సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 180వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా ఇచ్చిన పునర్జీవితం
  2. సాయి ఆశీస్సులు

బాబా ఇచ్చిన పునర్జీవితం

విజయవాడ నుండి సాయిభక్తుడు నరేష్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని(జీవితాన్ని) మనతో పంచుకుంటున్నారు.

నా పేరు నరేష్ కుమార్. మాది విజయవాడ. మా నాన్నగారు బంగారపు పని చేస్తుంటారు. నాకు ఊహ తెలిసినప్పటికే మా తాతగారు బాబా భక్తులు. నా చిన్నవయసునుంచే మా అమ్మ నన్ను విద్యాధరపురంలో వున్న సాయిబాబా గుడికి తీసుకువెళ్తుండేది. బాబాని చూస్తూ వుంటే నాకు చెప్పలేని ఆనందం కలుగుతుండేది. మేము ఏ పనిమీద వెళ్తున్నా బాబా ఊదీ పెట్టుకొని వెళ్ళమని మా అమ్మ ఇప్పటికీ చెబుతుంటుంది.

2007వ సంవత్సరంలో నా మిత్రులు కొందరు నందిగామ దగ్గరలో వున్న (చందర్లపాడు వైపు) రామన్నపేట అనే గ్రామ సమీపాన కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయని అనటంతో, ఒక ఆదివారం ఉదయం మిత్రులందరం కలిసి వజ్రాల వేటకు వెళ్ళాము. మధ్యాహ్నం వరకు కొన్ని రంగురంగుల రాళ్ళు సేకరించాము. తరువాత దగ్గరలోనే వున్న కృష్ణానదిలో స్నానం చేద్దామని ముందుగా నేను నదిలోకి దిగాను. ఆ చోట లోతు ఎక్కువగా(ఇరవై అడుగులు) ఉన్నందున దిగటం దిగటమే నేను నీట మునిగిపోయాను. ఈత రానందున ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. అది చూసిన నా మిత్రులు కంగారుపడి సహాయంకోసం ఎవరైనైనా పిలుచుకు రావడానికి పరుగులు తీసారు. ఇక్కడ నేను ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాను, ఎటువైపు చూసినా నల్లని చీకటి. దాదాపు నేను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. ఆ స్థితిలో నాకు బాబా గుర్తుకొచ్చారు. వెంటనే నేను నా రెండు చేతులూ జోడించి, “నా పని అయిపోయింది బాబా, నన్ను మీరే కాపాడాలి” అని మనసులోనే అనుకున్నాను. అంతే! కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలో బాబా బాబా నన్ను ఒడ్డుకు చేర్చారు. జరిగినదంతా కలో, నిజమో అర్థం కాలేదు. నెమ్మదిగా తేరుకుని, నా ప్రాణాలు కాపాడిన బాబాకు కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అంతలో నా మిత్రులు చుట్టుప్రక్కలవారిని పిలుచుకొచ్చారు. అప్పటికే నేను ఒడ్డున ఉండటం చూసి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడికి ఒక పెద్దావిడ వచ్చి, “ఈ గోతిలో పడి చాలామంది చనిపోయారు బాబూ. నువ్వు ఒక్కడివే బ్రతికి బయటపడ్డావు” అన్నారు. నేను వారితో, “బాబానే నన్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు” అని చెప్పాను. సాయిబాబా లీలలు సామాన్యులకు అంతుచిక్కనివి. ఆరోజు బాబా నన్ను కాపాడకపోయివుంటే ఈరోజు నేను మీముందు ఇలా ఉండేవాడిని కాదు. అంతటి ప్రమాదం నుండి నన్ను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించిన సాయికి నేను నా జీవితాంతం ఋణపడివుంటాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

సాయి ఆశీస్సులు

యు.ఎస్.ఎ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:  


నేను చాలాకాలం నుండి సాయిభక్తురాలిని. నేను ఇతరులనుంచి అతితక్కువ సహాయాన్ని పొందుతూ ఒంటరిగా కష్టపడుతున్న మహిళను. స్వల్ప మార్గదర్శకత్వంతో జీవితంలో ప్రతిదీ నేనే ఒంటరిగా చేసుకుంటున్నాను. నేను చికాగోలో ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రాజెక్టు ఒప్పందం ముగియనుండటంతో నేను ఆందోళనపడ్డాను. ఆ సమయంలో నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో అడగగా, 'నీకెందుకు ఆందోళన?' అని సమాధానం వచ్చింది. దాంతో 'అంతా బాబా చూసుకుంటారు' అని ధైర్యంగా ఉన్నాను. తరువాత నా ప్రాజెక్టు చివరిరోజున నేను నా మనసులో, 'తరువాత బ్యాంక్ ప్రాజెక్ట్ రావాల'ని అనుకుంటుండగా 'SAIA' అనే ట్రక్కు నా దృష్టిలో పడింది. అలా బాబా ఆశీర్వదించారని నేను చాలా సంతోషించాను. అద్భుతం! తదుపరి నాకు న్యూయార్కులో వచ్చిన ప్రాజెక్టు బ్యాంకు ప్రాజెక్టే! అక్కడి ప్రాజెక్టు మేనేజరు వీలైనంత త్వరగా నేను అక్కడికి చేరుకోవాలని కోరారు. అందువలన నేను వెంటనే చికాగో నుండి న్యూయార్కుకు మకాం మార్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అంతకుముందెప్పుడూ నాకు స్థలమార్పిడి అనుభవం లేని కారణంగా చాలా టెన్షన్ పడ్డాను. ముఖ్యంగా నా కారును క్రొత్తచోటుకు ఎలా తీసుకుపోవాలో నాకు తెలియలేదు. సహాయం కోసం ఇంటర్నెట్‌లో పరిశోధించాను కానీ, ఏమాత్రం తెలియని కారు ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలను నమ్మడంపై నాకు అనుమానాలు తలెత్తాయి. అటువంటి పరిస్థితిలో సహాయం కోసం నేను నా ప్రియమైన సాయిని ప్రార్థించి, ఆయన ఆశీస్సులను అభ్యర్ధించాను. ఆ విషయమై నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబా సమాధానం కోసం చూస్తే, "నువ్వు ప్రయాణం చేస్తావు. ప్రయాణం సుఖంగా ముగుస్తుంది" అని వచ్చింది. వెంటనే నేను ఇంటర్నెట్ ద్వారా ఒక ఏజెన్సీని సంప్రదించి, ఆ వ్యక్తితో మాట్లాడాను. అతను చాలా స్నేహపూర్వకంగా మాట్లాడి చక్కగా సహాయం చేశాడు. అనేక ఇతర ఏజెన్సీలను కూడా నేను సంప్రదించినప్పటికీ అతనిపై నమ్మకం కలిగింది. అతను నామమాత్రంగా పైకం వసూలు చేసి 2 రోజుల్లో డ్రైవరును ఏర్పాటు చేశాడు. నిజంగా ఇది ఒక అద్భుతం! ఎందుకంటే సాధారణ ధరలో డ్రైవర్ దొరకాలంటే ఒక వారం పడుతుంది. 2 రోజుల్లో కావాలంటే చాలా ఎక్కువ ధర చెప్తారు. అలాంటిది బాబా నాకు స్వల్పసమయంలో సాధారణ రేటుతో డ్రైవరును చూపించారు. బాబా దయతో నేను చికాగోలో ఉండగానే న్యూయార్క్‌లో నాకు వసతి కూడా ఏర్పాటైంది. తరువాత నేను న్యూయార్క్ చేరుకున్నాను. అక్కడి స్టాఫ్ చాలా స్నేహపూర్వకంగా నన్ను ఆహ్వానించి, ఒక కుటుంబసభ్యురాలిలా పరిగణిస్తూ నాతోపాటు ఫ్లషింగ్ లో ఉన్న శిరిడీసాయి మందిరానికి కూడా వచ్చారు. నా ఊహకందని విధంగా నాకు ఎంతో సహాయం చేస్తూ ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇదంతా సాయి ఆశీస్సుల కారణంగానే. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo