సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ప్రత్యక్ష సాయిభక్తుడు శ్రీకుశాల్‌చంద్ కుటుంబసభ్యులతో "సాయిపథం" ఇంటర్వ్యూ..


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిసచ్చరిత్రకి సంబంధించి మరుగునపడివున్న ఎన్నో అమూల్యమైన విషయాలను వెలికితీసి సాయిచరిత్రను సమగ్రంగా రూపొందించాలన్న బృహత్ ప్రణాళికతో, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ 'సాయిపథం' పత్రికను 1988లో ప్రారంభించారు. దానిలో భాగంగా బాబాను ప్రత్యక్షంగా దర్శించిన ఎందరో సాయిభక్తులను, వారి కుటుంబసభ్యులను కలిసి వారి అనుభవాలను, స్మృతులను 'సాయిపథం' సేకరించింది. ఆ సాయిసేవాకార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష సాయిభక్తులు శ్రీచంద్రభాన్‌సేఠ్, శ్రీకుశాల్‌చంద్(రహతా) కుటుంబసభ్యులను ది. 6-1-2001 న సాయిపథం బృందం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. శ్రీచంద్రభాన్‌సేఠ్ మనుమడు శ్రీజయచంద్‌సేఠ్, మునిమనుమడు శ్రీసురేందర్‌సేఠ్‌లు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. మరాఠి, ఇంగ్లీషులలో సాగిన ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలను తెలుగులోకి అనువదించి సాయిపథం మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఆ ఆహ్లాదకరమైన ఇంటర్వ్యూని సాయిపథం ప్రథమ సంపుటం 2001 నుండి స్వీకరించి మీ ముందు ఉంచుతున్నాము.      

శ్రీచంద్రభాన్‌సేఠ్
శ్రీజయచంద్‌సేఠ్
సాయిపథం: మేము 'సాయిపథం' పత్రిక తరపున వచ్చాము. శ్రీసాయిబాబా తరచుగా తమ పాదస్పర్శతో పునీతం చేసిన మీ ఇంటిని చూసి, ఆనాటి ఆ వివరాలను మీ నుంచి స్వయంగా తెలుసుకోవాలని వచ్చాము. దయచేసి మాకా వివరాలు చెప్పండి.

జయచంద్ సాండ్: అలాగా! చాలా సంతోషం! మాకు తెలిసినంతవరకు చెప్తాము. శ్రీ సాయిసచ్చరిత్రలో అంత విశదంగా రాని అప్పటి సంగతులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా వెలుగులోకి రావటం, ప్రచురింపబడటం మాకు సంతోషమే కదా!

సాయిపథం: బాబా శిరిడీ వదిలి ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లేవారు కాదని, ఎప్పుడైనా వెళితే పక్కనే ఉన్న రెండు గ్రామాలకు అంటే నీమ్‌గావ్‌లో శ్రీడేంగ్లేగారింటికి, రహతాలోని శ్రీకుశాల్‌చంద్ గారింటికి మాత్రమే వెళ్లేవారని బాబా చరిత్రలో ఉంది. బాబా రహతాకు వచ్చినప్పుడు ఈ ఇంటికే వచ్చేవారా?

జయచంద్ సాండ్: అవును. ఆరోజు నుండి ఈరోజు వరకు ఈ ఇంటికి మార్పులేమీ చేయలేదు. కాకపోతే రంగులు వేయించి, ఎలక్ట్రికల్ వర్క్ చేయించాము అంతే!

సాయిపథం: బాబా ఇక్కడకు మొత్తం ఎన్నిసార్లు వచ్చారన్నది మీరు ఏమైనా చెప్పగలరా?

జయచంద్ సాండ్: బాబా ఇక్కడకు ఆయన సమాధి చెందేంతవరకు చాలా తరచుగా వస్తుండేవారు.( ఓ హమేషా ఆతే థె!) ఒక వారంపాటు కుశాల్‌చంద్ శిరిడీకి రాకపోయినట్లయితే "కుశాల్‌చంద్ రాలేదే, తాత్యా! టాంగా ఏర్పాటు చేయి, వెళ్లి కుశాల్‌చందుని చూసి రావాలి" అనేవారు. తాత్యా టాంగా ఏర్పాటు చేస్తే అందులో వచ్చేవారు. ఒక్కోసారి టాంగా కోసం చూసుకోకుండా నడుచుకుంటూ అయినా వచ్చేసేవారు. ఆ రోజుల్లో ఈ ఊరి పొలిమేరలవరకు మా తోటలు ఉండేవి. బాబా వస్తున్న కబురు మా చౌఖీదార్ తీసుకొని వచ్చేవాడు. అప్పుడు మా తాతగారు వాళ్ళు ఊరి పొలిమేరలలో ఎదురెళ్లి మేళతాళాలతో సాదరంగా బాబాను ఇంటికి తీసుకువచ్చేవారు.
కుశాల్‌చంద్
సాయిపథం: ఎప్పుడూ ఎవరింటికీ వెళ్ళని బాబా మీ ఇంటికి రావడం, మీ కుటుంబసభ్యులపట్ల అంత అపారమైన ప్రేమను చూపడం చూస్తే, ఆయనకు మీ కుటుంబానికి ఏదో గొప్ప ఋణానుబంధం ఉందనిపిస్తుంది. దానికి మీరేమంటారు?

జయచంద్ సాండ్: ఆ మాట అక్షర సత్యం! ఆయనతో మాకేదో గొప్ప ఋణానుబంధం ఖచ్చితంగా ఉండివుండాలి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని మాత్రం చెప్పగలం. కానీ ఎటువంటి ఋణానుబంధమో, ఎందువల్ల ఏర్పడిందో మాకైతే తెలియదు. మా నాన్నగారు అమోలోక్‌చంద్ సాండ్‌గారు చెప్పిన ప్రకారం, అహ్మద్‌నగర్‌లోని మా ఎస్టేట్ (వాడియా పార్క్) లో జవహర్ అలీ అనే ఓ ఔలియా ఉండేవారు. ఆయనకోసం బాబా నగర్, అక్కడనుండి రహతాకు వచ్చి, తర్వాత శిరిడీ వెళ్లారు.


సాయిపథం: అంటే, బాబా మొదట నగర్, రహతా వచ్చి తర్వాత శిరిడీ వచ్చారన్నది వాస్తవమే అంటారా?

జయచంద్ సాండ్: మా నాన్నగారన్న మాటను బట్టి నేను చెబుతున్నానే కానీ, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. బాబా ఆ జవహర్ అలీతో కలిసి అహ్మద్‌నగర్‌లో ఉండటం మా సోదరుడు(కజిన్) దౌలత్‌రామ్ చూశాడని మా నాన్నగారు చెప్పారు.

సాయిపథం: అహ్మద్‌నగర్‌లోని మీ రహటేకర్‌వాడాలో జవహర్‌అలీ ఫోటో ఉందని విన్నాము, అది నిజమేనా?

జయచంద్ సాండ్: నిజమే! అక్కడ ఒక స్పిన్నింగ్ మిల్లు ఉండేది. ఇప్పుడు అది మా ఆధీనంలో లేదు. దాన్ని చాలాకాలంక్రితం అమ్మేసాము. కానీ జవహర్‌అలీ ఫోటో మాత్రం మా దగ్గరే ఉండేది. కానీ, తర్వాత ఒక సాయిభక్తుడు మా దగ్గరనుండి ఆ ఫోటోను, కాపీ తీసుకుని మరలా ఇస్తామని చెప్పి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. మేము దానికోసమే ప్రయత్నిస్తున్నాము.

సాయిపథం: శ్రీసాయిశరణానంద తన ఆత్మకథలో, "ఒకసారి బాబాతో కలిసి తాను బాపూసాహెబు జోగ్, కాకాసాహెబు దీక్షిత్, శ్రీమతి జోగ్ మొదలగు వారందరూ మీ ఇంటికి వచ్చార"ని వ్రాసారు.

జయచంద్ సాండ్: అవును! బాబా ఇక్కడకు వచ్చే రోజుల్లో ఆయనతోపాటు ఎందరో ప్రముఖభక్తులు మా ఇంటికి వచ్చేవాళ్లు. బాబాకు కుశాల్‌చందుకు ఉన్న అనుబంధం ఎంత గొప్పదంటే, బాబా ఒకసారి కుశల్‌చంద్‌తో "కుశాల్, నాకు ఇక్కడ ఉండడానికి స్థలం ఏర్పాటు చెయ్యి. నేను  ఇక్కడే స్థిరపడిపోతాను" అని అన్నారట. దానికి కుశాల్‌చంద్ ఎంతో సంతోషంగా స్థలం ఇవ్వడానికి వెంటనే సంసిద్ధులయ్యారు. కానీ ఎందుకో మరలా బాబా శిరిడీలోనే ఉండిపోయారు.

సాయిపథం: సాయిశరణానంద, దీక్షిత్, జోగ్‌లతో కలిసి బాబా మీ ఇంటికి వచ్చినప్పుడు బాబా రాకలోని ముఖ్యకారణం నార్వేకర్ అనే భక్తుని కోసం అప్పు అడగడానికి అని సాయిశరణానంద వ్రాసారు. అంటే దానిని బట్టి బాబా మీ తాతగారి దగ్గర డబ్బులు అప్పు అడిగి తీసుకునే వారని అర్థమవుతుంది. అది నిజమేనా? మీ తాతగారు బాబాకు అప్పు ఇచ్చేవారా?

జయచంద్ సాండ్: నార్వేకర్ విషయం మాకు తెలియదు. బహుశా నిజం అయివుండవచ్చు. ఒకసారి బాబా కుశాల్‌చంద్‌ని పిలిచి, "కాకాసాహెబు దీక్షిత్‌కు 500 రూపాయలు ఇవ్వు" అని చెప్పారు. మా తాతగారు బాబా ఆజ్ఞప్రకారం అలానే  చేశారు. ఈ విషయం దీక్షిత్ మనవరాలు మాకు చెప్పింది. ఆమె బొంబాయిలోని జుహూలో నివసిస్తుంది. మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన ప్రకారం బాబా తనకోసం తాను ఏదీ అడగలేదు. అయినా ఆయనకు ఆ అవసరం మాత్రం ఏముంది? మా ఇంటికి వచ్చినప్పుడైనా, ఇంట్లోనే ఆడవాళ్లు ఎంతో బ్రతిమాలితే, "అచ్ఛామా! తోడా దూద్ రోటి లావ్"( సరే అమ్మా, కొంచెం రొట్టె పాలు ఇవ్వండి) అనేవారు. అదీ ఎంతో బ్రతిమాలితే కొద్దిగా తినేవారు. అంతే! మా ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండేవి. ఆయన ఏం కావాలంటే అవి తీసుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీసుకునేది మాత్రం ఆ కొద్దిగా పాలు, రొట్టె మాత్రమే!

సాయిపథం: బాబా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి లోపలికి వచ్చేవారా? లేదా వరండాలోనే కూర్చునేవారా?

జయచంద్ సాండ్: లోపలికి వచ్చేవారు! అదిగో, ఆ ద్వారంగుండానే లోపలికి వచ్చేవారు.

సాయిపథం: మీ కుటుంబానికి బాబాతో గల అనుభవాలు కొన్ని చెబుతారా?

జయచంద్ సాండ్: బాబాతో మా కుటుంబానికి గల అనుభవాలు ఎన్నని చెప్పగలము! మా తాతగారైన చంద్రభాన్‌సేఠ్‌గారికి మూడు వివాహాలు అయ్యాయి. ఆయన ముగ్గురు భార్యలకు చాలామంది పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ తర్వాత మా తాతగారికి మా నాన్నగారు 21వ బిడ్డగా పుట్టారు. చంద్రభాన్‌సేఠ్‌కి పిల్లవాడు పుట్టాడని కబురు అందడంతో బాబా ఇక్కడికి వచ్చారు. వచ్చి నేరుగా పిల్లవాడిని తన చేతిలోకి తీసుకుని "ఈ బిడ్డ నా ప్రసాదం" అని అన్నారు. తర్వాత ఆ బిడ్డకు ఏ అనారోగ్యం కలుగలేదు. ఆ విధంగా మా వంశం బాబా దయవలనే నిలబడింది. ఈరోజుకి కూడా బాబా దయ మా మీద అపారంగా వర్షిస్తూనే ఉంది. బాబా ఒకసారి కుశాల్‌చంద్‌తో, "చూడు కుశాల్, నేను పోయిన తరువాత ప్రజలు నా ఎముకలను పూజిస్తారు" అని అన్నారు. ఆ మాటే నిజమైంది.
చంద్రభాన్‌సేఠ్‌
సురేందర్ సాండ్: బాబా ఇక్కడకు వచ్చే రోజుల్లో ఊరి పొలిమేరవరకు మాకు తోటలు ఉండేవి. తరువాత కొన్నాళ్లకు నీటి సదుపాయం లేకపోవడంతో ఆ తోటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. 1990 వరకు కూడా నీరు లేకపోవడంతో అక్కడ ఏ తోటలు లేవు. 90లో మేము బోరు వేయించాలని అనుకొని బోర్ వేయడం ప్రారంభించాము. పని ఉదయం మొదలుపెడితే సాయంత్రంవరకు నీళ్లు పడలేదు. నేను సాయంత్రం శిరిడీ వెళ్లి సమాధి మందిరంలో దర్శనం చేసుకుని, "బాబా! బోరింగ్ లో  నీళ్లు పడి, నువ్వు వచ్చేటప్పుడు తోటలు ఎలా ఉండేవో ఇప్పుడు పచ్చగా, అలాగే ఉండేలా చేయి" అని ప్రార్థించాను. అంతే ఐదు నిమిషాలలో బోరింగ్ లో మంచినీళ్ళు పడ్డాయి. దానితో తోటలు బాగా వృద్ధి చెందాయి. అంతా బాబా దయ!

సాయిపథం: బాబా అందరి దగ్గర దక్షిణ అడిగి తీసుకునేవారు కదా! అలాగే మీ తాతగారు కూడా బాబాకు దక్షిణ ఇచ్చేవారా ?

జయచంద్ సాండ్: కుశాల్‌చంద్ శిరిడీకి వెళ్లినప్పుడు ఏమైనా ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం, "గురువు ఇంటికి వచ్చారు ఖాళీ చేతులతో ఊరకే పంపకూడదు" అని ఏదయినా ఇచ్చేవారు. అంతేకాదు, బాబా ఎవరైనా సహాయం చేయమంటే వారికి కుశాల్‌చంద్ సహాయం చేసేవారు. అంతేగానీ‌, బాబా మాత్రం ఎప్పుడూ తనకోసమంటూ ఏమీ తీసుకోలేదని మా పెద్దవారు చెప్పేవారు.

సాయిపథం: బాబా ఇక్కడకు వచ్చినప్పుడు ఏం ఏర్పాట్లు చేసేవారు? ఊరిలో అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారా? బాబా వస్తున్నట్లు మీకు ముందుగానే కబురు వచ్చేదా?

జయచంద్ సాండ్: బాబా వస్తున్నప్పుడు ఊరి పొలిమేరల దగ్గర ఉన్న మా తోటల వద్దకు రాగానే, అక్కడ పనిచేసే లక్ష్మణ్ ఉరఫ్ "లక్ష" అనే బ్రాహ్మణ కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి "బాబా వస్తున్నారు, బాబా వస్తున్నార"ని చెప్పేవాడు. వెంటనే కుశాల్‌చంద్ మేళతాళాలతో ఎదురెళ్లి బాబాకు స్వాగతం చెప్పి ఇంటికి తీసుకు వచ్చేవారు. బాబాతో పాటుగా కొందరు భక్తులు వచ్చేవారు. బాబా మా ఇంటికి తప్ప ఇంకెవరి  ఇంటిలో అడుగు పెట్టలేదు. ప్రజలలో మా కుటుంబం పట్ల ఎంతో భయభక్తులు ఉండేవి. అందువలన ఎవరూ ధైర్యంగా మా ఇంటికి వచ్చేవారు కాదు. బాబా తన వెంట వచ్చిన భక్తులతో మరియు మా కుటుంబసభ్యులతో కొంతసమయం గడిపి వెళ్లేవారు. బాబా మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు సేవ చేసుకున్న లక్ష అనే కుర్రవాడే తర్వాత కాలంలో బల్సాద్ ప్రాంతంలో 'లక్ష్మీబాబా'గా ప్రసిద్ధుడయ్యాడు.

సాయిపథం: బాబా మహాసమాధి చెందినప్పుడు బాబాను కబరిస్తాన్(స్మశానం)లో సమాధి చేయాలని వాదించిన వారిలో కుశాల్‌చంద్ కూడా ఉన్నారని సచ్చరిత్రలో వ్రాసి ఉంది. అది నిజమేనా?

జయచంద్ సాండ్: దాని గురించి మాకు తెలియదు. బాబా మహాసమాధి చెందిన తర్వాత ఉపాసనీబాబా మా తోటలో ఒకసారి నామసప్తాహం నిర్వహించారు. అప్పట్లో ఆయన మా తోటలోనే ఉండేవారు. దానికి కావలసిన ఏర్పాట్లు మా సోదరుడు దౌలత్‌రామ్ చేసాడు. తరువాత బాబా మహాసమాధి చెందిన సరిగ్గా నెల రోజులకు 1918 నవంబర్ 15వ తారీఖున శ్రీ కుశాల్‌చంద్ దివంగతులయ్యారు.

సోర్స్: సాయిపథం, ప్రథమ సంపుటము, 2001.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo