సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- ఆరవ భాగం


2007, జులై 13, శుక్రవారంనాడు జరిగిన ఒక సంఘటన: 'సాయికృప ఇండస్ట్రియల్ క్లీనింగ్' నుండి ప్రకాష్ జోషీ అనే అతను జులై 9, సోమవారంనాడు రవీంద్ర నాచ్నేకు ఫోన్ చేసి, "మీ వద్ద 1930లో ప్రచురించబడిన శ్రీసాయి సచ్చరిత్ర గ్రంథం యొక్క మొదటి ముద్రణ ఉందని శ్రీ అనిల్ షా నాతో చెప్పారు. నేను ఆ పవిత్ర గ్రంథాన్ని దర్శించి, ప్రార్థించాలని అనుకుంటున్నాను. అందువలన మీకు అనుకూలమైన సమయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను" అని చెప్పాడు. అందుకు రవీంద్ర "మీకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా రావొచ్చు" అని చెప్పాడు. అతడు చాలా సంతోషించి, "నేను వచ్చేముందు మీకు ఫోన్ చేస్తాన"ని చెప్పాడు. జూలై 13న (శుక్రవారం) రవీంద్ర పనిమీద బయటకు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతని భార్య ఉష పూజగదిలో ప్రార్థన చేస్తోంది. గురువారంనాడు మాత్రమే అన్ని పటాలకు పూజ చేయాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. అంటే, మిగతారోజుల్లో పూజకు ఎక్కువ సమయం పట్టదు. అయితే బయటకు వెళ్లిన రవీంద్ర తిరిగి వచ్చేసరికి కూడా అతని భార్య ఉష పూజగదిలోనే ఉంది. ఆమె శ్రీగజానన్ మహరాజ్ ఫోటో వద్ద ప్రార్థిస్తోంది. దాంతో రవీంద్రకు ఆమెపై కోపం వచ్చింది. ఆ విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అదేరోజున రవీంద్ర చేసిన తప్పును అతనికి అర్థమయ్యేలా బాబా చూపించారు. 

ఆరోజు ప్రకాష్ జోషీ ఫోన్ చేసి రవీంద్ర ఇంటికి వచ్చాడు. అతను ముందుగా సచ్చరిత్ర పవిత్ర గ్రంథానికి, బాబా ఇచ్చిన వెండి పాదుకలకు నమస్కరించుకుని ప్రార్థన చేశాడు. తరువాత అతను తిరిగి వెళ్ళడానికి బయలుదేరబోతూ సాయిబాబాకు సంబంధించిన 'సాయి మిమ్మల్ని  పిలిచారు(Sai has called you)' అను రెండు సి.డి.లను, 'పీ ఘే రే సమస్త్' (Drink & finish it all) అనే పుస్తకాన్ని రవీంద్ర నాచ్నేకు ఇచ్చాడు. తరువాత రవీంద్ర ఆ పుస్తకాన్ని చూస్తూ 36వ పేజీలో ఉన్న 'ఎ బౌల్ ఆఫ్ నెక్టర్' అనే అధ్యాయంలోని పంక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ, "నువ్వు ఎవరినైనా వారి ఇష్టదేవతను ప్రార్థించకుండా అడ్డు చెప్పకూడదు, వాళ్ళను ఏమీ అనకూడదు" అని ఉంది. వెంటనే రవీంద్ర తన భార్యకు, శ్రీగజానన్ మహరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన సాయిబాబా ఇప్పటికీ మన మధ్య ఉన్నారని, వారు తన భక్తులకు సరైన సమయంలో, సరైన మార్గనిర్దేశం చేస్తారని స్పష్టంగా తెలియజేసింది.

2007, అక్టోబర్ 4, ఉదయం 11 గంటలకు రవీంద్ర తన పూజ ముగించిన తరువాత ఫోన్ కాల్ స్వీకరించడానికని వెళ్లి బాబా ఫోటో క్రిందగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హఠాత్తుగా అతను చేతితో ఫోన్ రిసీవర్‌ని పట్టుకోలేకపోయాడు, చేతిలో ఉన్న గ్లాసులోని నీళ్లు తన శరీరం మీద పడిపోయాయి. ఏమి జరుగుతోందో అర్థంకాక అతడు బాబాకు నమస్కరించుకుని వెంటనే డాక్టర్ దయానంద్ కుంబాల (కార్డియాలజిస్ట్) వద్దకు వెళ్లి తన పరిస్థితి గురించి చెప్పాడు. డాక్టర్ అతనిని పరీక్షించి, 'మినీ స్ట్రోక్' వచ్చిందని చెప్పి వెంటనే ఆసుపత్రిలో చేర్పించుకుని చికిత్స ప్రారంభించాడు. ఈ సంఘటన గురించి రవీంద్ర భార్యకు తెలియగానే, ఆమె ఆసుపత్రికి పరుగున వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి భర్త చేత త్రాగించి, అతని శరీరమంతా ఊదీ రాసింది. అతను ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ ఆమె క్రమంతప్పకుండా ఈ విధంగా చేసింది. బాబా ఊదీ, ఆశీర్వాదాలతో అతనికి పూర్తిగా నయమై ఆసుపత్రి నుండి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రవీంద్ర తనకు స్ట్రోక్ వచ్చిందని చెప్పినా ఎవరూ నమ్మరు, అంత ఆరోగ్యాన్ని బాబా అతనికి ప్రసాదించారు.

రవీంద్ర నాచ్నే మనవరాలు తన్వి అలియాస్ తేజల్ చదువులో వెనుకబడి ఉండేది. అందువలన ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడు రవీంద్ర కుమారుడు అతుల్ ఆమెను తిడుతుండేవాడు. ఆమెకు శ్రీసాయిబాబాపై పూర్తి నమ్మకం. ఆమె బాబా ఫోటో ముందు నిలబడి, "బాబా! చదువులో నేను ఎందుకు బలహీనంగా ఉన్నాను? ఇలా అయితే నేను ఎలా నా 10వ తరగతి పూర్తి చెయ్యగలను?" అని ప్రార్థించింది. ఆమెకు కలలో బాబా కనిపించి, "దాని గురించి నువ్వు ఆందోళన చెందకు. నువ్వు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తావు" అని చెప్పారు. పరీక్షలు ముగిసిన తరువాత ఆమె తాత, నానమ్మలతో కలిసి శిరిడీ వెళ్ళడానికి తల్లిదండ్రుల అనుమతి అడిగింది. దాంతో రవీంద్ర, అతని భార్య, అతుల్, తేజల్ శిరిడీ వెళ్లారు. తేజల్ తన తలను బాబా సమాధికి తాకించి నమస్కరించుకుని, "పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మళ్ళీ స్వీట్లతో శిరిడీ సందర్శిస్తాను బాబా" అని చెప్పుకుంది. అదే సమయంలో అక్కడున్న పూజారి తన తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ గులాబీ పూలగుత్తిని ఇచ్చాడు. 2008, జూన్ 26న నాచ్నే 49వ వార్షికోత్సవంనాడు ఆమె పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆమె ఉత్తీర్ణత సాధిస్తుందని కుటుంబసభ్యులెవరూ అనుకోలేదు. కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతం జరిగినట్లుగా ఆమె ఉత్తీర్ణురాలైంది. ఆమె ప్రార్థనలు, ఆమెకు వచ్చిన కల నిజమయ్యాయి. నాచ్నే కుటుంబమంతటిపై ఉన్న బాబా ఆశీస్సులకు ఇది ఒక ఉదాహరణ.

ఒకరోజు రవీంద్ర మనుమలు అఖిలేష్, ప్రతామేష్ హాల్లో కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా ట్యూబ్ లైట్ వాళ్ళు కూర్చున్న చోటుకి పక్కనే ఉన్న కుర్చీ మీద పడింది. కానీ ట్యూబ్ లైట్ విరిగిపోలేదు. బాబా కృపవలన పిల్లలిద్దరూ రక్షింపబడ్డారు.

రవీంద్ర నాచ్నే అన్న వాసుదేవ్‌కు సచిన్ అనే కొడుకు ఉన్నాడు. అతని స్నేహితుడికి యెవాలేలో కొన్ని చేనేత పరికరాలున్నాయి. అతను సచిన్‌తో, "పైథానీ చీరలు తయారుచేసే వ్యాపారాన్ని మొదలుపెట్టమ"ని చెప్పి, అందుకు అవసరమైన సహాయం తాను చేస్తానని భరోసా ఇచ్చాడు. బాబా ఆశీర్వాదంతో పని ప్రారంభించాలని సచిన్ నిర్ణయించుకున్నాడు. అతను కొన్ని బిజినెస్ కార్డులను ప్రింట్ చేయించి తన భార్య స్నేహల్‌తో కలిసి శిరిడీ వెళ్లాడు. ఆ సమయంలో సమాధిమందిరంలో దర్శనానికి మగవాళ్లకు, ఆడవాళ్లకు వేర్వేరుగా క్యూ లైన్లు ఉండేవి. అందువలన వాళ్లిద్దరూ చెరో లైన్లోకి వెళ్లారు. అయితే బాబా కృపవలన ఇద్దరూ ఒకేసారి బాబా సమాధి వద్దకి చేరుకున్నారు. వాళ్ళు తమ బిజినెస్ కార్డును సమాధికి తాకించి బాబా ఆశీస్సులు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ కార్డును పూజారి(ఉదయ్ వలుంజ్కర్)కి అందించి సమాధికి తాకించమని అభ్యర్థించారు. పూజారి ఆ కార్డు మీద ఉన్న నాచ్నే అన్న పేరు చూసి, "రవీంద్ర నాచ్నేతో మీకు ఏమైనా అనుబంధం ఉందా?" అని వాళ్ళని అడిగాడు. అందుకతను రవీంద్ర గారు తన బాబాయి అని బదులిచ్చాడు. అప్పుడు పూజారి ఆ బిజినెస్ కార్డుని సమాధికి తాకించి, "జయమగు గాక" అని ఆశీర్వదిస్తూ వాళ్లకు తిరిగి ఇచ్చి‌‌, "వ్యాపారం బాగా నడిస్తే ఒక చీర తీసుకుని శిరిడీ రండి" అని చెప్పాడు. బాబా కృపవలన సచిన్ వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అతను ఒక చీర తీసుకుని శిరిడీ వెళ్లి అదే పూజారిని కలిశాడు. పూజారి ఆ చీరను బాబా పాదాల వద్ద సమర్పించి, తిరిగి బాబా ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చాడు.

ఒకసారి సచిన్‌ చీరలు తీసుకుని రావడానికి యెవాలే వెళ్ళాడు. అప్పుడు అతనికి శిరిడీ దర్శించాలని బలంగా అనిపించింది. కానీ సమయం చాలక వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. అతను యెవాలే నుండి మన్మాడ్ వెళ్లే బస్సెక్కి కూర్చున్నాడు. బస్సులో అతనికి శిరిడీ వెళ్లి తిరిగి వస్తున్న ముంబాయి ప్రయాణీకులు కలిశారు. వాళ్ళ బ్యాగులు బస్సులోని పైషెల్ఫ్‌లో ఉన్నాయి. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బస్సు తీవ్రంగా కుదుపులకి లోనవుతోంది. ఆ కుదుపులకి పైన బ్యాగులో ఉన్న పువ్వులు, ప్రసాదాలు సచిన్ ఒడిలో పడ్డాయి. అతను వాటిని తిరిగి ఆ ప్రయాణీకులకు ఇవ్వగా వాళ్ళు శిరిడీ నుండి తెస్తున్న బాబా ప్రసాదాలను అతనికి ఇచ్చారు. శిరిడీ వెళ్ళలేకపోయినప్పటికీ బాబా తనకి ప్రసాదాలను పంపించారని అతడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తరువాత మన్మాడులో కల్యాణ్ వెళ్లే రైలు ఎక్కాడు. తోటి ప్రయాణీకులలో ఒక మహిళ, ఆమె కుమార్తె ఉన్నారు. వాళ్ళు తినడానికి తెచ్చుకున్న ఆహార పదార్థాలను బయటకు తీసి, తీపి రొట్టెలను సచిన్‌కి ఇచ్చారు. వాటిని తీసుకోవడానికి అతను సంశయిస్తుంటే, వాళ్ళు 'ఆ రొట్టెలను ప్రత్యేకరీతిన తయారుచేశామని, దయచేసి రుచిచూడమ'ని అభ్యర్థించారు. అతను బాబా తన ఆహారం కోసం కూడా ఏర్పాట్లు చేసి, తన ఆకలి తీరుస్తున్నారని గ్రహించి మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని ఆ రొట్టెలు తీసుకుని తిన్నాడు.

తలసరి సమీపంలోని కోజ్‌బాద్-దహను వద్ద గోదాతాయి పరులేకర్ నడుపుతున్న ఆశ్రమం ఒకటి ఉంది. అందులో రవీంద్ర సోదరుడు సాయినాథ్ తాడ్గల్ సంస్థ తరపున పనిచేస్తున్నాడు. కోజ్‌బాద్ దట్టమైన అటవీప్రాంతం. అక్కడంతా స్థానిక గిరిజనులే నివాసముండేవారు. సాయినాథ్ అక్కడికి వెళ్లిన మొదటి రాత్రి స్థానిక గిరిజనులు డ్రమ్స్ మొదలైన వాయిద్యాలతో చేసే శబ్దాల కారణంగా భయంతో చెమటలు పట్టి నిద్రపోలేకపోయాడు. అప్పుడతను బాబా సహాయం కోరి, ఆయన నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో గోదాతాయి అక్కడికి వచ్చి, అతని మానసికస్థితిని గ్రహించింది. దాంతో అతనికి తోడుగా మరొకరిని అక్కడ ఉంచింది. పిలిచిన వెంటనే సాయిబాబా తనకు సహాయం చేయడానికి వచ్చారని సాయినాథ్ గ్రహించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత అతనికి ఎటువంటి సమస్యలూ ఎదురుకాలేదు.

సాయినాథ్ కుమార్తె శుభాంగి ఒక అర్థరాత్రి తన భర్త అనిల్ సబ్నిస్, మామగారు, కుమార్తె అమృత మరియు కుమారుడు సంకేత్‌తో కలిసి టాటా సుమోలో త్రయంబకేశ్వరం వెళ్లి తిరిగి బదలాపూరులో ఉన్న తమ ఇంటికి వస్తున్నారు. అకస్మాత్తుగా బ్రేకులు పనిచేయడం లేదని డ్రైవరు గుర్తించాడు. అందరూ కంగారుపడ్డారు. ఆమె బాబా స్మరణ చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపట్లో సుమో ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. బాబా కృపవలన ఆమె మామగారికి స్వల్ప గాయం అవడం తప్ప, అందరూ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే వాళ్లంతా అర్థరాత్రి వేళ ఘాట్‌ రోడ్డులో దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని ఉన్నారు. బాబా తన బిడ్డలని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటారు కదా! కొద్దిసేపట్లో అక్కడికి ఒక కారు వచ్చింది. వాళ్ళు తాము బదలాపూర్ వెళ్తున్నామని, వారంతా తమ కారులో సురక్షితంగా బదలాపూర్ చేరుకోవచ్చని చెప్పారు. ఆవిధంగా కుటుంబమంతటినీ బాబా రక్షించారు.

బల్వంత్ నాచ్నే అన్న ఆనందరావు కుమారుడు శరద్ ఒక అనుభవం ఇలా చెప్పారు: ఒకసారి అందరూ పట్టుబట్టడంతో ఆనందరావు తన భార్య, కుమారులు దత్తా, శరద్‌లను తీసుకుని శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వారు ఒక రాత్రి కోపర్గాఁవ్ స్టేషన్ చేరుకున్నారు. ఆ సమయంలో శిరిడీ వెళ్ళడానికి వాహనాలు అందుబాటులో లేవు. చేసేదిలేక అందరూ స్టేషన్లో కూర్చుంటున్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక గుఱ్ఱపుబండి అక్కడికి వచ్చింది. ఆ టాంగావాడు రూ.11.25 పై. తీసుకుని వాళ్ళను శిరిడీలో దించాడు. వాళ్లంతా వెళ్లి ఒక ఇంటి తలుపు తట్టారు. డాక్టర్ గవాంకర్ తలుపులు తెరిచారు. ఆయనతో ఆనందరావు 'తాను నాచ్నే సోదరుడనని, అందరి అభ్యర్థన మేరకు శిరిడీ వచ్చాన'ని చెప్పాడు. అందుకాయన "ఇంత రాత్రివేళ మీరు ఇక్కడికెలా చేరుకున్నార"ని అడిగాడు. అతను గుఱ్ఱపుబండి విషయం చెప్పగా గవాంకర్, "ఆ గుఱ్ఱపుబండిని మీకోసం ఏర్పాటు చేసినది బాబానే" అని చెప్పి, వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు.

రవీంద్ర నాచ్నే తన భార్య, నలుగురు పిల్లలతో 1984 వరకు 10'x10' పరిమాణంలో ఉన్న రెండు గదులలో నివాసం ఉండేవాడు. పిల్లలు పెరిగేసరికి ఆ స్థలం చాలా చిన్నదిగా అనిపించింది. ఆ ఆరుగురికి అది సరిపోలేదు. అయినప్పటికీ అప్పుడున్న క్లిష్ట పరిస్థితుల కారణంగా రవీంద్ర పెద్ద ఇంటిని కొనలేక చాలా నిరాశ చెందాడు. ఆ విషయమై కుటుంబంలోని అందరూ ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తుండేవారు. బాబా వారి ప్రార్థనలు విన్నారు. ఒకరోజు రవీంద్ర ఏమీ చెప్పకుండానే అతను పనిచేస్తున్న సంస్థలోని అకౌంట్స్ ఆఫీసర్ అతనితో, "పెద్ద ఇంటిని తీసుకోవడానికి ఋణం ఎందుకు అడగకూడదు?" అని అడిగాడు. అందుకతను, "మరాఠీవాణ్ణి అయిన నేను ఋణం పొందడం కష్టమని భావించాన"ని చెప్పాడు. అకౌంట్స్ ఆఫీసర్ ఆ మాటలను త్రోసిపుచ్చి 70 వేల రూపాయల ఋణాన్ని ఆమోదించాడు. దాంతో రవీంద్ర ఇంటి కోసం వెతకడం ప్రారంభించాడు. అతనొక ఇంటిని బాగా ఇష్టపడ్డాడు. కానీ దాని ధర 1,60,000 రూపాయలు. అతని వద్ద ఉన్నది కేవలం రూ.70,000. అంటే, ఇంకా లక్ష రూపాయలు అవసరం. అంత మొత్తాన్ని ఆదా చేయడం అతనికి అసాధ్యమైన పని. ఒకరోజు అతడు తన సమస్యను శ్రీసాయిబాబాకు చెప్పుకున్నాడు. అదేరోజు అతను మార్కెట్‌కు వెళుతున్నప్పుడు తన స్నేహితుల్లో ఒకరు బ్యాంకు చైర్మన్‌గా ఉన్నారని తెలిసింది. రవీంద్ర సమస్యలన్నీ తెలిసిన ఆ స్నేహితుడు, "వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తే బ్యాంక్ ఋణాన్ని మంజూరు చేయలేను. కానీ థానా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మీ భార్యతో కలిసి సంయుక్తంగా దరఖాస్తు చేస్తే అవసరమైన మొత్తాన్ని మంజూరు చేయగలను" అని చెప్పాడు. వాళ్లిద్దరూ అలాగే చేసి ఆ ఇంటిని కొన్నారు. 1984 నుండి వాళ్ళు ఆ ఇంటిలోనే నివాసముంటున్నారు. ఆ విధంగా బాబా రవీంద్ర కోరికను నెరవేర్చారు.

1986, ఆగస్టు 24న రవీంద్ర నాచ్నేకి మొదటి మనవడు జన్మించాడు. తన పేరు నికేత్. 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆ పిల్లవాడు విరేచనాలతో బాధపడసాగాడు. కుటుంబసభ్యులు పిల్లవాణ్ణి డాక్టర్ ప్రదీప్ హజీర్నిస్ నడుపుతున్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టరు పరీక్షించి, "పిల్లవాడు నిర్జలీకరణకు (డీహైడ్రేషన్) గురయ్యాడని, నరాలలోకి సెలైన్ ఎక్కించడం అవసరమ"ని చెప్పారు. అయితే, నరాలు కనుగొనడం చాలా కష్టం కావడంతో పిల్లవాడి కాలిపై కత్తితో గాటు పెట్టి సెలైన్ ఎక్కించాలని చెప్పి, ఆ ప్రక్రియ చేయడంలో ఉన్న ప్రమాదాలను డాక్టరు కుటుంబసభ్యులకు వివరించారు. అది విన్న కుటుంబసభ్యులు పిల్లాడి శరీరమంతా ఊదీ రాసి, బాబాను ప్రార్థించడం మొదలుపెట్టి, బాబాపై ఉన్న పూర్తి విశ్వాసంతో ఆ ప్రక్రియను కొనసాగించమని డాక్టరుతో చెప్పారు. తరువాత పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాడు. పిల్లవాడు పెరిగి పెద్దవాడై హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసి పైచదువుల కోసం యు.కె వెళ్ళాడు. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే అతనికి వీసా వచ్చింది. బాబా ఆశీస్సులు లేకుండా ఇవన్నీ సాధ్యమేనా?

రవీంద్ర నాచ్నే అన్నయ్య వాసుదేవ్ గారి కుమార్తె శ్రీమతి సాధనా నితిన్ శృంగార్‌పూర్ అనుభవాలు:

ఆమె తన కుటుంబంతో భైండర్‌లో నివాసముండేది. ఆమె కుమారుడు సుమేధ్ 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు ఉదయం స్కూలుకి వెళ్లడానికి తయారవుతున్నాడు. తను స్నానం చేసి, తువ్వాలు కట్టుకుని బట్టలు తీయడానికి బీరువా తెరిచాడు. అకస్మాత్తుగా తనకి మైకం కమ్మి స్పృహతప్పి నేలమీద పడిపోయాడు. ఆ సమయంలో శ్రీమతి సాధన వంటపనిలో నిమగ్నమై ఉంది. ఆమె భర్త షేవింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అంతలో వాళ్ళ చిన్నకొడుకు కేక వేసి వాళ్ళని పిలిచాడు. కానీ పిల్లలిద్దరూ వాళ్లలో వాళ్ళు గొడవపడుతున్నారని భావించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆమె భర్త మాత్రం ఏదో జరిగిందని గ్రహించి లోపలికి వెళ్లి పిల్లవాడు అపస్మారక స్థితిలో పడివుండటం చూశాడు. వెంటనే అతను వెళ్లి డాక్టర్ దేశాయ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. సుమేధ్‌ను పరిశీలించిన డాక్టర్ ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్పించమని సూచించాడు. కుటుంబసభ్యులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లాడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. ఆరోజు గురువారం. వైద్యులు అతనిపై ఆశ వదిలేశారు. శ్రీమతి సాధన బాబాను ప్రార్థించి, పిల్లవాడికి ఊదీ పెట్టి, బాబా స్మరణ చేసింది. శుక్రవారం ఉదయం సుమేధ్ ఒక బకెట్ మూత్రాన్ని విసర్జించి, స్పృహలోకి వచ్చి ఆమెను పిలిచాడు. తర్వాత కుటుంబమంతా ఒక నిర్ణయం తీసుకుని పిల్లవాడిని నానావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పిల్లవాడు చాలా త్వరగా కోలుకున్నాడు. శ్రీసాయిబాబా అపారమైన కృపవలన మాత్రమే తమ బిడ్డ తమకు దక్కాడని ఆమె అభిప్రాయపడింది. ఇప్పుడా పిల్లవాడు పెరిగి పెద్దవాడై హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు.

శ్రీమతి సాధన ప్రస్తుతం డోంబివలిలో ఉంటుంది. ఆమె చిన్న కొడుకు తన్మయ్ 12వ తరగతి పరీక్షలు వ్రాశాడు. ఫలితాలు వెలువడేలోపు ఖాళీ సమయంలో ఇంట్లో చాలా ప్రయోగాలు చేస్తుండేవాడు. ఒకరోజు తను ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలతో ఏదో పని చేస్తున్నాడు. కరెంట్ వైరుని నోట్లో పెట్టుకుని ఫ్యూజ్ తీయడానికి దంతాలతో ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ వైరుముక్క మృదువైన తన అంగుడిలోకి గుచ్చుకుని ఇరుక్కుపోయింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది ఊడి బయటకు రాలేదు. దాంతో తను ఆ విషయాన్ని తల్లితో చెప్పాడు. ఆమె వెంటనే అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. డాక్టర్ కూడా దాన్ని తీయలేక ENT స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళమని సూచించాడు. ENT స్పెషలిస్ట్ సాధారణ పద్ధతుల్లో ఆ వైరు బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో అబ్బాయికి అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. సాధన భయపడి తన భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. ఆరోజు కూడా గురువారం. తన్మయ్ బాబా ఫోటో ముందు నిలబడి, "ఆపరేషన్ అవసరం లేకుండా ఆ వైరుముక్క బయటకు వచ్చేలా సహాయం చేస్తే పూలదండ తెచ్చి పూజిస్తానని, లేకుంటే పూజించన"ని బాబాతో చెప్పుకున్నాడు. తరువాత పూలదండ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అతనికి బాగా దగ్గువచ్చి కఫాన్ని ఉమ్మేశాడు. ఆ కఫంలో తీగముక్క ఉండటం చూసి ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆరోజు నుండి తన్మయ్‌కి సాయిబాబాపై పూర్తి విశ్వాసం ఏర్పడింది.

సాయిభక్తుల ప్రయోజనార్థం దివంగత శ్రీ శాంతారాం బల్వంత్ నాచ్నే కుమారుడు శ్రీ రవీంద్ర శాంతారాం నాచ్నే సంప్రదింపు వివరాలు:


Shri.Ravindra Shantaram Nachane,
Sai Sadan Co-Op Housing Society Limited,
Near Pratap Cinema,
Thane (West),
Mumbai-400  601,
Maharashtra, India.
Phone: 022  2547 3496
Mobile: 99872 43967

నాచ్నే కుటుంబ అనుభవాలు సమాప్తం.... 

source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai om sai sri sai Jaya Jaya sai om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏😂

    ReplyDelete
  2. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  3. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo