సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 267వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రేమ అద్భుతం, అనంతం
  2. పిలిచినంతనే పలుకుతారు సాయి

బాబా ప్రేమ అద్భుతం, అనంతం

బాబా ప్రేమ అద్భుతం, అనంతం. ఎంత అనుభవించినా తనివితీరని ఆ ప్రేమను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. ఇప్పుడే(2019, డిసెంబర్ 22) బాబా నుండి పొందిన ప్రేమను ఆలస్యం చేయకుండా మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను.

2019, డిసెంబర్ 22 మధ్యాహ్నం బ్లాగ్ వర్క్ చేద్దామని కంప్యూటర్ ఆన్ చేశాక బ్లాగ్ ఓపెన్ చేసి నిర్ఘాంతపోయాను. ఎందుకంటే, ముందురోజు ఒక ఆర్టికల్ చేసి డ్రాఫ్టులో సేవ్ చేసి పెట్టుకున్నాను, అది కాస్తా కనిపించలేదు. కింద నుంచి పైదాకా అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. దాదాపు గంటన్నరసేపు శ్రమపడి చేసిన ఆర్టికల్ కనపడకపోయేసరికి కంగారుగా అనిపించింది. నాతో బ్లాగ్ వర్క్ చేసే వాళ్లలో ఒకరు డిలీట్ చేశారేమోనని తనకి ఫోన్ చేసి అడిగాను. తను, "అనవసరమైన డ్రాఫ్టులు ఎందుకని కొన్ని డిలీట్ చేశాను" అని చెప్పి, "అందులో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా?" అని అడిగారు. అందుకు నేను, "అందులో నేను కొంత వర్క్ సేవ్ చేసి పెట్టాను, అది పోయింది" అని బాధగా చెప్పాను. దాంతో తను కూడా బాధపడుతూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నాకు కూడా ఏమీ మాట్లాడాలనిపించక తను లైన్‌లో ఉండగానే చెప్పాపెట్టకుండా కాల్ కట్ చేశాను. 'మళ్ళీ ఆ ఆర్టికల్ చేసుకోవాలా?' అని చాలా బాధగా అనిపించింది. సరే, ఏం చేస్తాం అనుకొని మళ్ళీ ఆ వర్క్ చేయడానికి సిద్ధపడ్డాను. అంతలో ఏదైనా పరిష్కారం గూగుల్‌లో దొరుకుతుందేమో చూద్దామనుకున్నాను. కానీ ఇదివరకు కూడా ఇలాగే సేవ్ చేసిపెట్టుకున్న వర్క్స్ రెండు, మూడుసార్లు పోయాయి. అప్పుడు నేను గూగుల్‌లో పరిష్కారం కోసం చూసినప్పుడు, పబ్లిష్ చేసినవి డిలీట్ అయితే తిరిగి పొందే అవకాశం ఉంది కానీ, డ్రాఫ్ట్స్ డిలీట్ అయితే తిరిగి పొందలేమని తెలిసింది. ఆ విషయం తెలిసి కూడా నేను గూగుల్‌లో ఒక పేజీ తెరిచి ఒకటి రెండు పాయింట్స్ చదివానో లేదో, చాలా మనోవేదనను అనుభవిస్తూ మనసులో, "బాబా! బ్లాగులో లేదా వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడ సేవ్ చేసుకున్నా ఇలాగే పోతున్నాయి. నేను ఎంతో కాలాన్ని వెచ్చించి, శ్రమపడి వర్క్ చేస్తుంటే ప్రతిసారీ నాకెందుకిలా జరుగుతోంది బాబా?" అని అనుకున్నాను. వెంటనే మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. కాదు..కాదు, అది బాబాయే స్ఫురింపజేశారు. వెంటనే బ్రౌజర్ హిస్టరీ ఓపెన్ చేసి, ముందురోజు ఏ టైములో అయితే ఆ ఆర్టికల్ చేసి సేవ్ చేశానో ఆ సమయాన్ని బట్టి అక్కడున్న యు.ఆర్.ఎల్ ఓపెన్ చేశాను. అద్భుతం! పోయిందనుకున్న ఆర్టికల్ దొరికింది. నిజానికి ఈ ప్రయత్నం నేను అంతకుముందు వర్క్ పోగొట్టుకున్నప్పుడు కూడా చేశాను. కానీ అప్పుడు పోగొట్టుకున్నవి తిరిగి లభించలేదు. అందుకే ఇది చాలా పెద్ద మిరాకిల్. ఇక నా ఆనందానికి అంతులేదు. పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని కంప్యూటరులో శిరిడీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఓపెన్ చేసి, "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత ప్రేమను నాపై కురిపించి నా బాధని క్షణంలో తీసేశారు" అని చెప్పుకున్నాను. మరుక్షణంలో నేను, 'ఈ ఆనందాన్ని, మీ ప్రేమను ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేను బాబా' అనుకుంటూ డ్రాఫ్ట్ డిలీట్ చేసినందుకు బాధపడుతున్న తనకి ఫోన్ చేసి బాబా ఇచ్చిన ఈ ఆనందాన్ని పంచుకుంటే తను కూడా ఆనందిస్తారని అనుకున్నాను. అదే క్షణాన రెండు విధాలుగా బాబా తమ ప్రేమను నాపై మళ్ళీ కురిపించారు. ఒకటి, ప్రత్యక్ష ప్రసారంలో ఎవరో తమ చిన్న బాబుని అక్కడున్న పూజారికి అందించారు. పూజారి ఆ బిడ్డను బాబా పాదాలకు తాకించారు. అలా చిన్నపిల్లల్ని బాబాకి తాకించిన దృశ్యాన్ని నేనెప్పుడు చూసినా, బాబా ఆ పిల్లల తలపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు, ఆ స్థానంలో నా తలే ఉన్నట్లు, బాబా నన్నే ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగి మనస్సు ఆనందంతో నిండిపోగా బాబా ప్రేమను తృప్తిగా ఆస్వాదిస్తాను. ఇక రెండో విషయం, ఒక సాయిబంధువు నుండి ఫోన్ వచ్చింది. తామిచ్చిన ప్రేమను పంచుకోకుండా నేను ఉండలేనని తెలిసిన బాబా సమయానికి ఆ ఫోన్ కాల్ అందించారు. తనతో బాబా ఇచ్చిన తాజా ప్రేమను ఆనందంగా పంచుకున్నాను. తరువాత డ్రాఫ్ట్ డిలీట్ చేసినందుకు బాధపడుతున్న తనకి కూడా ఫోన్ చేసి బాబా చేసిన మిరాకిల్ పంచుకోగా, తను కూడా సంతోషించారు. బాబా ఇచ్చిన ప్రేమ పంచుకోవడంతో ఆయన ప్రేమ మరిన్ని రెట్లై నన్ను ఆనందపారవశ్యంలో ముంచేసింది. ఆనందస్వరూపుడైన బాబా తమ ప్రేమతో అంతులేని ఆనందాన్నిచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

పిలిచినంతనే పలుకుతారు సాయి

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు సాధారణ భక్తుడిని. ఆయన లీలలంటే నాకు చాలా ఇష్టం. తరచూ వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నా అనుభవానికి వస్తే...


ముందుగా నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సాయికి నా క్షమాపణలు. కొన్ని వారాల క్రితం నేను రాత్రి భోజనం చేశాక ఎడమవైపు చివరి దంతాలలో ఏదో చిక్కుకున్నట్లు గమనించాను. అది నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. సమయానికి నా వద్ద టూత్‌పిక్‌లు కూడా లేవు. నాకు వీలైనంతవరకూ అన్నివిధాలా ప్రయత్నించాను కానీ, ప్రయోజనం కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! నా దంతాలలో ఇరుక్కున్న దాన్ని తొలగించండి. అది ఉండగా నేను నిద్రకు ఉపక్రమించలేకపోతున్నాను" అని హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించాను. తరువాత నేను దాన్ని తొలగించడానికి చేసిన మొదటి ప్రయత్నంలోనే నేను ఆశ్చర్యపోయేలా అది బయటకు వచ్చింది. మన సాయికి ఒక్క పిలుపు చాలు, క్షణం ఆలస్యం చేయకుండా ఆయన పరుగున వస్తారు. గుండెలోతుల్లో నుండి పిలిస్తే ఆయన సమాధానమిస్తారు. "మీరు ఎక్కడున్నా నన్ను తలచుకున్న మరుక్షణం నేను మీ చెంత ఉంటాను" అని దాముఅన్నాతో బాబా అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అవి కేవలం దాముఅన్నాకు చెప్పినవి కావు, అసంఖ్యాకమైన ఆయన భక్తులందరికీ ఆయన చేసిన వాగ్దానమది. ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. "ఓ దేవా! దయచేసి మీ సృష్టిపై దయ చూపండి. ప్రతి జీవిని ఆశీర్వదించండి. బాధలు లేకుండా చేసి మీ పాదాలను గుర్తుపెట్టుకుని, మీ నామము జపించేలా అనుగ్రహించండి".

6 comments:

  1. Om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sadguru sainathaya namaha om sai sai ram subam bhavat

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  5. Sai tandri Naku nanna Leni lotu tircstuadu . Prati sari nannu save cestunna dayamayudu Sai. Sarioina drukpadam to mundu ku nadipistunna Sai danyavada mulu. Niku sata koti vandanamulu . Na janma danyam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo