సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 639వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. శ్రీసాయి కృపతో తగ్గిన జ్వరం
  2. బాబా దయతో ఫీజు, సర్టిఫికెట్లు వాపసు

శ్రీసాయి కృపతో తగ్గిన జ్వరం


గుంటూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ఈ బ్లాగుని నిరాటంకంగా నడుపుతున్న నిర్వాహకులకు నా నమస్కారములు. సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. శ్రీసాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ, నాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 


2020, నవంబరు నెలలో ఒకసారి నాకు జలుబు, జ్వరం వచ్చాయి. కొన్ని రోజుల తరువాత మా పాపకు కూడా జ్వరం వచ్చింది. ఆ సమయంలో మావారు క్యాంపు పనిమీద హైదరాబాదు వెళ్లివున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కూడా జ్వరం వచ్చింది. ముగ్గురికీ ఒకేసారి జ్వరం రావడంతోనూ, అందులోనూ ఇది కరోనా సమయం కావడంతోనూ మాకు చాలా భయమేసింది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా అందరం బాబా నామస్మరణ చేసుకుంటూ, నుదుటన బాబా ఊదీ పెట్టుకుని, కొద్దిగా ఊదీని మంచినీటిలో కలుపుకుని త్రాగుతూ ఉన్నాము. మా అందరికీ ఎటువంటి సమస్యా లేకుండా ఉంటే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అందరం రక్తపరీక్షలు చేయించుకున్నాము. రిపోర్టులు వచ్చాక మాకెవరికీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిసి మేమంతా ఊపిరి పీల్చుకున్నాము. మావారికి వచ్చిన జ్వరం టైఫాయిడ్ జ్వరమని చెప్పి, టైఫాయిడ్ తగ్గటానికి మందులిచ్చారు. బాబా దయవల్ల కొద్దిరోజులలోనే మావారి టైఫాయిడ్ జ్వరం తగ్గిపోయింది. అంతేకాదు, నాకు, మా పాపకు కూడా ఎటువంటి సమస్యా లేకుండా బాబా కాపాడారు. మా వెంటే ఉండి మమ్మల్నందరినీ కంటికిరెప్పలా కాపాడుతున్న బాబాకు శతకోటి కృతజ్ఞతలు.


మరొక అనుభవం:


మా పాప ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాయడానికి వెళుతూ నాకు ఫోన్ చేసి, తాను పరీక్షలకి సరిగా చదవలేదని చెప్పి ఏడ్చేసింది. తను అలా ఏడ్చేసరికి నాకూ బాధ కలిగి బాబాకు నమస్కరించుకుని, ఎటువంటి సమస్యా లేకుండా పాప చక్కగా పరీక్ష రాసేలా అనుగ్రహించమని విన్నవించున్నాను. పరీక్ష పూర్తయిన తరువాత పాప నాకు ఫోన్ చేసి తాను పరీక్ష బాగా వ్రాశానని సంతోషంగా చెప్పడంతో, బాబానే మా పాపకు తోడుగా ఉండి పరీక్ష బాగా వ్రాయించారని నా మనసుకు అర్థమై ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలానే ప్రతి పరీక్షలోనూ బాబా మా పాపకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను.


ప్రస్తుత సమస్య:


మా కుటుంబం ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నాము. మేము ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. ఇప్పుడు మేము ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామని తెలిసి అందరూ మానుండి దూరంగా, కాదు..కాదు, చాలా దూరంగా ఉంటున్నారు. అంటే, మా చుట్టూ ఉన్నవారందరూ మనిషి మంచితనం కంటే డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయామనే బాధకంటే, అందరు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటా అని మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఎన్నో సమస్యల నుండి మమ్మల్ని కాపాడిన బాబా, మా ఆర్థిక సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము. మా భారమంతా బాబా పాదాలపై వేసి, ప్రతి క్షణం మాతోనే ఉండి మమ్మల్ని నడిపిస్తూ, మా సమస్యలను పరిష్కరించమని సర్వస్య శరణాగతితో వేడుకుంటున్నాము. బాబా దయవల్ల మా సమస్యలు ఎంత త్వరగా తీరితే, అంత త్వరగా మా అనుభవాలను మరలా ఈ బ్లాగులో పంచుకుంటాను.


బాబా దయతో ఫీజు, సర్టిఫికెట్లు వాపసు

 

హైదరాబాద్ నుండి శ్రీమతి ఉష తమకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ఓం శ్రీ సాయినాథాయ నమః


సాయికుటుంబసభ్యులందరికీ నా నమస్కారములు. ‘నేను సాయిభక్తులలో ఒకరిని’ అని చెప్పుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ గ్రూపులో ప్రచురించే శ్రీసాయినాథుని దివ్యచరిత్రను, సాయిభక్తుల అనుభవాలను ప్రతిరోజూ చదవటం నాకు ఎంతో ఇష్టమైన ఒక దినచర్య. ఇప్పటికే నేను రెండుసార్లు బాబా నాపై కురిపించిన దివ్యలీలలను సాటి సాయిభక్తులతో పంచుకోవటం జరిగింది. ఇప్పుడు బాబా దయవలన కలిగిన మరో అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల ప్రవేశ పరీక్షలన్నీ వాయిదాపడటం వల్ల మా పాప భవిష్యత్తు గురించి చాలా ఆందోళనపడ్డాము. 6 నెలల ఆందోళన తరువాత చివరికి అక్టోబరు 1,2 వారాల్లో జరిగిన మొదటి కౌన్సిలింగులో మా పాపకు ఒక కాలేజీలో సీటు రావటం జరిగింది. అది మంచి కాలేజీనే, కానీ మా ఇంటికి 30 కి.మీ. దూరంలో ఉంటుంది. అయినా ఫరవాలేదని ఫీజు కట్టి, సర్టిఫికెట్లన్నీ దాఖలు చేశాము. తర్వాత కొన్ని రోజులకు రెండవ కౌన్సిలింగ్ ద్వారా మా ఇంటికి దగ్గరగా వున్న మరో మంచి కాలేజీలో తనకు సీటు వచ్చింది. దాంతో, వెంటనే మా పాపకు మొదట సీటు కేటాయించిన కాలేజీవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాము. కానీ వాళ్ళు సర్టిఫికెట్లు, ఫీజు తిరిగివ్వటానికి మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. “ఫీజు తిరిగిస్తారో లేదో, సర్టిఫికెట్లు వస్తే చాలు” అనుకుని బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఫీజు మరియు సర్టిఫికెట్లు మా చేతికి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకున్నాను. 2,3 వారాలు ఆందోళనపడినప్పటికీ బాబా దయవలన ఆ కాలేజీవాళ్ళు మా పాప సర్టిఫికెట్లు మరియు ఫీజు కూడా మాకు తిరిగిచ్చారు. ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా సర్టిఫికెట్లు, ఫీజు తిరిగివ్వటం బాబా దయకాక ఇంకోటి ఎంత మాత్రమూ కాదు. “బాబా! మీ దయ, కరుణ ఎల్లపుడూ మా అందరిమీదా ఉండేలా అనుగ్రహించండి”.


ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.



5 comments:

  1. ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Om sri sai dattatreya namaha baba amma ki manchi arogyani prasadinchu thandri pleaseeee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo