సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 995వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ ఉంటే ఏదైనా సాధ్యమే!
2. బాబా దయ ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు
3. వేడుకున్నంతనే అనుగ్రహించే బాబా

బాబా దయ ఉంటే ఏదైనా సాధ్యమే!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఇప్పుడు రెండు అనుభవాలు పంచుకోబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అసాధ్యమైన పనులను బాబా ఎలా సుసాధ్యం చేస్తారో నా ఈ అనుభవాల ద్వారా అందరికీ విదితమవుతుంది. మేము చాలాకాలం క్రితం రెండు ఫ్లాట్స్ కొన్నాము. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు నేను మా పుట్టింట్లో పెట్టాను. మా అన్నయ్య వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ విషయం అన్నయ్య నాకు చెప్పలేదు. పైగా నేను ఎప్పుడు ఆ పేపర్ల గురించి అడిగినా "అవి మీ దగ్గరే ఉన్నాయి, మీ ఇంట్లోనే బాగా వెతికితే దొరుకుతాయ"ని చెప్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అనుకోకుండా మా అన్నయ్యకు డబ్బులిచ్చిన వ్యక్తి నాకు ఫోన్ చేసి, "మీ ఫ్లాట్స్ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. మీ అన్నయ్యను డబ్బులిచ్చి తీసుకోమని చెప్పండి" అని చెప్పాడు. అప్పుడు నేను మా అన్నయ్యను నిలదీస్తే, "ఏదో అవసరానికి తాకట్టు పెట్టానులే" అని చాలా తేలికగా సమాధానం చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పుట్టింటికి దూరమవుతానన్న భయంతో విషయం మావారికి కూడా తెలియజేయక, "నా ఇంటి కాగితాలు నాకు చేరేటట్లు చూడు దేవుడా!" అని బాబాకి మొరపెట్టుకున్నాను. ఇంకా '11వారాలు గుడిలో దీపాలు వెలిగిస్తాన'ని మొక్కుకున్నాను. బాబా నాపై దయ చూపారు. ఎలా వస్తాయో ఏమిటో అనుకున్న ఇంటి కాగితాలు నా దగ్గరకు వచ్చాయి. ఇంకా బాబా దయవలన 2021, నవంబర్ 14న ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద జరిగింది. ఇదంతా బాబాకు నా మీదున్న ప్రేమ.


మా పెద్దమ్మాయి లాప్టాప్‌ని చాలా అజాగ్రత్తగా వాడుతుంది. ఒకసారి లాప్టాప్ తెరుస్తూనే స్క్రూలన్నీ ఊడి వచ్చేశాయి. మావారికి చెప్తే, బాగా తిడతారని చెప్పకుండా రిపేర్‌కి ఇచ్చాము. లాప్టాప్ పరిస్థితి చూస్తే, అది బాగుందని అస్సలు నమ్మకం లేదు. అందువలన నేను బాబా మీద నమ్మకముంచి, "లాప్టాప్ మంచిగా పని చేయాల"ని వేడుకున్నాను. బాబా దయవలన తక్కువ ఖర్చుతోనే లాప్టాప్ బాగైంది. "ధన్యవాదాలు బాబా. సదా మీ కృప మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ... మీ పాద సేవకురాలు".


బాబా దయ ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు శ్రీదేవి. ముందుగా శ్రీసాయి దివ్య చరణ కమలములకు అనంతకోటి పాదాభివందనాలు. సాయిబంధువులకు నా నమస్కారాలు. 2021, దీపావళి నాడు అమావాస్య నోములు, పాడ్యమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, రెండు రోజుల తర్వాత శివకళ్యాణం, అమ్మవారికి ఒడిబియ్యం ఇలా వారంలో అనేక పూజలు చేయాల్సి ఉండగా సరిగ్గా అదే సమయంలో నా నెలసరి సమయం ఉండేసరికి నాకు చాలా భయమేసింది. నెలసరి వస్తే నేను చేయాల్సిన పూజలు ఆగిపోతాయని బాబాను, "ఏ ఆటంకాలు లేకుండా పూజలన్నీ చేయగలిగెలా అనుగ్రహించమ"ని ప్రార్థించాను. బాబా దయవలన ఎటువంటి ఆటంకం లేకుండా పూజలన్నీ పూర్తి చేశాను. సాయి అంటే ప్రత్యక్ష దైవం. ఆయన దయ ఉంటే సప్తసముద్రాలను కూడా అవలీలగా దాటవచ్చని నా నమ్మకం. బాబాను నమ్మండి, కష్టాల నుండి బయటపడండి. "థాంక్యూ సో మచ్ బాబా".


మా ఇంటి పై పోర్షన్ అద్దెకు ఇచ్చాము. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటుండేవారు. అలా చుట్టుపక్కల వారితో గొడవలు పడుతూ ఒకసారి ఎదురింటి వాళ్ళ మీద పోలీసు కేసు కూడా పెట్టారు. మేము చాలాసార్లు వాళ్ళను ఇల్లు ఖాళీ చేయమని చెప్పాము. కానీ ఆమె అప్పుడు, ఇప్పుడు అంటూ దాదాపు పది నెలలు దాటేసింది. చివరికి నేను, "బాబా! ఎలాగైనా ఏ గొడవలు లేకుండా ఆమె చేత మా ఇల్లు ఖాళీ చేయించండి" అని బాబాను ప్రార్థించాను. అంతే! ఆమె మా ఇల్లు ఖాళీ చేసింది. ఎటువంటి గొడవ చేయకుండా ఇవ్వాల్సిన డబ్బులిచ్చి మరీ వెళ్ళిపోయింది. ఇదంతా బాబా దయ. బాబా దయ ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా బయట పడవచ్చు. "ధన్యవాదాలు బాబా. ఆ ఇంటిలో మంచివాళ్లు చేరేలా దీవించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


వేడుకున్నంతనే అనుగ్రహించే బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు రూప. 2021లో మా అమ్మవాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయ్యి నెల రోజులైన ఆ పోర్షన్‌లోకి ఎవరూ రాలేదు. ఆ విషయం అమ్మ నాతో చెప్పుకుని బాధపడింది. అపుడు నేను, "త్వరగా ఆ పోర్షన్‌లోకి అద్దెకు వచ్చేలా అనుగ్రహించమ"ని బాబాని వేడుకున్నాను. తర్వాత వారం రోజులకి బ్యాచిలర్స్ ఆ పోర్షన్‌లోకి వచ్చారు. అయితే నలుగురు ఉంటామని చెప్పి, దాదాపు పదిమందికి పైనే ఉండసాగారు. దాంతో మా అమ్మ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. అలా నాలుగు రోజులకే ఆ ఇల్లు మళ్లీ ఖాళీ అయింది. అప్పుడు, "మళ్ళీ త్వరగా ఆ ఇంట్లోకి ఎవరైనా మంచివాళ్ళు వచ్చేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన 2021, నవంబర్ 17న ఒకరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. "ధన్యవాదాలు బాబా. ఈసారి అద్దెకు వచ్చినవాళ్ళు మంచివాళ్ళు అయుండాలి తండ్రి. ముందు మాటిచ్చి మర్చిపోయినందుకు నన్ను క్షమించమని మరోసారి వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నేను, మా అమ్మ ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నాము. ఆ సమస్యలనుంచి మమ్మల్ని కాపాడు తండ్రి సాయినాథా!".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo