సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 318వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. శిరిడీ పర్యటనలో బాబా ఆశీస్సులు
  2. సాయి కరుణతో శ్రీవారి దర్శనం

శిరిడీ పర్యటనలో బాబా ఆశీస్సులు

ఒరిస్సా నుండి సాయిభక్తురాలు పూజ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయికి అంకిత భక్తురాలిని. ఆయన ఆశీస్సులు లెక్కలేనన్ని. బ్లాగు నిర్వహిస్తున్న బృందానికి నా ధన్యవాదాలు. నేను ఎప్పుడు కలతగా ఉన్నా ఈ పేజీ తెరుస్తాను. తద్వారా నేను ఓదార్పు పొందుతాను. నాకు 20 సంవత్సరాలు. ప్రస్తుతం నేను NEET పరీక్షకు సిద్ధమవుతున్నాను. నేను నా కుటుంబంతో ఒరిస్సాలో నివసిస్తున్నాను. మేము దాదాపు 7 సంవత్సరాల క్రితం బాబా పాదకమలాల వద్దకు చేరుకున్నాము. అప్పటినుండి ఇప్పటివరకు మేము 4, 5 సార్లు శిరిడీ సందర్శించాము. అయితే ఏవో కారణాల వలన 4 సంవత్సరాలుగా శిరిడీ వెళ్ళలేకపోయాము. చివరికి నాలుగేళ్ళ తరువాత ఈ సంవత్సరం మేము శిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. అది కూడా నా సాయి ఆశీస్సుల వలనే  జరిగింది. నెల ముందుగా మేము టికెట్లు బుక్ చేసుకున్నాము. చాలా వ్యవధి తరువాత మేము శిరిడీలో బాబాను చూడబోతున్నామని ఎంతో ఆసక్తితో సంతోషంగా ఎదురుచూశాము. రోజులు గడిచేకొద్దీ ఆ ఉత్సాహం ఇంకా ఇంకా అధికమైంది. చివరకు ఆరోజు రానే వచ్చింది. మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మొదట్లో మా నాన్నగారు పనిభారం వలన శిరిడీ రావడానికి నిరాకరించారు. కానీ కొన్నిరోజుల తరువాత ఆయన మానసికస్థితి మారి కనీసం ఒక్క దర్శనమైనా చేసుకొని తిరిగి వస్తానని మాతో రావడానికి సిద్ధమయ్యారు.

బాబా ఆశీస్సులతో మేము నిర్ణీత సమయానికన్నా ఒక గంట ముందే సాయినగర్ (శిరిడీ) చేరుకున్నాము. మేము ద్వారకామాయికి సమీపంలో గది తీసుకున్నాము. కాలకృత్యాలు తీర్చుకుని బాబా దర్శనం కోసం సమాధిమందిరానికి వెళ్ళాము. ఆరోజు ఆదివారం కావడంతో బాబా దర్శనం కోసం చాలా రద్దీ ఉంది. మేము 3 గంటలపాటు లైనులోనే ఉండిపోయాము. సమయం ఉదయం 11 గంటలు అయింది. ఇంకో అరగంట అయితే ఆరతికోసం దర్శనాలు ఆపేస్తారు. మా నాన్నగారి రిటర్న్ టికెట్ అదేరోజు మధ్యాహ్నం 1.55 గంటల ట్రైనుకి ఉంది. కాబట్టి బాబా దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుందని మేమంతా కలత చెందాము. అయితే బాబా తన అద్భుతాన్ని చూపించారు. మేము అత్యవసర మార్గం గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాము. ఆ ప్రయత్నంలో మాకు తెలియకుండానే మేము విఐపి దర్శనం క్యూలో ప్రవేశించాము. ఆ క్యూలో పెయిడ్ పాసులు తీసుకున్న వాళ్ళు వెళ్ళాలి. మా వద్ద ఆ పాసులు లేకపోయినప్పటికీ మేము ఆ లైనులో వెళ్తున్నాము. బాబా కృపో ఏమో గానీ ఆ లైనులో ఎక్కడా పాసులు తనిఖీ చేయలేదు. కేవలం 3-4 నిమిషాల్లో మేము మా ప్రియమైన బాబా వద్దకు చేరుకుని ఆయన దర్శనాన్ని పొందడం మాకస్సలు నమ్మశక్యం కాలేదు. ఆ సమయంలో మా ఆనందానికి హద్దులు లేవు. ఆయనను చూస్తూ, ఆయనెంత దయగలవారని మేము కన్నీళ్ళు పెట్టుకున్నాము. మా నోటమాట రాలేదు. చక్కటి దర్శనంతో మేము మా గదికి తిరిగి వచ్చాము. బాబా యొక్క ఇంకో అనుగ్రహం గురించి చెప్పాలి. మేము నాన్నగారికి టికెట్ థర్డ్ ఎసిలో బుక్ చేశాము. చివరి నిమిషంలో మేము చెక్ చేసుకుంటే అది ఫస్ట్ ఎసికి అప్‌గ్రేడ్ అయ్యింది. బాబా ప్రేమను ఏమని వర్ణించేది!! ఆయన చాలా దయగలవారు. ఆయన ఆశీస్సులకు అంతులేదు.

నాన్నగారు వెళ్ళిపోయాక మేము శిరిడీలోనే ఉన్నాము. ఎప్పటినుండో ద్వారకామాయిని శుభ్రపరచాలని నాకు కోరికగా ఉండేది. ఆ కోరికను బాబా ఈ సంవత్సరం నెరవేర్చారు. మేము తిరుగు ప్రయాణమయ్యేరోజు నేను శిరిడీ విడిచి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకోవడానికి సమాధిమందిరాన్ని దర్శించాను. దర్శనం తరువాత నేను పారాయణ హాలుకి వెళ్లి కాసేపు పారాయణ చేసుకున్నాను. తరువాత చివరగా నేను గురుస్థాన్ వద్ద పదినిమిషాలపాటు కూర్చున్నాను. కానీ నాకు ఒక్క వేపాకు కూడా లభించలేదు. అందుచేత నేను ఆకు పొందేంత అదృష్టవంతురాలిని కానని అనుకున్నాను. అయినప్పటికి మరో ఐదు నిమిషాలు వేపాకు కోసం అక్కడే వేచి చూద్దామని అనుకున్నాను. నిమిషం తరువాత ఒక వ్యక్తి నేరుగా నా దగ్గరకు వచ్చి ఒక వేపాకు ఇచ్చాడు. 'బాబా ప్రేమంటే ఇదీ!' అని అనుకుంటూ నేను మంత్రముగ్ధురాలినయ్యాను. బాబా వద్దనుండి ఎవరూ వట్టిచేతులతో తిరిగి వెళ్లరు. ఆయన తన పిల్లల కోరికలన్నింటినీ నెరవేరుస్తారు. చివరికి నేను సాయిభక్తులందరితో, బాబా నామాన్ని జపిస్తూ, ఏదీ ఆశించకుండా బాబాను ఆరాధించమని చెప్పాలనుకుంటున్నాను. బాబాకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. బాబా ఎప్పుడూ బోధించే శ్రద్ధ, సబూరీలను హృదయమునందు భద్రపరుచుకోవాలి. ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ తన భక్తులపై వర్షిస్తూ ఉంటుంది.

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సోర్స్:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2541.html

సాయి కరుణతో శ్రీవారి దర్శనం

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకు ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

బాబా భక్తులందరికీ నా ప్రణామాలు. ఇటీవల బాబా నాపై చూపిన కరుణను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 

మేము 2020, జనవరి 30న తిరుమలలో శ్రీవారి దర్శనానికి బుక్ చేసుకున్నాం. నాకు డిసెంబరు నెలలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. కొద్దిరోజులకు జ్వరం తగ్గినప్పటికీ, ఆ తరువాత విపరీతమైన కీళ్ళనొప్పులతో బాధపడ్డాను. ఆ బాధతో అసలు నడవలేకపోయాను. ఈ కీళ్ళనొప్పులతో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళగలనా, లేదా అనిపించింది. అయితే భారమంతా బాబా మీద వేసి తిరుమల వెళ్ళాను. జనవరి 29 రాత్రి కూడా కీళ్ళనొప్పులు అలానే ఉన్నాయి. ఆ నొప్పులతోనే ధర్మదర్శనానికి వెళ్లి, దర్శనానికి ఎంత సమయం పడుతుందోనని టెన్షన్ పడ్డాను. కానీ బాబా ఎంత కృప చూపారంటే, కేవలం 2 గంటల్లోనే స్వామివారి దర్శనం అయింది. ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరలా తెల్లవారి గురువారం వసంతోత్సవం సేవకు వెళ్ళాను. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావటానికి దాదాపు అయిదు గంటల సమయం పట్టింది. అంత సమయం పట్టినప్పటికీ బాబా దయవలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా శ్రీవారిని దర్శించుకున్నాను. అంత తీవ్రమైన కీళ్ళనొప్పులతో వున్న నేను తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లి రావడం నాకో పెద్ద అద్భుతం. నిజానికి దర్శనం బుక్ అయిన దగ్గరనుండి నేను బాబాను అడుగుతూ వున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేయించండి అని. బాబా మన ప్రార్థన ఖచ్చితంగా వింటారు. ఆయన దయవల్ల అంతా చక్కగా జరిగింది. నా ఆరోగ్యం ఇంకా కుదుటపడాల్సి ఉంది. కానీ నాకేం భయంలేదు, అంతా బాబానే చూసుకుంటారు. "మేము నీ పిల్లలం బాబా! ఏమయినా తప్పులు చేస్తే క్షమించండి. నన్ను, నా కుటుంబాన్ని, ఈ అనుభవాలు చదువుతున్న వాళ్ళందరినీ చల్లగా కాపాడు తండ్రీ!".

జై సాయిరామ్.


4 comments:

  1. OM SAIRAM,
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo