సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 972వ భాగం...


ఈ భాగంలో అనుభవం: 

  • జాతకాన్ని మార్చగల శక్తిసంపన్నులు బాబా

నా పేరు సుమ. మాది నెల్లూరు. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు ఆ బాబా కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. బాబా దయతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. బాబా దయతో నాకు 2020లో వివాహమైంది. వివాహానంతరం నేను, నా భర్త ఇందుకూరుపేటలో ఉన్న శ్రీసాయిబాబా మందిరానికి వెళ్తుండేవాళ్లం. మాకు ఏ సమస్యలున్నా ఆ మందిరంలోని బాబా దర్శనం చేసుకోగానే ఆ సమస్యలు తీరిపోతుండేవి. ఒకసారి నేను, నా భర్త బాబా గుడికి వెళ్ళినప్పుడు ఒక పాప నా దగ్గరకి వచ్చి, 'అమ్మా, అమ్మా' అంటూ నన్ను పిలిచింది. నేను తనవైపు చూసేసరికి చక్కగా నవ్వుతూ నిలబడి ఉంది ఆ పాప. విషయమేమిటంటే, ఆ పాప నన్ను తన తల్లి అనుకుని నన్ను అలా పిలిచింది. ఇలాగే మరోసారి అదే గుడిలో నేను బాబాకి దణ్ణం పెట్టుకుంటూ ఉంటే ఒక పాప వచ్చి, "అమ్మా! నన్ను ఎత్తుకో" అంటూ నా చున్నీ లాగింది. నేను చూసేసరికి ఆ పాప తల్లి వచ్చి, "పాప మిమ్మల్ని చూసి నేను అనుకుంది అండీ" అని చెప్పి, పాపని తీసుకుని వెళ్ళింది. అలా రెండుసార్లు చిన్నపాపలు నన్ను బాబా సమక్షంలో 'అమ్మా' అని పిలిచాక, 'త్వరలో బాబా పాపని ఇవ్వబోతున్నారేమో!' అని నాకనిపించింది. అయితే నా జాతకంలో నాకు చాలా ఆలస్యంగా సంతానం కలుగుతుందని ఉంది. అయినప్పటికీ నేను ఒక్కటే అనుకునేదాన్ని, 'నాకెప్పుడు సంతానాన్ని అనుగ్రహించాలో బాబాకి బాగా తెలుసు' అని.


తరువాత, నా చెల్లెలు నాకు పిల్లలు పుట్టాలని సాయి దివ్యపూజ చేసింది. అయితే ఆ విషయం తను నాకు ముందుగా చెప్పలేదు. ముందే చెప్తే, నేను వద్దంటాననో లేక నేనే చేసుకుంటాననో తను కొన్ని వారాల పూజ అయ్యాక నాతో ఆ విషయం చెప్పింది. తరువాత 2020, డిసెంబరులో తన పూజ పూర్తయ్యాక ప్రసాదం పంచేందుకు నేను, తను కలిసి బాబా గుడికి వెళ్ళాము. అప్పుడు పూజారిగారు పూజ చేసిన తర్వాత నాకు, నా చెల్లికి పువ్వులు, ప్రసాదం ఇచ్చారు. గుడి నుండి బయటికి వచ్చాక చూస్తే నాకిచ్చిన వాటిలో ఒకే కాడకి మూడు పువ్వులున్నాయి. మూడు పువ్వులు ఒకే కాడకి ఉండడం చాలా అరుదు, అదికూడా రెండు పెద్దపువ్వుల మధ్యలో ఒక చిన్నపువ్వు ఉంది. వాటిని చూడగానే నాకు అవి నేను, నా భర్త, మా జీవితంలోకి రాబోయే చిన్నపాప అనిపించి, తొందరలోనే బాబా మాకు సంతానాన్ని ఇవ్వబోతున్నారన్న దానికి అది సంకేతంలా అనిపించి ఎంతో సంతోషించాను. అనుకున్నట్లే 2021, జనవరిలో బాబా దయవల్ల నేను ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. నేను ఎంతో ఆనందించాను.


నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాకముందు 2020, డిసెంబరులో మా కుటుంబమంతా కలిసి జనవరిలో వైజాగ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని, టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకున్నాం. కానీ జనవరిలో నా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అవడంతో ఆ స్థితిలో అంత దూరప్రయాణం వల్ల ఏదైనా సమస్య అవుతుందేమోనని నేను ఆగిపోదామనుకున్నాను. నాకోసం మావారు కూడా ఆగిపోదాం అనుకున్నారు. అలా ఒక్కొక్కరు ఆగిపోతూ, 'వెళ్తే, అందరమూ వెళదాము, లేకపోతే ఎవరూ వద్దు' అనే నిర్ణయానికి వచ్చారు. నా ఒక్కదానివల్ల మిగతా ఇరవైమంది ఆగిపోవడం నాకు బాధగా అనిపించి సలహా తీసుకునేందుకు నేను డాక్టరుని సంప్రదించాను. డాక్టరు, "కడుపులోని బిడ్డ రక్షణకోసం ఒక ఇంజక్షన్ వేసుకుని వెళ్లొచ్చు. అయితే నాలుగు వారాలపాటు ఆ ఇంజక్షన్ ఖచ్చితంగా వేసుకోవాల"ని చెప్పారు. సరేనని, నేను ఇంజక్షన్ వేయించుకుని కుటుంబసభ్యులతో వైజాగ్ ప్రయాణమయ్యాను. మేము వైజాగ్ నుంచి అరకు వెళ్ళాము. అది నాకు ఇంజక్షన్ వేయాల్సినరోజు. అయితే, అరకు ఏజెన్సీ ప్రాంతమైనందున మెడికల్ షాపులు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా నేను ఈరోజు ఇంజక్షన్ వేయించుకునేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. కాసేపటికి మావారు ఆ ప్రాంతంలో విచారించగా, "దగ్గర్లో ఒక క్లినిక్ ఉంద"ని అక్కడి వాళ్ళు చెప్పారు. అద్భుతం! ఆ క్లినిక్ పేరు 'సాయి క్లినిక్'. అది తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కడికి వెళ్తే, ఆ క్లినిక్‍లో అంతటా సాయిబాబా ఫోటోలే ఉన్నాయి. నేను నా మనసులో, 'ఇంజక్షన్ తుంటికి చేయాలి కదా! లేడీ డాక్టర్ ఉంటే బాగుంటుంది' అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే లేడీ డాక్టరు ఉండేలా అనుగ్రహించారు బాబా. నిజానికి అక్కడ ఎప్పుడూ జెంట్ డాక్టరే ఉంటారట. అలాంటిది ఆ డాక్టరు సెలవులో ఉండటం వలన ఆరోజు లేడీ డాక్టరు డ్యూటీలో ఉన్నారు. ఇంకో అద్భుతం చూడండి! మేము ఏ ఇంజక్షన్ అనేది చెప్పకుండా "ఇంజక్షన్ చెయ్యాలి" అని అనగానే ఆ డాక్టరు, "ప్రెగ్నెన్సీకి సంబంధించా?" అని అడిగారు. 'మేము ఏమీ చెప్పకుండా ఆమెకు ఎలా తెలిసిందా' అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె ఇంజక్షన్ చేశాక నాకు అస్సలు నొప్పి తెలియలేదు. నిజానికి ఆ ఇంజక్షన్ వేశాక చాలా నొప్పి ఉంటుంది. అందుకే ఆ ఇంజక్షన్ తుంటికి వేస్తారు. అదివరకు నేను ఆ ఇంజక్షన్ నెల్లూరులో రెండుసార్లు వేయించుకుంటే చాలా నొప్పేసింది. రెండురోజులు వరకు చాలా నొప్పి అనుభవించాను. ఆ కారణంగా నేను ట్రిప్‍లో ఇంజక్షన్ వేసుకున్నాక చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ బాబా ఎంతో దయతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. 'సాయి క్లినిక్' కనిపించడం, అక్కడ లేడీ డాక్టరే ఉండటం, ఆమె ఇంజక్షన్ వేశాక అస్సలు నొప్పి లేకపోవడం అంతా సాయి లీల. తర్వాత మేము సింహాచలం, అన్నవరం దర్శించుకుని తిరిగి వచ్చాము. ఆవిధంగా బాబా దయవలన మా ట్రిప్ ప్రశాంతంగా ముగిసింది. ప్రయాణంలో మావారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంటికొచ్చాక ప్రయాణం వల్ల కడుపులో బిడ్డ ఎలా ఉందోనని కాస్త భయపడ్డాము. అయితే మూడో నెలలో స్కాన్ చేసినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉందని అన్నారు. అంతా బాబా దయ.


కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి నాకు మామిడిపండు తినాలనిపించింది. అదేరోజు మా బావగారు నాలుగు మామిడిపండ్లు తెచ్చి నాకు ఇచ్చారు. నేను అడగకుండానే మామిడిపండ్లు తేవడంతో నాకు చాలా సంతోషం కలిగింది. ఇంకా వాటిని చూడగానే నాకు శ్రీసాయిసచ్చరిత్రలోని బాబా దాముఅన్నాకి నాలుగు మామిడిపండ్లు ప్రసాదించి సంతానాన్ని అనుగ్రహించిన లీల గుర్తు వచ్చింది. ఇంకోరోజు నాకు జిలేబీ తినాలనిపించింది. ఆరోజు అనుకోకుండా మావారు జిలేబీ తెచ్చారు. నిజానికి నాకు జిలేబీ అస్సలు ఇష్టముండదు. అలాంటిది ఆరోజు నాకు జిలేబీ తినాలనిపించడం, మావారు తేవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆవిధంగా  కడుపుతో ఉన్నప్పుడు నేను మనసులో ఏవి తినాలనుకున్నా బాబా దయవల్ల అవి వచ్చేసేవి


ఒకసారి నేను వంగి ఫ్రిడ్జ్ లోని కూరగాయలు తీసి, పైకి లేస్తుంటే పొరపాటున ఫ్రిడ్జ్ తలకి గట్టిగా గుద్దుకుని చాలా రోజుల వరకు నొప్పి ఉండేది. డాక్టరుని అడిగి మాత్రలు  వాడినప్పటికీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను రోజూ బాబా ఊదీని తలకి వ్రాయడం మొదలుపెట్టాను. ఊదీ రాసినప్పటి నుంచి నొప్పి తగ్గడం మొదలై, మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐవ నెలలో ఒకసారి నేను అనుకోకుండా పడిపోబోయాను, కానీ బాబా దయవల్ల పడలేదు. పడివుంటే, ప్రక్కనే ఉన్న చిన్నగోడ నా కడుపుకు తగిలి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం జరిగి ఉండేది. ఎవరో పట్టుకున్నట్టు పడకుండా ఆగిపోయాను. ఈ విధంగా ఎన్నోసార్లు బాబా కడుపుతో ఉన్న నన్ను రక్షించారు


ఆరవ నెల నడుస్తుండగా నాకు, మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మా డాక్టరు నా విషయంలో, "మేము ఏమీ చేయలేం. చికిత్స కోసం నువ్వు చెన్నై వెళ్ళాలి" అని చెప్పేశారు. ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను, బేబీకి ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. ఆ సమయంలోనే మొదటిసారి నాకు కడుపులో బిడ్డ కదలిక తెలిసింది, బిడ్డ తన్నడం అనుభూతి చెందాను. అంత బాధలో కూడా బాబా నన్ను ఆవిధంగా సంతోషపెట్టారు. అదలా ఉంచితే, నా బాధ చూడలేక మావారు నన్ను వేరే హాస్పిటల్లో చూపించి మందులిప్పించారు. నేను డాక్టరు ఇచ్చిన మందులు కేవలం మూడు రోజులే వాడి, మిగిలిన అన్నిరోజులూ కేవలం బాబా ఊదీ పెట్టుకుని, ఊదీనీళ్లు త్రాగేదాన్ని. ఇంకా ప్రతిరోజూ బాబా ఊదీని నోట్లో వేసుకుని, కడుపులో ఉన్న నా బిడ్డ బాగుండాలని పొట్ట మీద కూడా ఊదీ రాసుకుంటుండేదాన్ని. నాకు ఆ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగానూ, బాగా ఆయాసంగానూ ఉండేది. చాలామంది కడుపులో బిడ్డకి ప్రమాదమని భయపెట్టారు. ఆ రోజులని ఎప్పుడు తలచుకున్నా నాకు చాలా భయమేస్తుంది. 15 రోజుల తరువాత టెస్ట్ చేస్తే, బాబా దయవల్ల కరోనా నెగిటివ్ వచ్చింది. అప్పటినుండి నేను వేరే డాక్టరుని సంప్రదించాను. ఆమె నన్ను చాలా బాగా చూసేవారు.


ఒకరోజు నాకు కలలో అమ్మవారు కనిపించి నా చెయ్యి చూసి, "నీకు ఆడపిల్ల పుడుతుంది" అని చెప్పారు. తరువాత 2021, సెప్టెంబరు 8వ తేదీన నేను పురిటినొప్పులు భరించలేక  బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల కాసేపట్లో ఎటువంటి ఇబ్బందీ లేకుండా నాకు డెలివరీ అయి చక్కటి ఆరోగ్యవంతమైన పాపకి జన్మనిచ్చాను. పాప బాబా వరప్రసాదమని చెప్పాలి. తానెప్పుడూ మా ఇంట్లో ఉన్న సాయిబాబా ఫోటో చూస్తుంటుంది. వేరే గదిలోకి మార్చినా ఆ గదిలో ఉన్న బాబా ఫోటోని చూస్తూ బాగా ఆడుతూ ఉంటుంది. అలా తను బాబాని చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే 'తను బాబాతో మాట్లాడుతుందేమో! తనని బాబా బాగా చూసుకుంటున్నారు' అనిపిస్తుంది. "థాంక్యూ బాబా. ఇదంతా మీ దయే తండ్రీ. మీ కృప ఎప్పుడూ మా అందరిమీదా ఉండాలి సాయీ. పాపకి మంచి ఆరోగ్యాన్ని, చక్కటి భవిష్యత్తుని ఇవ్వండి సాయీ". 


చివరిగా, సాయిబంధువులకు నేను చెప్పేది ఒక్కటే, నాకు జాతకంలో సంతానం ఆలస్యమవుతుందని ఉంది. కానీ పెళ్ళైన సంవత్సరంలోపే నాకు సంతానం కలిగింది. జాతకాన్ని మార్చే శక్తి మన సాయికి ఉంది. అన్నిటికంటే ఆయన గొప్పవారు. సాయి  చెప్పినట్టు జాతకాలను ప్రక్కన పెట్టి సాయిని నమ్మండి. సాయి తన బిడ్డలకు ఎల్లప్పుడూ  శ్రేయస్కరమైనదే ప్రసాదిస్తారు.


సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!!!



8 comments:

  1. Om sai Sri sai jaya jaya sai

    ReplyDelete
  2. Om sairam, sai leela is very nice.om sai sri sai jaya jaya sai

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  5. Om sai ram please bless my family with health and longevity of life. Om sai ram❤❤❤

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo