1. శ్రీసాయి సంరక్షణ
2. బాబా స్మరణతో వ్రాసిన పరీక్షలు - అందరికంటే ఎక్కువ మార్కులు
3. బాబా దయతో రెండురోజుల బాధ నుండి ఉపశమనం
శ్రీసాయి సంరక్షణ
సాయిభక్తులకు నమస్కారాలు. సద్గురు సాయినాథుని కృప అందరిమీదా వర్షించాలని మనసారా కోరుకుంటున్నాను. బాబా మనకు ప్రసాదించే అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించిన బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు గంగాభవాని. మాది విశాఖపట్నం. నేను మొదటినుంచి సాయిభక్తురాలిని. ప్రతిక్షణం బాబాతో నాకు ఎన్నో జ్ఞాపకాలు. బాబాతో మాట్లాడుతూ ఉంటే కాలం తెలియదు. ఆయనతో ప్రయాణం ఒక మధురానుభూతి. అమ్మ అయినా క్షణం ఆలస్యం చేస్తుందేమోగాని, మన సాయి మాత్రం తలచిన వెంటనే తమ బిడ్డల దగ్గర వాలిపోతారు. అంతటి కరుణ, ప్రేమ వారి సొంతం. ఆయన తప్ప ఇంకెవరూ అంతటి ప్రేమను చూపరు. ఇకపోతే, నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇకముందు కూడా పంచుకుంటూ ఉంటాను. ఇప్పుడు మాత్రం రెండు అనుభవాలను పంచుకుంటున్నాను.
2022, జులై 4న మా బాబు గ్రౌండులో కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. కాలు విపరీతంగా వాచిపోయి నొప్పితో చాలా బాధపడ్డాడు. డాక్టరుకి చూపిస్తే, "రేపు పొద్దున ఎక్స్-రే తీయించాలి. అప్పటివరకు ఏమీ చెప్పలేము" అని మందులిచ్చి పంపేశారు. ఆ రాత్రి బాబు విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. నాకు దిక్కుతోచక బాబుకి బాబా ఊదీ రాసి, "బాబు కాలికి ఏమీకాకుండా చూడు సాయీ" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. సాయి కరుణ అపారం, అనంతం. డాక్టరు పొద్దున ఎక్స్-రే తీసి, "కాలికి ఏమీ కాలేద"ని చెప్పి, బ్యాండేజ్ వేసి పంపారు. అప్పటివరకు మాకు నిద్రలేదు. బాబా దయవలన నేను రోజూ ఇలాంటి గండాలు అనేకం దాటుతాను. అడుగడుగునా బాబా నాకు చేయూతనిచ్చి నడిపిస్తూ ఉంటారు. నాకు అమ్మ, నాన్న అన్నీ బాబానే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. నేను కూడా అదే కోరుకుని బాబాకి ఎన్నో ప్రార్థనలు చేశాను. సాయి దివ్యపూజ చేసాను. ఫలితంగా బాబా మాకు దారి చూపించారు. ఆయన ఆశీస్సులతో ఈమధ్యే మేము గృహనిర్మాణం మొదలుపెట్టాము. 2022, జులై 6న శ్లాబ్ వేయడానికి ముహూర్తం నిర్ణయించాము. కానీ డబ్బు సర్దుబాటు కాకపోవడం వలన ఆరోజు శ్లాబ్ వేయలేకపోయాము. నాకు చాలా బాధేసింది. కానీ బాబా ఏమి చేసినా దాని వెనుక ఒక మంచి దాగివుంటుందని నమ్మకంతో బాబాని ఒక్కమాట కూడా అడగలేదు. మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే, ఆ తండ్రి ఎల్లవేళలా నన్ను కాపాడుతూనే ఉంటారు. ఆయన దయవల్ల 2022, జులై 11, సోమవారం నాటికి రావాల్సిన డబ్బులు చేతికి అందాయి. కానీ అనుకోకుండా వర్షాలు బాగా ఎక్కువయ్యాయి. వర్షం అస్సలు ఆగడం లేదు. అందరూ ఈ వర్షాలలో శ్లాబ్ వద్దని అధైర్యపరిచారు. అట్టి స్థితిలో నేను, 'శ్లాబ్ వెయ్యాలా, వద్దా' అని ఒకటే బెంగతో బాబా దగ్గర దీపం పెట్టి, బాబా వైపు చూస్తే నాకెందుకో ధైర్యంగా అనిపించింది. దాంతో, 'ఏదయితే అది అయింది, బాబా ఉన్నారు' అని శ్లాబ్ వేయడానికి నిశ్చయించుకున్నాము. మాకు బాబా ఆశీస్సులు ఉన్నాయనడానికి నిదర్శనంగా సాయిభక్తులకు పండుగరోజు, బాబాకు ఎంతో ఇష్టమైనరోజైన గురుపూర్ణిమనాడు మా ఇంటి శ్లాబ్ నిర్విఘ్నంగా పూర్తయింది. ఆరోజు పని మొదలుపెట్టడానికి కొబ్బరికాయ కొట్టినంతనే ఒక ఆవు అక్కడికి వచ్చి శ్లాబ్ పూర్తయ్యేవరకు అక్కడే పడుకుంది. నేను అన్నం పెడితే తిని, ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా సాయంత్రం వరకు అక్కడే ఉంది. బాబానే ఆ ఆవు రూపంలో 'నేనున్నాను, మీకేం భయం లేదమ్మా' అన్నట్లు దగ్గరుండి శ్లాబ్ పని పూర్తిచేయించారు. ఆయన దయవల్ల ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదు. వాతావరణం చల్లగా ఉండటం వలన పనివాళ్ళు కూడా అనుకున్న సమయానికంటే ముందే పని పూర్తిచేశారు. "బాబా! నేను నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోను తండ్రీ? నా తల్లిదండ్రులు కూడా ఆలోచించనంతగా నువ్వు నాకోసం ఆలోచిస్తూ సదా మమ్మల్ని సంరక్షిస్తున్నావు బాబా. ఇలాగే ఎల్లవేళలా మమ్మల్ని కాపాడు బాబా".
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా స్మరణతో వ్రాసిన పరీక్షలు - అందరికంటే ఎక్కువ మార్కులు
ఓం శ్రీసాయినాథాయ నమః !!!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
ముందుగా సాయిబంధువులకు నా నమస్కారం. నేను సాయిభక్తురాలిని. మేము హైదరాబాదులో ఉంటాము. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి ఇంటర్ పూర్తిచేశాడు. చిన్నబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. పెద్దబ్బాయి చాలా చురుకుగా ఉంటాడు. చదువులోగానీ, ఆటల్లోగానీ తనే ముందుంటాడు. అయితే కరోనా కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ఒక నెల ముందే పరీక్షలు ఉంటాయని తెలిసి తను చాలా భయపడ్డాడు. ఆ భయంతోనే పరీక్షలు వ్రాశాడు. ఆ పరీక్షల ఫలితాలలో మా బాబుకి తన తోటి పిల్లలకన్నా తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో బాబు చాలా బాధపడ్డాడు. మేము తనకి చాలా సర్దిచెప్పాల్సి వచ్చింది. తర్వాత కాలం గడిచేకొద్దీ రెండవ సంవత్సరం పరీక్షలు రానే వచ్చాయి. అప్పుడు కూడా తను చాలా భయపడుతుంటే, నేను తనతో, "చూడమ్మా! మనల్ని ఎప్పుడూ ఆ బాబానే కాపాడారు, కాపాడుతున్నారు. ఆయనపై నమ్మకముంచి, ఆయన్ని తలచుకుని పరీక్ష రాయడం మొదలుపెట్టు. అంతా మంచిగా ఉంటుంది" అని ధైర్యం చెప్పాను. తను నేను చెప్పినట్లే చేస్తూ, ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరం బెటర్‌మెంట్ పరీక్షలు కూడా వ్రాశాడు. ఆశ్చర్యం! బాబుకి తన తోటి విద్యార్థులందరి కంటే ఎక్కువ మార్కులు(97%) వచ్చాయి. బాబా వల్లే ఇది సాధ్యం అయింది. "ధన్యవాదాలు బాబా". ఇలానే బాబా మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతారని కోరుకుంటూ ...
ఇట్లు
బాబా భక్తురాలు
బాబా దయతో రెండురోజుల బాధ నుండి ఉపశమనం
సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను సాయిభక్తుడిని. నేను 2000 సంవత్సరం నుండి బాబాను నమ్ముతున్నాను. ఈమధ్య నేను విపరీతమైన జ్వరం, గొంతునొప్పితో రెండు రోజులు బాధపడ్డాను. అప్పుడు నేను, "బాబా! నాకు నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు నుండి నేను పడుతున్న బాధ నుండి నాకు ఉపశమనం లభించింది. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteSai I love you please be with me always please I love you baba
ReplyDeleteSeat ravali thandri please baba
ReplyDelete