వరద నుండి కాపాడిన వరదాయి శ్రీసాయి
ప్రియమైన సాయిభక్తులారా! మీరు కనీసం ఒక్కసారయినా శిరిడీ దర్శించి వుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న శిరిడీకి, వంద సంవత్సరాల క్రితం మా నాన్నగారు వెళుతున్నప్పటి శిరిడీకి చాలా తేడా ఉన్నది. అప్పట్లో, కోపర్గాఁవ్ నుంచి శిరిడీ వెళ్ళేదారిలో, శిరిడీ పొలిమేరల్లో ఒక వాగు వుండేది. శిరిడీ గ్రామంలోనికి వెళ్ళాలంటే ఆ వాగును దాటాలి. ఆ వాగు, సంవత్సరంలో ఎక్కువకాలం ఎండిపోయి వుండి, కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తూ వుండేది. ప్రస్తుతం దానిమీద చిన్నవంతెన నిర్మించారు. ఆ రోజులలో గ్రామస్తులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ వాగు ఒడ్డుకు వస్తూ వుండేవారు. అక్కడ చాలా పొదలు ఉండటంవల్ల, రోడ్డుమీద పెద్దగా జనసంచారం లేకపోవడం వల్ల, ఆ ప్రదేశం సూర్యోదయానికి ముందు గ్రామస్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనువుగా వుండేది.
ఒక సంవత్సరం వర్షాకాలంలో మా నాన్నగారు శిరిడీలో వున్నారు. ఆయనకు వేకువఝామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత, కాకడ ఆరతికి వెళ్ళడం అలవాటు. ఈ సంఘటన జరిగినరోజు ఆయన వేకువఝామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాగు ఒడ్డుకు వెళ్ళారు. సన్నగా వర్షం పడుతుండటంతో, ఆయన తనతో పాటు గొడుగు, టార్చిలైట్ తీసుకుని వెళ్ళారు. ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటుండగా వాగు అవతలి ఒడ్డునుంచి ఎవరో గట్టిగా అరుస్తూ వుండటం వినపడింది. మొదట ఆయన ఆ అరుపులను పట్టించుకోలేదు. ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడ వున్నాడో చూద్దామని ప్రయత్నించారు, కానీ చీకటిగా వుండటం వల్ల ఆయనకు ఎవరూ కనపడలేదు. కొద్దిసేపటి తరువాత ఆ మనిషి తనను అక్కడనుండి వెంటనే పరుగెత్తి వెళ్ళిపొమ్మని అరుస్తున్నట్లుగా అర్థమయింది. అతడు మరాఠీలో “లోండా ఆలారే ఆలా! పాలా! (వరద కెరటం వస్తున్నది, పారిపో!)” అని అరుస్తున్నాడు. మా నాన్నగారికి లోండా (కెరటం) అంటే అర్థం కాలేదు. ఆయన విద్యాభ్యాసమంతా ఆంగ్ల మాధ్యమంలో జరగడం వల్ల, మరాఠీ వాడుకభాషను అర్థం చేసుకోవడం ఆయనకు కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఆ మనిషి అక్కడున్న వారందరినీ ఆ ప్రదేశం వదలి పరిగెత్తుకుని వెళ్ళిపొమ్మని హెచ్చరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఆయన హడావిడిగా తమ కాలకృత్యాలు ముగించుకొని పైకి లేచి, ఏమి జరుగుతోందో చూద్దామని చుట్టూ టార్చిలైట్ వేసి చూడగా, సుమారు 15, 20 అడుగుల ఎత్తులో నల్లటి రంగులో వరద నీటిప్రవాహం తనవైపుకు రావడం కనబడింది.
ముందురోజురాత్రి దూరంగా ఎక్కడో కుండపోతగా వర్షం కురవడంవల్ల, హఠాత్తుగా ఆ వాగుకు వరద వచ్చింది. తనకు మరణం ఆసన్నమైనదని అర్థమై, ఆయన గట్టిగా “బాబా! మేలో మలా వాఛవా!” (బాబా! నేను మరణిస్తున్నాను. రక్షించు!”) అని అరిచారు. ఆయన కళ్ళు మూసుకుని బాబా నామస్మరణ చేస్తూ కదలకుండా అక్కడే ఉండిపోయారు. కొంతసేపటి తరువాత ఆయన కళ్ళు తెరచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. తాను బ్రతికేవున్నానని, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోలేదని ఆయనకు అర్థమయింది. నీటి ప్రవాహం తనను కనీసం తాకనైనా తాకకుండా, రెండు పాయలుగా విడిపోయి తనను దాటి ప్రవహిస్తున్నది. ఆయన ఇంకా ఆ నీటి ప్రవాహంలోనే నిలబడి వున్నారు. కానీ మరణభయంతో ఆపకుండా బాబా నామస్మరణ చేస్తూనే వున్నారు. కొంతసేపటి తరువాత నీటిమట్టం తగ్గి మోకాలు లోతుకు వచ్చిన తరువాత, వరదనీరు ఆయన శరీరాన్ని తాకింది. ప్రవహించే ఆ వరదనీటిలో తన చుట్టూరా చెట్లకొమ్మలు, పొదలు, పశువులు మొదలైనవి కొట్టుకొని పోతూవుండటం చూశారు. బాబాయే తనను మృత్యుముఖం నుండి కాపాడారని అర్థమై, అక్కడికక్కడే ఆయన బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. తరువాత మెల్లగా ఆ మోకాలిలోతు నీటిలోనుండి బయటకు వచ్చి తమ బసకు వెళ్ళి స్నానం చేసారు.
ఆ ఉదయం ఆయనకు కాకడ ఆరతిని చూసే అదృష్టం చేజారిందని వేరే చెప్పనక్కరలేదు. తన బసకు వెళ్ళిన తరువాత జరిగినదంతా తన తల్లికి చెప్పారు. ఆమె మా నాన్నగారితో, బాబాయే ఆయనను మృత్యుముఖం నుంచి బయటికి లాగారని, ప్రాణభిక్ష పెట్టినందుకు వెంటనే వెళ్ళి బాబాకు ధన్యవాదాలు తెలుపమని అన్నారు. ఆయన వెంటనే పూజాసామాగ్రితో మసీదుకు వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా, బాబా రెట్టించిన స్వరంతో, “భావూ! ఇవాళ పొద్దున్నే నా సహాయం కోసం ఎందుకు అరిచావు? మరణిస్తావని భయం వేసిందా?” అన్నారు. మా నాన్నగారు వెంటనే బాబా కాళ్ళమీద పడి, బాబాకు సర్వమూ తెలుసునని, కళ్ళెదుట మృత్యువు కనపడుతూ వుంటే తనలాంటి సామాన్య మానవుడు భయపడటం సహజమేనని అన్నారు. బాబా ఆయన భుజాలు పట్టుకుని లేవనెత్తి, “భావూ! పైకి లే! నిన్ను శిరిడీకి రప్పించింది చంపడానికి కాదు. నువ్వింత త్వరగా మరణించవని గుర్తుంచుకో! భవిష్యత్తులో నువ్వు చేయవలసిన నిర్మాణాత్మకమైన పని ఎంతో వున్నది” అన్నారు.
ప్రియమైన సాయిభక్తులారా! మనలాంటి సామాన్య మానవులకు అటువంటి అనుభవాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు. నాలోని ఆలోచనాశక్తిని రేకెత్తించే విధంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను నేనిప్పుడు మీకు వివరిస్తాను. అది 1962వ సంవత్సరం జూన్ నెల. బాంద్రాలోని న్యూటాకీస్ లో 'టెన్ కమాండ్ మెంట్స్' అనే గొప్ప సినిమా ఆడుతోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సెసిల్స్ బి డిమిల్లె ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా కొలాబాలోని రీగల్ థియేటర్ మరియు బాంద్రాలోని న్యూటాకీస్ (ప్రస్తుతము అదే గ్లోబస్ థియేటరుగా మార్చబడి, తరువాత కాలంలో 70 ఎం.ఎం. స్క్రీన్, స్టీరియోఫోనిక్ సౌండుతో పునర్నిర్మించబడింది) యొక్క పాత రికార్డులన్నీ తిరగరాసింది.
నేను ఆ సినిమా చూసి, ఆ సినిమాలో చూపించిన అద్భుతాలు, మా నాన్నగారు శిరిడీలో సాయిబాబా సమక్షంలో అనుభవించిన అద్భుతలీలలు దాదాపు ఒకటేలా ఉన్నాయని అనుకున్నాను. ఎంతో బలవంతం చేసి, నాన్నగారిని కూడా ఈ సినిమా చూడటానికి ఒప్పించాను. సుమారు 30-35 సంవత్సరాల తరువాత ఆయన థియేటరుకు వెళ్ళి సినిమా చూస్తున్నారు. అందులో పర్వతాన్ని దర్శించడానికి మోజెస్ వచ్చినప్పుడు దివ్యమైన ప్రకాశం రావడం, మోజెస్ తన జ్యూయిష్ ప్రజలందరినీ ఫరోహా రాజు ఆగ్రహం నుంచి రక్షించడానికి ఈజిప్టు భూభాగం నుండి ఎర్రసముద్రం(రెడ్ సీ) ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ప్రభువును ప్రార్థించినప్పుడు, సముద్రం రెండు భాగాలుగా విడిపోవడం లాంటి దివ్యమైన దృశ్యాలు ఆయన చూశారు. మా నాన్నగారికి ఆ పిక్చరైజేషను చాలా బాగా నచ్చి, అమితానంద భరితులయ్యారు. ఆయన కళ్ళనుండి ఆనందాశ్రువులు ధారపాతంగా కారసాగాయి. మేము థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టెన్ కమాండ్ మెంట్స్ సినిమాలో చూపించిన విధంగా శ్రీసాయిబాబా కూడా మానవాతీత శక్తులు కలిగివున్నారని, మోజెస్ పాత్రకు, బాబాకు బాగా పోలిక వుందని నిర్ధారించారు. ఇంకా ఆయన నాతో, “వీరేన్! శ్రీసాయిబాబాతో వున్న అనుబంధం వల్ల నేను పొందిన అపూర్వమైన అనుభవాలను నమ్మడానికి నీకిప్పుడు తగిన ఆధారం దొరికింది ” అని అన్నారు.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
ఓం సాయిరాం జీ 🙏
ReplyDeleteSadhguru sainatha namo namaha🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏