సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 159వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • క్యాన్సర్ వ్యాధి మా కుటుంబాన్ని సాయి రక్షణ వలయంలోకి చేర్చింది

సాయిభక్తురాలినైన నేను మహాపారాయణ గ్రూపులోని సభ్యురాలిని. నా వయసు 33 సంవత్సరాలు. సాయిభక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి సాయి అద్భుతాలను ప్రచురించే సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే...

2018, మే నెలలో నేను థైరాయిడ్ గ్రంథి ఉండే భాగంలో పెద్ద గడ్డ ఉన్నట్లు గమనించాను. నేను డాక్టర్ని సంప్రదిస్తే, "థైరాయిడ్ గ్రంథి యొక్క ఒక భాగం చెడిపోయింది, దానిని శస్త్రచికిత్స చేసి తొలగించాల"ని చెప్పారు. ఆ సమయానికి మా ఇంటి పూజగదిలో సాయిబాబా విగ్రహం ఉన్నప్పటికీ సాయిబాబా గురించి నాకేమీ తెలియదు. తరువాత జులై నెలలో డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి చెడిపోయిన భాగాన్ని తొలగించారు. అయితే శస్త్రచికిత్స అనంతరం వైద్యులు బయాప్సీ పరీక్ష నిర్వహించి, అది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్ అని నిర్ధారించి, మిగిలిన భాగాన్ని కూడా తొలగించాలని చెప్పారు. క్యాన్సర్ అనీ, పైగా రెండు వారాల్లోనే మళ్ళీ శస్త్రచికిత్స అనేసరికి కుటుంబంలోని ప్రతిఒక్కరూ హతాశులయ్యారు. అయితే నేను అదృష్టవంతురాలిని. కుటుంబమంతా నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా నా చెల్లెలు నాకు దేవుడిచ్చిన వరం. నాకు సమస్య మొదలైన రోజునుండి తను నాతో ఉంది. తను నాకోసం పూజగదిలో ఏడుస్తూ ప్రతి ఒక్క దేవుడిని 'నాకు తగినంత మానసిక ధైర్యాన్ని చేకూర్చమ'ని ప్రార్థిస్తుండేది. కొన్నిసార్లు ఏ దేవుడూ మాకు సహాయం చేయడం లేదని దేవతలపై కోపంగా అరుస్తుండేది. ఇలా ఉండగా నా రెండో శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒకరోజు తను ఫేస్‌బుక్ లో సాయి చేసే అద్భుత వైద్యం గురించి తెలుసుకుంది. వెంటనే తను పూజగదిలోకి వెళ్లి, "సాయీ! మాకు ఇతర దేవతల నుండి సహాయం రాలేదు. దయచేసి ఈ క్లిష్ట పరిస్థితి నుండి మేము బయటపడేలా మాకు సహాయం చెయ్యండి" అని ప్రార్థిస్తూ సాయిబాబా విగ్రహాన్ని తన గుండెలకు హత్తుకుని బాగా ఏడ్చింది.

తరువాత నేను శస్త్రచికిత్సకు వెళ్ళేముందు నా చెల్లి నాతో, “ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి” అన్న సాయి మంత్రాన్ని కనీసం 18 సార్లు జపించమని చెప్పింది. తను చెప్పినట్లుగానే నేను ఆ నామాన్ని జపించడం మొదలుపెట్టాను. నా భర్త ఆసుపత్రికి వెళ్లి మధ్యాహ్నం శస్త్రచికిత్స ఉండేలా బుక్ చేసుకుని వచ్చారు. అతను ఆసుపత్రి నుండి ఇంటికి చేరగానే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి, "కొన్ని కారణాలరీత్యా మధ్యాహ్నం శస్త్రచికిత్స చేయడం కుదరదు. అందుచేత ఇంకో రెండు గంటల్లో మీరు హాస్పిటల్లో ఉండాల"ని చెప్పారు. ఆరోజు గురువారం. నా కర్మ ప్రకారం ఆరోజు నేను శస్త్రచికిత్స చేయించుకున్నాను. తర్వాత నన్ను జనరల్ వార్డుకు మార్చారు. నా తల్లి, చెల్లి, తన భర్త భోజనం చేయడానికి సమీపంలో ఉన్న హోటల్‌కు వెళ్ళారు. వాళ్ళు భోజనం ముగించుకుని హోటల్ నుండి బయటకు వస్తుండగా ఒక ఫకీరు వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాడు. క్షణాల్లో ఆ ఫకీరు మళ్ళీ వెనుకకు తిరిగి నా చెల్లెలి భర్త వద్దకు వచ్చి తెలియని భాషలో ఏదో అడిగాడు. నా చెల్లెలి భర్త ఆ ఫకీరుకు ఆసుపత్రిని చూపిస్తూ, "మా వదిన ఆరోగ్యం బాగాలేదు. అందువలన ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. దయచేసి తనకోసం మీరు ప్రార్థించండి" అని చెప్పాడు. ఆ ఫకీరు నా చెల్లెలి భర్తని డబ్బులు అడిగాడు. అతను ఫకీరుకు 50 రూపాయలు ఇచ్చాడు. మరుక్షణం ఆ ఫకీరు ఒక సాయిబాబా ఫోటోను, 16 రూపాయలను అతని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అప్పటికి సాధారణంగా సాయి తన భక్తులను అడిగే దక్షిణల గురించిన వివరాలు మాకు తెలియవు.

వాళ్ళు హాస్పిటల్‌కు తిరిగి వచ్చి ఆ సంఘటన గురించి నాకు వివరించి, సాయిబాబా ఫోటోను నాకు చూపించారు. అది ఫోటోనే అయినప్పటికీ నాకు ఆయన వాస్తవరూపంలా కనిపించి ఆయన నాతో ఉన్న ఉనికిని అనుభూతి చెందాను. ఇంతలో అకస్మాత్తుగా నా చెల్లెలి భర్త తన చేతిని నా తలపై పెట్టి కొంతసేపు అలానే ఉంచాడు. ఆ సమయంలో నేను గొప్ప ఉపశమనం పొందాను. నా హృదయం ప్రశాంతంగా అయిపోయింది. ఆ సమయం నుండి సాయి మమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరించారు. మేము ఆయన రక్షణ వలయంలోకి వెళ్ళాము. శస్త్రచికిత్స ఉదయానికి మారకపోతే మేము ఆ ఫకీరును కలుసుకునే వాళ్ళమో లేదో గాని అంతా సాయి ప్రణాళికేనని మేము గ్రహించాము. తరువాత సాయి సచ్చరిత్ర చదివి ఆయన భక్తుల అనుభవాల గురించిన వివరాలు తెలుసుకునేకొద్దీ ఆయన మహాసమాధి చెందే సమయానికి ఆయన జేబులో 16 రూపాయలు మాత్రమే ఉన్నాయని మాకు తెలిసింది. అప్పుడు శస్త్రచికిత్స జరిగినరోజు వచ్చిన ఫకీరు మరెవరో కాదు, నా తండ్రి సాయేనని మాకు అర్థమైంది. తరువాత 8 నెలల్లో నేను, నా కుటుంబసభ్యులు చాలా సాయి అద్భుతాలను చూసాము. ఈ క్రింది అనుభవం సాయిపై మాకున్న విశ్వాసాన్ని అనంతం చేసింది.

నేను మహాపారాయణ గ్రూపులో చేరి పారాయణ ప్రారంభించాక జరిగిన అనుభవమిది. శస్త్రచికిత్స జరిగిన 6 నెలల తరువాత నేను నా రెగ్యులర్ ఫాలోఅప్ కోసం హాస్పిటల్‌కు  వెళ్ళాను. అప్పుడు నా మెడభాగానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి రెండు అనుమానాస్పద కణితులు గుర్తించారు డాక్టర్. రిపోర్టును బట్టి నాకు మళ్ళీ క్యాన్సర్ వచ్చినట్లుగా డాక్టర్ అనుమానం వ్యక్తం చేసి, బయాప్సీ చేయించుకోమని సూచించారు. ఆ మాట వింటూనే నా హృదయం బద్దలైపోయినట్లు అనిపించింది. కానీ తేరుకొని వెంటనే బయాప్సీ చేయించుకున్నాను. రిపోర్ట్స్ 3 రోజుల తరువాత వస్తాయని చెప్పారు. ఆ మూడురోజుల్లో నేను పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. కానీ సాయిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో సాయి నుండి నాకు, "ఇది మీకు పరీక్ష సమయం. మీరు దానినుండి విజయవంతంగా బయటపడతారు" అని ఒక సందేశం వచ్చింది. దానితో నాకు ధైర్యం వచ్చింది. తరువాత వచ్చిన రిపోర్టులో ఆ కణితులు ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చాయని, క్యాన్సర్ కాదని తేలింది. సాయి నా నమ్మకాన్ని నిలబెట్టి నా ఆందోళన తీసేశారు. "లవ్ యూ సాయి!"

సాయి ఎప్పుడూ మనకి తోడుగా ఉంటారు. కష్టసమయాల్లో మనకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకసారి ఆయన రక్షణ వలయంలోకి ప్రవేశించిన తర్వాత మన విశ్వాసం, సహనం మనల్ని ఇంకా ఇంకా సాయికి దగ్గర చేస్తాయి. సాయి గురించి మేము తెలుసుకుని కొన్ని నెలలు మాత్రమే అయ్యింది. తెలిశాక - ఆయనే నా దైవం, సంరక్షకుడు అని తెలియక నా జీవితంలో 32 సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయని అనిపిస్తుంది.

సాయి చెప్పినట్లుగా నేను సాయి యొక్క మామిడిచెట్టు నుండి రాలిపోయే పువ్వులా లేదా పిందెలా ఉండాలని అనుకోవడంలేదు, పూర్తిగా అభివృద్ధి చెందిన మామడిపండులా ఉండాలనుకుంటున్నాను. "సాయీ! నా కోరిక మన్నించండి".

సాయినాథా! శరణం!

source: https://www.saishiridi.com/how-sai-helped-in-curing-cancer-a-devotee-story?fbclid=IwAR335p9b4B5M6ugV_iIdzUL3_QA7MLoGib5tP0hGMoO2FAqx-k_-0kgskvo

1 comment:

  1. ఓం శ్రీ సాయినాథ్మహరాజ్ కీ జై.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo