సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

హరి వినాయక్ సాఠే - మొదటి భాగం


 
హరి వినాయక్ సాఠే 1855లో జన్మించాడు. అతను డిప్యూటీ కలెక్టరుగా పనిచేసేవాడు. 44 ఏళ్ళ వయసులో అతను తన భార్యను కోల్పోయాడు. అప్పటికి అతనికి ఒక కుమార్తె మాత్రమే ఉంది. వంశోద్ధారకుని కోసం రెండవ వివాహం చేసుకోమని స్నేహితులంతా అతనిని ఒత్తిడి చేయసాగారు. అతనికి కూడా వంశోద్ధారకుడు కావాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ 50 సంవత్సరాలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ వివాహం చేసుకుంటే కొడుకే పుడతాడన్న నిశ్చయమేమిటని అనుకున్నాడు. అందువల్ల ఆ విషయంలో తనని బలవంతపెడుతున్న స్నేహితులతో, "ఎవరైనా మహాత్ములు హామీ ఇస్తేగానీ మళ్ళీ వివాహం చేసుకోన"ని ఖండితంగా చెప్పాడు. 1904, ఏప్రిల్‌ నెలలో అతడు ఆఫీసు పనిమీద కోపర్‌గాఁవ్ వెళ్ళాడు. అక్కడ మామల్తదారుగా ఉన్న అతని స్నేహితుడు బార్వే అతనితో, 'శిరిడీలో సాయిబాబా అనే గొప్ప మహాత్ములున్నార'ని చెప్పి, అతన్ని శిరిడీ తీసుకెళ్లాడు. ఇద్దరూ బాబా దర్శనం చేసుకున్నారు. కొంతసేపటికి సెలవు తీసుకుని సాఠే మశీదు మెట్లు దిగుతుండగా బార్వే, "సాహెబ్‌కు కొడుకు లేడ"ని బాబాతో అన్నాడు. అప్పుడు బాబా, "అతడు వివాహం చేసుకుంటే అల్లా అతనికి కొడుకుని ప్రసాదిస్తాడు (షాదీ కరేగా తో అల్లా బచ్చా దేగా)" అని అన్నారు. ఇక అప్పటినుండి బార్వే తదితర స్నేహితులు సాఠేను మళ్ళీ పెళ్లి చేసుకోమని మరలా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరాంతంలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు పూణే వచ్చి ఉన్నారని తెలిసి సాఠే అతన్ని సంప్రదించాడు. అతను సాఠేకు, అతని కూతురికి గతంలో జరిగిన కొన్ని విషయాలు యథాతధంగా చెప్పాడు. అంతేకాకుండా సాఠే జాతకచక్రాన్ని పరిశీలించి 50వ సంవత్సరం తరువాత అతనికి కొడుకు పుడతాడని చెప్పాడు. దాంతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న సాఠే ఆలోచన బలపడినట్లయింది.

తరువాత కొన్ని మాసాలకి సాఠేకు అహ్మదాబాద్ బదిలీ అయ్యింది. ఒకరోజు దాదాకేల్కర్ (గణేష్ దామోదర్ కేల్కర్) తనకు పెళ్ళీడుకొచ్చిన ఒక కుమార్తె ఉందని,  అహ్మదాబాదులో ఆమెకు తగిన సంబంధాలేవైనా ఉంటే తెలుపమని సాఠేకు ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం పెండ్లికొడుకుల అన్వేషణకుగాక, అతని కుమార్తె విషయంలో తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్లుగా సాఠేకు తోచింది. అంతేకాకుండా ఆ ఉత్తరం వెనుక శ్రీసాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుచేత అతడు, 'ఈ దూరప్రాంతంలో ఆమెకు తగిన సంబంధం ఆశించలేము. ఒకవేళ మీరు నన్నే దృష్టిలో పెట్టుకుని ఉత్తరం వ్రాసి ఉన్నట్లైతే, నా వయస్సు తదితర విషయాలు పరిగణించమ'ని జవాబు వ్రాశాడు. అది అందుకున్న కేల్కర్, 'మీ పూర్తి వివరాలు నాకు తెలుసు. మిమ్మల్ని నా అల్లునిగా చేసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని వ్రాశాడు. అందుకు సాఠే, "అలాగైతే మీ కుమార్తెను మీతోపాటు శిరిడీ తీసుకెళ్ళి శ్రీసాయిబాబాకు చూపించి, వారి అనుమతి తీసుకోండి. బాబా అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోను" అని జవాబు వ్రాశాడు. ఆ సమయంలో దాదాకేల్కరుకు బాబాపట్ల వ్యతిరేక భావమున్నందున తన కుమార్తెను సాఠేకి ఇవ్వడానికి బాబా అనుమతించరేమోనని, దాంతో వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువలన 'వాయి'లోని బ్రాహ్మణ పండితుని (అతని బావమరిదిని) సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు సాఠే ఒప్పుకోక, బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవలసిందేనని పట్టుబట్టాడు. దాంతో కేల్కర్ తన కుమార్తెను తీసుకుని శిరిడీకి వెళ్లి, మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచివున్నాడు. అతను బాబా వద్దకు వెళ్ళగానే ఆయన అతని కుమార్తె నుదుటిపై కుంకుమ పెట్టి, "అమ్మాయిని అహ్మదాబాద్ పంపు" అని అన్నారు. అంటే సాఠేతో వివాహం జరిపించమని పరోక్షంగా బాబా తెలిపారు. బాబా వివాహానికి అనుమతించారన్న సమాచారాన్ని సాఠేకు అందించారు. బాబా అనుమతి లభించడంతో సాఠే తన యాభయ్యవ ఏట 1905 కేల్కర్ కుమార్తెను వివాహమాడాడు.

వివాహానంతరం సాఠే తన భార్యతోపాటు బాబా ఆశీస్సులకోసం శిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతడు బాబాకు ఒక శాలువాను, వెండి భరిణెను ఇచ్చాడు. బాబా తమ దివ్యహస్తాలతో వాటిని పవిత్రపరచి తమ ఆశీస్సులతోపాటు అతనికి తిరిగి ఇచ్చారు.

సాఠే దంపతులకు మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అప్పుడు దాదాకేల్కర్, అతని భార్య బాబా వద్దకు వెళ్ళి, "మాకు మనవడిని ఎప్పుడు ప్రసాదిస్తారు బాబా?" అని అడిగారు. అందుకు బాబా, “నేను అల్లాను అభ్యర్థిస్తున్నాను. అతను నా అభ్యర్థనను మన్నిస్తాడు" అని బదులిచ్చారు. తరువాత ఒకటి, రెండు సంవత్సరాలకు, అంటే 1913లో బాబా అనుగ్రహంతో సాఠేకు ఆరోగ్యకరమైన చక్కటి పుత్రుడు జన్మించాడు. సాఠేకు వివాహం జరిపించడం, ఆ తరువాత అతనికి సంతానాన్ని ప్రసాదించడం సాఠేకు బాబా చేసిన గొప్ప ఉపకారాలు.

సాఠేవాడా

బాబాకు ఇష్టమైన వేపచెట్టు సమీపంలో శిథిలావస్థలో ఉన్న గ్రామ సరిహద్దు గోడ ఉండేది. ఒకరోజు బాబా సాఠేతో, “గ్రామ సరిహద్దు గోడను పడగొట్టి, నిర్మించు” అన్నారు. ఆ గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని అతడు అర్థం చేసుకుని, అంత పెద్ద గోడ నిర్మించడానికి చాలా ఖర్చవుతుందని భయపడి మౌనంగా ఉండిపోయాడు. కానీ బాబా ఉద్దేశ్యం అది కాదని, గ్రామ సరిహద్దు గోడను కలుపుతూ ఒక వసతి గృహం నిర్మించమని మాత్రమే వారు సూచించినట్లుగా తరువాత అతను గ్రహించాడు. దాంతో వేపచెట్టు వద్ద కొంత స్థలాన్ని కొని, సరిహద్దు గోడను కలుపుతూ వేపచెట్టుకు ఒకవైపున వసతిగృహాన్ని నిర్మించాలని అనుకున్నాడు.

తరువాత అనుకోకుండా ఒక పౌర్ణమి ముందురోజున సాఠే తన ప్రయాణం గురించి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బేరేతో కలిసి శిరిడీకి ప్రయాణమయ్యాడు. వాళ్ళు సాయంత్రానికల్లా కోపర్‌గాఁవ్ చేరుకున్నారు. "రాత్రిపూట బాబాను సులభంగా దర్శించలేము కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండి, రేపు ఉదయం శిరిడీ వెళదామ"ని బేరే సాఠేను ఒప్పించాడు. దాంతో వాళ్ళు ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. అలా వాళ్ళు కోపర్‌గాఁవ్‌లో ఉండిపోవడం బాబా అనుగ్రహమే. అందువలన మంచిదే జరిగింది. ఎందుకంటే, అతని మామగారి(దాదాకేల్కర్) తండ్రివైపు బంధువులెవరో చనిపోవడంతో దశదిన కర్మక్రతువులు ఆరోజు జరిపించారు. ఇల్లంతా మైలపడి, రోదనలతో గందరగోళంగా ఉంది. వాళ్ళు శిరిడీ వచ్చి ఉంటే, వాళ్లకు మడిగా వండి వడ్డించేందుకు కూడా ఇంట్లో ఎవరూ లేరు.

మరుసటిరోజు ఉదయాన్నే సాఠే, బేరేలు శిరిడీ బయలుదేరారు. వాళ్ళు శిరిడీ చేరుకున్న సమయానికి బాబా లెండీ నుండి వస్తున్నారు. బాబా దర్శనం కోసం 80, 90 మంది జనం ప్రోగై ఉన్నారు. సాఠే, బేరేలు వెళ్లి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. అప్పుడు బాబా సాఠేతో, "నువ్వు సరైన సమయానికి వచ్చావు. వాడా శంఖుస్థాపన కార్యక్రమం జరపాలి" అన్నారు. శంఖుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని సాఠే ఆశపడ్డాడు. వెంటనే అతడు ఒక పార తీసుకుని త్రవ్వడానికి ఉపక్రమించాడు. అది చూసి బాబా, "నువ్వెందుకు అక్కడికి వెళ్లడం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీమేస్త్రీలు, పనివాళ్ళు చూసుకుంటారు" అని అతన్ని ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం శాస్త్రోక్తంగా జరగాల్సిన విధంగా శంఖుస్థాపన కార్యక్రమం జరగలేదు. అంటే, శాస్త్రోక్తంగా శంఖుస్థాపన జరగనివ్వలేదు బాబా. తరువాత సాఠేతో అతని మామ, "పౌర్ణమిరోజున మీరు శిరిడీ వస్తున్నట్లు ముందురోజే మాకు తెలుసు. అందుకే పునాదిరాయి వేయడానికి ఈరోజు నిర్ణయించాన"ని చెప్పాడు. అప్పుడు సాఠే, "నేను వస్తున్నట్లు మీకెలా తెలుస"ని అడిగాడు. "సాహెబ్ రేపు వస్తున్నాడు. ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకడానికి వేసారట" అని ముందురోజు బాబా అన్నారని చెప్పాడు కేల్కర్. కానీ సాఠే గుడారమూ పంపలేదు, తాను వస్తున్నట్లు చాకలికి కబురూ చేయలేదు.

శంఖుస్థాపన కార్యక్రమం ముగిశాక బాబా వేపచెట్టు దగ్గరున్న సమాధిని చూపుతూ, అది తమ గురువు సమాధి అని చెప్పి, దానిమీదుగా ఒక చిన్న గూడు నిర్మించి భక్తులు పూజించుకునేందుకు అనువుగా ఏర్పాటు చేయమన్నారు. అందుకు అయ్యే ఖర్చుని కూడా సాఠేనే భరించమని చెప్పారు. బాబా తమ గురువు పేరు కూడా సాఠేతో చెప్పారట కానీ, అది తనకి గుర్తులేదని, పేరులో చివరి అక్షరం 'షా'తో గానీ, 'సా'తో గానీ పూర్తవుతుందని, బహుశా అది “వెంకూసా” అయి ఉండవచ్చని అతడు చెప్పాడు.

భవన నిర్మాణం జరుగుతుండగా వేపచెట్టు కొమ్మల వలన నిర్మాణానికి అడ్డంకి ఏర్పడింది. బాబా శిరిడీ వచ్చిన తొలినాళ్లలో ఆ చెట్టునీడనే కూర్చుని ధ్యానం చేసుకునేవారు. అందువలన అందరూ దానినెంతో పవిత్రమైనదిగా భావించేవారు. అటువంటి ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ఎవరికీ ధైర్యం చాలక బాబా వద్దకు వెళ్లారు. అప్పుడు బాబా, "నిర్మాణానికి అడ్డొచ్చే కొమ్మలను నరికివేయండి. మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా?" అని అన్నారు. కానీ ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో బాబానే స్వయంగా ఆ కొమ్మలను నరికివేశారు. ఇక ఏ ఆటంకాలు లేకుండా భవన నిర్మాణం పూర్తయింది. ఆ తరువాత వేపచెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. 

అప్పటివరకు శిరిడీ వచ్చే భక్తులు బస చేయడానికి చావడి మాత్రమే అందుబాటులో ఉండి ఎంతో ఇబ్బందిగా ఉండేది. 1908లో సాఠేవాడా నిర్మాణం జరిగాక ఆ సమస్య తీరింది. సాఠే అత్తమామలు కూడా అందులోనే నివాసముండేవారు. ఇలాంటి ధర్మకార్యాల కోసం బాబా సాఠే చేత ఖర్చు పెట్టించేవారు. దాసగణు రచించిన "మహాత్ముల జీవిత చరిత్రలు" అనే గ్రంథ ముద్రణకు సాఠే చేత 75 రూపాయలు ఇప్పించారు బాబా.

సాయిబాబా ద్వారా సాఠే పొందిన ఇతర ప్రయోజనాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా అతని వృత్తి జీవితం గురించి చెప్పాలి. బాబా మార్గదర్శకత్వంలో అతను తన వృత్తిరీత్యా ఎదురైన సమస్యలను అధిగమించాడు.

సుమారు 1909, 1910 ప్రాంతంలో సాఠే, రెవెన్యూ కమీషనర్ శ్రీకర్టిస్, జిల్లా కలెక్టరు ఒక కమిటీగా ఏర్పడి ఉన్నారు. ఒకరోజు ఈ కమిటీ మన్మాడులో సమావేశమై, ఆ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. ఆ సమావేశానికి ముందురోజు సాఠే శిరిడీలో ఉన్నాడు. అతను మన్మాడ్ వెళ్ళడానికి బాబా అభ్యంతర పెట్టరని తలచి అనుమతికోసం తన మామగారైన దాదాకేల్కర్‌ని బాబా వద్దకు పంపాడు. కేల్కర్ తిరిగి వచ్చి బాబా అనుమతివ్వలేదని చెప్పాడు. అప్పుడు సాఠే ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాడు. కేల్కర్ మళ్ళీ వెళ్ళి బాబాను అడిగాడు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్ళకుండా సాఠేను గదిలో బంధించి ఉంచమన్నారు. అలా మూడురోజులు అతన్ని శిరిడీలోనే ఉంచిన తరువాత మన్మాడ్ వెళ్ళేందుకు బాబా అనుమతించారు. అతను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే, సమావేశం జరగవలసిన రోజు అధికారులెవ్వరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. నిజానికి అతను పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడిదులలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామగ్రిని రైల్లో మన్మాడ్ నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు ముందుగానే చేసి ఉన్నాడు. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అవి పంపబడలేదని, మన్మాడులోనే ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెతికి, తిరిగి తెప్పించుకోడానికి అతను నానా అవస్థలు పడవలసి వచ్చేది. త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఆ ఏర్పాటంతా చేశారు. ఆ విషయమే అతడిలా అన్నాడు: "నేను మన్మాడ్ వెళ్ళనందువలన నాకు జరిగిన నష్టమేదీ లేదు, ఒక్క మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అనవసరమైన ఇబ్బంది తప్పడమేకాక శిరిడీలో కుటుంబంతో, సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగే అవకాశం నాకు దక్కింది. నేను శిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాననుకోవడం నా అజ్ఞానమేఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి".

ఒకసారి సాఠే ఉద్యోగరీత్యా తనకు రావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తి చెందాడు. అతను విసుగుతో ఆ విషయం గురించి సాయిబాబాకు చెప్పి, ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నాడు. బాబా, "అలా చేయవద్దు, త్వరలోనే ప్రమోషన్ వస్తుంది" అని చెప్పారు. కొన్నాళ్ళకు బాబా చెప్పినట్లుగానే కొంతమంది సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంటుగా అతనికి  ప్రమోషన్ ఇచ్చి కోల్హాపూర్ బదిలీ చేశారు. జీతం కూడా వంద రూపాయలు పెరిగింది. అంతేకాదు, ఆ స్థాయిలో అతను పదవి విరమణ చేసినందున తన సీనియర్లకంటే తనకే ఎక్కువ పింఛను కూడా లభించింది.

ఆ పింఛను విషయంలోనూ అతనికొక సమస్య ఎదురయింది. పింఛను శాఖవారు చివరగా అతను నిర్వహించిన ఉన్నత పదవిని పరిగణనలోనికి తీసుకుండా డిప్యూటీ కలెక్టరు ఉద్యోగాన్ని ప్రాతిపదికగా తీసుకుని పింఛను మంజూరు చేశారు. ఫలితంగా అతనికి  రావలసినదానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఆ విషయం గురించి అతడు అధికారులకు విజ్ఞప్తి చేసి, తరువాత బాబా వద్దకు వెళ్లి, "ఇలా తక్కువ పింఛను తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవడం మానివేస్తాన"ని అన్నాడు. అప్పుడు బాబా, "ఆ యాభైరూపాయలు తప్పక మంజూరవుతాయి. అల్లా మేలు చేస్తాడు" అని అన్నారు. తరువాత అతను రెవెన్యూ కమీషనరైన కర్టిస్‌కు అప్పీలు పిటీషన్ పంపాడు. అదే సమయంలో బాబా తమ వద్దకు వచ్చిన ధుమాల్‌ను 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతను తనవద్ద డబ్బులేదని విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా అతనితో “సాహెబ్ వద్దకు వెళ్లి, అడిగి తీసుకుని రా” అని చెప్పారు. అతడలాగే వెళ్లి సాఠేను అడిగాడు. బాబా తననుండి 50 రూపాయలు దక్షిణ అడిగారని తెలిసి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న తన పిటిషన్ తనకి అనుకూలంగా వస్తుందనడానికి సూచనగా భావించాడు సాఠే. సంతోషంగా బాబాకు దక్షిణ సమర్పించాడు. తరువాత కర్టిస్ సిఫారసుతో తనకు రావాల్సిన పింఛను మొత్తం పూర్తిగా మంజూరయింది. తనను బాబా దక్షిణ అడిగిన రోజునే తన పిటిషన్‌పై అదనపు రూ.50 పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సాఠేకు తెలిసింది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు. ఏదైనా సంభవింపజేయగలరు.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

source:  http://www.saiamrithadhara.com/mahabhakthas/hari_vinayak_sathe.html
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. om sairam
    baba always be with me

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo