శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
యస్. విష్ణు కులకర్ణి బాబాపట్ల భక్తిశ్రద్ధలు కల నిర్మలమైన భక్తుడు. తన పెద్దకొడుకు అనిల్ ఉపనయనానికి ముందు శిరిడీ వెళ్ళి, ఉపనయనానికి రమ్మని బాబాను ప్రేమతో ఆహ్వానించాడు. ద్వారకామాయి ఫొటోలోని బాబా చరణాలవద్ద ఆహ్వానపత్రికను ఉంచి, స్వయంగా వచ్చి తమని అనుగ్రహించమని వినయంగా బాబాను వేడుకొన్నాడు.
ఉపనయన వేడుక చాలా గొప్పగా జరిగింది. విందుకు ప్లేట్లు సిద్ధం చేసారు. అతిథులు కూర్చోబోతున్న సమయంలో కులకర్ణి భార్య తలుపు దగ్గర ఒక ఫకీరు ఉండటం గమనించింది. ఆ ఫకీరు, బాబా వేషధారణలో అచ్చం బాబాలానే ఉన్నారు. వెంటనే కులకర్ణి వెళ్ళి బాబా చేయి పట్టుకొని సగౌరవంగా తీసుకొనివచ్చి విందులో కూర్చోబెట్టారు. అతను, అతని భార్య స్వయంగా బాబాతో పాటు అందరికీ వడ్డించారు. కులకర్ణి ఒక పాన్ బీడాను తెచ్చి బాబా స్వీకరించాలన్న బలమైన కోరికతో బాబా తింటున్న ప్లేటు ప్రక్కన పెట్టాడు. బాబా వడ్డించిన పదార్థాలన్నీ తిన్నారు. చివరికి 'బూందీ లడ్డు' మాత్రమే బాబా ప్లేటులో మిగిలివుంది. అప్పుడు బాబా కులకర్ణి భార్య వైపు తిరిగి, "అమ్మా! ఈ లడ్డూ నేను తినలేను. కానీ, మీ ఇంట్లో స్టీలుడబ్బాలో ఉన్న 'రవ్వలడ్డు' మాత్రం ఖచ్చితంగా తింటాను" అని అన్నారు. ఆమె వాటిని తీసుకొని రావడానికి వెళ్తూ, "ఇంట్లో రవ్వలడ్డూలు ఉన్నాయని ఆయనకెలా తెలుసు?" అని ఆశ్చర్యపోయింది. ఆమె రవ్వలడ్డూలను తెచ్చి భక్తి ప్రేమలతో బాబాకు వడ్డించింది. భోజనానంతరం చేతులు కడుక్కోవటానికి బాబాని బాత్‌రూముకు తీసుకొని వెళ్ళారు. బాబా లోపలికి వెళ్లగా, కులకర్ణి తన చేతులో పాన్ బీడా పట్టుకొని, మరోవైపు అతని భార్య టవల్ పట్టుకొని నిలుచున్నారు. బాబా లోపల గడియపెట్టుకొని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, కొంతసేపటి తరువాత కులకర్ణి తలుపులు బలవంతంగా నెట్టాడు. కానీ బాత్‌రూమ్ లోపల బాబా లేరు! బాత్‌రూమ్ నుంచి బయటకుపోవడానికి ఇంకో మార్గం కూడా లేదు. వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. తమ ఆహ్వానాన్ని మన్నించి స్వయంగా బాబా వచ్చి తమని ఆశీర్వదించారని చాలా సంతోషించారు. కానీ బాబా పాన్ బీడా తీసుకోలేదని కులకర్ణి నిరాశపడి, ఉపనయనం పూర్తైన వెంటనే శిరిడీ వెళ్లి, ఈసారైనా బాబా స్వీకరించాలన్న కోరికతో బాబా సమాధి మీద ఒక 'పాన్ బీడా' ఉంచి, ఇంటికి తిరిగి వచ్చేసాడు. తరువాత ఒకరోజు వేకువఝామున బాబా కలలో కనిపించి, "నీవు నన్ను ఉపనయనానికి ఆహ్వానించావు. నేను అక్కడకు వచ్చి నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను" అని చెప్పారు. కులకర్ణి చేతులు కట్టుకొని, "బాబా! మీరు భోజనం చేసారు కాని, 'పాన్ బీడా' తీసుకోలేదు" అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వి, "నీవు గౌరవముతో నన్ను భోజనం చెయ్యమన్నావు, అందుకని మనస్ఫూర్తిగా భోజనం చేసాను. కానీ 'పాన్ బీడా' ని ఊరకే ప్రక్కన పెట్టావు. నన్ను తీసుకోమని ఎప్పుడు అడిగావు? దాన్ని సమర్పించడానికి మళ్ళీ అంతదూరం ప్రయాణంచేసి శిరిడీకి రావడం అవసరమా? నాకు ఎలాంటి బీడా అవసరం లేదు. నువ్వెప్పుడూ ప్రేమించే విధంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉండు. అది నాకు చాలు!" అని చెప్పారు. అంతటితో కల పూర్తయింది.
సోర్స్: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్ దీపావళి సంచిక 1998.
🕉 sai Ram
ReplyDelete