సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1370వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా సంరక్షణ
2. శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు

బాబా సంరక్షణ


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, సచ్చిదానంద సమర్థ సద్గురువు అయిన శ్రీసాయినాథ్ మహరాజుకి పాదాభివందనాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో డిపో మేనేజర్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాను. నేను బాబా భక్తుడిని. బాబా అనుగ్రహం వల్ల అనుక్షణం బాబా నామం నా నాలుకపై ఉంటుంది. ఇది బాబా నాకు ఇచ్చిన గొప్ప వరం. నేను గతంలో బాబా నాపై చూపిన కరుణాకటాక్షాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. 2012లో నేను మెదక్ డిపో మేనేజరుగా ఉన్నపుడు జూన్ 13, మధ్యాహ్నం భోజనం చేసి నా అఫీషియల్ వెహికల్‌కి రిపేర్ ఉండడం వల్ల డిపోలోని ఒక ఎంప్లాయ్ తాలూకు మారుతి-800 కారు తీసుకుని నా డ్రైవరుతో కలిసి రూట్ అబ్జర్వేషన్ కోసం కామారెడ్డి రూటులో వెళ్ళాను. ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాక హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిలోకి ప్రవేశించాము. కొద్ది దూరం వెళ్లిన తరువాత బహుశా డ్రైవరుకి నిద్ర కమ్మిందేమో, హఠాత్తుగా కారు రోడ్డు పక్కకి దిగి పల్టీలు కొట్టి ఒక గుంటలో పడిపోయింది. ఆ కారు స్థానికంగా గ్యాస్‌తో నడిచేలా ఏర్పాటు చేసినందువల్ల కారులో గ్యాస్ సిలిండరు ఉంది. అదృష్టవశాత్తూ ఆ సిలిండర్ బ్లాస్ట్ కాలేదు. కారు డోర్స్ కూడా తొందరగానే తెరచుకోవడంతో మేము కారులో నుండి బయటపడ్డాము. ఆ క్షణంలో బాబా రూపం నాకు కనిపించింది. ఆయన దయవల్లే నేను ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డానని అనుకున్నాను. డ్రైవరుకి ఏమీ కాలేదుగానీ నా ఎడమచేయి ఫ్రాక్చర్ అయింది. అందువల్ల నేను నాలుగు నెలలపాటు ఇంట్లోనే ఉండిపోయాను. కానీ అలా ఉండడం వల్లనే నేను కొన్ని చెడు విషయాల నుండి రక్షింపబడ్డానని నాకు తరువాత అర్థమైంది. ఇలాగే నా కుమారుని కూడా మూడుసార్లు ప్రమాదాల నుండి బాబా కాపాడారు.

 

2019లో ఒకసారి మేము మా అబ్బాయి మ్రొక్కు తీర్చుకోడానికని అప్పటికప్పుడు తిరుపతి వెళ్ళలనుకుని ఆన్లైన్‌లో ప్రత్యేక దర్శనం మరియు రూముల కోసం చూస్తే, అందుబాటులో లేవు. అప్పుడు నేను సహాయం కోసం బాబాను ప్రార్థించి ఇతర మార్గాలలో ప్రయత్నం చేయగా చెన్నై-తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులకి తిరుపతి ప్రత్యేక దర్శనం అనుసంధానింపబడి ఉందని తెలిసింది. దాంతో ఆన్లైన్‌లో చెన్నై నుండి తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్నాం. రూమ్ కోసం తిరుపతి బస్సు స్టేషన్‌లో ఉన్న సూపర్‌వైజరుతో నేను జగిత్యాల DMగా పరిచయం చేసుకుని, "తిరుమలలో వసతి విషయంలో మాకు సహాయం చేయండి" అని రిక్వెస్ట్ చేశాను. అతను ప్రయత్నిస్తానని అన్నారు. ఇక మేము దేవుని మీద భారం వేసి తిరుపతి వెళ్ళాం. మేము అలిపిరి దాటి, కొద్దిగా ముందుకు వెళ్లేసరికి తిరుపతి బస్టాండ్ సూపర్‌వైజర్ కాల్ చేసి, "మీరు కొండపైకి వెళ్లి శ్రీపద్మావతి గెస్ట్‌హౌస్‌లో 'sl no.6' అని చెప్పండి. రూమ్ ఇస్తారు" అని అన్నాడు. మేము నేరుగా శ్రీపద్మావతి గెస్ట్‌హౌస్‌కి వెళ్లి, అతను చెప్పమన్నట్టే చెప్పాం. కేవలం 10 నిమిషాల్లో మాకు రూమ్ ఇచ్చారు. సాయంత్రం ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ల మీద ప్రత్యేక దర్శనం చేసుకున్నాం. అదేరోజు నా శ్రీమతి కుటుంబానికి ఆప్తమిత్రుడైన ఒకతను ఏదో విషయంగా ఫోన్ చేస్తే, "మేము తిరుపతిలో ఉన్నాం" అని చెప్పాం. వెంటనే అతను, "మీరు రేపు ఉదయం JEO ఆఫీసుకి వెళ్ళండి. మీకు సుప్రభాతసేవ టికెట్లు ఇవ్వమని చెపుతాను" అని చెప్పాడు. మేము మరుసటిరోజు ఉదయం JEO ఆఫీసుకి వెళితే, మరునాటి ఉదయం సుప్రభాతసేవ టికెట్లు ఇచ్చారు. మరొకరోజుకి రూమ్ పొడిగించుకుని ప్రశాంతంగా సుప్రభాతసేవలో పాల్గొన్నాము. ఇదంతా మేము ఊహించని బాబా కరుణ. ఆయన దయతో 2022, జూలైలో కూడా మాకు విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రసాదించారు

.

నేను జీవితంలో ఒక్కసారైనా చార్‍ధాం యాత్ర చేయాలని అనుకునేవాడిని. నేను 2022, జనవరిలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఏప్రిల్లో మా చిన్న బావమరిది ఏదో ఫంక్షన్ విషయంగా మా ఇంటికి వచ్చాడు. మాటల్లో అతను హఠాత్తుగా నా శ్రీమతితో, "చిట్టీ! మేము మే 20న నా భార్య అక్కతో కలిసి చార్‍ధాం యాత్రకి వెళ్తున్నాము" అని చెప్పాడు. అప్పుడు మా పిల్లలు, "మీరు కూడా వాళ్లతో వెళ్ళండి" అని బలవంతపెట్టారు. వెంటనే ఆర్.వి ట్రావెల్స్‌లో డబ్బులు కట్టి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. మా యాత్రలో రెండోరోజు హరిద్వార్ నుండి ఉత్తరకాశీ వెళ్తున్నపుడు హరిద్వార్ దాటాక 15 కిలోమీటర్ల దూరంలో బస్సు క్లచ్ ఫెయిల్ అయి బస్సు బ్రేక్ డౌన్ అయింది. కొద్దిగా ముందుకు వెళ్తే, పూర్తిగా లోతైన ఘాట్ సెక్షన్ ఉంది. అక్కడ గనక బస్సు ఫెయిల్ అయుంటే చాలా దారుణం జరిగి ఉండేది. కానీ బాబా ముందుగానే సమస్య వచ్చేలా చేసి మమ్మల్ని కాపాడారు. బాబా దయవల్ల క్షేమంగా ప్రశాంతగా మా చార్ధాం యాత్ర పూర్తి చేసుకుని వచ్చాము. “మీ అనుగ్రహానికి శతకోటి ధన్యవాదాలు బాబా”.


2022, సెప్టెంబర్ నెలలో నా శ్రీమతి తన వస్త్ర వ్యాపారానికి సంబంధించిన ఒక బుక్ కోసం దాదాపు ఆరురోజులు ఎంతలా వెతికినా దొరకలేదు. నేను నా శ్రీమతి టెన్షన్ చూడలేక, "బాబా! బుక్ దొరికేలా చేయండి. మీ కరుణను బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. తరువాత రెండోరోజు నా శ్రీమతి చేతిలో ఆ బుక్ ఉండటం చూసి, "అరే.. ఆ బుక్ ఎక్కడ దొరికింది" అని అడిగాను. అందుకామె, "షాపు పక్క రూమ్లో ఉంద"ని చెప్పింది. అంతా బాబా కరుణాకటాక్షం. "బాబా! ఈమద్య నాకు, నా భార్యకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నా వయస్సు 61 సంవత్సరాలు. మనిషి సగటు ఆయుష్షు 80 సంవత్సరాలనుకుంటే మూడు వంతుల జీవితకాలం పూర్తయి చివరి వంతులో ఉన్నాను. దయచేసి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా కాపాడండి ప్రభూ".


2022, సెప్టెంబర్ 29న నా మనవరాలికి హై ఫీవర్‍తో వణుకు వచ్చింది. అప్పుడు, "బాబా! పాపకి తొందరగా తగ్గిపోవాలి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయతో రెండు రోజుల్లో పాపకి తగ్గిపోయింది. కానీ, మళ్ళీ వచ్చింది. డాక్టర్ 'యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్' ఉందని చెప్పి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమన్నారు. నేను, "బాబా! రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా చూసి తొందరగా నా మనవరాలు మామూలుగా అయ్యేలా అనుగ్రహించండి తండ్రి. మీ కరుణను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. అంతేకాదు, జ్వరం కూడా తగ్గిపోయి పాప మామూలుగా అయింది. ఇదంతా కేవలం బాబా కరుణాకటాక్షాల వల్లే. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక చేసిన తప్పులకు క్షమాభిక్ష ప్రసాదించండి బాబా. మీ కృపవలన కరీంనగర్‍లో మాకు ఒక సొంతిల్లు సమకూరింది. అలాగే మీ దయతో అబ్బాయి తిరుచ్చి NITలో బిటెక్(ECE) పూర్తిచేసి, ప్రస్తుతం USలో MS చేస్తున్నాడు. MS కోసం కోయారే బ్యాంక్ లోన్ సాంక్షన్ అయినప్పటికీ మీ దయవల్ల అదే యూనివర్సిటీలో అబ్బాయికి టీచింగ్ అసిస్టెంట్గా రావడంతో, ఫీజు రాయితీ(exemption) రావడమే కాకుండా, రెండు వేల డాలర్ల హానరోరియం(పారితోషకం) కూడా ఇస్తున్నారు. అలాగే చెన్నైలో MS( ENT) కోర్స్ చేస్తున్న చిన్న అమ్మాయికి ఎలాంటి అవరోధాలు కలగకుండా కోర్సు పూర్తయ్యేలా అనుగ్రహించు తండ్రి. అలాగే మా స్వంత ఊరిలో అపరిష్కృతంగా ఉన్న భూమి పంపకాలు తొందరగా పూర్తి అయ్యేలా అనుగ్రహించండి బాబా".


సాయి చరణం!!

సర్వదా శరణం శరణం!!!


శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు


సాయితండ్రికి, సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు గీత. మా అబ్బాయి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టు కోసం 2022, మే 28న మొదటి దశ పరీక్ష వ్రాసాడు. అప్పుడు నేను, "బాబా! బాబు పరీక్షలో ఉత్తీర్ణుడై రెండో దశకు చేరుకుంటే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని ఆ దయామయుని వేడుకున్నాను. ఆయన దయవల్ల మా బాబు మొదటి రౌండు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ అనుభవాన్ని గతంలో మీతో పంచుకున్నాను. ఇకపోతే  2022, జూన్ 25న బాబు రెండో దశ పరీక్ష వ్రాసాడు. అప్పుడు కూడా నేను, "బాబా! బాబు 'పరీక్ష బాగా వ్రాసాన'ని చెబితే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అదేరోజు సాయంత్రం బాబు ఫోన్ చేసి నేను కోరుకున్నట్లే పరీక్ష బాగా వ్రాసానని చెప్పాడు. వెంటనే ఆ విషయాన్ని బ్లాగులో పంచుకోవడానికి మేటర్ ఫోన్లో టైప్ చేశాను. కానీ సాయితండ్రి కృపాకటాక్షాలను తుంచి ముక్కలుగా చేసి పలుమార్లు రుచి చూపిస్తున్నట్లు ఉంటుందేమోననిపించి ఆ ఉద్యోగానికి సంబంధించి అన్ని దశలు పూర్తయ్యాక సాయి కృపామృతభాండాన్ని పూర్తిగా మీతో పంచుకోవాలని ఆగిపోయి సాయి వర్షించే కృపామృతం కోసం సహనంతో ఎదురుచూసాను. ఆ తండ్రి దయవల్ల బాబు రెండవ దశలో కూడా ఉత్తీర్ణుడై తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి ఎంపిక అయ్యాడు. 2022, సెప్టెంబర్ 12వ తేదీన ముంబాయిలోని ఆర్.బి.ఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉండగా బాబు 11వ తేదీన ముంబాయి చేరుకున్నాడు. ఆ రాత్రి బాబుకి 4 సార్లు విరోచనాలయ్యాయి. ఆ విషయం తను నాతో ఫోన్‍లో చెప్పాడు. నేను దేవుడి గదిలో బాబా ముందు నిలబడి, "బాబా! బిడ్డ పెద్ద పరీక్షకు హాజరవుతున్నాడు. బాబు నోట్లో వేస్తున్నట్లుగా భావించి చిటికెడు ఊదీ నా నోట్లో వేసుకుంటాను. దయచేసి తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. ఆ దయామయుడు బాబు ప్రత్యక్షంగా ఊదీ తీసుకోకపోయినా, తనకి బదులు నేను తీసుకున్నా బాబుకి నయం చేశారు. ఇక బాబు ఏ ఇబ్బందీ లేకుండా ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఆ సాయితండ్రి కరుణ వల్ల అదేరోజు తనకి ఆ ఉద్యోగం వచ్చింది. బాబు తన మొదటి జీతం మా ఊరి శ్రీసాయినాథ్ మహరాజ్‍కి సమర్పించుకుంటానని అనుకున్నాడు. శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు. ఆయనను నమ్మిన వారి వెంట పరుగులు తీస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ మేలు ఎప్పుడూ మరువము తండ్రి. ఇలాగే మీ దయా వీక్షణలు మాపై సదా నిలుపు తండ్రి".



సాయిభక్తుల అనుభవమాలిక 1369వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు
2. ఎనలేని దయచూపే సాయితండ్రి

బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు


నేను డా.సుచరిత. నేను సాయిభక్తురాలిని. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. నేను కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులను  ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. "బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి".


నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో మా అమ్మకి కరోనా వచ్చి తగ్గాక అమ్మ పరిస్థితి విషమించిందని, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకి డయాలసిస్ చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలో ఆమె ప్రాణానికి ముప్పు ఉందని డాక్టరు చెప్పారని పంచుకున్నాను. అయితే బాబా అనుగ్రహం వల్ల అమ్మకి సుమారు 60 సార్లు డయాలసిస్ చేసినప్పటికీ ఏ సమస్యా రాలేదు. అంతేకాదు ఆయన ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కారమైంది కూడా. ఇది సుమారు 15 నెలల కిందటి మాట. తరువాత అప్పుడప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుండటం వలన అమ్మ ఇబ్బందిపడుతుంది. ఇలా ఉండగా 2022లో మా నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు ఘనంగా చేద్దామని నేను, మా అక్క, అన్నయ్య అనుకున్నాము. సరిగ్గా అదే సమయంలో 'అమ్మకి గుండె సంబంధిత సమస్య ఉందని, వెంటనే చికిత్స చేయించాలి, కానీ రిస్క్ ఎక్కువగా ఉంది' అని డాక్టరు అన్నారు. మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! నాన్న పుట్టినరోజు వేడుక బాగా జరగాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించి కార్డియాలజిస్టు డాక్టరు, "తొందరేమీ లేదు, పుట్టినరోజు వేడుకయ్యాకే గుండె చికిత్స పెట్టకుందాం" అన్నారు. మేము ఎంతో సంతోషంగా వేడుక పనులు మొదలుపెట్టాము. అయితే పుట్టినరోజునాడు అంబులెన్సులో అమ్మని ఇంటికి తీసుకొస్తుంటే అమ్మ స్పృహ కోల్పోయింది. ఫస్ట్ ఎయిడ్ చేసారు. అప్పుడు నేను మనసులో బాబాను ప్రార్థించాక అమ్మ హుషారుగా అయింది. ఫంక్షన్ మేము కోరుకున్నట్టుగా బాగానే జరిగింది. అంతా బాబా దయ.


నేను చాలారోజుల క్రితం కాలినడకన తిరుమల కొండ ఎక్కుతానని మ్రొక్కుకున్నాను. ఐతే కోవిడ్ విజృంభన, ఆ తరువాత మా అమ్మనాన్నల ఆరోగ్యం బాగా లేకపోవడం, మరికొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నా తిరుపతి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. పైగా కోవిడ్ సమయంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల నేను, మా పిల్లలు చాలా బరువు పెరిగాము(బరువు పెరగడం వల్ల ఎన్ని సమస్యలో మన అందరికి తెలిసిందే). ఆ స్థితిలో నేను నడవగలనో, లేదో నా శరీరం సహకరిస్తుందో, లేదో అని చాలా భయపడాను. కానీ బాబా మా ఇంటిపైన జిమ్ పెట్టుకునేలా ఆలోచననిచ్చి నేను, మా బాబు బరువు తగ్గేందుకు సహాయం చేసారు. ఇక బాబా ఆశీస్సులతో నేను అలిపిరి నుంచి కాలినడకన కొండెక్కి నా మొక్కు తీర్చుకున్నాను. ధన్యవాదాలు బాబా.


మా పిల్లల పరీక్షకి ముందురోజు కరెంట్ పోయింది. దాంతో బాబు, నేను సరిగా రివిజన్ చేసుకోలేకపోతున్నానని బాధపడ్డాడు. అప్పుడు నేను బాబాని వేడుకోగానే కరెంట్ వచ్చింది.


మా పెద్దబాబు చాలా బాగా చదివేవాడు. కానీ యుక్తవయసు వచ్చాక తను ఎక్కువ సమయం తన ఫ్రెండ్స్ తో గడుపుతుండేవాడు. నేను ఆ ప్రభావం బాబు చదువుపై పడకూడదని బాబాని వేడుకోని తను పరీక్షకి వెళ్లేముందు తనకి బాబా ఊదీ పెట్టి పంపేదాన్ని. బాబా దయతో బాబుకి ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు వచ్చేలా అనుగ్రహించారు


ఒకసారి మా బావ, పెళ్లికి కొనిపెట్టిన మా అక్క నగలు కనిపించకుండా పోయాయి. అక్క వాటికోసం ఇల్లంతా ఎంత వెతికినా కనిపించలేదు. ఇక ఆ నగలు పోయినట్లే అనుకున్నారు. అప్పుడు నేను, "బాబా! అక్క నగలు దొరికితే అన్నదానం చేస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత అక్కవాళ్ళు కొత్త ఇంటిలోకి మారారు. అప్పుడొక రోజు బాబా దయవల్ల ఆ నగలు మందుల డబ్బాలో దొరికాయి. ఇంకా బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు మరియు మా తప్పులన్నింటికీ క్షమాపణ వేడుకుంటున్నాను బాబా. మళ్లీ మళ్లీ ఆ తప్పులు చేయను బాబా. మీ మీద భక్తివిశ్వాసాలు పెంపొందేలా మమ్మల్ని అనుగ్రహించి సన్మార్గంలో నడిపించండి బాబా. భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి బాబా. దయచేసి ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టకండి"


శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


ఎనలేని దయచూపే సాయితండ్రి


అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేను సాయి భక్తురాలిని. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సాయి ఆనతితోనే జరుగుతుందని నా నమ్మకం. నా కుటుంబం మరియు నాకు సంబందించిన వారి మీద నా సాయితండ్రి ఎనలేని దయ చూపుతున్నారు. 2022, సెప్టెంబర్ నెల చివరిలో మా పాపకు జ్వరం వచ్చింది. మావారు ఇంగ్లీష్ మందులు వాడనివ్వరు. అందుచేత ఆయుర్వేద మందులు వాడతాము. అయితే మూడురోజులైనా తగ్గలేదు. ఇంకా నేను బాబాను శరణువేడి, "బాబా! మీరే నా పాపను కాపాడాలి. తనకి ఎలాగైనా జ్వరం తగ్గేలా అనుగ్రహించు తండ్రి" అని వేడుకున్నాను. ఆయన దయతో మరుసటిరోజుకి పాప జ్వరం అదుపులోకి వచ్చి ఒక్క వారంలో మామూలు అయింది. "థాంక్యూ సో మచ్ బాబా".


ఈమధ్య తమ్ముడు ప్రసాద్ వాళ్ళ అన్నయ్యకు థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ అయింది. ఆ సమయంలో నేను 'బాబా దయవల్ల అతను క్షేమంగా ఇంటికి వస్తే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అతను హాస్పిటల్లో ఉన్న సమయంలో వాళ్ళ నలుగురు పిల్లల్ని మావారు స్కూల్లో దించారు. మావారు విసుక్కోకుండా బాధ్యతగా ఆ పని చేయాలని నేను బాబా దగ్గర చెప్పుకున్నాను. ఎందుకంటే, ఆ పిల్లలు చదివే స్కూలు, మా ఇద్దరు పిల్లలు చదివే స్కూలు ఒక్కటి కాదు. బాబా దయవల్ల మావారు ఎటువంటి ఇబ్బందిపడకుండా ఆ వారం రోజులు పిల్లల్ని వాళ్ళవాళ్ళ స్కూళ్లలో దింపి, తిరిగి తీసుకొచ్చారు. ఆ వారంలోనే ప్రసాద్ చిన్నకొడుకు మరియు అతని మేనకోడలు పుట్టినరోజులు వచ్చాయి. ప్రసాద్, తన అన్నయ్య హాస్పిటల్లో ఉన్నందున, ఆ పిల్లల చేత కేక్ కట్ చేయించాలని నా మనసుకి అనిపించింది. కానీ ఆ మాట మావారితో అంటే ఏమంటారో అని భయమేసి, "ఎలాగైనా నా కోరిక తీర్చమ"ని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయతో మావారికి పిల్లల పుట్టిన రోజుల గురించి తెలిసి తనంతటతానే, "వాళ్ళతో కేక్ కట్ చేయిద్దామా?" అని అన్నారు. అలా బాబా దయవల్ల పిల్లలిద్దరి పుట్టినరోజులు బాగా జరిగాయి. బాబు పుట్టినరోజునాడు మేము తమ్ముడు వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాము. ఆరోజు చాలా సంతోషంగా గడిచింది. ఆ తరువాత ప్రసాద్ వాళ్ల అన్నయ్యను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. ఆరోజు మా సార్ తన పర్సనల్ పని వదులుకుని వాళ్ళను కారులో హైదరాబాద్ నుండి నల్గొండకి తీసుకొచ్చారు. వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చి 2022, అక్టోబర్ 7, శుక్రవారం ఆయన తిరిగి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు. నేను కోరుకున్నట్లే అంతా జరిపించారు నా బాబా తండ్రి.


విజయదశమి రోజున మధ్యాహ్నం 2:15కి మేము నకిరేకల్‍‍‍లోని బాబా గుడికి వెళ్లి కొంచెంసేపు నామ సప్తాహంలో పాల్గొన్నాము. తరువాత బాబా దర్శనం చేసుకుందామంటే  'కిందనుండే చేసుకోవాలి. పైకి ఎక్కి బాబాని తాకడానికి లేదు. సాయంత్రం 4 తరువాత అయితే బాబాని తాకనిస్తాము' అని అన్నారు. అయితే అదేరోజు తమ్ముడు ప్రసాద్ వాళ్ళు మమ్మల్ని డిన్నర్‍‍‍కి పిలిచారు. గుడిలో ఎక్కువసేపు ఉంటే వాళ్ళింటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందేమోనని, "బాబా! ఎలాగైనా మీ దర్శనాన్ని అనుగ్రహించు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల అందరూ వెళ్ళిపోయాక మమ్మల్ని పైకి ఎక్కనిచ్చి బాబాను తాకనిచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. తరువాత తమ్ముని వాళ్ళింటికి వెళ్లి డిన్నర్ చేసాం. మరుసటిరోజు వాళ్ళను మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి పిలిచాము. వాళ్ళు మొత్తం 12 మంది. మేము నలుగురం. అంటే మొత్తం 16 మందికి నేను భోజనాలు తయారు చేయాల్సి వచ్చింది. అంత మందికి వంట చేయటం నాకు అదే మొదటిసారి. అయినప్పటికీ బాబా దయవల్ల ఏ ఇబ్బందీ కలగలేదు. వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చారు. మావారికి కొంచం కోపం వచ్చింది కానీ బాబా దయవల్ల చాలా సంతోషంగా గడిపాము. అలా ఎప్పటినుండో ప్రసాద్ వాళ్ళ కుటుంబాన్ని లంచ్‍‍‍కి పిలవాలన్న నా కోరిక ఆ గురువారంనాడు నెరవేరింది. ఇలాగే ఎప్పుడూ మాపై దయ చూపాలని, ఇంకా ఎన్నో అనుభవాలు మీతో పంచుకోవాలని బాబాను కోరుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1368వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదిహేనవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


మా మనవడు సాయీష్ పంచెల మహోత్సవం: 2019, ఫిబ్రవరి 10వ తారీఖున శ్రీపంచమి వచ్చింది. అప్పటికి ఒక నెల రోజుల ముందు మా అమ్మాయి మాకు ఫోన్ చేసి, “సాయీష్‍కు పంచెల మహోత్సవం చేద్దామా? తాతయ్య(మా నాన్నగారు) ఎటూలేడు, అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఎప్పుడో ఫంక్షన్ చేసే బదులు అమ్మమ్మ ఉన్నప్పుడే చేస్తే మంచిదనిపిస్తోంది. శ్రీపంచమినాడు జరిపించడానికి బాబా అనుమతి ఇస్తారేమో బాబాను అడిగి ఏ విషయమూ నాకు ఫోన్ చేసి చెప్పండి" అని అంది. వెంటనే మేము బాబాను అడిగితే, ఫంక్షన్ చేయడానికి అనుమతించారు. మేము ఆ విషయం మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పి ఆ రోజే ఫంక్షన్ చేయడానికి నిర్ణయించాము. అప్పుడు, "బాబా! మాకు పెద్దగా ఏమీ తెలియదు. అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు లేరు. ఇంత త్వరగా అంటే డబ్బులు సమకూరడం కూడా కష్టమే. మొదలునుండి తుదివరకూ అన్నీ మీ దయతో సక్రమంగా జరిగేలా చూడు తండ్రి” అని బాబాకు చెప్పుకుని ఫంక్షన్‍కి సంబంధించిన పనులు మొదలుపెట్టాము. ముందుగా కార్డులు ప్రింటింగ్‍కి ఇద్దామని వెళ్ళాము. కానీ వాళ్ళు చూపే మోడల్స్ మాకు పెద్దగా నచ్చలేదు. మఖమల్ క్లాత్ మీద స్క్రీన్ ప్రింటింగ్ అయితే బాగుంటుందని, అదీకాక తాళపత్రంలా చుట్టేది కావాలని షాపుల్లో ఆడుతుంటుంటే మాకు కావాల్సిన విధంగా దొరకడం లేదు. షాపులన్నీ తిరిగి తిరిగి అలసిపోయాము. అటువంటి సమయంలో మా విద్యార్థి ఒకరు వచ్చి, ఒక షాపుకు తీసుకెళ్ళి, అన్నీ మాట్లాడి, సెటిల్ చేసి వెళ్ళిపోయాడు. ఆ విద్యార్థి రూపంలో బాబానే వచ్చి మొదటి పని పూర్తి చేసి పెట్టారని మా నమ్మకం. ఆ మోడల్ అందరికీ బాగా నచ్చింది. కొంతమందైతే వాళ్ళింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అలాంటివే వేయించాలని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. మరి బాబా ప్రసాదించిన మోడల్ కదా!


మేము ఫంక్షన్ బాబా గుడిలోనే చేయాలనుకుని, మేము తరచూ వెళ్ళే చేబ్రోలులోని బాబా గుడి అయితే బాగుంటుందనుకున్నాం. కానీ బాబాను అడిగితే, 'అక్కడ వద్ద'ని, 'గుంటూరు హౌసింగు బోర్డు కాలనీలోని సాయిబాబా గుడిలో చేయమ'ని సమాధానమిచ్చారు. సరేనని అక్కడికి వెళ్ళాము. ఆ గుడి యాజమాన్యం, "ఆ రోజుకు వేరే ఏ ఫంక్షనూ బుక్ అవలేదు. ఖాళీగానే ఉంది" అని చెప్పారు. దాంతో అతి తక్కువ ఖర్చుతో ఫంక్షన్ హాల్ మా పేరు మీద బుక్ చేసాము. గుడి తరపున టెంట్ హౌస్, లైటింగు, పనివాళ్ళు అన్ని చాలా తక్కువ ఖర్చులో కుదిరిపోయాయి. మా అమ్మాయి పెళ్ళి ఆ గుడిలోనే జరిగింది. ఇప్పుడు వాళ్ళబ్బాయి పంచెల ఫంక్షన్ కూడా అక్కడే జరగడం బాబా దయ.


ఇక డెకరేషన్ విషయానికొస్తే, గుడి తరపున వ్యక్తి మాత్రమే డెకరేషన్ చేయాలి, బయటివాళ్ళని అనుమతించమని చెప్పడంతో వాళ్ళకే ఇరవైరోజుల ముందు అడ్వాన్స్ ఇచ్చాను. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా డెకరేషన్ చేసే అతను మమ్మల్ని కలవలేదు. బాబా ఏదో కారణం వల్ల అతన్ని ఆపి ఉంటారు అనుకున్నాము. చివరికి ఫంక్షన్ రేపనగా ముందురోజు రాత్రి అతను వచ్చి, “లక్ష రూపాయలు అవుతుంది డెకరేషన్‍కి” అని అన్నాడు. “బాబోయ్.. అంతా” అనుకోని ఉరుకున్నాము. బాబా మరొకర్ని పంపించి, 35 వేల రూపాయలకే చక్కగా డెకరేషన్ చేయించారు. సాయీష్ కూర్చోవడానికి మంచి సోఫా కూడా అతను ఏర్పాటు చేసాడు. బాబా దయవల్ల గుడి కమిటీ వాళ్ళెవరూ అభ్యంతరం చెప్పలేదు.


ఇకపోతే, అందర్నీ ఫంక్షన్‍కి ఆహ్వానించే విషయం: పదవ తారీఖు ఫంక్షనైతే 5వ తారీఖున 'కార్డులిచ్చి ఆహ్వానించడానికి వెళ్ళవచ్చా?' అని బాబాను అడిగితే, 'వద్దు' అని బదులిచ్చారు. సరేనని ఆరవ తారీఖున మళ్ళీ బాబాను అడిగాము. అప్పుడూ 'వెళ్ళ వద్ద'నే సమాధానం వచ్చింది. ఏడవ తారీఖు గురువారం. ఆ రోజు వెళ్ళడానికి బాబా అనుమతిస్తారని అనుకున్నాము. కానీ ఆ రోజు కూడా బాబా అనుమతించలేదు. దాంతో బంధువులు, “ఫంక్షన్‍కింకా రెండు రోజులే ఉన్నాయి. చాలా పనులున్నాయి. అవెప్పుడు చేస్తారు? ఎప్పుడు ఆహ్వానిస్తారు?" అని అనసాగారు. కానీ మేము తొందరపడకుండా బాబా అనుమతికోసం నిరీక్షించాము. మరుసటిరోజు 8వ తారీఖున బాబా అనుమతి లభించడంతో ఉదయం 7గంటలకే బయల్దేరి ముందుగా ఫంక్షను అనుకున్న హౌసింగ్ బోర్డు కాలనీలోని బాబా మందిరానికి వెళ్ళి, మొదటి కార్డు బాబా ముందుంచి ఆయనను ఆహ్వానించాము. తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించి, పిలుపులకు వెళ్లి నాలుగు ఊళ్ళలో ఉన్న బంధువులందర్ని ఫంక్షనుకు ఆహ్వానించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము. ఏ మాత్రము అలసట అనిపించలేదు. అంతా బాబా దయ. "ధ్యాంక్యూ బాబా".


ఇకపోతే ఫంక్షనుకు వచ్చే మా అల్లుడుగారి స్నేహితులు, దూరం నుండి వచ్చే బంధువులకోసం హోటల్లో రూములు బుక్ చేయాలనుకుంటే మంచి హోటల్లో రూమ్ రెంట్ రోజుకు రూ. 4,000/- వరకూ ఉంది. పైగా అవి గుడికి బాగా దూరంగా ఉన్నాయి. పొరపాటున ఏదైనా మర్చిపోతే అంతదూరం వెళ్లాల్సి వస్తుంది. పోనీ గుడికి దగ్గరలో తీసుకుందామంటే మంచి రూమ్స్ లేవు. మరెలా అనుకుంటుండగా బాబానే పరిష్కారం చూపారు. ఎలాగంటే, గుడికి దగ్గరలో వరసకు అన్నయ్య అయ్యే ఒకతనికి ఫోన్ చేసి ఫంక్షనుకు ఆహ్వానిస్తూ మాటల మధ్యలో రూములు కావాలని చెప్తే, “ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది, ఫంక్షన్లకు మాత్రమే అద్దెకు ఇస్తారు. చాలా బాగుంటుంది. పైగా గుడికి చాలా దగ్గరలో ఉంటుంది. వచ్చి చూసి, మాట్లాడుకోండి” అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళాము. ఆ రూములు చాలా చాలా బాగున్నాయి. మేము మూడు రోజులకు కావాలంటే అద్దె సగానికి సగం తగ్గించి మరీ ఇచ్చారు. అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. బుక్ చేసుకుంది మూడు రోజులకే అయినా నాల్గవ రోజు కూడా ఇల్లు వాడుకుని, ఐదవరోజు ఖాళీ చేసాము. వాళ్ళు ఒక రూపాయి కూడా అదనంగా తీసుకోలేదు. అలా బాబా హోటల్ రూములకి బదులు తక్కువ ఖర్చులో మంచి డూప్లెక్స్ హౌస్ ఇప్పించారు. ఇదంతా బాబా దయకాక మరేమిటి?


మా ఇళ్ళల్లో ఏ ఫంక్షనైనా చలిపిండి (చలిమిడి) చేసి అందరికీ గిఫ్ట్ ప్యాక్‍లో వేసి పంచుతాము. అయితే అది చేయడం నా భార్యకు అస్సలు రాదు. ఆ విషయంలో "ఎవరిని సహాయం అడగాలి?" అని బాబాను అడిగితే ఒకరి పేరు సూచించారు. వాళ్ళకు ఫోన్ చేసి విషయం చెబితే, మామూలు బియ్యంతో చేస్తే, అంత రుచిగా ఉండదని ఆరు కేజీలు స్టోర్ బియ్యం వాళ్ళ ఇంట్లో ఉంటే పంపించారు. ఆ బియ్యం ఒక రోజంతా నానిన తర్వాత మర పట్టించాలి. కానీ చలిమిడి చేసేదెవరని నా భార్య ఆలోచిస్తుంటే, "చలిమిడి చేయటానికి ఎవర్నో ఒకర్ని పంపిస్తాలే, ధైర్యంగా నా మీద భారం వేసి బియ్యం నానబెట్టు" అని లీలగా ఆమెకు వినిపించింది. దాంతో సమయానికి బాబా ఎవరో ఒకరిని పంపిస్తారులే అనుకుని నా భార్య ధైర్యంగా ఉంది. రెండు రోజుల తర్వాత పిండి సిద్ధం చేసిన అరగంటలో ఊరి నుండి నా భార్య పిన్ని (సాయీష్ వాళ్ళ నాయనమ్మ) వచ్చింది. నిజానికి మరుసటిరోజే ఫంక్షన్ కాబట్టి ఆమె వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, వాళ్ళ ఇంట్లో తనకి కూడా ఫంక్షన్‍కి సంబంధించిన పనులుంటాయి. అలాంటిది ఆమె వచ్చి చలిపిండి తయారుచేసి వెళ్ళింది. లేకపోతే ఆ బియ్యం అంతా వృధా అయిపోయేది. నా భార్య బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. చలిమిడి చాలా రుచిగా ఉందని బంధువులు అంటే, చల్లని బాబా దయ అన్నాము మేము.


ఇక స్వీట్ విషయానికొస్తే, గిఫ్ట్ ప్యాక్‍లో చలిమిడితోపాటు ఒక స్వీటు, హాటు, తాంబూలం వేసి ఇవ్వాలి. కొన్న స్వీట్లు బాగుండవు, చేయిస్తే రుచిగా ఉంటాయి. అందువలన చేయిద్దామని అనుకున్నాము. కానీ ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి? గుంటూరా? తెనాలా? అని అనుకుంటున్న సమయంలో ఒకరోజు మేము మా ఊరికి ప్రక్కనే ఉన్న చేబ్రోలులోని బాబా గుడికి వెళ్ళి వస్తూ ఒక షాపు ముందు బండి ఆపి ఆవకాయ పచ్చడి తీసుకుందామని లోపలికి వెళ్ళాము. ఆ షాపులో ఆమె అది ప్యాక్ చేస్తూండగా అక్కడున్న లడ్డూలు చూసి, “కేజీ ఎంత?" అని అడిగింది నా భార్య. “ముందు రుచి చూడండి” అని ఆమె నా భార్య చేతిలో ఒక లడ్డు పెట్టింది. నా భార్య ఆ లడ్డు తినకుండా దాని వైపే చూస్తూ, “ ‘స్వీటు ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి?’ అని అనుకుంటున్న సమయంలో చేతిలోకి ఈ లడ్డు వచ్చిందంటే, 'ఇక్కడే ఆర్డర్ ఇవ్వమ'ని బాబా సంకల్పమై ఉంటుంది” అని అంది. దాంతో అక్కడే ఆర్డర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఎవరో తెలియకపోయినా వాళ్ళు మా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మరుసటిరోజు సాయంత్రానికల్లా లడ్డూలు రెడీ చేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా మేము వెళ్ళి తెచ్చుకోవాలనగా మా స్టూడెంట్ ఒక అబ్బాయికి ఫోన్ చేసి “ఎక్కడ ఉన్నావు?” అని అడిగితే, ఎప్పుడూ పనులతో ఊళ్ళు తిరుగుతూ ఉండే ఆ అబ్బాయి లక్కీగా “చేబ్రోలులో ఉన్నాను” అని చెప్పాడు. వెంటనే విషయం చెప్పి, “వచ్చేటప్పుడు ఆ లడ్డూలు తెస్తావా?” అని ఫలానా షాపని అడ్రసు చెప్తే, అలాగేనని తన జేబులోని డబ్బులిచ్చి, లడ్డూలు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు మేము అతనికి డబ్బులిచ్చాము. అలా బాబా ఉన్న చోటుకే ఏ ఇబ్బంది లేకుండా లడ్డూలు పంపించారు.


ఇక ఫంక్షన్‍లో పూజ చేయటానికి పూజారి కావాలని మాకు తెలిసిన నలుగురు పేర్ల మీద బాబా ముందు చీటీలు వేస్తే, వాళ్ళల్లో ఎవరినీ బాబా అనుమతించలేదు. ఇప్పుడెలా అనుకుంటుండగా బాబా గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం పూజారి గురించి తెలియడం, బాబాను అడిగితే అనుమతి ఇవ్వడం, ఆ పూజారి వచ్చి చక్కగా చేయడం జరిగింది. బాబా మందిరంలో, ఆయన సమక్షంలో మేము బాబుకు నూతన వస్త్రాలు ఇచ్చి, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూండగా అక్కడున్న బాబా విగ్రహానికి పెట్టిన ఒక గులాబీ పువ్వు జారిపడటం విశేషం. తద్వారా బాబా స్వయంగా సాయీష్‍ని ఆశీర్వదించారని అందరం ఎంతో ఆనందించాము. బాబా అనుగ్రహం వలన మా అమ్మాయి ఆయన(బాబా)కు కొత్త బట్టలు, పూలమాలలు సమర్పించుకుంది. పూజ అవ్వగానే పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మొదలవడంతో వచ్చిన అతిధులంతా హారతిలో పాల్గొన్నారు. ఆ గుడి పూజారి, “గుడి కట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలలో ఇంతమంది హారతికి హాజరవటం ఇదే మొదటిసారి” అని చాలా ఆనందంగా అన్నారు. హారతి అనంతరం బాబా ఆశీస్సులతో ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. సాయీష్‍కు పంచెల బహూకరణ జరిగాక క్రింద ఉన్న ఫంక్షను హాలులో బాబా ఫోటో వద్ద సాయీష్‍తో దీపారాధన చేయించి సోఫాలో కూర్చోపెట్టాము. తరువాత అతిథులందరూ తనని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. విశేషమేమిటంటే, మధ్యాహ్నం 12-30కి వెలిగించిన దీపాలు సాయంత్రం 6-00 గంటల వరకూ వెలుగుతూనే ఉన్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటున్నారా! ఫ్యాను ఫుల్ స్పీడులో తిరుగుతోంది మరి!


ఇకపోతే భోజనాల విషయం! మాకు క్యాటరింగ్ చేసే వాళ్ళెవరితోనూ పరిచయాలు లేవు. అందువల్ల ఆ పనిని మా తరపున బంధువుకు అప్పగిస్తే మా అల్లుడుగారి తరుపు వాళ్ళకు నచ్చుతాయో? లేదో? పేర్లు పెడతారేమో! పోనీ అల్లుడుగారి తరపు బంధువుకు అప్పగిస్తే, మా తరపువాళ్ళకు నచ్చుతాయో? లేదో? అని మేము పెద్ద సందిగ్ధంలో పడ్డాము. ఏం చేయాలో అర్ధంకాక “బాబా ఇది నీ గుడిలో, నీ ఒడిలో జరుగుతున్న వేడుక. ఆ వేడుక కోసం వండిన వంటకాలను ముందు మీరు నైవేద్యంగా స్వీకరించాక ఆ ప్రసాదం మా అందరికీ అందాలి. అది తిన్న వారందరికీ నచ్చి, సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి. ఇక క్యాటరింగ్ ఎవరికి ఇప్పిస్తారో అంతా నీ ఇష్టం” అని బాబాకి విన్నవించుకున్నాను. రెండు రోజుల తర్వాత బాబా మా స్టూడెంట్ ద్వారా 'భరత్ కుమార్' అనే అతని పేరు సూచించారు. అప్పుడు అతని అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళాము. అతని ఇంట్లోకి వెళ్ళిన మాకు, సింహాసనం మీద కాలు మీద కాలు వేసుకుని ఆశీనులై ఉన్న బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతటితో అప్పటివరకు మాకున్న సంశయాలన్నీ పటాపంచలైపోయి, 'ఇక భోజనాల విషయం బాబానే చూసుకుంటార'ని ఆయనకి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఇకపోతే, ఆ 'భరత్ కుమార్' మంచివ్యక్తి, పద్ధతైన మనిషి. అతను మాతో చాలా బాగా మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో వివరంగా చెప్పి, తయారు చేయాల్సిన వంటకాలను వ్రాసుకున్నారు. తదనుగుణంగా వంటకాలను సిద్ధం చేసి పంపించారు. అవి రాగానే మేము ఆ వంటకాలన్నిటిలో బాబా ఊదీ వేసి, బాబాకి నివేదించి, ఆ ప్రసాదాన్ని అందరికీ వడ్డించాము. ప్రతి ఒక్కరూ భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయని అన్నారు. మేము వాళ్లతో, “అంతా బాబా దయ. మాదేమీ లేదు" అని చెప్పాము. కొంతమంది వాళ్ళింట్లో ఫంక్షనుకు ఆర్డర్ ఇచ్చేందుకు భరత్ కుమార్ గారి నెంబర్ అడిగి తీసుకున్నారు. అలా బాబా భోజనాల విషయంలో ఒడ్డున పడవేశారు. ఇలా ప్రతి పనిలో బాబా మాకు టెన్షన్ లేకుండా సహాయం చేస్తూ, ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిపించారు. నూటికి నూరు శాతం అందరూ మెచ్చుకున్నారు. మేము ఇచ్చిన గిఫ్టులు కూడా అందరికీ బాగా నచ్చాయి. "కృతజ్ఞతలు బాబా".


నేను, “సాయీష్ పంచెల మహోత్సవం పూర్తయిన వెంటనే శిరిడీ వస్తాన”ని బాబాకి మొక్కుకున్నాను. అందువలన కార్యక్రమం పూర్తయిన తర్వాత నేనొక్కడినే శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నేను బయలుదేరే ముందు శిరిడీలో నాకు పరిచయమున్న ప్రసాద్‍గారికి ఫోన్ చేసి, "నేను శిరిడీ వస్తున్నాను" అని చెప్పాను. అప్పుడు అతను, “నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. అయినా మీకు ఇబ్బంది కలగకుండా చూస్తాను. మీరు శిరిడీలో దిగిన వెంటనే నాకు ఫోన్ చేయండి” అని చెప్పాడు. నేను అలాగే అని శిరిడీ వెళ్లి, అతనికి ఫోన్ చేశాను. అతను తన తమ్ముడు హరి వివరాలు చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి, “వెళ్ళి, అతనిని కలవమ"ని అన్నారు. నేను వెళ్ళి హరిగారిని కలిశాను. అతను నన్ను స్కూటరుపై తీసుకువెళ్ళి, ప్రసాదుగారి ఇంట్లో దించారు. ఆ కుటుంబం మొత్తం పెళ్లికని విజయవాడ వెళ్లి ఉన్నారు. ఆ ఇంట్లో శ్రీను అని, వారి దూరపు బంధువు మాత్రమే ఉన్నాడు. నేను నాలుగు రోజులు(మంగళ, బుధ, గురు, శుక్రవారాలు) వాళ్ళింట్లోనే ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు ఛత్రపతి శివాజీ జన్మదినం రావడం వలన  లక్ష మంది భక్తులు బాబా దర్శనం చేసుకున్నారు. ఆ ఒక్క రోజే రూము అద్దె 1500/- దాకా ఉంది. అలాంటిది నేను ప్రసాద్ గారింట్లో ఉన్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఉచితంగా పెట్టి నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను నాలుగు రోజులూ బాబా దర్శనం చేసుకున్నాను. మధ్యాహ్న హారతికి బాబా ఎదురుగా కూర్చునే భాగ్యం దక్కింది. ప్రసాదాలు, రుద్రాక్షలు, బాబా లాకెట్లు బాబా మూర్తికి, సమాధికి తాకించి తెచ్చుకున్నాను. ఔషదాలలోకెల్లా అమోఘమైన దివ్య ఔషధం బాబా ఊదీ. అవి యాభై ప్యాకెట్లు లభించాయి. డొనేషను కౌంటరు వద్ద నిల్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి 3000/- రూపాయలు డొనేషను కడితే, అతనికి పెద్ద రుమాల్ అంత బాబా తలకి కట్టే వస్త్రం ఇచ్చారు. అది చూసిన నేను డొనేషను కట్టిన తర్వాత, "నాకు కూడా బాబా వస్త్రం ఇస్తారా?" అని అడిగితే, పెద్ద టవల్ సైజు బాబా వస్త్రం ఇచ్చారు. నాకు చాలా ఆనందమేసింది. శనివారం బాబా అనుమతి, ఆశీర్వాదాలతో తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చాను. ఒక్కడినే వెళ్లినా బాబా నాకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. "ధన్యవాదాలు బాబా".


తరువాయి భాగం వచ్చేవారం... 



 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 1367వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చిన బాబా
2. సాయి కృప
3. ఆపరేషన్ అక్కరలేదని చెప్పించిన బాబా

ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. అందరూ సాయి కృపకు సదా పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి అభినందనలు. ఇంతమంది సాయి భక్తుల్ని ఒకే తాటిపై నడిపిస్తున్న మీ కృషి చాలా గొప్పది. నాపేరు గంగాభవాని. మాది విశాఖపట్నం. నేను చిన్నప్పటినుంచి బాబా భక్తురాలిని. ఆయనే నాకు అమ్మ, నాన్న, అన్నీ. నేను అప్పుడప్పుడు ఆయనతో గొడవ పడుతుంటాను. తరువాత ఆయన 'చూడు ఇందాక అరిచావుగా' అని నవ్వుతున్నట్లు కనిపిస్తారు. ఆయన అలా నన్ను బుజ్జగించడం నాకు భలే అనిపిస్తుంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. నేను సొంతింటికోసం బాబాకి ఎన్నో ప్రార్థనలు చేశాను. మొత్తానికి ఆయన దయతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాము. ఆ క్రమంలో బ్యాంక్ లోన్ వస్తే, డబ్బుకు ఇబ్బంది ఉండదని ఆ ప్రయత్నం చేసాను. ఎందుకో తెలియదుగాని రెండుసార్లు రెజెక్ట్ అయ్యింది. చాలా బాధపడ్డాను కానీ, 'ఇది కూడా బాబా దయనే. ఎప్పుడు లోన్ శాంక్షన్ అవ్వాలని ఉంటే అప్పుడు అవుతుంది' అని బాబాకే వదిలేసాను. నెలరోజుల తరువాత ఇంట్లో మా అక్క బంగారు గొలుసు పోయింది. ఎలా పోయిందో తెలియదుకాని, ఎన్నిసార్లు వెతికినా దొరకలేదు. పోలీసులు కూడా వచ్చారు. మా అక్క తన ఆర్థిక పరిస్థితుల వలన రోజూ బాబా ముందు కూర్చుని, "ఎందుకు ఇలా చేసావు?" అని ఏడుస్తుంటే మాకు దుఃఖం ఆగేది కాదు. అందుచేత నేను కూడా రోజూ బాబాను, "మా అక్క వస్తువు దొరకాలి" అని ప్రార్థిస్తుండేదాన్ని. రెండు నెలలు గడిచిన తరువాత నేను బాబా ఆజ్ఞతో శ్రీగురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయిన రోజు సాయంత్రం గుడికి వెళదామంటే ఒకటే వర్షం. అయినా మొండిగా గుడికి వెళ్లి బాబాకు మొక్కు తీర్చుకున్నాను. మరుసటిరోజు నేను బ్యాంకులో ఉండగా మా అక్క ఫోన్ చేసి, "గొలుసు దొరికింది" అని చెప్పింది. నేను సంతోషం పట్టలేక అక్కడే ఏడ్చేశాను. అదేరోజు సాయంత్రం ముందురోజు నేను గుడిలో బాబాని దర్శించిన సమయానికి బ్యాంకువాళ్ళు పోన్ చేసి, "మీకు లోన్ శాంక్షన్ అయింది. రేపు మీ అకౌంటులో డబ్బులు పడతాయి" అని చెప్పారు. అంతా బాబా దయ. ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చారు. శ్రీగురుచరిత్ర పారాయణతో నా చెడు కర్మలను తొలగించి, పని అయ్యేలా చేశారు. అదే బాబా లీల. "బాబా! నిన్ను నమ్ముకున్నవాళ్ళు ఎన్నడూ వట్టి చేతులతో వెళ్ళరు. కానీ మాకే కాస్త కంగారు ఎక్కువ. మనుషులం కదా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాదాల మీద మా నమ్మకాన్ని కోల్పోకుండా చూడండి, అంతే చాలు. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరిస్తాం. మీ దయకోసం నిరీక్షిస్తాం".


ఇంకో విషయం.. నేను రోజూ సోషల్ మీడియాలో బాబా వాక్కుకోసం చూస్తాను. అలాగే నేను ఇంటి నిర్మాణం మొదలు పెట్టడానికి ముందు 'అసలు ఎలా ఇల్లు కడతాను?' అని అనుకుంటున్న సమయంలో ఫేస్బుక్‍లో 'నువ్వు గొప్ప ధనవంతురాలివి అవుతావు. తొందరలోనే పెద్ద ఇల్లు కడతావు. మనం అక్కడ సంతోషంగా ఉందాం' అని బాబా వాక్కు వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన మాట తప్పరు కదా! నేను ఆ ఫోటోని చాలా భద్రంగా దాచుకున్నాను. అందులోని బాబా మాటలని రోజులో ఒకసారైనా తలుచుకుంటూ ఉంటాను. "బాబా! మన ఇల్లు తొందరగా పూర్తి చేయండి. మనం అక్కడ హాయిగా ఉందాము. సరేనా!". అందరూ బాబా పాదాల మీద నమ్మకం పెట్టండి చాలు. అంతా అయన చూసుకుంటారు.


రాజాధిరాజ యోగిరాజ సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయి కృప


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి. నేను మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా చిన్నబ్బాయి ఒక ప్రైవేట్ స్కూల్లో  8వ తరగతి చదువుతున్నాడు. మొదటి రెండు టర్మ్ ల ఫీజు కట్టకపోతే 2022, అక్టోబర్ నెలలో జరగనున్న పరీక్షల్లో  పిల్లాడిని కూర్చోబెట్టమని స్కూలులో చెప్పారు. నాకు ఫీజు కట్టాల్సిన భాధ్యత ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన పరీక్షల సమయం దగ్గరపడుతున్నా డబ్బు సమకూరలేదు. దాంతో నేను పిల్లాడిని పరీక్షలు వ్రాయనివ్వరని భయపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! డబ్బులు కట్టకపోయినా పరీక్షలు వ్రాయడానికి పిల్లాడికి అనుమతి ఇవ్వాలి. అలా అనుమతిస్తే మీ బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాపై భారం వేసినంతనే, ఆయన దయతో ప్రిన్సిపాల్ మనసు మార్చి, డబ్బులు కట్టకపోయినా పరీక్ష వ్రాయడానికి అనుమతినివ్వడంతో మా బాబు పరీక్షలు వ్రాసాడు. ఎంతటి సమస్య అయినా భక్తి, విశ్వాసాలతో మనస్ఫూర్తిగా బాబాను స్మరించి సహనంతో ఉంటే సమయానికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. "శతకోటి వందనాలు బాబా".


నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి, శ్రీస్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాను. అయితే కరోనా కారణంగా నేను గత మూడు సంవత్సరాలు తిరుపతి వెళ్లలేకపోయాను. కరోనా తగ్గిన తరువాత కూడా వెళ్ళడానికి కుదరక చాలా ఇబ్బందులు పడ్డాను. 'మొక్కులు తీర్చకపోతే కష్టాలు వస్తాయ'ని బాబా చెప్పిన మాట నా జీవితంలో అక్షరాలా నిజమైంది, నాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో చెప్పలేను కానీ, 'బాబా ఉండగా భయమేల?' అని కర్మను అనుభవిస్తూ బాబా దయతో ధైర్యంగా నిలబడ్డాను. అలాగే "తొందరగా మొక్కులు తీర్చుకునేలా అనుగ్రహిస్తే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయ చూపడంతో మేము 2022,సెప్టెంబర్ 30న తిరుపతి వెళ్ళాము. దసరా సమయంలో స్వామి దర్శనం అంటే మామూలా? కానీ అంత జన సందోహంలో కూడా తొందరగా స్వామి దర్శనం మాకు అయింది. అది సాయి కృపే. ఆయన అడుగడుగునా ఫోటో రూపంలో దర్శనమిస్తూ మాకు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. తరువాత సాయి కృపతో విజయదశమి రోజున విజయవాడలో శ్రీకనకదుర్గమ్మ దర్శన భాగ్యం మాకు కలిగింది. ఇకపోతే నా భార్య మ్రొక్కుకున్న దుర్గమ్మ పూజ, భవానీల పూజ కూడా సాయి కృపతో మా ఇంట్లో అద్భుతంగా జరిగింది. వీటన్నిటికీ అవసరమైన ధనం కూడా శ్రీసాయి కృపతోనే సమకూరింది. బాబా మీద భారం వేసి మనం చేయాల్సింది చేస్తే, ఆయన మనల్ని గట్టెక్కిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కోసారి సాయి పట్టించుకోవడం లేదని మనకి భయం కలుగుతుంది. కానీ అయన నామస్మరణ ఒక బ్రహ్మాస్త్రమై కొద్దిసేపట్లోనే ఆయనను మనకు రక్షణగా నిలబెడుతుంది. అయితే మనం సహనంతో ఉండాలి. అదే అయన ప్రేమకు మనల్ని దగ్గర చేస్తుంది.


ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


ఆపరేషన్ అక్కరలేదని చెప్పించిన బాబా


ప్రియమైన శ్రీసాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను శ్రీసాయినాథుని భక్తురాలిని. నా పేరు ఉషారాణి. నేను నా జీవితంలో శ్రీసాయినాథుని దయవల్ల ఎన్నో అనుభవాలు పొందాను. ఇప్పుడు ఒక అనుభవం మీతో పంచుకుంటాను. నేను చాలా నెలల నుంచి కాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎంతో మంది. వైద్యులను కలిశాను. ఎన్నో రకాల మందులు వాడాను. ఎక్స్-రేలు, MRI స్కాన్‍లు అయ్యాయి. చివరికి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ అంటే నాకు చాలా భయమేసింది. అప్పుడు నా దైవం అయిన శ్రీసాయినాథుని తలచుకుని మరో డాక్టరుని సంప్రదించాము. ఆయన అన్ని రిపోర్టులు చూసి, "ఇది వయసుతో జరిగే మార్పు వల్ల వచ్చిన సమస్య. ఇప్పట్లో ఆపరేషన్ అక్కరలేదు" అని అన్నారు. ఆయన మాటలు నాకు చాలా మనఃశాంతినిచ్చాయి. "బాబా! మీకు నా నమస్కారాలు. ఇలాగే మమ్మల్ని, మా పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండండి తండ్రి. మీ ఆశీస్సులు మాకు సదా ఉండాలి".



సాయిభక్తుల అనుభవమాలిక 1366వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో తీరిన ఆకలి - పారాయణ పూర్తి
2. హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించిన బాబా
3. బాబా దయతో అయిన ఇంటి రిజిస్ట్రేషన్

బాబా కృపతో తీరిన ఆకలి - పారాయణ పూర్తి


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపులకు నమస్కారం. నా పేరు విజయ్‍చంద్ర. మాది ఏలూరు. లోగడ శ్రీసాయి నాపై చూపిన దయను మీతో పంచుకున్నాను. అది నా పూర్వజన్మ సుకృతం వలన లభించిన బాబా అనుగ్రహమని భావిస్తున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవం పంచుకుంటున్నాను. ఈమధ్య నేను ఆఫీసు పని మీద నూజివీడు వెళ్ళాను. ఏలూరు నుండి నూజివీడు వెళ్లే దారిలో పోతురెడ్డిపల్లి దాటిన తరువాత రోడ్డుకి ఆనుకుని ఒక సాయిబాబా మందిరం ఉంది. నేను చాలాకాలం క్రితం ఆ మందిరంలో బాబా దర్శనం చేసుకున్నాను. అప్పుడు అక్కడున్న ఒక మాతృమూర్తి అకలితో ఉన్న నాకు అన్నం పెట్టింది. మేము బాబా లీలలు, మహిమలు, ఆయన చూపే దయ, ప్రేమ గురించి మాట్లాడుకుని చాలా ఆనందించాము. నాకు ఆ మందిరంలోని బాబాని, ఆయన సన్నిధిలో ఉండే ఆ మాతృమూర్తిని చూడాలనిపించి తిరుగు ప్రయాణంలో ఆ గుడికి వెళదామనుకున్నాను. నూజివీడు వెళ్లి అక్కడ పని చూసుకుని ముందుగా అనుకున్నట్లే దారిలో ఆ బాబా గుడికి వెళ్ళాను. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. గుడి తలుపులు దగ్గరగ వేసి ఉన్నాయి. ఆ మాతృమూర్తి అక్కడ కనిపించలేదు. సరే, నేను తలుపులు తీసి లోపలి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అమ్మని చూస్తే, ఆకలి గర్తుకి వస్తుంది కదా! బాబాని చూస్తూనే నాకు ఆకలేసింది. అంతే, నేను ఊరుకోకుండా, "బాబా! నాకు అన్నం కావాలి" అని వేళకానివేళలో ఆయనని ఇబ్బందిపెట్టాను. అలా బాబాని అడిగి గుడి బయట ఉన్న వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అంతలో ఒక వ్యక్తి వచ్చారు. నేను ఆయన్ని, "గతంలో ఇక్కడొక మామ్మగారు ఉండేవారు" అని ఆ మాతృమూర్తి గురించి అడిగాను. అందుకతను, "ఆమె ఇప్పుడు రావడం లేదు. నేనే ఈ గుడి వ్యవహారాలు చూస్తున్నాను" అని చెప్పి, "ఆమెతో ఏమైనా పని ఉందా?" అని అడిగారు. నేను, "లేదండీ, కొంతకాలం క్రితం బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు బాబా కృపవల్ల ఆమె నా కడుపు నిండా అన్నం పెట్టింది. కొసరికొసరి వడ్డిస్తుంటే ఆమె ప్రేమకు నేను మైమరచిపోయాను. మళ్ళీ చాలాకాలం తర్వాత ఇప్పుడే వచ్చాను. ఆమెను ఒకసారి చూడాలనిపించి అడిగాను" అని అన్నాను. అప్పుడు ఆయన, "భోజనం ఉంది. తినేసి వెళ్ళండి" అని అన్నారు. ఆ సమయంలో భోజనం ఉండడం బాబా దయకాకపోతే మరేంటి? దర్శిస్తూనే, "బాబా! అన్నం కావాలి" అని అడిగిన నా ఆకలిని తీర్చిన ఆయన దయ, ప్రేమలను మీ అందరితో ఇలా పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".


నాకు ఎంతోకాలంగా శ్రీదేవీభాగవతం పారాయణ చేయాలని కోరిక. మూడు, నాలుగు సార్లు ప్రయత్నించి 4, 5 స్కందాలు పారాయణ చేశాక ఆపేసాను. ఎందుకంటే, ఎంత ప్రయత్నించినా అంతకుమించి ముందుకు వెళ్ళలేకపోయేవాడిని. అందువల్ల, "ప్లీజ్ బాబా! శ్రీదేవీభాగవతం పారాయణ పూర్తి చేసేటట్లు చూడండి" అని బాబాను విసిగిస్తుండేవాడిని. ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళినప్పుడు శ్రీదేవీభాగవత గ్రంధం నాకు లభించింది. నిజానికి అప్పటికే నా దగ్గర ఆ పుస్తకం ఉంది. కానీ మళ్లీ లభించడంతో 'ఇప్పుడు నాకు బాబా  దివ్యాశీస్సులు లభించాయి. ఇక తిరుగులేదు. నేను పారాయణ పూర్తి చేస్తాను' అని నాకు నమ్మకం కలిగింది. అంతేకాదు, 'ఇప్పుడు పూర్తి చేస్తావు. ఇంకా ఏడుపు ముఖం పెట్టకు' అని బాబా నాతో అన్నట్టు అనిపించింది. ఆయన ఆశీస్సులు మాటలా, మజాకా! నేను ఈసారి శ్రీదేవీభాగవతం పారాయణ ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేశాను. కాదు కాదు బాబా చేయించారు. "ధన్యవాదాలు బాబా". నా మనసులో ఉన్న మరో కోరిక తీరితే మళ్ళీ నా అనుభవంతో మీ ముందుకు వస్తాను.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సద్గురు శ్రీసాయినాథుని పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తూ, ఆ తండ్రి నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు సుగుణ. మేము హైదరాబాదులో ఉంటున్నాము. మావారి పేరు రాధాకృష్ణప్రసాద్. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బాబా దయతో 4 సంవత్సరాలు క్రితం మా అమ్మాయి వివాహం జరిగింది. మా అబ్బాయికి పెళ్ళి చేద్దామనుకునే లోపల తనే మాతో మాట్లాడుతూ, తాను ఒక అమ్మాయిని ప్రేమించాననీ, తననే పెళ్ళి చేసుకుంటాననీ, పెళ్ళి విషయంలో మమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు క్షమించమనీ కోరాడు. మేము తన ఇష్టాన్ని అంగీకరించాము. అయితే, తను ప్రేమించిన అమ్మాయి ఒక క్రిస్టియన్. తను హిందూమతంలోకి మారతానని అన్నది. ఈ విషయమై మేము ఒక బ్రాహ్మణుడిని సంప్రదించగా, ‘ఒక హోమం ద్వారా ఆ అమ్మాయిని హిందువుగా మార్చటానికి వీలవుతుంద’న్నారు. ఆ హోమం ఒక నది ఒడ్డున జరగాలని చెప్పి, ధర్మపురిలో గోదావరి నది ఒడ్డున హోమం చేయాలని నిర్ణయించి, హోమానికి ముహూర్తం పెట్టారు. అయితే ఆ సమయానికి భారీవర్షాలు కురవటంతో కార్యక్రమం వాయిదాపడింది. తిరిగి రెండవసారి మళ్ళీ ముహూర్తం పెట్టారు. ఈసారి అనుకోకుండా మైల రావటంతో కార్యక్రమం మళ్ళీ వాయిదాపడింది. మూడవసారి మళ్ళీ ముహూర్తం పెట్టారు. అప్పటికే రెండుసార్లు కార్యక్రమం వాయిదాపడటంతో ఈసారి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయమేసింది. అప్పుడే నేను బాబాని తలచుకుంటూ, 'సాయి మహరాజ్ సన్నిధి'లో ప్రచురించిన సాయిభక్తుల అనుభవాలు చదివాను. వెంటనే నేను కూడా బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈసారి ఏ అడ్డంకులూ రాకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని కోరుకున్నాను. మరో 4 రోజుల పాటు భారీవర్షాలు కురవబోతున్నాయని ఆ రాత్రంతా సూచనలు వచ్చాయి. మేము మరునాడు ధర్మపురికి బయలుదేరుతామనగా ఆరోజు కూడా పెద్ద వర్షం పడింది. కానీ ఆ మరునాడు ఎండ వచ్చింది. అందరం కలిసి ధర్మపురికి బయలుదేరాము. అక్కడ విపరీతమైన ఎండ. బాబా కృపతో హోమం చక్కగా పూర్తయింది. మేము రెండు రోజులు ఉన్నామక్కడ. ఆ రెండు రోజులు హైదరాబాదులో భారీవర్షాలు కురిశాయి. ధర్మపురిలో వాన రాకుండా కాపాడి మమ్మల్ని అనుగ్రహించారు బాబా. ‘బాబాకు తమ భక్తులపై ఎంత దయ, అనుగ్రహమో!’ అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా అనుగ్రహాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించి, అలౌకిక ఆనందం పొందాను. బ్లాగులో నా అనుభవం పంచుకుంటానని బాబాకి మాట ఇచ్చాను. కాబట్టి మీ అందరితో నా అనుభవాన్ని పంచుకున్నాను. శ్రీసాయిబాబా కృపాదృష్టి మనందరి మీదా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


అనుక్షణం బాబా దృష్టిలో నేను ఉండాలని కోరుకుంటూ..  సుగుణ.


బాబా దయతో అయిన ఇంటి రిజిస్ట్రేషన్

సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర‌్వహిస‌్తున‌్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక‌్తుడిని. నా పేరు చంద్రశేఖర్. మాది పాతర‌్లగడ‌్డ(కాకినాడ రూరల్). ఈ బ‌్లాగు నిర‌్వహిస‌్తున‌్న సాయికి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు సాయి నాకు చేసిన సహాయం గురించి ఈ బ‌్లాగులో పంచుకున‌్నాను. ఇప‌్పుడు సాయి నాకు చేసిన మరో సహాయం గురించి పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళితే రిజిస్ట్రేషన్ అవ‌్వలేదు. అప‌్పటినుండీ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. చివరికి నేను, "బాబా! 2022, సెప్టెంబర్ నెలాఖరు లోపు మా స్థలం రిజిస్ట్రేషన్ అయ‌్యేలా చేస‌్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ‌్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప‌్లార‌్థించాను. మూడు నెలలుగా అవ‌్వని రిజిస్ట్రేషన్ బాబా దయవల్ల 2022, సెప‌్టెంబరు 29న ఎటువంటి ఇబ‌్బందులు లేకుండా అయింది. "ధన్యవాదాలు బాబా. దయతో నా మనస‌్సులో ఉన‌్న కోర‌్కెలు కూడా నెరవేరేలా చేయి తండ్రి".

సమర‌్థ సధ‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1365వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరుణతో చెడు అలవాటును మాన్పించి జీవితాన్ని మార్చిన బాబా
2. మనమేమీ చెప్పకపోయినా అర్థం చేసుకుని అనుగ్రహిస్తారు బాబా
3. ఎంతో దయచూపిన బాబా

కరుణతో చెడు అలవాటును మాన్పించి జీవితాన్ని మార్చిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!! సాయి భక్తులకు, ఎంతో చక్కగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు వేంకటరమణ. కొద్దిరోజుల క్రితమే బాబా కరుణ వలన నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. నేనిప్పుడు ముందుగా 2014లో సాయి నన్ను తమ దరికి రప్పించుకుని నా జీవితంలో ఎలా మార్పు తీసుకొచ్చారో మీతో పంచుకుంటాను. అప్పట్లో నేను పరిస్థితులకు లోనై తాగుడికి అలవాటుపడ్డాను. ఏ రోజుకారోజు 'రేపటి నుండి మానేద్దాం' అనుకునేవాడినిగాని నావల్ల అయ్యేదికాదు. చాలాసార్లు చేతికి కడియం వేసుకుని, ఒట్టు పెట్టుకునేవాడిని. కానీ కొద్దిరోజులకి ఆ కడియం తీసేసి పూజగదిలో పెట్టి, ఒట్టు కూడా గట్టు మీద పెట్టేసేవాడిని. నా ఆరోగ్యం, వ్యాపారం దెబ్బతిని అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా చాలా నష్టపోయాను, ఉన్న మంచి పేరు కాస్త పాడయింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యసనం నుండి బయటపడలేక నన్ను నేను తిట్టుకుంటూ ఉండేవాడిని. అటువంటి సమయంలో నేను దేవుడిచ్చిన మా బావతో(బోగలింగేశ్వర్) శిరిడీలో కడియం వేయమన్నాను. అందుకు తను సరే అన్నాడు. 2014, డిసెంబర్ 4, ఉదయం మేమంతా కలసి శిరిడీలో బాబా దర్శనానికి వెళ్లాం. నేను ఇంచుమించు 20 నిమిషాలపాటు బాబాను చూస్తూ, వారి ముందు అలాగే ఉండిపోయాను. నాతోపాటు వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారు. తరువాత నా బావ నా గురించి వెతుకుతూ మళ్ళీ వచ్చాడు. అప్పుడు నేను, "బావ, నా చేతికి కడియం వేయి" అని అన్నాను. అందుకు తను ఒప్పుకోక, "కనీసం ఆరునెలలు కడియం తీయకుండా ఉంటానంటే వేస్తాను. అప్పుడు కూడా ఇదే శిరిడీలో, బాబా సన్నిధిలో నేనే ఆ కడియం తీయాలి. ఆరునెలలు తరువాత నువ్వు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను" అని షరతు పెట్టాడు. నేను, 'సరే' అని కడియం వేయించుకున్నాను. అంతే, నా సాయినాథుని దయవలన ఇన్ని సంవత్సరాలు గడిచినా కడియం తీసే అవసరం రాలేదు. ఇక రాదు కూడా. అలా బాబా నా జీవితాన్ని మార్చేశారు. నా తండ్రి నన్ను తమ దగ్గరకి రప్పించుకుని, జ్ఞానోదయం కలిగించి నాలో ఉన్న చెడు అలవాటును మానిపించి, జీవితం అంటే ఏమిటో తెలిపారు. "ధన్యవాదాలు బాబా".


ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటాను. 2014లో నేను ఒక చిన్న మెస్ తీసుకున్నాను. ఆ మెస్‍ను నాకు అమ్మిన ఆమెను, "మీరు ఏమి చేస్తారు?" అని అడిగాను. "ఎక్కడైనా పని చేసుకుంటాను" అని అన్నారామె. నేను, "ఎక్కడో ఎందుకు? ఇక్కడే ఉండి ఈ మెస్ మీరే నడపండి. నాకు రోజుకు వేయి రూపాయలిచ్చి, మిగిలింది మీరు తీసుకోండి. కావాల్సిన సరుకుల గురించి నేనే చూసుకుంటాను" అని అన్నాను. అందుకు ఆమె సరేనని అంది. బాబా దయవలన బిజినెస్ బాగానే ఉండేది. ఆమె ఒక సంత్సరకాలం బాగా నడిపించింది. ఆపై ఆమె కొడుకు చెడు అలవాట్ల వల్ల అప్పులు తీసుకుని షాపులో డబ్బు వాడేసేది. నేను డబ్బులు అడిగితే, "బేరం లేదు సార్. ఈరోజు, రేపు" అని కాలం గడుపుతూ నాకు తెలియకుండానే మెస్ వేరే వాళ్లకు ఇచ్చింది. నేను అడిగితే, "బేరం లేదు సార్. నష్టమొస్తుంది. ఆవిడ మీకు డబ్బులు ఇస్తారు, అవి తీసుకోండి. మిగిలిన డబ్బులు నేను ఆంధ్ర యూనివర్సిటీ గేటు వద్ద బండి పెట్టి, అమ్ముకుని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను" అనింది. ఆ మెస్ అమ్మిన డబ్బులు కూడా ఇవ్వలేదు. అడిగితే, "నేను ఆవిడకు డబ్బులు బాకీ ఉన్నాను. అందుకే మెస్ ఇచ్చేసాను" అని చెప్పింది. ఆఖరికి నా డబ్బులు నాకు ఇవ్వకుండానే ఆమె ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే, ఎత్తేది కాదు, ఒకవేళ ఎప్పుడైనా ఎత్తినా ఈనెల, వచ్చేనెల అంటుండేది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2022, సెప్టెంబర్ 29, గురువారంనాడు నేను, "తండ్రీ! వాళ్ళు నా డబ్బుల గురించి ఈరోజు నాకు సమాధానం చెప్పేలా చూడండి" అని బాబాను వేడుకుని వాళ్ళకి ఫోన్ చేసాను. బాబా కరుణ వల్ల ఆమె కూతురు ఫోన్ ఎత్తి, "అంకుల్, మా పరిస్థితి బాగా లేదు. నేను నెలనెలా కొంచం కొంచం డబ్బులు పంపిస్తాను" అంటూ చెప్పింది. అంతేకాదు, అన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నవాళ్ళు సెప్టెంబర్ నెలలో 10,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 10,000 రూపాయలు పంపారు. ఇదంతా మన సాయితండ్రి మహిమ. "సాయిబాబా, సాయితండ్రీ, సాయిప్రభూ! ఇలాగే వాళ్ళు బాగుండి, నా డబ్బులు నాకు ఇచ్చేలా దీవించండి నాయనా. నేను ఆర్థికంగా, ఆరోగ్యంగా, వాప్యారపరంగా బాగుండేలా ఆశీర్వదించండి".


ఈమధ్య ఒకరోజు నాకు విపరీతంగా పంటినొప్పి వచ్చింది. ఆ రాత్రి, "బాబా! ఈ నొప్పిని తగ్గించండి" అని శ్రీసాయినాథుని వేడుకున్నాను. ఆ తండ్రి దయతో కొద్ది సమయంలోనే నొప్పి తగ్గించారు. "సాయినాథా, సాయితండ్రీ! నాకు సర్వం మీరే. నా జీవితాన్ని మార్చిన మీకు శతకోటి వందనాలు. ఈ సంవత్సరం మీ దీక్ష చేసేందుకు నాకు అవకాశం కల్పించమని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించు తండ్రి. ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కాపాడుతూ చల్లగా చూడండి సాయిదేవా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


మనమేమీ చెప్పకపోయినా అర్థం చేసుకుని అనుగ్రహిస్తారు బాబా


సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన అందమైన ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను రోజూ బాబాకు ఆహారం నివేదిస్తాను. నేను ప్రతివారం వివిధ నగరాలలోని మా ఆఫీసుకు వెళ్తుంటాను. అలా వెళ్ళినప్పుడు నేను నాతో చాక్లెట్లు తీసుకెళ్లి నా స్నేహితుల ఇంట్లో వాటిని బాబాకి నివేదిస్తుంటాను. అయితే 2022, అక్టోబర్ రెండో వారంలో నేను చాక్లెట్లు తీసుకోవడం మర్చిపోయాను. దాంతో బాబాకి నివేదించడానికి ఏమీ లేవని చాలా  బాధపడ్డాను. ఆఫీసుకి చేరేవరకు నేను అదే ఆలోచిస్తూ నాలో నేను బాధపడుతున్నాను. అయితే బాబా తమ అద్భుతంతో  నన్ను తేలికపరిచారు. అదేమిటంటే, నా సహోద్యోగి ఒకరు శిరిడీ ప్రసాదం తెచ్చి, ఆ ప్రసాదంతోపాటు ఆ ప్రసాదం ప్యాకెట్‍లో ఉన్న ఒక బాబా ఫోటోను నాకు ఇచ్చింది. నేను వాటిని తీసుకుని నా సీటు దగ్గరకి వెళ్తుండగా మరో సహోద్యోగి నన్ను పిలిచి చాక్లెట్లు ఇచ్చింది. బాబా ప్రేమకు నాకు కన్నీళ్లు వచ్చేయగా నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను. తరువాత నా డెస్క్ దగ్గరకి వెళ్లి బాబా ఫోటో ఓ చోట ఉంచి, చాక్లెట్ బాబాకు నివేదించాను. నేను పొందిన ఆనందాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మనం ఏమీ చెప్పకపోయినా బాబా అంతా అర్థం చేసుకుంటారు. ఆయన నేను బాధపడకూడదని అన్నీ ఏర్పాటు చేశారు. అందువల్ల నేను మిగిలిన రోజంతా ఎటువంటి అపరాధ భావం లేకుండా తేలికగా ఉన్నాను. "ధన్యవాదాలు బాబా".


బాబా అందరిపై తమ ఆశీస్సులు ప్రసాదించు గాక!!!

సర్వేజనా సుఖినోభవంతు!!!


ఎంతో దయచూపిన బాబా


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, మాది గుంటూరు జిల్లా. ఏడు సంవత్సరాల క్రితం మా అమ్మకి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అదేమిటంటే, ఆమె గుండె లెఫ్ట్ EF (Ejection Fraction) 35% ఉంది. అది ప్రమాదకర స్థితి. అయినప్పటికీ అమ్మ అప్పటికే వాడుతున్న కొన్ని మందుల వల్ల గుండెకు సంబంధించి మందులు వాడటానికి కుదరలేదు. అలా ఏడేళ్లు గడిచాక ఈమధ్య  2022, ఆగస్టులో నేను 3 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుని అమ్మని హాస్పిటల్‍కి తీసుకు వెళ్ళాను. నేను హాస్పటల్‍కి వెళ్ళినప్పటినుంచి నిరంతరం సాయిని, "అమ్మకు ఆపరేషన్ అవసరం లేకుండా మందులతోనే నయమవుతుందని డాక్టర్ చెప్పాలి తండ్రి" అని ప్రార్థించాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, "ఇప్పుడు EF 45% ఉంది. ఆపరేషన్ అవసరం లేదు, మందులు వాడండి, చాలు" అని చెప్పారు. సాయిబాబా నా ప్రార్ధనను ఆలకించి ఎటువంటి మందులు వాడకుండానే EF 35% నుంచి 45%కి పెంచి నా యందు ఎంతో దయను చూపించారు. "బాబా! నేను మీకు సదా కృతజ్ఞుడనై ఉంటాను. ఆలస్యంగా ఈ అనుభవం పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి". ధన్యవాదాలు సాయినాథా.



సాయిభక్తుల అనుభవమాలిక 1364వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా వెన్నంటే ఉండి కష్టం లేకుండా చూస్తున్న బాబా
2. భగవాన్ సాయిబాబా అనుగ్రహం
3. కాలి బాధను తగ్గించిన బాబా

అడుగడుగునా వెన్నంటే ఉండి కష్టం లేకుండా చూస్తున్న బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు వాణిశ్రీ. మాది శ్రీకాకుళం. ప్రస్తుతం మేము ఆఫ్రికాలో ఉంటున్నాము. నేను చాలా డిప్రెషన్‍లో ఉన్న సమయంలో ఎడారిలో ఒయాసిస్‍లా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు కనిపించి నాకు ఎంతో ఆసరాగా నిలిచింది. ఇది సాయినాథుని కృప. సాయి అంతటా ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం.


ఒకసారి నేను ట్రైన్ టికెట్ తీసుకోవటానికని వెళ్లి టికెట్ కౌంటరు వద్ద క్యూలైనులో నిలబడ్డాను. అయితే నా దగ్గర 500 రూపాయల నోటు మాత్రమే ఉంది, చిల్లర డబ్బులు అస్సలు లేవు. కౌంటరులో ఉన్న వ్యక్తి టికెటుకు సరిపడా చిల్లర ఇస్తేనే, టికెట్ ఇస్తానని అన్నారు. అవతల ట్రైన్ ఫ్లాట్‍ఫారం మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నందున నాకు ఎం చెయ్యాలో అర్ధంకాక బాబాని తలచుకుని, "బాబా! మీరే నాకు సహాయం చేయాలి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. దయచేసి నాకు సహాయం చేయండి సాయి" అని పలుమార్లు బాబాను ప్రార్ధించాను. అంతలో నా వెనుక ఒకతను, "అమ్మా! నా దగ్గర చిల్లరుంది, తీసుకో" అని చిల్లర డబ్బులిచ్చారు. అలా బాబా దయవల్ల నేను నిల్చున్న చోటు నుండి కదలకుండానే టికెట్ తీసుకుని వెళ్లి ట్రైన్ ఎక్కాను. "ధన్యవాదాలు సాయినాథా".

   

రోజూ స్కూలుకి వెళ్ళే మా బాబు హఠాత్తుగా ఒకసారి బాగా మొండికేసి స్కూలుకి వెళ్లడం మానేసాడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని స్కూలుకి పంపడం నాకు సాధ్యం  కాలేదు. అప్పుడు శ్రీసాయినాథునికి  నమస్కరించుకుని, "బాబా! బాబు స్కూలుకి వెళ్లేలా చేయి తండ్రి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ సాయినాథుడు కరుణ చూపారు. మా బాబు మనసు మార్చి స్కూలుకి వెళ్లేలా చేసారు. మా వలన కాని పని సాయినాథుని వల్ల జరిగినందుకు నేను చాలా సంతోషించాను. "థాంక్యూ సాయి".


ఒకరోజు మా బాబు సైకిల్ తొక్కడానికని వెళ్తే, అక్కడ తన సైకిల్ కనిపించలేదు. అక్కడ ఉన్న అందరినీ అడిగితే, "మాకు తెలీదు. మేము చూడలేదు" అని అన్నారు. మాకు ఏమి చేయాలో పాలుపోలేదు. అప్పుడు నేను సాయినాథుని, "సైకిల్ దొరికితే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అప్పుడు, 'అందరూ మాకు తెలీదు అంటుంటే, వాచ్మెన్ ఏమి ఎరగని వానిలా చోద్యం చూశాడ'ని గుర్తొచ్చి వెళ్లి అతనిని అడిగితే, "నేను తీయలేదు" అన్నాడు. కానీ మేము ఊరుకోక, "మా సైకిల్ ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం" అని అన్నాము. దాంతో అతను భయపడి ఎక్కడ దాచాడో అక్కడనుండి తెచ్చి మా సైకిల్ మాకు అప్పగించాడు. నేను ఆనందంతో సాయినాథునికి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


ఒకరోజు నా కన్ను ఎర్రబడిపోయి ఆ రోజంతా నేను చాలా బాధపడ్డాను. చివరికి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామం గుర్తొచ్చి పలుమార్లు పఠించాను. బాబా దయవల్ల మరుసటిరోజు నా కన్ను ఎర్రదనం తగ్గి సాధారణ స్థితికి వచ్చింది. "నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు  క్షమించండి బాబా. మీరు అడుగడుగునా మా వెన్నంటే ఉండి ఏ కష్టం కలగకుండా మమ్మల్ని  ముందుకి నడిపిస్తున్నారు తండ్రి. మీకు అనేక నమస్కారాలు".


భగవాన్ సాయిబాబా అనుగ్రహం


ముందుగా సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నాపేరు శ్రీరామ సాయి కార్తికేయ. నా వయస్సు పది సంవత్సరాలు. ఈ మధ్య సాయిబాబా నాకు ఎక్కువ అనుభవాలను ప్రసాదిస్తున్నారు. అందులో నుండి రెండు అనుభవాలు నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2022, అక్టోబర్ 9, ఆదివారం నాడు నేను నా బంధువులతో కలిసి ఆడుకుంటూ మంచం మీద పల్టీ కొట్టి పొరపాటున కింద పడిపోయాను. నా ఎడమ కన్ను క్రింద, కుడి అరచేయికి కొంచం కిందగా నేలకి గుద్దుకుంది. కన్ను దగ్గర నొప్పి తగ్గిపోయింది కానీ, చేయినొప్పి తగ్గలేదు. మా నానమ్మ తైలం రాసినప్పటికీ నొప్పి తగ్గలేదు. ఆ రాత్రి నేను, "సాయిబాబా! రేపు ఉదయానికల్లా నొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. శ్రీసాయిబాబా దయవలన ఉదయానికి నొప్పి దాదాపు తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లే నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి. మీ కృపను ఎప్పుడూ మాపై వర్షించండి తండ్రి".


2022, అక్టోబర్ 27, గురువారం రాత్రి నేను నా ముఖానికి అలొవేరా రాసుకుందామని నా కళ్ళజోడు తీసి ఓ చోట పెట్టి, అక్కడ పెట్టిన సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఆ రాత్రి, మరుసటిరోజు ఉదయం ఎంత వెతికినా ఆ కళ్ళజోడు కన్పించలేదు. నాకు ఐ సైట్(మాయొపియా) ప్రాబ్లెమ్ ఉంది. కాబట్టి కళ్ళజోడు ఉండటం నాకు అత్యంత అవసరం. కానీ ఎంత వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి కళ్ళజోడు లేకుండానే ఆరోజు బడికి వెళ్లాను. "బాబా! నా కళ్ళజోడు కనిపిస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో  పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా అక్క, "బట్టలు మడతపెడుతుంటే కళ్ళజోడు దొరికింద"ని చెప్పి నా కళ్ళజోడు నాకిచ్చింది. శ్రీసాయిని నమ్ముకున్నవారికి బాధ అక్కర్లేదు. అంతా శ్రీసాయే చూసుకుంటారు.


కాలి బాధను తగ్గించిన బాబా


సాయి భక్తులకు నమస్కారాలు. నాపేరు మణిమాల. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మా పాఠశాలలో దసరా సెలవులు ఇచ్చాక చివరి రోజున ఉపాధ్యాయులు, పిల్లలు కలిసి బతుకమ్మ ఆడాము. అందరం ఆనందంగా ఆడుకుంటుండగా నా కాలు పట్టుకుని చాలా ఇబ్బంది పడ్డాను. వాపు కూడా వచ్చింది. హాస్పిటల్‍కి వెళితే, ఏమంటారో  అని భయపడ్డాను. నాకు బాబానే సర్వస్వం. అందుచేత, "బాబా! మీ దయతో నా కాలి సమస్య తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మరునాటికి కొంచెం తగ్గి, పెద్ద బతుకమ్మ జరిగే నాటికి పూర్తిగా తగ్గిపోయింది. సాయి తమ భక్తులకు సర్వదా అండగా ఉంటారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ మనం సాయి కృపకు పాత్రులైనాము. సాయి పాదాలకు శరణు శరణు. బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo