సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 961వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'నేనున్నానుగా .. నీకెందుకు భయమ'ని నిదర్శనమిస్తున్న బాబా

నా పేరు మీనాక్షి. సాయిబంధువులందరికీ నమస్కారం. 'ఒక్కసారి నా దగ్గరకి వచ్చిన తర్వాత నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం యొక్క బాధ్యత కూడా నాదే' అని బాబా అడుగడుగునా ప్రతి ఒక్కరికీ అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉంటారు. అలాగే, ఒక తల్లిగా మనం మన బిడ్డలకోసం ఎంతగా ఆరాటపడతామో, అంతకుమించి బాబా మన పిల్లలను కనిపెట్టుకుని ఉంటారని నాకు ఈమధ్యనే తెలియజేశారు బాబా. ఆ అనుభవంతోపాటు మరో అనుభవాన్ని కూడా నేనిప్పుడు మీతో పంచుకుంటాను. "బాబా! నన్ను క్షమించండి. ఈ అనుభవాలు పంచుకోవడం కొద్దిగా ఆలస్యం చేశాను".


రెండోసారి వచ్చిన కరోనా ఉధృతి కాస్త సద్దుమణిగిందనుకోగానే ఈమధ్యకాలంలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోవడం, జాండీస్ మొదలైన లక్షణాలన్నీ ఒకేసారి కనిపించటం మా చుట్టుప్రక్కల ఎన్నో చూశాం, ఇంకా వింటూ ఉన్నాం. తెలిసినవాళ్ళు చాలామంది ఇంటిల్లిపాద హాస్పిటల్లో అడ్మిట్ అయి తిరిగివచ్చి కూడా ఇప్పటికీ కోలుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఉన్నట్టుండి మా పాపకు 100-101 డిగ్రీల జ్వరం మొదలైంది. కరోనా మూడో వేవ్ ముప్పు ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందని అందరూ అంటుండటంతో మా పిల్లలు బయటికి ఎక్కడికీ వెళ్ళటం లేదు, కనీసం స్కూలుకి కూడా వెళ్లట్లేదు. మరి ఎవరినీ కలవని పాపకు జ్వరమెందుకు వచ్చిందో అర్థం కాలేదు. వెంటనే భయంతో డాక్టరుకి ఫోన్ చేస్తే, "3 రోజులు పారాసిటమాల్ తప్ప ఇతర మందులేవీ వేయొద్దు" అని చెప్పారు. అంటే, మూడురోజుల్లో జ్వరం తగ్గకపోతే కోవిడ్ మొదలు అన్ని టెస్టులూ చేయించాల్సిందే! నా భయం అది ఒక్కటే కాదు, కన్నతల్లిని అయివుండి బిడ్డ ప్రక్కన ఉండే పరిస్థితి నాకు లేదు. కొన్ని అతిముఖ్యమైన పనులు, ఇబ్బందుల కారణంగా నేను నాలుగు రోజులపాటు వేరే ఊరు వెళ్లాల్సి ఉంది, మావారు కూడా క్యాంపుకి వెళ్లి దూరప్రాంతంలో ఉన్నారు. ఆ విషయం అలా ఉంచితే, ఇంట్లో అత్తయ్యగారు, 'ఒట్టి జ్వరానికి హడావుడి చేస్తావేంటి? పిల్లలన్నాక జ్వరం రాదా? అయినా ఒక డోలో వేస్తే అదే తగ్గుతుంది' అని నన్ను పదే పదే వింతగా చూస్తుంటే ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు. పెద్దవాళ్లు బయట పరిస్థితులు విన్నా, చూసినా టెన్షన్ పడతారు, ప్రతిదానికీ భయపడతారనే ఉద్దేశ్యంతో కరోనా న్యూస్ నుండి, పేపర్, టీవీ వార్తలకు కొంతకాలంగా దూరంగా ఉంచిన నేను, ఆవిడ మరీ అంత తేలికగా తీసుకుంటుంటే ఏమీ చెప్పలేక ఎప్పటిలానే బాబాకు నా భయాల చిట్టాతో స్తోత్రం మొదలుపెట్టాను. పెద్దావిడ కొంచెం పాతకాలం మనిషి, థర్మామీటర్‌తో జ్వరం చూడటం కూడా తెలియని ఆవిడ చేతిలో 7 సంవత్సరాల చిన్నపిల్లను పెట్టి వెళ్లాల్సిన పరిస్థితికి నన్ను నేను తిట్టుకోని నిమిషం లేదు, బాబాని వేడుకోని క్షణం లేదు.


మందులు, అవసరమైన డ్రాప్స్ అన్నీ పాపకు అందుబాటులో పెట్టి, జ్వరం ఎలా చెక్ చేసుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తూ, "పెద్దవాళ్ళని ఇబ్బందిపెట్టవద్దు, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఒక్క రెండురోజుల్లో వచ్చేస్తాను" అని చిన్నప్పుడు చదువుకున్న ఆవు-దూడ కథలోలాగా ఒకటికి పదిసార్లు పాపకు సలహాలు, సూచనలిస్తూ, అన్నిరకాల బుద్ధులూ చెప్పి తన బాధ్యతను తనకే అప్పగిస్తుంటే, అత్తయ్యగారు నా అప్పగింతలు వినలేక, "ఇక చాల్లే, మరీ విడ్డూరం! మేమంతా కనలేదా పిల్లల్ని? మాకు తెలీదా? మేము చూసుకోలేమా? కొద్దిపాటి జ్వరానికి ఇంత హంగామా చేస్తావేంటమ్మాయ్? నువ్వెళ్ళు ముందు" అని బలవంతంగా నన్ను పంపించారు. అలా నేను ఇంటినుండి వెళ్ళడమైతే వెళ్ళానుగానీ, లోపల రకరకాల భయాలు. అప్పటికే మా పాప తోటిపిల్లలకు జ్వరాలు, ప్లేట్లెట్స్ పడిపోవడం వంటివి తెలిసినందున కాస్త ఎక్కువగానే టెన్షన్ పడసాగాను. కన్నతల్లినైయుండి పాప ప్రక్కన ఉండే పరిస్థితి లేకపోవటం మరియు "నేనున్నాను, నువ్వు వెళ్ళు, నీకు మా మీద నమ్మకం లేదు" అంటూ పెద్దావిడ చిన్నబుచ్చుకుంటూ అన్న మాటలు నన్ను బాగా కలవరపెట్టగా, "కొద్దిగా జలుబు చేసినా కోతిపిల్లలా నన్ను అతుక్కుపోయే చిన్నపాపను వదిలి రెండు, మూడు రోజులైనా ఎలా ఉండటం బాబా?" అని ఎన్నోవిధాలుగా లోపల ఏడుస్తూనే ఉన్నాను. కానీ, మనుషులం అన్నాక ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎదుర్కోక తప్పదనుకుని, "బాబా! నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే పాప దగ్గర ఉండి నేను ప్రక్కన లేని లోటుని, బెంగని తీర్చాలి. నా బిడ్డ మీద నాకన్నా మీకే ఎక్కువ బాధ్యత" అని గట్టిగా మనసులోనే చెప్పుకుని, ప్రార్థిస్తూ వెళ్ళాను.


ఎప్పటికప్పుడు పాపతో మాట్లాడాలని ఫోన్ చేస్తే, తను ఫోన్, టీవీ, ఆటల యావలో పడి సరిగా నాతో మాట్లాడేది కాదు. టీవీ సీరియల్స్ వస్తున్నప్పుడు మధ్యలో ఏమాత్రం డిస్టర్బ్ చేసినా మామయ్యగారితో సహా దేవుణ్ణి కూడా క్షమించని అత్తయ్యగారిని, "పిల్లకు ఎలా ఉంది? లక్షణాలు ఏమేమి ఉన్నాయి? జ్వరం ఉందా? ఎప్పుడెప్పుడు వస్తోంది" అని అడిగితే, "ఏమో చూడలేదు. తెల్లవారుఝామున మాత్రం ఒళ్లు వేడిగా ఉంది. వంద పైన ఉంటుందేమో జ్వరం, అప్పుడు మందులేం వేస్తాం? పొద్దునకు ఒళ్ళు చల్లగానే ఉందిలే" అని అమాయకంగా, చాలా తేలికగా ఆవిడ చెప్పే మాటలకు కోపం, బాధ అన్నీ కలగలిపి వచ్చేవి. కానీ నేను చేయగలిగిందేమీలేక లోలోపలే భయంతో ఆందోళన చెందుతూ, దిగులుపడుతూ డిజిటల్ థర్మామీటరులో జ్వరం చెక్ చేయటానికి కూడా ఆవిడకు ఎందుకంత అలసత్వమని రకరకాలుగా నా ఖర్మని తిట్టుకుంటూ, ఇక టెన్షన్ తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లోనైనా రెండురోజుల్లో నేను ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అంతవరకు స్థిమితంగా ఉండలేక, "బాబా! ఈ ప్రపంచంలో ఏ కన్నతల్లినైనా రీప్లేస్ చేయగలిగింది మీరు ఒక్కరే. దయచేసి ఆ చంటిదాని దగ్గరే ఉండి మీరే జాగ్రత్తగా చూసుకోండి. మూడు రోజులు పాప స్థితిని గమనించమని డాక్టరు చెప్పారు. జ్వరం తగ్గకపోతే వాళ్ళు ఏమి చెప్తే అది చెయ్యక తప్పదు. నాకు అంత ధైర్యం లేదు. పిల్ల కూడా నీరసపడిపోతుంది. ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను బాబా. మీరు ఉండీ నేను ఇంత బాధపడటం నేను అస్సలు భరించలేను బాబా" అని నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాను.


నేను ఇంటికి వచ్చాక, "ఆ రెండు రోజుల్లో అప్పుడప్పుడు పాప ఒళ్ళు కాస్త వెచ్చగా అనిపించింది అంతే. వంద, వంద పైన ఉంటుందిలే. కాసేపటికి తగ్గిపోతోంది. జ్వరం లేకుండా టాబ్లెట్ ఎందుకు అని మందులు వెయ్యలేదు" అనే మాటలు విని తల్లినైవుండి 'పిల్లకన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు' అని గట్టిగా మాట్లాడలేకపోయిన నా చేతకానితనం మీద నాకే కోపం వచ్చి, ఇక యుద్ధప్రాతిపదికన నా వైద్యం నేను మొదలుపెట్టాను. బాబా ఊదీని పాపకి పెట్టి, "బాబా! ఇంకొక్కరోజు చూసి మార్పు లేకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తాను. మీరు ఉండగా నాకు ఆ అవసరం రాదని నా నమ్మకం బాబా. చిన్నపిల్ల, దాన్ని మీ చేతిలో పెట్టేశాను. మీదే భారం" అని చివరిగా బాబాకు శరణాగతి చేశాను. బాబా దయవలన ఆరోజు పాపకు జ్వరం రాలేదు. పూర్తిగా ఆటలు, ఫోన్ యావలో పడి చేతికి దొరక్కుండా పాప అటుఇటు పరిగెత్తుతుంటే నాకు అప్పుడు, 'నా వయసుకి నేనే పాపని పట్టుకోలేకపోతున్నానే, మరి పెద్దవాళ్ళ దగ్గర ఇంకాస్త గారాబం ఉంటుంది కదా! ఆ వయసులో పెద్దావిడకి అంత ఓపిక, సహనం ఎక్కడ ఉంటుంది? ఎంత డిజిటల్ ధర్మామీటర్లు అయినా అవి ఆవిడకు కొత్త. ఆ మాట చెప్పలేక ఏదో చెప్పారు అంతే. ఏదో గంభీరంగా మాట్లాడుతున్నారు తప్ప లోపల ఆవిడకి మాత్రం చిన్నపిల్ల మీద ప్రేమ ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఆ జనరేషన్ అంతేలే!' అనిపించింది. 'సరే, ఈరోజు జ్వరం రాలేదు కదా, రేపు కూడా చూద్దాం' అని అనుకున్నాను. మరుసటిరోజు కూడా జ్వరం రాలేదు. ఇంకొక్కరోజు కూడా చూద్దామని ఇంకొకరోజు... అలా 5, 6 రోజులు గడిచిన తర్వాత, 'నేనే పెద్ద డాక్టర్ని, ఇంకా నీకు భయం దేనికి?' అని ఎప్పటికప్పుడు బాబా నిదర్శనం చూపిస్తూనే ఉన్నారని నాకు అర్థమైంది. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో  పంచుకున్న అనుభవాలలో కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు, కరోనా సమయంలో బాబా ఎలా మా కుటుంబాన్ని ఆదుకున్నారో, నా భయాల్ని ఎలా తుడిచివేసి 'నేనున్నానుగా, ఇంకెందుకు భయం?' అని చూపించారు. ఇంతకన్నా బాబా గురించి ఏం చెప్పాలి? చెప్పాలంటే నేను ఇంకొక దాసగణుగా మరొక జన్మ ఎత్తాలేమో!!


కొద్దిరోజుల క్రితం బాబా చేసిన మరో సహాయం:-


ఇటీవల ఒకసారి ఒక ఫైల్లో కొన్ని ఎంట్రీస్ తప్పుగా పడటం, నేను దానిని గమనించకుండా నా పైఆఫీసరుకి పంపించడం జరిగింది. ఇంటిపని, పిల్లల మీద ధ్యాస, ఇటు ఒక గెంతు, అటు ఒక గెంతు వేస్తూ ఎక్కడో ఏదో పొరపాటు చేసి (ఇంట్లో కూర్చుని పనిచేయటం (వర్క్ ఫ్రమ్ హోమ్) ఆడవాళ్లకు ఎంతవరకు కుదురుతుందో అనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం), సమయం లేక వెంటనే ఫైల్ పంపించటం వల్ల నేను దాన్ని సరిగా గమనించలేకపోయాను. నా పైఆఫీసర్ కూడా నాపై నమ్మకంతో ఆ ఫైల్‌ను వేరే వాళ్ళకి పంపించేశారు. ఆ రాత్రి వాళ్ల వద్ద నుండి 'ఎంట్రీస్ ట్యాలీ కావట్లేదు. ఏం చేయాలి?' అని నా పైఆఫీసరుకి మెసేజ్ వెళ్ళింది. ఆయన వెంటనే ఆ మెసేజ్‌ను నాకు ఫార్వర్డ్ చేశారు. నిజంగా అది నాకు పెద్ద షాక్! 'నా మీద చాలా నమ్మకం పెట్టుకున్న నా పైఆఫీసర్ ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారో!' అని నా మనసుకి చాలా బాధేసింది. నా పైఆఫీసర్ చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, అదీ అవసరమైతేనే. ఒకటి, రెండు మాటలు తప్ప వారి నోటినుండి మూడో మాట రావడం నాకు దాదాపుగా తెలియదు. వర్క్ విషయంలో నా పద్ధతిని నేను అనుసరించే స్వాతంత్ర్యాన్నిచ్చిన ఆయన అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. అలాంటిది ఇలా జరిగిందేమిటి అని చాలా అవమానంగా అనిపించి వెంటనే బాబా దగ్గరకు వెళ్లి, "బాబా! నాకు తెలియకుండా పొరపాటు జరిగినట్టుంది. నన్ను ఎవరూ ఏమీ అనకపోవచ్చు కానీ, ఎప్పుడు చూసినా 100% మనసుపెట్టి, ఎంతైనా కష్టపడే నాకు ఎందుకో బాధగా, వెలితిగా ఉంది. నా బాస్ ఏమీ అనరు. ఆయన దానిగురించి మాట్లాడరు. అది ఆయన పద్ధతి. అది నాకు ఇంకా పెద్ద సస్పెన్స్. ఇలాంటి వాటివల్ల వర్క్ విషయంలో ఆయనకు నాపైన నమ్మకం సడలుతుంది కదా!" అని మనసులో ఉన్న దిగులు, భయం, బాధ అన్నీ బాబాకు చెప్పేసుకున్నాను. తరువాత వర్కులో జరిగిన తప్పును సరిచేద్దామని కూర్చునేసరికి నెట్ ప్రాబ్లమ్, వాట్సాప్ డౌన్ అయిపోయింది. అది ఇంకొక టెన్షన్. కానీ ఇందులో కూడా ఒక మంచి జరిగింది. అదేమిటంటే, మనసులో జరుగుతున్న అంతర్మథనంలో నుండి పరిస్థితిని చక్కబెట్టుకునే సమయాన్ని బాబా నాకు ఇచ్చారు. మనసులో ఉన్న అలజడి వలన వెంటనే ఏదో ఒక సమాధానం చెప్పేయాలనే ఆత్రుతతో ఏదో ఒక సంజాయిషీ ఇచ్చేదాన్నేమో! కానీ ఆ అవకాశం లేకపోవడం వల్ల ముందు పనిలో నిమగ్నమై సవ్యంగా ఆలోచించగలిగాను. పొద్దున్నే ఆ మూడో వ్యక్తిని నేరుగా కాంటాక్ట్ అయి ప్రాబ్లమ్ ఏమిటో కనుక్కుని, ఎక్కడో పొరపాటుగా పడిన ఎంట్రీని సరిచేసి, మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పేసరికి ఆయన అహం కొంచెం సంతృప్తి అయి మామూలుగా స్పందించారు. ఆ ధైర్యంతో మూడో వ్యక్తికి ఫైల్ గురించి అన్నీ వివరించి జరిగిన పొరపాటుకు వివరణ ఇచ్చినట్టుగా నా పైఆఫీసరుకి తెలియజేశాను. ఆయన కూల్‌గా స్పందించినప్పటికీ లోపల చిన్నపాటి నూన్యతాభావం మిగిలే ఉన్నందున ఏదో ఇబ్బందిగా ఉంది.


తరువాతరోజు మా ఆఫీసర్ ఎన్నడూ లేని విధంగా నాకు ఫోన్ చేసి, "నేను బిజీగా ఉన్నాను. ఒక అసైన్‌మెంట్(పని) కొంచెం మీరు చూస్తారా?" అని అడిగారు. నేను సరేనని, నా వంతు పనిచేసి సబ్మిట్ చేశాను. మర్నాడు నేను మా బాస్‌కి, 'మీరిచ్చిన  అసైన్‌మెంట్ పూర్తయింది' అని మెసేజ్ చేస్తే, దానికి ఆయన, "గ్రేట్ మేడం, యు డిడ్ వండర్‌ఫుల్ జాబ్" అని రిప్లై ఇచ్చారు. అది మనం చాలా మూమూలుగా వాడే మాటే అయినప్పటికీ, 'ఎస్ మేడం, ఓకే మేడం' అనే రెండు మాటలు తప్ప ఇంకేవీ ఆయన నుండి వినని నాకు ఎంతో పెద్ద అవార్డు అందుకున్నట్లు అనిపించింది. అప్పటికి రెండురోజుల ముందు బాబాకు చెప్పుకున్నప్పుడు నా మనసులో ఉన్న దిగులు, వెలితి చేరిపేసేలా అత్యంత ఆనందాన్నిచ్చారు బాబా. ఆర్తితో, నమ్మకంతో హృదయపూర్వకంగా బాబాను అడగాలేగానీ ఆయన చక్కబెట్టలేని ఏ ఒక్క విషయమూ మన జీవితంలో ఉండదు. ఇప్పటికీ, ఎప్పటికీ నన్ను, నా భయాల్ని భరిస్తూ తన ఉనికిని నాకు పరిపరివిధాలుగా తెలియజేస్తూ ఉన్న నా బాబాకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు.


చివరిగా, మనం మన నిజజీవితంలో ఎన్నో బాబా చర్యలను అనుభూతి చెందుతూ ఉంటాం. కానీ, అది నలుగురికీ తెలియజేయాలని వ్రాసేటప్పుడు, దాన్ని తిరిగి చదివేటప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించటం కష్టం. ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో నా అనుభూతిని పంచుకునే అవకాశాన్నిచ్చిన బ్లాగ్ అడ్మిన్స్‌కి నా కృతజ్ఞతలు.



7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram very nice sai leelas. 1st sai leela is very nice��. We feel tension at that time. Sai takes care about his devotees. If we have faith and trust. He takes care. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. మీ అనుభవం చాలా బాగా రాసారండి,🙏🙏

    ReplyDelete
  4. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness Jaisairam

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo