1. శరణన్నవారి బాధలు తీరుస్తారు బాబా
2. బాబా దయవల్లే కోలుకున్న నాన్న, తగ్గిన తిమ్మిర్లు
3. బాబా చేసిన ఉపకారం
శరణన్నవారి బాధలు తీరుస్తారు బాబా
నా పేరు భాను. నేను నిజామాబాద్ నివాసిని. ఇదివరకు నేను ఈ బ్లాగులో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇటీవల మా అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య పెళ్లయ్యాక విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత అన్నయ్య, వదిన మళ్ళీ కలిసి కొంతకాలం జీవించారు. ఒక పాప పుట్టాక వదిన అన్నయ్యతో మళ్ళీ గొడవపడి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మా అమ్మ చనిపోతే ఒక్కరోజు కోసం వచ్చి వెళ్ళింది. మళ్లీ రాలేదు. అన్నయ్య రమ్మంటే, "నేను రాను. నీ కూతురికి పెళ్లిచేసేంతవరకు రాను" అని అంది. ఒక సంవత్సరం క్రిందట అన్నయ్య ఆరోగ్యం బాగాలేకపోతే నేనే హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు కూడా మా వదిన రాలేదు. రెండు నెలల క్రితం వరకు అన్నయ్యను చూసుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు. నేనే అన్నయ్యని హాస్పిటల్‍కి తీసుకుపోవడం, స్నానం చేయించడం అన్నీ చేసేదాన్ని. ఆ సమయంలో రమ్మన్నా మా వదిన రాలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు, మా అన్నయ్య చనిపోయినప్పుడు ఖర్చులు నేనే పెట్టుకున్నాను. మా వదిన మా కుటుంబ బాధ్యతలు అస్సలు తీసుకోలేదు. కానీ మా అన్నయ్య చనిపోయాక ఆస్తి కావాలని వచ్చింది. అన్నయ్య తను ఉన్నప్పుడు 'నా బాధ్యతలన్నీ నా చెల్లినే చూసుకుంటోంద'ని బ్యాంకులో నామినీగా నా పేరు ఇచ్చి ఉన్నందువల్ల అన్నయ్య చనిపోయాక ఇన్స్యూరెన్స్ రెండు లక్షలు వస్తాయి అన్నారు. కానీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలన్నారు. అందుకోసం నేను గ్రామపంచాయితీకి వెళ్తే, 'భార్యకి ఇస్తాంకానీ, సిస్టర్‌కి ఇవ్వము' అన్నారు. నేను, "మా అన్నయ్యకి, వదినకి విడాకులు అయ్యాయి. అన్నయ్య చనిపోయేవరకు ఆమె రాలేదు" అన్నా నా బాధ ఎవరూ వినిపించుకోలేదు. మరోపక్క మా వదిన 'ఇల్లు తన పేరు మీద వ్రాస్తేనే డెత్ సర్టిఫికెట్ ఇస్తాన'ని అంది. నాకు పెళ్లి కాలేదు, తల్లిదండ్రులు లేరు. ఉన్న ఒక్క ఇల్లు తనకి ఇచ్చేస్తే, నాకు నిలువ నీడ లేకుండా పోతుందని నేను చాలా బాధపడ్డాను. మా ఊరు సర్పంచ్ని సంప్రదిస్తే, అతను కూడా మా వదినకి మద్దతు ఇచ్చాడు. ఇక నేను ఏమీ చేయలేక బాబాకి వదిలేసాను. ఆయన దయచూపారు. కొన్నిరోజులు తర్వాత సర్పంచ్ నాకు ఫోన్ చేసి మా అన్నయ్య డెత్ సర్టిఫికెట్ నాకు ఇచ్చారు. అలా ఆ సమస్య తీరింది.
ఇకపోతే, నేను HDFC బ్యాంకు(ఫైనాన్సియల్ సర్వీసెస్)లో ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే డిఆర్ఏ ఎగ్జామ్ వ్రాసి పాస్ అవ్వాలి. కానీ నేను రెండుసార్లు(అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి, అన్నయ్య చనిపోయినప్పుడు ఒకసారి) ఆ ఎగ్జామ్ వ్రాసి ఫెయిల్ అయ్యాను. దాంతో కంపెనీ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం వదిలి వెళ్ళిపోమన్నారు. అందువల్ల తప్పనిసరై నేను రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. నెల రోజుల నోటిస్ పీరియడ్‍లో వేరే ఉద్యోగం కోసం నేను చాలా ప్రయత్నించాను కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. అలా 29 రోజులు గడిచిపోయాయి. ఇంకా HDFC ఉద్యోగానికి రేపే చివరి రోజు అనగా, "బాబా! నాకు వేరే ఉద్యోగం రాలేదు. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా పోతే నాకు ఆధారమేమిటి బాబా? దయచేసి నా రాజీనామా రద్దు అయి డిఆర్ఏ ఎగ్జామ్ వ్రాయడానికి మరొక్క అవకాశం వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత మా సార్ని, "ఎగ్జామ్ వ్రాయడానికి మరొక్క అవకాశం ఉంటుందేమో కనుక్కోండి సార్. నేను నా రాజీనామా క్యాన్సిల్ చేసుకుంటాను" అని రిక్వెస్ట్ చేశాను. అందుకాయన, "మూడో అవకాశం ఇవ్వరు. రేపే చివరి రోజు కదా! రాజీనామా క్యాన్సిల్ చేసుకోడానికి కూడా ఉండదు" అని అన్నారు. ఇంక నేను బాబానే శరణువేడాను. బాబా దయవల్ల రాజీనామా క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉందని ఎగ్జామ్ వ్రాయడానికి మరో అవకాశం ఇచ్చారు. దాంతో ఎగ్జామ్ వ్రాసి, పాస్ అయి అదే ఉద్యోగంలో కొనసాగుతున్నాను. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా దయవల్లే కోలుకున్న నాన్న, తగ్గిన తిమ్మిర్లు
శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!
నా పేరు మాధురి. ముందుగా సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా నాన్నగారికి 85 సంవత్సరాల వయస్సు. ఒకరోజు తెల్లవారుఝామున ఆయన బాత్రూంలో పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. బాగానే ఉన్నారనుకున్నాము కానీ, రెండురోజుల తర్వాత కళ్ల కింద బ్లడ్ క్లాట్స్ కనబడ్డాయి. డాక్టరు సీటీ స్కాన్ చేయించుకుని రమ్మన్నారు. స్కాన్ రిపోర్టును బట్టి లోపల బ్లీడింగ్ అయి బ్రెయిన్ హేమరేజ్ అయ్యిందని అన్నారు. మేము చాలా భయపడిపోయాం. డాక్టరు, "ఆ బ్లడ్ క్లాట్స్ కరగవచ్చు. లేకపోతే ఆపరేషన్ చేయాలి. ఆయన్ని కాస్త గమనిస్తూ ఉండండి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే తీసుకునిరండి" అని అన్నారు. ఏడు రోజుల తర్వాత నాన్న కుడికాలు వీక్ అయితే వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ వయసులో ఆయన ఎలా తట్టుకుంటారో అని మేము భయపడ్డాము. అప్పుడు నేను, "బాబా! నాన్న కోలుకుంటే మీ అనుగ్రహాన్ని ''సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆయన తొందరగానే కోలుకున్నారు. కానీ డిశ్చార్జ్ చేయడానికి ముందు ఆయనకి విరోచనాలు మొదలయ్యాయి. పెద్ద వయస్సు అవడం వల్ల విరోచనాలు అనేసరికి మేము మళ్ళీ భయపడిపోయాము. నేను, "బాబా! ఆయనకు విరోచనాలు తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల నాన్నకి విరోచనాలు తగ్గిపోయాయి. ఈరోజు మా నాన్నగారు కోలుకున్నారంటే అంతా బాబా దయ, కృప. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. మీ దయ అందరి మీద ఉండాలి బాబా",
ఒకసారి మావారు తన కుడికాలి పాదం ఒకపక్క తిమ్మిరిగా ఉంటుందని చెప్పారు. నాకు చాలా భయమేసి తిమ్మిరిగా ఉన్నచోట ఊదీ రాయడం మొదలుపెట్టి, "బాబా! మావారికి తిమ్మిరి తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకుని మావారిని డాక్టర్ దగ్గరకి వెళ్ళమన్నాను. సరేనని, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు, "డి మరియు బి12 లోపం వల్ల అలా తిమ్మిర్లు రావొచ్చు" అని మందులు వ్రాసిచ్చి, "తగ్గకపోతే, న్యూరాలజిస్టుని కలవండి" అని చెప్పారు. మావారు డి విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటూ రోజూ బాబా ఊదీ పాదాలకు రాస్తుంటే తిమ్మిరి తగ్గిపోయింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీ దయ ఎల్లప్పుడూ సాయి భక్తులందరిపై ఉండాలి. అలాగే బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. ఈ అనుభవం పంచుకోవడంలో ఆలస్యం జరిగినందుకు నన్ను క్షమించండి బాబా".
బాబా చేసిన ఉపకారం
నేను ఒక సాయి భక్తుడిని. ప్రప్రధమంగా నా సాయికి ప్రణామాలర్పిస్తూ ఆ తండ్రి చేసిన ఉపకారాన్ని మీ అందరితో పంచుకోవటం నా మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక స్థలాన్ని అమ్మకానికి పెడితే, దాని గురించి చాలామంది విచారించారు. ఒక వ్యక్తి ఏకంగా కొనటానికి సిద్దమయ్యాడు. కానీ కాగితాలు చూడకుండా, వచ్చి మాట్లాడకుండా అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుంటే నాకెందుకో అనుమానమొచ్చి బాబాని తలచుకుని, "బాబా! ఇది సరైన డీల్ కాకపోతే, ఏదో ఒక విధంగా మీరే ఇది జరగకుండా ఆపండి" అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత ఆ వ్యక్తి ఎందుకో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమో తెలీదుగానీ బాబా దయవల్ల గండం గడిచింది అనుకుంటున్నాను. "బాబా! ఇలాగే మీరు మమ్మల్ని కాపాడుతూ ఉండండి. ఎల్లప్పుడూ మీ దయ మా మీద ఉండాలి. మాకున్న అన్ని సమస్యలు తీరిపోవాలి. మా కుటుంబాన్ని సదా సంతోషంగా ఉంచాలి తండ్రి".
Om sairam
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Nannenduku inthala parikshistnav tandri nenu neeku em droham chesaanu ? Na jeevitam lo okka korikaina nuvvu teerchaledhu
ReplyDelete