సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 616వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, పిలిచిన వెంటనే పలికే దైవం సాయినాథుడు
  2. అనుగ్రహించిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, పిలిచిన వెంటనే పలికే దైవం సాయినాథుడు

సాయిభక్తురాలు శ్రీవల్లి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా ఈ బ్లాగుని ప్రారంభించిన సాయికి నా నమస్కారాలు. ఇందులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే బాబాపై నాకున్న నమ్మకం, భక్తి రెట్టింపవుతున్నాయి. ఇక నా విషయానికి వస్తే.. 

నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుండి బాబాకు భక్తురాలిని. బాబా పేరు తలవనిదే నాకు నిమిషం కూడా గడవదు. ఏది వచ్చినా బాబాకు చెప్పుకుంటూ ఆయననే స్మరించుకుంటూ ఉంటాను. అన్నివేళలా ‘నేను ఉన్నాను’ అంటూ నా వెనుకనే ఉండి నన్ను నడిపిస్తూ, నా జీవితంలోని ఒడిదుడుకులను సరిచేస్తూ, నా తప్పులను ఒప్పులుగా చూపిస్తూ బాబా నన్ను కాపాడుతూ వచ్చారు. దానికి బాబాకు చాలా ఋణపడివుంటాను. చెప్పాలంటే బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోనుండి ఈమధ్య కలిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. ఆయనకు కాస్త ఆరోగ్యం బాగలేకపోయినా వెంటనే బాబాను స్మరించుకుంటూ ఆ ఆందోళన తగ్గేవరకు నేను అలాగే ఉంటాను. అలాగే బాబా కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రోజూ మాట్లాడుతున్నట్లే అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. మాటల మధ్యలో, “నాన్నగారు ఈమధ్య సరిగ్గా భోజనం చేయడం లేదు, ఆయనకు ఏదీ సహించడం లేదు” అని అమ్మ చెప్పింది. నేను ఈ విషయాన్ని తేలికగానే తీసుకున్నప్పటికీ నాన్నగారి ఆరోగ్యం గురించి బాబాను స్మరించుకుంటూనే ఉన్నాను. మూడు రోజుల తరువాత ఎప్పటిలాగే అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ గొంతులో కొంచెం ఆందోళన వినిపిస్తోంది. ఏమైందని అడిగితే, “ఈరోజు ఉదయం నుండి నాన్నగారు ఏమీ తినలేదు. హాస్పిటల్కి తీసుకెళదామంటే ఈ కోవిడ్ సమయంలో ఎక్కడికీ రానని అంటున్నారు” అని చెప్పింది. నేను చాలా కంగారుపడ్డాను. నాన్నగారు భోజనం చేయకుండా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. “నాన్నగారితో మాట్లాడతాను, ఫోన్ ఆయనకివ్వమ”న్నాను. నాన్నగారు చాలా నీరసంగా మాట్లాడారు. తరువాత నేను అమ్మతో మాట్లాడుతూ, “నాన్నగారు చెప్పింది నిజమే! ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎక్కడికి వెళతారు? నాన్నగారికి దిష్టి తీసెయ్యి, తాయెత్తు కూడా కట్టించు” అన్నాను. అవన్నీ చేశానన్నది అమ్మ. ఆ రాత్రి నేను నిద్రపోలేదు, బాబాను నిద్రపోనివ్వలేదు. “నీదే భారం బాబా, రేపు సాయంత్రానికల్లా నాన్నగారి ఆరోగ్యం బాగుంటే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవడంతో పాటు సప్తాహపారాయణ చేస్తాను” అని బాబాకు మ్రొక్కుకుంటూ ఉన్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, పిలిచిన వెంటనే పలికే దైవమైన నా సాయినాథుడు నా మొర ఆలకించారు. మరుసటిరోజు ఉదయాన్నే ఫోన్లో నాన్నగారి గొంతు విని ఆశ్చర్యపోయాను. ఆయన గొంతు చాలా హుషారుగా ఉంది. అసలు ఏ మాత్రం నీరసం లేదు. “ఏమి చేశావు నాన్నా? నువ్వు ఏమీ తినడం లేదు కదా, గ్యాస్ట్రిక్ సమస్యతో రాత్రి ఏమైనా ఇబ్బందిపడ్డావా?” అని అడిగితే, “ఏ సమస్యా లేదమ్మా, బాబా దయవల్ల చక్కగా నిద్రపట్టింది. పొట్టలో కూడా ఇప్పుడు కొంచెం పరవాలేదు” అన్నారాయన. నాన్నగారు చెప్పింది విని ఎంతో ఆనందించాను. “థాంక్యూ బాబా! లవ్ యూ సో మచ్! నాకున్న రెండు సమస్యల గురించి మిమ్మల్ని ఎప్పటినుండో అడుగుతున్నాను, వాటిని కూడా నెరవేర్చండి బాబా!”

మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

అనుగ్రహించిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఇటీవల మా వదినగారి భర్తకు బాగా జలుబు, దగ్గు వచ్చాయి. ఆయన పనిచేసే ఆఫీసులోని కొందరు సహోద్యోగులకు కోవిడ్ పాజిటివ్ ఉండటంతో, ఆయనకు కూడా కోవిడ్ సోకివుంటుందేమోనని మా అత్తగారు బాగా భయపడ్డారు. అప్పుడు మా అత్తగారు బాబాకు నమస్కరించుకుని, ఆయనకు కోవిడ్ సోకకుండా ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నారు. కోవిడ్ పరీక్షలో ఆయనకు నెగిటివ్ వస్తే తన అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని, అలాగే స్తవనమంజరి రోజుకు ఒకసారి చొప్పున 11 రోజులు పారాయణ చేస్తానని మా అత్తగారు బాబాకు మ్రొక్కుకున్నారు. తరువాత ఆయన కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. బాబా దయవల్ల ఆయనకు నెగిటివ్ వచ్చింది. మా అత్తగారు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని తన పారాయణ మ్రొక్కును తీర్చుకున్నారు. మా అత్తగారి తరఫున ఇప్పుడిలా మీతో ఆ అనుభవాన్ని పంచుకుంటున్నాను. “కాస్త ఆలస్యంగా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు క్షమించండి బాబా! త్వరగా ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి అందరినీ కాపాడండి బాబా!”


6 comments:

  1. Please bless my hubby and children with long life

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba pilluste palike dyvam nuvvu thandri please baba ma mother health problem cure cheyi thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo