సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 635వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన అనుభవాలు
  2. ప్రతి చిన్న ఇబ్బందినీ ప్రేమతో అధిగమింపజేస్తున్న బాబా
  3. సాయి కృప - మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

బాబా ప్రసాదించిన అనుభవాలు


సాయిభక్తుడు బెహరా ఛత్రపతి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం! సాయి అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఈమధ్య పరీక్షల కోసం కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది. బాబా దయవల్ల పరీక్షలు బాగా జరిగాయి. కానీ ఆ మరుసటిరోజు మా బ్యాచ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసి నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ స్థితిలో నేను సాయినే నమ్ముకుని, "ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడితే మీకు నైవేద్యం సమర్పించుకుంటాను. ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత ఇంట్లో అందరికీ దూరంగా ఉంటూ, సాయి ఊదీని నీళ్లలో కలిపి త్రాగుతుండేవాడిని. చివరిగా కరోనా పరీక్ష చేయించుకుంటే, బాబా అనుగ్రహం వల్ల 'నెగెటివ్' వచ్చింది. బాబా కృపతో ఏ చింతా లేకుండా ఆ కష్టం నుండి బయటపడ్డాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

 

ఇంకో ముఖ్య విషయం:


రెండు నెలల క్రితం నాకొక స్వప్నం వచ్చింది. ఆ కలలో నేను సాయిబాబా మందిరానికి వెళ్ళాను. పక్కనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అక్కడ దత్తస్వరూపులైన వాసుదేవానందస్వామి నాకు ఆంజనేయస్వామి తాయెత్తు ఇచ్చారు. తరువాత 10 రోజులకు శ్రీపాద శ్రీవల్లభస్వామి చరితామృతం గురించి నాకు తెలిసింది. అందులో 45వ అధ్యాయంలో ఆంజనేయస్వామిని శ్రీపాదులవారు సాయిబాబాగా అవతరించమని చెప్పినట్లు ఉంది. (ఆ పేజీలను ఈ క్రింద జతపరుస్తున్నాను.) అది చదివాక, నాకొచ్చిన కల ద్వారా సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని సందేశమిచ్చారని గ్రహించాను. అద్భుతమైన ఆ స్వప్నం ఇంకా నా కళ్ళముందే కదలాడుతున్నట్లు ఉంది.


ఓం సాయిరామ్!


ప్రతి చిన్న ఇబ్బందినీ ప్రేమతో అధిగమింపజేస్తున్న బాబా


అందరికీ నమస్తే! నా పేరు అంజలి. నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేను సాయినే ఆశ్రయిస్తాను. ఆయన నా ప్రతి కష్టాన్నీ ఇట్టే పరిష్కరిస్తూ నాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎన్నో అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నాను. నా విధులననుసరించి నేను ప్రతి నెలా ఆఫీసు ల్యాప్‌టాప్‌లో రీడింగ్స్ తీయాలి. డిసెంబరు 1న ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. ల్యాప్‌టాప్‌లో మీటర్ రీడింగులు వస్తున్నాయి. ఇంతలో ప్రెస్ వాళ్లమంటూ ఒక నలుగురు మా ఆఫీసుకి వచ్చి, ఏదో మీటింగ్ కోసం డబ్బులు ఇమ్మని అడిగారు. అంతకుముందు కూడా వాళ్ళు అలాగే వచ్చారు. అప్పుడు నాకు తెలియక నేను వాళ్ళకి డబ్బులిచ్చాను. వాళ్ళు మరలా వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఇవ్వనంటే వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమోనని నాకు భయమేసింది. వెంటనే బాబాను తలుచుకుని, "బాబా! వాళ్ళు ఏ గొడవా చేయకుండా వెళ్ళిపోవాలి" అని చెప్పుకున్నాను. తరువాత వాళ్ళతో, "మీకు డబ్బులు ఇవ్వటం కుదరదు. మొదటిసారంటే ఏదో ఇచ్చాను కానీ, ఇప్పుడు ఇవ్వలేను. నాకు జీతం తప్ప అదనంగా డబ్బులేమీ రావు. కాబట్టి దయచేసి వెళ్లిపోండి" అని చెప్పాను. వాళ్ళు కొంచెంసేపు ఉండి వెళ్లిపోయారు. అంతా బాబా దయ. ఆయన కృపవలన వాళ్ళు ఏ గొడవా చేయకుండా వెళ్లిపోయారు


ఇకపోతే, నేను అప్పటికే రీడింగులు తీస్తున్న పని విషయానికి వస్తే, ఒక మీటర్ రీడింగ్ మధ్యలో ఆగిపోయింది. నేను ఎంత ప్రయత్నించినా రీడింగ్ రాలేదు. ఇక చివరిగా బాబాను తలచుకుని,  "బాబా! ఎలాగైనా రీడింగ్ వచ్చేలా చేయండి" అని ఆయనకు శరణువేడాను. అంతే! మిరాకిల్ జరిగినట్లు మరుక్షణంలో ఆ మీటర్ రీడింగ్ రావటం మొదలైంది. 'బాబా దయ' అనుకుని ఆనందంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మరి కొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


జై సాయిరామ్!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి కృప - మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయి శరణం. ఓం శ్రీ సాయిరామ్. సాయిభక్తులందరికీ ప్రణామాలు. సాయిని దృఢంగా విశ్వసించే లక్షలాదిమంది భక్తులలో నేను ఒకడిని. ఇంటర్నెట్లో భక్తుల అనుభవాలు చదవకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ఎవరు సాయిని పిలిచినా మరుక్షణంలో ఆయన వారిచెంత ఉంటారు. నేను ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నా భార్యకు 47 సంవత్సరాల వయస్సు. ఈమధ్య తనకి రెండు నెలలపాటు నెలసరి రాలేదు. అదివరకు ఒకసారి మా ఫ్యామిలి డాక్టరుని సంప్రదించినప్పుడు, లక్షణాలను బట్టి నా భార్యకి మెనోపాజ్ దశ తొందరగా ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. అయితే అంతకుముందెప్పుడూ రెండు నెలలపాటు నెలసరి తప్పిపోలేదు. అందువలన ఇప్పుడా సమస్య కారణంగా నా భార్య చాలా ఆందోళన చెందసాగింది. కానీ ఈ కరోనా సమయంలో డాక్టరు వద్దకు వెళ్లడానికి భయపడింది. తను త్వరలో నెలసరి వస్తుందని భావించినప్పటికీ చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండేది. అటువంటి కష్ట సమయాల్లో మనం మన రక్షకుడైన సాయిని తప్ప ఇంకెవరిని ఆశ్రయిస్తాము? మేము హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించాము. నేను, "బాబా! తనని జాగ్రత్తగా చూసుకోండి. మానసిక ఒత్తిడి నుండి తనకి ఉపశమనం ప్రసాదించండి" అని బాబాని వేడుకున్నాను. తరువాత మేము క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబాని అడిగితే, “విశ్వాసం కలిగి ఉండండి, ఓపికపట్టండి, త్వరలో అంతా బాగుంటుంది" అని వచ్చింది. దాంతో మేము, "మాకు ఇంకేమి కావాలి దేవా? మీ మాటలు మాకు భరోసా నిచ్చాయి" అని అనుకుని మా చింతను బాబా పాదకమలాల వద్ద సమర్పించి మా రోజువారీ పనులలో మునిగిపోయాము. బాబా ఎవ్వరినీ నిరాశపరచరు. ఆయన సర్వశక్తిమంతుడనని, మన రక్షకుడనని నిరూపిస్తారు. ఆయన కృపతో నా భార్యకు నెలసరి వచ్చింది. దాంతో ఆమె చాలా ఉపశమనం పొంది, మహదానందంగా ఉంది. "ధన్యవాదాలు దేవా! మీరెప్పుడూ మాకోసం ఉన్నారు. దయచేసి ఈ మహమ్మారి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించండి. ప్రజల మనస్సులోని వేదనను, గందరగోళాన్ని తొలగించండి. త్వరలోనే ఈ ప్రపంచాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురండి".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.



7 comments:

  1. Very nice sai leelas. Sai baba helped in my health. My thanks to saimaa. Like that you take care of my son,, daughter, husband. We keep faith on you

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  6. Baba pleaseeee rakshinchu thandri amma ki infection tiseyi sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo