సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 974వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని కృప
2. సాయి కృపతో కుదిరిన ధ్యానం
3. పోగొట్టుకున్న వస్తువు కనపడేలా అనుగ్రహించిన బాబా

సాయినాథుని కృప


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో నివాసముంటున్నాము. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబరులో మా ఆడపడుచు భర్త చనిపోయారు. అతని అస్థికలు కాశీలో నిమజ్జనం చేసేందుకుగానూ మా ఆడపడుచు, వాళ్ళ అబ్బాయి, ఇంకా ఆమె తోడికోడలు కాశీకి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తర్వాత కొన్నిరోజులకి మా ఆడపడుచు తోడికోడలికి హఠాత్తుగా నడుమునొప్పి మొదలైంది. దాంతో ఆమె కనీసం నడిచే స్థితిలో కూడా లేకపోవడంతో ఆమెకి బదులు వదినకి తోడుగా నన్ను కాశీ తీసుకుని వెళ్లాలని అనుకున్నారు. అయితే ప్రయాణానికి వారముందనగా నాకు బాగా జలుబు చేసింది. నాకెప్పుడు జలుబు చేసినా ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోయేది. కానీ ఈసారి మందులు వాడుతున్నప్పటికీ వారం రోజులైనా తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ జలుబుతో నాకు చాలా భయమేసింది. పైగా పిల్లల్ని, మా వారిని వదిలి వెళ్లాల్సి ఉంది. అప్పుడు నేను, "బాబా! నాకు ఈ జలుబు తగ్గి, నేను కాశీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మాకు, ఇక్కడ ఉన్న మా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు తండ్రీ. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని 'అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని బాబాకి నమస్కరించుకున్నాను. తరువాత ప్రయాణానికి బయలుదేరే సమయానికి నాకు కొద్దిగా జలుబు ఉంది. అయితే, బాబా దయవల్ల మేము ఏసి కోచ్‍లో ప్రయాణం చేసినప్పటికీ నాకు ఏ ఇబ్బందీ కలగలేదు. ఇక్కడ ఉన్న పిల్లలు, మా వారు కూడా సంతోషంగా ఉన్నారు. మేము కాశీ వెళ్లేటప్పుడు అన్నిరకాల టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళాము కానీ, బాబా దయవల్ల వాటి అవసరమే మాకు రాలేదు. ఆయన మాకు తోడుగా ఉండి అన్నివిధాలా సహాయం చేశారు. సాయినాథుని కృపవలన మా కాశీయాత్ర చాలా బాగా జరిగింది. మేము కాశీయాత్ర ముగించుకుని 2021, అక్టోబర్ 23, శనివారం వచ్చాము. కానీ నా అనుభవాన్ని గురువారం బ్లాగుకి పంపాలని ఆగాను. ఆ ఆలస్యానికి బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను.


ఇంకో అనుభవం: 2021, మే నెలలో కరోనా వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 15రోజుల వ్యవధిలో వెంటవెంటనే మా అమ్మ, అత్తయ్యగారు, మామయ్యగారు, మా ఆడపడుచు ఒకరు చనిపోయారు. డాక్టర్లు ఆ విషయం నాకు చెప్పొద్దని చెప్పినందువల్ల మావాల్లు నాతో చెప్పలేదు. బాబా దయవల్ల నేను బ్రతికి ఇంటికి వచ్చిన కొన్నిరోజులకి వాళ్ళందరి మరణం గురించి నాకు తెలిసింది. అప్పటినుండి ఎవరికో ఏదో అయిపోతున్నట్లు నాకు చెడు కలలు వస్తుండేవి. అప్పుడు నేను, "బాబా! నాకు ఈ చెడు కలలు రాకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులోని 'అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. బాబా నా కోరిక మన్నించారు, చెడు కలలు రావడం ఆగిపోయాయి. "ధన్యవాదాలు బాబా, నాకు చాలా సంతోషంగా ఉంది". ఇలాగే ఎప్పుడూ నా సాయినాథుని కృపాకటాక్షలు మనందరి మీద ఉండాలని బాబాను కోరుకుంటున్నాను. అలాగే తొందరలో కరోనాని నశింపజేసి ప్రపంచమంతా శాంతి సౌఖ్యాలతో ఉండేలా అనుగ్రహించమని సాయినాథుని మనసారా కోరుకుంటున్నాను. ఇలా మీ అందరితో నా అనుభవాలు పంచుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది.


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి కృపతో కుదిరిన ధ్యానం


సాయి కుటుంబసభ్యులందరికీ నమస్తే. నా అనుభవాన్ని పంచుకునే అవకాశాన్నిచ్చిన సాయిబాబాకు, ఈ బ్లాగుకు నా కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. ఎవరూ నమ్మని విధంగా నా జీవితంలో నేను చాలా అనుభవాలను పొందాను. బాబా ఉనికిని చాలాసార్లు అనుభూతి చెందాను. కానీ బాబాతో నా అనుభవాలను ఏదైనా బ్లాగులో ఎలా పంచుకోవాలో నాకు తెలియదు. ఈమధ్యకాలంలోనే నేను సాయిబాబా భక్తుల అనుభవాలు చదవడం ప్రారంభించాను. కానీ ఇంత తొందరగా నా అనుభవాన్ని పంచుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో ఊహించని తీవ్రమైన మార్పుల కారణంగా గత 6 సంవత్సరాల నుంచి నేను లోలోపలే బాధపడుతున్నాను, మానసిక సంఘర్షణకు గురవుతున్నాను. నేను మానసికంగా, శారీరకంగా చాలా బలహీనపడిపోయాను. ఆ క్రమంలో నేను ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకుని అన్నీ బాబాకు వదిలిపెట్టాను. నేను నా మనసుని శాంతింపజేయడం కోసం ధ్యానం చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నియంత్రించుకోలేని ఆలోచన వల్ల ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు. ఎక్కువ సమయం ధ్యానం చేయాలని ప్రయత్నించినప్పుడల్లా కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. దాంతో నేను ఈసారి బాబాను ప్రార్థించి, ఆయన నామజపాన్ని వింటూ ధ్యానం చేయడం ప్రారంభించాను. బాబా దయవల్ల నాకు ధ్యానం చక్కగా కుదిరి అద్భుతమైన అనుభవం అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఎల్లప్పుడూ నాతో ఉండండి. అందరినీ ఆశీర్వదించండి".


పోగొట్టుకున్న వస్తువు కనపడేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు మహేశ్వరి. ఈ బ్లాగు ద్వారా బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. సాయిబాబా వల్ల మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మేము ఈమధ్య కొత్త ఇంటికి వెళ్ళాము. బాబా అనుగ్రహంతో గృహప్రవేశం చాలా బాగా జరిగింది. మా సామాన్లన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రాన్స్ పోర్టు ద్వారా కొత్త ఇంటికి తరలించాము. అన్ని వస్తువులు జాగ్రత్తగా వచ్చాయి. మేము ఆ సామాన్లన్నీ సర్దుకునేటప్పడు నేను ఒక విలువైన వస్తువుని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇల్లంతా చాలా వెతికానుకానీ అది కనపడలేదు. నేనెప్పుడూ ఏ వస్తువును పోగొట్టుకోనందున నాకు చాలా భయమేసింది. అప్పుడు నేను, "బాబా! నా చిన్నతనం నుంచి నేను ఏ వస్తువును పోగొట్టలేదు. అలాంటిదిప్పుడు ఇలా విలువైన వస్తువు పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అది నాకు ఎంతో ముఖ్యమైనది బాబా. మీరే ఎలాగైనా ఆ వస్తువు నాకు కనపడేటట్లు చూడండి తండ్రి. వస్తువు కనిపిస్తే, ఈ అనుభవాన్ని తోటి సాయిబంధువులతో మీ బ్లాగు ద్వారా పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన పదినిమిషాలకే ఆయన అనుగ్రహం వల్ల నాకు ఆ వస్తువు జాడ  తెలిసింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అనుగ్రహం ఎల్లవేళలా మా కుటుంబం మీద ఇలాగే ఉండాలి".



సాయిభక్తుల అనుభవమాలిక 973వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన వెంటనే అనుగ్రహిస్తున్న బాబా
2. మందులు లేకుండానే షుగర్ కంట్రోల్ చేసిన బాబా
3. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

అడిగిన వెంటనే అనుగ్రహిస్తున్న బాబా


బాబా భక్తులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఇటీవల మా అక్క కూతురుని హైదరాబాదులోని ఒక మంచి స్కూలులో జాయిన్ చేద్దామని స్కూలుకి తీసుకెళ్తే, వాళ్ళు ముందుగా తనకొక పరీక్ష పెట్టారు. కరోనా సమయంలో స్కూలులేక పాప చదువులో వెనుకబడి ఉన్నందున తను ఏమీ వ్రాయలేకపోయింది. దాంతో ఆ స్కూలు టీచర్ మరో అవకాశమిస్తూ పరీక్ష వ్రాయడానికి ఇంకొక రోజు రమ్మన్నారు. చాలా మంచి పేరున్న అటువంటి స్కూల్లో చదివితే తన భవిష్యత్తు బాగుంటుందనిపించి నేను, "బాబా! అక్క కూతురుకి ఆ స్కూలులో ఎలాగైనా సీట్ వచ్చేలా ఆశీర్వదించండి. మీ దయవలన తనకి సీట్ వస్తే, ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. తరువాత స్కూలు వాళ్ళు రమ్మన్న రోజు పాప వెళ్లి పరీక్ష వ్రాసింది. కాసేపటికి టీచర్ వచ్చి, "పాపకి సీట్ ఓకే" అని చెప్పగానే మాకు చాలా ఆనందమేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2021, అక్టోబరులో మా యూత్ అంతా కలిసి దేవీశరన్నవరాత్రులు జరుపుకున్నాము. ఆ ఉత్సవాలలో భాగంగా మా యూత్‍లోని వాళ్ళు రోజుకొకరు చొప్పున దేవీ పూజలు చేయాలనుకుని, ఏరోజు ఎవరు పూజ చేయాలన్న విషయంగా 9 మంది పేర్ల మీద చీటీలు వేసాము. నేను బాబాని తలుచుకుని, 'నాకు పూజ చేసే అవకాశం గురువారం నాడు రావాల'ని మనసులో అనుకుంటూ చీటీ తీసాను. అద్భుతం! బాబా అనుగ్రహం వలన నాకు గురువారమే వచ్చింది. ఆయన కృపవల్ల ఆ రోజు పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగాయి. ఇంకా, "ఈసారి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరిగినట్లైతే, బ్లాగులో పంచుకుంటాన"ని నేను బాబాతో చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే తొమ్మిదిరోజులూ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అంతా బాబా కృప. "ధన్యవాదాలు బాబా".


పరీక్షా కేంద్రంలో ఒకసారైనా ఇన్విజిలేటర్‍గా పని చేయాలన్నది నా ఆశ. నేను ఇటీవల నా చదువు పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాను. ఒకసారి డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా నేను మా కాలేజీ సార్‍కి ఫోన్ చేసి, "నాకు ఇన్విజిలేటర్‍గా చేయాలని ఉంద"ని చెప్పాను. సార్, "మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను" అంటూ కాల్ కట్ చేశారు. అలా రెండు, మూడుసార్లు జరిగింది. అప్పుడు నేను ఆ విషయం గురించి బాబాతో చెప్పుకున్నాను. సరిగ్గా గురువారంనాడు బాబా పూజ పూర్తికాగానే కాలేజీ సార్ వద్దనుంచి, "ఇన్విజిలేటర్‍‍గా అవకాశం ఇస్తామ"ని  మెసేజ్ వచ్చింది. సాయినాథుని అనుగ్రహంతో ఇన్విజిలేటర్‍గా నేను విధులు సక్రమంగా నిర్వర్తించాను. ఈవిధంగా బాబా నా చిన్న కలను నెరవేర్చారు. "థాంక్యూ సో మచ్ బాబా".


ఈ మధ్యకాలంలో ఒక అనారోగ్య సమస్య కారణంగా మా అక్కకి తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పారు. అయితే ఆపరేషన్ చేసే ముందు అక్కకి బ్లడ్ టెస్ట్ చేయించగా టైఫాయిడ్, మలేరియా రెండూ నిర్ధారణ అయ్యాయి. దాంతో డాక్టర్లు, "ఆ రెండు జ్వరాలు వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంది. అది తగ్గితేనే ఆపరేషన్ చేస్తాము" అన్నారు. అప్పుడు నేను బాబాను, "అక్కకి రెండు జ్వరాలూ తగ్గి, విజయవంతంగా ఆపరేషన్ పూర్తయితే, కొబ్బరికాయ కొట్టి, పరమాన్నం నైవేద్యంగా సమర్పించుకుంటాను. అలాగే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా ఆశీర్వాదంతో ఒక్కరోజులో టెంపరేచర్ నార్మల్ స్థాయికి రావడంతో అక్కకి ఆపరేషన్ జరిగింది. ఈవిధంగా నా బాబా నేను అడిగిన వెంటనే అనుగ్రహిస్తున్నారు. "బాబా! నాకు ఉద్యోగం లేదు, వ్యాపారమూ లేదు. ఆర్థికంగా అభివృద్ధి లేదని చాలామంది చులకనగా చూస్తున్నారు బాబా. మీ దయవలన ఒక వ్యాపారం మొదలుపెడదామని అనుకుంటున్నాను. అందుకు సంబంధించి పూర్తి బాధ్యత మీదే బాబా. ఈ మీ భక్తుడిని మీరే ముందుకు నడిపించాలి". చివరిగా బాబా నాకు మరిన్ని మహాద్భుతమైన లీలలను ప్రసాదించాలని కోరుకుంటూ.. మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


మందులు లేకుండానే షుగర్ కంట్రోల్ చేసిన బాబా


బాబాకు నమస్కరిస్తూ, వారి ఆశీస్సులు మనందరికీ సదా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సంగీత. రోజూ బ్లాగులో వచ్చే అనుభవాలు చదువుతూ ఎంతో ఆనందాన్ని పొందుతుంటాను. నా అనుభవానికి వస్తే... నా భర్తకి షుగర్, బిపి రెండూ ఉన్నాయి. ప్రతిరోజూ షుగర్‍‍కి 850mg టాబ్లెట్ ఉదయమొకటి, రాత్రి ఒకటి వేసుకునే ఆయన వ్యాయామం చేయడం, వేపాకు తినడం చేస్తూ మందులు వేసుకోవడం మానేసారు. అప్పుడు నేను, "బాబా! మావారు చాలా కష్టపడుతున్నారు. మీ దయవల్ల షుగర్ లెవెల్స్ నార్మల్ అయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే మావారి షుగర్ లెవెల్స్ నార్మల్‍‍కి వచ్చాయి. 9 నెలలుగా మావారు మందులు వాడటం లేదు. "ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎప్పుడూ మందులు వాడకుండా ఉండేలా చూసుకోండి తండ్రి. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".


మరొక అనుభవం: నాకు కూడా ఆరోగ్యం బాగోలేక మందులు వాడుతున్నాను. ఆ మందులు పడక కడుపులో తిప్పుతున్నట్లు, వాంతి వచ్చినట్లు ఉంటూ ఎప్పుడూ కడుపులో అదోలా ఉండేది. నా సమస్య చెప్పేందుకు చిన్నగా అనిపించినా నేను దానితో చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను, "నా ఇబ్బందిని కూడా తొలగించండి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు నేను బాగున్నాను. "ఎల్లప్పుడూ ఇలాగే అందరిపై మీ కరుణ చూపించండి బాబా. థాంక్యూ సో మచ్ బాబా".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


సాయితండ్రికి శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు నాగలక్ష్మి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. మావారికెప్పుడూ ఉద్యోగంలో టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. పై అధికారుల వలన, కింద ఉద్యోగుల వలన ఆయన రోజూ మనఃశాంతి లేకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. దానివల్ల ఆయన బీపీ బాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "ఒకసారి కార్డియాలజిస్ట్ ను కలవమ"ని చెప్పారు. సరేనని, మేము హైదరాబాద్ వెళ్లి కార్డియాలజిస్ట్ ని సంప్రదిస్తే, ఆయన కొన్ని టెస్టులు చేయించుకోమన్నారు. ఆ టెస్టులు చేస్తున్నంతసేపు నేను శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ, "టెస్టులన్నీ నార్మల్‍‍గా వస్తే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవలన రిపోర్టులన్నీ నార్మల్‍గా వచ్చాయి. ఇదంతా బాబా ఆశీర్వాదం, అనుగ్రహం మాత్రమే. "ధన్యవాదాలు బాబా. మావారి టెన్షన్లన్నీ పోయేటట్లు అనుగ్రహించండి బాబా. మా పెద్దపాప బాధ్యతను కూడా మీ పాదాల చెంత పెడుతున్నాను సాయి. మీరే తన బాగోగులు చూసుకుని మంచి భవిష్యత్తునివ్వండి తండ్రి".



సాయిభక్తుల అనుభవమాలిక 972వ భాగం...


ఈ భాగంలో అనుభవం: 

  • జాతకాన్ని మార్చగల శక్తిసంపన్నులు బాబా

నా పేరు సుమ. మాది నెల్లూరు. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు ఆ బాబా కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. బాబా దయతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. బాబా దయతో నాకు 2020లో వివాహమైంది. వివాహానంతరం నేను, నా భర్త ఇందుకూరుపేటలో ఉన్న శ్రీసాయిబాబా మందిరానికి వెళ్తుండేవాళ్లం. మాకు ఏ సమస్యలున్నా ఆ మందిరంలోని బాబా దర్శనం చేసుకోగానే ఆ సమస్యలు తీరిపోతుండేవి. ఒకసారి నేను, నా భర్త బాబా గుడికి వెళ్ళినప్పుడు ఒక పాప నా దగ్గరకి వచ్చి, 'అమ్మా, అమ్మా' అంటూ నన్ను పిలిచింది. నేను తనవైపు చూసేసరికి చక్కగా నవ్వుతూ నిలబడి ఉంది ఆ పాప. విషయమేమిటంటే, ఆ పాప నన్ను తన తల్లి అనుకుని నన్ను అలా పిలిచింది. ఇలాగే మరోసారి అదే గుడిలో నేను బాబాకి దణ్ణం పెట్టుకుంటూ ఉంటే ఒక పాప వచ్చి, "అమ్మా! నన్ను ఎత్తుకో" అంటూ నా చున్నీ లాగింది. నేను చూసేసరికి ఆ పాప తల్లి వచ్చి, "పాప మిమ్మల్ని చూసి నేను అనుకుంది అండీ" అని చెప్పి, పాపని తీసుకుని వెళ్ళింది. అలా రెండుసార్లు చిన్నపాపలు నన్ను బాబా సమక్షంలో 'అమ్మా' అని పిలిచాక, 'త్వరలో బాబా పాపని ఇవ్వబోతున్నారేమో!' అని నాకనిపించింది. అయితే నా జాతకంలో నాకు చాలా ఆలస్యంగా సంతానం కలుగుతుందని ఉంది. అయినప్పటికీ నేను ఒక్కటే అనుకునేదాన్ని, 'నాకెప్పుడు సంతానాన్ని అనుగ్రహించాలో బాబాకి బాగా తెలుసు' అని.


తరువాత, నా చెల్లెలు నాకు పిల్లలు పుట్టాలని సాయి దివ్యపూజ చేసింది. అయితే ఆ విషయం తను నాకు ముందుగా చెప్పలేదు. ముందే చెప్తే, నేను వద్దంటాననో లేక నేనే చేసుకుంటాననో తను కొన్ని వారాల పూజ అయ్యాక నాతో ఆ విషయం చెప్పింది. తరువాత 2020, డిసెంబరులో తన పూజ పూర్తయ్యాక ప్రసాదం పంచేందుకు నేను, తను కలిసి బాబా గుడికి వెళ్ళాము. అప్పుడు పూజారిగారు పూజ చేసిన తర్వాత నాకు, నా చెల్లికి పువ్వులు, ప్రసాదం ఇచ్చారు. గుడి నుండి బయటికి వచ్చాక చూస్తే నాకిచ్చిన వాటిలో ఒకే కాడకి మూడు పువ్వులున్నాయి. మూడు పువ్వులు ఒకే కాడకి ఉండడం చాలా అరుదు, అదికూడా రెండు పెద్దపువ్వుల మధ్యలో ఒక చిన్నపువ్వు ఉంది. వాటిని చూడగానే నాకు అవి నేను, నా భర్త, మా జీవితంలోకి రాబోయే చిన్నపాప అనిపించి, తొందరలోనే బాబా మాకు సంతానాన్ని ఇవ్వబోతున్నారన్న దానికి అది సంకేతంలా అనిపించి ఎంతో సంతోషించాను. అనుకున్నట్లే 2021, జనవరిలో బాబా దయవల్ల నేను ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. నేను ఎంతో ఆనందించాను.


నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాకముందు 2020, డిసెంబరులో మా కుటుంబమంతా కలిసి జనవరిలో వైజాగ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని, టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకున్నాం. కానీ జనవరిలో నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అవడంతో ఆ స్థితిలో అంత దూరప్రయాణం వల్ల ఏదైనా సమస్య అవుతుందేమోనని నేను ఆగిపోదామనుకున్నాను. నాకోసం మావారు కూడా ఆగిపోదాం అనుకున్నారు. అలా ఒక్కొక్కరు ఆగిపోతూ, 'వెళ్తే, అందరమూ వెళదాము, లేకపోతే ఎవరూ వద్దు' అనే నిర్ణయానికి వచ్చారు. నా ఒక్కదానివల్ల మిగతా ఇరవైమంది ఆగిపోవడం నాకు బాధగా అనిపించి సలహా తీసుకునేందుకు నేను డాక్టరుని సంప్రదించాను. డాక్టరు, "కడుపులోని బిడ్డ రక్షణకోసం ఒక ఇంజక్షన్ వేసుకుని వెళ్లొచ్చు. అయితే నాలుగు వారాలపాటు ఆ ఇంజక్షన్ ఖచ్చితంగా వేసుకోవాల"ని చెప్పారు. సరేనని, నేను ఇంజక్షన్ వేయించుకుని కుటుంబసభ్యులతో వైజాగ్ ప్రయాణమయ్యాను. మేము వైజాగ్ నుంచి అరకు వెళ్ళాము. అది నాకు ఇంజక్షన్ వేయాల్సినరోజు. అయితే, అరకు ఏజెన్సీ ప్రాంతమైనందున మెడికల్ షాపులు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా నేను ఈరోజు ఇంజక్షన్ వేయించుకునేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. కాసేపటికి మావారు ఆ ప్రాంతంలో విచారించగా, "దగ్గర్లో ఒక క్లినిక్ ఉంద"ని అక్కడి వాళ్ళు చెప్పారు. అద్భుతం! ఆ క్లినిక్ పేరు 'సాయి క్లినిక్'. అది తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కడికి వెళ్తే, ఆ క్లినిక్‍లో అంతటా సాయిబాబా ఫోటోలే ఉన్నాయి. నేను నా మనసులో, 'ఇంజక్షన్ తుంటికి చేయాలి కదా! లేడీ డాక్టర్ ఉంటే బాగుంటుంది' అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే లేడీ డాక్టరు ఉండేలా అనుగ్రహించారు బాబా. నిజానికి అక్కడ ఎప్పుడూ జెంట్ డాక్టరే ఉంటారట. అలాంటిది ఆ డాక్టరు సెలవులో ఉండటం వలన ఆరోజు లేడీ డాక్టరు డ్యూటీలో ఉన్నారు. ఇంకో అద్భుతం చూడండి! మేము ఏ ఇంజక్షన్ అనేది చెప్పకుండా "ఇంజక్షన్ చెయ్యాలి" అని అనగానే ఆ డాక్టరు, "ప్రెగ్నెన్సీకి సంబంధించా?" అని అడిగారు. 'మేము ఏమీ చెప్పకుండా ఆమెకు ఎలా తెలిసిందా' అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె ఇంజక్షన్ చేశాక నాకు అస్సలు నొప్పి తెలియలేదు. నిజానికి ఆ ఇంజక్షన్ వేశాక చాలా నొప్పి ఉంటుంది. అందుకే ఆ ఇంజక్షన్ తుంటికి వేస్తారు. అదివరకు నేను ఆ ఇంజక్షన్ నెల్లూరులో రెండుసార్లు వేయించుకుంటే చాలా నొప్పేసింది. రెండురోజులు వరకు చాలా నొప్పి అనుభవించాను. ఆ కారణంగా నేను ట్రిప్‍లో ఇంజక్షన్ వేసుకున్నాక చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ బాబా ఎంతో దయతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. 'సాయి క్లినిక్' కనిపించడం, అక్కడ లేడీ డాక్టరే ఉండటం, ఆమె ఇంజక్షన్ వేశాక అస్సలు నొప్పి లేకపోవడం అంతా సాయి లీల. తర్వాత మేము సింహాచలం, అన్నవరం దర్శించుకుని తిరిగి వచ్చాము. ఆవిధంగా బాబా దయవలన మా ట్రిప్ ప్రశాంతంగా ముగిసింది. ప్రయాణంలో మావారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంటికొచ్చాక ప్రయాణం వల్ల కడుపులో బిడ్డ ఎలా ఉందోనని కాస్త భయపడ్డాము. అయితే మూడో నెలలో స్కాన్ చేసినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉందని అన్నారు. అంతా బాబా దయ.


కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి నాకు మామిడిపండు తినాలనిపించింది. అదేరోజు మా బావగారు నాలుగు మామిడిపండ్లు తెచ్చి నాకు ఇచ్చారు. నేను అడగకుండానే మామిడిపండ్లు తేవడంతో నాకు చాలా సంతోషం కలిగింది. ఇంకా వాటిని చూడగానే నాకు శ్రీసాయిసచ్చరిత్రలోని బాబా దాముఅన్నాకి నాలుగు మామిడిపండ్లు ప్రసాదించి సంతానాన్ని అనుగ్రహించిన లీల గుర్తు వచ్చింది. ఇంకోరోజు నాకు జిలేబీ తినాలనిపించింది. ఆరోజు అనుకోకుండా మావారు జిలేబీ తెచ్చారు. నిజానికి నాకు జిలేబీ అస్సలు ఇష్టముండదు. అలాంటిది ఆరోజు నాకు జిలేబీ తినాలనిపించడం, మావారు తేవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆవిధంగా  కడుపుతో ఉన్నప్పుడు నేను మనసులో ఏవి తినాలనుకున్నా బాబా దయవల్ల అవి వచ్చేసేవి


ఒకసారి నేను వంగి ఫ్రిడ్జ్ లోని కూరగాయలు తీసి, పైకి లేస్తుంటే పొరపాటున ఫ్రిడ్జ్ తలకి గట్టిగా గుద్దుకుని చాలా రోజుల వరకు నొప్పి ఉండేది. డాక్టరుని అడిగి మాత్రలు  వాడినప్పటికీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను రోజూ బాబా ఊదీని తలకి వ్రాయడం మొదలుపెట్టాను. ఊదీ రాసినప్పటి నుంచి నొప్పి తగ్గడం మొదలై, మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐవ నెలలో ఒకసారి నేను అనుకోకుండా పడిపోబోయాను, కానీ బాబా దయవల్ల పడలేదు. పడివుంటే, ప్రక్కనే ఉన్న చిన్నగోడ నా కడుపుకు తగిలి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం జరిగి ఉండేది. ఎవరో పట్టుకున్నట్టు పడకుండా ఆగిపోయాను. ఈ విధంగా ఎన్నోసార్లు బాబా కడుపుతో ఉన్న నన్ను రక్షించారు


ఆరవ నెల నడుస్తుండగా నాకు, మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మా డాక్టరు నా విషయంలో, "మేము ఏమీ చేయలేం. చికిత్స కోసం నువ్వు చెన్నై వెళ్ళాలి" అని చెప్పేశారు. ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను, బేబీకి ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. ఆ సమయంలోనే మొదటిసారి నాకు కడుపులో బిడ్డ కదలిక తెలిసింది, బిడ్డ తన్నడం అనుభూతి చెందాను. అంత బాధలో కూడా బాబా నన్ను ఆవిధంగా సంతోషపెట్టారు. అదలా ఉంచితే, నా బాధ చూడలేక మావారు నన్ను వేరే హాస్పిటల్లో చూపించి మందులిప్పించారు. నేను డాక్టరు ఇచ్చిన మందులు కేవలం మూడు రోజులే వాడి, మిగిలిన అన్నిరోజులూ కేవలం బాబా ఊదీ పెట్టుకుని, ఊదీనీళ్లు త్రాగేదాన్ని. ఇంకా ప్రతిరోజూ బాబా ఊదీని నోట్లో వేసుకుని, కడుపులో ఉన్న నా బిడ్డ బాగుండాలని పొట్ట మీద కూడా ఊదీ రాసుకుంటుండేదాన్ని. నాకు ఆ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగానూ, బాగా ఆయాసంగానూ ఉండేది. చాలామంది కడుపులో బిడ్డకి ప్రమాదమని భయపెట్టారు. ఆ రోజులని ఎప్పుడు తలచుకున్నా నాకు చాలా భయమేస్తుంది. 15 రోజుల తరువాత టెస్ట్ చేస్తే, బాబా దయవల్ల కరోనా నెగిటివ్ వచ్చింది. అప్పటినుండి నేను వేరే డాక్టరుని సంప్రదించాను. ఆమె నన్ను చాలా బాగా చూసేవారు.


ఒకరోజు నాకు కలలో అమ్మవారు కనిపించి నా చెయ్యి చూసి, "నీకు ఆడపిల్ల పుడుతుంది" అని చెప్పారు. తరువాత 2021, సెప్టెంబరు 8వ తేదీన నేను పురిటినొప్పులు భరించలేక  బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల కాసేపట్లో ఎటువంటి ఇబ్బందీ లేకుండా నాకు డెలివరీ అయి చక్కటి ఆరోగ్యవంతమైన పాపకి జన్మనిచ్చాను. పాప బాబా వరప్రసాదమని చెప్పాలి. తానెప్పుడూ మా ఇంట్లో ఉన్న సాయిబాబా ఫోటో చూస్తుంటుంది. వేరే గదిలోకి మార్చినా ఆ గదిలో ఉన్న బాబా ఫోటోని చూస్తూ బాగా ఆడుతూ ఉంటుంది. అలా తను బాబాని చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే 'తను బాబాతో మాట్లాడుతుందేమో! తనని బాబా బాగా చూసుకుంటున్నారు' అనిపిస్తుంది. "థాంక్యూ బాబా. ఇదంతా మీ దయే తండ్రీ. మీ కృప ఎప్పుడూ మా అందరిమీదా ఉండాలి సాయీ. పాపకి మంచి ఆరోగ్యాన్ని, చక్కటి భవిష్యత్తుని ఇవ్వండి సాయీ". 


చివరిగా, సాయిబంధువులకు నేను చెప్పేది ఒక్కటే, నాకు జాతకంలో సంతానం ఆలస్యమవుతుందని ఉంది. కానీ పెళ్ళైన సంవత్సరంలోపే నాకు సంతానం కలిగింది. జాతకాన్ని మార్చే శక్తి మన సాయికి ఉంది. అన్నిటికంటే ఆయన గొప్పవారు. సాయి  చెప్పినట్టు జాతకాలను ప్రక్కన పెట్టి సాయిని నమ్మండి. సాయి తన బిడ్డలకు ఎల్లప్పుడూ  శ్రేయస్కరమైనదే ప్రసాదిస్తారు.


సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!!!



లక్ష్మణ్ గోవింద్ ముంగే



సాయిభక్తుడు లక్ష్మణ్ గోవింద్ ముంగే మహారాష్ట్రలోని నాసిక్‌ నివాసి. 1890కి ముందు ఇతను సాయిభక్తుడైన చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే సీనియర్ మామల్తదారు వద్ద గుమస్తాగా పనిచేస్తుండేవాడు. అప్పుడొకసారి గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్‌లు శిరిడీ వెళ్తుంటే, ముంగే కూడా వాళ్లతోపాటు మొదటిసారి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు ముగ్గురూ మసీదులో బాబా దర్శనం చేసుకొని అక్కడే కూర్చున్నారు. అప్పుడు ముంగే, 'ఫకీరైన బాబాను హిందువులు ఎలా పూజిస్తున్నారు?' అని ఆలోచిస్తుండగా బాబా గాడ్గిల్‌ను, "నా ఖర్జూరాలు, సాంబ్రాణికడ్డీలు, నా రూపాయి నాకివ్వు" అని అన్నారు. బాబా మాటలు ముంగే దృష్టిని ఆకర్షించాయి. కారణం, ముందురోజు రాత్రి నిద్రకుపక్రమించే ముందు గాడ్గిల్ బాబాకి సమర్పించేందుకుగాను కొన్ని ఖర్జూరాలు, ఒక రూపాయి, సాంబ్రాణికడ్డీల ప్యాకెట్టును ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. బాబా ఆ మూడింటినే గాడ్గిల్‌ను అడిగి స్వీకరించారు. తరువాత నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకి పదిరూపాయల నోటును దక్షిణగా ఇవ్వబోయాడు. బాబా ఆ పదిరూపాయలను తీసుకోవడానికి నిరాకరిస్తూ, "నేను ఫకీరును. నేను ఈ డబ్బు తీసుకోను" అని అన్నారు. తరువాత బాబా గాడ్గిల్ నుండి స్వీకరించిన ఆ రూపాయిని మసీదులో వెలిగించే దీపాలకు అవసరమైన నూనెను సరఫరా చేసే నూనెవర్తకునికి ఇచ్చి, సాంబ్రాణికడ్డీలు వెలిగించి, ఖర్జూరాలను అక్కడున్న భక్తులందరికీ పంచిపెట్టారు. ఇదంతా చూశాక, బాబా సర్వజ్ఞులనీ, మహనీయులనీ, వారిని పూజించటం సరైనదేననీ ముంగే భావించాడు.

1890లో 26 ఏళ్ల వయసులో ముంగేకు వివాహం నిశ్చయమైంది. వివాహ సమయంలో పెళ్లికూతురుని అలంకరించేందుకు అతనికి నగలు అవసరమయ్యాయి. ఆ విషయంలో అతను రహతాలో ఉన్న తన మేనత్త భర్త సహాయం చేస్తాడని ఆశించి రహతా వెళ్ళాడు. అప్పుడు బాబా రహతాలోని మారుతీ ఆలయంలో ఉన్నారు. బాబాను అక్కడ చూసి వారి దర్శనానికి వెళ్ళాడు ముంగే. బాబా అతన్ని చూసి, "అబ్బాయీ, రా! నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను" అంటూ ఆహ్వానించి తమ కాళ్ళు వత్తమన్నారు. అతను అలాగే చేశాడు. అప్పుడు బాబా అతనికి ఒక మామిడిపండు ఇచ్చి తినమన్నారు. ముంగే ఆ మామిడిపండును తిన్నాడు. అది ఎంతో మధురంగా ఉంది. అప్పుడు బాబా, "నువ్వు దేనికోసం వచ్చావు?" అని అడిగారు. అందుకు ముంగే, "బాబా! నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా అతనితో, "ఎవరికి ఎవరు? ఇచ్చేదెవరు? పుచ్చుకొనేదెవరు? అవసరానికి ఎవరూ సహాయం చేయరు. నీకు అవసరమైతే 1,000 రూపాయలుగానీ, 2,000 రూపాయలుగానీ నా దగ్గర నుండి తీసుకో!" అన్నారు. గోనెగుడ్డలు ధరించి, చేతిలో కేవలం ఒక రేకుడబ్బా పట్టుకొని ఉన్న బాబాను చూస్తూ, "ఈయన నాకు అవన్నీ ఎలా ఇస్తారు?" అని అనుకున్నాడు ముంగే. తరువాత అతను అక్కడినుండి తన మేనత్త ఇంటికి వెళ్లి, ఆమె భర్తతో తన అవసరాన్ని చెప్పాడు. అతని మామ ‘తన దగ్గర నగలేమీ లేవ’ని చెప్పాడు. దాంతో, ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో ముంగే వెనుదిరిగాడు. అదేసమయంలో అతని స్నేహితుడొకడు కలవగా అతనికి తన పరిస్థితిని వివరించాడు ముంగే. వెంటనే ఆ స్నేహితుడు ముంగేకి సహాయం చేయదలచి సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారును అతనికి పరిచయం చేశాడు. ఆ షావుకారు ముంగేకి కాలిఅందెలు, ముక్కుపుడక అరువుగా ఇచ్చాడు. అంతేకాదు, 30 తులాల బంగారంతో ముంగేకి అవసరమైన నగలను ఒక్కరోజులో తయారుచేయించి నెలవారీ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. దాంతో ముంగే వివాహం వాయిదాపడకుండా సకాలంలో సక్రమంగా జరిగింది. ఆ విధంగా ముంగే స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా అతనికి సహాయం అందేలా చేసి తమ మాటను నిలుపుకున్నారు బాబా. అప్పటినుండి ముంగే ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకొనేవాడు.

మొదట్లో ముంగే దంపతులకు కలిగిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు మినహా మిగతా బిడ్డలందరూ అతి తక్కువ కాలంలోనే మరణించారు. 1912లో అతను బాబాను దర్శించి తన దురదృష్టానికి దుఃఖిస్తూ, "బాబా! నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుడిని ప్రసాదించండి" అని ప్రార్థించాడు. బాబా అతనితో, "నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటావు? నీకు నేను ఇద్దరు కుమారులను  ప్రసాదిస్తాను" అని అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే ఆ తరువాత ముంగే దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. ముంగే నిత్యమూ తన ఇంట్లో బాబా చిత్రపటాన్ని పూజిస్తుండేవాడు. బాబా అతని కోరికలన్నీ తీర్చారు. అందుకు ఈ క్రింది సంఘటనే నిదర్శనం.

ఒకసారి ముంగే ఇంట్లో ఒక వ్యక్తి, అతని కుమార్తె కొద్దిరోజులు అతిథులుగా ఉన్నారు. ఒకరోజు ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బుచేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేకపోయింది. ఆ రాత్రి ముంగే బాబా ఫోటోను ఆమె తల దగ్గర పెట్టి, ఆమెకి ఊదీ పెట్టాడు. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయం ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆమె తల్లి బాబాకు 10 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మ్రొక్కుకొని వాటిని బాబాకు సమర్పించింది.

సోర్స్: డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాయిబాబా బై బి.వి.నరసింహస్వామి.

సాయిభక్తుల అనుభవమాలిక 971వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాయగానే తీరిన కష్టాలు
2. సాయితండ్రి దయ - ఊదీ మహత్యం
3. సద్గురు సాయి చూపిన లీల

ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాయగానే తీరిన కష్టాలు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నా శతకోటి ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు సౌదామిని. మేము ఇదివరకు రేపల్లెలో ఉండేవాళ్ళం. ప్రస్తతం బదిలీ మీద భీమవరం వచ్చి ఉంటున్నాము. నేను 20 సంవత్సరాలుగా బాబాను కొలుస్తున్నాను. నాకు అన్నీ బాబానే. 2021, మే నెలలో నాకు కరోనా వచ్చి రిపోర్టు పాజిటివ్ అని రాకముందే నేను మొదటిసారి నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. తరువాత నాకు కరోనా పాజిటివ్ వచ్చినా ఇంట్లోనే క్వారంటైన్‍లో ఉంటూ వారంలోపే సాయితండ్రి దయవల్ల సాధారణ జ్వరం నుంచి కోలుకున్నట్లు కరోనా నుండి బయటపడ్డాను. అయితే ఇంకే ఇబ్బంది లేదనుకున్న తరుణంలో మా అత్తగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసలే ఆవిడ డయాబెటిక్ పేషెంట్ అయినందున, "మా అత్తగారు ఏ సమస్య లేకుండా కరోనా నుండి కోలుకుంటే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చినప్పటికీ బాబా దయవలన ఆవిడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా నుండి కోలుకున్నారు.


ఇకపోతే నేను కరోనా నుండి బయటపడ్డ తరువాత పోస్ట్ కోవిడ్ ప్రభావం వలన ఏదో ఒక అనారోగ్య సమస్యతో చాలా బాధపడ్డాను. అందులో మొదటిది మానసిక ఆందోళన. దాని కారణంగా భయంతో రాత్రిళ్ళు నాకు నిద్ర ఉండేదికాదు. పగలు కూడా చాలా ఆందోళనగా ఉండేది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నా ఇద్దరి పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్ గురించి చాలా దిగులు పడిపోతుండేదాన్ని. ఇలా అనుభవిస్తుంది చాలదన్నట్లు 2021, అక్టోబర్ 6న జ్వరం, ఒళ్లునొప్పులతో లేవలేకపోయాను. అమ్మ వాళ్ళింట్లో ఉంటూ, హోమియో మందులు వాడుతూ బాబా మీద పూర్తి విశ్వాసముంచి, "నాకు జ్వరంతో తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. నా నమ్మకం వృథా పోకుండా బాబా నన్ను ఆ కష్టం నుండి గట్టెక్కించారు. ప్రస్తుతం బాబా దయవలన పోస్ట్ కోవిడ్ బాధలన్నీ తగ్గాయి, మానసికంగా కూడా కొంచెంకొంచెంగా కోలుకుంటున్నాను. అంతా నా తండ్రి బాబా పెట్టిన భిక్ష. "ధన్యవాదాలు బాబా".


కరోనా ప్రభావం వలన మూతపడ్డ స్కూళ్ళు తెరిచిన రెండు నెలల వరకూ కరోనా భయంతో నేను నా పిల్లల్ని స్కూలుకి పంపలేదు. చివరికి దసరా సెలవుల తరువాత వారం నుండి పిల్లలిద్దరినీ స్కూలుకి పంపాను. సరిగ్గా నాల్గవ రోజు ఉదయం బాబుకి చలి జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆరోజు ఆదివారం కావడం వలన భీమవరంలో ఒక్క డాక్టరూ అందుబాటులో లేరు. భయాందోళనలతో నా గుండె వేగంగా కొట్టుకోగా నా సాయితండ్రి నాకు గుర్తుకు వచ్చారు. ఆయనకి నమస్కరించుకుని, "నా బిడ్డని రక్షించండి బాబా" అని వేడుకున్నాను. తరువాత నా భర్త తనకి తెలిసిన డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెప్తే, కొన్ని మందులు చెప్పి, వాటిని బాబుకి వేయమన్నారు. మరో డాక్టరు మాత్రం కోవిడ్ టెస్టు చేయించమన్నారు. నేను భయపడి బాబా ఫోటో దగ్గరకి వెళ్లి, "టెస్టు రిపోర్టు నెగిటివ్ వస్తే, వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నాకు, నా బిడ్డకు మీరే దిక్కు బాబా" అని వేడుకున్నాను. ఆరోజుంతా జ్వరానికి మందులిచ్చి, మరునాడు సోమవారం మధ్యాహ్నం బాబుకి రాపిడ్ టెస్టు చేయించాము. బాబా దయవలన టెస్టు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. 'ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాసుకుంటే, ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది' అని బాబా జీవితచరిత్రలో ఉన్న ఒక భక్తుని అనుభవం అక్షర సత్యం. నా విషయంలో కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకి మొక్కుకున్నంతనే ప్రతి కష్టం నుండి నన్ను గట్టెక్కిస్తున్నారు బాబా. "ధన్యవాదాలు బాబా. నాకు తెలుసు, మా బాధలు మీకు నివేదించనక్కరలేదు. సర్వమూ మీరు చూసుకుంటారు తండ్రీ. మమ్మల్ని ఎప్పుడూ చల్లగా మీ నీడలో క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి నాయనా!"


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయితండ్రి దయ - ఊదీ మహత్యం


ఓం శ్రీ సాయినాథాయ నమః. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయిబంధువులందరికీ సాయి తండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీదేవి. నాకు సర్వం నా బాబాతండ్రే. ఆయన ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఇంతకుముందు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ 22న మావారు జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులతో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయనెప్పుడూ ఎంత కష్టమెచ్చినా సహనంతో ఓర్చుకునేవారు. అలాంటిది ఈసారి వచ్చిన జ్వరాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ కృపతో మా వారికి జ్వరం త్వరగా తగ్గిపోవాలి. అలా జరిగితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. తరువాత మావారికి ఊదీ పెట్టి, ఊదీ తీర్థాన్ని ఇచ్చాను. బాబా దయవల్ల మావారు త్వరగా కోలుకున్నారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా ఉండగా మనకు భయమెందుకు?


ఒకరోజు రాత్రి గం.11:30ని.లకు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా నాన్నగారి నుదుట నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది. దాంతో హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. వెంటనే బాబాకు నమస్కరించుకుని, ఎదురుగా ఉన్న ఊదీని నా నుదుటన ధరించి, "బాబా! నాన్నకి ఏమీ కాకుండా చూడండి" అని వేడుకున్నాను. రెండురోజుల తర్వాత మా అమ్మతో మాట్లాడుతుంటే, "నాన్న నుదుటికి కప్ బోర్డులకు బిగించే శీల గుచ్చుకుంది, అయితే పెద్దగా రక్తం కారకుండా చిన్న చెమ్మలా వచ్చింద"ని అమ్మ చెప్పింది. ఇదంతా నాకు కల వచ్చిన మరుసటిరోజు జరిగింది. నా సాయితండ్రి దయవల్ల, ఊదీ మహత్యం వల్ల నాన్నకు ప్రమాదం తప్పింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా, అందరినీ చల్లగా చూడు తండ్రీ".


సద్గురు సాయి చూపిన లీల


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శారద చంద్రశేఖర్. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు చాలాకాలం నుంచి అప్పుడప్పుడు వెన్నునొప్పి వస్తూ, అదే తగ్గిపోతూ ఉంది. అయితే ఒకరోజు నీళ్ళ బకెట్ తెస్తుంటే చెయ్యి బెణికి వెన్నునొప్పి బాగా వచ్చింది. ఎప్పుడూ హోమియో మందులు వాడే అలవాటు ప్రకారం అప్పుడు కూడా హోమియో మందు వేసుకుంటే తగ్గింది. కానీ సరిగా అప్పుడే ప్రయాణం, పండుగ కారణంగా పనులు ఎక్కువ అవ్వటం వలన చాలా నీరసంగా ఉండటం, దాంతోపాటు కొద్దిగా జలుబు, జ్వరం కూడా ఉండేసరికి వాటికి కూడా హోమియో మందులు వేసుకున్నాను. అంతలోనే మళ్లీ బిందెతో నీళ్ళు పట్టుకుని వచ్చే క్రమంలో చెయ్యి బెణికి మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. ఈసారి మందులు వాడినా తగ్గలేదు. అందరూ డాక్టరు దగ్గరకు వెళ్లి చూపించుకోమని అన్నారు. కానీ నేను ఆ నొప్పితోనే నా పనులన్నీ (నీళ్ళు పట్టుకోవడం కూడా) చేసుకుంటూ, "ఈ నొప్పి తగ్గేలా లేదు, ఏం చేయాలి?" అని అనుకున్నాను. తరువాత తోటి భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! నాకు సాయంత్రంలోగా నొప్పి తగ్గితే, వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి నాకు ఆ నొప్పి నుండి ఉపశమనం లభించింది. వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం బ్లాగు వారికి పంపాను. నమ్మకంతో కొలిస్తే మన చెంతనే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు బాబా.



సాయిభక్తుల అనుభవమాలిక 970వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్య ఏదైనా బాబా ప్రేమతో అనుగ్రహిస్తారు
2. మనకై మనం బాబా భక్తులం కాము - బాబానే మనల్ని తమ భక్తులని చేసుకుంటారు
3. బాబా ప్రసాదించిన సంతోషం

సమస్య ఏదైనా బాబా ప్రేమతో అనుగ్రహిస్తారు


సాయి భక్తులకి, బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వీణ. మాది హైదరాబాదు. నాకు ఏ చిన్న కష్టమొచ్చినా బాబా ఉన్నారని బాబాకే చెప్పుకుంటాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మా కజిన్‍‍కి కరోనా వచ్చింది. తన ద్వారా 80 సంవత్సరాల వాళ్ల అమ్మకి కూడా కరోనా వచ్చి ఐదు రోజుల తర్వాత ఆవిడ చనిపోయారు. తల్లి మరణంతో కల్గిన బాధ వలన మా కజిన్ చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఇంకా కరోనా కూడా ఉపిరితిత్తులపై ప్రభావం చూపడం వలన తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అయింది. దాంతో తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఒక పక్క తల్లి చనిపోయింది, మరోపక్క కరోనాతో హాస్పిటల్లో ఒంటరిగా ఉన్న అతనికి ఫోన్ చేసి దైర్యం చెప్పడం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. అటువంటి స్థితిలో నేను తనకి ఫోన్ చేసి, "నీకు ఏమీ కాదు, భయపడకు. నీకు ఎవరూ లేరనుకోవద్దు. నీ పక్కన సాయిబాబా ఉన్నారు. నువ్వు 'సాయిరామ్ సాయిరామ్' అని నామజపం చేస్తూ ఉండు. నీకోసం మేము కూడా చేస్తూ ఉంటాము. నీకు తప్పకుండా నయమైపోతుంద"ని చెప్పాను. అతను అలాగే చేసాడు. నేను కూడా తన గురించి బాబాని వేడుకుని, అతనికి నయమైతే మీఅందరితో పంచుకుంటానని చెప్పుకున్నాను. బాబా దయ చూపించారు. మూడు రోజుల్లో అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.


నేను వేసవికాలంలో సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి పెట్టాను. నిజానికి నాకు పచ్చడి పెట్టడం సరిగా తెలీదు. మరుసటిరోజు ఉదయానికి పచ్చడి బాగానే ఉంది కానీ మూడురోజులు తర్వాత కలుపుదామని మూత తీస్తే, పైన అంతా నురగలు నురగలుగా ఉంది. అది చూసి, 'ఇదేమిటి ఇలా పాడైపోయినట్లు అయిపోయింది, మొత్తం పారేయాల్సిందేనా' అని భయపడ్డాను. వెంటనే బాబా గుర్తుకు వచ్చారు. "బాబా! నువ్వే ఇది పాడవకుండా మంచిగా ఉండేలా చూడు" అని బాబాతో చెప్పుకుని, ఆయన నామం చేసుకుంటూ కొద్దిగా ఊదీ పచ్చడిలో వేసి కలిపాను. అంతే, బాబా దయవలన పచ్చడి ఇప్పటివరకు చాలా బాగుంది. ఇంత చిన్న దాన్ని కూడా అనుభవాల్లో వ్రాయాలా అని అందరూ అనుకోవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు, దాన్ని అనుభవించేవారికి అది పెద్దగా అనిపిస్తుంది, ఏం చేయాలో తోచక టెన్షన్‍గా ఉంటుంది. అయినా సమస్య ఎంత చిన్నదైనా బాబా ప్రేమతో అనుగ్రహిస్తారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


మనకై మనం బాబా భక్తులం కాము - బాబానే మనల్ని తమ భక్తులని చేసుకుంటారు


సాయికుటుంబానికి నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నడుపుతున్న సాయికి నా కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా మీరు చాలా మంచి సాయిసేవ చేస్తున్నారు. ఎల్లప్పుడూ  బాబా అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు నవీన్. నా జీవితంలో బాబా ప్రసాదించిన ఒక చక్కని అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మేము బ్రాహ్మణులం. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఉపనయనం జరిగింది. మా పక్కింటివాళ్ళు సాయి భక్తులు. వాళ్ళు నా ఉపనయనానికి కొన్ని రోజుల ముందు నా ఉపనయనంలో కట్టుకోమని బాబా మందిరంలో బాబాకి కట్టిన ఒక పంచెని తెచ్చి నాకు ఇచ్చారు. అయితే అప్పటికి నేనింకా సాయిభక్తుడిని కానందున నేను దానిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఉపనయనంలో మాత్రం చాలావరకు నేను ఆ పంచెనే కట్టుకున్నాను. ఉపనయనం చాలా బాగా జరిగింది. తరువాత నేను ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయాను. ఇన్ని సంవత్సరాల తరువాత నేను బాబాకి భక్తుడినయ్యాక ఇటీవల ఒకరోజు నా ఉపనయనం గురించి ఆలోచిస్తుంటే, ఆ పంచె విషయం గుర్తుకువచ్చి చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను వారి భక్తుడిని కాకమునుపే బాబా నన్ను ఏ రీతిన అనుగ్రహించారో గుర్తించాక వెంటనే బాబా ప్రసాదించిన ఈ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకోవాలనిపించి ఇలా మీతో పంచుకున్నాను. ఈ అనుభవం ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, 'మనకై మనం బాబా భక్తులం కాము. బాబానే మనల్ని తమ భక్తులని చేసుకుంటారు. తమ వాళ్ళు ఎవరో బాబాకి మనం పుట్టినప్పటినుంచే తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని తమ భక్తులుగా మలుచుకుంటారు. ఇంకో విషయం బాబా తమ భక్తుల శుభకార్యాలకు ఏదో ఒక రూపంలో హాజరై తమ ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు' అని. నా విషయంలో అదే జరిగింది. "బాబా! నన్ను మీ భక్తుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ మీరు నాతోనే ఉండండి. నా చేయి ఎప్పుడూ వదలకండి బాబా. నన్నే కాదు, సాయిబంధువులందరిని మంచి మార్గంలో నడిపించండి. నేను శిరిడీకి చాలా చిన్నపుడు వచ్చాను బాబా. నాకు ఇప్పుడు శిరిడీ చూడాలని, మీ దర్శనం చేసుకోవాలని చాలా కోరికగా ఉంది బాబా. నాకు తొందరగా శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి సాయి".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


బాబా ప్రసాదించిన సంతోషం


నా పేరు సాహిత్య. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. జులై నెలలో నేను మావారికి జీతంలో పెరుగుదల లేదా వేరే కంపెనీలో అధిక జీతంతో ఉద్యోగం రావాలని ఏడు రోజులు సచ్చరిత్ర పారాయణ చేశాను. బాబా దయవలన నెలరోజుల్లో మావారికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. నేను ఆశించినంత జీతం కాకపోయినప్పటికీ జీతం పెరిగినందుకు నేను చాలా సంతోషించాను. తరువాత సరిగ్గా నేను పారాయణ పూర్తిచేసిన మూడు నెలలకి అక్టోబర్ నెలలో మావారికి అత్యధిక జీతంతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇదంతా బాబా దయవల్లే. "థాంక్యూ సో మచ్ బాబా. మీ మేలు ఎన్నడూ మరువము సాయి".


2021, అక్టోబర్ 21న మా అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా బాగా జరిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో  పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన అన్నయ్య పెళ్లి చాలా వైభవంగా, సంతోషదాయకంగా జరిగింది. 2021, అక్టోబర్ 24న పెళ్లి తరువాత మా అమ్మ, వదినకు పెట్టాల్సిన చీర ఒకటి కనిపించలేదు. అప్పుడు నేను 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని చెప్పుకున్నాను. బాబా దయవలన కొన్ని నిమిషాల్లో చీర కనిపించింది. అలాగే మావారు హైదరాబాద్ నుండి క్షేమంగా మా ఊరు వస్తే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన ఆయన క్షేమంగా వచ్చి, తిరిగి వెళ్ళారు. "అన్నిటికి మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!



సాయిభక్తుల అనుభవమాలిక 969వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బ్లాగు నిలువెత్తు బాబా రూపానికి సజీవసాక్ష్యం
2. బాబా కృపతో అందరికీ ఆరోగ్యం
3. బాబా సదా కాపాడుతుంటారు

బ్లాగు నిలువెత్తు బాబా రూపానికి సజీవసాక్ష్యం


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. శ్రీ సాయినాథుని దివ్య పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకోబోతున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సంధ్య. ఆర్థిక ఇబ్బందులతో, కష్టనష్టాలతో, అనారోగ్యసమస్యలతో మావారు బాధపడుతున్నప్పుడు, మావారి బాధ చూడలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, బంధు బలం దూరమైనప్పుడు అసలు బంధం 'సాయే'నని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నా కంటపడింది. కాదు, బాబానే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు రూపంలో నాకు దర్శనమిచ్చి ధైర్యాన్ని, సాయిబంధువుల అనుభవాల ద్వారా వారి ప్రేమను ప్రసాదించారు. ఇంకా నేను పొందిన వారి ప్రేమను పంచుకునేలా నన్ను అనుగ్రహించారు. బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు నా కళ్లలో ఆనందాశ్రువులు పొంగిపొర్లుతాయి. నిజంగా భక్తుల అనుభవాలు రూపంలో సాయి లీలలు చదవడం బాబా మనకిచ్చిన గొప్ప వరం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఈతరం భక్తులకు నిలువెత్తు బాబా రూపానికి సజీవసాక్ష్యం. బ్లాగులోని సాయి వచనాలు, సందేశాలు చాలా ధైర్యాన్ని, 'బాబా ఉన్నారు, తప్పక మేలు జరుగుతుంద'న్న నమ్మకాన్ని ఇస్తున్నాయి.


మేము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో పిల్లల చదువులకోసం కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాము. ఒకరోజు ఆ అప్పు ఎలా తీర్చాలని వేదనపడుతూ నేను కూడా ఏదైనా ఆదాయం వచ్చే పని చేస్తే, మావారికి కొంత సహాయంగా ఉంటుందని బాబాని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. ఇంకా పూర్తిగా నిద్రలోకి జారుకోక ముందే కాస్త మెలుకువ ఉన్న స్థితిలో, "కూర్చుని తిను" అన్న మాట వినబడింది. అది నా సాయిబాబా స్వరమని నేను నిశ్చింతగా ఉండిపోయాను. అదే సమయంలో మేము అదివరకు కొన్న ఒక పొలం అమ్మకానికి పెట్టాము. మేము ఆ పొలం కొన్నప్పుడు లేని సమస్యలు అమ్మకానికి పెట్టినప్పుడు తలెత్తాయి. అంత క్లియర్‍గా ఉన్న ఆ పొలం గతంలో హరిజనులది. వాళ్ళు మాకు పొలంలో హక్కు ఉంది, అది మా తాతల ఆస్తి. గతంలో మేము తక్కువ ధరకు మీకు అమ్మాము. కాబట్టి మాకు ఇప్పుడు పెద్ద మొత్తం డబ్బులు కావాలని మమ్మల్ని పొలం దగ్గరకు కూడా రానివ్వక చాలా ఇబ్బందులకు గురి చేశారు. మేము నిస్సహాయస్థితిలో బాబాను ప్రార్థించాము. అప్పుడు బ్లాగులో "నీవు నా వద్ద ఊరకే కూర్చో! చేయవలసిందంతా నేను చేస్తాను" అన్న సాయి వచనం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ మాటలు బాబా మాకే చెప్తున్నారనిపించి మేము ధైర్యంగా ఉండసాగము. తరువాత నేను భూమి అమ్మడంలో బాబా సహాయం కోరుతూ సచ్చరిత్ర పారాయణ చేశాను. ఐదవరోజు పారాయణ పూర్తికాగానే బాబా అద్భుతం చేసారు. ఆరోజు భూమి కొనుగోలుదారులు వచ్చి ఒప్పంద పత్రం వ్రాసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎంతో శ్రమపడాల్సిన మాకు చాలామంది వ్యక్తుల సహాయం అందింది. వాళ్ళంతా బాబా ఏర్పాటు చేసిన వ్యక్తులని మా విశ్వాసం. వారి సహాయంతో ఎటువంటి శ్రమ లేకుండా పొలం అమ్మకం జరిగింది. ఇంకో విషయం ఆ కష్ట సమయంలో ఒకసారి వచ్చిన "నీకు చాలా డబ్బులు ఇస్తాను" అన్న బాబా వచనం నాకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. బాబా చెప్పినట్లే పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో మా అవసరాలన్నీ తీర్చుకున్నాము. ఇది బాబా అద్భుతలీల. "ధన్యవాదాలు సాయితండ్రి".

 

ఇప్పుడు మేము మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మళ్ళీ భూమి కొనాలని అనుకుంటున్నాము. ఆ ప్రయత్నాలలో మాకు ఒక పొలం నచ్చింది. అప్పుడు మేము, "బాబా! ఆ భూమి సరైనదైతే మాకు ఇప్పించండి" అని బాబాను ప్రార్థించి చీటీల ద్వారా బాబా నిర్ణయాన్ని అడిగితే, బాబా తీసుకోమన్నారు. సరేనని సిట్టింగ్ ఏర్పాటు చేసి భూమి ధరను నిర్ణయిస్తుంటే దళారులు మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తానికి పెంచేశారు. "బాబా! మీరే దగ్గరుండి ఆ భూమిని మేము కొనుగోలు చేసేలా అనుగ్రహించండి. న్యాయంగా ఎంతవరకు పెట్టవచ్చో అంత సెటిల్ చేయండి. మళ్ళీ భూమి కొన్నామనే ఆనందాన్నిచ్చి, భూమి అమ్మకున్నామన్న వేదనను నుండి రక్షించండి. గతంలో భూమి కొన్నప్పుడు జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని క్లియర్ టైటిల్ ఉన్న భూమిని కొందామని చాలా ప్రయత్నిస్తున్నాము. మాకు మీ సహాయం, ఆశీస్సులు కావాలి సాయీశ్వరా! సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను బాబా, నన్ను ఆశీర్వదించండి, నాపై దయ ఉంచండి. మాకు మీరే దిక్కు తండ్రి. మీ దయతో మేము భూమిని కొనుక్కుంటే మీ అపారప్రేమను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను సాయితండ్రి". 


సద్గురు చరణం భవభయ హరణం, శ్రీసాయినాథ శ్రీచరణం.


బాబా కృపతో అందరికీ ఆరోగ్యం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు డబ్బులు డ్రా చేద్దామని నా ఏటీఎం కార్డు కోసం చూస్తే, అది కనిపించలేదు. ఎంత వెతికినా కార్డు దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో నా ఏటీఎం కార్డు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా నేను బాబాని ప్రార్థించిన ఐదు నిముషాల్లో కార్డు నా హ్యాండ్ బ్యాగులోనే దొరికింది. నిజానికి ఎప్పుడూ మావారి వద్దనుండే ఆ కార్డు నా బ్యాగులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. "ధన్యవాదాలు బాబా".


ఇటీవల ఒకసారి మా పాపకి జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! పాపకి జ్వరం తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన రెండురోజుల్లో పాపకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా". తరువాత దసరా ముందురోజు నాకు కూడా జ్వరమొచ్చింది. జ్వరంతోపాటు దగ్గు, ఒళ్లునొప్పులు ఉండేసరికి నేను చాలా ఇబ్బందిపడుతూ మాట్లాడలేకపోయాను కూడా. నా పరిస్థితి చూసి మా అమ్మగారు, "బాబా! జ్వరం తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నారు. అంతే, జ్వరం, దగ్గు అన్నీ తగ్గి నేను బాగున్నాను. మూడునెలల వయస్సున్న మా చెల్లెలి కూతురుకి ఈమధ్య నాలుగురోజులైనా విరోచనం కాలేదు. అన్ని చిట్కాలు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు కూడా మా అమ్మగారు, "పాపకు విరోచనం అయితే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నారు. అంతేకాదు బాబా ఊదీ పాపకు పెట్టారు. అరగంటలో పాపకు విరోచనమైంది. "ఇలా మా జీవితాలలో అడుగడుగునా మాకు తోడుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. అమ్మ మీకు మాటిచ్చినట్లు ఆ అనుభవాలను పంచుకున్నాను. నాకు ఉన్న మనోవేదనను సాధ్యమైనంత త్వరగా తొలగించి, ఆ అనుభవాన్ని కూడా పంచుకునేలా అనుగ్రహించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై.


బాబా సదా కాపాడుతుంటారు


ఓం శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై. నాపేరు సుమ. ఇటీవల మా బాబుకి జ్వరం వచ్చింది. ప్రస్తుత సమయంలో జ్వరమంటే చాలా భయమేస్తుంది. అయినా నేను బాబా ఉండగా భయమెందుకని, "బాబా! మా బాబుకి జ్వరం తగ్గేలా చూడండి. మీ దయతో జ్వరం తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే బాబుకి జ్వరం తగ్గింది. మరుసటిరోజు నాకు జ్వరం వచ్చిందికానీ, బాబా దయవల్ల తొందరగానే తగ్గిపోయింది. "బాబా! మీరు ఉండగా మాకు భయమేల? తల్లి ఉండగా బిడ్డలు భయపడతారా? మీరే మాకు సర్వం. మీ భక్తులందరినీ సదా కాపాడుతుండమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా మనసులో కోరికలు మీకు తెలుసు బాబా. వాటిని మీరు తొందరలో తీరుస్తారని నమ్ముతున్నాను. మీ పాదాలకి శతకోటి వందనాలు".



సాయిభక్తుల అనుభవమాలిక 968వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని అనుగ్రహించిన బాబా
2. నమ్మకమనే విత్తనాన్ని నాటి ప్రేమతో ఆదరిస్తున్న బాబా
3. డాక్టరు నోట ఉపశమనాన్నిచ్చే మాటలు పలికించిన బాబా

ఆరోగ్యాన్ని అనుగ్రహించిన బాబా


సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. నాపేరు శ్రీకాంత్. ఆ సాయినాథుని దయవల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉన్నామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసుకుని మన బాధను, ఇబ్బందిని తెలుపుకుని, కష్టాన్ని తొలగించమంటే వెంటనే అనుగ్రహించే మన ఇలవేల్పైన శ్రీ సాయినాథుని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన ప్రసాదించిన అనుభవాలను పంచుకుటున్నాను. ఈమధ్యనే మా అత్తమ్మగారు చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఎందుచేతనోగాని నాకు నిద్ర సరిగా రాకపోవడం, గుండె దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఒళ్ళంతా ఊపుతున్నట్లు ఉండటం వంటి లక్షణాలుండేవి. ఏం జరుగుతుందో అర్థంకాక నేను చాలా భయాందోళనలకు గురయ్యాను. వెంటనే సాయినాథుని ముందు కూర్చొని, "నాకున్న ఇబ్బందిని తొలగించి, ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. తరువాత ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారము చేసుకుని, "నేను ఆరోగ్యంగా ఉన్నట్లయితే, ఈ అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆ శిరిడీ సాయినాథుని కృపాకటాక్షాల వలన గుండె దడ, ఒళ్ళు ఊపడం తగ్గి ఆరోగ్యం చేకూరింది.


ఇకపోతే ఈమధ్యకాలంలో నా శ్రీమతి శ్రీవాణికి హఠాత్తుగా ఒకరోజు రాత్రి విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య వచ్చాయి. నేను వెంటనే ఆ సాయినాథుని ఊదీ నా భార్య నుదుటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో వేసి ఇచ్చాను. కొద్దిక్షణాల్లో ఆమె హాయిగా నిద్రపోయింది, తెల్లవారేసరికి తలనొప్పి, ఆయాసం అదృశ్యమయ్యాయి. ఇలా ఆ సాయినాథుని ఊదీ ఎంత మహిమ గలదో నేను, నా కుటుంబం చాలాసార్లు ప్రత్యక్షంగా అనుభవించాం. కృతజ్ఞతాపూర్వకంగా ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు అర్పించుకుని, వారి కృపను మీతో ఇలా పంచుకున్నాను. "బాబా! నాకు, నా కుటుంబానికి సద్భుద్ధిని, మంచి ఆరోగ్యాన్ని, మీ పట్ల దృఢమైన భక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను తండ్రి".


నమ్మకమనే విత్తనాన్ని నాటి ప్రేమతో ఆదరిస్తున్న బాబా.


ప్రియమైన సాయిబంధువులారా! నా పేరు సుచిత్ర చంద్రబోస్. నేను సినీరంగంలో కొరియోగ్రాఫర్ ని. నేను హైదరాబాదులో నివాసముంటున్నాను. బాబాతో నాకున్న అనుబంధాన్ని మీతో పంచుకోవడం బాబా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. చిన్నతనంలో నాకు అమ్మానాన్న తెలుసుగానీ దేవుడు ఎలా ఉంటాడు?, దేవుడంటే ఏంటో? అస్సలు తెలీదు. ఆ వయస్సులో నాకు పెద్దగా జ్ఞాపకశక్తి ఉండేది కాదు. ఆ కారణంగా నేనెప్పుడూ చదువులో వెనకబడి ఉండేదాన్ని. నాకు తెలిసి అప్పుడప్పుడు నాకు 2, 3 మార్కులు వచ్చినా ఎక్కువగా సున్నా మార్కులే వచ్చేవి. నా రిపోర్టు షీటు ఎప్పుడూ ఎరుపుగా రెడ్ ఇంకుతో నిండిపోయి ఉండేది. అందరూ బాగా చదువుకుంటున్నారు, నేను మాత్రమే ఎందుకు చదువుకోలేకపోతున్నానని నాకు అనిపించేది. సరే, ఏదోరకంగా నాకు కూడా మంచి పేరు రావాలి, అందరిచేత ప్రశంసింపబడాలి అని ఎంతో తపన పడేదాన్ని. ఆ తపనతో స్కూల్లో నాకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలని ఆలోచించాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఆసక్తి. నా స్నేహితులంతా నేను గనక వాళ్ళ జట్టులో ఉంటే వాళ్ళ జట్టే గెలుస్తుందని చాలా బలంగా నమ్మేవారు. అందువలన నేను స్పోర్ట్స్ లో ఛాంపియన్ అవ్వాలనుకున్నాను. అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళం. మా అమ్మ తరచూ మైలాపూర్‍లోని బాబా మందిరానికి వెళ్తుండేది. ఒకసారి నేను కూడా `అమ్మతో వెళ్ళాను. అప్పుడు నాకు అందరూ బాబాను కోరికలు కోరుతున్నారు గదా మనం కూడా కోరుకుందామనిపించి, "బాబా! సూపర్ సీనియర్స్ గర్ల్స్ లో నేను ఛాంపియన్ అవ్వాలి. మీ వల్ల ఎట్లాగైనా నాకు కప్పు రావాలి. స్కూలు బోర్డులో నాపేరు లిఖించబడాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తరువాత నావంతు కృషి నేను చేసి నా స్నేహితులంతా నామీద నమ్మకం పెట్టుకుంటే, నేను బాబా మీద నమ్మకం పెట్టాను. బాబా దయవల్ల మా జట్టు గెలిచి నాకు కప్పు వచ్చింది. బాబా వల్ల మొదటిసారి నాకు దేవుడంటే మన కోరిక నెరవేరుస్తాడనే నమ్మకం కుదిరింది. అంతేకాదు నా మీద నాకే నమ్మకం కలిగేలా చేసారు బాబా. అలా చిన్నతనంలో మొదలైన బాబాపై నమ్మకంతో నా జీవనప్రయాణం సాగుతూ ఉంది. ఇప్పటికీ బాబా నా చేయి వదలలేదు. ప్రతి కష్టంలో బాబా వెంటే ఉంటున్నారు. వంటిట్లో వెల్లుల్లి దగ్గర నుంచి ఏం కావాలన్నా, ఏది కనపడలేదన్నా, 'బాబా ప్లీజ్..' అనుకుంటే వెంటనే అది కనపడుతుంది. అదే చీర కట్టుకుంటున్నప్పుడు ఒక సేఫ్టీ పిన్ కావాలన్నా 'బాబా ప్లీజ్.. ఒక్కటన్న సేఫ్టీ పిన్ అందివ్వు బాబా' అనుకుంటే, సరిగ్గా ఒక పిన్ కనిపిస్తుంది. కాలప్రవాహంలో మా అమ్మగారు బాబాలో ఐక్యమయ్యారు. ప్రస్తుతం మా నాన్న M. పూర్ణచంద్రరావుగారికి 92 ఏళ్ళు. ఆయన ఒంటరిగా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పడిపోతారేమో, దెబ్బ తగులుతుందేమోనని ఆయనకి బాబాలా వస్త్రధారణ చేసి బయటకి పంపేదాన్ని. ఎందుకంటే, ఆయన ఎవరినైనా లిఫ్ట్ అడిగితే ఆ దైవమే సహాయం కోరుతున్నారన్న భావం జనాలకు కలుగుతుంది, తద్వారా ఆయనను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి దింపేస్తారన్న నమ్మకం. సరిగ్గా అదే జరిగేది. మా నాన్న ఎక్కడ, ఎవరిని లిఫ్ట్ అడిగినా వాళ్ళు ఇంటివరకూ తీసుకొచ్చి ఆయనను ఇంట్లో దింపేవారు. అలా ప్రేమగా బాబా నా ఆలోచనను ఎప్పుడూ కాదనరు. ఇకపోతే బాబా మంత్రం విషయంలో పుస్తకంలో చూసి చదవడం కాకుండా నేనే సొంతంగా వ్రాసేసుకోవాలనిపించి నా బాబాకి ప్రేమతో ఈ క్రింది మంత్రం వ్రాసుకున్నాను.


'సాయిరామ్ సాయిరామ్ సత్యం సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ నిత్యం సాయిరామ్. సదా సాయిరామ్. సర్వం సాయిరామ్. సగర్వం సాయిరామ్. దిశ సాయిరామ్. దశ సాయిరామ్. జనం సాయిరామ్. భోజనం సాయిరామ్'.


శ్రీ శిరిడీ సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


డాక్టరు నోట ఉపశమనాన్నిచ్చే మాటలు పలికించిన బాబా.


ముందుగా ప్రియమైన సాయిబంధువులకు మరియు బ్లాగు నిర్వాహకులకు నమస్తే. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను, భావాలను పంచుకునేందుకు అనువుగా ఈ వేదికను ఏర్పాటుచేసిన వారికి ధన్యవాదాలు. నా పేరు మాధవిరెడ్డి. మాది హైదరాబాద్. సాయి తన ఉనికిని, అద్భుతాలను అనేక విధాలుగా చూపిస్తారు. ఆయన ఎప్పుడూ నాతో ఉన్నారు, నేను దేని గురించి అనుకున్నా ఆ విషయంలో నాకు ఒక మార్గాన్ని చూపుతారు. ఈ రోజు నేను ఒక అతిముఖ్యమైన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఈమధ్య మా అమ్మగారికి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అయితే ఏ మేరకు సమస్య ఉందో, డాక్టరు ఏమి చెప్తారో మాకు తెలియకముందే నేను, "బాబా! అమ్మని కాపాడండి. బాధాకరమైన పెద్ద చికిత్సలు అవసరం లేకుండా తేలికైన పద్ధతుల ద్వారా తనకి చికిత్స జరిగేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. మేము డాక్టరుని కలిసినప్పుడు ఆయన, "క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. చిన్న శస్త్రచికిత్స చేస్తే సరిపోతుంది. కీమోథెరపీ అవసరం లేదు" అని చెప్పారు. మా అందరికీ ఎంతో ఉపశమనాన్నిచ్చిన మధురక్షణాలవి. బాబా అనుగ్రహానికి, వారి సంరక్షణకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను. "బాబా! అన్నిటికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు మీ సహాయసహకారాలు అందించండి. ఇంకా ఎప్పుడూ మీ మార్గాన్ని అనుసరించగలిగేలా నాకు, నా కుటుంబానికి మార్గనిర్దేశం చేయండి. నేను శిరిడీ సందర్శించాలని ఆశపడుతున్నాను. దయచేసి నాకు అనుమతివ్వండి బాబా. మీ ఆశీస్సులు మాపై కుమ్మరించండి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 967వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎక్కువ కష్టం లేకుండా చేసిన బాబా
2. సాయిబాబా దయ నాపై ఉందన్న నమ్మకం కుదిర్చిన అనుభవం
3. బాబా దయతో ఇంటిల్లిపాదికి కోవిడ్ నెగిటివ్

ఎక్కువ కష్టం లేకుండా చేసిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సమస్త సాయిబంధువులకు మరియు బ్లాగు నిర్వహిస్తున్న సాయికి వందనాలు. నా పేరు అనూజ. మాది నిజామాబాద్. 1996కి ముందే నాకు బాబా గురించి తెలుసు. కానీ బాబా దయవల్ల ఆ సంవత్సరం మాకు బాబు పుట్టాక నేను ఎక్కువగా బాబాను నమ్మసాగాను. బాబుకి కూడా సాయి సిద్దార్థ్ అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు తనకి జరిగిన ఒక సంఘటన గురించి బాబాకి మొక్కుకున్న విధంగా మొదట పంచుకుంటున్నాను. నిజానికి దీనికన్నా ముందు ఒక మ్రొక్కు మ్రొక్కుకుని అది తీరేదాకా ఈ బ్లాగులో ఈ అనుభవం పంచుకోను అనుకున్నాను. కానీ మొదటి మ్రొక్కు విషయంలో నాకు బాబా అనుగ్రహం లభించలేదు. ఇంతలో ఇప్పుడు పంచుకోబోయే సంఘటన జరగడంతో ముందు ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి  మ్రొక్కుకున్నాను. ఇక అసలు విషయానికి వస్తే.. 


2021, అక్టోబర్ 6న బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా మా బాబు ముక్కుకి ఫ్రాక్చర్ అయ్యి చాలా రక్తం పోయింది. బాబు ఇంటికొచ్చి తన ముక్కుకి ఇలా జరిగిందనగానే నాకు చాలా భయమేసి వెంటనే, "బాబా! బాబుకి పెద్ద సమస్య కాకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటే నవగురువార వ్రతం చేస్తానని, 'సాయి మాహారాజ్ సన్నిది' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత డాక్టరుకి చూపిస్తే, "ఫ్రాక్చర్ అయ్యింది, అయితే మెయిన్ బోన్‍కి కాకుండా సైడ్ బోన్‍కి అయ్యింది. రెండునెలల్లో తగ్గిపోతుంది. ఆపరేషన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ముక్కు వంకర అనిపిస్తే, అప్పుడు చేసుకోవచ్చు" అని అన్నారు. అప్పుడు నేను, "అటువంటి సమస్యలేమీ లేకుండా చేయమ"ని బాబాను వేడుకున్నాను. ఇప్పుడు మా బాబు ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉన్నాడు. అంతా బాబా దయవల్లే. ఆయన ఎక్కువ కష్టం లేకుండా బాధను తీసేసారు. ముక్కు కొద్దిగా వంకర ఉన్నప్పటికీ చెప్తేనే తెలిసేంత స్వల్పంగా ఉంది. అందుకే ఆపరేషన్ చేయించలేదు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక వారం పట్టింది. అందుకే వారం ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నాను. "దయచేసి క్షమించండి బాబా": మా బాబుకి సాయి అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నమ్ముతాను. ఎందుకంటే బాబా అనుగ్రహంతోనే బాబు మాకు పుట్టాడు. ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను. "బాబా! ఇదే మొదటిసారి కావడం వల్ల ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే క్షమించండి. మా అందరిపైన మీ చల్లని చూపు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు బాబా. శతకోటి వందనాలు బాబా".


సాయిబాబా దయ నాపై ఉందన్న నమ్మకం కుదిర్చిన అనుభవం

నాపేరు సుభాష్. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 17సంవత్సరాల క్రితం చలికాలంలో నేను, నా మిత్రుడు ఏ.ఎన్.ఆర్ కలిసి శిరిడీ వెళ్ళాము. పది నిమిషాలలో తయారై బాబా దర్శనానికని బయలుదేరాము. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనందున నా మిత్రుడు దర్శనానికి వెళ్లేముందు నా జేబులో ఇరవై రూపాయలు పెట్టాడు. అయితే, నేను బాబాను చూస్తూ ఆ డబ్బులు హుండీలో వేయలేదు. దర్శనానంతరం బయటకు వచ్చి ఎండలో నిలబడి ఉండగా రైల్లో పరిచయమైన వాళ్ళు కలిస్తే వాళ్లతోపాటు నా మిత్రుడు వెళ్ళాడు. నేను మాత్రమే అక్కడే నిలబడి ఉన్నాను. కొంత సమయం తరువాత నేను ఎడమవైపు తిరిగి చూస్తే, డొనేషన్ కౌంటర్ కనపడింది. దగ్గరకు వెళ్లి కౌంటర్లో ఉన్న అతన్ని, "ఇరవై రూపాయలిచ్చినా తీసుకుంటారా?" అని అడిగాను. అందుకు అతను, "ఇరవైరెండు రూపాయలు మొదలు మీరు ఎంత డబ్బు ఇచ్చిన తీసుకుంటాం" అని అన్నాడు. కానీ నా దగ్గర నా మిత్రుడు నా జేబులో పెట్టిన ఇరవై రూపాయలకు మించి పైసా కూడా లేదు. అందుచేత నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అలాగే ఐదు నిముషాలు నిలబడ్డాను. టక్కున రెండు రూపాయల నాణెం ఒకటి ఎండలో మెరిసిపోతూ నా కంటపడింది. అప్పటివరకూ ఆ చోటలేని నాణెం హఠాత్తుగా కనపడేసరికి అది సాయిబాబా మహిమ అనిపించింది. వెంటనే వెళ్ళి ఆ నాణెం తీసుకుని వెళ్ళి కౌంటర్లో ఇరవైరెండు రూపాయలు ఇచ్చాను. అతను నా ముఖం అలాగే చూసి రిసిప్ట్ ఇచ్చాడు. నెల రోజుల తర్వాత పోస్టులో ఊదీ, ప్రసాదం మా ఇంటికి వచ్చాయి. సాయిబాబా దయ నాపై ఉందన్న నమ్మకం కుదిరింది. అప్పటినుండి నా జీవితం సాయిబాబా అనుగ్రహంతోనే నడిచిపోతుంది. ఎన్ని కష్టాలొచ్చినా బాబా దయతో దూదిపింజల్లా ఎగిరిపోతున్నాయి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

బాబా దయతో ఇంటిల్లిపాదికి కోవిడ్ నెగిటివ్

నాపేరు కవిత. ముందుగా శ్రీసాయిబాబాకు కోటి పాదనమస్కారాలు తెలుపుకుంటూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇటీవల మా ఇంటిల్లిపాదికి కరోనా వచ్చింది. పిల్లలు, ఒక పెద్ద వ్యక్తి మినహా మిగతా అందరమూ కోవిడ్‍తో పదిరోజులపాటు ఎంతో బాధపడ్డాము. ఆ సమయంలో నేను బాబాను గట్టిగా ప్రార్థించి, "మాకు నయమైతే ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవలన ఈరోజు (2021, అక్టోబర్ 18న) మా అందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. "నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మాకు తోడునీడగా ఉంటూ రక్షణనివ్వండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
                                                                                                                           

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo