సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 162వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. అవసరంలో దారిచూపి నడిపించేది సాయినాథుడే
  2. బాబా నాతో ఉన్నారని తెలియజేసిన అనుభవం

అవసరంలో దారిచూపి నడిపించేది సాయినాథుడే!

బెంగుళూరునుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు లక్ష్మి. నా వయస్సు 70 సంవత్సరాలు. మేము ఎన్నో ఏళ్ళుగా బెంగుళూరులో నివాసముంటున్నాము. ఎంతోమంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూవుంటే చూసి నా అనుభవాన్ని కూడా పంచుకోవాలని నా మనసు ఎంతగానో ఉవ్విళ్లూరింది. అందుకే నేనిప్పుడు తొలిసారిగా దాదాపు 22 ఏళ్ళ క్రితం జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. అంతకుముందు రెండు మూడుసార్లు శిరిడీ వెళ్లినప్పటికీ ఈ అనుభవం నా తొలి అనుభవమని చెప్పాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగాకే నేను బాబాకు దగ్గరయ్యాను. ఇక నా అనుభవానికి వస్తే... 

అది 1997వ సంవత్సరం. గుంటూరులో మా పెద్దమనవడు జన్మించే సమయం. పుట్టేటప్పుడు వాడి మెడ చుట్టూ ప్రేగులు అల్లేసుకుని ఉన్నాయి. పుట్టిన తరువాత వాడు ఏడవలేదు. డాక్టర్లు 'నమ్మకంలేద'ని చెప్పేశారు. మా వియ్యంకుడు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పి, "ఇప్పుడేమి చేద్దామక్కా?" అని అడిగారు. దానికి నేను, "చేసేదేముంది? ఆ భగవంతునికే మ్రొక్కుకుందాం" అన్నాను. తరువాత నేను బాధపడుతూ కూర్చునివుంటే మా పక్కింటామె వచ్చి, "ఏమీ బాధపడొద్దు. అన్నింటికీ సాయినాథుడే ఉన్నాడు" అని నన్ను ఓదారుస్తూ, "సచ్చరిత్ర 11 రోజులు పారాయణ చేస్తే తప్పకుండా ఫలితముంటుంది. 'మైలలో ఎలా చేసేది?' అనకు. అటువంటివేమీ పట్టించుకోకు. బాబా విషయంలో అవి అడ్డుకావు. నువ్వు పారాయణ చేయి, తప్పక ఫలితముంటుంది" అని చెప్పింది. నిజానికి సచ్చరిత్ర పుస్తకం ఎప్పటినుండో నావద్ద ఉన్నప్పటికీ నేను అప్పటివరకు చదవలేదు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని, సాయిని స్మరించుకుంటూ పారాయణ చేయడం మొదలుపెట్టి సాయంకాలానికి పూర్తి చేశాను. మరుక్షణంలో మా వియ్యంకుడి దగ్గరనుండి, "బాబు బాగున్నాడు. ఇంక ఫరవాలేదు" అని ఫోన్ వచ్చింది. ఇదంతా సాయినాథుడి మహిమ వల్లనే జరిగిందని నాకు దృఢమైన నమ్మకం ఏర్పడింది. ఆరోజునుండి ఏ కష్టం వచ్చినా ఆయన మీదనే భారంవేసి ఉంటున్నాను. ఆయనే మమ్మల్ని సదా కాపాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఆశీస్సులతో మా మనవడు బి.టెక్ చదువుతున్నాడు. "అన్నింటికీ చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ! మీ చల్లని నీడలో మా కుటుంబంతా కలకాలం చల్లగా ఉండాలి. మీ భక్తులందరికీ మీ ఆశీస్సులు అందజేయండి బాబా!"

బాబా నాతో ఉన్నారని తెలియజేసిన అనుభవం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాధారణ సాయిభక్తురాలిని. 2009లో నాకు బాబాతో అనుబంధం ఏర్పడింది. అయితే గత మూడు నాలుగేళ్లలో చాలా అనుభవాల ద్వారా బాబా ఆశీస్సులు పొందాను.

కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా నేను ప్రతి సంవత్సరం ఎం.ఆర్.ఐ స్కాన్ చేయించుకోవాల్సివుంది. కానీ గత రెండేళ్లలో చేయించుకోలేకపోయాను. చివరికి ఈ సంవత్సరం స్కాన్ చేయించుకోవడానికి నేను, నా భర్త నిర్ణయించుకున్నాము. అయితే, 'రిపోర్టుల్లో ఏమొస్తుందో, ఏమిటో' అని మనసులో మా ఇద్దరికీ ఒకటే భయం, ఆందోళన. ఇంటినుండి బయటకు వెళ్తూనే నా మనస్సులో, 'దారిలో ఏదో ఒక రూపంలో బాబా దర్శనమిస్తే ఆయన నాతో ఉన్నారని, అంతా బాగుంటుందన్న సందేశమని' అనుకున్నాను. అదే విషయం కొన్ని నిమిషాలపాటు బాబాని ప్రార్థించి, తరువాత పూర్తిగా దానిగురించి మర్చిపోయాను. హఠాత్తుగా హాస్పిటల్ కాసేపట్లో చేరుకుంటామన్న సమయంలో 'ఎక్కడా బాబా కనిపించలేద'ని గుర్తించాను. దానితో నాకు చాలా భయమేసింది. మరుక్షణం బాబా ఫోటో ఉన్న ఒక కారు మా కారు పక్కనుండి వెళ్ళింది. కానీ మా కారు స్పీడుగా పోతున్నందున నేను సరిగా చూడలేకపోయాను. 'సరే, ఎలా అయితే ఏముంది? బాబా కనిపించారు కదా!' అని నా మనసుకు సర్దిచెప్పుకున్నాను. అంతలో మరో కారు వెనుక అద్దంపై బాబా స్టిక్కర్ ఉండటం చూసాను. సంతోషంతో నాకు కన్నీళ్లు వచ్చేశాయి. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అక్కడితో అయిపోలేదు. మరి రెండు, మూడు నిమిషాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ కి చేరుకున్నాము. అక్కడ రిసెప్షన్ లో పెద్ద బాబా విగ్రహం ఉంది. కన్నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో బాబాకు నమస్కరించుకున్నాను. తరువాత నేను స్కాన్ కోసం వెళ్ళాను. నా భర్త కూడా నాతోపాటే ఉన్నారు. మేమిద్దరమూ ఆ సమయమంతా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాము. స్కాన్ మొదలయ్యాక స్కాన్ జరుగుతున్ననంతసేపు నా భర్తకు శ్లోకాలు, బాబా పేరు జపిస్తున్న కొన్ని గొంతులు వినిపించాయి. నిజానికి తను నాలాగే బాబాను నమ్ముతారు కాని, అంతగా మాట్లాడరు. సచ్చరిత్ర చదవడంగాని, బాబా నామస్మరణ చేయడంగాని చేయరు. అయినప్పటికీ తనకి అద్భుతమైన అనుభవం ఇచ్చారు బాబా. ఆ విషయానికి నేను చాలా సంతోషించాను. బాబా కృపతో స్కాన్ రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. "మరో సంవత్సరం నాకు ఉపశమనం కలిగించినందుకు ధన్యవాదాలు బాబా! ఇది ఎవరికైనా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం మీరు నాతో ఉన్నారని తెలియజేసిన గొప్ప అనుభవం బాబా! కోటి కోటి ధన్యవాదాలు బాబా! నేను, నా భర్త కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. దయచేసి మంచి ఆరోగ్యం, శాంతి ప్రసాదించి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా! మమ్మల్ని క్షమించి దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉండండి". బాబా మనతో ఉన్నారని ఎప్పుడూ మరిచిపోకండి. ఆయన మనకోసం అద్భుతాలు చేస్తారు. ఆయనకేదీ అసాధ్యం కాదు. మనం కేవలం దృఢమైన విశ్వాసంతో ఆయనను ప్రార్థిస్తే చాలు.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2409.html

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo