సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శంకర్ హరిభావ్ చౌబల్


సాయిబాబా చిన్నపిల్లలను ఎంతగానో ప్రేమించేవారు. పిల్లల పట్ల ఆయనకి ఉన్న ప్రేమకు సంబంధించిన లీలలు 'సాయిసచ్చరిత్ర'లో చాలా అరుదుగా కనిపించినప్పటికీ శ్రీ బి.వి.నరసింహస్వామిగారు రచించిన 'లైఫ్ ఆఫ్ సాయిబాబా', 'డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాయిబాబా' పుస్తకాలలో, సాయిలీలా మ్యాగజైన్లలో అటువంటి లీలలను చాలా చూడవచ్చు. ఇప్పుడు అటువంటి ఒక లీలను మనం తెలుసుకుందాం.

శంకర్ హరిభావ్ చౌబల్ థానే జిల్లాలోని దహనులో తేదీ.13 - 8 -1910న జన్మించాడు. తన తండ్రి హరిభావ్.వి.చౌబల్ శిరిడీలో చాలారోజులు ఉన్న సమయంలో బాబాను మొదటిసారి చూశాడు శంకర్ చౌబల్. అప్పటికి అతను చాలా చిన్నవయస్సులో ఉన్నందున తనకి అప్పటి సంగతులేవీ గుర్తులేవు. కానీ 1917వ సంవత్సరంలో రెండవసారి తనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మళ్ళీ శిరిడీ వెళ్లినప్పటి సంగతులు చాలావరకు గుర్తున్నాయి. ప్రతిరోజు కాకడ ఆరతి ముగిసిన తరువాత అతని తల్లి ఇంటికి వెళ్లి బాబాకోసం ఝుణకా భాకరి తయారుచేసేది. ఎందుకంటే, బాబా వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చేవారు. బాబాకు భిక్ష ఎవరు ఇవ్వాలనే విషయంలో పిల్లలు వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకునేవారు. ఈ సమస్యను, పిల్లలందరికీ ఒకరి తరువాత ఒకరికి (బాబాకి భిక్ష వేసే) అవకాశం వచ్చే విధంగా ఆమె పరిష్కరించింది. బాబా భిక్షకు వెళ్లి తిరిగి వచ్చేలోపల శంకర్ ద్వారకామాయికి పరుగున వెళ్ళి వేచి ఉండేవాడు. బాబా ప్రేమగా తనని దగ్గరకు తీసుకొని, కాసేపు ఒడిలో కుర్చోబెట్టుకొని, గట్టిగా హత్తుకొని ముద్దు చేసేవారు. చాలా తరుచుగా తన ముక్కు తుడిచేవారు. తాము తెచ్చుకున్న భిక్షనుండి రుచికరమైన పదార్థాలను తనకి ఇచ్చిన తరువాత వెళ్ళి ఆడుకోమని చెప్పేవారు బాబా.

ఒకసారి షామా శంకర్‌ను పిలిచి, "బాబూ! నువ్వు రోజూ ఇక్కడికి వచ్చి నిలుచుంటావు. బాబా నిన్ను దగ్గరకు తీసుకొని నీ ముక్కు తుడుస్తూ ఉంటారు. నువ్వు చూస్తే చాలా మురికిగా ఉంటావు. రేపటినుంచి ఇక్కడకి వచ్చి నిల్చోవద్దు" అని కాస్త గట్టిగా మందలించాడు. మరుసటిరోజు శంకర్ ద్వారకామాయికి వచ్చి సభామండపంలో మౌనంగా కూర్చున్నాడు. బాబా ఒక భక్తుణ్ణి పిలిచి, శంకర్‌ని తమ దగ్గరకు తీసుకురమ్మని పంపించారు. కానీ షామా బాబా ప్రక్కనే ఉండడంతో బాబా దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించాడు శంకర్. అదే విషయం ఆ భక్తుడు బాబాకు చెప్పగా, బాబా మళ్ళీ వెళ్లి తనని తీసుకునిరమ్మని చెప్పారు. కానీ ఈసారి కూడా శంకర్ నిరాకరించగా, ఆ భక్తుడు శంకర్‌ని ఎత్తుకొని తీసుకెళ్లి బాబా ముందు ఉంచాడు. బాబా శంకర్‌ని తమ ఒడిలో కుర్చోబెట్టుకొని మృదుస్వరంతో, "భావూ! ఈరోజు నా మీద కోపంగా ఉన్నావా? నాకు దూరంగా ఎందుకు కూర్చొన్నావు?" అని అడిగారు. అప్పుడు తను షామా అన్న మాటలు బాబాకు చెప్పాడు. అప్పుడు బాబా శ్యామాతో, "అరె, షామ్యా! నువ్వు ఎలాగైతే నా బిడ్డవో, అలాగే భావూ కూడా. నా బిడ్డలను నేను దగ్గరకు తీయకుంటే, మరెవరు తీసుకుంటారు? కాబట్టి అతని మీద కోప్పడకు" అని షామాను సమాధానపరిచారు. అప్పటినుండి షామా తనని బాబా దగ్గరకు వెళ్ళడానికి అభ్యంతరం చెప్పలేదు.

సోర్స్: సాయిలీల మ్యాగజైన్ - మే 1986.

2 comments:

  1. 🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo