సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్యామారావు రామచంద్ర జయకర్


శ్యామరావు జయకర్ సుప్రసిద్ధ చిత్రకారుడు. అతడు 1865వ సంవత్సరంలో ముంబైలో జన్మించాడు. అతడు పఠారేప్రభు కులానికి చెందినవాడు. అతని తాతతండ్రులు ఉన్నత విద్యావంతులైన గొప్ప పండితులుగా ప్రసిద్ధి చెందారు. దురదృష్టవశాత్తు శ్యామారావుకు కేవలం 16 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతని తండ్రి మరణించాడు. ఆ సంఘటనతో అతని తల్లి తన నలుగురు కొడుకులు, ఒక కుమార్తెతో తన సోదరుడు బాబాసాహెబ్ అజంక్య ఇంట ఆశ్రయం పొందింది. బాబాసాహెబ్ అజంక్య ముంబై ఓడరేవుల్లో సగభాగానికి యజమాని. ఇప్పటికీ వారిని(ఆ కుటుంబీకులను) 'భావూ కా ఢాకా' అని పిలుస్తారు. 

శ్యామారావు మిషన్ స్కూల్లో చదువుకున్నాడు. అతడు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలడు. అతను చిన్ననాటినుండి పెయింటింగ్ పట్ల చాలా ఆసక్తి కనబరిచేవాడు. అతను ఆర్ట్ స్కూలుకు వెళ్లకపోయినా, ఎవరివద్దా నేర్చుకోకపోయినా చక్కగా పెయింటింగ్ చేయగలిగేవాడు. ఒకప్పుడు అతను రాజ్‌కోట్ వరకు ప్రయాణించాడు. అక్కడి రాజాస్థానానికి చెందిన రాజు తన రాజకుటుంబంలోని వారందరి చిత్రాలను శ్యామారావు చేత గీయించాడు. దాంతో అతను చిత్రకారునిగా ప్రసిద్ధి పొంది రాజకుటుంబీకుల, బ్రిటీష్ ప్రభువుల చిత్రాలను చిత్రిస్తుండేవాడు.

జయకర్ కొంతకాలం పూణేలో పనిచేసిన తరువాత ముంబైకి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని బావ ద్వారా బాబా గురించి విన్నాడు. అదే అతడు మొదటిసారి బాబా గురించి వినడం. అదే సమయంలో బాబా భక్తుడైన రావుబహదూర్ మోరేశ్వర్ డబ్ల్యూ. ప్రధాన్ అతనిని కలిసి శిరిడీ సందర్శించి బాబా తైలవర్ణ చిత్రాన్ని చిత్రించమని విన్నవించుకున్నాడు. అందుకతను సమ్మతించి ప్రధాన్‌తో కలిసి శిరిడీ వెళ్లేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే సాధారణంగా బాబా ఎవరినీ తమ ఫోటోగ్రాఫ్స్ తీసేందుకు అనుమతించేవారు కాదు. ఎవరైనా ఆయన అనుమతి లేకుండా ధైర్యం చేసి ఫోటో తీసినా అందులో బాబా రూపం కనిపించేది కాదు.

జయకర్ ప్రధాన్‌తో కలిసి కేవలం బాబా పెయింటింగ్ వేయాలన్న నెపంతో మొదటిసారి శిరిడీకి బయలుదేరాడు. అది ఏ సంవత్సరమన్నది స్పష్టంగా తెలియలేదు. అప్పటికింకా అతనికి బాబా దైవత్వం గురించి, కీర్తి గురించి తెలియదు. అందుచేత ప్రయాణంలో ఉండగా అతను, "నా ఈ శిరిడీ ప్రయాణం వృధాశ్రమేనేమో! ఇదే నేను ఏదైనా రాజభవనానికి వెళ్తే పెద్ద మొత్తం నాకు తెచ్చిపెడుతుంది" అని అనుకున్నాడు. శిరిడీ చేరుకున్న తరువాత వారు బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. జయకర్ బాబాను పరిశీలనగా చూశాడు, బాబా కూడా అదేవిధంగా అతనివైపు చూశారు. తరువాత బాబా, "ఇతనెందుకు శిరిడీ వచ్చాడు? ఏదైనా రాజభవనానికి వెళ్లి, వారి చిత్రాలను చిత్రించవచ్చు. నాలాంటి పేద ఫకీరు చిత్తరువును గీయడం వల్ల ఏమిటి ఉపయోగం?" అన్నారు. ప్రయాణంలో తాననుకున్న మాటలే బాబా నోట విని అతడు  ఆశ్చర్యపోయాడు. అయితే అతడు తైలవర్ణ చిత్రం గీయడానికి బాబా అనుమతి తప్పనిసరి. కాబట్టి షామా మధ్యవర్తిత్వం వహించి బాబాను అనుమతించమని అభ్యర్థించాడు. అప్పుడు బాబా, "పేద ఫకీరునైన నా చిత్రం గీయడమెందుకు? షామా, నీవు ఉపాధ్యాయుడివి. నీ చిత్రం గీయించుకోరాదూ!" అని అన్నారు. ఎలాగైతేనేమి చివరకు షామా బాబాను ఒప్పించి, బాబా అనుమతించారని జయకర్‌తో చెప్పాడు. తరువాత బాబా ద్వారకామాయిలో తమ ఆసనంపై కూర్చొనగా ఆనందంగా జయకర్ తన పని మొదలుపెట్టాడు. ప్రధాన్ ఒక చిత్రాన్ని చిత్రించమని చెప్పినప్పటికీ అతడు మూడు చిత్రాలను చిత్రించాడు. వాటిలో రెండు ప్రధాన్ తీసుకోగా, మిగిలిన దాన్ని బాబా వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయన దాన్ని తాకి దీక్షిత్‌కి ఇవ్వమని చెప్పారు.

తరువాత జయకర్ మరో పెద్దచిత్రాన్ని కూడా చిత్రించాడు. అతడా చిత్రపటాన్ని తన ఇంట్లో ఉంచుకొని పూజించుకోవాలని అనుకున్నాడు. పెయింటింగ్ పూర్తయ్యాక అతడు దానిని తీసుకొని వెళ్లి, బాబా చేతిలో పెట్టాడు. ఆయన, "దీనిని చావడిలో ఉంచాలి" అని అన్నారు. ఆయన అన్న మాటలు అతనికి అర్థంకాక, ఆ పెయింటింగ్ తీసుకొని చావడికి వెళ్లి, సాధారణంగా బాబా కూర్చొనే చోట తాకించి తనతో తీసుకొని వెళ్ళాడు. అయితే ఏ కారణం చేతనో అది ఉపయోగించబడకుండా చాలా సంవత్సరాలు ఉండిపోయింది. సుమారు 1925-26లో కాకాసాహెబ్ దీక్షిత్, ప్రధాన్‌లు శ్యామారావును కలిసి అతని వద్ద ఉన్న ఆ పెయింటింగును ద్వారకామాయిలో ఉంచమని అడిగారు. అందుకతను ఎంతో ఆనందంతో అంగీకరించి, ఆ పెయింటింగుకి ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. దానిని బాబా సాధారణంగా కూర్చునే చోట ఉంచారు. ఆవిధంగా ఆ పెయింటింగ్ ద్వారకామాయికి చేరి లక్షలాదిమంది భక్తుల చేత ఆరాధింపబడింది. తరువాత కొంతకాలానికి సంస్థాన్ మ్యూజియం ఏర్పాటు చేశాక, ధుని వేడి కారణంగా పెయింటింగుకి హాని జరిగే ప్రమాదముందన్న ఉద్దేశ్యంతో ఒరిజినల్ పెయింటింగుని మ్యూజియంలో భద్రపరిచారు.

ద్వారకామాయిలో బాబా కూర్చున్న భంగిమలో ఉన్న తైలవర్ణ చిత్రంతోపాటు భక్తులతో కలిసి చావడి ఊరేగింపుకు వెళ్తున్న తైలవర్ణ చిత్రాన్ని కూడా జయకర్ చిత్రించాడు. ఆ చిత్రంలో ఉన్న పిల్లలిద్దరిలో చేతిలో ప్లేటు పట్టుకొని ఉన్న పిల్లవాడు మోరేశ్వర్ ప్రధాన్ కొడుకు ఛోటా సాయినాథ్, చేతిలో వెండి దండం పట్టుకొని ఉన్న పిల్లవాడు జయకర్ కుమారుడు సురేంద్ర.
1936లో బి.వి.నరసింహస్వామిగారితో జయకర్ పంచుకున్న అనుభవాలు:-

1916-17 లేదా అంతకుముందు నేను శిరిడీ వెళ్ళినప్పుడు ఇతర భక్తులతో కలిసి ఉండేవాడిని. వాళ్ళంతా శిరిడీ విడిచి వెళ్ళిపోయినప్పటికీ నేను అక్కడే ఉండేవాడిని. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వచ్చేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడుగుతుండేవారు, నేను సమర్పిస్తుండేవాడిని. ఇతర భక్తులు వెళ్లిపోయిన తరువాత నా వద్ద  డబ్బులుండేవి కావు, బాబా కూడా నన్ను దక్షిణను అడిగేవారు కాదు. నా పరిస్థితి గురించి నేను బాబాకు చెప్పకపోయినా ఆయనకు తెలుసు.

నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత ఒక సన్యాసి దానికి ఒక శక్తిమంత్రాన్ని జోడించి ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికే ఈ మంత్రోపదేశాలు జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరికీ వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ ఉండమని (జో కరీత్ ఆలే తోచ్ కరా) సలహా ఇస్తుండేవారు. బాబా తన భక్తులకు నైతిక విలువల గురించి బోధిస్తుండేవారు. ఉదాహరణకు, “పవిత్రంగా ఉండండి, సత్యాన్ని అంటిపెట్టుకోండి, నిజాయితీగా ఉండండి, అందరినీ సమదృష్టితో చూడండి" అని చెప్పేవారు.

నాకు శిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. నేను రాధాకృష్ణఆయీ వద్దకు ఎప్పుడూ వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం రాలేదు. నాకు నానావలి తెలుసు. అతనొక ప్రమాదకరమైన వ్యక్తి. అతనితో సహవాసం చేయవద్దని బాబా నాతో చెప్పారు. మొదట్లో నేను, డాక్టర్ పిళ్ళై నానావలితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావలి డాక్టర్ పిళ్ళైని కొట్టాడు. అప్పటినుండి మేమిరువురం అతని సహవాసాన్ని విడిచిపెట్టాము. నానావలి బాబాను ఆరాధించలేదు, కానీ మర్యాదపూర్వకంగా చూసేవాడు. బాబా అతన్ని కొట్టి, దుశ్చేష్టలు మానమని హెచ్చరించేవారు.

నేను శిరిడీలో గడిపిన ఎనిమిదినెలల కాలంలో బాబా నోటిగుండా చాలా గోష్ఠులు(చర్చలు), సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ, నాకు అవేవీ గుర్తులేదు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి చెప్పలేదు. ఆరోగ్యం, సంపద మొదలైన ప్రాపంచిక విషయాలను ఆశించే ప్రజలు బాబా వద్దకు వచ్చేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు.

బాబా కృపాదృష్టి ఎప్పుడూ నామీద ఉన్నందువలన నేను సంతృప్తిగా ఉండేవాడిని. నేను నా సంతానంలో ఇద్దరిని కోల్పోయాను. అయినా బాబా మా కుటుంబాన్ని క్షేమంగా ఉండేలా చూశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బును ఇచ్చినప్పటికీ, మనం డబ్బుని మాత్రమే ఆశించి వారి వద్దకు వెళ్ళకూడదు. బాబా తరచూ తమ మసీదు గోడలు బంగారంతో చేసినవని, ప్రజలు వచ్చి ఆ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకుపోవాలని అనేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని విచారాన్ని వ్యక్తపరిచేవారు.

బాబా నాపట్ల ఎంతో దయ చూపేవారు. కానీ, బాబాతోపాటు అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను విచిత్ర స్వభావం కలవాడిని, ఏ పనీ సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు.

ఒకసారి నేను వెండి పాదుకలు తయారుచేయించి, వాటిని బాబా హస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని ఆశపడ్డాను. చిన్న పాదుకల జతను తయారుచేయించి, బాబా వద్దకు తీసుకొని వెళ్ళాను. బాబా నన్ను, నా చేతిలో ఉన్న పాదుకలను చూశారు. ఆయన వాటిని అందుకొని తిరిగి ఇచ్చే సమయంలో తమ అరచేతులను కాస్త క్రిందికి వాలుగా వంచారు. అవి క్రింద పడిపోయాయి. నేను వాటిని పూజించదలచి తీసుకున్నాను. అదేరోజు సాయంత్రం నేను నా మాసిన బట్టలను చాకలికి వేస్తూ, వెండి పాదుకలు ఉన్న చొక్కాను కూడా వేశాను. ఇక అవి నా దగ్గరకు తిరిగి రాలేదు. నా నిర్లక్ష్య ధోరణివల్ల నేను పాదుకలను కోల్పోయాను. నేనెలాగూ పోగొట్టుకుంటానని బాబాకు తెలుసు గనుక పాదుకలను పూజించుకొనేందుకు నేరుగా నా చేతుల్లోకి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు.

ఒకసారి నేను సంతానంలేని చాలా ధనవంతురాలైన ఒక మహమ్మదీయ ఘోషాస్త్రీకి నాలుగువేల రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది ఎనిమిదిమంది కుమారులున్న పెద్ద కుటుంబమైనందున ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడం నాకు తప్పనిసరైంది. కానీ, ఆమె ఎంతకూ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బు తిరిగి వసూలు చేసుకోవడంలో బాబా నాకు దయతో సహాయం చేస్తారన్న ఆశతో నేను బాబా వద్దకు వెళ్ళాను. కానీ బాబా నాతో, “ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే!(ఆపల్యాల తే హరా మాచే నకో)" అని అన్నారు. నేను నా డబ్బు తిరిగి పొందలేదు. రెండు, మూడు సంవత్సరాల తరువాత ఆ స్త్రీ తన సంపద మొత్తాన్ని కోల్పోయిందని నాకు తెలిసింది.

నేను బాబాను దర్శించినప్పటినుండి ఆయన ఫోటోను ఎల్లప్పుడూ నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా బాబా నా వెంటే వుంటూ నన్ను, నా కుటుంబాన్ని అనూహ్యరీతిన కాపాడుతుండేవారు. అందుకు సంబంధించిన కొన్ని సందర్భాలను చెప్తాను.

1916లో నేను నా కుటుంబంతో ముగాబత్(బొంబాయి)లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాను. ఇంట్లోని ఒక గదిలో బాబా పటం ఉంది. ఒకరోజు రాత్రి తెల్లవారుఝామున 2 గంటల సమయంలో దొంగలు ఆ గది కిటికీకున్న రెండు ఊచలను వంచి తీసివేసి, ఆ సందుగుండా లోపలికి ప్రవేశించి, ఇల్లంతా దోచుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిరోజూ వేకువఝామున 4 గంటలకు లేచి, ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు. కానీ ఆరోజు ఎందుకో చాలా విచిత్రంగా ఎటువంటి కారణం లేకుండానే అతను తెల్లవారుఝామున 2 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగాడు. అతన్ని చూసిన దొంగలు పరుగుపెట్టారు. అతను వారిని చూసి 'దొంగలు, దొంగలు' అని పెద్దగా అరవడంతో మేమందరం లేచాము. దొంగలు ఇంటిలోకి దూరకుండా సరైన సమయానికి మమ్మల్ని లేపి, మా ఇల్లు దోచుకొనబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమంతా అనుకున్నాము.

1917లో నేను నా కుటుంబంతో పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంట్లో నివసిస్తున్నాను. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. పైకప్పు నుండి దుమ్ము పడకుండా పైకప్పు క్రిందభాగంలో ఒక వస్త్రాన్ని అంటించిపెట్టాము. ఒకరోజు రాత్రి బాబా చిత్రపటం ఉన్న గదిలో, పటానికి ముందుగా ఒక కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. అక్కడికి సమీపంలో సంవత్సరం వయస్సున్న నా బిడ్డ నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా "డబ్" మనే పెద్ద శబ్దం  వినిపించి, మాకు మెలకువ వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్లి చూస్తే, పైకప్పు వస్త్రం పడిపోయివుంది. శిథిలమైన గోడల తాలూకు ఇటుకలు వస్త్రంపై పడటంతో వస్త్రంతోపాటు అవి నేలమీదకు వచ్చి పడ్డాయి. నిజానికి పైకప్పు కింద ఉన్న వస్త్రం రాళ్లతోపాటు పడినందున బాబా ఫోటో ముందు కాకపోయినా బిడ్డమీద గాని, లాంతరుమీదగాని పడివుండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. వస్త్రంతో ఉన్న ఆ రాళ్లు పిల్లవాడికి, లాంతరుకు అడుగు దూరంలో పడ్డాయి. బిడ్డపై పడివుంటే, బిడ్డ నలిగిపోయి ఉండేవాడు. లాంతరు మీద పడినా అగ్ని ప్రమాదానికి  దారితీసేది. ఇవేమీ జరగకుండా బాబా మమ్మల్ని కాపాడారు.

1917లో నేను నా కుటుంబంతోపాటు శిరిడీ వెళ్లి, 10 నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు మేము బాలాభావ్(శారదాబాయి) ఇంట్లో ఉన్నాము. మేము ఉంటున్న ఆ చిన్నవాటాలోని ఒక రంధ్రంలో ఒక పాము ఉండేది. అందువలన మేము ప్రమాదంలో ఉన్నామనే భయం మమ్మల్ని వెంటాడుతుండేది. ఒక రాత్రి ఆ రంధ్రం నుండి పాము బయటకు రావడాన్ని నా కొడుకు, మరికొంతమంది చూసి దాన్ని చంపేశారు.

1923లో పదేళ్ల వయసున్న నా కొడుకు సురేంద్రకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. తను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా తన కడుపులోని వాయువు ఛాతీభాగానికి, గుండెవైపుకు ఎగదన్ని ఒత్తిడి చేసింది. పిల్లవాడు ఆ బాధను తట్టుకోలేక, "కాపాడండి, కాపాడండి" అని అరిచాడు. టైఫాయిడ్ కారణంగా తను చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ స్థితిలో తనని తాకడానికిగానీ, మర్దన చేయడానికిగానీ నాకు భయమేసి, వాడికెలాంటి సహాయం చేయలేక బిగ్గరగా 'బాబా' అని అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గింది.

ఆధ్యాత్మిక విషయంలో నేరుగా సలహాల రూపంలో, దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలో బాబా నాకు సహాయం అందించేవారు. ఒకసారి ఆయన, "నీవెంత నాటుతావో, అంతే ఫలితాన్ని పొందుతావు" అని చెప్పారు. మరో సందర్భంలో బాబా నావైపు చూస్తూ, "మనం గురువును సేవించాలి(గురూ సేవా కరావీ)" అన్నారు. ఆయన నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే, అంటే నా ఇరవయ్యవ ఏట ఒక గురువు నుండి ఉపదేశం పొంది, వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాలపరిమితి కంటే ఎక్కువకాలమే ఆ మంత్రాన్ని జపించాను.

బాబా బోధనలు ఎక్కువగా నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి ఉండేవి. ఒకసారి బాబా భక్తులతో, "ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. వారిని, వీరిని ప్రశ్నించి, వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడం వలన ప్రయోజనమేముంది? (ఆప్ లా ఆపన్ హోఉన్ పహానా త్యాలావిచారణాయాత్ కాయ్ అర్థ్ ఆహే)" అన్నారు. ఆ సమయంలో భక్తులలో ఒకరు ఇతరులను, 'బాబా ఒక సిద్ధుడా? లేక అవతార పురుషుడా?' వంటి ప్రశ్నలు అడుగుతుండేవాడు. బాబాని స్వయంగా దర్శించి, వారితో సంబంధమేర్పరుచుకొని స్వయంగా తమంతట తామే నిర్ధారించుకునే అవకాశమున్నపుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవడాన్ని బాబా నిరసించేవారు.

ఒకసారి బాబాకు అత్యంత విధేయుడిగా ప్రసిద్ధి చెందిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒక వ్యాఖ్య చేశారు. ఒకరోజు బాబా దీక్షిత్‌ను పిలిచి 30 రూపాయల దక్షిణ అడిగారు. అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అప్పుడు బాబా, 'బాపూసాహెబ్ జోగ్ వద్దకు వెళ్లి అతనినడిగి ఆ డబ్బు తీసుకొని రమ్మ'న్నారు. దీక్షిత్ ఇంకా మసీదు ప్రాంగణమైనా దాటకముందే, బాబా అతన్ని ఉద్దేశిస్తూ, "నిలకడలేని మనిషి" అని అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతివిషయంలోనూ నేరుగా బాబాను సంప్రదించి, ఆయన సలహామేరకు నడుచుకోవడానికి బదులుగా తన పాత అలవాటు ప్రకారం బాబా గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా సాయి సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తర్వాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది.

బాబా తన అంతర్యామిత్వం గురించి తెలియజేయడం ద్వారా నా విశ్వాసాన్ని బలపరిచిన సంఘటనలు:

ఒకసారి నేను బాబా ముందు కూర్చొని ఉన్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్‌కర్‌ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో నా జేబులో 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంటిఖర్చులకు నా వద్ద ఉన్న డబ్బు అదే. బాబా నాతో, "మాలా చార్ ద్యావే" అని అడిగారు. వారు అన్నది నాకు స్పష్టంగా అర్థంకాక, ఆయన 'రూపాయా' అన్నట్లు అనుమానపడ్డాను. దాంతో ఆయన నాలుగు రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతున్నారని తలచి, నేను నా జేబులో ఉన్న మూడు రూపాయలు తీసి ఆయన ముందు ఉంచాను. దీక్షిత్, "నాలుగు అడిగితే, మూడు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు?" అన్న భావంతో నా వైపు సందేహంగా చూశాడు. వెంటనే బాబా, "నాలుగు ఎక్కడివి? ఉన్నవి మూడే" అని అన్నారు. దీనినిబట్టి నా జేబులో ఉన్న డబ్బు ఖచ్చితంగా మూడు రూపాయలు మాత్రమేనని ఆయనకు తెలుసని అనుకున్నాను. అంతేకాక నా పరిస్థితులన్నీ ఆయనకు తెలుసునని గ్రహించాను. బాబా నాలుగు రూపాయలు అడగడంలో ఉద్దేశ్యం, నేను విధికి తలవంచి, ఆయనపై విశ్వాసంతో డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారంవేసి అన్నీ ఆయనే చూసుకుంటారని, అవసరమైనప్పుడు మన పరిస్థితులను చక్కబరుస్తారని నమ్మకం మనకు కలిగితే, మన దగ్గరున్న డబ్బంతా చివరిపైసాతో సహా ఆయనకు సంతోషంగా సమర్పించగలుగుతాము.

ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి, కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయస్థితిలో నిలబెట్టిన మరో సంఘటనను ఇప్పుడు వివరిస్తాను. 1917వ సంవత్సరం, ఆషాఢమాసంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్నచోటుకు 20 అడుగుల దూరంలో సభామంటపంలో నేను కూర్చొని ఉన్నాను. వర్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతడు మసీదులో "సత్యనారాయణ పూజ" చేయడానికి అనుమతించమని బాబాను   అర్థించాడు. బాబా అనుమతి ఇచ్చారు. అతడు తన వద్ద పూజ చేయడానికి అవసరమైన డబ్బులు లేవని చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు వేలు చూపిస్తూ వర్డేతో, "వెళ్లి అతనిని అడుగు" అని చెప్పారు. వర్డే నా వద్దకు వచ్చి, సత్యనారాయణ పూజకు అవసరమైన డబ్బులు నా నుండి తీసుకోమని బాబా చెప్పారని చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తుడిగా మాత్రమే తెలుసుగానీ, మరేవిధమైన పరిచయం అతనితో నాకు లేదు. కానీ, అతడు బాబా నా నుండి డబ్బు తీసుకోమని చెప్పారని చెప్పినందువల్ల నేను డబ్బు ఇచ్చేందుకు అంగీకరించి, "ఎంత అవసరముంటుంద"ని అడిగాను. అతడు కేవలం 2 రూపాయల, 5 అణాలవుతుందని బదులిచ్చాడు. నా జేబులో ఉన్న మొత్తం డబ్భు కూడా సరిగ్గా అతను అడిగినంతే! అలా నా వద్ద ఉన్న డబ్బంతా అడగటం బాబా లీలగా నేను భావించి, అతనికి 2 రూపాయల, 5 అణాలు ఇచ్చాను.

వర్డే వెళ్లి పూజకు అవసరమైన సామాగ్రిని కొని తెచ్చి, అన్ని ఏర్పాట్లు చేశాడు. అతను బాబాను సత్యనారాణస్వామిగా భావించి, రెండువైపులా చిన్న అరటి పిలకలు పెట్టి, మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా అలా చేయడానికి అభ్యంతరం తెలిపి, "అరటి పిలకల మధ్య ఎప్పుడూ సాధారణంగా పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టుకొని వాటినే పూజించమ"ని ఆదేశించారు. కానీ వర్డే, మిగతా భక్తులు 'బాబానే సత్యనారాయణస్వామిగా ఉండమ'ని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అంగీకరించారు.

తరువాత సత్యనారాయణస్వామి కథా పఠనం క్రింది మంటపములో మొదలయింది. నేను మసీదులోనే ఒకరిద్దరితో కలిసి బాబా ప్రక్కనే కూర్చొని ఉన్నాను. కొన్ని క్షణాల్లో నా  మనస్సులో ఆందోళన మొదలై, అది మానసిక సంఘర్షణగా మారింది. ఒకవైపు నాకు సత్యనారాయణ కథ వినాలని చాలా ఆసక్తిగా ఉంది. మరోవైపు బాబా ప్రత్యక్షసన్నిధి - ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారికన్నా ఎత్తులో కూర్చొని ఆ కథ వినడం భావ్యం కాదు. ఏమి చేయాలో అర్థంకాని సందిగ్ధంలో నేను చాలా మధనపడుతున్నాను. బాబా నా మనస్సులోని సంఘర్షణను పసిగట్టి అకస్మాత్తుగా నాతో, "దిగివెళ్లి అక్కడ కూర్చో!" అని ఆదేశించారు. బాబా చూపిన ఆ స్థలం పూజారికి సమీపంలోనూ, తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో బాబా నాకు పరిష్కారాన్ని చూపించారు.

అకారణంగా హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకరమైన రుగ్మతలను తమ అద్భుతశక్తితో నివారించి, వాటికీ ఆశ్రయమిచ్చి రక్షిస్తారని నిర్ధారించే ఒక సంఘటనను నేనిప్పుడు చెప్తాను.

ఒకరోజు నేను దీక్షిత్‌వాడా వరండాలో ఉన్నాను. అప్పుడొక వింత దృశ్యాన్ని నేను చూశాను. ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల, పెద్ద కుక్కలను తరుముతోంది. చిన్న కుక్కపిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది గ్రామస్తులు చిన్న కుక్కపిల్లను చంపాలని చేత కర్రలు పట్టుకొని దాని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. అంతలో ఆ కుక్కను తరుముతున్నవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఆ కుక్కపిల్ల పరుగెత్తుకుంటూ మసీదు మెట్లెక్కి బాబా వెనుకకు వెళ్లి దాగింది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు ఆయన వద్ద తనపై దాడి చేసే ధైర్యం చేయరని దానికి అనిపించినట్లుంది. అదే నిజమని నిరూపణ అయ్యింది. దానిని తరుముతున్న గ్రామస్థులు దూరంగా నిలబడి ఆ కుక్కపిల్ల బయటకు వస్తే దాన్ని చంపాలని వేచివున్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ వాళ్ళు, ఆ కుక్క పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని అన్నారు. బాబా వారిని మరింత తీవ్రంగా తిట్టి అక్కడనుండి దూరంగా వెళ్లిపొమ్మని అన్నారు. నేను, డాక్టర్ పిళ్ళై మసీదులో బాబా వద్దే ఉన్నాము. ఆ కుక్కవలన మాకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్థులు వెళ్లిపోవడంతో ఆ కుక్క బాబా చేత రక్షించబడింది. బాబా ఆ కుక్క పిచ్చిని నయం చేసి, దాని ప్రాణాలను కాపాడినట్లు నేను  పిళ్లైతో అన్నాను. కుక్క పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు.


Source డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి,
Devotees Experiences of Sri Saibaba part III by Pujya Sri B.V.Narasimha Swamiji

7 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai. Baba be with us. Surgery successfully complete ayyi fast ga recovery ayyettu bless cheyi Baba. Maatho undu Baba. Om sai

    ReplyDelete
  2. jayakar life history is good.all sai photos are beautiful.devotees life historiesare nice to know

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. Help me Baba pls

    ReplyDelete
  5. Na life lo happiness eppudhu vastundhi sai nadha🙏🙏🙏🙏🌻🌻🌺🌺

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo