సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 615వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని దయ
  2. “నేను నీతోనే ఉన్నాను. భయం వద్దు”

సాయినాథుని దయ

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నా పేరు లక్ష్మి. ఆ సాయినాథునికి నమస్కరిస్తూ, బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నా సాటి సాయిభక్తులతో పంచుకోబోతున్నాను. 

2020, అక్టోబరు నెలలో మా చిన్నబ్బాయికి ఉన్నట్టుండి విపరీతంగా తుమ్ములు మొదలయ్యాయి. కరోనా సమయంలో ఇలా జలుబు చేయటంతో చాలా భయపడ్డాము. మా అబ్బాయి ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని మా అబ్బాయి నుదుటిపై పెట్టి, కొంత ఊదీని తన నోట్లో వేశాను. తరువాత తనను డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే, ఆయన మా అబ్బాయిని పరీక్షించి, ‘ఇది జలుబు కాదు, మామూలు ఎలర్జీ’ అని చెప్పి, ఎలర్జీ తగ్గటానికి మందులిచ్చారు. అంతా బాబా దయే. తనకు అప్పుడప్పుడు తుమ్ములు వచ్చినా ఆ సాయినాథుడి దయవలన భయంలేకుండా ఉన్నాము. ఆ ఎలర్జీ కూడ ఆ బాబా కృపతో త్వరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. 

మరో అనుభవం:

కొద్దిరోజుల నుండి మా మరదలికి జ్వరం వస్తూ ఉంది. తను వయసులో పెద్దవారు కనుక ఈ కరోనా సమయంలో డాక్టర్ దగ్గరికి పోకుండా జ్వరం తగ్గడానికి క్రోసిన్ మాత్రలు వేసుకున్నారు. మాత్రలు వేసుకున్నప్పటికీ జ్వరం ఎంతకీ తగ్గకపోయేసరికి ఆన్లైన్లో డాక్టరును సంప్రదిస్తే, ఆయన మా మరదలిని కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. మేము భయపడి, ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చేలా చేయమని బాబాను ప్రార్థించి, అంతా బాబా మీదనే భారం వేసి బాబా నామమే స్మరించుకుంటూ ఉన్నాము. ఆమెకు కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వస్తే బాబా అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో తనకు కోవిడ్ పరీక్షలో నెగిటివ్ అని వచ్చింది. ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆమెకు ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. బాబా అనుగ్రహంతో అవి కూడా తొలగిపోతే ఆ అనుభవాలను కూడా మీ అందరితో పంచుకుంటాను. బాబా కరుణ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. ఈ గ్రూప్ ప్రారంభించి చక్కగా నిర్వహిస్తున్న సాయికి నా అభినందనలు.

ఓం శ్రీ సాయినాథాయ నమః

“నేను నీతోనే ఉన్నాను. భయం వద్దు”

సాయిభక్తురాలు శ్రీమతి శిరీష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ సాయిరాం! నా పేరు శిరీష. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. కొన్నిరోజుల క్రితం బాబా నాకు ప్రసాదించిన అభయాన్ని గురించి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. అక్టోబరు 14వ తేదీ సాయంత్రం నేను బాబా ముందు దీపం వెలిగించేటప్పుడు నా ఫోన్ రింగ్ అయింది. దాని సారాంశం - నా భర్తకు కరోనా సోకిందని. కానీ, నాకు భయమనిపించలేదు. బాబా దగ్గర ఉండగా ఈ వార్త తెలిసింది కాబట్టి బాబానే ఆయన ఆరోగ్యం చూసుకుంటారని, ఆయన క్షేమంగా ఉండేలా అనుగ్రహిస్తారని ధైర్యంగా ఉన్నాను. నా భర్త నాస్తికుడు. అందువల్ల, ఆయనకు బాబా ఊదీని పెట్టడంగానీ, నీళ్ళలో ఊదీ కలిపి ఇవ్వడంగానీ చేయలేను. కనుక మరుసటిరోజు ఉదయం కాఫీలో బాబా ఊదీని కలిపి ఆయనకు తెలియకుండా ఇద్దామనుకున్నాను. కానీ మరుసటిరోజు ఉదయం పనుల హడావిడిలో ఆ విషయం మర్చిపోయాను. తరువాత నేను నా డ్యూటీలో ఉండగా ఆ విషయం గుర్తుకువచ్చి బాధపడ్డాను. అప్పుడు ‘సాయి మహరాజ్ సన్నిధి’ ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ చూశాను. అందులో, “నేను నీతోనే ఉన్నాను. భయం వద్దు” అన్న బాబా సందేశం ఉంది.
బాబా నన్ను భయపడవద్దని సందేశమిచ్చినప్పటికీ నాకు బాధగానే ఉంది. ఎందుకంటే, ఆరోజు నా భర్త హాస్పిటల్లో అడ్మిట్ అవుదామనుకున్నారు. ఇక ఆయనకు బాబా ఊదీని ఇవ్వలేనని అనుకున్నాను. అదేరోజు సాయిభక్తుల అనుభవాలు పాతవి మన బ్లాగులో పునఃప్రచురించారు. అందులో నా పేరే ఉన్న ఒకావిడ, “మా పాపకు జ్వరం వస్తే బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఇద్దామనుకుని మర్చిపోయాను, కానీ బాబా మా పాప జ్వరాన్ని తగ్గించారు” అని రాశారు. ఈ పోస్ట్ ద్వారా నన్ను భయపడవద్దని బాబానే స్వయంగా చెప్తున్నారనిపించింది. ఎంతో సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మనకు కలిగే ప్రతి భయానికీ బాబా ఏదో ఒక రూపంలో సమాధానం ఇస్తున్నారని అనిపించింది. ఈ అనుభవాన్ని ఆరోజే మీతో పంచుకుందామని ఎన్నిసార్లు మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. నా భర్త హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మీతో పంచుకోవాలని బాబా అనుకుంటున్నారేమోనని ఇన్ని రోజులూ ఆగి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా భర్త ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అక్టోబరు 15న “నేనుండగా నీకు భయమేల?” అని పోస్ట్ చూశానని చెప్పాను కదా! ఆరోజే నేను కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను. నాకు నెగిటివ్ అని వచ్చింది. “Thank you Baba for being with me all the time and guide me about what is right and what is wrong (ఎప్పుడూ నాకు తోడుగా ఉంటున్నందుకు మరియు ఏది మంచో, ఏదో చెడో మార్గనిర్ధేశం చేస్తుందుకు ధన్యవాదాలు బాబా)”


7 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo