సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 946వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. ఆపరేషన్ లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
2. బాబాపై విశ్వాసం అత్యంత అవశ్యకం

ఆపరేషన్ లేకుండా ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజనా గుప్తా. మాది నర్సంపేట, వరంగల్ జిల్లా. నేను మీకు సుపరిచితురాలినే. ఎందుకంటే, గతంలో నేను రెండు అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు పంచుకోబోయే మూడవ అనుభవంలో బాబా నన్ను పావుగా చేసుకుని ఇతరులకు సహాయం చేసిన పద్ధతి గురించి చెప్తాను.


నేను బాబాను ఎంతగానో నమ్ముతాను. నేను ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, పడుకున్నాక మెలకువ వచ్చినప్పుడు బాబాను తలుస్తూ ఉంటాను. అలా బాబా స్మరణలో ఉంటూ, సచ్చరిత్ర పారాయణ చేస్తూ బాబానే లోకంగా ఉంటాను. ఇంతకుముందు సోషల్ సర్వీస్, ఫంక్షన్స్, టెంపుల్స్ తదితర వాటిలో తిరుగుతుండే నేను ఇప్పుడు పూర్తిగా బాబా స్మరణ, ధ్యానం, బాబా చెప్పే విషయాల మననం వంటి వాటితో బాబా ధ్యాసలోనే ఉంటున్నాను. ఎక్కడికైనా వెళ్లాలన్నా మనస్సు పోవడం లేదు. అంతలా నాలో మార్పులు వచ్చాయి. నిజానికి 1994 నుండి బాబా భక్తురాలినైన నేను గత ఐదారు సంవత్సరాల నుండి పూర్తిగా బాబా సేవలో తరిస్తున్నాను. బాబా సేవకే అంకితమైన నాకు అడుగడుగునా ప్రతి విషయంలోనూ నాతో ఉన్నానని బాబా నిరూపణ ఇస్తున్నారు. ఒకసారి నేను వంట చేస్తూ అన్నం పొంగుతుంటే, మూత తీసి గరిటతో కలుపుతున్నాను. అంతలో గరిట చేజారి ఉడుకుతున్న అన్నంలో పడిపోయింది. తొందరలో ఉడుకుతున్న అన్నంలో చేయి పెడుతున్నానన్న స్పృహ కూడా లేకుండా నా చేయి నేరుగా ఆ పాత్రలో పెట్టేసి గరిటను బయటకు తీశాను. అద్భుతం ఏమిటంటే, వేడి తగలడంగాని, నా చెయ్యి కాలడంగాని జరగలేదు. బాబా చేసిన మిరాకిల్‍ని తలచుకుంటే, ఇప్పటికీ నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈవిధంగా ప్రతి విషయంలోనూ నేనున్నాను అని బాబా తెలియజేస్తూ ఉంటారు.


నాకు ఒక స్నేహితురాలు ఉంది. తన పేరు శోభ. ఐదేళ్ల క్రితం ఒక గ్రూపు ద్వారా తనతో నాకు పరిచయం జరిగింది. ఇప్పటివరకూ మేము ఒకరిని ఒకరం చూసుకోలేదు. అయితే తను కూడా బాబా భక్తురాలైనందున మా ఇద్దరి మధ్య బంధం పటిష్టం అయ్యింది. 5 సంవత్సరాలగా ప్రతి విషయంలోనూ తను నన్ను సలహాలు, సూచనలు అడుగుతూ ఉంది. 2020, ఆగస్టు ఒకటో తారీకు, గురువారం అర్ధరాత్రి 12:00 గంటలకు తన నుండి నాకు ఫోన్ వచ్చింది. మెలకువ వచ్చి చూస్తే, శోభ ఫోన్ చేస్తుంది. నిజానికి నేను రాత్రి 9 - 9:30 తర్వాత ఎవరి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయను. అలాంటిది అర్ధరాత్రి వచ్చిన తన ఫోను లిఫ్ట్ చేశాను. కారణం అంత అర్థరాత్రి వేళ ఫోన్ చేసిందంటే ఏదో పెద్ద సమస్య వచ్చి ఉంటుందనిపించింది. తన భర్త భాస్కర్ సి.ఆర్.పి.ఎఫ్‍లో ఉద్యోగం చేస్తారు. అందువల్ల శోభ ఒక్కతే ఇద్దరు పిల్లలతో హైదరాబాదులో ఉంటుంది. అందువల్ల నా అవసరం వచ్చి ఉంటుందని ఫోన్ లిఫ్ట్ చేశాను. మరుక్షణం తను బాగా ఏడుస్తుంది. అది విని నాకు కూడా బాధేసి, "ఎందుకు ఏడుస్తున్నావ్ శోభ? ఏం జరిగింది? ముందు విషయం చెప్పు" అని నేను ఒకటికి, రెండుసార్లు అడిగాను. చివరికి, "పిల్లలకు ఏమైనా అయిందా?" అని అడుగుతుంటే, "కాదు,భాస్కర్ కు యాక్సిడెంట్ అయ్యిందంట" అని చెప్పి ఏడ్చింది. అప్పుడు నేను, "బాబా ఉన్నారు. ఏమీ భయపడవద్దు. ధైర్యంగా ఉండు" అని చెప్పాను. కానీ తన బాధ వర్ణనాతీతం. ఆ క్షణంలో నాకు కూడా ఏడుపొచ్చింది.


ఇంతకీ అసలు విషయమేమిటంటే, తన భర్త  డ్యూటీ పూర్తి చేసుకుని వస్తుండగా పదిమంది ఉన్న వ్యాన్ యాక్సిడెంట్‍కి గురైంది. ఆ యాక్సిడెంట్ ఫోటోలు, అతను పడిపోయిన విధానము చూస్తే, ఆ ప్రమాదంలో ఎంతమంది బ్రతికి ఉన్నారో, అతనికి ఏమైందో తెలియని అయోమయం. ఆ విషయం తెలియగానే శోభ నాకు ఫోన్ చేసి, విషయం చెప్పడం, నేను తనకి బాబాను ప్రార్థించమని ధైర్యం చెప్పడం జరిగింది. కానీ అప్పటినుంచి నా మనసు ఆమె చుట్టూ తిరుగసాగింది. గంటగంటకి ఫోన్ చేస్తూ, "ఎలా ఉంది? వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారా? డాక్టరు ఏమన్నారు? ఇక్కడికి తీసుకొస్తారా?" అని అడుగుతూ పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాను. యాక్సిడెంట్ జరిగిన పదిమందిలో డ్రైవరుకి, మరో ఇద్దరికి కాలు తీసేయడం, తలకి గాయం అవ్వడం వంటి మేజర్ ప్రాబ్లమ్స్ జరిగాయి. అలాంటిది బాబా దయవలన భాస్కర్‍కి చిన్నగా గీరుకుపోవడం తప్ప పెద్ద గాయాలు ఏమీ కాలేదు. కానీ అతను స్పృహలో లేడు. పైకి తెలియని దెబ్బలు తగిలి ఉంటాయేమో, అందుకే స్పృహ లేకుండా ఉన్నాడని అనుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం భద్రాచలానికి సమీపంలో ఉన్నందున భాస్కర్‍ని భద్రాచలంలోని ఒక హాస్పిటల్లో చూపించారు. వాళ్ళు కొంత ట్రీట్మెంట్ చేసి, "హైదరాబాద్ తీసుకెళ్ళమ"ని చెప్పారు. తెల్లవారుతునే నేను శ్రీసాయి సన్నిధి గ్రూపులో జరిగిన సంఘటన గురించి తెలియజేసి, అందరినీ అతనికోసం ప్రార్థించమని మెసేజ్ పెట్టాను. శ్రీసాయి సన్నిధి గ్రూపులోని ప్రతి ఒక్కరూ బాబాను ప్రార్థించి, "బాబా ఉన్నారు. అతనికేమీ కాదు. అంతా మంచి జరుగుతుంది. మీ స్నేహితురాలిని ధైర్యంగా ఉండమని చెప్పండి" అని చెప్పారు.


ఉదయం 7:00 గంటలకి శోభ భర్త భాస్కర్‍ని హైదరాబాదు తీసుకొచ్చి తదుపరి చికిత్సకోసం సి.ఆర్.పి.ఎఫ్ హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు అతని వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అసలే కోవిడ్ పరిస్థితులు, ఆపరేషన్ అంటుంటే శోభ భయంతో బెంబేలెత్తిపోయింది. ఆమె రమణానంద మహర్షిగారి శిష్యురాలు. తాను పీఠంకు ఫోన్ చేసింది. బాబా దయవల్ల తనకి స్వామితో మాట్లాడే అవకాశం వచ్చింది. స్వామి ఆమెతో, "ఆపరేషన్ అవసరం ఉండదమ్మ. త్వరగానే అంటే పదిహేను నుండి నెల రోజుల్లో అతను కోలుకుంటాడ"ని చెప్పి ఆశీర్వదించారు. శోభ నాకు ఫోన్ చేసి ప్రతి విషయం చెప్తూ ఉంది. నేను అప్పుడు తనతో, "రెండో అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుంటుందేమో!" అని అన్నాను. దాంతో ఆమె తన భర్తను మరో హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్లు, "ఆపరేషన్ అవసరం లేదు. ఒక ఇంజక్షన్ చేస్తాము, దానితో అంతా సెట్ అయిపోతుంది. అవ్వకపోతే, అప్పుడు ఆపరేషన్ చేద్దామ"ని చెప్పి సదరు ఇంజెక్షన్ చేసారు. మూడు, నాలుగు రోజలు గడిచాయి. కానీ అతని పరిస్థితిలో ఏ మార్పు కనిపించకపోవడంతో ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. శోభ నాకు ఫోన్ చేసి విషయం చెప్తే, నేను తనతో, "సరే చూద్దాం! నువ్వు బాబా సచ్చరిత్ర తెప్పించుకుని దగ్గర పెట్టుకో. అయినా అప్పుడే తొందరపడొద్దు, ఆపరేషన్ అవసరం లేదని అన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ తొందరపడుతున్నారు ఎందుకు?" అని అన్నాను. అందుకు తను, "వాళ్లు ఆగడం లేదు" అని చెప్పింది.

అయితే, బాబా ఊరికే చూస్తూ ఉంటారా! తమను నమ్మిన వాళ్లకు తోడుగా ఉండి అన్నీ చూసుకుంటారు. డాక్టర్లు ఆపరేషన్ కోసంగా టెస్టులు మొదలుపెట్టారు. అందులో భాగంగా అతనికి కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. రిజల్ట్ కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో డాక్టర్లు  పదిహేను రోజుల తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆపరేషన్ పోస్ట్ ఫోన్ చేయడమేకాక భాస్కర్‍ని డిశ్చార్జ్ కూడా చేశారు. అప్పుడు వేరే హాస్పిటల్లో మరోసారి భాస్కర్‍కి టెస్ట్ చేయిస్తే, "కోవిడ్ పాజిటివ్ కాద"ని చెప్పారు. ఇంకా "ఆపరేషన్ కూడా అవసరం లేదు. కాకపోతే మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలి. కోలుకోవడానికి కనీసం ఆరునెలలైనా పడుతుంది" అని చెప్పారు. అలా బాబా దయవలన ఆపరేషన్ ఐతే తప్పిపోయిందికానీ, భాస్కర్ ఆరు నెలలు మంచంలోనే ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన భాస్కర్ బాబా దయవలన 15 రోజుల్లో చాలావరకు కోలుకున్నాడు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు, మందులు వాడుతుండటం వలన నెమ్మదిగా మూడు నెలలకి అతను నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు భాస్కర్ చక్కగా డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యారు. అలా ఆ బాబా అనుగ్రహం వల్ల, అందరి సహాయసహకారాలు, ప్రార్థనలు వల్ల మహర్షి వారి ద్వారా బాబా చెప్పించినట్లే ఆపరేషన్ లేకుండానే భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. వాళ్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. 

 

ఆ సాయినాథుడు తమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి చెంతనుంటూ 'నేనున్నా'నని సేద తీరుస్తారు. ఆ చల్లని తండ్రి తీర్చని సమస్య అంటూ ఉంటుందా? ఆయన అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఒంటిమీద చిన్న మరక కూడా కనిపించకుండా చేశారు.  ప్రతినిత్యం, ప్రతిక్షణం మనసులో ఆ సాయినాథుని స్మరిస్తున్న వారి 'సాయీ' అన్న పిలుపుకు 'ఓయ్' అని తప్పక పలుకుతారు బాబా. నా విషయంలో ఎప్పుడూ  పలుకుతున్నారు. ఆయన దయతో నేను శోభ, భాస్కర్‍ల సమస్యల్లో పాలుపంచుకోవటం, నా వంతు సహాయసహకారాలు అందించటం, తద్వారా నన్ను ఒక పావుగా చేసుకుని వాళ్లకు 'నేనున్నాను' అని నిరూపణ ఇస్తున్నారు బాబా. అందుకు నేను ఎంతో ధన్యురాలిని. భాస్కర్ యాక్సిడెంట్ గురించి నేను శ్రీసాయి సన్నిధిలో విన్నవించిన మరుక్షణమే స్పందించిన ప్రతి ఒక్కరికీ నా తరఫున మరియు శోభ, భాస్కర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ అనుభవం గురించి బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని శోభ ఎన్నోసార్లు నాతో చెబుతూ వచ్చింది. కానీ సమయం లేక నేను వ్రాయలేకపోయాను. ఇప్పటికైనా సమయం దొరికి వ్రాయగలినందుకు బాబాకు వేలవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా సాయిబాబా ఎంతోమంది భక్తులకు ప్రసాదించిన అనుభవాలను సేకరించి, ఈ బ్లాగులో ప్రచురించి సాయి బంధువులందరికీ తెలియజేస్తున్న సాయికి కృతజ్ఞతలు.

 

మీ... అంజనా గుప్తా.


సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు.


బాబాపై విశ్వాసం అత్యంత అవశ్యకం


ఓం నమో సద్గురు శ్రీ సాయినాథాయ. సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉపేంద్ర. మాది విజయవాడ. నేను గత రెండు నెలలుగా తీవ్రమైన బ్యాక్ పెయిన్‍తో బాధపడుతున్నాను. డాక్టరు వద్ద చూపించుకుని మందులు వాడుతున్నా నొప్పి తగ్గలేదు. ఆ నొప్పి వలన స్థిమితంగా కూర్చోలేక రోజూ ఎంతో ఇబ్బందిపడుతుండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు బాబాను ప్రార్థించి, 'మళ్లీ డాక్టరు దగ్గరకు వెళ్ళాలా, వద్దా' అని చీటీలు వేస్తే, 'వద్దు' అని వచ్చింది. దాంతో డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు. తరువాత ఒక సోమవారంనాడు మన బాబాకు నా బాధ చెప్పుకుని, "నొప్పి తగ్గితే, రాబోయే గురువారంనాడు బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆశ్చర్యంగా ఆ రోజు మధ్యాహ్నం నుండి మూడురోజులపాటు నొప్పి అసలు లేదు. అయితే, నేను నా ఈ అనుభవాన్ని డైరీలో వ్రాసుకున్నానుగాని బ్లాగులో ప్రచురణకు పంపలేదు. పైగా నొప్పి మళ్లీ వస్తుందేమోనని కించిత్ సందేహం నా మనసులో ఉండేది. బాబా మీద విశ్వాసం ఉన్నప్పటికీ పొరపాటున నా మనసులో ఆ సందేహం కలగడం వలన నాలగవరోజున మళ్లీ నొప్పి మొదలై క్రమంగా పెరిగింది. అప్పుడు నేను మన బాబాతో, "తండ్రీ! మిమ్మల్ని  సంపూర్ణంగా విశ్వసించినట్లయితే తగ్గిపోయిన నొప్పి తిరిగి వచ్చేది కాదు. బ్లాగులో పంచుకుంటానని మీకు చెప్పి, వెంటనే పంచుకోకుండా ఆలస్యం చేశాను. నన్ను క్షమించు తండ్రీ" అని ప్రార్థించి వెంటనే నా అనుభవం పంచుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఆశ్చర్యమేమిటంటే, ఈ అనుభవం పంపుతున్న సమయానికే నాకు కొంచెం ఉపశమనం కలిగినట్లు అనిపించింది. ఇప్పుడు నాకు 100 శాతం నమ్మకం ఉంది, 'బాబా నా బాధను త్వరలో పూర్తిగా తగ్గిస్తార'ని. నొప్పి పూర్తిగా తగ్గిన వెంటనే నా అనుభవాన్ని మళ్లీ మన బ్లాగులో పంచుకుంటాను.


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః.



6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram it's month my mom passed away.i love her very much. Baba you are my parents. ❤❤❤

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jai sairam

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🥰🌸😃🌹😀🌺🤗🌼

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo