సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 971వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాయగానే తీరిన కష్టాలు
2. సాయితండ్రి దయ - ఊదీ మహత్యం
3. సద్గురు సాయి చూపిన లీల

ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాయగానే తీరిన కష్టాలు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నా శతకోటి ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు సౌదామిని. మేము ఇదివరకు రేపల్లెలో ఉండేవాళ్ళం. ప్రస్తతం బదిలీ మీద భీమవరం వచ్చి ఉంటున్నాము. నేను 20 సంవత్సరాలుగా బాబాను కొలుస్తున్నాను. నాకు అన్నీ బాబానే. 2021, మే నెలలో నాకు కరోనా వచ్చి రిపోర్టు పాజిటివ్ అని రాకముందే నేను మొదటిసారి నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. తరువాత నాకు కరోనా పాజిటివ్ వచ్చినా ఇంట్లోనే క్వారంటైన్‍లో ఉంటూ వారంలోపే సాయితండ్రి దయవల్ల సాధారణ జ్వరం నుంచి కోలుకున్నట్లు కరోనా నుండి బయటపడ్డాను. అయితే ఇంకే ఇబ్బంది లేదనుకున్న తరుణంలో మా అత్తగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసలే ఆవిడ డయాబెటిక్ పేషెంట్ అయినందున, "మా అత్తగారు ఏ సమస్య లేకుండా కరోనా నుండి కోలుకుంటే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చినప్పటికీ బాబా దయవలన ఆవిడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా నుండి కోలుకున్నారు.


ఇకపోతే నేను కరోనా నుండి బయటపడ్డ తరువాత పోస్ట్ కోవిడ్ ప్రభావం వలన ఏదో ఒక అనారోగ్య సమస్యతో చాలా బాధపడ్డాను. అందులో మొదటిది మానసిక ఆందోళన. దాని కారణంగా భయంతో రాత్రిళ్ళు నాకు నిద్ర ఉండేదికాదు. పగలు కూడా చాలా ఆందోళనగా ఉండేది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నా ఇద్దరి పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్ గురించి చాలా దిగులు పడిపోతుండేదాన్ని. ఇలా అనుభవిస్తుంది చాలదన్నట్లు 2021, అక్టోబర్ 6న జ్వరం, ఒళ్లునొప్పులతో లేవలేకపోయాను. అమ్మ వాళ్ళింట్లో ఉంటూ, హోమియో మందులు వాడుతూ బాబా మీద పూర్తి విశ్వాసముంచి, "నాకు జ్వరంతో తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. నా నమ్మకం వృథా పోకుండా బాబా నన్ను ఆ కష్టం నుండి గట్టెక్కించారు. ప్రస్తుతం బాబా దయవలన పోస్ట్ కోవిడ్ బాధలన్నీ తగ్గాయి, మానసికంగా కూడా కొంచెంకొంచెంగా కోలుకుంటున్నాను. అంతా నా తండ్రి బాబా పెట్టిన భిక్ష. "ధన్యవాదాలు బాబా".


కరోనా ప్రభావం వలన మూతపడ్డ స్కూళ్ళు తెరిచిన రెండు నెలల వరకూ కరోనా భయంతో నేను నా పిల్లల్ని స్కూలుకి పంపలేదు. చివరికి దసరా సెలవుల తరువాత వారం నుండి పిల్లలిద్దరినీ స్కూలుకి పంపాను. సరిగ్గా నాల్గవ రోజు ఉదయం బాబుకి చలి జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆరోజు ఆదివారం కావడం వలన భీమవరంలో ఒక్క డాక్టరూ అందుబాటులో లేరు. భయాందోళనలతో నా గుండె వేగంగా కొట్టుకోగా నా సాయితండ్రి నాకు గుర్తుకు వచ్చారు. ఆయనకి నమస్కరించుకుని, "నా బిడ్డని రక్షించండి బాబా" అని వేడుకున్నాను. తరువాత నా భర్త తనకి తెలిసిన డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెప్తే, కొన్ని మందులు చెప్పి, వాటిని బాబుకి వేయమన్నారు. మరో డాక్టరు మాత్రం కోవిడ్ టెస్టు చేయించమన్నారు. నేను భయపడి బాబా ఫోటో దగ్గరకి వెళ్లి, "టెస్టు రిపోర్టు నెగిటివ్ వస్తే, వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నాకు, నా బిడ్డకు మీరే దిక్కు బాబా" అని వేడుకున్నాను. ఆరోజుంతా జ్వరానికి మందులిచ్చి, మరునాడు సోమవారం మధ్యాహ్నం బాబుకి రాపిడ్ టెస్టు చేయించాము. బాబా దయవలన టెస్టు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. 'ఏ కష్టమొచ్చినా సాయికి వ్రాసుకుంటే, ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది' అని బాబా జీవితచరిత్రలో ఉన్న ఒక భక్తుని అనుభవం అక్షర సత్యం. నా విషయంలో కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకి మొక్కుకున్నంతనే ప్రతి కష్టం నుండి నన్ను గట్టెక్కిస్తున్నారు బాబా. "ధన్యవాదాలు బాబా. నాకు తెలుసు, మా బాధలు మీకు నివేదించనక్కరలేదు. సర్వమూ మీరు చూసుకుంటారు తండ్రీ. మమ్మల్ని ఎప్పుడూ చల్లగా మీ నీడలో క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి నాయనా!"


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయితండ్రి దయ - ఊదీ మహత్యం


ఓం శ్రీ సాయినాథాయ నమః. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయిబంధువులందరికీ సాయి తండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీదేవి. నాకు సర్వం నా బాబాతండ్రే. ఆయన ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఇంతకుముందు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ 22న మావారు జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులతో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయనెప్పుడూ ఎంత కష్టమెచ్చినా సహనంతో ఓర్చుకునేవారు. అలాంటిది ఈసారి వచ్చిన జ్వరాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ కృపతో మా వారికి జ్వరం త్వరగా తగ్గిపోవాలి. అలా జరిగితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. తరువాత మావారికి ఊదీ పెట్టి, ఊదీ తీర్థాన్ని ఇచ్చాను. బాబా దయవల్ల మావారు త్వరగా కోలుకున్నారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబా ఉండగా మనకు భయమెందుకు?


ఒకరోజు రాత్రి గం.11:30ని.లకు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా నాన్నగారి నుదుట నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది. దాంతో హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. వెంటనే బాబాకు నమస్కరించుకుని, ఎదురుగా ఉన్న ఊదీని నా నుదుటన ధరించి, "బాబా! నాన్నకి ఏమీ కాకుండా చూడండి" అని వేడుకున్నాను. రెండురోజుల తర్వాత మా అమ్మతో మాట్లాడుతుంటే, "నాన్న నుదుటికి కప్ బోర్డులకు బిగించే శీల గుచ్చుకుంది, అయితే పెద్దగా రక్తం కారకుండా చిన్న చెమ్మలా వచ్చింద"ని అమ్మ చెప్పింది. ఇదంతా నాకు కల వచ్చిన మరుసటిరోజు జరిగింది. నా సాయితండ్రి దయవల్ల, ఊదీ మహత్యం వల్ల నాన్నకు ప్రమాదం తప్పింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా, అందరినీ చల్లగా చూడు తండ్రీ".


సద్గురు సాయి చూపిన లీల


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శారద చంద్రశేఖర్. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు చాలాకాలం నుంచి అప్పుడప్పుడు వెన్నునొప్పి వస్తూ, అదే తగ్గిపోతూ ఉంది. అయితే ఒకరోజు నీళ్ళ బకెట్ తెస్తుంటే చెయ్యి బెణికి వెన్నునొప్పి బాగా వచ్చింది. ఎప్పుడూ హోమియో మందులు వాడే అలవాటు ప్రకారం అప్పుడు కూడా హోమియో మందు వేసుకుంటే తగ్గింది. కానీ సరిగా అప్పుడే ప్రయాణం, పండుగ కారణంగా పనులు ఎక్కువ అవ్వటం వలన చాలా నీరసంగా ఉండటం, దాంతోపాటు కొద్దిగా జలుబు, జ్వరం కూడా ఉండేసరికి వాటికి కూడా హోమియో మందులు వేసుకున్నాను. అంతలోనే మళ్లీ బిందెతో నీళ్ళు పట్టుకుని వచ్చే క్రమంలో చెయ్యి బెణికి మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. ఈసారి మందులు వాడినా తగ్గలేదు. అందరూ డాక్టరు దగ్గరకు వెళ్లి చూపించుకోమని అన్నారు. కానీ నేను ఆ నొప్పితోనే నా పనులన్నీ (నీళ్ళు పట్టుకోవడం కూడా) చేసుకుంటూ, "ఈ నొప్పి తగ్గేలా లేదు, ఏం చేయాలి?" అని అనుకున్నాను. తరువాత తోటి భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! నాకు సాయంత్రంలోగా నొప్పి తగ్గితే, వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి నాకు ఆ నొప్పి నుండి ఉపశమనం లభించింది. వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం బ్లాగు వారికి పంపాను. నమ్మకంతో కొలిస్తే మన చెంతనే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు బాబా.



9 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺😃🌼😀🌸🥰🌹💕👪

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram every sai leela is very nice. If we trust sai nanna he will take care like father. He is my lovely parents. I lost both of them, sai take care of my family. Om sai ram❤❤❤

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  5. Om sai ram baba ma eddari arogyalu bagundali thandri rakshinchu thandri sainatha

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete
  7. Baba maku meere dikku thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo