సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 640వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఇచ్చిన బహుమతి 
  2. పిలిచినంతనే నా బిడ్డను నిద్రపుచ్చారు బాబా
  3. బాబా చూపిన కరుణ

బాబా ఇచ్చిన బహుమతి 


సాయిభక్తుడు రమేష్‌బాబు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


మనం నడిచే సాయి మార్గంలో ఎటువంటి విఘ్నములూ కలుగకుండా చూడమని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ, మన సద్గురు సాయినాథుని స్మరించే శక్తిని ఇవ్వమని సరస్వతీమాతను వేడుకొంటూ, మా ఇలవేల్పు అయిన లక్ష్మీనరసింహస్వామికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేని ప్రేమను చూపించే మన సద్గురువు సాయికి శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఈ జన్మలో నాకు సాయిని పరిచయం చేసిన మా గురువుగారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ... 2018వ సంవత్సరంలో నేను ఎప్పటికీ మరచిపోలేని విధంగా సాయి నాకు ప్రసాదించిన లీలను మీతో పంచుకుంటున్నాను.


ఈ కలియుగంలో అవతరించిన పిలిస్తే పలికే దైవం మన సద్గురు సాయినాథుడు నేటికీ ఎంతోమందికి ఎన్నో లీలలను చూపిస్తున్నారు. 2009వ సంవత్సరంలో సాయి ఆదేశం మేరకు సాయిసచ్చరిత్ర 1,008 సప్తాహాలు పారాయణ చేయాలని మా గురువుగారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నన్ను ఆదేశించారు. సాయి ఆదేశానుసారం పారాయణలు ప్రారంభించాను. ఇటీవల 2020, అక్టోబరు ఒకటవ తారీఖున 400వ పారాయణ నాచే ప్రారంభింపజేసిన సాయినాథునికి శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను.


2018, అక్టోబరు 25, గురువారంరోజు ఉదయం సాయినాథుడు నాకు ధ్యానంలో దర్శనమిచ్చి, “ఈరోజు నీకు ఒక బహుమతి ఉంది” అని తెలియజేశారు. “ఈ దీనునికి ఏం బహుమతి ఇస్తారు సాయీ?” అని అడిగాను. అందుకు బాబా, “లేదు, నీకు ఈరోజు ఒక బహుమతి ఉంది” అన్నారు. అదేరోజు మధ్యాహ్నం నాకు తెలిసిన ఒక సాయిభక్తుడు (వెంకటేష్ గారు) ఫోన్ చేసి, “మీరేమైనా ఈ నెలలో శిరిడీ వెళ్తున్నారా?” అని అడిగారు. “ఒక వారంరోజులలో వెళ్తున్నాన”ని చెప్పాను నేను. అప్పుడాయన, “సాయికి కొంత డబ్బు ముడుపుగా తీసివుంచాను, ఆయనకు చేర్చండి” అని అడిగారు. ఆ ముడుపును ఆరోజు సాయంత్రం బాబా ఆలయ అర్చకుడైన ఆచార్యకు అందచేయమని ఆయనతో చెప్పాను. 


తరువాత నేను (బాబా ఆదేశానుసారం) ఆలయ అర్చకుడు ఆచార్యకు ఫోన్ చేసి, “ఈరోజు శేజ్ ఆరతి తరువాత ఆ భక్తుడు ఇచ్చిన ముడుపును (సీల్డ్ కవర్) బాబా ధరించిన వస్త్రం లోపల బాబా ఒడిలో ఉండేలా పెట్టమ”ని చెప్పాను. అతను అలానే శేజ్ ఆరతి అనంతరం బయటికి కనిపించకుండా ఆ కవరుని బాబా ఒడిలో ఉంచి గుడికి తాళం వేసి వెళ్ళాడు. మరుసటిరోజు ఉదయం అతనే వచ్చి గుడి తాళం తీసి బాబా ఒడిలో వున్న పేపరు తీసి చూస్తే, ఆశ్చర్యం! ఆ ముడుపులో ఆ సాయిభక్తుడు ఉంచిన డబ్బులతో పాటు ఒక విదేశీనాణెం మరియు అప్పుడే ధునినుంచి తీసినట్టుగా వెచ్చగా ఉన్న బాబా ఊదీ (శిరిడీలోని ధుని ఊదీ) ఉన్నాయి. ఈ బాబా లీలను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇంతటి కరుణ చూపించిన సాయినాథుని ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మరుసటిరోజు ధ్యానంలో, “ఆ బహుమతికి కారణమేమిటి సాయీ?” అని సాయిని అడిగాను. “నీకు 1008 పారాయణలు చేయమని చెప్పాను కదా! 500 పారాయణల వరకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా నా ఆశీస్సులను ఈ రూపంలో ఇచ్చాను” అని సాయి తెలియజేశారు. ఎంతో ఆనందంగా సాయికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సాయి ఇంకా ఎన్నో అనుభవాలను నాకు ప్రసాదించారు. త్వరలోనే మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.





బాబా చూపిన కరుణ


సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


2020, డిసెంబరు 7న నేను మావారి తెలుపురంగు టీ-షర్టులన్నీ వాషింగ్ మెషీన్లో వేసి ఆన్ చేశాను. కాసేపటి తరువాత బట్టలు ఆరేద్దామని తీసేసరికి తెలుపురంగు టీ-షర్టులన్నీ కాస్త పచ్చరంగులో ఉన్నాయి. వాటిని అలా చూసేసరికి నాకు చాలా భయమేసింది. ఎందుకలా జరిగిందా అని చూస్తే, వాటి మధ్యలో నా పచ్చరంగు చున్నీ ఒకటి ఉంది. దాన్ని నేను చూసుకోకుండా మెషీన్ ఆన్ చేసినందువల్ల చున్నీ తాలూకు పచ్చరంగు అంటుకొని టీ-షర్టులన్నీ అలా అయిపోయాయి. ఈ విషయం మావారికి చెప్తే ఏమంటారో ఏమిటోనని, మనసులోనే బాబాను తలచుకొని, "బాబా! ఈ బట్టలను మళ్ళీ వాషింగ్ మెషీన్లో వేస్తాను. వాటికి అంటుకున్న రంగు పోయేలా మీరే చేయాలి బాబా. టీ-షర్టులన్నీ మునుపటిలా తెల్లగా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకొని వాషింగ్ మెషీన్ ఆన్ చేసి గంట టైం పెట్టాను. గంట తర్వాత చూస్తే, టీ-షర్టులన్నీ మునుపటిలా తెల్లగా ఉన్నాయి. అది చూసి ఆనందంగా, "మేరే బాబా! మీరు చూపిస్తున్న కరుణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి" అని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


పిలిచినంతనే నా బిడ్డను నిద్రపుచ్చారు బాబా

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్. శిరిడీ సాయి మిలియన్ భక్తులలో నేను ఒకదాన్ని. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా ప్రతి విషయాన్నీ దానితో ముడిపెడుతూ ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రతి ఒక్కరం భయపడుతున్నాము. "బాబా, మీ బిడ్డలందరినీ ఈ మహమ్మారి నుండి కాపాడండి". నా కూతురి వయస్సు 22 నెలలు. ఒకరోజు రాత్రి తను హఠాత్తుగా నిద్రలేచి ఏడవటం మొదలుపెట్టింది. తనని ఓదార్చడానికి నేను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తను ఆపకుండా ఏడుస్తూనే ఉంది. మొదట్లో నేను టెన్షన్ పడలేదు కాని, తనకి నిద్ర వస్తున్నప్పటికీ నిద్రపోక ఇబ్బంది పడుతుంటే భయపడ్డాను. అలా గంటన్నర సమయం గడిచింది. అయినా తను నిద్రపోలేదు. తన భాద ఏమిటో చెప్పడానికి తను చాలా చిన్నది. ఒక తల్లిగా నేను తన సమస్య ఏమిటో తెలుసుకోవాలి. తనకి ఏమైందో, ఏ బాధ కలిగిందో నాకు అర్థం కాలేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇంకేదైనా కారణమా అన్నది నేను ఏమీ కనుగొనలేకపోయాను. ఇక ఆ స్థితిలో నేను సాయి స్మరణ చేయడం మొదలుపెట్టి, "నా బిడ్డకి సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. అద్భుతం! తరువాత తను హాయిగా నిద్రపోయింది. మళ్ళీ ఉదయానే లేచింది. తను చాలా ఉత్సాహంగా ఉంది. "బాబా! మీ భక్తులకు అండగా ఉంటూ, వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదని తెలియజేస్తున్నందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను".



గురుగోవింద్ & కేశవదత్



గురుగోవింద్ అనే మహాత్ముడు బాబాకు సమకాలీనుడు. అతను మహారాష్ట్రలోని ధూలే సమీపంలోని సోన్‌గిరిలో నివాసముండేవాడు. అతను ప్రాపంచిక బంధాలన్నింటినీ త్యజించిన అవధూత. అతను బాబాను ఎంతోగానో ప్రేమించి, గౌరవించేవాడు. ఒకసారి అతను తన దివ్యజ్ఞానంతో, 'బాబా ఈ భూమిపై తమ అవతారకార్యాన్ని పూర్తిచేశారని, త్వరలోనే ఆయన మహాసమాధి చెందుతార'ని గ్రహించాడు. దాంతో తన ప్రియశిష్యుడైన కేశవదత్ శిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందాలని అతను ఆశించాడు. 

ఇదిలా ఉంటే, బొంబాయిలో ఉన్న కేశవదత్‌కి ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చింది. నిజానికి అతను ఆ సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా అతనికి చెమటలు పట్టి శరీరమంతా తడిసిపోయింది, గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన గురువుకు ఏదో జరిగిందని అతనికి అనిపించింది. వెంటనే కొంతమంది భక్తులతోపాటు అతను సోన్‌గిరి వెళ్ళాడు. నిజంగానే తన గురువుకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లు గుర్తించిన కేశవదత్ సహజంగానే తన గురువు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాడు. అయితే గురుగోవింద్ తన ప్రియశిష్యునితో, "కొద్ది రోజుల్లో మేము కోలుకుంటాము. నువ్వు వెంటనే శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకో" అని చెప్పారు. తరువాత మదన్ పాటిల్ అనే భక్తుడితో, "తమ తరపున బాబాకు ఒక లేఖ వ్రాసి, దానిని కేశవదత్‌ చేతికిచ్చి, బాబాకు అందజేయమని చెప్పమ"ని చెప్పారు. గురువు ఆదేశాన్ని పాటిస్తూ కేశవదత్ వెంటనే శిరిడీకి ప్రయాణమయ్యాడు.
 
కేశవదత్ శిరిడీ చేరుకొని చావడిలో బాబాను దర్శించుకున్నాడు. తన గురువు ఇచ్చిన లేఖను బూటీకిచ్చి బాబాకు ఇవ్వమని కోరాడు. బాబా ఆ లేఖ తీసుకొని గౌరవసూచకంగా తమ నుదుటికి తాకించుకున్నారు. తరువాత కేశవదత్‌ను ప్రేమగా చూస్తూ ఆ లేఖను తమ కళ్ళకు అద్దుకున్నారు. ఆ తరువాత బాబా తదేకంగా కేశవదత్‌ వైపు చూడసాగారు. బాబా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అప్పుడు బాబా రెండు కళ్ళ నుండి దేదీప్యమైన కాంతి వెలువడి కేశవదత్‌ కళ్ళలో నిక్షిప్తమైంది. కేశవదత్‌ శరీరమంతా దైవిక ప్రకంపనలతో నిండిపోగా అతను సమాధిస్థితిలోకి వెళ్లి ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. బాబా అతనికి దృష్టిపాతం చేశారు.

తరువాత కేశవదత్‌ బాబా వద్ద సెలవు తీసుకొని సోన్‌గిరికి తిరిగి వెళ్లి, శిరిడీలో జరిగిందంతా తన గురువుకు వివరంగా చెప్పాడు. తరువాత వచ్చిన విజయదశమినాడు బాబా మహాసమాధి చెందారు. ఆ ముందురోజు గురుగోవింద్, "అయ్యో! ఈ భూమినుండి వెలువడే కాంతి చంద్రునిలో లీనం కాబోతుంది" అని శోకించారు.

 సోర్స్ : శ్రీసాయి సాగర్ పత్రిక 1994 (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి).

సాయిభక్తుల అనుభవమాలిక 639వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. శ్రీసాయి కృపతో తగ్గిన జ్వరం
  2. బాబా దయతో ఫీజు, సర్టిఫికెట్లు వాపసు

శ్రీసాయి కృపతో తగ్గిన జ్వరం


గుంటూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ఈ బ్లాగుని నిరాటంకంగా నడుపుతున్న నిర్వాహకులకు నా నమస్కారములు. సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. శ్రీసాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ, నాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 


2020, నవంబరు నెలలో ఒకసారి నాకు జలుబు, జ్వరం వచ్చాయి. కొన్ని రోజుల తరువాత మా పాపకు కూడా జ్వరం వచ్చింది. ఆ సమయంలో మావారు క్యాంపు పనిమీద హైదరాబాదు వెళ్లివున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కూడా జ్వరం వచ్చింది. ముగ్గురికీ ఒకేసారి జ్వరం రావడంతోనూ, అందులోనూ ఇది కరోనా సమయం కావడంతోనూ మాకు చాలా భయమేసింది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా అందరం బాబా నామస్మరణ చేసుకుంటూ, నుదుటన బాబా ఊదీ పెట్టుకుని, కొద్దిగా ఊదీని మంచినీటిలో కలుపుకుని త్రాగుతూ ఉన్నాము. మా అందరికీ ఎటువంటి సమస్యా లేకుండా ఉంటే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అందరం రక్తపరీక్షలు చేయించుకున్నాము. రిపోర్టులు వచ్చాక మాకెవరికీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిసి మేమంతా ఊపిరి పీల్చుకున్నాము. మావారికి వచ్చిన జ్వరం టైఫాయిడ్ జ్వరమని చెప్పి, టైఫాయిడ్ తగ్గటానికి మందులిచ్చారు. బాబా దయవల్ల కొద్దిరోజులలోనే మావారి టైఫాయిడ్ జ్వరం తగ్గిపోయింది. అంతేకాదు, నాకు, మా పాపకు కూడా ఎటువంటి సమస్యా లేకుండా బాబా కాపాడారు. మా వెంటే ఉండి మమ్మల్నందరినీ కంటికిరెప్పలా కాపాడుతున్న బాబాకు శతకోటి కృతజ్ఞతలు.


మరొక అనుభవం:


మా పాప ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాయడానికి వెళుతూ నాకు ఫోన్ చేసి, తాను పరీక్షలకి సరిగా చదవలేదని చెప్పి ఏడ్చేసింది. తను అలా ఏడ్చేసరికి నాకూ బాధ కలిగి బాబాకు నమస్కరించుకుని, ఎటువంటి సమస్యా లేకుండా పాప చక్కగా పరీక్ష రాసేలా అనుగ్రహించమని విన్నవించున్నాను. పరీక్ష పూర్తయిన తరువాత పాప నాకు ఫోన్ చేసి తాను పరీక్ష బాగా వ్రాశానని సంతోషంగా చెప్పడంతో, బాబానే మా పాపకు తోడుగా ఉండి పరీక్ష బాగా వ్రాయించారని నా మనసుకు అర్థమై ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలానే ప్రతి పరీక్షలోనూ బాబా మా పాపకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను.


ప్రస్తుత సమస్య:


మా కుటుంబం ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నాము. మేము ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. ఇప్పుడు మేము ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామని తెలిసి అందరూ మానుండి దూరంగా, కాదు..కాదు, చాలా దూరంగా ఉంటున్నారు. అంటే, మా చుట్టూ ఉన్నవారందరూ మనిషి మంచితనం కంటే డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయామనే బాధకంటే, అందరు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటా అని మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఎన్నో సమస్యల నుండి మమ్మల్ని కాపాడిన బాబా, మా ఆర్థిక సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము. మా భారమంతా బాబా పాదాలపై వేసి, ప్రతి క్షణం మాతోనే ఉండి మమ్మల్ని నడిపిస్తూ, మా సమస్యలను పరిష్కరించమని సర్వస్య శరణాగతితో వేడుకుంటున్నాము. బాబా దయవల్ల మా సమస్యలు ఎంత త్వరగా తీరితే, అంత త్వరగా మా అనుభవాలను మరలా ఈ బ్లాగులో పంచుకుంటాను.


బాబా దయతో ఫీజు, సర్టిఫికెట్లు వాపసు

 

హైదరాబాద్ నుండి శ్రీమతి ఉష తమకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ఓం శ్రీ సాయినాథాయ నమః


సాయికుటుంబసభ్యులందరికీ నా నమస్కారములు. ‘నేను సాయిభక్తులలో ఒకరిని’ అని చెప్పుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ గ్రూపులో ప్రచురించే శ్రీసాయినాథుని దివ్యచరిత్రను, సాయిభక్తుల అనుభవాలను ప్రతిరోజూ చదవటం నాకు ఎంతో ఇష్టమైన ఒక దినచర్య. ఇప్పటికే నేను రెండుసార్లు బాబా నాపై కురిపించిన దివ్యలీలలను సాటి సాయిభక్తులతో పంచుకోవటం జరిగింది. ఇప్పుడు బాబా దయవలన కలిగిన మరో అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల ప్రవేశ పరీక్షలన్నీ వాయిదాపడటం వల్ల మా పాప భవిష్యత్తు గురించి చాలా ఆందోళనపడ్డాము. 6 నెలల ఆందోళన తరువాత చివరికి అక్టోబరు 1,2 వారాల్లో జరిగిన మొదటి కౌన్సిలింగులో మా పాపకు ఒక కాలేజీలో సీటు రావటం జరిగింది. అది మంచి కాలేజీనే, కానీ మా ఇంటికి 30 కి.మీ. దూరంలో ఉంటుంది. అయినా ఫరవాలేదని ఫీజు కట్టి, సర్టిఫికెట్లన్నీ దాఖలు చేశాము. తర్వాత కొన్ని రోజులకు రెండవ కౌన్సిలింగ్ ద్వారా మా ఇంటికి దగ్గరగా వున్న మరో మంచి కాలేజీలో తనకు సీటు వచ్చింది. దాంతో, వెంటనే మా పాపకు మొదట సీటు కేటాయించిన కాలేజీవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాము. కానీ వాళ్ళు సర్టిఫికెట్లు, ఫీజు తిరిగివ్వటానికి మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. “ఫీజు తిరిగిస్తారో లేదో, సర్టిఫికెట్లు వస్తే చాలు” అనుకుని బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఫీజు మరియు సర్టిఫికెట్లు మా చేతికి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకున్నాను. 2,3 వారాలు ఆందోళనపడినప్పటికీ బాబా దయవలన ఆ కాలేజీవాళ్ళు మా పాప సర్టిఫికెట్లు మరియు ఫీజు కూడా మాకు తిరిగిచ్చారు. ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా సర్టిఫికెట్లు, ఫీజు తిరిగివ్వటం బాబా దయకాక ఇంకోటి ఎంత మాత్రమూ కాదు. “బాబా! మీ దయ, కరుణ ఎల్లపుడూ మా అందరిమీదా ఉండేలా అనుగ్రహించండి”.


ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.



సాయిభక్తుల అనుభవమాలిక 638వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. 'మనకు బాబా ఉన్నారు' 
  2. వర్షాన్ని అపి గమ్యాన్ని చేర్చిన బాబా


'మనకు బాబా ఉన్నారు' 

సాయిమహారాజుకి పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ముందుగా, ఈ అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఈమధ్య మేము ‘బాబా పంపిన పని’ మీద (క్రొత్త ఇల్లు కొనుగోలు చేసే పని) యు.ఎస్.ఏ. లో మేముండే స్టేట్ నుండి వేరే స్టేట్‌కి వెళ్ళవలసి వచ్చింది. ‘బాబా పంపిన పని’ అని ఎందుకన్నానంటే, బాబా ఆజ్ఞ లేకుండా మనం కదలలేము కదా! "అలా అనడం తప్పయితే నన్ను క్షమించండి బాబా". కానీ, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే భయం. పైగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. చివరికి తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్న తరువాత, “బాబా! అంతా మీదే భారం తండ్రీ. మీ దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా పని పూర్తయి, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకుని ప్రయాణమైనాము. వెళ్ళాల్సిన స్టేట్‌కి చేరుకున్నాక, కరోనా కారణంగా హోటల్లో ఉండటం ఇష్టం లేక 5 రోజుల కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాము. అక్కడినుండే క్రొత్త ఇంటిని చూడటానికి వెళ్ళాం. బాబా అనుగ్రహం వల్ల అంతా బాగా జరిగింది. చాలా ఆనందంగా అక్కడ అన్ని చూసుకొని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక కేవలం రెండు రోజులు మాత్రమే పిల్లలకు దూరంగా ఉన్నాము. బాబా దయవల్ల మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవలేదు. బాబా ఉండగా భయమేల? 

మరో అనుభవం:

ఆ స్టేట్‌లో ఇంటిని కొనుగోలు చేసే పనులన్నీ చూసుకుని అక్కడినుంచి బయలుదేరేరోజు మావారు స్నానం చేసి వచ్చి తన మెడలోని బంగారు గొలుసు కనిపించడం లేదని అన్నారు. నేను వెంటనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ప్రయాణానికి సమయం దగ్గరపడుతోంది. త్వరగా గొలుసు కనిపించేలా చేయి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. ఎందుకంటే, ఒకవేళ ఆ ఇంట్లో గొలుసు కనిపించకపోతే అంతకుముందురోజు ఇంటి పనిమీద బయట తిరిగినప్పుడు ఎక్కడో పడిపోయివుండవచ్చు. అదే జరిగితే గొలుసు మాకు దొరికే అవకాశం ఉండదు. అంతేకాదు, ఒకవేళ గొలుసు ఆ ఇంట్లోనే పడిపోయినా, మేము ఆ ఇంటిని వదిలి వచ్చిన తరువాత ఆ ఇంటికి ఎవరు వస్తారో తెలియదు కదా. ఒకప్రక్క ఫ్లైట్ టైం కూడా అయిపోతోంది. అందువల్ల బాబాను తలచుకుంటూ, పరుపు, దుప్పట్లు అన్నీ విదిలించి చూశాము, ఇల్లంతా వెతికాము. గొలుసు కనపడలేదు. అంతా వెతికిన తరువాత హాలులోకి వచ్చి చూస్తే సోఫా ప్రక్కనే గొలుసు కనిపించింది. బాబాను ప్రార్థించిన పది నిమిషాలకే గొలుసు కనపడింది. ఇది బాబా మహిమ కాకపోతే మరేమిటి? బాబా చూపిన లీలకు ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మా కుటుంబంలో ఎవరికి కాస్త నలతగా ఉన్నా, ఆఖరికి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా సరే అందరమూ బాబా ఊదీనే ధరిస్తున్నాము. 2020, మార్చి నెలలో కరోనా వ్యాపించినప్పటినుండి బయటకు వెళ్ళాలంటే ఎంతో భయపడుతున్నాము. తప్పనిసరిగా బయటకు వెళ్ళాలంటే బాబా అనుమతి కోరి వెళ్తున్నాము. “బాబా! నా అనుభవాన్ని పంచుకోవటంలో ఏదైనా మరచిపోతే నన్ను క్షమించండి”. 

కొంతకాలం క్రింతం ఒకతను మాకు కొంత పొలం అమ్మాడు. మేము అతనికి డబ్బంతా ఇచ్చిన తరువాత, “ఇప్పుడు రేట్లు పెరిగాయి, ఆ పొలాన్ని నేను మీకు ఇవ్వను” అని పొలాన్ని మాకు అప్పజెప్పకుండా మమ్మల్ని ఎంతో బాధపెడుతున్నాడు. అతని మనసు మార్చి ఈ సమస్యను పరిష్కరించమని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. బాబా దయవల్ల అతను మాకు పొలాన్ని స్వాధీనం చేస్తే ఆ అనుభవాన్ని కూడా మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. బాబా తలచుకుంటే అతని మనసు మారడం ఎంతసేపు? అందుకే ఇంకా ఆ పొలం మాకు స్వాధీనం కానప్పటికీ ముందుగానే మీతో పంచుకుంటున్నాను. సాటి సాయిబంధువులకు చిన్న మనవి - దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలో మాకోసం బాబాను ప్రార్థించండి. బాబా ఆశీస్సులతో పాటు మీ అందరి దీవెనలు కూడా మాకు కావాలి. 

“బాబా! మేము ఈ నెలలో అమెరికా నుండి ఇండియా రావాలి. ఏ ఇబ్బందీ లేకుండా అందరం ఆనందంగా ఇండియాకు వచ్చేలా అనుగ్రహించండి. మీరు మాకు అండగా ఉండగా మాకు భయం లేదు. కానీ, మానవులం కదా, మమ్మల్ని చల్లగా చూడమని నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాము”. తన పిల్లలు ఏది ఎన్నిసార్లు అడిగినా బాబా చిరునవ్వుతో చూసుకుంటారు. ఏది చెయ్యాలన్నా ‘మనకు బాబా ఉన్నారు, అన్నీ ఆయనే ఒక కుటుంబ పెద్దగా చూస్తార’ని ఆశ. ఇప్పటివరకు అందరూ శ్రద్ధగా నా అనుభవాలను చదివినందుకు మీకు నా ధన్యవాదాలు. 

బాబాకు ప్రేమపూర్వక పాదాభివందనాలతో...


వర్షాన్ని అపి గమ్యాన్ని చేర్చిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు  తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నేను బాబాను నమ్ముకున్న ఒక సాధారణ భక్తురాలిని. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మేము బైక్ మీద కాకినాడ వెళ్తున్నాము. మేము బయలుదేరినప్పుడు వాతావరణం బాగుంది. కానీ బై-పాస్ రోడ్డులోకి వచ్చేసరికి హఠాత్తుగా వర్షం మొదలైంది. అక్కడ ఒక్క షెల్టర్ కూడా లేదు, జనసంచారమూ లేదు. వెంటనే నేను, "బాబా! నువ్వే దిక్కు. ఇక్కడ ఆగటానికి ఎటువంటి షెల్టర్లూ లేవు. దయచేసి మీ చేతులతో ఈ వర్షాన్ని ఆపండి" అని ప్రార్థించాను. అద్భుతం! ఒక మీటరు దూరం వెళ్లేసరికి వర్షం లేదు. అసలు అక్కడ వర్షం పడిన జాడ కూడా లేదు. బాబా మమ్మల్ని క్షేమంగా మా గమ్యానికి చేర్చారు. "థాంక్యూ సో మచ్ బాబా. మేము ఎల్లప్పుడూ మిమ్మల్నే నమ్మి, మీ పాదాలకు సర్వస్య శరణాగతి చేస్తాము".


ఓం సాయిరాం!



సాయిభక్తుల అనుభవమాలిక 637వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయతో ఉదోగ్యప్రాప్తి
  2. చిన్న చిన్న విషయాలలో కూడా అండగా ఉండే బాబా


బాబా దయతో ఉదోగ్యప్రాప్తి


ఓం సాయిరాం! సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. సాయి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి బాబా నాకు తెలుసు. నా చిన్నతనం నుంచి బాబా తప్ప వేరే దైవం అంటే తెలియదు. తెలియదు అనంటే, ఆయా దైవమందిరాలకు వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థించాలో తెలిసేది కాదు. నాకు ఏమి కావాలో అంతా నా బాబానే చూసుకునేవారు. ఇప్పటివరకు నేనిలా ఉన్నానంటే అది నా బాబా దయే. నా జీవితంలో బాబా ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిలోనుండి ఒక అద్భుతాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


2015లో నా వివాహం జరిగింది. మావారు ఒక చిన్న కంపెనీలో 8 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నారు. ఆ కంపెనీ యాజమాన్యం తీరు నచ్చక వేరే కంపెనీలో చేరాలని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాకు నా బాబా మీద నమ్మకం తప్ప వేరే ఆలోచన లేదు. బాబా దయతో మావారికి ఏదైనా చిన్న కంపెనీలో ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ మేము ఊహించని టాప్ కంపెనీలో మావారికి ఉద్యోగం ప్రసాదించారు బాబా. ఆ కంపెనీ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ టెస్ట్ రాయడానికి కంపెనీవాళ్ళు టెస్ట్ లింక్ పంపించారు. కానీ, మావారు ఆ టెస్ట్ సరిగా రాయలేదు. దాంతో ఆ ఉద్యోగం ఇంక రాదని అనుకున్నాము. కానీ ఎవరికీ జరగని అద్భుతం బాబా అనుగ్రహంతో మాకు జరిగింది. ఆ కంపెనీవాళ్ళు మరలా రెండవసారి టెస్ట్ లింక్ పంపించారు. ఈసారి మావారు ఆ టెస్టులో పాసయ్యారు. ఇది కేవలం బాబా దయ మాత్రమే


అలాగే జీతం విషయంలో కూడా బాబా అద్భుతాన్ని చేశారు. మొదట ఆ కంపెనీ హెచ్.ఆర్ తో మాట్లాడినప్పుడు మేము ఆశించినదానికంటే తక్కువ జీతం ఇస్తామన్నారు. కానీ, ఆ తరువాత హెచ్.ఆర్ వాళ్ళే మావారికి ఫోన్ చేసి, “మీకు ఎంత జీతం కావాలి?” అని అడిగి, మేము ఆశించినదానికన్నా తక్కువ జీతమే అయినప్పటికీ బాబా దయవల్ల మొదట ఇస్తామన్న దానికన్నా పెంచారు. మావారికి ఉద్యోగం వస్తే సాయిభక్తుల అనుభవమాలికలో ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “థాంక్యూ బాబా. మీ భక్తులు ఏమడిగినా మీరు కాదని చెప్పరు. మీ ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను”. ధన్యవాదాలు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై!


చిన్న చిన్న విషయాలలో కూడా అండగా ఉండే బాబా

పేరు వెల్లడించని ఓ సాయిభక్తురాలు తన అనుభవాన్ని  ఇలా పంచుకుంటున్నారు:

ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారం. నేను టీచరుగా ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్య కరోనా కారణంగా క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే చెప్పడం జరుగుతోంది. అందుకు సంబంధించిన వర్క్ మొత్తం మొబైల్లోనే చేయాల్సి వస్తోంది. దాంతో నా మొబైల్లో ఛార్జింగ్ చాలా తొందరగా అయిపోతూ ఉండేది. ఇక వేరే గత్యంతరం లేక ఒక క్రొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నాను. అయితే, నేను ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా బాబా అనుమతి తీసుకుంటాను. అందువల్ల నేను, “బాబా! నాకు క్రొత్త మొబైల్ కొనుక్కోవాలని ఉంది, అనుమతి ఇవ్వండి” అని బాబాను అడిగాను. కానీ, బాబా “వద్దు” అని సమాధానమిచ్చారు. దాంతో నేను నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. తరువాత మా తమ్ముడితో మాట్లాడుతూ, “నా మొబైల్లో ఛార్జింగ్ చాలా తొందరగా అయిపోతోంది, దానివల్ల క్లాసులు చెప్పలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని చెప్పి, బాబా నిర్ణయం గురించి కూడా చెప్పాను. దాంతో వాడు, “సరే, నా మొబైల్ నువ్వు తీసుకో, నీది నాకివ్వు” అన్నాడు. ఈ విషయంలో కూడా బాబాను అనుమతి అడిగాను. కానీ బాబా అందుకు కూడా ఒప్పుకోలేదు. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, వర్క్ మొత్తం నేను మొబైల్లోనే చెయ్యాలి. అప్పుడు మా తమ్ముడు ‘కనీసం క్రొత్త బ్యాటరీ అయినా తీసుకో’ అన్నాడు. దాంతో మళ్ళీ నేను, “క్రొత్త బ్యాటరీ తీసుకోనా?” అని బాబాను అడిగాను. బాబా ‘తీసుకో’మని చెప్పారు. బాబా అనుమతితో నేను, మా తమ్ముడు కలిసి మొబైల్ షాపుకి వెళ్లి మొబైల్ ఇచ్చాము. “బ్యాటరీ మారుస్తాము, సాయంత్రానికల్లా వచ్చి మొబైల్ తీసుకెళ్ళండి” అని చెప్పారు వాళ్ళు. ఆరోజు సాయంత్రం నేను షాపుకి వెళ్ళి మొబైల్ తీసుకున్నాను. కానీ అక్కడ నేను మొబైల్‌ని సరిగా గమనించలేదు. ఇంటికి వచ్చి చూసుకునేసరికి నా మొబైల్లో ఉండాల్సిన రెండు సిమ్‌లు కనిపించలేదు. దాంతో నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! నువ్వు చెప్పినట్టే కదా నేను చేశాను. నా సిమ్‌లు నాకు దొరికేలా చూడు బాబా. మళ్లీ నేను వాటికోసం బయట తిరిగే పరిస్థితి రానీయకు. వెంటనే నా సిమ్‌లు నాకు దొరికితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. నా తమ్ముడు సిమ్‌ల కోసం షాపువాళ్ళకి ఫోన్ చేస్తే, “ఆ సిమ్‌లు ఇక్కడే వున్నాయి, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పారు వాళ్ళు. అది విని నాకు చాలా సంతోషమేసింది. క్రొత్త మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ మాత్రం మార్చి మొబైల్ చక్కగా పనిచేసేలా చూసిన బాబాకు ఎంతో ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “బాబా! మీ లీలలు తెలుసుకోవడం అసాధ్యం తండ్రీ. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు తల్లిలా, తండ్రిలా, స్నేహితునిలా, గురువులా, దైవంలా నాకు తోడుంటారు. మీ ఋణం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను తండ్రీ!”

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 636వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా, గురువుగారి ఆశీస్సులు
  2. ఆపదలో ఆదుకున్న నా సద్గురువు
  3. ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా బాబా చేసిన సహాయం

బాబా, గురువుగారి ఆశీస్సులు


గుంటూరు నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అనంతకోటి సాయిభక్తులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు శతకోటి వందనాలు. ఉదయాన్నే లేవగానే ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాల కొరకు నా కళ్ళు వెతుకుతాయి. వారి అనుభవాలు చదువుతుంటే అవి నా జీవితానికి దగ్గరగా ఉన్నాయన్న ఆనందం కలుగుతుంది. నేను ఈ బ్లాగులో నా అనుభవాలను పంచుకోవటం ఇదే మొదటిసారి. అనారోగ్యంతో బాధపడుతున్న మా పాపకు ఆరోగ్యం చేకూరితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాను, గురువుగారిని (శరత్‌బాబూజీ) ప్రార్థించాను. వారి అనుగ్రహంతో మా పాప 10 రోజుల్లోనే కోలుకుంది.


2020, ఆగస్టు 6వ తారీఖున మా పాప హఠాత్తుగా తనకు నొప్పిగా ఉందని ఏడ్చింది. హాస్పిటల్‌కు తీసుకువెళితే టెస్టులన్నీ చేసి, పాపకు ఊపిరితిత్తులలో నెమ్ము ఉందని, తగ్గటానికి కొంత సమయం పడుతుందని, దానికోసం కొన్ని నెలల పాటు మందులు వాడాల్సి వస్తుందని చెప్పారు డాక్టర్లు. దాంతో ఇంట్లో అందరం చాలా ఆందోళనచెందాము. పాపను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళిన దగ్గరనుంచీ టెస్టులు జరుగుతున్నంతసేపూ బాబాను, గురువుగారిని స్మరించుకుంటూనే ఉన్నాను. “సాయితండ్రీ! గురువుగారూ! మీరు మాతోనే ఉండి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీరు నా బిడ్డ ప్రక్కనే ఉండి నా బిడ్డ కోలుకునేవరకు జాగ్రత్తగా చూసుకోండి!” అని వేడుకోని క్షణం లేదు. అలాగే సాయితండ్రి, గురువుగారి అనుగ్రహంతో నా బిడ్డ రోజురోజుకూ మెల్లగా కోలుకుంటూ, కేవలం 10 రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతురాలైంది. డాక్టర్ గొప్పతనం కన్నా సాయితండ్రి, గురువుగారి కృపాకటాక్షాలు ఉన్నాయి కనుకనే మా పాప అంత త్వరగా కోలుకుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము.


రెండవ అనుభవం:


కొంతకాలం క్రితం నాకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టేది కాదు. నిద్రపట్టడం కోసం 3 నెలల పాటు మందులు కూడా వాడాను. నా సమస్యను పరిష్కరించమని సాయితండ్రిని, గురువుగారిని మనస్పూర్తిగా వేడుకున్నాను. క్రమేణా నా సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు నేను మందులేవీ వేసుకోకుండానే ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఇదంతా మా గురుదేవులైన సాయితండ్రి, గురువుగారి అనుగ్రహమే. అందుకే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, యజమాని, స్నేహితుడు అన్నీ బాబా, గురువుగారే. మా కుటుంబ సంరక్షణ బాధ్యతంతా వారిదే. సాయికి శరణాగతి చెందితే మనకు భయమనేది ఉండదు. ఇలాగే బాబా, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. “బాబా, గురువుగారూ! ఎల్లవేళలా మాకు రక్షణనిచ్చే మీకు, మీ మంగళకరమైన దివ్యచరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవటం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి!”


సాయిబాబా! సాయిబాబా! సాయిబాబా! సాయిబాబా!


ఆపదలో ఆదుకున్న నా సద్గురువు


ముందుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం అయిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథునికి నా పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ఎల్లప్పుడూ సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగార్జున. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నిటిని ఇటీవల ఈ బ్లాగులో పంచుకున్నాను. ఎందుకంటే, ఇప్పుడు నా ఈ జన్మ బాబా ప్రసాదించినదే కనుక. మనం బాబాపై నమ్మకముంచి ఓర్పుతో ఉంటే మనకొచ్చే కష్టాలను తన అనుగ్రహంతో సులభంగా తీసివేస్తాడు మన సాయినాథుడు. అటువంటి అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


మాది వ్యవసాయ కుటుంబం. ఒకరోజు పొలంపనుల నిమిత్తం నేను పొలానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా చేతివేలు తెగింది. ఆరోజు ఆశ్వయుజ అమావాస్య కావటంతో అశుభంగా అనిపించింది. ఎందుకంటే, ఇటీవల నన్ను కొన్ని గండాల నుండి తప్పించి బాబా నాకు ఈ పునర్జన్మను ప్రసాదించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా గండం ఏర్పడుతుందేమోనని ఆందోళన కలిగింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి తెగిన చేతివేలికి కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాక, బాబా ముందు నిలబడి నన్ను కాపాడమని కన్నీటితో ప్రార్థించాను. కాసేపట్లోనే ఒక వాట్సాప్ సాయి గ్రూపులో “నేనుండగా భయమెందుకు?” అనే సందేశంతో కూడిన బాబా ఫోటో వచ్చింది. బాబా సందేశం చూశాక బాబా నాతో ఉన్నారని నాకెంతో ఆనందం కలిగి నిశ్చింతగా బాబా స్మరణలో గడపసాగాను. వేలికి గాయమైన మూడు, నాలుగు రోజుల తర్వాత మా ప్రక్కింటివారు శనగపప్పుతో వండిన వంకాయ కూర ఇచ్చారు. (కాదు.. కాదు.. బాబానే పంపారు.) నేను ఆ కూరతో భోజనం చేస్తూ ఉండగా భోజనం చివరలో గుర్తుకు వచ్చింది, నా చేతివేలికి కుట్లు ఉన్నాయన్న సంగతి. శనగపప్పు తినటం వల్ల చేతివేలికి ఉన్న కుట్లు చీము పడతాయేమోనని చాలా భయమేసింది. దాంతో భోజనం చేసిన వెంటనే బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, బాబాకు నమస్కారం చేసుకొని, సచ్చరిత్ర తెరవగా, 118, 119 పేజీలు వచ్చాయి. అందులో, అనేక ఔషధాల రూపంలో బాబా తమ భక్తుల వ్యాధులను నిర్మూలించిన లీలలు ఉన్నాయి. ఆ లీలలు చదివిన నేను, “బాబా! ఈ కూర రూపంలో నాకు ఔషధం పంపించావా తండ్రీ?” అనుకుని ఆనందంతో బాబాకు నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తరువాత ప్రతిరోజూ గాయానికి ఊదీ రాసుకుంటూ ఉన్నాను. బాబా అనుగ్రహంతో నేను తిన్న ఆహారం వల్ల చేతివేలికి ఉన్న కుట్లకు ఎలాంటి హానీ జరగలేదు. అంతేకాదు, నాకు వైద్యం చేసిన డాక్టరు కూడా ఆశ్చర్యపోయేలా పదిరోజుల్లో గాయం పూర్తిగా మానిపోయింది. “బాబా! నీకు శతకోటి వందనాలు తండ్రీ! నాకు ఏమి కావాలో నీకు తెలుసు. నాకు ఎల్లవేళలా తోడునీడగా ఉండు తండ్రీ! అందరికీ రక్షగా ఉండు తండ్రీ!”


ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా బాబా చేసిన సహాయం

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయి భక్తురాలిని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా నా భర్త నెలరోజులుగా ఇంటి నుండి పని చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒకరోజు Wi-Fi కనెక్షన్ పనిచేయడం మానేసింది. అసలే మావారు ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు, ఆయనకి ఇంటర్నెట్ చాలా అవసరం. కానీ ఇంటర్నెట్ లేనందున ఆయన పని ఆగిపోయింది. మేము కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే, వాళ్ళు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దాంతో మావారు మొబైల్ డేటా మీద పని చేస్తూ వచ్చారు. అయితే ఐదు రోజులైనా సమస్య పరిస్కారం కాలేదు. ఈసారి కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ కాల్ కి స్పందించలేదు. అప్పుడు నేను క్వశ్చన్ & ఆన్సర్ సైట్ లో బాబాని అడిగాను. "తప్పు చేసి అంతరాయం కలిగించవద్దు. శ్రీసాయిని గుర్తుంచుకో, సరైన మార్గం చూపబడుతుంది" అని వచ్చింది. నేను సరిగా అర్థం చేసుకోలేక "ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా చేయమ"ని బాబాను ప్రార్థించి, సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని పంచుకుంటానని ఆయనకి మాట ఇచ్చాను.

తరువాత ఏడవ రోజున నేను మళ్ళీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాను. వాళ్ళు ఒకసారి కనెక్షన్స్ తనిఖీ చేయమని చెప్పారు. సరేనని నేను పరిశీలిస్తే DSL వైర్ రాంగ్ పోర్టులో ప్లగ్ ఇన్ చేయబడి ఉంది. అదివరకు సమస్య పరిష్కరించే ప్రయత్నంలో మేమే పొరపాటున ఆ కేబుల్‌ను రాంగ్ పోర్టులో పెట్టాము. దాన్ని సరి చేయడంతో ఇంటర్నెట్ పని చేయడం ప్రారంభించింది. అప్పుడు నాకు బాబా ఇచ్చిన సమాధానం అర్ధమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా, ఐ లవ్ యు. దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించండి".




సాయిభక్తుల అనుభవమాలిక 635వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదించిన అనుభవాలు
  2. ప్రతి చిన్న ఇబ్బందినీ ప్రేమతో అధిగమింపజేస్తున్న బాబా
  3. సాయి కృప - మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

బాబా ప్రసాదించిన అనుభవాలు


సాయిభక్తుడు బెహరా ఛత్రపతి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


అందరికీ నమస్కారం! సాయి అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఈమధ్య పరీక్షల కోసం కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది. బాబా దయవల్ల పరీక్షలు బాగా జరిగాయి. కానీ ఆ మరుసటిరోజు మా బ్యాచ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసి నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ స్థితిలో నేను సాయినే నమ్ముకుని, "ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడితే మీకు నైవేద్యం సమర్పించుకుంటాను. ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత ఇంట్లో అందరికీ దూరంగా ఉంటూ, సాయి ఊదీని నీళ్లలో కలిపి త్రాగుతుండేవాడిని. చివరిగా కరోనా పరీక్ష చేయించుకుంటే, బాబా అనుగ్రహం వల్ల 'నెగెటివ్' వచ్చింది. బాబా కృపతో ఏ చింతా లేకుండా ఆ కష్టం నుండి బయటపడ్డాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

 

ఇంకో ముఖ్య విషయం:


రెండు నెలల క్రితం నాకొక స్వప్నం వచ్చింది. ఆ కలలో నేను సాయిబాబా మందిరానికి వెళ్ళాను. పక్కనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అక్కడ దత్తస్వరూపులైన వాసుదేవానందస్వామి నాకు ఆంజనేయస్వామి తాయెత్తు ఇచ్చారు. తరువాత 10 రోజులకు శ్రీపాద శ్రీవల్లభస్వామి చరితామృతం గురించి నాకు తెలిసింది. అందులో 45వ అధ్యాయంలో ఆంజనేయస్వామిని శ్రీపాదులవారు సాయిబాబాగా అవతరించమని చెప్పినట్లు ఉంది. (ఆ పేజీలను ఈ క్రింద జతపరుస్తున్నాను.) అది చదివాక, నాకొచ్చిన కల ద్వారా సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని సందేశమిచ్చారని గ్రహించాను. అద్భుతమైన ఆ స్వప్నం ఇంకా నా కళ్ళముందే కదలాడుతున్నట్లు ఉంది.


ఓం సాయిరామ్!


ప్రతి చిన్న ఇబ్బందినీ ప్రేమతో అధిగమింపజేస్తున్న బాబా


అందరికీ నమస్తే! నా పేరు అంజలి. నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేను సాయినే ఆశ్రయిస్తాను. ఆయన నా ప్రతి కష్టాన్నీ ఇట్టే పరిష్కరిస్తూ నాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎన్నో అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నాను. నా విధులననుసరించి నేను ప్రతి నెలా ఆఫీసు ల్యాప్‌టాప్‌లో రీడింగ్స్ తీయాలి. డిసెంబరు 1న ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. ల్యాప్‌టాప్‌లో మీటర్ రీడింగులు వస్తున్నాయి. ఇంతలో ప్రెస్ వాళ్లమంటూ ఒక నలుగురు మా ఆఫీసుకి వచ్చి, ఏదో మీటింగ్ కోసం డబ్బులు ఇమ్మని అడిగారు. అంతకుముందు కూడా వాళ్ళు అలాగే వచ్చారు. అప్పుడు నాకు తెలియక నేను వాళ్ళకి డబ్బులిచ్చాను. వాళ్ళు మరలా వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఇవ్వనంటే వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమోనని నాకు భయమేసింది. వెంటనే బాబాను తలుచుకుని, "బాబా! వాళ్ళు ఏ గొడవా చేయకుండా వెళ్ళిపోవాలి" అని చెప్పుకున్నాను. తరువాత వాళ్ళతో, "మీకు డబ్బులు ఇవ్వటం కుదరదు. మొదటిసారంటే ఏదో ఇచ్చాను కానీ, ఇప్పుడు ఇవ్వలేను. నాకు జీతం తప్ప అదనంగా డబ్బులేమీ రావు. కాబట్టి దయచేసి వెళ్లిపోండి" అని చెప్పాను. వాళ్ళు కొంచెంసేపు ఉండి వెళ్లిపోయారు. అంతా బాబా దయ. ఆయన కృపవలన వాళ్ళు ఏ గొడవా చేయకుండా వెళ్లిపోయారు


ఇకపోతే, నేను అప్పటికే రీడింగులు తీస్తున్న పని విషయానికి వస్తే, ఒక మీటర్ రీడింగ్ మధ్యలో ఆగిపోయింది. నేను ఎంత ప్రయత్నించినా రీడింగ్ రాలేదు. ఇక చివరిగా బాబాను తలచుకుని,  "బాబా! ఎలాగైనా రీడింగ్ వచ్చేలా చేయండి" అని ఆయనకు శరణువేడాను. అంతే! మిరాకిల్ జరిగినట్లు మరుక్షణంలో ఆ మీటర్ రీడింగ్ రావటం మొదలైంది. 'బాబా దయ' అనుకుని ఆనందంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మరి కొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


జై సాయిరామ్!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి కృప - మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయి శరణం. ఓం శ్రీ సాయిరామ్. సాయిభక్తులందరికీ ప్రణామాలు. సాయిని దృఢంగా విశ్వసించే లక్షలాదిమంది భక్తులలో నేను ఒకడిని. ఇంటర్నెట్లో భక్తుల అనుభవాలు చదవకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ఎవరు సాయిని పిలిచినా మరుక్షణంలో ఆయన వారిచెంత ఉంటారు. నేను ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నా భార్యకు 47 సంవత్సరాల వయస్సు. ఈమధ్య తనకి రెండు నెలలపాటు నెలసరి రాలేదు. అదివరకు ఒకసారి మా ఫ్యామిలి డాక్టరుని సంప్రదించినప్పుడు, లక్షణాలను బట్టి నా భార్యకి మెనోపాజ్ దశ తొందరగా ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. అయితే అంతకుముందెప్పుడూ రెండు నెలలపాటు నెలసరి తప్పిపోలేదు. అందువలన ఇప్పుడా సమస్య కారణంగా నా భార్య చాలా ఆందోళన చెందసాగింది. కానీ ఈ కరోనా సమయంలో డాక్టరు వద్దకు వెళ్లడానికి భయపడింది. తను త్వరలో నెలసరి వస్తుందని భావించినప్పటికీ చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండేది. అటువంటి కష్ట సమయాల్లో మనం మన రక్షకుడైన సాయిని తప్ప ఇంకెవరిని ఆశ్రయిస్తాము? మేము హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించాము. నేను, "బాబా! తనని జాగ్రత్తగా చూసుకోండి. మానసిక ఒత్తిడి నుండి తనకి ఉపశమనం ప్రసాదించండి" అని బాబాని వేడుకున్నాను. తరువాత మేము క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబాని అడిగితే, “విశ్వాసం కలిగి ఉండండి, ఓపికపట్టండి, త్వరలో అంతా బాగుంటుంది" అని వచ్చింది. దాంతో మేము, "మాకు ఇంకేమి కావాలి దేవా? మీ మాటలు మాకు భరోసా నిచ్చాయి" అని అనుకుని మా చింతను బాబా పాదకమలాల వద్ద సమర్పించి మా రోజువారీ పనులలో మునిగిపోయాము. బాబా ఎవ్వరినీ నిరాశపరచరు. ఆయన సర్వశక్తిమంతుడనని, మన రక్షకుడనని నిరూపిస్తారు. ఆయన కృపతో నా భార్యకు నెలసరి వచ్చింది. దాంతో ఆమె చాలా ఉపశమనం పొంది, మహదానందంగా ఉంది. "ధన్యవాదాలు దేవా! మీరెప్పుడూ మాకోసం ఉన్నారు. దయచేసి ఈ మహమ్మారి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించండి. ప్రజల మనస్సులోని వేదనను, గందరగోళాన్ని తొలగించండి. త్వరలోనే ఈ ప్రపంచాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురండి".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః.



సాయిభక్తుల అనుభవమాలిక 634వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. కోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబా
  2. సాయి ఆశీస్సులు

కోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబా

ఓం శ్రీసాయి సర్వాభీష్టప్రదాయ నమః

మనం అడిగేవి, అడగనివి అన్నీ ప్రసాదించే ప్రేమమూర్తి, మన భాగ్యంలో లేనివి కూడా ఇవ్వగల సమర్థ సద్గురువు మన సాయి. అలాంటి ఒక అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. ఈ లీల చదివిన చాలామందికి వాళ్ళ జీవితం మీద నమ్మకం వస్తుంది. ‘బాబాను అడిగితే ఏదైనా సాధ్యమే’ అనే విశ్వాసం బలపడుతుంది. అందుకు మనం సాయికి సమర్పించాల్సిన రెండు పైసల దక్షిణ - సాయి మనం అడిగింది ఖచ్చితంగా ప్రసాదిస్తారనే దృఢమైన నమ్మకం (శ్రద్ధ), బాబా ప్రసాదించేవరకు సంతోషంతో ఓపికగా ఉండటం (సబూరి). ఈ రెండు పైసల దక్షిణ సమర్పించగానే మనం అడిగింది బాబా మనకు ప్రసాదిస్తారు, మనం కోరుకున్న దానికంటే గొప్పగా.

ఇక, నా సాయి ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం గురించి చెప్తాను. నా పేరు సరిత. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. బాబా అనుగ్రహంతో నేను మహాపారాయణ కూడా చేస్తున్నాను. మహాపారాయణ ప్రారంభించాక నేను నా జీవితంలో చాలా పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాను. బాబా దయవల్ల ఒక్కొక్క సమస్య మెల్లగా పరిష్కారమవుతూ వస్తోంది. ముఖ్యంగా బాబా సన్నిధి నాకు బాగా అనుభవమవుతోంది. నేను మహాపారాయణ ప్రారంభించిన రెండు, మూడు నెలల తర్వాత ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో రెండేళ్ళలోపు వయసున్న ఒక చిన్నపిల్లాడు కనిపించాడు. వాడు ఆడుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడుకొని నిద్రపోయాడు. అంతకుముందెప్పుడూ నేను వాడిని చూడనప్పటికీ నాకెంతో చాలా చేరువగా అనిపించాడు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా తమ్ముడికి సాయి ఆశీర్వాదంతో ఒక పాప ఉంది. తను బంగారుతల్లి. మా అందరికీ తనంటే ప్రాణం. ఆ పాప తర్వాత ఇంకొక బిడ్డ కావాలి అనుకున్నాము. కానీ మా కోరిక నెరవేరలేదు. మా మరదలు ఒకసారి గర్భవతి అయింది, కానీ దురదృష్టవశాత్తూ తనకు గర్భస్రావం అయింది. దాంతో 99% ఆశలు వదిలేశాము. ఆ ఒక్కశాతం ఆశ మన సాయి మాత్రమే. కానీ, బిడ్డను ప్రసాదించమని బాబాను మేమెన్నడూ వేధించలేదు. ఏదైనా బాబా అనుగ్రహమే అని భావించి ఆ విషయాన్ని వదిలేశాము. కానీ, సాయి ప్రణాళికలు ఎప్పుడూ మన ఊహకి కూడా అందవు కదా! అదే జరిగింది.

2020, జనవరి 13వ తేదీన ఫేస్‌బుక్‌లో,“ఈ నెలాఖరుకు నువ్వు ఒక గ్రేట్ న్యూస్ వింటావు, నేను చేస్తున్నాను” అని బాబా నాకు మెసేజ్ ఇచ్చారు. అది చూసి, ‘బాబా ఏదో ఇవ్వబోతున్నారు, అది మాకు చాలా సంతోషకరమైన విషయం’ అని అనిపించింది, కానీ అదేమిటో నేను ఊహించలేకపోయాను. జనవరి 31వ తేదీన మేమంతా ఎంతో బాధపడే ఒక సంఘటన మా ఇంట్లో జరిగింది. ఆ బాధలో, “ఏదో మంచి విషయం వింటారన్నావు, ఇదేనా ఆ గొప్ప విషయం?” అని బాబాను నిలదీస్తూ ఏడ్చేశాను కూడా. మర్నాడు, అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన, నేను అంతకుముందెప్పుడో ఇద్దామని అనుకున్న కొంత డబ్బును శిరిడీ సంస్థాన్‌కి ఆన్‌లైన్‌లో పంపించాను. అదే మొదటిసారి నేను శిరిడీ సంస్థాన్‌కి ఆన్‌లైన్‌లో డబ్బు పంపించడం. డబ్బులు పంపాక వెబ్‌సైట్ లాగౌట్ చేయబోతుండగా మా తమ్ముడు ఏదో మెసేజ్ పంపినట్లు నాకు వాట్సాప్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను శిరిడీ వెబ్‌సైట్ లాగౌట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశాను. ఆ మెసేజ్ చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. అదేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా? అవును! అది, ‘మా మరదలు ప్రెగ్నెంట్’ అనే మెసేజ్. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను. ఈ శుభవార్త తెలిసి అందరం ఎంతో సంతోషించాము. ఇక్కడ మీకు ఒక సందేహం రావొచ్చు. “జనవరి నెలాఖరుకి గుడ్ న్యూస్ వింటారని సాయి అన్నారు కదా, మరి ఫిబ్రవరి ఒకటో తేదీన తెలియటమేంటి?” అని. సాయి మాటలు ఎప్పుడూ పొల్లుపోవు. మా మరదలు గర్భవతి అనే విషయం మావాళ్ళకి జనవరి 30నే తెలిసింది. కానీ, 100% ధ్రువపరచుకున్నాక మాకు చెబుదామని అనుకుని వెంటనే మా ఫ్యామిలీ డాక్టరుకి చూపించటం, డాక్టర్ మా మరదలి ప్రెగ్నెన్సీని ధ్రువపరచడం, అంతా బాగుందని చెప్పడం, కానీ మా మరదలు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం చకచకా జరిగిపోయాయి. వాళ్ళకు తోడుగా మా అమ్మ అక్కడే ఉంది. అన్ని నెలలు బాబా దయతో చాలా ప్రశాంతంగా గడిచిపోయాయి. మాకు ఏదైనా ఆందోళన ఉందంటే అది ఈ కోవిడ్ సమయంలో డెలివరీ ఎలా అని మాత్రమే. అన్నిటినీ జాగ్రత్తగా చూసే సాయితల్లి మనతో ఉండగా మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. హాస్పిటల్లో మాకు తోడుగా ఉండటానికి మా బంధువులు వచ్చారు. ఇంకా మా మరదలి స్నేహితురాలు కూడా వచ్చింది. వాళ్ళంతా ఈ క్లిష్ట సమయంలో మాకు చాలా తోడుగా ఉన్నారు. బాబానే వాళ్ళ రూపంలో వచ్చారని నా నమ్మకం.

ఇంకొక అద్భుతం కూడా చెప్పాలి. ఈ కోవిడ్ కారణంగా డెలివరీ సమయంలో హాస్పిటల్లో ఎలా ఉండాలా అని చాలా భయపడ్డాము. కానీ సాయి చాలా గొప్పగా మా భయాన్ని తీసేశారు. కోవిడ్ కేసులు ఎక్కువవడం వల్ల మావాళ్లు జాయిన్ అవటానికి రెండు రోజుల ముందునుంచి హాస్పిటల్లో పేషంట్స్‌ను చూడటం ఆపేశారు. మావాళ్ళు హాస్పిటల్లో ఉన్న 5 రోజులు అక్కడ వేరే పేషెంట్ ఒక్కరు కూడా లేరు. మావాళ్ళు డిశ్చార్జ్ అయినరోజు నుంచి మళ్లీ పేషంట్స్‌ను చూడటం ప్రారంభించారు. చూశారా, నా సాయి ప్రణాళిక! ఇది విన్న ప్రతి ఒక్కరూ, “మిమ్మల్ని దేవుడు చాలా చక్కగా ఆశీర్వదించాడు. లేకపోతే ఈ కరోనా రోజుల్లో అలా హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉండటం ఏమిటి?” అని ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతకీ పుట్టిన బిడ్డ గురించి మీకు చెప్పలేదు కదూ! బాబా నాకు కలలో చూపించారు కదా ఒక పిల్లాడిని, ఇక వేరే చెప్పాలా అబ్బాయి పుట్టాడని. “థాంక్యూ సో మచ్ బాబా!” వాడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, వాడిని మాకు ప్రసాదించింది బాబానే కదా. నేను కోరుకునేది ఒకటే, వాడు బాబాకు మంచి భక్తుడిగా ఉండాలి అని. ఈ సమయంలో మాకు తోడుగా ఉన్నవాళ్లని కూడా బాబా ఎల్లప్పుడూ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను..

ఇంకొక్క విషయం చెప్పేసి ముగిస్తాను. ఎలాగైతే సాయిభక్తులందరం సాయిసచ్చరిత్రను, ఊదీని బాబా ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలుగా భావిస్తామో, అలాగే మహాపారాయణ కూడా మనకు బాబా ఇచ్చిన ఇంకొక గొప్ప ఆశీర్వాదం. మీరు మహాపారాయణ చేసి చూడండి, మీకే ఆ విషయం అర్థమవుతుంది. జీవితం చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇది నూటికి నూరుశాతం నిజం.

సాయిభగవానుడు అందరినీ ఆశీర్వదించుగాక!

ఓం సాయిరాం!

సాయి ఆశీస్సులు


నా పేరు పద్మ. నేను బాబా భక్తురాలిని. అయితే నేను మొదటినుండి బాబా భక్తురాలిని కాను. నేను బాబా భక్తురాలిగా మారడంలో మా అత్తగారు నాకెంతో సహాయం చేశారు. ఆమె చేసిన మేలు నేనెప్పటికీ మరువలేను. ఒకసారి ఆమె శిరిడీ వెళ్లి, అక్కడినుండి వచ్చేటప్పుడు బాబా ఊదీ, సాయి సచ్చరిత్ర గ్రంథం తీసుకొచ్చారు. వాటిని నాకు ఇస్తూ, నీటితో దీపాలు వెలిగించిన బాబా అద్భుత లీలను గురించి చెప్పారు. ఆ అద్భుతం నా మనసుకెంతగానో నచ్చింది. బాబా ఊదీ నా నుదుటన పెట్టుకుని సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. నెమ్మదిగా నేను బాబా భక్తురాలినయ్యాను. బాబా ఆశీర్వాదం వలన నేను నాలుగుసార్లు శిరిడీ సందర్శించాను. బాబా దర్శనంతో నాకెంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు నేను మోకాళ్లనొప్పులతో మంచానికి అతుక్కుపోయాను. అప్పుడు నేను కేవలం బాబా మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచాను. ఆయన ఎంతో దయతో నా మోకాళ్ల నొప్పులు తగ్గించారు. ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించారు. 33 సంవత్సరాల క్రితం కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న మా బావ/మరిదికి నయం చేశారు బాబా. ఆయన ఆశీస్సులతో అతనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా సాయి నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. ఆయన ఆశీస్సులతో నా జీవితం సంతోషంగా ఉంది. బాబా అనుగ్రహం వలన నాకు నలుగురు మనవళ్లు ఉన్నారు. వాళ్ళల్లో ఇద్దరు కవలలు. "బాబా! దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నా భర్త, కొడుకు, కుమార్తెలకు తోడుగా ఉంటూ వాళ్ళకి దీర్ఘాయువునివ్వండి బాబా".


ఓం సాయిరామ్!



సాయిభక్తుల అనుభవమాలిక 633వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలు
  2. సద్గురు సాయి సమాధానం

బాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలు


ఓం సాయిరామ్! అందరూ బాగుండాలి. సాయి దాసులందరికీ నా నమస్కారాలు. నా పేరు మంగ. నేను సాయిభక్తురాలిని. అన్నింటిలోనూ నాకు తోడుగా ఉంటున్న శ్రీ సాయిబాబాకు నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. నా జీవితం వారి ఆశీర్వాదమే! నా నిశ్చితార్థం, వివాహం గురువారంనాడే జరిగాయి. 2020, అక్టోబరు 1న నాకు పాప పుట్టింది, అది కూడా గురువారంనాడే. ఇలా బాబా తమ ఆశీస్సులు సదా నాపై కురిపిస్తున్నారు. ఇకపోతే, బాబా నాకు ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మొదటి అనుభవం:


మా పాపకిప్పుడు మూడో నెల వచ్చింది. నవంబరు మూడవ వారం నుండి రెండు వారాల పాటు తనకు తీవ్రంగా జలుబు చేసి బాగా ఏడుస్తుండేది. తన బాధను కూడా చెప్పుకోలేని చిట్టితల్లి అంతలా ఏడుస్తుంటే తల్లిగా నాకు చాలా బాధగా ఉండేది. అప్పుడు బాబాను తలచుకుని, "పాప ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. నా మీద దయతో పాపకు త్వరగా నయమయ్యేలా చేశారు బాబా. ఇప్పుడు పాప ఆరోగ్యం బాగుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


రెండవ అనుభవం:


2018 నుండి నా ఆరోగ్యం బాగాలేక ఎన్నో హాస్పిటల్స్‌ తిరిగి ఎందరో డాక్టర్లను సంప్రదించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. నా ఆరోగ్యం ఏ మాత్రమూ కుదుటపడలేదు. తమ కష్టం తీరితే తమ అనుభవాలను బ్లాగులో పంచుకుంటామని బాబాకు చెప్పుకున్నామని, బాబా కృపతో ఆ కష్టాలు తీరాయని సాటి సాయిభక్తులంతా పంచుకుంటున్న అనుభవాలను బ్లాగులో చదివాక నేను కూడా, "నా ఆరోగ్యం బాగుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. నిజంగా బాబా ఎంతో దయార్ద్రహృదయులు. రెండేళ్లుగా నయంకాకుండా ఉన్న నా అనారోగ్యాన్ని బాబా ఇట్టే నయం చేశారు. బాబా ఆశీస్సులతో నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. "బాబా! మీకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు". నన్ను ఈ గ్రూపుకి పరిచయం చేసినవాళ్ళకి నేను ఋణపడి ఉంటాను.


సాయినాథ్ మహరాజ్ కీ జై!


సద్గురు సాయి సమాధానం

యు.ఎస్.ఏ నుండి ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయి లీలలను మనం మన దైనందిన జీవితంలో ఏదో ఒక విధంగా అనుభవిస్తూ ఉంటాం. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

నేను యు.ఎస్.ఏ లో నివాసముంటున్నాను. నా సోదరి వివాహం 2020, మార్చి 19న జరపడానికి పెద్దలు నిశ్చయించారు. నా భర్త, పిల్లలని వదిలి నేను వెళితే, వాళ్ళు తమ పనులు నిర్వహించుకోలేరు. ఇలా కొన్ని కారణాల వలన నేను వివాహానికి వెళ్ళాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డాను. నేను ఏ నిర్ణయం తీసుకోలేక ఫిబ్రవరి నెల చివరివరకు వేచి చూసి,  'ఎస్', 'నో'  అని రెండు చీటీలు వ్రాసి, "బాబా! నేను వివాహానికి 'వెళ్లాలా? వద్దా?' మీ నిర్ణయం ఏమిటో చెప్పండి" అని ప్రార్థించి ఒక చీటీ తీసాను. బాబా సమాధానం 'వెళ్లొద్దు'అని వచ్చింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి, ఇలా చీటీల ద్వారా బాబాను అడిగిన సందర్భాలలో నాకు నచ్చని విధంగా బాబా సమాధానం వచ్చిన ప్రతిసారి నేను నాకు నచ్చినట్లు చేసేదాన్ని. అలాంటిది నాకు ఏ ప్రేరణ కలిగిందోగాని మొట్టమొదటిసారిగా నేను నా మనసు మార్చుకుని, బాబా సమాధానానికి కట్టుబడి నా భర్త, పిల్లలు, ఇంకా ప్రతి ఒక్కరితో వివాహానికి వెళ్ళనని చెప్పాను. 

తరువాత కోవిడ్ 19 కారణంగా మార్చినెలలో ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు.  వివాహమైన మరుసటిరోజే నా పెద్ద కూతురు యుక్తవయస్సుకు వచ్చింది. మార్చి 23 నుండి అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. విమానాల రాకపోకలు ప్రారంభించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ వివాహానికి వెళ్లి ఉంటే, నేను భారతదేశంలో చిక్కుకుపోయేదాన్ని. అవసరమైన సమయంలో నేను లేకపోవడంవలన, జాగ్రత్తగా చూసుకోవడానికి వేరెవరూ లేనందున నా కూతురుకి చాలా కష్టంగా ఉండేది. జరపవలసిన కార్యక్రమాలు చేయలేకపోయేవాళ్ళం. ఇటు నా కుటుంబం, అటు నేను ఎంతో బాధ పడేవాళ్ళం. బాబా చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ఎంతో మేలు జరిగింది. ఈ అనుభవం నుండి బాబా సమాధానం ప్రతికూలంగా వస్తే, మనం ఓపికగా ఉండాలని, అలా చేయడం వల్ల ఎంతో మేలు పొందుతామని, ఆయన లీలని చూస్తామని నేను తెలుసుకున్నాను.

"సాయి తండ్రి! మీరు కాకుండా ఇంతలా మాకు రక్షణనివ్వడానికి ఎవరు ఉన్నారు? కోటి కోటి ప్రణామాలు తండ్రి. నేను అన్నింటినీ మీకే వదిలి పెడుతున్నాను, ఏది మంచో, ఏది చెడో మీకు తెలుసు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. పనిలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు రావడానికి, సకాలంలో పనులు పూర్తి చేయడానికి సహాయం చేస్తున్న మీకు ధన్యవాదాలు సాయి. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మేము ధైర్యంగా ఉండేలా అనుగ్రహించండి. కఠినమైన సమస్యలను అధిగమించడానికి మీ దైవిక నామాన్ని జపించేలా ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి దయచేసి మాకు ఒక మార్గాన్ని చూపించండి".

మరో చిన్న అనుభవం:

నేను చాలాకాలంగా సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయడం మొదలుపెట్టి, "కోవిడ్ 19 మహమ్మారి నుండి కాపాడమ"ని బాబాను కోరుకున్నాను. రెండుసార్లు పారాయణ చేసిన తరువాత నేను, "ఈ మహమ్మారి నుండి ఎందుకు మమ్మల్ని బయటపడేయడం లేద"ని బాబాను అడిగాను. అదేరోజు నేను చూస్తున్న న్యూస్ ఛానెల్‌లో, "శిరిడీలో కోవిడ్ 19 కేసు ఒక్కటి కూడా లేద"ని చూసాను. దాంతో నేను, 'ఈ మహమ్మారి నుండి బాబా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారని, ఇది త్వరలోనే ముగుస్తుంద'ని నేను అనుకున్నాను. "బాబా! దయచేసి గోధుమపిండితో కలరాను నిర్ములించిన విధంగా ఈ కోవిడ్ 19ని ఏదోఒకటి చేసి తొలగించండి. మీరు మాత్రమే ఈ మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించగలరు".

శ్రీసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


స్వీయ అనుభవం:

నేను, నా స్నేహితుడు 2020, మే 16 రాత్రి ఫోన్ లో మాట్లాడుకుంటున్నాము. మాటల సందర్భంలో ఈ కరోనా కారణంగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించలేకపోతున్నామని, మళ్ళీ ఎప్పటికి భక్తులకి ఆ అవకాశం వస్తుందో అని చాలా బాధపడ్డాం. భక్తుల ప్రేమకోసం తప్పించే బాబా తమ బిడ్డలని ఎందుకిలా దూరంగా ఉంచారో అని కూడా అనుకున్నాము. చాలారోజులుగా మా మనసులో ఉన్న బాధ ఇదే. అయితే ఆ మాటల్లో "శిరిడీలో కరోనా కేసులున్నాయా?" అని నా స్నేహితుడు ఒక ప్రశ్న వేసాడు. "ఏమో! దాని గురించి తెలీదు. ఒకవేళ నమోదై ఉన్నాఇప్పుడు లేకపోయి ఉండొచ్చు" అని నేను అన్నాను. బాబా దానికి సమాధానం ఎలా ఇచ్చారో చూడండి. రెండురోజుల తరువాత నేను ఇంగ్లీష్ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుండగా పై భక్తురాలి అనుభవం కనిపించింది. అది చదివి బాబా ఇచ్చిన సమాధానానికి ఆనందాశ్చర్యాలకి లోనయ్యాను. వెంటనే నా స్నేహితుడికి మెసేజ్ చేశాను. అది చూసి తను హ్యాపీగా, "నేను చాలా వెతికాను. కానీ ఎక్కడా ఆ సమాచారం దొరకలేదు. అందుకే నిన్ను అడిగాను. నేను కోవిడ్ 19 డేటా పూర్తిగా చూసాను. మహారాష్ట్ర సమాచారం ఉంది కానీ, ఎక్కడా శిరిడీ గురించి లేదు. థాంక్స్ నా సందేహం క్లియర్ అయ్యింది" అని అన్నాడు. నిజంగా మన బాబా చాలా గ్రేట్. ఆయన తన భక్తులను సదా కనిపెట్టుకొని ఉంటారు. మనం అడగకపోయినా అవసరమైనది చేస్తూ ఉంటారు. "థాంక్యూ సో మచ్ బాబా!".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo