సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1277వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమస్య వచ్చినా తండ్రిలా ఆదుకునే బాబా
2. స్మరణతో లభించిన బాబా అనుగ్రహం
3. వర్షం పడకుండా అనుగ్రహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా

ఏ సమస్య వచ్చినా తండ్రిలా ఆదుకునే బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. మన నిత్య జీవితంలో ప్రతిక్షణం బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తుంటారు. ఆయన దయవల్ల నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా బాబు ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉండటానికి వెళ్ళాడు. తను అక్కడ ఒక హోటల్ రూమ్‍లో ఉండి రూమ్ కోసం చాలా చోట్ల వెతికాడు. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కానీ, రూమ్ దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! పిల్లాడికి అక్కడ ఒక రూమ్ దొరికేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం 5 గంటలకు బాబు ఫోన్ చేసి, "అమ్మా! రూమ్ దొరికింది" అని చెప్పాడు. నాకు చాలా షంతోషంగా అనిపించింది. వేడుకున్నంతనే కరుణ చూపిస్తారు బాబా.


ఉగాది ముందురోజు నా కడుపులో కుడివైపు నొప్పి వచ్చింది. నేను ఆ నొప్పిని భరించలేక "తట్టుకోలేకపోతున్నాను బాబా" అని బాబాతో చెప్పుకుని, ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి నొప్పి తగ్గింది.


మా తమ్ముడు ఒక పని విషయంగా ఒక రేకుల షెడ్ ఎక్కాడు. అప్పుడు రేకు పగిలిపోయి తను 25 అడుగుల ఎత్తు నుండి కిందకి పడిపోయాడు. మాకు చాలా భయమేసింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే, మా తమ్ముడు నాన్నలాగా మాకు ఎంతో సహాయంగా ఉంటాడు. వాడికేదన్నా అయితే మేము అస్సలు తట్టుకోలేము. అయితే తమ్ముడు చిన్నదెబ్బలతో ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. తరువాత, "అమ్మా! నువ్వెందుకు దిగులుపడుతున్నావు? నీకు ప్రియమైనవారు, నాకూ ప్రియమైనవారే కదా!" అని బాబా మెసేజ్ వచ్చింది. అప్పుడు, 'అంత ఎత్తునుండి పడిపోయినా తమ్ముడిని బాబానే  కాపాడార'ని నాకు అర్థమైంది.


మా అన్నయ్య (పెదనాన్న కొడుకు) బాగా త్రాగుతాడు. ఒకసారి తన ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసారు. డాక్టర్లు, "లివర్ పాడైంది. త్రాగుడు మానేయాల"ని చెప్పారు. అతను కొన్నాళ్ళు త్రాగుడు మానేసి మళ్ళీ ఈమధ్య త్రాగుతున్నాడని నాకు తెలిసింది. అతని భార్య చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. నేను చాలా భయపడి, "బాబా! వాడు త్రాగకుండా చేయండి. వాడికి ఏదన్నా జరిగితే పిల్లలిద్దరూ అన్యాయం అయిపోతారు. వాడు త్రాగడం మానేశాడని తెలిస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. తరువాత అతను తాగుతున్నాడో లేదో తెలుసుకుందామని భయంభయంగా ఫోన్ చేస్తే, తాగట్లేదని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నాకు ఏ సమస్య వచ్చినా తండ్రిలా బాబా ఆదుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు. ఏమైనా తప్పులుంటే క్షమించండి బాబా. ఎల్లవేళలా మాకు తోడుగా ఉండి మమ్మల్ని, మా పిల్లల్ని సన్మార్గంలో నడిపించండి బాబా. నా పిల్లల భారం మీకే అప్పగించాను. వాళ్ళ విషయంలో మేలు చేయండి తండ్రి. నా మనస్సులో ఒక కోరిక ఉంది. దాన్ని మీరే నెరవేర్చగలరు తండ్రి. అది జరిగాక నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


స్మరణతో లభించిన బాబా అనుగ్రహం


సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈ మధ్య డిగ్రీ పరీక్షలు వ్రాసాను. ఫలితాలు వెలువడ్డాక చూసుకుంటే, నేను కొన్ని సబ్జెక్టులలో పాసయ్యాను. ఇంకొన్ని సబ్జెక్టులలో ఫెయిల్  అయ్యాను. దాంతో నేను చాలా బాధపడుతుంటే నా స్నేహితురాలు ఫోన్ చేసి, "బాధపడకు, ఒక అవకాశం ఉంది. రీవాల్యూయేషన్కి అప్లై చేయి. తప్పకుండా పాసవుతావు" అని చెప్పింది. మళ్లీ ఒక వారం తరువాత తనే నాకు ఫోన్ చేసి, "రీవాల్యూయేషన్కి అప్లై చేయాల్సిన తేదీ వెల్లడించారు. నువ్వు నీ ఆధార్ కార్డు తీసుకుని కాలేజీకి వెళ్లి, ఫీజు కట్టు" అని చెప్పింది. అయితే నేను నా ఆధార్ కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలాసేపు వెతికినా దొరకలేదు. సరేనని కాలేజీకి వెళ్ళొచ్చాను. ఇంటికి వచ్చాక సాయికి నమస్కారం చేసుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని అనుకుంటూ పొద్దున్న ఎక్కడైతే వెతికానో అదే చోట మళ్లీ వెతికాను. ఆశ్చర్యం! నా ఆధార్ కార్డు దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ దయతో నేను డిగ్రీ అన్ని సబ్జెక్టులు పాసయ్యేలా  అనుగ్రహించండి బాబా. నేను గనక పాస్ అయితే, నా అనుభవాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను బాబా".


మా నాన్నగారు సౌదీలో ఉంటున్నారు. ఒకరోజు ఆయన ఫోన్‍లో నాతో, "కొన్నిరోజులుగా నా కళ్ళు విపరీతంగా మండుతున్నాయ"ని చెప్పారు. నేను బాబా ఫోటో ముందు కూర్చుని, సచ్చరిత్రలోని ఊదీ కథలు చదివి, ఆపై ఊదీని నా చేతిలోకి తీసుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించి నాన్నకి బదులు నేనే ఆ ఊదీని నా నుదుటన ధరించి, మరికొంత ఊదీని నోట్లో వేసుకున్నాను. అలా ఒక రెండు రోజులు చేశాక నాన్న ఫోన్ చేసి, "నా కంటి సమస్య తగ్గింది" అని చెప్పారు. నేను సంతోషంగా బాబా దగ్గరకి వెళ్లి మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను. చెప్పుకున్నంతనే ప్రతి విషయంలో బాబా నా కుటుంబాన్ని కాపాడుతున్నారు. "థాంక్యూ సో మచ్ సాయిబాబా. ఇలాగే నా అరికాలి మంటలు తగ్గేలా అనుగ్రహించండి బాబా".


వర్షం పడకుండా అనుగ్రహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా నా తండ్రి సాయినాథునికి కోటి కోటి ప్రణామాలు. సాయి కుటుంబసభ్యులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు అమరనాథ్. ఆ సాయినాథునితో అనుబంధం మరియు ఆయన లీలలకు సంబంధించి నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఆశీర్వాదంతో మరో అనుభవం పంచుకుంటున్నాను. నేను మా అబ్బాయికి వీసా వచ్చి, అన్నీ సక్రమంగా జరగాలని మా గ్రామదేవత 'రెడ్డి పేరంటాలమ్మ'కు కుంకుమ బండి కట్టి పూజ చేసుకుంటానని, అలాగే భోజనాలు పెడతానని అమ్మని వేడుకున్నాను. మేము కోరుకున్నట్లే బాబుకి వీసా రావడంతో జులై 21వ తారీఖున మేము మా కుటుంబసమేతంగా హైదరాబాద్ నుండి మా స్వగ్రామమైన సాలూరు వెళ్ళాము. అక్కడ ఎడతెరిపి లేకుండా పగలు, రాత్రి ఒకటే వర్షం కురుస్తుంది. మేము ఇంత వర్షంలో 24వ తేదీన చేయాల్సిన పూజ కార్యక్రమానికి, భోజనాలకి కావాల్సిన సరంజామా అంతా ఎలా తెచ్చుకోవాలని చాలా టెన్షన్ పడ్డాము. ఏ కష్టం వచ్చినా మనకి మొదట గుర్తుకు వచ్చేది బాబాయే కనుక నేను బాబాతో నా కష్టం చెప్పుకుని, "జులై 23 నుండి 24 రాత్రి భోజనాలు అయ్యేవరకు వర్షం పడకుండా చూడండి తండ్రి" అని వేడుకున్నాను. బాబా ఎంతో దయ చూపారు. ఆ రెండు రోజులు వర్షం కురవనేలేదు. చాలా ఆనందంగా పూజ మరియు భోజన కార్యక్రమాలు జరిగాయి. అందులో నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులందరూ చాలా సంతోషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాబా దయవల్లనే అంతా సక్రమంగా జరిగింది. "బాబా! మా అబ్బాయి అమెరికా వెళుతున్నాడు. మీరు ఎల్లప్పుడూ తన వెంటే ఉండి తనని జాగ్రత్తగా కాపాడండి తండ్రి. ఇంకా లోన్ శాంక్షన్ కాలేదు బాబా. అది కూడా ఏర్పాటు చేయండి తండ్రి. రాజాధిరాజు, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడవైన మీ పాదపద్మములకు శతకోటిప్రణామాలతో.. మీ పుత్రుడు అమర్నాథ్".


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Baba na manasu lo korika thirachnadi please

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo