ప్రప్రథమ సాయి దర్శనము
1908 సంవత్సరం - వేసవికాలంలో ఒకరోజున ఈ క్రింది సంఘటన జరిగింది. మా నాన్నగారు (జ్యోతీంద్ర) మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంటులో భోజనం చేసి, తను చదివే సెయింట్ జేవియర్ స్కూలుకు తిరిగి వెళుతున్నారు. ప్రతిరోజు స్కూలు విరామ సమయంలో ఇరానీ రెస్టారెంటుకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిరావడం ఆయనకు అలవాటు. ఆరోజు ఆయన రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులు ధరించి ఉన్న ఒక ఫకీరు ఆయనను పిలిచి దక్షిణ అడిగాడు. మా నాన్నగారు తన జేబులోంచి ఒక పైసా నాణెం(మధ్యలో కన్నం ఉన్న రాగినాణెం) తీసి ఆ ఫకీరుకిచ్చి స్కూలుకు సాగిపోతున్నారు. కానీ ఆ ఫకీరు ఆయనను ఆపి, అది 1894 సంవత్సరంలో ముద్రించిన ఒక పైసా నాణెం అని మా నాన్నగారితో అన్నాడు.
ఆ రోజుల్లో ప్రజలు ఒక పైసాను విరాళంగా ఇస్తూ ఉండేవారు. ఒక విద్యార్థి ఒక పైసా దానం చెయ్యడమంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం క్రింద లెక్క. మా నాన్నగారు ఆ ఫకీరుతో, ప్రతిరోజు మధ్యాహ్నభోజనం నిమిత్తం తనకు నాలుగు అణాలు ఇస్తారని, అందుచేత తాను ఒక పైసా దానం చేయగలననీ, అంతే కాకుండా, ఒక పైసా నాణెం ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరు దాని గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదనీ చెప్పారు. దానికి ఆ ఫకీరు నవ్వుతూ, “అల్లా భలా కరేగా!” అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత మా నాన్నగారు స్కూలుకు వెళ్ళిపోయారు. తరువాత, ఆ విషయం గురించి ఆయన పూర్తిగా మరచిపోయారు.
మా నాన్నగారికి ఇద్దరు అన్నయ్యలు, సత్యేంద్ర మరియు రవీంద్ర. వీరిద్దరూ వైద్య కళాశాలలో చదువుతూ ఉండేవారు. తరువాత, మా పెదనాన్న గారైన సత్యేంద్ర జీ.జీ.ఎం.సీ. (గ్రాడ్యుయేట్ ఆఫ్ గ్రాండ్ మెడికల్ కాలేజ్. ఇదే తర్వాత ఎం.బీ.బీ.ఎస్. గా రూపాంతరం చెందింది) డిగ్రీ సాధించారు. ఈయన మాతుంగాలోని కొంకణనగర్ లో ఉండేవారు. (ఇప్పుడాయన జీవించి లేరు. ఆయన కొడుకు, కూతురు మాత్రం అక్కడ నివసిస్తున్నారు).
మా నాన్నగారి సోదరుడు ఒక డాక్టరు, ఆయన బాబాయి ఒక డాక్టరు, ఆయన తాతగారు ఒక ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా అప్పటి ముంబయి వైస్రాయికి కుటుంబవైద్యుడు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే మా నాన్నగారిది వైద్యుల కుటుంబం. కుటుంబంలో ఇంతమంది వైద్యులు ఉన్నా, మా నానమ్మ మైగ్రేన్ వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేది. అన్నిరకాల మందులు వాడారు, కానీ ఆమె వ్యాధి నివారణ కాలేదు. మా నానమ్మని బాంద్రా మసీదు దగ్గరున్న పీర్ మౌలానా బాబా వద్దకు వెళ్ళమని వాళ్ళింట్లో పనిచేస్తున్న పనిమనిషి సలహా ఇచ్చింది. ఆయన ఇచ్చే ఆయుర్వేద మందులతో దీర్ఘకాలం నయమవ్వని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది.
ఆ రోజుల్లో ఒక హిందూ స్త్రీ, మసీదుకు వెళ్ళి ఒక ముస్లిం బాబాను కలుసుకోవడమంటే చాలా కష్టమైన విషయం. కానీ మా నానమ్మగారు, తనను అక్కడకు తీసుకెళ్ళమని తన కుమారుడితో చెప్పింది. స్వభావసిద్ధంగా ధైర్యవంతుడయిన మా నాన్నగారు, మా నానమ్మగారి సలహా మేరకు, ఆమె కోసం ఒక బురఖా ఏర్పాటుచేసి, ఆమెను కారులో పీర్ మౌలానాబాబా దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఎవరైనా ఎంతకీ నయం కాని వ్యాధితో బాధపడుతున్నప్పుడు మత కట్టుబాట్లను ఛేదించడం అసమంజసం కాదు కదా! కానీ, మౌలానాబాబాని కలుసుకొన్న తరువాత ఆమె తలనొప్పి తగ్గడానికి బదులు ఎక్కువయ్యింది. మా నానమ్మతో పీర్ మౌలానాబాబా, ఆమె వ్యాధిని నయం చేయడానికి తన వద్ద మందులేదని చెప్పి, “శిరిడీలో 'సాయిబాబా' అని నా సోదరుడు ఉన్నారు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీ వ్యాధిని నయం చేసి మీ బాధలన్నింటినీ పోగొడతారు” అని చెప్పడంతో వారిద్దరూ అయోమయంలో పడ్డారు కారణం - మొదటిది, మా తాతగారు ప్రార్థనా సమాజవాది కావటం వల్ల 'బాబా'లను కలుసుకోవడానికి అనుమతివ్వరని వారికి తెలుసు. ఇక రెండవది, శిరిడీ ఎక్కడ వుందో, అక్కడకు ఎలా వెళ్ళాలోనన్నది ఇంకా పెద్ద ప్రశ్న.
అయినప్పటికీ మా నాన్నగారు వెనుకాడలేదు. శ్రీసాయిబాబాను కలుసుకోవాలని వారి భవితవ్యం ముందే వ్రాసి ఉండటం వల్ల, శిరిడీ వెళ్ళకుండా వారిని ఎవ్వరూ ఆపలేకపోయారని నేను నమ్ముతున్నాను. మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంట్ యజమాని నుంచి మా నాన్నగారు బాబా గురించిన సమాచారాన్ని సేకరించారు. శిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలో ఉందని, అక్కడకు వెళ్ళాలంటే రైలులో మన్మాడ్ మీదుగా కోపర్గాం వెళ్ళాలని ఆయన తెలుసుకున్నారు. కోపర్గాం నుంచి 9 కి.మీ. దూరంలో ఉన్న శిరిడీకి గుఱ్ఱపుబండిలో వెళ్ళాలి. అంటే ముంబయి నుండి శిరిడీకి వెళ్ళి రావాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. ఏమయినప్పటికీ మా నాన్నగారు, మా తాతగారి అనుమతి సంపాదించి శిరిడీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఒక శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకులిద్దరూ బయలుదేరి శనివారం ఉదయానికి శిరిడీ చేరుకున్నారు. వారు వివరాలన్నీ సేకరించి, స్నానాదికాలు ముగించుకొని శ్రీసాయిబాబాను కలుసుకోవడానికి మసీదుకు చేరుకొని, అక్కడ ధుని (బాబా వెలిగించిన పవిత్రమైన అగ్ని) ముందు కూర్చుని ఉన్న సాయిబాబాను చూసారు. మా నానమ్మ వంగి బాబా పాదాలను తాకి నమస్కరించుకున్నారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
బాబా మా నానమ్మగారితో, “అమ్మా! బాంద్రానుంచి నా సోదరుడు పంపగా నువ్వు నావద్దకు వచ్చావు. దయచేసి కూర్చో! అమ్మా! నువ్వు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నావు కదూ?” అని అన్నారు. తరువాత సాయిబాబా తన అయిదు వేళ్ళను ఊదీతో నిండి ఉన్న ప్లేటులో ముంచి, ఆ చేతితో మా నానమ్మ గారి నుదుటి మీద మెల్లగా తట్టారు. వెంటనే ఆయన, ఆమె నుదుటిని తమ వరదహస్తంతో గట్టిగా నొక్కుతూ, “అమ్మా! నీ తలనొప్పి పూర్తిగా నివారణయింది. ఇప్పటి నుండి జీవితాంతం వరకు ఎటువంటి నొప్పీ నీ దరిచేరదు!” అన్నారు.
శ్రీసాయి చర్యకు మా నానమ్మగారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆమె ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయినా సాయిబాబాకు వారి రాక గురించి, ఆమె తలనొప్పి గురించి ఎలా తెలిసింది? బాబా తమ రెండు చర్యల ద్వారా మా నానమ్మ తలనొప్పి పూర్తిగా నివారించారు.
మొదటిది - బాబా తమ దివ్యమైన చూపును మా నానమ్మపై ప్రసరింపచేయడం.
రెండవది - ఊదీ నిండిన తమ పవిత్రహస్తంతో ఆమె నుదిటిని తాకడం.
మా నానమ్మకు అంత శక్తివంతమైన మోతాదులో మందు ఎప్పుడూ ఇవ్వబడలేదు. ఆమెలో ఎటువంటి పరివర్తన సంభవించిందనే విషయం ఆమెకు మాత్రమే తెలుసు. తలనొప్పి వల్ల ఆమె వదనంలో కనబడే బాధ మటుమాయమై, ఎంతో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆమె తిరిగి బాబా పాదాలకు నమస్కరించి, మా నాన్నగారిని కూడా బాబా పాదాలకు నమస్కరించమని చెప్పింది.
జరిగినదంతా గమనిస్తున్న మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఎప్పుడూ ఆమె అలా ఆజ్ఞాపించలేదు. మా నాన్నగారు బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నారు. వెంటనే బాబా మా నాన్నగారితో, “భావూ! నీవు నన్ను గుర్తుపట్టలేదా?” అన్నారు. మా నాన్నగారు గుర్తుపట్టలేదని చెప్పారు. అప్పుడు బాబా, “నన్ను చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు!” అని అన్నారు. ఎంత ప్రయత్నించినా మా నాన్నగారికి కొంచెం కూడా గుర్తురాలేదు.
బాబా వెంటనే తమ కఫ్నీ జేబులో నుంచి ఒక పైసా రాగి నాణాన్ని బయటకు తీసారు. ఆయన ఆ నాణాన్ని మా నాన్నగారికి చూపించి, “భావూ! ఒకరోజు నువ్వు స్కూలుకు వెళుతున్నప్పుడు, 1894లో ముద్రించిన ఈ నాణాన్ని ఒక ఫకీరుకు దక్షిణగా ఇచ్చావు, గుర్తులేదా?” అన్నారు. అప్పుడు మా నాన్నగారికి ఆ సంఘటన గుర్తువచ్చి, కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారగా, వెంటనే ఆయన బాబా పాదాలకు నమస్కరించారు. బాబా మా నాన్నగారిని లేవనెత్తి, “భావూ! ఆరోజు నువ్వు కలుసుకున్న ఆ ఫకీరును నేనే. నీవిచ్చిన ఆ పైసా నాణాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను. దీనిని జాగ్రత్తగా భద్రపరచుకో! ఇది నీకు ఎన్నోరెట్లు సంపదనిస్తుంది” అని అన్నారు.
ప్రియపాఠకులారా! మా నానమ్మగారికి, మా నాన్నగారికి ఎంతో ప్రసన్నమైన సాయిబాబా దర్శనం అయిందని, ఆ దర్శనం వారికి ఎంతో చిరస్మరణీయమైనదని మీరు పూర్తిగా నాతో అంగీకరిస్తారు! అప్రయత్నంగానే అప్పటినుండి వారు బాబాపట్ల ఆకర్షితులయ్యారు. తమ మొట్టమొదటి దివ్యదర్శనంలోనే ఆ తల్లీకొడుకులు సాయిబాబాను తమ గురువుగా భావించుకొని, పూర్తిగా సాయిభక్తికి అంకితమైపోయారు. మా నానమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది. భగవంతునియందు ఆమె భక్తి ద్విగుణీకృతమయ్యింది. బాబా ఇచ్చిన పైసా నాణెం మా ఇంటిలో పూజలో ఉంచబడింది.
సాయిబాబాను కలుసుకున్న తరువాత ఏం జరిగిందని మేము మా నాన్నగారిని అడుగుతూ ఉండేవాళ్ళం. శ్రీసాయిబాబా ప్రసన్నమైన చూపులు ఎవరినైనా అయస్కాంతంలా ఆయన వైపుకు ఇట్టే ఆకర్షిస్తాయనీ, ఎంతో శక్తివంతమైన ఆయన హస్తస్పర్శ ఎంత లోతైన గాయాన్నయినా మాన్పగలదనీ మా నాన్నగారు చెబుతూ ఉండేవారు.
సాయిబాబా ఎప్పుడూ తాను భగవంతుడినని చెప్పుకోలేదని, తాను దైవం యొక్క దూతనని చెబుతూ ఉండేవారని మీకందరికీ తెలుసు. ఖండోబా ఆలయ పూజారైన భగత్ మహల్సాపతి మొట్టమొదటిసారిగా బాబాను చూసినప్పుడే “రండి సాయి! రండి!” అని సంబోధించి, ఆయనకు సరియైన నామకరణం చేసారని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు.
మన భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక బాబాలకు నిలయం. వారి వారి భక్తులు వారిని తగిన పేరుతో పిలుచుకుంటారు. 'సాయి' అనే పేరు అన్నింటినీ సూచిస్తుందని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన వివరించిన దాని ప్రకారం మరాఠీలో 'సాయి' అనే మాటకి అర్థం: 'సా' అంటే సాక్షాత్' (సత్యమైన), 'యి' అనగా 'ఈశ్వర్' (భగవంతుడు). ఆయన దృష్టిలో 'సాయిబాబా' అంటే 'సాక్షాత్ భగవంతుడు' అని అర్థం.
మా నాన్నగారు శిరిడీ సందర్శించినప్పుడు ఆయనకు కలిగిన అనుభవాలు చాలా అద్భుతమైనవి. సామాన్య మానవులెవరైనా అటువంటి దివ్యానుభూతిని పొందినప్పుడు, సాయిబాబా అతీతమైన దివ్యశక్తులు కలిగి ఉన్నారనే నిర్ణయానికి వస్తారు. అంతటి అనుగ్రహాన్ని పొందిన కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. సాయిబాబా అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
శ్రీసాయిబాబాతో అంతటి అద్భుతమైన అనుభవం వల్ల కలిగిన అనుభూతితో తల్లీ కొడుకులిద్దరూ వెంటనే బాంద్రా తిరిగి వెళ్ళి, మా తాతగారితో ఎప్పుడెప్పుడు ఆ అనుభవం చెబుదామా అనే ఆత్రుతతో ఉన్నారు. కానీ సాయిబాబా వారిని మరికొద్ది రోజులు శిరిడీలో ఉండమని సూచించగా వారు ఆనందంగా అంగీకరించారు. కొంతసేపటి తరువాత, బాబాకు సన్నిహితంగా ఉంటూ, భక్తులకు సహాయపడుతూ ఉండే మాధవరావు దేశపాండేని (శ్యామా) కలిసినప్పుడు ఆయన వారితో, ఆ రోజు ఉదయం బాబా ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉన్నారనీ, ఎవరికోసమని తాను అడిగినప్పుడు, తన తల్లి, సోదరుడు తనను కలుసుకోవడానికి వస్తున్నట్లుగా బాబా చెప్పారని అన్నారు. అంతేకాకుండా, బాబా అనుమతి తీసుకున్న తరువాతనే భక్తులు శిరిడీ వదిలి వెళ్ళడం అక్కడి సంప్రదాయమని కూడా శ్యామా వారితో చెప్పారు.
తరువాత వారు తాము సాయిబాబా ఆజ్ఞ మేరకు శిరిడీలో మరికొన్ని రోజులు ఉంటామని, వారు పొందిన అనిర్వచనీయమైన అనుభూతిని వివరిస్తూ బాంద్రాలో ఉన్న మా తాతగారికి (బాబాసాహెబ్ తర్ఖడ్) ఉత్తరం వ్రాసారు. అలా శిరిడీలో వారం రోజులు ఉన్న తరువాత బాబా అనుమతి తీసుకుని, మరలా మా తాతగారితో కలసి వస్తామని బాబాకు మాట ఇచ్చి వారు బాంద్రాకు తిరిగి వెళ్ళారు. వారు శిరిడీలో వున్న ఆ వారం రోజులలో సాయి భక్తులయిన శ్రీమహల్సాపతి, కాకా మహాజని, శ్యామారావ్ జయకర్ మొదలైన ప్రముఖ సాయిభక్తులను కలుసుకున్నారు. వారంతా, శ్రీసాయిబాబా సాధారణ మానవమాత్రులు కారనీ, ఆయన భక్తుల బాధల నివారణకు మంచి మందులనివ్వడమే కాక, అద్వితీయమయిన శక్తులు కూడా కలిగి ఉన్నారని చెప్పారు.
బాంద్రా చేరుకున్నాక, మా నానమ్మ తన దివ్యానుభవాన్ని మా తాతగారికి వివరించినప్పుడు, ఆమె మనోభావాలను ఆయన చాలా తేలికగా కొట్టిపారేశారు. అదే సమయంలో, మా నాన్నగారి నుంచి కూడా అటువంటి అభిప్రాయాన్నే విని కొంచెం ఆశ్చర్యపోయారు. తాము మరలా మా తాతగారితో కలిసి శిరిడీ సందర్శించుకుంటామని బాబాకు చెప్పినట్లుగా కూడా వారు తెలియచేసారు.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Om Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏❤😊
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH
ReplyDelete..Om Sai Ram
Sri sai padam saranam prapadye...🌹🌹🌹🌹🙏🙏🙏... Tarkad kutumbaniki dhanyavadamulu...🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏. East godavari district AP INDIA..🙏
ReplyDeleteశ్రీ సమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై జై జై 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏80742 85553
ReplyDelete🌹అర్థం: 'సా' అంటే సాక్షాత్' (సత్యమైన), 'యి' అనగా 'ఈశ్వర్' (భగవంతుడు).
ReplyDelete'సాయిబాబా' అంటే 'సాక్షాత్ భగవంతుడు' 🌹🌹🌹🌹
🌹🌹🌹🌹Sairam🌹🌹🌹🌹
ReplyDeleteammki help cheyi tandri 🌹🌹🌹🌹