సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ - మొదటి భాగం


అంకితసాయిభక్తుడైన శ్రీలక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్ వురఫ్ 'తాత్యాసాహెబ్ నూల్కర్'ను గురించిన వివరాలు శ్రీసాయిసచ్చరిత్ర 31వ అధ్యాయంలో స్వల్పంగా ప్రస్తావించబడ్డాయి. శ్రీసాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తులలో ఒకరైన శ్రీనూల్కర్ కు సంబంధించిన పూర్తివివరాలు శ్రీసాయిచరిత్రలలో లభించడం లేదు. కాని లెఫ్టనెంట్ కల్నాల్ (రిటైర్డ్) శ్రీనింబాల్కర్ గారు శ్రీనూల్కర్ బాల్యము, ఉద్యోగము, వారి ఆధ్యాత్మిక ప్రగతి, వారు ఏ విధంగా సాయిబాబాచే ఆకర్షితులై చివరకు శిరిడీలో ఎలా జన్మరాహిత్యాన్ని పొందారు మొదలైన వివరాలన్నీ ఆనాడు శ్రీ షామా తదితరులు వ్రాసిన ఉత్తరాలతో సహా సేకరించి 1991లో శ్రీసాయిలీల పత్రికలో ప్రచురించారు. ఈ వ్యాసమేగాక శ్రీనూల్కర్ గూర్చి శ్రీడి.యస్.టిప్నిస్ మరాఠీలో రచించిన మరో వ్యాసం 1978 సాయిలీలామాసిక్ (మరాఠీ) పత్రికలో ప్రచురింపబడింది. శ్రీనూల్కర్ జీవిత విశేషాలు, గురుపూర్ణిమనాడు బాబాకు భక్తులు చేసిన గురుపూజకు సంబంధించిన వివరాలలో పైన పేర్కొన్న రెండు వ్యాసాలకు కొంత వైరుధ్యముంది. ఆ వ్యాసాలలోను, తక్కిన సాయిచరిత్రలలోను శ్రీనూల్కర్ గురించి ప్రచురింపబడిన వివరాలనన్నిటినీ క్రోడీకరించి, యీ సమగ్ర వ్యాసాన్ని  పాఠకులకందిస్తున్నాం!

శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ 1862 లేక 1863లో జన్మించారు. పూనాలో విద్యాభ్యాసం జరిగింది. తర్వాత న్యాయవాదపట్టా పుచ్చుకొని ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. వీరు న్యాయవాదిగానే గాక సత్యవాదిగా, దృఢసంకల్పం కలిగిన స్వార్థరహితుడుగా పేరు తెచ్చుకొన్నారు. న్యాయమూర్తిగా తన వృత్తి నిర్వహణలో వీరు చూపిన సంయమనము, నిజాయితీ అందరిచే ప్రశంసలందుకొంది. ఆధ్యాత్మికచింతన గలిగినవాడు. ఉపనిషాది వేదాంతగ్రంథాలు క్షుణ్ణంగా చదివినవాడు. సాధుసంతులను తరచూ దర్శించి వారి సాంగత్యంలో గడిపేవాడు.

1908లో వీరు పండరిపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ అక్కడ మామల్తదారుగా పనిచేస్తూ వుండేవాడు. ఒకే ఊరిలో  వున్న ఆ ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచు స్నేహపూర్వకంగా కలుసుకొనేవారు. చందోర్కర్ తన మామూలు ధోరణిలో సాయిబాబా మహిమల గురించి చెప్పి, వారినొకసారి దర్శించమని నూల్కర్ కు చెబుతూ వుండేవాడు. నూల్కర్ తనకు రెండు కోరికలున్నాయని, అవి సాయిబాబా కృపవలన నెరవేరితే వారినొక మహాత్మునిగా నమ్మి తప్పక శిరిడీ వెళతానని అన్నాడు. ఆ కోరికలలో మొదటిది తనకు మంచి వంట బ్రాహ్మణుడు దొరకాలని, రెండవది బాబాకు సమర్పించడానికి శ్రేష్టమైన నాగపూర్ కమలాపండ్లు లభించాలని! బాబా మహిమపై దృఢవిశ్వాసమున్న శ్రీనానాసాహెబ్ ఆ రెండు కోరికలు తప్పక నెరవేరుతాయని హామీ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా అదేరోజు రాత్రి ఒక వంటబ్రాహ్మణుడు తనకేదైనా పని ఇప్పించమని చందోర్కర్ వద్దకొచ్చాడు. నానా అతనిని నూల్కర్ దగ్గరకు పంపాడు. అంతేకాదు, ఆ మరుసటి  ఉదయం వంద శ్రేష్టమైన నాగపూర్ కమలాపండ్లున్న పార్సిలొకటి నూల్కర్ కు వచ్చింది. దానిపై పంపినవారి పేరు లేదు! బాబాయొక్క దివ్యశక్తిపై నూల్కర్ కు - నమ్మకం ఏర్పడింది. వెంటనే నానాసాహెబ్‌‌తో శిరిడీ వెళ్ళాడు. “నా భక్తుడెక్కడున్నా పిచ్చుక కాలికి దారంకట్టి లాక్కున్నట్లు లాక్కుంటాను” అన్న బాబా అమోఘవాక్యాలు యితని పట్ల పూర్తిగా నిజమయ్యాయి.

ఆవిధంగా అతను 1909లో ప్రప్రథమంగా శిరిడీ సందర్శించాడు. ఆ ప్రథమ దర్శనంలోనే అతనికొక వింత అనుభవాన్ని ప్రసాదించారు బాబా. కాస్త పొట్టిగా, లావుగా ఉండే నూల్కర్ వంగి బాబా పాదాలకు నమస్కరించుకుంటుండగా బాబా అతని తలను చేతి వేళ్ళతో మెల్లగా నొక్కుతూ, అలాగే వెనక్కితోసారు. నూల్కర్ ఒక్క ఉదుటున వెళ్ళి మసీదులో వున్న స్తంభం దగ్గర వెల్లకిలా పడ్డాడు. ఆశ్చర్యం! నూల్కర్ పడింది స్తంభంవద్ద కాదు, ఆనందసాగరంలో! అతనికి దాదాపు స్పృహ కోల్పోతున్నట్లనిపించింది. బాబా స్పర్శతో అతను అనిర్వచనీయమైన అనుభూతిని పొంది  ఆ ఆనందసాగరంలో కాసేపు ఓలలాడాడు. అప్పుడు అర్ధమైంది నూల్కర్ కు తన గురువు 'సాయిబాబా' అని,  తన గమ్యం 'శిరిడీ' అని! 

ఆ రోజు రాత్రి సాఠే వాడాలో భోజనానంతరం నిద్రిస్తూ ఆకస్మాత్తుగా లేచి, తనకప్పుడు కిళ్ళీ వేసుకోవాలని నానాసాహెబ్ చందోర్కర్‌‌‌‌‌తో అన్నాడు. నానాసాహెబ్‌‌కు కిళ్ళి వేసుకునే అలవాటు లేదు. సరిగ్గా అదే  సమయంలో బాబా  మసీదులో ఒక భక్తుని పిలిచి, అతని చేతికి నాలుగు కిళ్ళీలిచ్చి, “నానాతో కలిసివచ్చి సాఠే వాడాలో బసచేసివున్న ఆ ముసలాయనకి యీ కిళ్ళీలిచ్చి రా" అని ఆదేశించారు. అప్పటికప్పుడు కిళ్ళీలతో తనను వెతుక్కుంటూ వచ్చిన మనిషిని చూడగానే, నూల్కర్‌‌కు బాబా సర్వజ్ఞత అర్థమై ఆశ్చర్యపోయాడు. ఇంకా ఎక్కడో, ఏ మూలనో వున్న సంశయాలన్నీ ఆ లీలతో మటుమాయమయ్యాయి. ఆ క్షణాన్నే బాబాపట్ల దృఢభక్తి, సంపూర్ణ విశ్వాసము అతని మనసున స్థిరపడిపోయాయి. ఆ తర్వాత తను ఉద్యోగార్థం పండరికి వెళ్ళినా, అవకాశం దొరికినప్పుడల్లా శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోసాగాడు. అనతి కాలంలోనే బాబా సన్నిహిత భక్తవర్గంలో నూల్కర్ ఒకడైపోయాడు.

నూల్కర్ కంటిజబ్బు నివారణ 

ఒకసారి నూల్కర్ ప్రమాదకరమైన కంటిజబ్బుతో బాధపడసాగాడు. అతని కళ్ళబాధ భరించరానిదిగా తయారైంది. దీనికి తోడు దృష్టిలోపం కూడ వచ్చింది. కంటినిపుణుల వద్ద చికిత్సలు చేయించాడు. కానీ నివారణ కాలేదు. చివరగా బాబానాశ్రయించాడు, కోర్టుకు శలవుపెట్టి శిరిడీవచ్చి సాఠే వాడాలో బసచేసాడు. రెండు రోజులు గదిలోనే కూర్చొని బాబా నామాన్ని నిరంతరం జపిస్తూ గడిపాడు. మూడవరోజు మశీదుకెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా తమ చేతులను కళ్ళపై పెట్టుకొని షామాతో "ఈరోజు నాకళ్ళెందుకో తీవ్రంగా బాధపెడుతున్నాయి?” అన్నారు. బాబా నోటవెంట ఆ మాటలు వెలువడిన క్షణంనుండి నూల్కర్ కంటి బాధ తగ్గనారంభించి త్వరలో పూర్తి స్వస్థత చేకూరింది. చూపు కూడ చక్కగా కనబడసాగింది.

ఆ సమయంలో, అంటే, నూల్కర్ శిరిడీలోనున్నప్పుడు పండరీపురంలో కోర్టులోని ప్లీడర్లు విశ్రాంతి తీసుకొనే గదిలో వీరిని గురించి చర్చ జరిగింది. విద్యాధికుడైన నూల్కర్ తన రోగనివారణకు సాధువులను బాబాలను ఆశ్రయించడం అవివేకమని, మందులు వాడకుండ రోగాలెలా నయమవుతాయని, విద్యావంతులు నాగరికులైనవారే యిలా మౌఢ్యంగా ప్రవర్తించడం గర్హనీయమని వాఖ్యానించారు. ఈ సందర్భంలో సాయిబాబాను కూడ వ్యంగ్యమైన మాటలతో పరిహసించారు. ఈ చర్చలో పాల్గొన్న ప్లీడరొకడు చాలాకాలం తర్వాత శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా పాదాలకు భక్తితో నమస్కరించి, దక్షిణ సమర్పించి ఒక మూల కూర్చున్నాడు. అప్పుడు బాబా అక్కడున్న భక్తులనుద్దేశించి, "ప్రజలెంత టక్కరివారు? ఎదురుపడితే వంగివంగి నమస్కారాలు చేస్తారు, అడగకుండానే దక్షిణ సమర్పించి నక్క వినయాలు ప్రదర్శిస్తారు. పరోక్షంలో నిందించి, దుర్భాషలాడ్తారు” అని అన్నారు. ఈ బాణాలు తగలవలసినవారికి తగలనే తగిలాయి. అప్పుడు మాత్రం ఈ పండరీపురం ప్లీడరు తేలు కుట్టిన దొంగవలె మిన్నకుండి, తర్వాత మసీదు నుండి బయటకు వచ్చి అసలు విషయం తోటి భక్తులతో చెప్పుకున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం పండరిపురం లోని కోర్టులో ప్లీడర్ల విశ్రాంతిగదిలో జరిగిన ఈ సంభాషణంతా పూసగుచ్చినట్లు వివరించగలిగిన ఆయన మహిమకు, మహత్యానికి మరోసారి చేతులెత్తి నమస్కరించాడా ప్లీడరు. ఇకపై పరనిందా ప్రసంగాలు చేయకూడదని బుద్దితెచ్చుకున్నాడు. (చూ. శ్రీసాయి సచ్చరిత్ర 21వ అధ్యాయం)

సోర్స్: సాయిపథం ప్రధమ సంపుటము

 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.



3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo