సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1005వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్న వారి భయంకరమైన బాధలను సునాయాసంగా దాటిస్తారు బాబా
2.బాబాకి చెప్పుకుంటే చాలు - సమస్యలు లేకుండా పోతాయి

నమ్ముకున్న వారి భయంకరమైన బాధలను సునాయాసంగా దాటిస్తారు బాబా


"శ్రీసాయినాథా! మీ దివ్య పాదపద్మములకు నమస్కారాలు. మీరు ఇచ్చిన సంతోషాన్ని బ్లాగులో పంచుకోవటం ఆలస్యమైనందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ... నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటున్నాను తండ్రి". సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తూ మన అందరికీ సాయిని ఇంకా ఇంకా దగ్గర చేస్తున్న బ్లాగు నిర్వాహకులకు సదా కృతజ్ఞతలు. నా పేరు రేఖ. ఇంతకుముందు నవగురువార వ్రతం చేస్తున్నప్పుడు సాయి నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని 'సాయి భక్తుల అనుభవమాలిక - 857వ భాగం'లో పంచుకుని ఎంతో ఆనందం పొందాను. ఇప్పుడు నవగురువార వ్రతం జరుగతున్నప్పుడు జరిగిన మరో అనుభవాన్ని చెప్తున్నాను. వ్రతం మధ్యలో ఉండగా ఒకరోజు మావారు స్వల్ప జ్వరంతో ఇంటికి వచ్చారు. బాగా అలసట తప్ప జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు ఏమీ లేకపోవటం వల్ల నేను పెద్దగా కంగారు పడలేదు. కానీ మరుసటిరోజు మావారికి ఏదో ఇబ్బందిగా అనిపించి హాస్పిటల్‌కి వెళ్తానని వెళ్ళారు. అలా వెళ్లిన ఆయనకి సాయంత్రం వరకు సెలైన్ ఎక్కించారు. అప్పుడు మావారు ఫోన్ చేసి, "నువ్వు ఒకసారి హాస్పిటల్‌కి రా, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం" అని అన్నారు. సరేనని నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. హాస్పిటల్ వాళ్ళు మావారిని అన్ని రకాలుగా పరీక్షించి ఇంటికి పంపే సమయానికి మళ్ళీ మావారికి జ్వరం వచ్చింది. అప్పుడు కోవిడ్ టెస్ట్ చేస్తే, పాజిటివ్ వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో మాకు కోవిడ్ వస్తుందని మేము అస్సలు ఊహించలేదు. అయినా సరే, 'మనకి సాయి ఉన్నారు' అని నేను ధైర్యంగా ఉన్నాను. మావారు ఇంట్లోనే ఐసోలేషన్‍లో ఉండసాగారు. మరుసటిరోజు ఒక బాబా భక్తురాలి ద్వారా మావారికి వేయమని ఆయుర్వేద మందు నాకు అందింది. బాబానే ఆ మందు పంపారు అనుకున్నాను. అయితే అప్పటికే మావారికి మొదటి డోసు కోవిడ్ చికిత్స మొదలుపెట్టేసరికి ఆ ఆయుర్వేద ముందు నేను మా ఆయనకి వెయ్యలేదు. కానీ, బాబా పంపిన మందు అని నేను వేసుకున్నాను.


అదే సమయంలో చివరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న మా అమ్మాయికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించాము. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తను కాలేజీలో పడిపోయింది. ఆ విషయం కాలేజీవాళ్ళు మావారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన చూస్తే, ఐసోలేషన్‍లో ఉన్నారు. నాకు ఏ విషయంలోనూ పెద్దగా అవగాహన లేదు. అందువల్ల నాకు ఏ ఇబ్బందీ లేకుండా అన్నీ మావారే చూసుకుంటారు. అలాంటి నాకు ఆ పరిస్థితిలో చాలా భయం వేసింది. అట్టి స్థితిలో ఎవరికైనా తమ తల్లిదండ్రులు గుర్తు వస్తారు. నాకు తల్లీ, తండ్రీ ఇద్దరూ సాయిబాబానే. అందుచేత ఆయన్నే, "నన్ను వదలకండి సాయిదేవా! మీరే నాతో ఉండి ఈ కష్టం నుండి దాటించండి" అని వేడుకున్నాను. అంబులెన్స్ తీసుకుని వెళ్ళి, మా అమ్మాయిని కాలేజీ నుండి హాస్పిటల్‌కి తీసుకుని వచ్చాను. అప్పుడు తనకి సెలైన్ పెట్టి, అన్ని టెస్టులు చేసి, "అన్నీ బాగున్నాయి, కానీ కోవిడ్ మైల్డ్ పాజిటివ్ ఉంది. కానీ అది వాక్సిన్ వల్ల అయుండొచ్చు. మందులు ఏమీ వద్దు. కేవలం విశ్రాంతి తీసుకుంటే చాలు" అని అన్నారు. కానీ ఆ సమయంలో మా అమ్మాయికి పరీక్షలు జరుగుతుండటం వలన ఏమి జరిగినా 'సాయిబాబా ఉన్నార'ని నేను కాలేజీ సార్‌కి ఫోన్ చేస్తే, "మేము తనకి తర్వాత పరీక్షలు పెడతాము. ప్రస్తుతం తనని విశ్రాంతి తీసుకోనివ్వమ"ని అన్నారు. అంతే, 'సాయి సాయి' అనుకోవటం తప్ప నాకు ఇంకో మాట లేదు. ఇకపోతే, అమ్మాయి కాలేజీలో పడిపోయిందని తెలిసినప్పటి నుండి నేను వీక్ అయిపోయాను. మరుసటిరోజుకి మరింత బలహీనపడిపోయాను. ఒళ్ళునొప్పులు, రుచి, వాసన కోల్పోయాను. దాంతో 'నాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింద'ని నాకు అర్దం అయిపోయింది. కానీ అప్పటికే ఇంట్లో ఉండే ముగ్గురిలో, అనారోగ్యం పాలై, కోవిడ్ భయంతో ఉన్న ఇద్దరికీ నా సంగతి తెలిస్తే, వాళ్ళు మరింత భయపడతారని నా సంగతి ఎవ్వరికీ చెప్పక సాయికే చెప్పుకుని, "తండ్రీ! ఎట్లా మమ్మల్ని బయటపడేస్తారోగానీ నా జీవితం మీ చేతిలో ఉంది. నేను మిమ్మల్నే నమ్ముతున్నాను" అని ప్రార్థించాను. నా సాయి నవగురువార వ్రతం ఆపకుండా చేసుకునేలా శక్తిని, ధైర్యాన్ని నాకు ఇచ్చారు. పూజకి కావాల్సినవన్నీ బయటకి వెళ్లకుండా సాయి భక్తులైన మా బంధువులతో ఏర్పాటు చేయించి, పూజ ఎంతో ఘనంగా చేసుకునేలా అనుగ్రహించారు. అంతేకాదు ఆయన కరుణతో అందరం కోలుకుని భయంకరమైన బాధని చాలా తేలికగా సునాయాసంగా దాటాము. అయితే, మా కర్మలో భాగంగా మేము అనుభవించాల్సిన బాధ అంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. అదేమిటంటే...


నవగురువార వ్రతం ఆఖరివారం రేపు, ఆ మర్నాడు వరలక్ష్మీవ్రతం అనగా ఆరోజు మావారు బయటకి వెళ్లి, వస్తూ బంగారు వరలక్ష్మి ప్రతిమ నా చేతికి ఇచ్చి బాత్రూంకి వెళ్ళారు. అలా వెళ్లిన ఆయన కాళ్ళు కడుక్కుని, బయటకి వచ్చే క్రమంలో పడిపోయారు. అప్పుడు వచ్చిన పెద్ద శబ్దానికి ఏమి జరిగిందో క్షణకాలం నాకు అర్థం కాలేదు. మావారు నా చేతిలో పెట్టిన ప్రతిమ నా చేతిలోనే ఉంది. అంతలోనే ఆ ఘటన జరిగింది. నేను, మా అమ్మాయి లేపుతున్నా మావారు పైకి లేవలేకపోయారు. అతికష్టం మీద ఆయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టి హాస్పిటల్‌కి ఫోన్ చేశాను. అంతసేపూ నేను 'సాయిరాం సాయిరాం' అని పైకి పెద్దగా అంటున్నానని తర్వాత మా అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. ఆ సమయంలో సాయి తప్ప నాకు ఇంకేమీ తెలియట్లేదు. "ఫ్రాక్చర్  ఏమి లేకుండా చెయ్యండి బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. 4గంటల తర్వాత వీల్ చైర్‌లో తీసుకెళ్తే తప్ప వెళ్లలేని స్థితిలో ఉన్నారు మావారు. ఆయన హాస్పిటల్లో వర్క్ చెయ్యటం వలన డాక్టర్లు మా ఇంటికే రావడం, స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చెయ్యటం జరిగింది. బాబానే వారందరిలో ఉండి మాకు సహాయం చేశారు. ఆ రాత్రి 10 గంటలవుతున్నా మావారి విషయంలో ఏ స్పష్టత లేకపోవడంతో మరుసటిరోజు నవగురువార వ్రత ఉద్యాపన చేయగలనని నేను అనుకోలేదు. సరిగ్గా అప్పుడే ఎక్స్-రే రిపోర్టు ఫ్రాక్చర్ ఏమీ లేదని వచ్చింది. అప్పుడు డాక్టరు, "ఫ్రాక్చర్ లేదు. 5 రోజులు విశ్రాంతి తీసుకుని, తరువాత బ్రేస్ పెట్టుకుని నడవొచ్చు" అన్నారు. బాబా మాపైన చూపిన ఆ ప్రేమ అద్భుతమైనది. అప్పుడు మావారు నాతో, "నువ్వు పూజ చేసుకో, నేను బాగానే ఉన్నాన"ని ధైర్యం చెప్పారు. దాంతో నేను ఒక్కదాన్నే స్వయంగా వండి 15 మందికి భోజనం ఏర్పాటు చేశాను. ఆ శక్తిని సాయే నాకు ఇచ్చారు. ఆయన కృపవలన ఎంతో బాగా పూజ పూర్తి చేసుకున్నాను. నవగురువార వ్రతం చేసిన ఆ తొమ్మిది వారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కునేందుకు కావల్సిన శక్తినిస్తూ, కర్మలో భాగంగా అనుభవించే బాధను సునాయాసంగా గట్టెక్కించి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు సాయిబాబా. నా మీద వారు చూపించిన కరుణాకటాక్షాలను ఎంతని చెప్పగలను? కానీ నాకు తగినంత శక్తి లేని కారణంగా నేను సంపూర్ణంగా బాబా లీలను, వారి ప్రేమను వ్రాయలేకపోయాను. కానీ బాబా మనతో ఉన్నారనే నమ్మకం చాలు, మనం ఎటువంటి పరిస్థితి నుండి అయినా దాటి ముందుకు వెళ్లగలము అనటానికి నా జీవితంలో జరిగిన ఈ అనుభవం మీ అందరికీ తెలియజేసాను. ఎప్పటికీ సాయి మనతోనే ఉంటారు. అయితే మనం సాయిని దర్శించగలిగేది ఎప్పుడు అంటే, 'సాయితత్వం అర్థం చేసుకుని వారి నీడలో నడవగలిగినప్పుడు...' ఆ శక్తిని వారు మనకి ఇస్తారని నమ్మకంతో ఆయన నామస్మరణలో ఉందాము.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


బాబాకి చెప్పుకుంటే చాలు - సమస్యలు లేకుండా పోతాయి


ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేనొక సాయిభక్తురాలిని. మనమందరం సాయి భక్తులమవడం నిజంగా మన అదృష్టం. బాబా నాపై చూపిన దయను నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. నేను నా గత అనుభవంలో మా అమ్మాయివాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు బాబాను వేడుకున్నంతనే ఫలించి అగ్రిమెంట్ అయ్యిందని తెలియజేసాను. బాబా అనుగ్రహం వల్ల ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇకపోతే, ఈమధ్య నా ఆరోగ్యం సరిగా లేకుంటే, డాక్టరుకి చూపించుకున్నాను. అప్పుడు డాక్టరు చెప్పిన టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే, ఆ టెస్టులు చేసిన ఆమె, "వెన్నెముకలో సమస్య ఉంద"ని చెప్పింది. నాకు భయమేసి, "బాబా! టెస్టు రిపోర్టులు మంచిగా ఉండి, నాకు ఏ సమస్య లేనట్లయితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన రిపోర్టులు బాగా వచ్చాయి. డాక్టరు, "సమస్య ఏమీ లేద"ని చెప్పారు. "చాలా సంతోషం బాబా".


ఈమధ్య ఒకసారి మా ఇంట్లో మా అమ్మాయి వెండి సామాన్లున్న కవరు కనిపించలేదు. ఇంట్లో అంతా వెతికినప్పటికీ ఆ వస్తువులు ఉన్న కవరు కనిపించలేదు. నేను అప్పుడప్పుడు బీరువాలో వస్తువులు బయటపెట్టి మర్చిపోతుంటాను. అలా ఆ వస్తువులు కూడా ఎక్కడైనా పెట్టి మర్చిపోయానేమోనని నేను చాలా కంగారుపడ్డాను. అప్పుడు, "బాబా! ఆ కవరు దొరికితే, నా ఆనందాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. నిజంగా బాబా ఎంతో దయామయులు. 5 నిమిషాల్లో ఆ కవరు బీరువాలోనే కనిపించింది. వాస్తవానికి అదేచోట నేను రెండు, మూడుసార్లు వెతికాను. అప్పుడు కనిపించని కవరు బాబాను తలుచుకోగానే కనిపించింది. ఇలా 20, 25 సంవత్సరాలుగా బాబా ఎన్నో కష్టాలు నుంచి, బాధల నుంచి కష్టం తెలియకుండా నన్ను కాపాడుతున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. సాయీ ఈ మధ్య మా పెద్దమ్మాయివాళ్ళు యు.కే. నుండి ఇండియాకి ప్రయాణమవబోతుండగా రెండు రోజుల ముందు టెస్టు చేయించుకుంటే, వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్లపై దయ చూపించు తండ్రి. నాకు చాలా దిగులుగా ఉంది. మీ కృపవలన వాళ్ళు క్షేమంగా ఇండియా వచ్చినట్లయితే నా సంతోషాన్ని మళ్ళీ తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1004వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎక్కడికి వెళ్లినా నా కన్నా ముందే అక్కడ ఉండే బాబా!
2. చల్లగా అనుగ్రహించే బంగారు సాయి తండ్రి
3. బాబా దయ

ఎక్కడికి వెళ్లినా నా కన్నా ముందే అక్కడ ఉండే బాబా!


అందరికీ నా నమస్కారాలు. నా పేరు శైలజ. బాబా తమను ఆశ్రయించిన భక్తులు ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా వారి చెంతనే ఉంటారు. శ్యామా గయ వెళ్ళినప్పుడు ఏన్నో ఏళ్ల ముందే అక్కడికి చేరిన బాబా అతనికి దర్శనమిస్తారు. నా విషయంలో కూడా ఎప్పుడూ అదే జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా నా కన్నా ముందే బాబా అక్కడ ఉంటారు. ఆ ప్రదేశంలో ఎక్కడో ఓ చోట ఫోటో రూపంలో బాబా నాకు దర్శనమిస్తారు. అలాంటి కొన్ని అనుభవాలను, తద్వారా బాబా నన్ను ఎల్లవేళలా ఎలా కాపాడుతున్నారో నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము ఢిల్లీలో ఉంటాము. మేము తరుచూ హిమాచల్‍ప్రదేశ్, ఉత్తరాఖండ్ వెళ్తూ ఉంటాము. ఆ కొండ ప్రాంతాల్లో ఏ మారుమూల ప్రదేశానికి మేము వెళ్లినా అక్కడ బాబా దర్శనమవుతుంది. మేము ఈ మధ్య అక్టోబర్ నెలలో 'కనతల్' వెళ్తూ టీ తాగుదామని ఒక ఢాబా దగ్గర ఆగాము. ఆ ఢాబాలో ఉన్న బాబా ఫోటో నన్ను ఆహ్వానిస్తున్నట్టు చిరునవ్వుతో దర్శనమిచ్చింది. అలా బాబాను చూసేసరికి నాకు చాలా సంతోషం కలిగింది. 


2021, నవంబర్ 20, శనివారం ఉత్తరాఖండ్‍లోని జాగేశ్వర్‍లో ఉన్న శివునికి అభిషేకం చేసుకుందామని నేను, మావారు మా కారులో బయలుదేరాము. మా ప్రయాణానికి ముందు మావారు బిజీగా ఉండి కారు కండిషన్ గురించి సరిగా చూసుకోలేదు. తెల్లవారుఝామున బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకి చేరుకోవచ్చని తలచి వేకువఝామునే మేము బయలుదేరాము. మధ్యలో రెండుసార్లు కారు ఆగిపోయిందికానీ స్టార్ట్ అయ్యింది. తరువాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో దాదాపు 100 మీటర్లలో దూరంలో మేము బుక్ చేసుకున్న హోటల్ ఉందనగా మా కారు మళ్లీ ఆగిపోయింది. చూస్తే, కారులోని బ్యాటరీ అయిపోయింది. కారు కొని 3 ఏళ్లు అయినందున బ్యాటరీ అయిపోయింది. చుట్టు కొండలు, లోయలు. నాకు చాలా భయం వేసింది. కానీ సరిగ్గా మా కారు ఆగిన చోట బాబా టెంపుల్ ఉంది. నాకంటే ముందే బాబా అక్కడ నా కోసం వేచి ఉన్నారు. ఆయన దయవల్ల ముగ్గురు మగపిల్లలు వచ్చి, ఏదో విధంగా కారు స్టార్ట్ చేసి ఇచ్చారు. అంతే నెమ్మదిగా మేము హోటల్ చేరుకున్నాము. అక్కడ ఒక డ్రైవరు తనకు తెలిసినవాళ్ల చేత కొత్త బ్యాటరీ తెప్పించి, మార్చారు. బాబానే ఆ రూపంలో వచ్చి మాకు సాయం చేశారు. బాబా దయవల్ల సంతోషంగా శివునికి అభిషేకం చేసుకుని తిరిగి వచ్చాము.


నాకు ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక పదిరోజులకు తగ్గింది కానీ, హఠాత్తుగా ఒకరోజు నాకు ఒళ్ళంతా బాగా దురదలు మొదలయ్యాయి. నేను సరేనని 'అలెగ్ర' టాబ్లెట్ వేసుకున్నాను. దాని ప్రభావం ఉన్నంతసేపు ఏమీ ఉండేది కాదుగానీ, ఆ మందు పవర్ అయిపోగానే మళ్లీ దురదలు మొదలయ్యేవి. ఒక రోజు అయితే ఎంతలా దురదలంటే, ఆ దెబ్బకి వణుకు వచ్చేసి మొహం, పెదాలన్నీ వాచిపోయాయి. వెంటనే నన్ను ఒక మంచి స్కిన్ స్పెషలిస్ట్ కలిశారు. ఆవిడ రూపంలో బాబానే వచ్చారు. ఆవిడ నాకు మంచి మందులిచ్చి, ఒక నెల వాడమన్నారు. బాబా దయవల్ల ఆ మందులతో నాకు నయమైంది. "సాయినాథా! ధన్యవాదాలు తండ్రి. మీ లీలలు ఏమని చెప్పను తండ్రి?".


చల్లగా అనుగ్రహించే బంగారు సాయి తండ్రి


నా పేరు లత. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు. బాబా లీలలు ఎన్నెన్నో. ఆయన ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేను. నేనిప్పుడు బాబా ప్రసాదించిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. ఇటీవల మేము మా మనవరాలికి పుట్టువెంట్రుకలు తీయించి, చెవులు కుట్టించాలని అనుకున్నాం. కానీ అనుకోని అవాంతరాలు వచ్చి పడుతుండేవి. అప్పుడు నేను బాబాతో, "ఏ ఆటంకాలు లేకుండా చూడండి బాబా" అని చెప్పుకున్నాను. అంతే, అనుకున్న తేదీన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో నిర్విఘ్నంగా కార్యక్రమం పూర్తి చేయించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఈమధ్య మా అల్లుడువాళ్ళు యూరప్ టూర్‌కి వెళ్ళాలని అనుకున్నారు. అయితే వాళ్ళ ప్రయాణానికి కొద్దిరోజుల ముందు మా అల్లుడికి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించింది. ఆ మాట వింటూనే మా పైప్రాణాలు పైనే పోయినంత పనైంది. ఆ కష్టకాలంలో నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే నామాన్ని పఠిస్తూ, బాబాపైన, అమ్మ(లలితమ్మ)పైన భారం వేసి, ఆ రాత్రంతా బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు మధ్యాహ్ననికి మా అల్లుడికి జ్వరం తగ్గి క్రమక్రమంగా కోలుకోసాగారు. తర్వాత ఐదారు రోజులకి పూర్తిస్థాయిలో ప్లేట్లెట్ కౌంట్ పెరిగి మా అల్లుడు పూర్తిగా కోలుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం యూరప్ టూర్‌కి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇదంతా బాబా దయవలన జరిగింది. నా తండ్రి కృప ఎంతని చెప్పగలను? నా బంగారు తండ్రి మీ పాదాలయందు నా నమ్మకాన్ని సదా ధృఢపరుస్తూ నన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడు సాయి బంగారం".


బాబా దయ


బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగును డైలీ చదువుతున్న తోటి భక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఇటీవల ఒకరోజు నా భర్తకి దగ్గు వచ్చింది. మరుసటిరోజుకి నోరు చేదుగా అనిపించింది. నాకు చాలా భయమేసి నీటిలో బాబా ఊదీ వేసి మావారికి ఇచ్చాను. ఆ తర్వాత, "బాబా! నా భర్తకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోతే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో నా భర్తకి నార్మల్ అయింది. "ఇది మీ దయవల్లే జరిగింది, థాంక్యూ బాబా".


ఇంకొరోజు నా భర్త మా రెండేళ్ల బాబుని తీసుకుని షాపింగ్‍కి వెళ్ళారు. మా బాబు ఎప్పుడూ అటూఇటూ తిరుగుతూ అవీ ఇవీ తాకుతూ ఉంటాడు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మాకు కొంచెం భయంగా అనిపించింది. అప్పుడు నేను బాబాతో, "వాళ్లకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".



సాయిభక్తుల అనుభవమాలిక 1003వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చల్లని సంరక్షణ
2. శ్రీసాయి అనుగ్రహం
3. బాబాను వేడుకున్నంతనే దొరికిన మొబైల్

బాబా చల్లని సంరక్షణ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు కల్పన. నేను సాయిభక్తురాలిని. నా జీవితంలో అడుగడుగునా బాబా నాకు ఎంతో సహాయం చేసారు, చేస్తున్నారు. వాటిలో కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కృష్ణయ్యని పూజించి, సాయి నామజపం చేశాను. అలాగే నా ఆరోగ్యం బాగుండాలని, మా అబ్బాయికి మంచి దారి చూపించాలని నాకు తెలిసిన అంజనమ్మగారితో మూడుసార్లు బాబా భజన చేయించాను. ఆవిడ నన్ను 'సాయిఅమ్మ'గారి (సాయి ఉపాసకురాలు) వద్దకి తీసుకుని వెళ్లారు. నేను అమ్మతో నా కుడిభుజం వెనుకభాగం చాలా నొప్పిగా ఉందని చెబితే, అమ్మ విభూతి ఇచ్చారు. దాంతో నాకు భుజం నొప్పి పూర్తిగా తగ్గింది. తర్వాత ఒకసారి కడుపులో గ్యాస్ ఎక్కువైనందువల్ల నొప్పి వస్తుండేది. అది కూడా బాబా దయవల్ల 'సాయిఅమ్మ' ఇచ్చిన విభూతితో పూర్తిగా నయమైంది. తర్వాత ఒకసారి కుడి కన్ను నొప్పిగా ఉండి, ఏవీ చదవలేకపోయేదాన్ని. దాంతో బాబా పుస్తకాలు చదవలేనని చాలా బాధపడ్డాను. అప్పుడు బాబా, "శక్తిని ఇస్తాను" అని అన్నారు, అలాగే ఇచ్చారు. విభూతి రాయడం వలన నాకున్న కంటి సమస్య తగ్గింది. నాకు అరుగుదల తక్కువగా ఉండేది. అందువలన తిన్నది త్వరగా జీర్ణమయ్యేది కాదు. ఆ సమస్య కూడా బాబా దయవలన పరిష్కారమై నా జీర్ణవ్యవస్థ మెరుగుపడింది. 2021, ఏప్రిల్ నెలలో నా యూరినరీ బ్లాడర్ లో గడ్డ ఉందని, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డకి దగ్గరగా ఉందని అన్నారు. మావారు భయపడి బాబాను వేడుకున్నారు. బాబా దయవలన అది మామూలు గడ్డ అని నిర్ధారణ అయింది. ఒకసారి బాబా సన్నిధానంలో ఆయన దయవలన తగ్గిన నా ఆరోగ్య సమస్యల గురించి స్వర్ణగారు అనే ఆమె చెప్పమంటే, నలుగురిలో తడబడతానని భయంతో చెప్పలేకపోయాను. "బాబా! ఇన్ని రోజులూ తడబడతానని, కన్నీరు ఆగదని మీకు కృతజ్ఞత తెలుపలేకపోయాను. నన్ను క్షమించండి".


మావారు ఉద్యోగ విరమణ చేసినప్పుడు, ఇకపై ఆదాయం సరిగా ఉండదని భయపడ్డారు. బాబా మాపై దయతలచి ఉద్యోగ విరమణ చేశాక కూడా మాకు డబ్బులు సమకూర్చారు. బాబా ఆశీస్సులతో మా పిల్లలకి మంచి ఆదాయం, గుర్తింపు, మాకు సొంత ఇల్లు లభించాయి. 15 సంవత్సరాలకు పైగా సమస్యలలో ఉన్న ఒక ఇంటికి సంబంధించి బాబా దయవల్ల ఒక పరిష్కారం లభించి ఆ ఆస్తి అమ్మకి, అక్కకి, నాకు దక్కాలని తేలింది. ఇలా ఎన్నో విషయాలలో బాబా నాకు అండగా నిలిచారు, చేయలేని పనులను చేయించారు.


ఇంకో విషయం, 'సాయిఅమ్మ' ఇచ్చే విభూతి సాధారణంగా నెల పైన వస్తుంది. అలాంటిది ఈసారి విభూతి పరిమాణం పెరుగుతూ మూడు నెలలపైన వచ్చింది. ఇది బాబా లీలల్లో ఒక గొప్ప అద్భుతం.


"ధన్యవాదాలు బాబా. మమ్ము నడిపించే తల్లి, తండ్రి, అండదండ మీరే బాబా. మీ చల్లని నీడలోనే బ్రతుకుతున్న మేము ఎంతగా మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే తండ్రి. మీ పాదాల చెంత మీ నామస్మరణ చేసుకుంటూ మా నలుగురి జీవితాలు తరించిపోవాలని కోరుకుంటున్నాను".


చివరిగా ఒక మాట: 'ఎవరైనా సరే బాబా నామస్మరణ చేయడం వలన ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతారన్నది నా అనుభవం. అందరూ ఇది ఆచరించవచ్చు. బావిలో నీరు తోడే కొలది ఎలా ఊరునో, బాబాను సేవించే కొలదీ వారి కృప లభిస్తుంది. తప్పక ఆయన ఆశీస్సులతో అనుకున్న అభీష్టం నెరవేరుతుంది. అందరికీ ఆయన ఆశీస్సులు లభించుగాక!'.


శ్రీసాయి అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు వీరాస్వామి. మాది వరంగల్ జిల్లాలోని లింగాల గ్రామం. బాబా ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 1996వ సంవత్సరంలో నేను బతుకుదెరువు నిమిత్తం బరోడా వెళ్ళేముందు, 'తిరుగు ప్రయాణంలో శిరిడీ దర్శించుకుని వద్దామ'ని మనసులో అనుకుని బయలుదేరాను. బరోడాలో పని ముగించుకుని రైల్లో మా ఊరికి తిరుగు ప్రయాణమయ్యాను. రైల్లో అనుకోకుండా నా కాలు తెగి రక్తం మడుగుకట్టింది. నేను గమనించేసరికి శిరిడీ వెళ్ళడానికి దిగాల్సిన స్టేషన్ దాటింది. అప్పుడు నేను, "బాబా! నేను తప్పు చేశాను. బరోడా వెళ్లి వచ్చేటప్పుడు నిన్ను దర్శించుకుంటాను అనుకుని మిమ్మల్ని దర్శించుకోలేదు. అందుకు తగిన శిక్ష వేసావా తండ్రి?" అని అనుకున్నాను. ఆ తరువాత వచ్చిన స్టేషన్ లో దిగి వెనుతిరిగి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని మా గ్రామం వచ్చాను. నేను గ్రామం చేరుకున్నాక బాబా ఆశీస్సులతో మాకు పుత్రిక జన్మించింది. అమ్మాయికి 'సాయి సుధా' అని నామకరణం చేసుకున్నాము.


ఒకసారి నేను బైక్ మీద వేరే గ్రామానికి పనిమీద వెళుతున్నాను. ఇంతలో వెనుక నుండి ఒక కారు వచ్చి నన్ను గుద్దింది. ఆ ప్రమాదంలో నేను స్పృహ కోల్పోయాను. నన్ను హాస్పిటల్లో చేర్పించారు. 9 రోజులు కోమాలో ఉన్న నన్ను ఏ డాక్టరు చూసినా "ఇతను బ్రతకడ"ని చెప్తుండేవారు. అయితే బాబా దయవల్ల నేను సృహలోకి వచ్చాను. స్పృహలోకి అయితే వచ్చాను కానీ, నాలో చలనం లేదు. నేను బ్రతకనేమోనని భయంతో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ప్రతి నిమిషం, ప్రతిక్షణం సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. అలా వారం రోజులు గడిచేసరికి నాలో కదలిక వచ్చింది, మాట్లాడగలిగాను. డాక్టర్లు "ఇతనికి ప్రాణాపాయం తప్పింద"ని చెప్పారు. ఆ మరుసటిరోజు ఉదయం నేను మా గ్రామానికి వచ్చేసాను. ఇక ఆరోజు నుండి ప్రతిరోజూ బాబా నాకు కలలో కనిపించేవారు. ఒకరోజు కలలో బాబా జోలె పట్టుకుని వచ్చి, ఒక స్టూలు మీద ఆకుపచ్చని వస్త్రం పరిచి, "నీవు నాకు ఏమి ఇచ్చావు?" అని అడిగారు. అప్పుడు నేను, "నా దగ్గర ఐదు నాణాలు ఉన్నాయ"ని చెప్పి, ఆ 5 నాణాలను వస్త్రం యొక్క నాలుగు మూలల్లో ఒక్కొక్కటి ఉంచి, మధ్యలో ఒకటి ఉంచాను. బాబా ఆ ఐదు నాణాలను మూటకట్టుకుని అదృశ్యమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బాబా కనిపిస్తూనే ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".


బాబాను వేడుకున్నంతనే దొరికిన మొబైల్


సాయిభక్తలందరికీ నమస్తే. నా పేరు మహేష్. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మన ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవం పంచుకుంటాను. 2021, నవంబర్ 20న మేము మా పొలంలోని వరి పంట తీద్దామని వెళ్ళాము. పనిలో నిమగ్నమై ఉండగా నా మొబైల్ ఫోన్ పొలంలో ఎక్కడో జారి పడిపోయింది. కాల్ చేస్తే, రింగ్ అవుతుందిగానీ, మాకు రింగ్ టోన్ వినిపించడం లేదు. నేను, నా స్నేహితులు కలిసి ఆ ప్రదేశమంతా చాలాసేపు వెతికినప్పటికీ ఫోన్ కనిపించలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! నా మొబైల్ ఫోన్ దొరికినట్లైతే నా అనుభవం మన బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లో మొబైల్ నా స్నేహితుడికి దొరికింది. అంతసేపు అంతలా మేము పొలమంతా వెతికినా దొరకని మొబైల్‌ను తమను వేడుకున్నంతనే కనపడేలా చేసిన బాబా కృపకు చాలా సంతోషమేసింది. "ధన్యవాదాలు సాయినాథా. ప్లీజ్ బాబా! త్వరగా నేను కోరుకుంటున్న మార్గాన్ని నాకు చూపించండి. మీ అనుగ్రహం కోసం 'శ్రద్ధ, సబూరి'లతో నిరీక్షిస్తున్నాను తండ్రి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1002వ భాగం....



1. బాబా నాపై వర్షించిన అనుగ్రహం
2. దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు
3. కృపతో ఏ ఇబ్బందీ లేకుండా అనుగ్రహించిన బాబా

బాబా నాపై వర్షించిన అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నా పేరు జ్యోతి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి నా స్నేహితురాలు బాబా గుడికి వెళ్దామని నన్ను పిలిస్తే, మొదటిసారి తనతోపాటు బాబా గుడికి వెళ్ళాను. ఏదో స్నేహితురాలు పిలిచిందని వెళ్లానే తప్ప, అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలీదు. మరుసటిరోజు నా మొదటి సంవత్సరం మాథ్స్ ఎగ్జామ్. అసలు ఏ ప్రిపరేషన్ లేకున్నా అలాగే వెళ్లి పరీక్ష వ్రాసి వచ్చాను. ఎంత మాత్రమూ  ఆ పరీక్ష పాస్ అవుతానని అనుకోని నేను, మంచి మార్కులతో పాసయ్యాను. అప్పుడు, 'ముందురోజు బాబా గుడికి వెళ్ళాను. బాబా కృపవలనే నేను ఈ పరీక్ష పాస్ అయ్యాన'ని నేను గ్రహించాను. అప్పటినుండి నేను బుద్ధి పుట్టినప్పుడల్లా బాబా గుడికి వెళ్తుండేదాన్ని. తర్వాత నేను ఎంసీఏ చేసి చివరి సంవత్సరం పరీక్షలు వ్రాసాక ఉద్యోగం చూసుకోవడం కోసం హైదరాబాదు వెళ్లి హాస్టల్లో చేరాను. అదే సమయంలో మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి సంబంధాలు చూస్తుండేవారు. మా హాస్టల్ పక్కనే బాబా గుడి ఉండేది. స్నేహితులతో కలిసి వెళ్లి, బాబాకి దణ్ణం పెట్టుకుని వచ్చేదాన్ని. అప్పట్లో ఇప్పుడు బాబా మీద ఉన్నంత భక్తి ఉండేది కాదు. కేవలం గుర్తు వచ్చినప్పుడు బాబా దర్శనం చేసుకుని రావడం, అంతే. బాబా దయవలన నేను మంచి పర్సంటేజ్ తో ఎంసీఏ పాసయ్యాను, మంచి సంబంధం కూడా సెట్ అయింది. మొదటి శుభలేఖ బాబా పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకున్నాను. అలా బాబా ఆశీస్సులతో నా వైవాహిక జీవితం మొదలైంది. అయితే బాబాకి దూరమయ్యాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడొక స్నేహితురాలు 'సాయి లీలామృతం' పుస్తకం నాకిచ్చి, "మనసు పెట్టి దీన్ని చదువు" అని చెప్పింది. అదేరోజు ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. బాబా ఆశీస్సులతో తెలియకుండానే ఎంతో తేలికగా నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, మేము అమెరికాకి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ఉద్యోగమూ రాలేదు. అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ సాయి లీలామృతం చదవడం మొదలుపెట్టాను. అంతే! నాకు తగినట్లు, కావాల్సిన విధంగా అనుకూలమైన సమయంతో నేను చేయగలిగిన ఉద్యోగం వచ్చింది. అది నేను అస్సలు ఊహించలేదు. నిజానికి జాబ్ చేసేవాళ్ళను చూసినప్పుడు అన్ని టెన్షన్స్ అవసరమా అని నాకు అనిపించేది. కానీ ఏంసిఏ చేసి ఖాళీగా ఉండటం బాధేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తే, బాబా నాకు ఎంత అద్భుతం చూపించారో చూడండి. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది. అలా ఎన్నోసార్లు బాబా మాకు సహాయం చేశారు. అయితే కొన్ని రోజుల నుండి నా ఆరోగ్య విషయంగా నేను టెన్షన్ పడుతున్నాను. బాబా దయవల్ల అంతా బాగుంటే మళ్ళీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నాకు అన్నీ మీరే బాబా. చాలా టెన్షన్ పడుతున్నాను. దయచేసి నన్ను ఈ టెన్షన్స్ నుండి బయటపడేసి నా మనసు మంచిగా ఉండేటట్లు చూడండి బాబా".


దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు


ముందుగా సాయి మహారాజ్‌కి ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నా పేరు సరిత. ఇంతకు ముందు నా అనుభవంలో సాయి మమ్మల్ని వరదల నుండి ఎలా కాపాడారో పంచుకున్నాను. ఇప్పుడు నా రెండో అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకుంటున్నాను. 2021 దసరా సెలవులకి నేను, మా బాబు మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకున్నాం. అందుకు సన్నద్ధమవుతుండగా ముందురోజు రాత్రి హఠాత్తుగా నాకు గొంతునొప్పి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! రేపు మా ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. సాయి మహిమ చూడండి. ఉదయం లేచేసరికి నొప్పి తగ్గిపోయింది. మా ప్రయాణం క్షేమంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా".


నేను ఇప్పుడు పంచుకోబోయేది చాలా గొప్ప లీల. మేము మా ఫ్లాట్ ఒకటి అమ్మకానికి పెట్టి ఏడేళ్లు అయ్యింది. అందరూ రావడం, చూసి వెళ్లడం తప్ప ఇంకేమీ జరిగేది కాదు. అలా ఉండగా 2021, అక్టోబరు నెలలో ఒకరు ఫ్లాట్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. కానీ మాకు నమ్మకం కుదరక, 'ఎప్పటిలాగే వీళ్ళు కూడా చూసి వెళ్తారు' అనిపించి, "బాబా! వీళ్ళు మా ఫ్లాట్ కొంటే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు. చివరికి మా ఫ్లాట్ అమ్మగలిగాము. ఇది సాయి చేసిన అద్భుతమే. ఎందుకంటే, ఏడేళ్ల కాలంలో మేము ఎంతగానో ప్రయత్నించాం. ఒకానొక దశలో ఆశలు వదులుకున్నాము కూడా. అలాంటిది నా తండ్రి సాయినాథుని కృపతో ఫ్లాట్ అమ్మగలిగాము. "థాంక్యూ వెరీ మచ్ బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


కృపతో ఏ ఇబ్బందీ లేకుండా అనుగ్రహించిన బాబా


సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు శ్రీకాంత్. ఈమధ్య నేను, నా భార్య గ్యాస్ట్రిక్ సంబంధిత నొప్పితో అనారోగ్యానికి గురి అయ్యాము. ఆ కారణంగా మూడురోజుల పాటు సరిగా నిద్ర కూడా పట్టక ఇద్దరమూ  తీవ్రమైన ఇబ్బందికి లోనయ్యాము. దాంతో నేను కార్తీకపౌర్ణమి రోజు సద్గురు శ్రీ సాయినాథుని దర్శించి, "మా ఇద్దరికీ ఆరోగ్యపరమైన సమస్యలేమీ లేకుండా కాపాడండి బాబా" అని వేడుకుని, అదేరోజు సాయంత్రం మేము డాక్టరు దగ్గరకు వెళ్ళాము. ఆ సాయినాథుని కృపవల్ల డాక్టరు పరీక్షలు చేసి మాకు ఎలాంటి సమస్య లేదని, ఆ గ్యాస్ట్రిక్ నొప్పి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అది వింటూనే నేను చాలా ఆనందపడి మనసులోనే ఆ సద్గురు సాయినాథునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నమ్ముకున్నవారికి నమ్మినంత ఆ సద్గురు సాయినాథుని కృపాకటాక్షాలు లభిస్తాయి. చివరిగా 'మా ఆరోగ్యాలు బాగుండాల'ని కోరుకుంటూ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1001వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి చిన్న ఇబ్బందిని తొలగిస్తున్న బాబా
2. బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకు అంత మంచిది
3. బాబా కృపతోనే తగ్గిన జ్వరం

ప్రతి చిన్న ఇబ్బందిని తొలగిస్తున్న బాబా


రోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివే భక్తులకు మరియు పవిత్ర భావంతో ఎంతో ఓపికగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. మాకు రెండు సంవత్సరాల మూడు నెలల వయస్సున్న బాబు ఉన్నాడు. తను ఒకరోజు ఆడుకుంటూ కాలుజారి పడటం వలన బాగా దెబ్బ తగిలింది. తన కాలికి ఏమైనా సమస్య అవుతుందేమోనని నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబు కాలికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి, మామూలుగా నడవగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన మూడు రోజుల్లో బాబు కాలు నార్మల్ అయ్యింది. "థాంక్యూ బాబా".


ఒకరోజు బాబు పాల సీసాతో ఆడుకుంటూ దానికి రంధ్రం చేసాడు. దాంతో చాలా సమస్య అవుతుందని నేను భయపడ్డాను. ఎందుకంటే, ఆ రకం సీసాలు ఇండియాలో మాత్రమే దొరుకుతాయి. నేను అక్కడినుండే వాటిని తెచ్చుకున్నాను. అందువలన "బాబా! ఏ సమస్యా లేకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. "థాంక్యూ బాబా".


నా భర్త తనకి ఉద్యోగం లేకపోవడం వల్ల కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కోచింగ్ తీసుకోసాగారు. అందుకోసం ఆయన చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన క్లాసులు పూర్తయితే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే ఏ సమస్యలు లేకుండా తన క్లాసులు పూర్తయ్యాయి. "థాంక్యూ బాబా".


ఆ తర్వాత కొన్ని రోజులకి నా భర్త సరుకులు తేవడానికని షాపుకి వెళ్లారు. పని పూర్తిచేసుకుని షాపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడటం వల్ల ట్రామ్ స్టేషన్ దగ్గర సైకిల్ జారి కింద పడిపోయారు. ఆ ఘటనలో ఆయన కాళ్లకు చిన్నగా దెబ్బలు తగిలాయి. మామూలుగా అయితే పెద్ద ప్రమాదం జరగాల్సిన పరిస్థితి. కానీ చిన్న దెబ్బలతో బాబా నా భర్తను కాపాడారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు మేము ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాం".


2021, నవంబరులో ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల సమస్య వచ్చి మేము చాలా ఇబ్బందిని ఎదుర్కున్నాము. నెట్ కనెక్షన్ సరి చేయడానికి టెక్నీషియన్లు రెండుసార్లు వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్ ప్రాబ్లం పరిష్కారమైతే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 2021, నవంబర్ 19న టెక్నీషియన్ వచ్చి నెట్ సమస్య పరిష్కరించారు. ఇదంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఇటీవల పొలంలో మా నాన్నకి పాము కరిచింది. బాబా దయవల్ల త్వరగానే కోలుకున్నారు కానీ, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అప్పుడు నేను, 'నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా నయమైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అని అనుకున్నాను. బాబా దయవల్ల  నాన్నకి నయమైంది. "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్".


ఒకసారి మావారు బయటకి వెళ్లాల్సిన పని పడింది. ఆయన వెళ్ళే ప్రదేశంలో జనం ఎక్కువగా ఉంటారని కాస్త భయమేసి, "బాబా! మీ దయవల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ ప్రాబ్లమ్ కాలేదు. కానీ కొంచం దగ్గు, నోరు చేదు ఉన్నాయి. బాబా దయవల్ల అవి కూడా తగ్గితే బ్లాగులో పంచుకుంటాను.


బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకు అంత మంచిది


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయిబంధవులందరికీ, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయితో తమకున్న అనుభవాలు పంచుకుంటున్న భక్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా పేరు ముసానపల్లె నిరంజన్ రెడ్డి. నేను రెండోసారి ఈ  బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను రెండు నెలల నుంచి ఉదయం పూట శ్రీ శిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర మరియు సాయంత్రం ఏడు గంటల సమయంలో శ్రీ భగవద్గీత పారాయణ చేస్తున్నాను. ఆ క్రమంలో 2021, నవంబర్ 17న పారాయణ చేయబోతే అక్షరాలు సరిగా కనపడక పారాయణ చేయడానికి వీలు పడలేదు. మరుసటిరోజు 2021, నవంబర్ 18, గురువారంనాడు నేను బాబాను భక్తితో  పారాయణ చేస్తానని ప్రార్థించిన తరువాత పారాయణ మొదలుపెట్టాను. ఆరోజు అక్షరాలు బాగా కనిపించి భక్తిశ్రద్ధలతో పారాయణ చేయగలిగాను. ఇలా పవిత్రమైన మనసుతో భక్తిగా పారాయణ చేస్తుంటే అక్షరాలు బాగా కనపడుతూ పారాయణ చక్కగా జరగడం, నిర్లక్ష్యంగా ఎలాగైనా పారాయణ చేయాలని చేస్తే, అక్షరాలు సరిగా కనపడకపోవడం నాకు చాలాసార్లు అనుభవమైంది. ఈ అనుభవం ద్వారా బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకి అంత మంచిదని గ్రహించాను. "బాబా! మీకు సర్వస్య శరణాగతి వేడుతున్నాను తండ్రి".


సర్వేజనా సుఖినోభవంతు!


బాబా కృపతోనే తగ్గిన జ్వరం


నేను సాయిభక్తురాలిని అనేకన్నా సాయి బిడ్డని అని చెప్పుకుంటాను. నేను రెండోసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. ఇటీవల మా అబ్బాయి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడ్డాడు. మేముండే ప్రాంతంలో డెంగ్యూ కేసులు ఉన్నందువలన నేను చాలా ఆందోళన చెందాను. నేను రోజూ పూజ చేసేటప్పుడు అబ్బాయి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తూ(ప్రత్యేకించి బాRబాను కాదు) బాబుకి చాలా మందులిచ్చాను. కానీ జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను నా ఏకైక దైవమైన సద్గురు శ్రీ సాయినాథుని ప్రార్థించాలని నిర్ణయించుకుని ఆర్తితో ఆయనను ప్రార్థించాను. మరుసటిరోజు నుండి అద్భుతం జరిగింది. మా అబ్బాయి జ్వరం తగ్గుముఖం పట్టింది. మేము అబ్బాయికి కొన్ని టెస్టులు చేయించాము. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. బాబా తీవ్రమైన జ్వరం నుండి మా అబ్బాయిని కాపాడారు. నాకు ఇంకొక కోరిక ఉంది. అదేమిటో బాబాకు తెలుసు. ఆయన అనుగ్రహంతో తొందరలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అది నెరవేరితే ఆ అనుభవాన్ని కూడా పంచుకుంటాను. "థాంక్యూ బాబా"



సాయిభక్తుల అనుభవమాలిక 1000వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ దర్శనానుభూతుల సమాహారం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజునా గుప్తా. మాది నర్సంపేట, వరంగల్ జిల్లా. నేను మీకు సుపరిచితురాలిని. నేను ఇంతకు ముందు నా అనుభవాలు మూడు పంచుకున్నాను. ఇప్పుడు పంచుకుంటున్న వాటిని అనుభవాలని అనను. ఎందుకంటే, ఇవి నా శిరిడీ సందర్శనాలకి సంబంధించిన నా అనుభూతుల సమాహారం.


మొదటి శిరిడీ దర్శనం:


నేను 1994 నుండి సాయిబాబా భక్తురాలిని. నిజానికి నేను అంతకుముందే ఒకసారి(ఖచ్చితంగా ఏ సంవత్సరం అన్నది గుర్తులేదు) నేను శిరిడీ దర్శించాను. మేము వైశ్యులం. నేను, నా భర్త ఒకసారి మా కుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన వారం రోజుల టూర్‌కి వెళ్ళాం. ఆ టూర్‌లో మేము దర్శించిన ప్రదేశాలలో శిరిడీ కూడా ఒకటి. అదే మేము మొదటిసారి శిరిడీ దర్శించడం. అయితే అప్పటికి నాకు శిరిడీ అంటే ఏంటో, సాయిబాబా అంటే ఏంటో, బాబా తత్వం ఏంటో తెలీదు. 'బాబా ప్రేమ స్వరూపుడని, దయామయుడని, కరుణా సాగరుడని, అడిగినవారికి, అడగనివారికి వరాలిచ్చే దైవమని, పిలిస్తే పలికి వెన్నంటే ఉంటాడ'ని తెలియదు. ఇప్పుడంటే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి 'సాయీ' అనగానే చమత్కారంగా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారు. కానీ అప్పటిరోజుల్లో సాయినాథుడి గురించి పెద్దగా ప్రచారం లేదు. అలాంటి రోజుల్లోనే నేను, మావారు శిరిడీ వెళ్ళాము, కాకడ హారతికి హజరయ్యాం. అప్పట్లో భక్తులకు రోజ్ వాటర్, గంగాజలం తీసుకెళ్ళి స్వహస్తాలతో సాయినాథునికి సమర్పించుకునే అవకాశం ఉండేది. తర్వాత అక్కడే సమాధి మందిరం ప్రధాన హాల్లో కూర్చుని బాబాకి జరిగే అభిషేకాన్ని, మంగళస్నానాన్ని, అలంకరణను తిలకించే వీలుండేది. బయట గులాబీలు, దవనం, సబ్జా దళాలతో కలిపి పుష్పగుఛ్ఛాలుగా మలచి అమ్మేవాళ్ళు. అవి తీసుకొచ్చి బాబా సమాధి మీద మనమే స్వయంగా పెట్టి దణ్ణం పెట్టుకునే సదుపాయం ఉండేది. అలా నేను బాబాను దర్శించుకుని బయటకి వచ్చే మార్గంలో ప్రవేశద్వారానికి సమీపంలో సమాధి అరుగును ఆనుకొని కూర్చుని ఉన్న పూజారి బాబాకి సమాధి మీద భక్తులు సమర్పించుకున్న పుష్పగుచ్ఛాలలోని ఒక పువ్వు తీసి నాకు ఇచ్చారు. నా ముందు, వెనక చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఎవరికీ పూలు ఇవ్వలేదు. అంతటి భాగ్యాన్ని ఆ సాయినాథుడు నాకు మొదటి దర్శనంలోనే ప్రసాదించినా నేను ఆయనను ఆ క్షణం నుంచి పట్టుకోలేకపోయాను. ఇది ఆ బాబా తండ్రి గురించి ఏమీ తెలియని రోజుల్లో నాకు జరిగిన నా మొట్టమొదటి అనుభూతి.


రెండోసారి శిరిడీ దర్శనం:


2013, అక్టోబర్ 21న నేను రెండోసారి శిరిడీ వెళ్ళాను. అప్పటి నా ప్రయాణం గురించి గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా దుఃఖం వస్తుంది, అదే సమయంలో సంతోషం కూడా కలుగుతుంది. నిజానికి అప్పుడు నాకు శిరిడీ వెళ్ళాలన్న ఆలోచనగానీ, ప్రణాళికగానీ లేవు. బాబానే నాకు తమ దర్శన భాగ్యాన్ని మరోసారి అనుగ్రహించారు. వివరాలలోకి వెళితే... మేము రమణానందమహర్షి వారి శిష్యులం. అప్పట్లో మహర్షి భక్తి టీవీలో బాబాతత్వం గురించి, బాబాతో సహజీవనం చేసిన నాటి భక్తుల గురించి వివరిస్తుండేవారు. ఆయన బాబాతత్వం, బాబా లీలల్లోని భావార్ధం గురించి చాలా లోతుగా వివరించి చెప్తుంటే, అప్పటికే సాయిభక్తులమైన మాకు ఎంతగానో నచ్చేవి. తెలియని ఎన్నో విషయాలు వారి ప్రవచనాల ద్వారా తెలుసుకుంటుండటం వల్ల బాబాపై భక్తిశ్రద్ధలు మరింతగా పెరిగి బాబాను విపరీతంగా ప్రేమిస్తుండేదాన్ని. 2011, నవంబర్, కార్తీకమాసంలో నేను, మావారు మొదటిసారి మహర్షి వారిని దర్శించుకున్నాము. అప్పటినుంచి వారి ప్రవచనాలు చెప్పినప్పుడు, కార్యక్రమాలు ఉన్నప్పుడు కుదిరితే నేను, నా భర్త తప్పకుండ హాజరవుతుండేవాళ్ళం. కనీసం శివరాత్రి వేడుకలకైనా వెళ్లేవాళ్ళం. అలా 2012, 2013లో వెళ్లి వచ్చాము. తరువాత 2013 అక్టోబర్లో మహర్షి శిరిడీలో 11 రోజులు ప్రవచనం పెట్టారు. ఆ విషయం తెలిసినా కూడా మాకు శిరిడీ వెళ్లాలన్న ఆలోచన లేదు. దూరమని కాదుగానీ మా కుటుంబ పరిస్థితుల రిత్యా వెళ్లగలిగే స్థితిలో లేము. మా ఇంట్లో, మా శరీరంలో కూడా శక్తి లేదు(ఆర్థికపరమైన విషయం కాదు. అది వేరే విషయం. దాన్ని అతి త్వరలో మీతో పంచుకుంటాను). అందుకనే మేము శిరిడీ వెళ్ళే ఆలోచన చేయలేదు. కానీ ఆ సాయినాథుడు ఊరుకోడుగా! ఆయన ఎవరినైతే తమ చెంతకు రప్పించుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితిల్లో ఉన్నా గాలమేసి మరీ రప్పించుకుంటారు.


అనుకోకుండా మహర్షి వారికి దగ్గరగా ఉండే ఒక సన్నిహితురాలు నాకు ఫోన్ చేసి, "ఫ్రెండ్స్ అందరం శిరిడీ వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నాము. అంజనా నువ్వు కూడా వస్తున్నావా?" అని అడిగారు. "నేను రావడం లేదు" అని చెప్పాను. అందుకు తను కారణమేమిటని అడిగితే, "మా కుటుంబ పరిస్థితులు మీకు తెలిసిందే కదా!" అని చెప్పేసి ఊరుకున్నాను. నేను అలా చెప్పేసరికి తను మరేం మాట్లాడలేకపోయారు. నేను కూడా దాని గురించి మళ్లీ ఆలోచించలేదు. తరువాత వాళ్ళ శిరిడీ ప్రయాణానికి 10 రోజులు ఉందనగా అక్టోబర్ 19న నా స్నేహితురాలు, "శిరిడీ వెళ్తున్న గ్రూపులో అనుకోకుండా ఒకరు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. కాబట్టి వాళ్ళ స్థానంలో నువ్వు రా!" అని చెప్పి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. తను నాతో, "అంతా బాబా చూసుకుంటారు. నీ పరిస్థితి కూడా చక్కపడొచ్చు. నువ్వు ఏమీ ఆలోచించక వచ్చేయి" అని అంది. ఇక ఆ విషయం గురించి నేను, మావారు చర్చించుకున్న మీదట మావారు, "సరే వెళ్ళమ"ని తన అంగీకారాన్ని తెలిపారు. నేను వాళ్ళతో వెళ్ళడానికి, తరువాత మావారు వీలు చూసుకుని తన ఆఫీసులో సెలవు తీసుకుని బయలుదేరేలా ప్రణాళిక చేసుకున్నాము. ఆ విధంగా రెండోసారి శిరిడీకి ప్రయాణమైన నేను అక్కడ 11 నిద్రలు చేశాను. ఉదయం లేవడం, బాబా దర్శనానికి వెళ్లడం, టిఫిన్ చేసి రావటం, మహర్షి వారి ప్రవచనం వినటం, భోజనం చేయటం, రూముకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం, మళ్లీ సాయంత్రం బాబా దర్శనానికి వెళ్లడం అలా అక్కడ ఉన్నన్ని రోజులూ ఎలాంటి ఆలోచనలు, బాధలు లేకుండా ఆనందంగా గడిపాను. ప్రతిపూట ప్రతిరోజూ నాలో తెలియని కొత్త ఉత్సాహం, పట్టలేని సంతోషం, ప్రతిక్షణమూ బాబాను చూడాలన్న తపన ఇలా నా రెండో శిరిడీయాత్ర చాలా అద్భుతంగా, అమోఘంగా జరిగింది. బాబాతత్వం తెలిసిన తర్వాత, బాబాను అనన్యంగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి శిరిడీ వెళ్లడం, అక్కడ పదకొండు రోజులు నిద్ర చేయటం అంతా ఒక కలలా జరిగిపోయింది. అక్కడినుండి వచ్చిన తరువాత కూడా నన్ను నేనే నమ్మలేక 'నేనేనా అన్ని రోజులు శిరిడీలో ఉన్నాను? ఇది కలా, నిజమా' అనే ఆలోచనలో ఉండేదాన్ని. అద్భుతమైన శిరిడీ యాత్రను, అద్భుతమైన దర్శనాలను అనుగ్రహించిన ఆ సాయినాథుడు మా ఇంట ఉన్న  పరిస్థితుల నడుమ మా వెన్నంటే ఉండి మా కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తూ బాధలను మరిపింపజేస్తూ ఉండేవారు.


మూడోసారి, నాల్గోసారి శిరిడీ దర్శనం:


2014, 2015 సంవత్సరాలలో నవంబరు నెలలో స్వామివారు శిరిడీలో రాధాకృష్ణమాయి గురించి ప్రవచిస్తున్నారని, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఆయనను సన్నిహితంగా సేవించుకున్న భక్తుల వారసులకి సన్మానాలు చేస్తున్నారని తెలిసి ఎలాగైనా శిరిడీ వెళ్ళాలన్న బలమైన కోరిక మాకు కలిగి ఆర్తిగా బాబాను వేడుకున్నాము. ఆ సద్గురు సాయినాథుని అనుగ్రహం మాకు లభించింది. ఆయన కృపవలన మావారికి ఆఫీసులో సెలవు దొరకడం, శిరిడీ ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. రాధాకృష్ణమాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, బాబా సన్నిధిలో గడపాలన్న ఉత్సాహంతో శిరిడీ చేరుకున్న మేము తొలిరోజు నుంచి బాబా దర్శనాలు చేసుకుంటూ వారి స్మరణలో ఆనందంగా గడిపాము. ఇంకా కార్తీకమాసం కాబట్టి లక్ష్మి మందిరంలో శివునికి అభిషేకాలు చేసుకోవడం, ప్రవచనాలకు పాల్గొనడం చేసేవాళ్ళం. ప్రవచనాలలో రాధాకృష్ణమాయి గురించి వింటుంటే, నిజంగా అప్పటి సాయి సన్నిధిలో ఉన్నామా అని అనిపించేది. అంతటి తాదాత్మ్యం చెందడం మూలాన మాయీ పడ్డ కష్టాలు వింటుంటే దుఃఖం తన్నుకొచ్చేది, అదే సమయంలో ఆమెపై బాబా చూపిన వాత్సల్యం, ప్రేమ, అనుగ్రహాలకు ఆనందంతో మనసు ఉక్కిరిబిక్కిరయ్యేది. ఆ అనుభూతి నుంచి బయటికి రావడానికి మాకు ఎంతో కష్టమయ్యేది. ఇటువంటి సత్సాంగత్యం వలన ఆ రెండు సంవత్సరాలలో పదకొండేసి రోజులు తెలియని తన్మయత్వంలో గడిచిపోయాయి. చివరికి తిరుగు ప్రయాణమవుతుంటే దుఃఖం ఆపుకోలేకపోయాను. బాబా సన్నిధి వీడి వెళ్ళడానికి మనసు రాక, "అప్పుడే 11 రోజులు అయిపోయాయా బాబా? ఇంకా ఇక్కడే ఉంటే బాగుండేది" అని ఏడుపు వచ్చింది. ఆ విధంగా నా సాయి తండ్రి ఒడిలో 11రోజులు, 11నిద్రలతో మా మూడు, నాలుగు శిరిడీయాత్రలు పూర్తయ్యాయి. శిరిడీ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో తెలియని అనుభూతి కలగడం వలన నాకు, మావారికి బాబాపట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. మా కుటుంబంలో ఉన్న సమస్య తీరనప్పటికీ నన్ను, మా వారిని, నా పిల్లలని ఏ కష్టం కలగకుండా చూసుకుంటూ ఒక్కోసారి మాకున్న సమస్యను మరిచిపోయేలా చేసేవారు బాబా. పేరుకే సమస్య మాది, అనుభవించేది అంతా ఆ సాయినాథుడే.


ఐదోసారి శిరిడీ దర్శనం:


2015 తర్వాత 2016లో మావారు, మా పెద్దబ్బాయి శిరిడీ వెళ్లొచ్చారు. అప్పుడు శిరిడీ  వెళ్లాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ బాబా అనుమతి లభించలేదు. ఆ తర్వాత కూడా మావాళ్ళు శిరిడీ వెళ్లొస్తున్నా నాకు మాత్రం వెళ్ళడానికి కుదరలేదు. 2019, నవంబరులో మావారు, చిన్నబ్బాయి శిరిడీ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్లాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా నా ప్రయాణం రద్దు అయింది. తరువాత 2020, ఫిబ్రవరి 8న నేను, మా పెద్దబ్బాయి శిరిడీ వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ తెల్లవారితే ప్రయాణమనగా ఆడవాళ్లకు సహజమైన నెలసరి వచ్చి వెళ్ళలేకపోయాను. బాబా అనుమతి లభించనందుకు చాలా బాధపడ్డాను కానీ, నేను శిరిడీ వెళ్ళడానికి ఇది సమయం కాదేమో, 'నీతోనే ఉన్నాను. ఎక్కడికి వస్తావ'ని బాబా అనుకుంటున్నారేమో అని సరిపెట్టుకున్నాను. అలా ప్రతిసారీ ఏదో ఒక కారణంగా ఆగిపోతున్న నా శిరిడీ ప్రయాణం 2021లో ఫలవంతం అయింది. ఎప్పుడు వెళ్లాలనుకున్నా వెళ్ళలేకపోయిన నేను కార్తీకమాసంలోనే తనని దర్శించుకోవాలని బాబా అనుకున్నారేమో! కార్తీకమాసంలోనే ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించారు బాబా.


2021, కార్తీకమాసంలో నవంబర్ 6వ తేదీన శిరిడీ వెళ్ళాడానికి మేము టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అప్పటికింకా మా ప్రయాణానికి పదిరోజులు ఉంది. గత అనుభవాల దృష్ట్యా, 'ఈసారైనా శిరిడీ వెళ్తానా' అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆరో తారీఖు ఉదయం ట్రైన్ ఎక్కేవరకూ నాకు 'శిరిడీ వెళ్తాను, బాబా దర్శనం చేసుకుంటాను' అనే నమ్మకం లేదు. అలాంటిది ఆ రోజు రానే వచ్చింది. నిజంగా నేను 'శిరిడీ వెళ్తున్నాను. బాబా అనుమతి నాకు లభించింది. నేను బాబా దర్శనం చేసుకోబోతున్నాను' అని చాలా ఉత్సుకతతో నా ప్రయాణం మొదలైంది. ఎప్పుడెప్పుడు శిరిడీ చేరుకుంటానా అని నాలో ఉత్కంఠత అధికమైంది. మరునాడు ఉదయం ట్రైన్ శిరిడీలో ఆగింది. అంతే నా సంతోషానికి అంతులేకుండా పోయింది. నిజంగా వచ్చేసాను, శిరిడి నేలలో అడుగుపెట్టాను. కళ్ళల్లో ఆనందభాష్పాలు, గుండెల్లో సన్నాయి మేళాలు మోగుతున్నాయి. నిజంగా అద్భుతం. అత్యంత ఆరాటం, బాబా తండ్రిపై అంతులేని ప్రేమ ఇవన్నీ ధూళి దర్శనం చేసుకునేంతవరకూ నా కళ్ళల్లో, ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. తరువాత పలుమార్లు తనివి తీరా బాబాను దర్శించుకుంటూ కార్తీకమాసంలో సాయినాథుని సన్నిధిలో ఆదివారం నుండి బుధవారం వరకు మొత్తం మూడు నిద్రలు చేశాను. ఈసారి శిరిడీ యాత్రలో నీంగావ్ లోని డేంగ్లే ఇల్లు, రహతా, అక్కడ కుషాల్ చంద్ ఇల్లు, రూయి, దూప్ ఖేఢాలోని చాంద్ పాటిల్ ఇల్లు దర్శించి అయా భక్తుల 3, 4, 5 తరాల వారసులను కలిశాము. ఇంకా కల్పవృక్షం చూసాను. మహాలక్ష్మి మందిరంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకున్నాము, మహాలక్ష్మీ అమ్మవారికి చీర కట్టించి ఒడిబియ్యం పోసాము. 


ఇక చివరిరోజు అంటే బుధవారానికి కూడా నా ఆరాటం ఎలా ఉందంటే, ఆరోజు ఉదయం బాబాను దర్శించుకున్నాక కూడా బాబాను ఏం కోరుకున్నానో తెలుసా! "బాబా నీ దర్శనభాగ్యాన్ని మళ్లీ తొందరలో కల్పించు" అని నా మనసులో బాబాకి విన్నవించుకున్నాను. తరువాత బయటికి వచ్చి మా పిల్లలకి ఫోన్ చేసి మాట్లాడాను. బాబా లీలను చూడండి,  కోరుకున్నదే తడవుగా మళ్లీ దర్శనాన్ని అనుగ్రహించారు. విచిత్రంగా మా పిల్లలు 12 గంటలకు మరో దర్శనానికి బుక్ చేశారు. దాంతో నేను మళ్లీ బాబా దర్శనానికి వెళ్లాను. బాబా దర్శనంతో నా తపన తీరింది. ఈసారి 'మళ్లీ దర్శన భాగ్యమెప్పుడు?' అని నా మనసుకు రాలేదు. నన్ను అంతలా మరిపింపజేశారు బాబా. తరువాత మేము తిరుగు ప్రయాణం అయ్యాము. బాబా దయవల్ల ఇంటివద్ద బయలుదేరింది మొదలు, తిరిగి ఇల్లు చేరుకునే వరకు మాకు ఎలాంటి వ్యయప్రయాసలు కలగలేదు. ఇంటికి వచ్చిన తరువాత రెండు, మూడు రోజులు వరకు నా ఈ శిరిడీ యాత్ర కలా, నిజమా అని నాకు అనిపించింది. చాలా చక్కగా అనే కంటే అత్యంత అద్భుతంగా జరిగింది. ఇంతటితో నా శిరిడీ యాత్రల గురించి పంచుకోవడం సంపూర్ణమయ్యింది. సాయిబంధువులందరికీ, బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ....


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 999వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా దయతో తగ్గిన ఇన్ఫెక్షన్ - అదుపులోకి వచ్చిన షుగర్
2. బాబాపై నమ్మకంతో ఏ కోరికైనా నెరవేరుతుంది
3. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

బాబా దయతో తగ్గిన ఇన్ఫెక్షన్ - అదుపులోకి వచ్చిన షుగర్


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


బ్లాగు నిర్వాహకులకు అభినందనలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను మే నెలలో కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నాను. తరువాత నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను దాన్ని సరిగా తెలుసుకోలేక, వ్యాక్సిన్ వలన వచ్చిందేమో అనుకుని, ఎప్పటికప్పుడు తగ్గుతుందని ఎదురుచూశాను. కానీ అది చాలా ఎక్కువ అయింది. అప్పుడు డాక్టరు దగ్గరకి వెళితే, కొన్ని పరీక్షలు చేశారు. అప్పుడు నాకు షుగర్ ఉందని, అది కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. బాబా మీద భారం వేసి మందులు తీసుకుని వాడటం మొదలుపెట్టాను. బాబా దయవలన ఒక వారం రోజులలోనే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది. షుగర్ కూడా ప్రీ డయాబెటిక్ దశకు వచ్చింది. కరోనా చాలా ఎక్కువగా ఉన్న ఆ సమయంలో బాబానే నన్ను కాపాడారు. ఇకపోతే, మేము ఉద్యోగరిత్యా ఉన్న ఊరిలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. బాబా దయతో ఏ ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ఈ కోరిక తీరగానే మీ అందరితో నా అనుభవాన్ని పంచుకుంటాను. అలాగే మాకు వేరే ఊరిలో ఒక చిన్న ఫ్లాట్ ఉంది. ఆ కాంప్లెక్స్ లో ఉన్న ఇద్దరు, ముగ్గురు మా ఇంటికి అద్దెకు ఎవరూ రాకుండా చేస్తూ మాకు చాలా ఇబ్బంది కలుగజేస్తున్నారు. దీని విషయమై మేము చాలా ఆందోళన చెందుతున్నాము. త్వరలోనే ఆ ఇంటిలోకి మంచి అద్దెదారులు రావాలని, వాళ్లకి అక్కడి వాళ్ళతో ఏ ఇబ్బంది రాకూడదని బాబాను వేడుకుంటున్నాను. ఆయన దయవల్ల త్వరగా మా ఆందోళన తీరుతుందని నమ్ముతున్నాము. "ధన్యవాదాలు బాబా. నాకున్న చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోయేలా అనుగ్రహించి, నాకు, నా భర్తకు, మా బాబుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి సాయి. మా బాబుకు బాగా చదువు వచ్చేలా ఆశీర్వదించండి. నా అనుభవాలను పంచుకోవడంలో జరిగిన ఆలస్యానికి నన్ను మన్నించి అనుక్షణం మా వెన్నంటే ఉండి కాపాడండి బాబా".


అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ సాయినాథ!!!


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబాపై నమ్మకంతో ఏ కోరికైనా నెరవేరుతుంది


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు సత్య. నా కుమార్తె టీచరుగా పని చేస్తుంది. 2020లో కరోనా మొదలైనప్పటి నుండి ఆన్లైన్ క్లాసులు జరుగుతుండేవి. అప్పటినుండి 2021 వరకు ఆన్లైన్ క్లాసులు చెప్తున్న నా కుమార్తె ఉన్నట్టుండి మార్చ్ నెలలో 'నేను ఆన్లైన్ క్లాసులు చెప్పలేకపోతున్నాన'ని తన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఈ రోజుల్లో మళ్లీ ఉద్యోగం దొరకడం అంత సులువైన పని కాదు. అందువలన తను ఇంట్లో కూర్చుని మానసిక ఆందోళనకు గురవుతుండేది. అప్పుడు నేను, "బాబా! నా కుమార్తెకు వెంటనే ఏదైనా ఉద్యోగం వచ్చేటట్టు చూడు తండ్రి. తనకి ఉద్యోగం వచ్చిన వెంటనే ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత బాబా దయవలన తనకి దరఖాస్తు చేసుకున్న అన్ని స్కూళ్ల నుండి కాల్స్ వస్తుండేవి. కానీ అన్ని స్కూళ్లు ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తుండేవి. అందువల్ల తను చేసేదేమీలేక ఆ స్కూళ్ళలో జాయిన్ అవ్వడం, పది, పదిహేను రోజులు చేశాక మళ్లీ రాజీనామా చేయటం జరుగుతుండేది. అప్పుడు నేను నా కుమార్తెతో, "చూడు తల్లి, ఈ పరిస్థితి అస్సలు బాగాలేదు. చక్కగా స్కూళ్లు తెరిచిన తర్వాత దరఖాస్తు చేసుకో, ఇప్పుడు మాత్రం చేయవద్దు" అని చెప్పాను. అయితే నేను ఎంతలా చెప్పినా తను వినకుండా దరఖాస్తు చేస్తూనే ఉండేది. ఇలా ఉండగా 2021, అక్టోబరులో ఒకరోజు తనకి ఒక స్కూలు నుండి ఫోన్ వచ్చింది. ఈసారి నా కుమార్తె, "నేను ఆన్లైన్ క్లాసులు తీసుకోను. స్టూడెంట్స్ స్కూలుకు వచ్చేటట్లు అయితే నేను మీ స్కూళ్ళో జాయిన్ అవుతాను" అని ఖచ్చితంగా చెప్పింది. అందుకు వాళ్ళు, "సరే, నవంబర్ నుండి స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి మీరు నవంబర్ 2న వచ్చి జాయిన్ అవ్వండి" అని చెప్పారు. అలా నా కుమార్తె నవంబర్ 2న కొత్త ఉద్యోగంలో చేరింది. స్కూలు మొదలై, తను రోజూ స్కూలుకి వెళ్లి వస్తుంది. అంతా బాబా దయ. బాబాపై నమ్మకంతో ఏ పని మొదలుపెట్టినా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. "ధన్యవాదాలు బాబా. మరలా కోవిడ్ సమస్యలు లేకుండా స్కూళ్లు, మిగతా అన్ని పనులు ఏ సమస్యలు లేకుండా సక్రమంగా జరిగేలా చూడు తండ్రి. ఆపధ్భాంధవా సాయీ! ప్రతిరోజు నీ అడుగుజాడల్లో నడిచే మమ్మల్ని కాపాడి దీవించు తండ్రి".


అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


నా పేరు రాంబాబు. మాది విజయనగరం. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలతో ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను పనిచేస్తున్న కంపెనీలో ఒక సమస్యని ఎదుర్కున్నాను. అదేమిటంటే ప్రోడక్ట్ అవుట్ పుట్ మరియు సాల్వెంట్ అవుట్ పుట్ తక్కువ వస్తుండేవి. ఈ సమస్యను అధిగమించడానికి మా పై అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో పనిచేస్తున్న కంపెనీకి న్యాయం చేయలేకపోతున్నాను అనే న్యూనతా భావంతో నేను ఎంతో బాధపడుతుండేవాడిని. అటువంటి సమయంలో నేను, "ఈ సమస్య నుంచి బయటపడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఎంతో ఆర్తితో బాబాను వేడుకున్నాను. తరువాత ఆ సమస్య పరిష్కారం కోసం సహాయం కావాలని మా ఆఫీసులో సుపీరియర్స్ కి మెయిల్ పెట్టాను. బాబా దయవలన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టెక్నాలజీ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ మేనేజర్ వచ్చి సిస్టంలో మార్చవలసిన వాటిని చెప్పి వెళ్ళడమేకాక వాళ్ల టీమ్‌ని పర్యవేక్షణలో ఉంచారు. ఆ సార్ చెప్పిన ప్రకారం మాడిఫికేషన్ చేశాక సాల్వెంట్ అవుట్ పుట్, ప్రోడక్ట్ అవుట్ పుట్ రెండూ కూడా బాగా రావడం మొదలయ్యాయి. అంతేకాదు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు కూడా వచ్చింది. ఈవిధంగా బాబా నా సమస్యను ఒక తండ్రిలా తీర్చారు. ఇదంతా బాబా దగ్గరుండి నన్ను నడిపిస్తున్నారన్న అనుభూతిని కలిగించగా, నాలో కృతజ్ఞతా భావం ఉప్పొంగింది.


శ్రీ సాయినాథాయ నమః!!!

సర్వేజనా సుఖినోభవంతు!!!



సాయిభక్తుల అనుభవమాలిక 998వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో దొరికిన నగలు
2. ఆశ్రయించిన వారికి తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించిన బాబా
3. బాబా చల్లని చూపు

బాబా దయతో దొరికిన నగలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!


నా పేరు మాధురి. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను ఈమధ్య ఒక వివాహ వేడుకకు వెళ్లాలని బ్యాంకు లాకర్‌లో ఉన్న నా నగలు తెచ్చుకోడానికని బ్యాంకుకి వెళ్లాను. అయితే, ఆ లాకర్‌లో నగలు లేవు. బహుశా ఇంకో లాకర్‌లో ఉన్నాయేమోనని తలచి అందులో చూశాను. అందులో కూడా లేవు. ఎక్కడ పెట్టానో గుర్తుకు రాక చాలా కంగారుపడ్డాను. ఇంటికొచ్చి బీరువాలో చూశాను. అందులో కూడా లేవు. దాంతో లాకర్ లో పెట్టడానికి వెళ్లి అక్కడెక్కడైనా మర్చిపోయానో? లేదంటే, ఇంకెక్కడైనా చేజార్చుకున్నానో? నాకేమీ అర్థం కాలేదు. ఇంట్లోవాళ్ళు ఇంట్లో ఉన్న మరో బీరువాలో చూడమన్నారు. కానీ ఆ బీరువాలో నేను ఎప్పుడూ నగలు పెట్టను. కాబట్టి అందులో ఉండవని నా నమ్మకం. అందుచేత బాబాకి దణ్ణం పెట్టుకుని, "నగలు దొరికితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని మళ్లీ మొదట చూసిన బీరువాలోనే చూసాను. కానీ నగలు కనిపించలేదు. దాంతో మావాళ్ళు చెప్పినట్లు రెండో బీరువాలో వెతకడానికి వెళ్ళాలని అనుకున్నాను. అయితే, అందులో వెతికే ముందు మళ్ళీ బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరు ఎంతోమందికి తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి దొరికేలా చేసారు. అలాంటి అనుభవాలు బ్లాగులో చాలామంది భక్తులు పంచుకున్నారు. నాకు కూడా దొరికేలా చేయండి" అని వేడుకున్నాను. తరువాత వెళ్లి ఆ బీరువాలో చూస్తే, బట్టల మధ్యలో నగలు కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించి, ఆ నగలు తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళి, ఆయనకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అసలు విషయం ఏమిటంటే, కోవిడ్ మొదలైనప్పుడు నగలు ఆ బీరువాలో పెట్టాను. తరువాత ఏ ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. రెండేళ్ళు గడిచిపోయాయి. ఈలోగా నగలు అక్కడ పెట్టానని మర్చిపోయాను. తుదకు బాబా దయవలన ఆ నగలు దొరికాయి. ఆయనే ఫంక్షన్ నెపంతో ఆ నగలు ఎక్కడ ఉన్నాయో చూపించారు. "చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ సాయిబంధువులందరిపై, అలాగే మాపై ఉండాలని, ఇంకా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనస్పూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను".


ఆశ్రయించిన వారికి తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించిన బాబా


సాయిభక్తులకు, బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను 2021, దసరా పండగకి మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలోనే మా చెల్లి పెళ్ళికి ముహూర్తం పెట్టుకోవాలని అనుకున్నాము. కానీ దానికంటే ముందు పెళ్లికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవాలని అనుకున్నాము. అందుకోసం మాకు ఉన్న ఒక భూమిని అమ్మాలనుకున్నాము. కానీ అక్కడే సమస్య మొదలై మేము చాలా టార్చర్ అనుభవించాము. విషయం ఏమిటంటే, మా అమ్మవాళ్ళ అక్క, 'సగం ధరకు ఆ భూమిని తనకు ఇచ్చేయమని, లేకుంటే ఆ భూమి ఎవరు కొంటారో చూస్తాన'ని మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టింది. బెదిరించడమే కాదు, బయటవాళ్లు భూమి కొనడానికి వస్తే చెప్పరాని విధంగా తిట్టి పంపించేది. అయితే భూమి అమ్మకపోతే చెల్లి పెళ్లి చేసే పరిస్థితి లేదు. మాకు తండ్రి లేరు. అమ్మకు మేము ముగ్గురం అమ్మాయిలం. మా అమ్మ వేరే భూమి అమ్మి నాకు, మా అక్కకు పెళ్లి చేసింది. అప్పుడు కూడా మా పెద్దమ్మ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఇప్పుడూ అదేవిధంగా చేస్తుంటే మాకు దిక్కు తోచలేదు. అట్టి స్థితిలో నేను రోజూ మన బాబాను, "తండ్రీ! నువ్వు తప్ప మాకు దిక్కెవరు? ఈ సమస్యని పరిష్కరించి, పెళ్లి జరిపించాల్సింది మీరే తండ్రి" అని వేడుకుంటూ మా భారమంతా ఆయన మీద వేసాను. బాబానే అన్నీ చూసుకుంటారని, అంతా ఆయనకే వదిలేసి ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకుండా మా ప్రయత్నాలు మేము చేయసాగాము. ఇదిలా ఉంటే, అబ్బాయి వాళ్ళు, "ఏంటి మీరు? అసలు పెళ్లి చేస్తారా, లేదా" అని మమ్మల్ని అడుగుతుండేవారు. ఎందుకంటే, నిశ్చితార్థం జరిగి కొన్ని నెలలైన తరువాత కూడా పెళ్లి ఆలస్యం జరుగుతుండటం సబబు కాదు కదా! ఇలా ఒక నెల గడిచిపోయింది. 2021, నవంబర్ 16న నేను బాబాతో, "ఏంటి తండ్రి. నిన్ను నమ్ముకున్న వాళ్లని ఇలాగే ఏడిపిస్తారా? రేపు ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి. అలా జరిగితే, నా అనుభవాన్ని వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అంతే! ఆ తండ్రి మాపై ఎలా దయ చూపారో చూడండి. నవంబర్ 17న పెళ్లికి కావాల్సిన డబ్బులు ఒక స్నేహితుని ద్వారా సమకూరేలా అనుగ్రహించారు బాబా. అయినవాళ్లే ఇబ్బందులు పెడుతుంటే, ఓర్పుతో నువ్వే దిక్కని ఆ తండ్రి పాదాలు పట్టుకుంటే, తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించారు బాబా. అందుకే ఆ తండ్రి మీద నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఆలస్యమైనా బాబా అందరికీ మంచి చేస్తారు. చివరిగా ఆ తండ్రి కరుణకు, దయకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


ఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబా చల్లని చూపు


అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను ఈరోజు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఒకసారి మా పిన్ని మూడు నాలుగు రోజులపాటు కడుపునొప్పితో బాధపడింది. తనని డాక్టరు దగ్గరకు తీసుకెళ్తే, అన్నిరకాల టెస్టులు చేసారు. అప్పుడు నేను, "రిపోర్టులన్ని నార్మల్ రావాల"ని బాబాను, ఆంజనేయస్వామిని వేడుకున్నాను. వారి దయవలన రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. కానీ, "కడుపులో ఏదో గడ్డ ఉందని అనుమానంగా ఉంది, మరోసారి స్కాన్ చేయించమ"ని అన్నారు. అది విని మేము అంతా చాలా భయపడిపోయాము. అప్పుడే నేను బాబాని తలుచుకుని, "బాబా! దయచేసి మాకు సహాయం చేయండి. పిన్నికి ఎలాంటి సమస్యా ఉండకూడదు. టాబ్లెట్లతో నొప్పి తగ్గిపోవాలి" అని ప్రార్ధించి, మా పిన్ని పేరు తలుచుకుని నా నుదుటన బాబా ఊదీ పెట్టుకున్నాను. బాబా ఆశీర్వదించారు. 'పిన్నికి ఉన్న సమస్య చాలా చిన్నదని, దానికి టాబ్లెట్లు కూడా అవసరం లేదు, అదే తగ్గిపోతుంది' అని చెప్పి పంపించారు. ఇదంతా బాబా చల్లని చూపు వల్లే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo