- సాయి సందేశాలు
సాయిభక్తురాలు సుజాత మరికొన్ని అనుభవాలు మనతో పంచుకుంటున్నారు:
సాయి సందేశాలు
నాకు కోవిడ్ వచ్చినప్పటి నుండి హాస్పిటల్లో, తరువాత ఇంట్లో నేను శ్రీసాయి సచ్చరిత్ర పుస్తకాన్ని నా మంచం మీదనే ఉంచుకుంటుండేదాన్ని. తద్వారా బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారనే అనుభూతి పొందుతుండేదాన్ని. అంతేకాదు, కోవిడ్‌కి చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్రీసాయిసచ్చరిత్ర, గురుచరిత్ర, నవ గురువార వ్రతం, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర, స్వామి సమర్థ చరిత్ర, దత్త పురాణము, సిద్ధమంగళ స్తోత్రము, నరసింహస్వామి అష్టకం మొదలైనవన్నీ రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేస్తుండగా ఆ సద్గురుమూర్తులు నాతోనే ఉన్నట్లు నాకు అనుభవమవుతూ ఉండేది. ఇలా నేను ఆ కష్టకాలంలో ప్రతిక్షణం ఆ సద్గురువుల కృపాదృష్టిని అనుభూతి చెందాను. ఇలా ఉండగా, అక్టోబరు చివరిలో వారం రోజుల పాటు నేను ప్రతిరోజూ బాబాను, “బాబా! రామాయణంలోని శ్లోకాలు, మహాభారతము, భాగవతము, వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల గురించి నాకు ఏమీ తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న రోజుల్లో బాలరామాయణం, భగవద్గీత చదివానుగానీ, అవి నాకు కంఠస్థం రావు. అలాగే వాటిని నిత్యజీవితానికి ఎలా అన్వయించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి బాబా!” అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అడగటమే ఆలస్యం, బాబా తమ సమాధానాన్ని ఆరోజు బ్లాగులో వచ్చిన సూక్తి ద్వారా ఇచ్చారు.
ఆ సూక్తి:
“గురువే సర్వదేవతా స్వరూపం. సాధన చతుష్టయం, ఆరు శాస్త్రాలు అక్కరలేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువును అంటిపెట్టుకుని ఉండు”.
ఆ బాబా సందేశంతో నా మనసు సమాధానపడి ఆనందంగా అనిపించింది. మనం ఎంతగా ఆ సద్గురువుకి శరణాగతి చెందుతామో అంతలా ఆయన రక్షణ మనకి లభిస్తుంది.
మరొక అనుభవం:
నేను సాయిబాబాతో ఎంతగా తాదాత్య్మం చెందుతున్నానంటే, ఈ ‘సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్’ నా జీవితంలో ఒక భాగమైపోయింది. నేను గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక సమస్యతో తీవ్ర వేదన చెందుతున్నాను. ఆ సమస్యను ఇప్పుడు చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించండి. పరిష్కారం లభించిన తర్వాత మీకు ఋజువులతో సహా ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను. ఇకపోతే అసలు విషయానికి వస్తే..
ప్రతిరోజులాగానే ఈమధ్య ఒకరోజు నేను నా సమస్య గురించి ఆలోచిస్తూ తీవ్రవేదనకు గురై, “పరిష్కారం చూపించు సాయీ” అని ప్రార్థిస్తూ మన బ్లాగ్ ఓపెన్ చేశాను. అక్కడ బాబా సందేశం: “భూమి విత్తును ధరిస్తుంది. మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన రశ్మితో వాటిని మొలకెత్తిస్తాడు. అయినా విత్తనాలు మొలకెత్తినందుకు ఇవేవీ సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవూ అలాగే చలించకూడదు. ఇంక దుఃఖమెక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి”.
అంతేకాకుండా, “ఇది నీ సొంత ఇల్లు, నేను మాత్రమే ఇక్కడ ఉంటాను. తరచుగా ఇక్కడికి వస్తూ ఉండు. సరేనా!” అన్న సందేశాన్ని కూడా ఇచ్చారు నా తండ్రి. అంటే, ఆ సందేశం ద్వారా తరచూ తమ మందిరాన్ని సందర్శించమని బాబా చెప్పారు. అది నా సొంత ఇల్లు అని అన్నారు. ఎందుకంటే నేను రోజూ ప్రార్థన చేసేటప్పుడుగానీ, అనుభవాలని పంచుకునేటప్పుడుగానీ తరచూ ‘నా తండ్రి’, ‘మన తండ్రి’ లాంటి పదాలను వాడుతాను. అంత చిన్న విషయానికి ఆయన నన్ను తన కుమార్తెగా స్వీకరించారు. నా తండ్రి నాకెంత గొప్ప వరం ఇచ్చారో చూడండి. అందుకనే నేనెప్పుడూ “బాబా! మీ దివ్యచరణాలకే సర్వస్యశరణాగతి చేసేలా నాలో భక్తి విశ్వాసాలను నిరంతరం వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను”. ఓం సాయిరామ్!
ధ్యానం చేయమని బాబా నాకు సందేశాన్ని ఇచ్చారు:
నేను ఏకాదశి, మహాపారాయణ, శ్రీగురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ, కోటిపారాయణ మొదలైన గ్రూపుల్లో సభ్యురాలిని. ఈ గ్రూపులన్నిటికన్నా ముందు నేను నా స్నేహితురాలు జి.పద్మావతి మేడం ద్వారా ‘ఓం శ్రీసాయిరామ్’ గ్రూపులో మెంబరునయ్యాను. నేను ఇలా మన తండ్రి సాయినాథుని రక్షణలో ఉన్నానంటే దానికి కారణం నా స్నేహితురాలి కుటుంబం. కనుక నేను వారికి సర్వదా ఋణపడివుంటాను. మన తండ్రి సద్గురువు కృపాకటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ ఆ కుటుంబంపై ఉండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేను పదేపదే ‘మన తండ్రి’ అని ప్రస్తావించడానికి కారణం -సాయిబాబా తమ భక్తులకే కాదు, సర్వ జీవకోటికీ తండ్రి.
ఏకాదశిరోజున నేను నా పారాయణ పూర్తిచేశాక ఒక సాయి సోదరుని కోసం వాలంటీరుగా 18-19, 20 అధ్యాయాలు పారాయణ చేశాను. తరువాతి గురువారంనాడు నా పారాయణ పూర్తిచేసి, అవసరమైతే ఎవరి తరఫునైనా వాలంటీరుగా పారాయణ చేస్తానని మా గ్రూప్ లీడర్ ఐశ్వర్య బాలాజీగారికి మెసేజ్ చేశాను. ఆవిడ “18-19, 20 అధ్యాయాలు పారాయణ చేయండి” అని మెసేజ్ చేసారు. సరేనని నేను 18-19 అధ్యాయాలు పారాయణ చేసిన తర్వాత చూస్తే, “ఆ అధ్యాయాలకి వాలంటీర్ దొరికారు” అని మెసేజ్ కనిపించింది. అంతలో ఆవిడ వేరే గ్రూపుకోసం 15, 16-17 అధ్యాయాలు పారాయణ చేయమంటే, అవి కూడా పారాయణ చేశాను. మరుసటిరోజు నిద్రలేచాక బాత్రూంకి వెళ్ళినప్పుడు, “బాబా నాతో ఏకాదశిరోజునా, గురువారంనాడూ నా చేత 18-19 అధ్యాయాలు ఎందుకు పారాయణ చేయించారు? దీని ద్వారా బాబా నాకేమి సందేశం ఇస్తున్నారు?” అని అనుకున్నాను. 18-19వ అధ్యాయములలో బాబా ఇట్లు చెప్పారు:
“నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది! ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానినలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ యాకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతోనైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును”.
ఆ సందేశాన్ని అనుసరించి బాబా నన్ను ధ్యానం చేయమని చెప్తున్నారని అర్థమైంది. “బాబా! మరి నేను ఎప్పుడూ ధ్యానం చేయలేదు కదా! నాకు మార్గం ఎలా దొరుకుతుంది?” అని నా మనసులోనే అనుకున్నాను. తర్వాత ఆరోజు మధ్యాహ్నం నా భర్త స్నేహితుడు లియో అన్నయ్య వాట్సాప్‌లో ఒక మెసేజ్ చేశారు. అదేమిటంటే, “30-10-2020 నుండి 2-11-2020 వరకు Level-2 ధ్యాన తరగతులు ZOOM యాప్ ద్వారా జరుగుతాయి” అని. ఉదయం ధ్యానం గురించి అనుకుంటే మధ్యాహ్నానికి బాబా మార్గం చూపించారని ఆశ్చర్యపోయాను. ఆరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నేను అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పుడు అన్నయ్య, “ముందు Level-1 అర్థమయితేనే Level-2 అర్థమవుతుంది. ఎందుకంటే, Level-1 లో గురూజీ సహస్రారంలో లాక్ ఓపెన్ చేస్తారు. అప్పుడే ధ్యాన ప్రక్రియ బాగా సాగుతుంది” అని చెప్పారు. అప్పుడు నేను, “అన్నయ్యా! మీ దగ్గర Level-1 వీడియోలు ఉంటే నాకు వాట్సప్‌లో షేర్ చేయండి. నేను వాటిని ఈ రాత్రికి చూసి Level-2 జాయిన్ అవుతాను. ఆ తర్వాత బాబా దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది” అని చెప్పాను. సరేనని అన్నయ్య ఆ లింకు పంపారు. కానీ మా అక్క “రాత్రి ఫోన్ చూశావంటే నేను చచ్చినంత ఒట్టు” అని ఒట్టుపెట్టుకుంది. కారణం, నేను పదిరోజుల క్రితమే కోవిడ్ నుండి బాబా దయతో క్షేమంగా బయటపడ్డాను. అందువల్ల నా ఆరోగ్యం మళ్ళీ ఎక్కడ చెడిపోతుందోనని నామీద ప్రేమతోనే అక్క అలా ఒట్టుపెట్టుకుంది. దాంతో నేను ‘సరే చూడనులే’ అని అక్కకి చెప్పి, కేవలం గ్రూపులో రిజిస్టర్ అయి, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ తీసుకెళ్లి అక్క పక్కన పెట్టి రాత్రి 10 గంటలకు పడుకున్నాను. ఆరోజు (అక్టోబరు, 30) రాత్రి 12:30కి మెలకువ వచ్చింది. మళ్ళీ ఎంతకీ నిద్రపట్టట్లేదు. ఇక లేచి గురుచరిత్ర, సాయి సచ్చరిత్రలోని కొన్ని అధ్యాయాలు, సిద్ధమంగళ స్తోత్రం 21 సార్లు పారాయణ చేసేసరికి మూడు గంటలు అయింది. అప్పుడు నిద్ర వస్తుంటే, “బాబా! నిద్రవస్తోంది. 5 గంటలకి ధ్యానం తరగతికి హాజరు కావాలి. అది మిస్ కాకుండా చూడండి” అని బాబాకు చెప్పుకుని పడుకున్నాను. బాబా నన్ను సరిగ్గా ఐదు గంటలకు మేల్కొలిపారు. అంతేకాదు, Level-1 క్లాస్ వినకపోయినా, Level-2 క్లాసుకు జాయిన్ చేసుకునేలా అనుగ్రహించారు. మొదటిసారి ధ్యానం చేసేవారు ధ్యానస్థితిలో ఎక్కువసేపు ఉండలేరు. కానీ బాబా దయవలన నేను ఆరోజు ఒక గంటసేపు ధ్యానంలో ఉండగలిగాను. అది బాబా అనుగ్రహమే. ఏకాదశి, గురువార పారాయణలలో భాగంగా నా చేత సచ్చరిత్రలోని 18-19 అధ్యాయాలు పారాయణ చేయించి, తద్వారా ధ్యానం చేయమని సందేశమివ్వడమేకాక అందుకు తగిన సహాయాన్ని అందిస్తున్న బాబాకు చాలా చాలా ధన్యవాదములు.
మరికొన్ని అనుభవాలు తరువాయి భాగంలో పంచుకుంటాను ...
Jai sairam
ReplyDeleteJai Sairam! Jai Gurudatta!
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
569 days
ReplyDeleteSairam
Om Sai ram
ReplyDeleteOm sai ram baba amma ki manchi arogyani prasadinchu thandri
ReplyDelete