శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
భక్తవత్సలుడైన శ్రీసాయిబాబా తన అనుంగుభక్తులను వారి మామూలు పేర్లతో గాక, తాను మాత్రమే పిలిచే ముద్దుపేర్లతో ప్రేమగా పిలుచుకునేవారు. చాలా సందర్భాలలో ఆ పేర్లకు గల అర్థాలు, అలా పిలవడానికి గల కారణాలు మనకు తెలిసినా, కొందరి విషయంలో మాత్రం కారణం అనూహ్యంగా ఉండేది. బాబా తన భక్తులకు పెట్టిన ముద్దుపేర్లలో కొన్నింటిని ఇక్కడ ముచ్చటించుకుందాం.
బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడుగా చెప్పబడే 'షామా' అసలు పేరు - శ్రీ మాధవరావు దేశ్‌పాండే. 'షామా' అన్నది అతనికి బాబా పెట్టిన ముద్దుపేరు. 'శ్యామా' అన్న నామానికి వ్యవహార రూపమే 'షామా'. శ్రీమాధవరావును బాబా “శ్యామా” అనీ, “భఠాచా షామా” అనీ ఎందుకు వ్యవహరించేవారో అన్న దానికి సరైన కారణం తెలియడం లేదు. అతడు తన పూర్వజన్మలో బృందావనంలో శ్రీకృష్ణుని చెలికాళ్ళలో ఒకడైన శ్యాముడనీ, అందుకే బాబా అతడిని ఆ పూర్వజన్మ నామంతో పిలిచేవారనీ కొందరి భక్తుల విశ్వాసం. ఐతే ఈ విషయం బాబా చెప్పినట్లు ఎక్కడా ఆధారం లేదు. మరికొందరు (మరాఠీలో) 'షా' అంటే స్కూలు అనీ, 'మా' అంటే మాస్టరుకు సంకేతమనీ, 'షామా' అంటే స్కూలు మాస్టరనీ నిర్వచించారు. ఎందుకంటే మాధవరావు కొంతకాలం శిరిడీలో స్కూలు మాస్టరుగా పనిచేశారు.
మహల్సాపతి (మొదట్లో) వృత్తిరీత్యా కంసాలి. విశ్వబ్రాహ్మణుడు. అందుకే అతన్ని బాబా 'సోనార్ డా' (కంసాలీ!) అని పిలిచేవారు. మహల్సాపతి ఖండోబా ఆలయంలో పూజారి కనుక, తన పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలు కలవాడు కనుక తరువాత తరువాత అతన్ని 'భగత్' (-భాగవతుడు, భక్తుడు) అని కూడా వ్యవహరించేవారు.
దామోదర్ రస్నేది గాజుల వ్యాపారం. అందుచేత అతడిని బాబా 'కాసార్ డా' (గాజుల వ్యాపారీ!) అని పిలిచేవారు. అలానే పిలాజీ గురవేని 'గుర్‌వడా!' (- మంగలీ!) అని పిలిచేవారు.
పైన పేర్కొన్న పేర్లన్నీ వారి వారి వృత్తులకు సంబంధించినవే! బాబా మరికొంతమందిని వారి రూపురేఖలను ఉద్దేశించి సరదాగా పిలిచేవారు. తాత్యాపాటిల్ కోతేని 'కొతేచా గోడ్ ముఖ్య' (గుఱ్ఱం మొహం వాడా!) అని, డాక్టర్ పిళ్ళేని (...సాధారణంగా 'భావూ' (సోదరుడా!) అని సంబోధించినా-) అప్పుడప్పుడూ 'అండాచీ పిళ్ళే' (కోడిగుడ్డు ముఖం వాడా!) అని తమాషాగా ఆట పట్టిస్తూ పిలిచేవారు.
మరికొంతమందిని బాబా వారి వారి స్వభావాలకు తగ్గట్టు పిలిచేవారు. మాధవరావు ఫస్లేని 'అర్ధగుండూ' (పిరికోడా!) అనీ, సుగుణమేరు నాయక్‌ను 'ఠకీ' (టక్కరీ!) అనీ, రాధాకృష్ణఆయిని 'ఔదశ' (దుర్బుద్ధీ!) అనీ వ్యవహరించేవారు.
అలానే శ్రీ బి.వి.దేవ్‌ను 'చిందీచోర్' (పాత గుడ్డపేలికలు దొంగిలించేవాడా!) అని పిలిచేవారు. ఒకసారి దేవ్ శిరిడీ దర్శించి, అక్కడ బాబా భక్తులను బాబా ద్వారా వారికి కలిగిన అనుభవాలను గూర్చి అడుగుతున్నాడు. బాబా అతన్ని పిలిపించి, “పాతగుడ్డపేలికలు దొంగిలిస్తావేం?” అని కోపంగా కేకలేసారు. కాసేపు అలా అతన్ని తిట్టిన తరువాత అనునయంగా, “నేను నీకు పట్టువస్త్రం బహూకరిద్దామనుకుంటే చింకిపేలికల కోసం పాకులాడతావేం?” అని అన్నారు. ఇతరులకు కలిగిన అనుభవాల స్మృతులు వాడి విడిచేసిన పాత చింకిపేలికల వంటివనీ, స్వయంగా అలాంటి అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలనీ బాబా భావం. ఆ సంఘటన జరిగిన తరువాత నుండీ బాబా దేవ్‌ని 'చిందీ చోర్' అని సరదాగా పిలిచేవారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బాబా మహాసమాధి అనంతరం బి.వి.దేవ్ భక్తుల అనుభవాలను సేకరించి, 'సాయిలీలా మాసిక్' (మరాఠీ) పత్రికలో 'మహారాజ్ కా అనుభవ్' అన్న శీర్షికన ధారావాహికంగా ఎన్నో వ్యాసాలు ప్రచురించాడు. అలా 'సాయిలీలా మాసిక్'లో 'బాబాంచా బాల్' అన్న కలంపేరుతో ప్రచురింపబడ్డ వ్యాసాలన్నీ శ్రీబి.వి.దేవ్ వ్రాసినవే. అంతేకాదు, శ్రీహేమాడ్‌పంత్ అసంపూర్ణంగా విడిచిన 'శ్రీసాయిసచ్చరిత్ర' లోని 52, 53 అధ్యాయాలు శ్రీబి.వి.దేవ్ రచించి ప్రచురించారు. 'సాయంత్ర ఆరతి'లో భావగాంభీర్యంతోనూ, ఆర్ద్రతతోనూ, శబ్దసౌందర్యంతోనూ తొణికిసలాడే 'రుసోమమ' ('రుసో మమప్రియా...' అనే ఆరతి పాట) రచించింది కూడా శ్రీబి.వి.దేవే.
ఇక బాబాసాహెబ్ బూటీని 'బూటయ్యా' అనీ,
బాబాసాహెబ్ ధుమాళ్‌ను 'భావూ' అనీ,
దాదాసాహెబ్ ఖపర్దేని 'తావూన్ దాదా!' అనీ వ్యవహరించేవారు.
దాసగణుమహారాజ్‌గా ప్రఖ్యాతుడైన శ్రీగణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధేని బాబా ప్రేమగా “గణూ” అని పిలిచేవారు.
మరికొంతమంది విషయంలో, బాబా వారిని పిలిచే పేర్లకు వారికి కలిగిన ఏదో సాయిలీలకో, వారు చేయబోయే సాయిసేవా కార్యక్రమానికో (-హేమాద్‌పంత్, బి.వి.దేవ్ విషయం లోలాగా) సంబంధం ఉండేది. అన్నాసాహెబ్ ధబోల్కర్‌ను 'హేమాడ్ పంత్' అనీ, కాకాసాహెబ్ దీక్షిత్‌ను 'లంగ్‌డా కాకా!' (కుంటిమామా)అనీ, అబ్దుల్‌ను 'కాకి' అనీ, రాంగిర్‌బువాను 'బాపూగిర్ బువా' అనీ బాబా పిలిచేవారు. అలా ఆయన పిలవడానికి గల కారణాలు 'శ్రీసాయిసచ్చరిత్ర' పఠిస్తే అవగతమవుతాయి.
- పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.
మూలం: సాయిపథం వాల్యూం - 3.
🕉 sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me