సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు మన సాయిబాబా...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు దీప్తి, నేను హైదరాబాదు నివాసిని. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా మొదటి అనుభవం గురుపౌర్ణమి రోజున ప్రచురితం అయింది. అదేరోజు నాకు తెలిసిన శారదమ్మగారు శిరిడీలోని చావడిలో బాబా పటం తుడిచి అలంకరణ చేస్తుండగా నన్నెందుకో తలచుకున్నారట. అదేసమయంలో నేను ఇక్కడ హైదరాబాదులో పారాయణ చేసుకుంటూ ఉండగా ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యాను. ఆ తరువాత ఆవిడ నాకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పారు. ఆవిడ ద్వారా బాబా ఆశీస్సులు లభించాయని అప్పుడు నాకు అర్థమై చాలా ఆనందాన్ని అనుభవించాను.

నాకొక సొంత ఇల్లు కావాలని చాలారోజులనుంచి బాబాని కోరుకుంటుండేదాన్ని. సచ్చరిత్ర 40వ పారాయణ చేస్తుండగా బాబా ఒక ఇంటిని చూపించారు. నిజానికి మా వారికి అపార్ట్‌మెంట్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయనకే బాగా నచ్చి మరీ కొన్నారు. ఖచ్చితంగా ఇది బాబా కృపే.

నేను సచ్చరిత్ర 51వ పారాయణ పూర్తి చేసి, "బాబా! ఇన్నిసార్లు పారాయణ చేశాను, నువ్వు నాతో ఉన్నావని నాకేదైనా ఒక ఋజువు చూపించు" అనుకున్నాను. తరువాత గురువారం గుడికి వెళ్ళాను. బాబా నాకు ఎలా ఋజువు చూపిస్తారోనని ఎదురు చూస్తున్నాను. అక్కడ పారాయణ చేయడానికి పుస్తకాలు పెట్టారు. నేను కూడా ఒక పుస్తకం తీసుకుని పుస్తకం తెరిస్తే నాకు వచ్చిన అధ్యాయం - 51. బాబా చూపిన నిదర్శనానికి అవాక్కైపోయి ఆ అధ్యాయాన్ని పారాయణ చేసి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇక శతాబ్ది సంవత్సరంలో నా ప్రయాణాలు:

నేను 2016లో శిరిడీ వెళ్లినప్పుడు, "బాబా! 2018 మీ మహాసమాధి సంవత్సరం. అప్పుడు మావారితో కలిసి శిరిడీ వచ్చేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. తరువాత నేను ఆ విషయం పూర్తిగా మరచిపోయాను. కానీ బాబా మరచిపోకుండా మమ్మల్ని శిరిడీ రప్పించుకున్నారు. 2018 జనవరి 28న నేను, మావారు శిరిడీ వెళ్లొచ్చాము. ఆ తర్వాత నేను రోజూ వెళ్లే సాయిమందిరంలో శారదమ్మగారు సాయిసేవకి శిరిడీ వెళ్లి వచ్చి, అక్కడ జరిగే ఉత్సవాల గురించి కళ్లకు కట్టినట్లు చెప్పారు. దానితో నాకు ఆమెతో కలిసి మళ్ళీ శిరిడీ వెళ్లాలని కోరిక కలిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు మన సాయిబాబా కదా! అనుకున్నదే తడవుగా మళ్ళీ నా శిరిడీ ప్రయాణానికి అవకాశం ఇచ్చారు బాబా.

రెండవ ప్రయాణం: మేము జూన్ 2, శనివారం బయలుదేరి ఆదివారం తిరుగుప్రయాణం పెట్టుకుందామనుకున్నాము. కానీ బాబా ప్రణాళిక వేరేగా ఉంది. ఆదివారం కూడా మమ్మల్ని శిరిడీలో ఉంచుకోవాలని అనుకున్నట్లు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయాల్సిన టైం కి (11 గంటలకి) సరిగ్గా పవర్ పోయింది. అది బాబా ఆజ్ఞగా భావించి మా ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నాము. ఆదివారం బాబా దర్శనం బాగా జరిగింది. ఆరోజు నా మదిలో, "బాబా! మీరు ఎలాగైనా నాకు కనిపించండి" అని అనుకున్నాను. మేము దర్శనానికి వెళ్తుండగా అచ్చం బాబా వేషధారణలో ఒక సాధువు కనిపించారు. తరువాత ఆరోజు మధ్యాహ్నం రహతాలో కుశాల్‌చంద్ ఇల్లు, వీరభద్రమందిరం, సాకోరిలోని ఉపాసనీ బాబా ఆశ్రమం, కొర్హాలాలోని బాబా నిజపాదముద్రలు దర్శనం చేసుకున్నాము. సోమవారం మరలా సాయి దర్శనం చేసుకుని తరువాత కోపర్‌గాఁవ్ లోని శుక్రాచార్యుని గుడి, జగన్మాత గుడి చూసాం. మధ్యాహ్నం బాబా దర్శనం చేసుకొని తిరుగుప్రయాణమయ్యాము. నేను అనుకున్నట్లుగా నా ఈ శిరిడీ ప్రయాణాన్ని బాబా మలిచారు.

మూడవ ప్రయాణం:

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళపల్లి సాయిమందిరంవారు సాయి సచ్చరిత్ర మహాపారాయణ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం నవంబర్ 2017లో మొదలుపెట్టి అక్టోబర్ 2018 విజయదశమితో ముగిసింది. ఇందులో భాగంగా ఒకవారం, అంటే గురువారంనాడు శిరిడీలో పారాయణ చేద్దామనుకున్నారు. ఆగష్టు 29న వెళ్లి సెప్టెంబర్ 1కి తిరిగి వచ్చేలా వాళ్ళ షెడ్యూలు. ముందే రెండుసార్లు వెళ్లి ఉండడం వల్ల మావారు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. బుధవారం పారాయణ చేస్తూ, "బాబా! మావారు శిరిడీ వెళ్ళడానికి ఒప్పుకునేలా చేయండి" అనుకుంటూ పారాయణ పూర్తిచేశాను. తరువాత మావారిని అడిగితే ఒప్పుకున్నారు. పెళ్ళైన తరువాత ఇదే మొదటిసారి కుటుంబసభ్యులెవరూ లేకుండా నేను ఒంటరిగా వెళ్లడం. మేము మొత్తం 40 మందిమి RAC లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ బాబా అద్భుతం చేశారు - ఒకటి కాదు ,అందరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. గురువారంనాడు బాబా దర్శనం చేసుకొని, అభిషేకం హాల్లో పారాయణ చేసుకున్నాము. ద్వారకామాయిలో బాబా దర్శనం చేసుకొని ప్రసాదాలు పంచాము. మొదటిసారిగా ఆరోజు బాబా పల్లకీ ఉత్సవం కూడా చూశాను. శుక్రవారంనాడు మధ్యాహ్నఆరతి సమయంలో బాబాకి చాలా దగ్గరగా ఉండే అవకాశం లభించింది. నిజంగా బాబా అనుగ్రహం. 'సాయిపథా'నికి వెళ్లి శరత్‌బాబూజీ గారి దర్శనం కూడా చేసుకొని ఆనందంగా బయల్దేరాము.

నాకు పారాయణ గ్రూపులో పరిచయమైన ఒక అమ్మాయి శతాబ్ది మరియు విజయదశమి ఉత్సవాలకు శిరిడీ వెళ్లి వస్తూ అందమైన బాబా ఫోటో, విభూతి తెచ్చి ఇచ్చింది. అలా ఆ అమ్మాయి ద్వారా బాబా నాకు ఆశీస్సులు ఇచ్చారు. ఇన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

కొర్హాలా గ్రామంలోని బాబా నిజపాద ముద్రలు 


లోకాః సమస్తాః సుఖినో భవంతు!

ఓం సాయిరామ్.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo