సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 634వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. కోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబా
  2. సాయి ఆశీస్సులు

కోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబా

ఓం శ్రీసాయి సర్వాభీష్టప్రదాయ నమః

మనం అడిగేవి, అడగనివి అన్నీ ప్రసాదించే ప్రేమమూర్తి, మన భాగ్యంలో లేనివి కూడా ఇవ్వగల సమర్థ సద్గురువు మన సాయి. అలాంటి ఒక అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. ఈ లీల చదివిన చాలామందికి వాళ్ళ జీవితం మీద నమ్మకం వస్తుంది. ‘బాబాను అడిగితే ఏదైనా సాధ్యమే’ అనే విశ్వాసం బలపడుతుంది. అందుకు మనం సాయికి సమర్పించాల్సిన రెండు పైసల దక్షిణ - సాయి మనం అడిగింది ఖచ్చితంగా ప్రసాదిస్తారనే దృఢమైన నమ్మకం (శ్రద్ధ), బాబా ప్రసాదించేవరకు సంతోషంతో ఓపికగా ఉండటం (సబూరి). ఈ రెండు పైసల దక్షిణ సమర్పించగానే మనం అడిగింది బాబా మనకు ప్రసాదిస్తారు, మనం కోరుకున్న దానికంటే గొప్పగా.

ఇక, నా సాయి ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం గురించి చెప్తాను. నా పేరు సరిత. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. బాబా అనుగ్రహంతో నేను మహాపారాయణ కూడా చేస్తున్నాను. మహాపారాయణ ప్రారంభించాక నేను నా జీవితంలో చాలా పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాను. బాబా దయవల్ల ఒక్కొక్క సమస్య మెల్లగా పరిష్కారమవుతూ వస్తోంది. ముఖ్యంగా బాబా సన్నిధి నాకు బాగా అనుభవమవుతోంది. నేను మహాపారాయణ ప్రారంభించిన రెండు, మూడు నెలల తర్వాత ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో రెండేళ్ళలోపు వయసున్న ఒక చిన్నపిల్లాడు కనిపించాడు. వాడు ఆడుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడుకొని నిద్రపోయాడు. అంతకుముందెప్పుడూ నేను వాడిని చూడనప్పటికీ నాకెంతో చాలా చేరువగా అనిపించాడు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా తమ్ముడికి సాయి ఆశీర్వాదంతో ఒక పాప ఉంది. తను బంగారుతల్లి. మా అందరికీ తనంటే ప్రాణం. ఆ పాప తర్వాత ఇంకొక బిడ్డ కావాలి అనుకున్నాము. కానీ మా కోరిక నెరవేరలేదు. మా మరదలు ఒకసారి గర్భవతి అయింది, కానీ దురదృష్టవశాత్తూ తనకు గర్భస్రావం అయింది. దాంతో 99% ఆశలు వదిలేశాము. ఆ ఒక్కశాతం ఆశ మన సాయి మాత్రమే. కానీ, బిడ్డను ప్రసాదించమని బాబాను మేమెన్నడూ వేధించలేదు. ఏదైనా బాబా అనుగ్రహమే అని భావించి ఆ విషయాన్ని వదిలేశాము. కానీ, సాయి ప్రణాళికలు ఎప్పుడూ మన ఊహకి కూడా అందవు కదా! అదే జరిగింది.

2020, జనవరి 13వ తేదీన ఫేస్‌బుక్‌లో,“ఈ నెలాఖరుకు నువ్వు ఒక గ్రేట్ న్యూస్ వింటావు, నేను చేస్తున్నాను” అని బాబా నాకు మెసేజ్ ఇచ్చారు. అది చూసి, ‘బాబా ఏదో ఇవ్వబోతున్నారు, అది మాకు చాలా సంతోషకరమైన విషయం’ అని అనిపించింది, కానీ అదేమిటో నేను ఊహించలేకపోయాను. జనవరి 31వ తేదీన మేమంతా ఎంతో బాధపడే ఒక సంఘటన మా ఇంట్లో జరిగింది. ఆ బాధలో, “ఏదో మంచి విషయం వింటారన్నావు, ఇదేనా ఆ గొప్ప విషయం?” అని బాబాను నిలదీస్తూ ఏడ్చేశాను కూడా. మర్నాడు, అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన, నేను అంతకుముందెప్పుడో ఇద్దామని అనుకున్న కొంత డబ్బును శిరిడీ సంస్థాన్‌కి ఆన్‌లైన్‌లో పంపించాను. అదే మొదటిసారి నేను శిరిడీ సంస్థాన్‌కి ఆన్‌లైన్‌లో డబ్బు పంపించడం. డబ్బులు పంపాక వెబ్‌సైట్ లాగౌట్ చేయబోతుండగా మా తమ్ముడు ఏదో మెసేజ్ పంపినట్లు నాకు వాట్సాప్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను శిరిడీ వెబ్‌సైట్ లాగౌట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశాను. ఆ మెసేజ్ చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. అదేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా? అవును! అది, ‘మా మరదలు ప్రెగ్నెంట్’ అనే మెసేజ్. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను. ఈ శుభవార్త తెలిసి అందరం ఎంతో సంతోషించాము. ఇక్కడ మీకు ఒక సందేహం రావొచ్చు. “జనవరి నెలాఖరుకి గుడ్ న్యూస్ వింటారని సాయి అన్నారు కదా, మరి ఫిబ్రవరి ఒకటో తేదీన తెలియటమేంటి?” అని. సాయి మాటలు ఎప్పుడూ పొల్లుపోవు. మా మరదలు గర్భవతి అనే విషయం మావాళ్ళకి జనవరి 30నే తెలిసింది. కానీ, 100% ధ్రువపరచుకున్నాక మాకు చెబుదామని అనుకుని వెంటనే మా ఫ్యామిలీ డాక్టరుకి చూపించటం, డాక్టర్ మా మరదలి ప్రెగ్నెన్సీని ధ్రువపరచడం, అంతా బాగుందని చెప్పడం, కానీ మా మరదలు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం చకచకా జరిగిపోయాయి. వాళ్ళకు తోడుగా మా అమ్మ అక్కడే ఉంది. అన్ని నెలలు బాబా దయతో చాలా ప్రశాంతంగా గడిచిపోయాయి. మాకు ఏదైనా ఆందోళన ఉందంటే అది ఈ కోవిడ్ సమయంలో డెలివరీ ఎలా అని మాత్రమే. అన్నిటినీ జాగ్రత్తగా చూసే సాయితల్లి మనతో ఉండగా మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. హాస్పిటల్లో మాకు తోడుగా ఉండటానికి మా బంధువులు వచ్చారు. ఇంకా మా మరదలి స్నేహితురాలు కూడా వచ్చింది. వాళ్ళంతా ఈ క్లిష్ట సమయంలో మాకు చాలా తోడుగా ఉన్నారు. బాబానే వాళ్ళ రూపంలో వచ్చారని నా నమ్మకం.

ఇంకొక అద్భుతం కూడా చెప్పాలి. ఈ కోవిడ్ కారణంగా డెలివరీ సమయంలో హాస్పిటల్లో ఎలా ఉండాలా అని చాలా భయపడ్డాము. కానీ సాయి చాలా గొప్పగా మా భయాన్ని తీసేశారు. కోవిడ్ కేసులు ఎక్కువవడం వల్ల మావాళ్లు జాయిన్ అవటానికి రెండు రోజుల ముందునుంచి హాస్పిటల్లో పేషంట్స్‌ను చూడటం ఆపేశారు. మావాళ్ళు హాస్పిటల్లో ఉన్న 5 రోజులు అక్కడ వేరే పేషెంట్ ఒక్కరు కూడా లేరు. మావాళ్ళు డిశ్చార్జ్ అయినరోజు నుంచి మళ్లీ పేషంట్స్‌ను చూడటం ప్రారంభించారు. చూశారా, నా సాయి ప్రణాళిక! ఇది విన్న ప్రతి ఒక్కరూ, “మిమ్మల్ని దేవుడు చాలా చక్కగా ఆశీర్వదించాడు. లేకపోతే ఈ కరోనా రోజుల్లో అలా హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉండటం ఏమిటి?” అని ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ పుట్టిన బిడ్డ గురించి మీకు చెప్పలేదు కదూ! బాబా నాకు కలలో చూపించారు కదా ఒక పిల్లాడిని, ఇక వేరే చెప్పాలా అబ్బాయి పుట్టాడని. “థాంక్యూ సో మచ్ బాబా!” వాడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, వాడిని మాకు ప్రసాదించింది బాబానే కదా. నేను కోరుకునేది ఒకటే, వాడు బాబాకు మంచి భక్తుడిగా ఉండాలి అని. ఈ సమయంలో మాకు తోడుగా ఉన్నవాళ్లని కూడా బాబా ఎల్లప్పుడూ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను..

ఇంకొక్క విషయం చెప్పేసి ముగిస్తాను. ఎలాగైతే సాయిభక్తులందరం సాయిసచ్చరిత్రను, ఊదీని బాబా ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలుగా భావిస్తామో, అలాగే మహాపారాయణ కూడా మనకు బాబా ఇచ్చిన ఇంకొక గొప్ప ఆశీర్వాదం. మీరు మహాపారాయణ చేసి చూడండి, మీకే ఆ విషయం అర్థమవుతుంది. జీవితం చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇది నూటికి నూరుశాతం నిజం.

సాయిభగవానుడు అందరినీ ఆశీర్వదించుగాక!

ఓం సాయిరాం!

సాయి ఆశీస్సులు


నా పేరు పద్మ. నేను బాబా భక్తురాలిని. అయితే నేను మొదటినుండి బాబా భక్తురాలిని కాను. నేను బాబా భక్తురాలిగా మారడంలో మా అత్తగారు నాకెంతో సహాయం చేశారు. ఆమె చేసిన మేలు నేనెప్పటికీ మరువలేను. ఒకసారి ఆమె శిరిడీ వెళ్లి, అక్కడినుండి వచ్చేటప్పుడు బాబా ఊదీ, సాయి సచ్చరిత్ర గ్రంథం తీసుకొచ్చారు. వాటిని నాకు ఇస్తూ, నీటితో దీపాలు వెలిగించిన బాబా అద్భుత లీలను గురించి చెప్పారు. ఆ అద్భుతం నా మనసుకెంతగానో నచ్చింది. బాబా ఊదీ నా నుదుటన పెట్టుకుని సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. నెమ్మదిగా నేను బాబా భక్తురాలినయ్యాను. బాబా ఆశీర్వాదం వలన నేను నాలుగుసార్లు శిరిడీ సందర్శించాను. బాబా దర్శనంతో నాకెంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు నేను మోకాళ్లనొప్పులతో మంచానికి అతుక్కుపోయాను. అప్పుడు నేను కేవలం బాబా మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచాను. ఆయన ఎంతో దయతో నా మోకాళ్ల నొప్పులు తగ్గించారు. ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించారు. 33 సంవత్సరాల క్రితం కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న మా బావ/మరిదికి నయం చేశారు బాబా. ఆయన ఆశీస్సులతో అతనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా సాయి నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. ఆయన ఆశీస్సులతో నా జీవితం సంతోషంగా ఉంది. బాబా అనుగ్రహం వలన నాకు నలుగురు మనవళ్లు ఉన్నారు. వాళ్ళల్లో ఇద్దరు కవలలు. "బాబా! దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నా భర్త, కొడుకు, కుమార్తెలకు తోడుగా ఉంటూ వాళ్ళకి దీర్ఘాయువునివ్వండి బాబా".


ఓం సాయిరామ్!



5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo