సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయి మహాభక్త బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్ ఒక గ్రామీణ బ్రాహ్మణుడు. అతను చితలీ గ్రామానికి 3 మైళ్ళ దూరంలో ఉన్న 'ఖైరీ' గ్రామ నివాసి.

జులై 27, 1936న శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాల గురించి శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఇలా వివరించారు:

35 సంవత్సరాలక్రితం మొదటిసారిగా నేను సాయిబాబా గురించి 'ఆయనొక పిచ్చి వ్యక్తి' అని విన్నాను. కానీ కొంతకాలం తర్వాత ప్రతిఒక్కరూ ఆయనని గురించి చాలా గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. దానితో శిరిడీలోని అప్పాకులకర్ణి వంటి కొందరు బ్రాహ్మణులతో నాకు పరిచయం ఉండటం వలన ఒకసారి నేను సాయిబాబా దర్శనంకోసం వెళ్ళాను. నేను వంశపారంపర్యంగా గ్రామాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. 1916వ సంవత్సరంలో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. పూర్వం రోజులలో ప్రజలు చితలీ, జల్గాఁవ్, రాంపూర్, నాత్పట్లాచా, వాడి, పింపల్వాడి మీదుగా ఉన్న మార్గాన్ని శిరిడీ సందర్శించడానికి ఉపయోగించేవారు. ఈ రహదారి ఇప్పుడు ఉపయోగంలో లేదు.

బాబా నూనెకు బదులుగా నీటిని ఉపయోగించి దీపాలు వెలిగించిన లీలను నేను చూసాను. దందేపూర్‌కి చెందిన దేశ్‌పాండే మాస్టర్ తరచుగా బాబా మాటలు వింటుండేవారు. కానీ బాబా చెప్పినదాని గురించి నాకు ఏమీ తెలియదు.

1908లో నేనొకసారి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ద్వారకామాయి మసీదు నేలపై పడివున్న ఒక నాణెం చూశాను. నేను దానిని తీసి బాబా చేతికందించి, "ఇది మీ నాణెం, దీనిని సురక్షితంగా ఉంచండి" అని చెప్పాను. కానీ బాబా నాకు ఆ నాణెం తిరిగిస్తూ, "సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకువెళ్లి, మీ పూజగదిలో మీరు పూజించే ప్రతిమలతోపాటు ఉంచుకో! మీరు శ్రేయస్సు పొందుతారు" అని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారం నేను ఆ నాణెం తీసుకుని వెళ్లి ఆరాధించసాగాను. ఆ నాణాన్ని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత కులకర్ణిగా నేను చాలా ఆదాయం పొందగలిగాను. నా భార్యకు బంగారుగాజులను కూడా చేయించగలిగాను. అంతకుముందు నా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మూడు సంవత్సరాలలో అనగా 1911 నాటికల్లా నేనెంతో శ్రేయస్సు పొందాను.

తరువాత ఒకసారి నేను ప్రయాణాలలో అపవిత్రంగా ఉన్నందువలన నా పారాయణ గ్రంథాన్ని ఒక స్నేహితుడికి పంపించాను. ఆ గ్రంథంలో బాబా ఇచ్చిన నాణెం ఉందన్న సంగతి నాకు అసలు గుర్తులేదు. కొన్నిరోజుల తర్వాత నాణెం పోగొట్టుకునట్లు గుర్తించాను. అందువలన 1911 తర్వాత నాకు చెడురోజులు ప్రారంభమయ్యాయి. ముందుగా నాణెం కోల్పోయిన ఆరునెలల్లో నేను నా భార్యను కోల్పోయాను. 1916లో నేను నా గ్రామాధికారి పదవి కోల్పోయాను. 1917-18లో నేను నా తల్లిని కోల్పోయాను. నేను ఇప్పుడు నా ఆహారం కోసం యాచించడం కూడా చేస్తున్నాను. ఐనా సరే నేను ప్రతీ సంవత్సరం రామనవమికి శిరిడీ వెళ్తూ ఉంటాను.

Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/balakrishna_ramachandra_khairikar.html (Devotees' Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji)

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo