సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1275వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అపారమైన బాబా అనుగ్రహం
2. ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా
3. భక్తుల ప్రేమకోసం తపించే సాయి - వారి బాధను తీర్చకుండా ఉంటారా!

అపారమైన బాబా అనుగ్రహం

ముందుగా సాయి కుటుంబీకులకు నా నమస్కారాలు. నా పేరు కిషోర్. నేనొక ప్రైవేటు కళాశాలలో లెక్చరరుగా పనిచేస్తున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక శనివారంరోజున నేను మా కాలేజీ లైబ్రరీలో చదువుకుని ఇంటికి వచ్చేటప్పుడు నా బ్యాగు మరిచిపోయి వచ్చేశాను. ఆ బ్యాగులో బ్యాంక్ పాస్‌బుక్, చెక్‌బుక్ మరియు ఎంతో కష్టపడి వ్రాసుకున్న నోట్‌బుక్స్ ఉన్నాయి. మరుసటిరోజు ఆదివారం సెలవు కనుక సోమవారం వెళ్లి చూస్తే, నా బ్యాగు కనపడలేదు. లైబ్రరీ యాజమాన్యాన్ని అడిగితే, వాళ్ళు చూడలేదని చెప్పారు. సరేనని, కనీసం ఒక గంటసేపు లైబ్రరీ అంతా నా బ్యాగుకోసం వెతికాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "నా బ్యాగు దొరికేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను దీనంగా వేడుకుని, నిరుత్సాహంతో మా కాలేజీ ఆఫీసుకు వెళ్ళాను. ఆశ్చర్యం! అక్కడ బయట ఉన్న ఒక కుర్చీలో నా బ్యాగు కనబడింది. అది చూసి నా ఆనందానికి మాటల్లేవు. ఇప్పటికీ అది అక్కడికెలా వచ్చిందో నాకు చిక్కువీడని ప్రశ్న. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

నేను మా కాలేజీలో టాప్ సెక్షన్ పిల్లలకు కెమిస్ట్రీ బోధిస్తాను. ఆ సెక్షన్‍లోని విద్యార్థులకి 60కి 60 మార్కులు రాకపోతే దానికి మనల్ని బాధ్యులని చేసి నిలదీస్తారు. నేను ఎంత కష్టపడి విద్యార్థులను చదివించినా నా దురదృష్టంకొద్దీ చెప్పని ప్రశ్న ఒకటి పరీక్షలో వచ్చింది. నేను బాధతో కుమిలిపోతూ, "బాబా! ఏదో ఒక విధంగా మా సెక్షన్లోని కనీసం 10-15 మంది పిల్లలకు 60కి 60 మార్కులు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రాధేయపడ్డాను. బాబా నా మొర ఆలకించి 12 మంది విద్యార్థులకి 60కి 60 మార్కులు వచ్చేలా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

JEE మెయిన్స్‌లో ర్యాంక్ అన్నది మూడు సబ్జెక్టులపై (లెక్కలు, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ) ఆధారపడి ఉంటుంది. అయితే మా కాలేజీలో లెక్కలు, ఫిజిక్స్ చెప్పే మాస్టార్ల టీచింగ్ అనుభవంతో పోలిస్తే నా అనుభవం చాలా చాలా తక్కువ. కనుక నేను రోజూ బాబాను, "మిగతా సబ్జెక్టుల వలె నేను చెప్పే కెమిస్ట్రీలో కూడా విద్యార్థులకి మంచి మార్కులు వచ్చి ఉత్తమ పర్సెంటైల్ రావాలని" కోరుకుంటూ ఉండేవాడిని. అద్భుతం! వెలువడిన ఫలితాల్లో ఓవరాల్ 99.07 పర్సెంటైల్ రాగా, నేను చెప్పిన కెమిస్ట్రీలో 99.9 పర్సెంటైల్ వచ్చింది. నా ఆనందానికి హద్దులు లేవు. అలాగే EAPCETలో కూడా కెమిస్ట్రీలో మంచి మార్కులు వచ్చాయి. మా కాలేజీవాళ్ళు నన్ను ఒక గొప్పవాడిలా చూస్తూ ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. నా జీతం పెంచుతానని వాగ్దానం కూడా చేశారు. ఇదంతా అపారమైన బాబా అనుగ్రహం. "ధన్యవాదాలు బాబా. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం తండ్రీ?".

ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా

సాయిభక్తులందరికీ నా నమస్సులు. నా పేరు ధనలక్ష్మి. మాది హైదరాబాద్. బాబా అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుమునుపు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా అక్క కూతురు జర్మనీలో ఉంటుంది. తను మూడు సంవత్సరాల క్రితం జర్మనీ వెళ్ళేటప్పుడు తన బంగారమంతా బ్యాంకు లాకరులో పెట్టి వెళ్ళింది. దాని తాళంచెవిని తను ఇండియాలోనే వదిలేసి వెళ్ళింది. అయితే సంవత్సరం తర్వాత వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు లాకర్ ఓపెన్ చేద్దామని చూస్తే, దాని తాళంచెవి ఎక్కడా కనిపించలేదు. దాంతో సరేనని సెలవులు అయిపోయాక జర్మనీకి తిరిగి వెళ్లిపోయారు. 2022, జూన్ 9న మా చిన్నక్క కూతురు పెళ్లి ఉంటే, ఆ పెళ్లికని పెద్దక్క కూతురు జూన్ 4న జర్మనీ నుండి వచ్చింది. అప్పుడు తను బ్యాంకుకి వెళ్లి, "లాకర్ తాళంచెవి కనిపించడం లేదు" అని చెపితే, బ్యాంకువాళ్ళు, "పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, FIR ఫైల్ చేయాల"ని చెప్పారు. తను నాతో ఆ విషయం చెప్తే నేను, "బాబా! లాకర్ తాళంచెవి దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని మా అక్కకూతురితో ఈ బ్లాగు గురించి చెప్పాను. తరువాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఆ ప్రాసెస్ పూర్తికావడానికి నెలరోజుల సమయం పడుతుందని అన్నారు. అయితే అక్కకూతురువాళ్ళు 2022, జూన్ 19న తిరిగి జర్మనీకి వెళ్ళిపోవాల్సి ఉంది. అందువలన నేను, "బాబా! లాకర్ తాళంచెవి దొరకడం లేదు. పోలీస్ కంప్లైంట్, నెలరోజుల గడువు వంటివేమీ లేకుండా ఏదైనా సులభ మార్గం చూపించు తండ్రీ" అని వేడుకున్నాను. 2022, జూన్ 13న మళ్ళీ బ్యాంకుకి వెళ్లి అడిగితే, "పోలీస్ కంప్లైంట్ అవసరం లేదు, ఎల్లుండి రండి, ఓపెన్ చేద్దాం" అని బ్యాంకు మేనేజర్ చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే మా అక్కకూతురు నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ రెండురోజుల తర్వాత బ్యాంకుకి వెళితే, "లాకర్ ఓపెన్ చేసేవాళ్ళు రాలేదు, రేపు రండి" అని అన్నారు. నేను, "అయ్యో బాబా, ఏంటి ఇలా చేశావు తండ్రీ?" అని అనుకున్నాను. కానీ మరుసటిరోజు బ్యాంకుకి వెళ్తే, లాకర్ ఓపెన్ చేశారు. మా సమస్య తీరి, ఎంతో సంతోషంగా అనిపించింది. బాబా ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారు. బాబా అనుగ్రహంతో మా ఇంటిల్లిపాది ఆనందంలో మునిగిపోయాము. మా కుటుంబమంతా బాబా భక్తులమే. నేను ఏ చిన్న విషయానికైనా 'బాబా నీవే దిక్కు' అనుకుంటాను. బాబా వెంటనే నాకు దారిచూపిస్తారు. మరో అనుగ్రహాన్ని మీతో పంచుకోవాలని బాబాని కోరుకుంటూ ఈ అవకాశమిచ్చిన సాయినాథునికి నా శతకోటి వందనాలు.

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

భక్తుల ప్రేమకోసం తపించే సాయి - వారి బాధను తీర్చకుండా ఉంటారా!

సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నాకు గురువు, దైవం అన్నీ సాయే. ఆ తండ్రి నాపై చూపుతున్న అనుగ్రహానికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియదు. అందుకే ఇలా బాబాకి నమస్కరిస్తూ నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2022, మే నెలలో నాకు నెలసరి రాలేదు. చాలా ఆలస్యంగా, 40 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఆ తరువాత 2 రోజులకి నెలసరి వచ్చింది. అలా జూన్‍లో వచ్చిన నెలసరి దగ్గర దగ్గర 20 రోజుల వరకు కనపడుతూనే ఉంది. ఆ సమయంలో నేను సాయిపై భారం వేసి రోజూ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగుతుండేదాన్ని. కానీ ఇంట్లో దేవుడికి పూజ చాలా రోజులు చేయలేకపోయాను. నిజానికి నేను, నా భర్త ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి, బాబా సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది ఈ సమస్యతో నేను నా సాయికి దూరం అయ్యాను. అసలు నాకు ఏమి జరుగుతోందో తెలియక, "నాకు ఏమిటి ఈ పరీక్ష సాయీ?" అని బాధపడేదాన్ని. చివరికి భరించలేక ఒక శుక్రవారంనాడు నేను సాయిని ఒకటే అడిగాను: "నేను శనివారం మీ ముందు దీపం పెట్టాలి, పూజ చేయాలి. నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని. భక్తుల ప్రేమకోసం తపించిపోయే నా సాయి శనివారంనాడు నా పూజ అందుకున్నారు. శ్రద్ధ, సబూరీలతో ఉంటే అంతా బాబా చూసుకుంటారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. ఎల్లవేళలా మీకు ఋణపడి ఉంటాను".

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. సమర్ధ sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo