద్వారా పిల్లలమైన మనం మన ప్రియమైన బాబాపై కలత చెందినప్పటికీ, కోపం తెచ్చుకున్నప్పటికీ ఆయన మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరని తెలుసుకున్నాను. "ధన్యవాదాలు సాయిబాబా!".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2571.html


సాయిభక్తుల అనుభవమాలిక - 331వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు
  2. బాబా అనుగ్రహంతో ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది

బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఓం సాయిబాబా! బాబా భక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు, వాటి ద్వారా మాలో భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందడానికి, సహనం అలవడటానికి ఉపయుక్తంగా ఉన్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. మాటలకు అందని సాయి ప్రేమకి చాలా చాలా కృతజ్ఞతలు. నా ప్రార్థనలకు సమాధానం లభించిన తర్వాత నా అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

గత 13 సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తురాలిని. దాదాపు ప్రతిసారీ నా ప్రార్థనలకు బాబా సమాధానం ఇచ్చారు. నా జీవితంలో ఆయన ఉనికిని నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నాను. చదువులో మంచి గ్రేడ్, మంచి ఉద్యోగం, వివాహం ఇలా ప్రతి విషయంలో ఆయన నాకు సహాయం చేశారు. ఆయన లేకుండా నేను లేను. ఆయన కృపతో ఈరోజు నేను మంచి విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. బాబా నాకు మంచి స్నేహితుడు.

నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా వివాహమైన తరువాత ఉద్యోగరీత్యా నేను, నా భర్త వేర్వేరు నగరాల్లో ఉంటున్నాము. అక్కడున్న పరిస్థితుల వలన మావారు తరచూ నా దగ్గరకు వచ్చే అవకాశం లేకుండాపోయింది. నా భర్త ప్రభుత్వ బ్యాంకులో పని చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా మావారు చాలా నిరాశకు గురయ్యారు. అంతేకాదు, ఆ పరిస్థితులు మా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయి. అందువలన ఆయన తన బ్యాంకులో వేరే పొజిషన్ కోసం దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు మానసిక ఒత్తిడి కారణంగా ఆయన సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ ఎలాగైనా అందులో ఎంపిక అయితే బాగుంటుందని ఆశపడ్డారు. ఆ విషయమై నేను హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించి సచ్చరిత్ర సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. 6వ రోజు బాబా అనుగ్రహం మాకు లభించింది. మావారు ఆ పొజిషన్‌కి ఎంపికైనట్లు శుభవార్త వచ్చింది. నేను, మావారు చాలా సంతోషంగా సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మా వారికి త్రివేండ్రంలో పోస్టింగ్ వచ్చింది. మేమిద్దరం త్వరలోనే అక్కడకు వెళ్తున్నాము. బాబా దయతో మేము కలిసి ఉండబోతున్నాము. మేము అక్కడికి వెళ్ళాక నాకు కూడా ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వమని సాయిని ప్రార్థిస్తున్నాను. ఆయన అనుగ్రహిస్తే, ఆనందకరమైన కుటుంబ జీవితంతో పాటు మంచి వృత్తి జీవితాన్ని కూడా కొనసాగించగలను. ఈ విషయంలో సాయి నాకు సహాయం చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. "బాబా! దయచేసి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2567.html

బాబా అనుగ్రహంతో ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది

సాయిభక్తురాలు శ్రీమతి శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శిరీష. ఇంతకుముందు నాకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు వారం రోజుల క్రితం జరిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మా పాపకి FA–IV (Formative Assessment) పరీక్షలు ఫిబ్రవరి 17వ తారీఖు నుండి మొదలయ్యాయి. అంతేకాదు, శివరాత్రిరోజున (21వ తారీఖున) మా పాప కూచిపూడి నాట్యప్రదర్శన అమరావతిలో ఉంది. అయితే రెండవరోజు పరీక్ష రాసిన మా అమ్మాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఇంటికి వచ్చింది. తననలా చూసి నేను చాలా ఆందోళనపడ్డాను. మా పాపకు జ్వరం తగ్గించమని బాబాని ఆర్తిగా వేడుకున్నాను. జ్వరం తగ్గిపోతే గురువారంనాడు మా పాపని బాబా మందిరానికి పంపిస్తానని, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాని ప్రార్థించి, పాపకి జ్వరం టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. ఉదయానికల్లా మా పాపకి జ్వరం తగ్గిపోయింది. ఎప్పుడూ టాబ్లెట్‌తో పాటు బాబా ఊదీని నీటిలో కలిపి త్రాగించడం నాకు అలవాటు. కానీ ఈసారి మాత్రం నెలసరి సమయం కావటంవల్ల నేను ఊదీ ఇవ్వలేకపోయాను. కానీ, ఎప్పుడూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని రక్షించే బాబా ఉదయానికల్లా మా పాపకు జ్వరం తగ్గిపోయేలా చేశారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


మేఘశ్యామ్


విరమ్‌గాఁవ్‌లో మేఘ అనే సాధారణ బ్రాహ్మణ భక్తుడుండేవాడు. అతని పూర్తి పేరు మేఘశ్యామ్. అతనెప్పుడూ 'ఓం నమఃశివాయ' అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూండేవాడు. అతనికి గాయత్రి, సంధ్య మంత్రం, బ్రహ్మయజ్ఞం, వైశ్వదేవం, రుద్రం మొదలైన బ్రాహ్మణ విధుల గురించి తెలియదు. అతనికి డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న హరి వినాయక్ సాఠేతో పరిచయం ఏర్పడింది. సాఠే అతని శ్రేయస్సు కోరి అతనికి బ్రాహ్మణ విధుల గురించి వివరించి గాయత్రి మంత్రాన్ని, సంధ్య వార్చడాన్ని బోధించాడు. అంతేకాదు, ఖర్చులకు 8 రూపాయలిచ్చి, బ్రోచ్ అనే ఊరికి పంపి అక్కడ రోజువారీ శివపూజలో నియమించాడు. మేఘ ఎల్లప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుణ్ణి ఆరాధిస్తుండేవాడు.

క్రమంగా సాఠే, మేఘలిరువురి మధ్య పరస్పర అభిమానం పెరిగింది. సాఠేను మేఘ తన మార్గదర్శకునిలా భావిస్తుండేవాడు. కొన్నిరోజుల తరువాత సాఠే భావోద్వేగంతో తన సద్గురువైన సాయిబాబా గొప్పతనం గురించి మేఘకు వివరించి, "శివుని అవతారమైన నా గురువును మతాచారాలతో, గంగాజలంతో అభిషేకించాలని నా అభిలాష. నీ భక్తిశ్రద్ధలు చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదృష్టముంటే, నీవు కూడా నా గురువైన సాయిబాబాను దర్శించి, ఆయన ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. అది నీ ఆధ్యాత్మికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది" అని అన్నాడు. అప్పుడు మేఘ, "మీ గురువు ఏ కులానికి చెందినవారు?" అని అడిగాడు. అందుకు సాఠే, "ఆయన కులమేమిటో నాకు తెలియదు. హిందువులు, ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారని చెప్పుకుంటారు. మసీదు ఆయన నివాసం. ఆయన ముందు నిరంతరం ధుని వెలుగుతూ ఉంటుంది. అందులోని అగ్నికి ఆయన తాము తెచ్చుకున్న భిక్షను అర్పిస్తారు" అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే మేఘ స్తంభించిపోయాడు. కాసేపటికి తేరుకుని, "ఆయన నివాసం మసీదు అయినప్పుడు, ముస్లింలు ఆయనను తమవానిగా పరిగణించినప్పుడు ఆయన ముస్లిమే అయివుండాలి. ఒక యవనుడు ఎప్పుడైనా గురువు కాగలడా? లేదు, అలా ఎన్నటికీ జరగదు" అని అన్నాడు. సాఠేకు ఏమి చెప్పాలో తెలియలేదు. అయినప్పటికీ సాఠే చాలా ఒత్తిడి చేయడంతో మేఘ శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించడానికి అంగీకరించాడు. అయితే బ్రోచ్ రైల్వేస్టేషనులో సాయిబాబా మహమ్మదీయుడని విని నిష్కపటి, ఆచారపరుడు అయిన మేఘ తానొక ముసల్మానుకు నమస్కరించాలా అని తీవ్రంగా కలతచెందాడు. తనను శిరిడీకి పంపవద్దని సాఠేని వేడుకున్నాడు. కానీ సాఠే పట్టుబట్టి, అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని తన మామగారైన దాదాకేల్కర్‌కు ఒక లేఖ వ్రాసి అతనికిచ్చి శిరిడీ పంపాడు.

మేఘ శిరిడీ చేరుకుని మసీదులోకి ప్రవేశించగానే బాబా కోపంతో ఉగ్రరూపం దాల్చారు. చేతిలో రాయి పట్టుకుని, "నువ్వు లోపలికి అడుగుపెట్టకు. నేను తక్కువ జాతికి చెందిన యవనుణ్ణి. నువ్వు ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణుడివి. నన్ను తాకినట్లయితే నువ్వు అపవిత్రమైపోతావు. పో, ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అరిచారు. అది విన్న అతడు 'ఇక్కడినుండి ఎంతో దూర ప్రదేశంలో తనకు సాఠేకు మధ్య జరిగిన సంభాషణ సాయిబాబాకు ఎలా తెలుసున'ని నివ్వెరపోయాడు. కానీ ఆలోచించేంత సమయం లేదు. బాబా అతన్ని మసీదు నుండి తరిమేశారు. ఆయన కోపానికి భయపడి అతడు బయటకు పరుగుతీశాడు. అయినా బాబా కోపం చల్లారలేదు. అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపినందుకు సాఠే మీద కూడా కోప్పడ్డారు. కొద్దిసేపటికి బాబా శాంతించారు. మేఘ మసీదు లోపలికి వెళ్లి బాబాకు నమస్కరించుకున్నాడు. ఈసారి బాబా అతనిని ఏమీ అనలేదు. మేఘ కొన్నిరోజులపాటు శిరిడీలో ఉంటూ బాబాకు సేవ చేసుకున్నాడు. బాబా శక్తులను, జీవన విధానాన్ని నిశితంగా గమనించాడు. కానీ బాబాపట్ల అతనికి దృఢమైన విశ్వాసం కుదరలేదు. అందువలన అతను తిరిగి వెళ్ళిపోయాడు.

శిరిడీ విడిచి వెళ్లిపోయిన మేఘ త్రయంబకం వెళ్ళి అక్కడ గంగాద్వార్‌లో ఒకటిన్నర సంవత్సరంపాటు శివుని ఆరాధనలో గడిపాడు. ఆ సమయంలో అతనొకసారి తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ మంచం పట్టాడు. అంత బాధలోనూ ఒకరోజు తన దైవమైన శివుని దర్శనార్థం ఆలయానికి వెళ్ళాడు. ఆశ్చర్యం! శివలింగం స్థానంలో అతడు సాయిబాబాను దర్శించాడు. అంతే! తిరిగి శిరిడీ వెళ్లాలని అతని మనస్సు ఉవ్విళ్ళూరింది. ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానా అని ఆరాటపడ్డాడు. అనారోగ్యం నుండి కోలుకున్న వెంటనే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా శిరిడీకి ప్రయాణమయ్యాడు. అలా 1910లో తిరిగి శిరిడీ చేరిన మేఘ తన చివరి క్షణం వరకు బాబాను సేవించుకుంటూ శిరిడీలోనే ఉండిపోయాడు. బాబా అతనిని గాయత్రీ మంత్రం పునశ్చరణ చేయమని చెప్పారు.

సాయిబాబాకు పూజ - ఆరతులు

ప్రారంభంలో సాయిబాబా తమని పూజించడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు. పూజాసామగ్రితో ఎవరైనా తమ వద్దకు వస్తే కోపగించుకునేవారు. కానీ మహల్సాపతి భక్తికి మెచ్చి మొదటిసారి అతని చేతుల మీదుగా పూజను స్వీకరించారు శ్రీసాయిబాబా. తరువాత నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడు మహాదేవ్, ఆ తరువాత మిగతా భక్తులందరూ బాబాను పూజించడం ప్రారంభించారు. రెండవసారి శిరిడీ వచ్చిన మేఘ శిరిడీలో తన జీవితాన్ని ఆనందించడమే కాదు, సాయిబాబా శివుని అవతారమేనని పూర్తి విశ్వాసంతో ఆయనను ఆరాధించడం మొదలుపెట్టాడు. శివుని ఆరాధనకు బిల్వపత్రాలు ఎంతో ప్రశస్తమైనవి. అవి శిరిడీలో లభ్యమయ్యేవి కావు. అందువలన మేఘ రోజూ ఒకటిన్నర మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్లి వాటిని తీసుకుని వచ్చేవాడు. కొంతకాలానికి చావడిలో కాకడ ఆరతి, శేజ్ ఆరతి మొదలయ్యాయి. ఆ తరువాత మసీదులో బాబాకు మధ్యాహ్న ఆరతి ఇవ్వడం ప్రారంభించారు. ఈ ఆరతులు పండరీపురానికి చెందిన రిటైర్డ్ జడ్జి తాత్యాసాహెబ్ నూల్కర్ నిర్వహిస్తూ ఉండేవాడు. 1911, మార్చిలో నూల్కర్ మరణానంతరం ద్వారకామాయిలో బాబాకు రోజువారీ ఆరాధనను మేఘ ప్రారంభించాడు. అతడు ఒంటికాలి మీద నిలబడి ఏకాగ్రతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాకు ఆరతి చేసేవాడు.

నిత్యక్రమం

మేఘ ప్రతిరోజూ గ్రామంలోని దేవతలందరినీ ఆరాధించి, తరువాత మసీదుకు వచ్చి బాబా ఆసనానికి నమస్కరించి, బాబాను ఆరాధించేవాడు. బాబా పాదాలు కడిగి, ఆ నీటిని తీర్థంగా త్రాగేవాడు. ఒకసారి ఈ నియమం తప్పింది. ఆరోజు ఖండోబా మినహా అన్ని గ్రామదేవతల పూజ పూర్తయింది. ఖండోబా ఆలయ తలుపులు మూసి ఉన్నందున అతను నేరుగా మసీదుకు వచ్చి బాబాను పూజించబోయాడు. బాబా తమను పూజించడానికి ఒప్పుకోకుండా, "నీ నిత్యక్రమంలో అంతరాయం ఏర్పడింది. వెళ్లి గ్రామదేవతలందరి పూజ పూర్తిచేసి ఇక్కడకు రా" అన్నారు. దానికతను, "బాబా! ఖండోబా ఆలయం తలుపులు మూసి ఉన్నాయి. కాబట్టి నేను ఖండోబాను పూజించలేను" అని అన్నాడు. అప్పుడు బాబా, “మళ్ళీ వెళ్ళు, ఇప్పుడు తలుపులు తెరచి ఉన్నాయి. మిగిలిన ఆ పూజను పూర్తిచేసి రా. ఆపై మామూలుగా ఇక్కడ పూజ, ఆరతులు చేసుకోవచ్చు” అని అన్నారు. అతను వెళ్లేసరికి బాబా చెప్పినట్లే ఖండోబా ఆలయం తలుపులు తెరచి ఉన్నాయి. ఖండోబా పూజ పూర్తిచేసి అతను మశీదుకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సాయిబాబాకి పూజ, ఆరతులు యథావిధిగా జరిగాయి. ఇలాంటి అనుభవాలు బాబా పట్ల మేఘ విశ్వాసాన్ని ఇంకా ఇంకా బలపరిచాయి.

గంగాస్నానం

ఒక మకర సంక్రాంతి పర్వదినాన మేఘ సాయిబాబాను గోదావరి నదీజలంతో అభిషేకించాలి అనుకున్నాడు. బాబా మొదట అలా చేయటానికి ఇష్టపడలేదు. కానీ మేఘ పదేపదే అభ్యర్థించిన మీదట ఒప్పుకున్నారు. సంక్రాంతి రోజున మేఘ ఉదయాన్నే లేచి, రానూపోనూ 8 మైళ్ళ దూరం నడిచి గోదావరి నీటిని తీసుకొచ్చాడు. స్నానానికి సిద్ధంకమ్మని మేఘ ఎంత బ్రతిమిలాడినా బాబా తమ ఆసనం మీద నుండి లేవలేదు. మధ్యాహ్న ఆరతి పూర్తయి భక్తులంతా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు మేఘ, "బాబా! మధ్యాహ్నం అయ్యింది. కనీసం ఇప్పుడైనా మీరు స్నానానికి సిద్ధంకండి" అని అన్నాడు. అందుకు బాబా, "నాలాంటి ఫకీరుకు గంగాజలంతో (బాబా ఎప్పుడూ గోదావరిని 'గంగ' అని సంబోధించేవారు) స్నానం ఎందుకు?" అని అన్నారు. మేఘ తన పట్టు విడవకుండా, "నాకు తెలిసింది ఒకటే, శివుడు గంగాస్నానంతో ప్రసన్నుడవుతాడు. ఈరోజు సంక్రాంతి. కావున ఈ పవిత్రమైన రోజున నేను శివుణ్ణి గంగాజలంతో అభిషేకించాలి. నా శివుడు మీరే కాబట్టి అభిషేకానికి మీరు ఒప్పుకుని తీరాలి" అని అన్నాడు. బాబా "సరే"నని తమ ఆసనం మీద నుంచి దిగి ఒక పీటపై కూర్చుని‌, తలగుడ్డని తొలగించి, తలను ముందుకు చాచి, "నువ్వు మొండిపట్టు పడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. శరీరానికి శిరస్సు ప్రధానం. నా తలపై కొద్దిగా నీళ్ళు పోయి, దాంతో మొత్తం శరీరానికి స్నానం చేయించినట్లవుతుంది" అని అన్నారు. బాబా మాటలకు అంగీకరించిన మేఘ నెమ్మదిగా బాబా శిరస్సుపై నీళ్ళు పోస్తూ బాబాపట్ల ప్రేమ ఉప్పొంగగా 'హరగంగే' అంటూ మొత్తం పాత్రలోని నీళ్లు బాబా తలపై కుమ్మరించాడు. మొత్తానికి తన శివునికి స్నానం చేయించానని మేఘ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అంతలోనే అతనొక అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. పాత్రలోని నీటిని మొత్తం కుమ్మరించినప్పటికీ బాబా తల మాత్రమే తడిసి, మిగతా శరీరమంతా పొడిగా ఉంది. ఆయన కఫ్నీ మీద ఒక్క నీటిబొట్టు కూడా లేదు. అతడు పదేపదే ఆ అద్భుతాన్ని గుర్తుచేసుకుంటూ, "సాయిబాబా విశిష్ట లక్షణం గలవారు. ఆయన నన్ను సంతోషపెట్టడమే కాకుండా గురు ఆదేశాన్ని ఉల్లంఘించిన నింద రాకుండా నన్ను రక్షించారు" అని ఆనందపరవశుడయ్యేవాడు.

శివలింగం

మేఘకు శ్రీసాయిబాబా మరో సాటిలేని అనుభవాన్ని ప్రసాదించి అతనిని పూర్తిగా తన వశం చేసుకున్నారు. సాయిబాబాకు సేవ చేయడం ప్రారంభించిన సుమారు సంవత్సరం తరువాత ఒక తెల్లవారుఝామున మేఘ మంచంపై పడుకొని ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ అతడు మెలకువగానే ఉన్నాడు. హఠాత్తుగా బాబా అతని ముందు ప్రత్యక్షమై అతనిపై అక్షింతలు చల్లి, “మేఘా, త్రిశూలం గీయి” అని చెప్పి అదృశ్యమయ్యారు. అతను కళ్ళు తెరచి చూస్తే అక్కడెవరూ లేరు. గది తలుపులు మూసివున్నాయి, పెట్టిన గడియ పెట్టినట్లే ఉంది. పక్కమీద అక్షింతలు మాత్రం ఉన్నాయి. అతడాశ్చర్యంతో మసీదుకు వెళ్లి, తన అనుభవాన్ని బాబాతో చెప్పి, "ఈ దృష్టాంతాన్ని అనుసరించి వాడాలో మీ చిత్రపటం దగ్గర త్రిశూలాన్ని గీయమంటారా?" అని అడిగాడు. అందుకు బాబా, "దృష్టాంతమేమిటి, నువ్వు నా గొంతు గుర్తుపట్టలేదా?" అన్నారు. అప్పుడతడు, "మొదట నేను కూడా అలానే అనుకున్నాను. కానీ నా గది తలుపులు లోపలినుండి గడియ పెట్టి ఉండటంతో నేనది దృష్టాంతమనుకున్నాను" అని అన్నాడు. అప్పుడు బాబా, "నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు రూపము లేదు, నేను సర్వవ్యాపకుడిని" అని అన్నారు. అదేరోజు వాడాలో తన గదిలో ఉన్న బాబా చిత్రపటానికి కుడివైపున బాబా చెప్పినట్లుగా ఎరుపురంగుతో త్రిశూలాన్ని గీశాడు మేఘ. మరుసటిరోజు పూణే నుండి ఒక రామదాసి శిరిడీ వచ్చి బాబాకు ఒక శివలింగాన్ని సమర్పించాడు. సరిగ్గా ఆ సమయానికి మేఘ అక్కడకు వచ్చాడు. బాబా మేఘతో, "చూడు, శంకరుడు వచ్చాడు. అతనిని జాగ్రత్తగా చూసుకో" అన్నారు. తాను త్రిశూలం గీసిన వెంటనే అనుకోకుండా శివలింగం రావటంతో మేఘ ఆశ్చర్యచకితుడయ్యాడు. మరోవంక ఆ శివలింగాన్ని చూస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. 

అదే సమయంలో వాడాలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి తలపై తువ్వాలు వేసుకుని నిలబడి సాయిని ధ్యానిస్తుండగా అతని మనోదృష్టికి ఒక శివలింగం గోచరించింది. దానిగురించి అతడు ఆలోచిస్తూ ఉండగా బాబా తనకి ప్రసాదించిన శివలింగాన్ని తీసుకొచ్చి అతనికి చూపించాడు మేఘ. ఆ శివలింగం, కొన్ని నిమిషాల ముందు తన మనోదృష్టికి గోచరించిన శివలింగం ఒకేలా ఉండటంతో దీక్షిత్ ఆనందభరితుడయ్యాడు. మేఘ తాను గీసిన త్రిశూలం పక్కనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించసాగాడు.

ఇలా చాలాకాలం శిరిడీలో ఉంటూ బాబాకు వినయ విధేయతలతో సేవ చేసుకున్న మేఘ తీక్షణమైన చూపులు, చక్కటి ముఖవర్ఛస్సు, దృఢమైన ఆరోగ్యం కలిగి చాలా సాదాసీదాగా ఉండేవాడు. ముక్కుసూటి మనిషి, ఇతరులతో పెద్దగా కలిసేవాడు కాదు. పగలు, రాత్రి శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఆనందం తాండవిస్తూ ఉండేది. బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలతో అతడు బాబాకు అంకిత భక్తునిగా మారిపోయాడు. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా అతని అంతరంగంలో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో ఆధ్యాత్మిక లబ్దిని చేకూర్చింది. తన సద్గురువైన సాయినాథుడు సాక్షాత్తూ శంకరుడే అనడంలో అతనికి ఎలాంటి సందేహాలూ లేవు. బాబాకు సేవ చేసే అవకాశం లభించినందుకు తానెంతో ధన్యతనొందినట్లు తలచేవాడు.

1912, జనవరి 3న గాయత్రి పునశ్చరణ పూర్తయిన సందర్భంగా మేఘ కొంతమంది బ్రాహ్మణులకు సాఠేవాడాలో విందు ఏర్పాటు చేశాడు. దాదాసాహెబ్ ఖపర్దే ఆ విందుకు హాజరయ్యాడు.
నిర్యాణం

1912, జనవరి 16న మేఘ తన అలవాటు ప్రకారం బాబాకు ఆరతి ఇచ్చాడు. ఆ సమయంలో బాబా అక్కడున్న భక్తులతో, "ఇదే ఇతనిచ్చే చివరి ఆరతి" అని అన్నారు. ఆ తరువాత మేఘ అనారోగ్యం పాలయ్యాడు. అందువలన జనవరి 17న బాబాకు జోగ్ ఆరతి ఇచ్చాడు. జనవరి 18 సాయంకాలం జోగ్ ఆరతి ఇస్తుండగా మేఘ మరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు బాబా. ఎప్పటిలాగే బాబా మాట సత్యమైంది. 1912, జనవరి 19వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు మేఘ తుదిశ్వాస విడిచాడు. బాబా తమ దివ్యహస్తాలతో అతని దేహాన్ని నిమురుతూ, "ఇతను నా నిజమైన భక్తుడు" అని అన్నారు. మేఘ దేహాన్ని స్మశానానికి తీసుకుపోతుంటే బాబా కూడా కొంతదూరం వరకు వెళ్లి అతని దేహంపై పూలు చల్లి ఎంతగానో శోకించారు. తరువాత తామే స్వయంగా డబ్బులిచ్చి అందరికీ విందు ఏర్పాటు చేయమని ఆదేశించారు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చాడు. ఆ తరువాత బాబా మేఘకిచ్చిన శివలింగాన్ని గురుస్థాన్‌లో ప్రతిష్ఠించారు.

సమాప్తం.

   source:  Shri Saibaba by Sharanaananda
 http://www.saiamrithadhara.com/mahabhakthas/megha.html
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo