సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

డాక్టర్ డి.ఎమ్.ముల్కీ



డాక్టర్ డి.ఎమ్.ముల్కీ ప్రఖ్యాత వైద్యుడు. అతను ప్రధానంగా బొంబాయికి చెందినవాడైనప్పటికీ ప్రభుత్వ వైద్య విభాగంలో ఉద్యోగస్థుడైనందువల్ల బదిలీ మీద ఒకచోటు నుండి ఇంకోచోటుకి మారుతూ ఎక్కువ సంవత్సరాలు బొంబాయికి వెలుపలే గడిపాడు. బొంబాయిలో ఉంటున్న అతని అన్నయ్య కొడుకు 1915వ సంవత్సరంలో బి.ఏ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనందువల్ల కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ ఆనందం ఎక్కువరోజులు నిలవలేదు. అకస్మాత్తుగా ఆ అబ్బాయి క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో మతమార్పిడి సమాజ ధిక్కారణ చర్యగా పరిగణింపబడేది. 18 సంవత్సరాల ప్రతిభావంతుడైన తమ బిడ్డ ఉజ్వలమైన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్న ఆ కుటుంబం ఈ హఠాత్ పరిణామంతో బాధల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా ముల్కీ అన్నయ్య దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండాపోయింది. అటువంటి సమయంలో అతనికి సన్నిహితుడైన కాకాసాహెబ్ దీక్షిత్ అతని కుటుంబాన్ని శిరిడీ తీసుకొని వెళ్ళాడు. బాబా దర్శనంతో, వారి ఆశీస్సులతో ముల్కీ అన్నయ్య వెంటనే కోలుకున్నాడు. వాళ్ళ జీవితాల్లో తిరిగి ప్రశాంతత చేకూరింది.

ముల్కీ అన్నగారి రెండవ కుమారుడు ఎముకలకు సంబంధించిన వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతుండేవాడు. ఎన్నోరకాల మందులు విదేశాల నుండి కూడా తెప్పించి వాడారు. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణులు వైద్యం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎందరో దేవతల దర్శనం, ఎన్నో మ్రొక్కులు.. అన్నీ వ్యర్థమయ్యాయి. చివరి ప్రయత్నంగా తల్లిదండ్రులు తమ బిడ్డను తీసుకొని శిరిడీ వెళ్లారు. వాళ్ళు బాబా ముందు సాష్టాంగపడి, “బాబా! మేము మా కొడుకు బాధను చూడలేకపోతున్నాము. ఎన్నో నివారణోపాయాలు ప్రయత్నించి విసిగిపోయాము. చివరి ప్రయత్నంగా మేము మిమ్మల్ని ఆశ్రయించాము. దయచేసి మీ చేతిని మా బిడ్డ తలపై ఉంచి ఆశీర్వదించి, తన జీవితాన్ని మాకు బహుమతిగా ఇవ్వండి” అని అభ్యర్థించారు. అప్పుడు బాబా, “ఈ మసీదును ఆశ్రయించినవారి చెడుకాలం అంతరిస్తుంది. ఈ ద్వారకామాయిలో అడుగిడినవారి జీవితనౌక సురక్షితంగా ఆవలి తీరానికి చేరుకుంటుంది. దీన్ని గుర్తుంచుకోండి, ఇక అన్ని చింతలు మరచిపోండి!” అని అన్నారు. తరువాత ఆ అబ్బాయిని తమ ముందు కూర్చుండబెట్టుకొని అతనిపై తమ కృపాదృష్టి సారించారు. తరువాత బాబా తమ చేతులతో ఊదీ తీసుకుని అతని వీపుపై పూసి, నోటిలో కొంత వేశారు. అమృతతుల్యమైన ఊదీ నోటిలో పడటంతోనే ఆ అబ్బాయి నొప్పులు మటుమాయమయ్యాయి. బాబా చూపిన కరుణకు ఆ కుటుంబమంతా ఆనందభాష్పాలతో బాబాకు కృతజ్ఞతలు అర్పించుకున్నారు. ఆ తరువాత ఆ కుటుంబం మరో నాలుగురోజులు శిరిడీలోనే బస చేసి ఆనందంగా ఇల్లు చేరారు. అప్పటినుండి వాళ్ళు తరచూ శిరిడీ వెళ్లడం, భజనలు చేయడం మొదలుపెట్టారు.

1916లో డా.ముల్కీకి బొంబాయిలోని పరేల్ వద్ద ఉన్న ప్రభుత్వ హాఫ్కిన్ ఇన్‌స్టిట్యూట్‌కి బదిలీ అయ్యింది. బొంబాయి చేరుకున్న అతను తన అన్నగారి కుటుంబాన్ని సందర్శించాడు. సహజంగా మాటల్లో తమ బిడ్డ వ్యాధి గురించి, అద్భుత నివారణ గురించిన ప్రస్తావన వచ్చింది. కుటుంబమంతా శ్రీసాయిబాబాను హృదయపూర్వకంగా కొనియాడుతూ జరిగిందంతా ముల్కీకి వివరంగా వర్ణించి చెప్పారు. సాయిబాబా గురించి వినడం ముల్కీకి అదే మొదటిసారి. అప్పటివరకు అతను బాబా ఫోటోను కూడా చూడలేదు.

అదే సంవత్సరం అక్టోబరు నెల‌లో ముల్కీ జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. అతని సహవైద్యులు తమ వంతుగా ఉత్తమ వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ కొంచెం కూడా జ్వరం తగ్గలేదు. వారం రోజులు గడిచిన తరువాత ఒక గురువారంనాటి సాయంత్రం ముల్కీ అన్నగారింట్లో సాయిపూజ, భజన జరిగింది. ఆ భజన విన్న ముల్కీకి వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో అతనికి నాస్తిక భావాలుండేవి. తమకున్న జ్ఞానం కారణంగా గురువులు మరియు అద్భుతాల వంటి గుడ్డి విశ్వాసాన్ని ఆశ్రయించడానికి వైద్యులు ఇష్టపడరు. అయితే, ఇప్పుడు గురుస్వరూపులైన సాయినాథుడు ఈ డాక్టర్ని కలవాలనుకున్నారు. బహుశా అతన్ని నాస్తిక భావాలనుండి కాపాడదలచారేమో!

నాటి రాత్రి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ముల్కీకి ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడవైన కఫ్నీ ధరించి, తలకు తెల్లనిగుడ్డ కట్టుకొని ఉన్న ఒక వృద్ధ ఫకీరు కనిపించి, “చింతించకు. నువ్వు నా దర్శనానికి వస్తానని మాట ఇస్తే నీ జ్వరం తగ్గిపోతుంది” అని అన్నారు. ముల్కీ భయపడి పెద్దగా కేక పెట్టి మేల్కొన్నాడు. ఆ కేక విని, అతనిని బిడ్డలా ఆదరించే అతని వదిన పరుగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే అతని వళ్లంతా చెమటలుపట్టి, కన్నీరు కారుస్తున్నాడు. అతను తనకు వచ్చిన కల గురించి చెప్పగా, ఆమె వెంటనే వెళ్లి ఒక అలమరాలో ఉన్న సాయిబాబా ఫోటో తెచ్చి అతనికి చూపించి, “నీ కలలో కనిపించినది వీరేనా?” అని అడిగింది.  కలలో వచ్చింది వారేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అంతటితో అతని జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ రాలేదు. పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాక ఉద్యోగానికి వెళ్లడం కూడా ప్రారంభించాడు. కానీ యువకుడైనందున నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన శిరిడీ వెళ్లాలన్న విషయం పూర్తిగా మరచిపోయాడు.

తరువాత ముల్కీ బొంబాయి నుండి పల్లెప్రాంతాలకు బదిలీ కోసం ఎంతగానో ప్రయత్నించిన మీదట నాసిక్ జిల్లాలోని మాలేగాఁవ్‌కి బదిలీ అయ్యింది. మాలేగాఁవ్‌ వెళ్లేందుకు మన్మాడ్, కోపర్‌గాఁవ్‌ల మీదుగా వెళ్ళాలి. అతను తలచుకుంటే కోపర్‌గాఁవ్‌లో దిగి శిరిడీ దర్శించవచ్చు. కానీ తన ఉద్యోగ విధులకు ప్రాధాన్యతనిచ్చి శిరిడీ ప్రయాణాన్ని వాయిదా వేశాడు. మాలేగాఁవ్‌ వెళ్ళాక పని ఒత్తిడిలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడు. దాంతో 1917 ఫిబ్రవరిలో సాయిమహిరాజ్ అతని వాగ్దానాన్ని  ఒక సంఘటన ద్వారా గుర్తుచేశారు.

మాలేగాఁవ్‌లో డాక్టర్ ముల్కీ ఒక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు, ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు కుళ్ళిన ద్రవం అతని ఎడమ కంట్లో పడింది. అతడు దానిని గుర్తించేలోపే కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నాసిక్‌లో ఉన్న సివిల్ సర్జన్ అతని కంటిని పరిశీలించి కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అది విని భీతిల్లిన ముల్కీ తన జీవితంలో మొదటిసారి బాబాను చాలా ఆర్తిగా ప్రార్థించాడు. బాబా అతని అపరాధానికి శిక్షించక దయతో అతని ప్రార్థనను మన్నించారు. వారం రోజుల్లో అతని కన్ను బాగైంది. దాంతో అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. జరిగిన సంఘటన గురించి తన అన్నగారి కుటుంబం ద్వారా బొంబాయిలో ఉంటున్న తన భార్యకు తెలియపరచి, వెంటనే బయలుదేరి మాలేగాఁవ్‌ వస్తే కలిసి శిరిడీ వెళదామని కబురుపెట్టాడు. ఆమె అలాగే వచ్చింది. అప్పుడు వాళ్లిద్దరూ ‘శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోకుండా తిరిగి బొంబాయి వెళ్లము’ అని మ్రొక్కుకున్నారు.

ఆ నెలాఖరున ఉద్యోగరీత్యా బొంబాయి తిరిగి వెళ్ళమని ముల్కీకి ఉత్తర్వులొచ్చాయి. అది తమ మ్రొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తలచి వారిద్దరూ మన్మాడ్ నుండి దోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువఝామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషనుకు చేరుకున్నారు. ముల్కీ ఫ్లాట్‌ఫారంపై నడుస్తుండగా అతనికొక దేశస్థ బ్రాహ్మణ బుకింగ్ క్లర్కు తటస్థపడ్డాడు. మాటల్లో తాము బాబా దర్శనానికి శిరిడీ వెళ్తున్నట్లు ముల్కీ అతనితో చెప్పాడు. అది వింటూనే అతను బాబాపై తిట్లవర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిదికాదని చెప్పాడు. దాంతో వాళ్ళు శిరిడీ ప్రయాణాన్ని మానుకొని వెంటనే తరువాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయారు. తరువాతకాలంలో ఆ విషయమై అతను ఎంతో బాధపడేవాడు. 

బొంబాయి వెళ్లిన నెలరోజుల తరువాత ముల్కీ వదినగారు వాళ్ళను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమని బలవంతం చేసి ఒప్పించారు. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముల్కీ దంపతులు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా నెలక్రితం మన్మాడ్ స్టేషనులో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. అది విని వాళ్ళు సిగ్గుతో తలవంచుకొని బుకింగ్ క్లర్క్ మాటలు విన్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. తరువాత నాలుగురోజులు శిరిడీలో గడిపి ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు ముల్కీ. బాబా అతనిని ఆశీర్వదించి, “జ్ఞానేశ్వరి పఠించు. నువ్వు బొంబాయి చేరుకొనేటప్పటికి పదోన్నతిపై బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన టెలిగ్రామ్ మీ ఇంట్లో టేబులుపై ఉంటుంది” అని చెప్పారు. అతను బాబాకి నమస్కరించి బొంబాయికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఇంటికి చేరేసరికి బాబా చెప్పినట్లే అతని టేబుల్ పై టెలిగ్రామ్ ఉంది. అది చూసి అతను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పదిహేను రోజుల్లో బీజాపూర్ వెళ్లి ఉద్యోగ విధుల్లో చేరాడు. అక్కడినుండి యుద్ధభూమిలో సేవ చేయడానికి వెళ్ళాడు. యుద్ధం ముగిసిన తరువాత గడగ్ చేరాడు.

బాబా కృపాశీస్సులతో ముల్కీ ప్రతి సంవత్సరం జ్ఞానేశ్వరి సప్తాహపారాయణ చేస్తుండేవాడు. నిజానికి అతను మద్రాసు రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవాడు. మెట్రిక్‌లో కన్నడం, ఆ తరువాత ఫ్రెంచ్ రెండవ భాషగా చదివాడుగానీ మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల అతనికి మరాఠీ చదవడం, వ్రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరి చదవగలిగేవాడు. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమయిందని అతని నమ్మకం.


6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  3. 🙏💐🙏 ఓం సాయిరాం

    ReplyDelete
  4. థాంక్యూ వెరీమచ్ బాబా.. మాకు మీరు అందించిన గొప్ప అనుభవాలు అయినటువంటి మీ లీలలు అద్భుతాలు మీ వరప్రసాదమ్ అన్ని.. నాకు తెలుసు శ్రీ శిరిడి సాయి నాధుని లీలలు ఆశీర్వాద బలమే సాయి దేవా మీరే కలరూ నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో .. థాంక్యూ బాబా థాంక్యూ థాంక్యూ

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo