సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 168వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయి పరీక్షిస్తారు, కానీ మనల్ని వదిలిపెట్టరు
  2. పిలిచినంతనే మాకు ఏ హానీ జరగకుండా కాపాడారు బాబా

సాయి పరీక్షిస్తారు, కానీ మనల్ని వదిలిపెట్టరు

పూణే నుండి సాయిభక్తురాలు రమ్య తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ ఓం సాయిరాం! నేను సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. నేను నా జీవితంలో ఆరోగ్యసమస్యలు, ఉద్యోగం లేకపోవడం, పిల్లలు లేకపోవడం, నాన్న ఆరోగ్యసమస్యలు ఇలా చాలా సమస్యలతో కష్టకాలాన్ని అనుభవిస్తున్నాను. అయితే సాయి నా ఈ సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తారని నాకు తెలుసు.

అటువంటి పరిస్థితులలో నేను, నా భర్త కలిసి గణేశహోమం, నవగ్రహశాంతి ఇంట్లో చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ నా అనారోగ్యం కారణంగా, మరీ ముఖ్యంగా కొత్త నగరం కావడంవలన హోమానికి అవసరమైనవన్నీ ఎలా సమకూర్చుకోగలుగుతామోనని  నేను చాలా భయపడ్డాను. ఉదయాన్నే లేచి ఆరుగురు పండితులకు వంట చేయాలి. మా స్వంత ఊరిలో మరుసటిరోజు 2019, జనవరి 18 శుక్రవారం చేయాల్సిన పూజకు అదేరోజు రాత్రి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అవన్నీ ఎలా చేయగలుగుతానా అని ఒకటే ఆందోళనపడ్డాను.

సమీపంలో ఉన్న ఒక దుకాణదారునికి  కూరగాయలు, ఇంకా ఇతర వస్తువులను ఆర్డర్ చేసి, "గురువారం ఉదయం నేను వచ్చి వాటిని తీసుకుంటాను, ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచండ"ని చెప్పాను. నేను గురువారం ఉదయం వెళ్లేసరికి అతను నా ఆర్డర్ సంగతి మర్చిపోయి బయటకు వెళ్లిపోయాడని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నా ఆరోగ్యసమస్యలతో చాలాదూరంలో ఉన్న మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలను తెచ్చుకోవడానికి నాకెటువంటి సహాయమూ లేదు. అప్పటికే దాదాపు మధ్యాహ్నం అయినందున ఏం చేయాలో నాకు అర్థంకాక నేను సాయిని, "నన్ను ఎందుకు విడిచిపెట్టారు?" అని అడిగాను. ఇంతలో నేను వచ్చిన ఆటో అతను, "దగ్గరలో ఒక పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో తాజా వస్తువులు సబ్సిడీ ధరలకు లభిస్తాయి. నేను 4.30కి వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాన"ని మాట ఇచ్చాడు. ఆ మాటలతో నాకు కాస్త ఊరటగా అనిపించింది. ఇంటికి వచ్చి భోజనం చేసిన తరువాత అతను వస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి 4 గంటలకి అతనికి ఫోన్ చేశాను. నన్ను మరింత పరీక్షించడానికన్నట్లు అతను, "బిజీగా ఉన్నాను. కాబట్టి నేనిప్పుడు మీ ఇంటికి రాలేన"ని చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాబా ముందు నిల్చొని, "నన్నెందుకిలా పరీక్షిస్తున్నార"ని ఏడ్చాను. తరువాత నా భర్తకు ఫోన్ చేసి, "నేను దగ్గరలో ఉన్న ఆటోస్టాండులో ఆటో తీసుకుని మీవద్దకు వస్తాను. ఇద్దరం కలిసి సిటీ మార్కెట్ కి వెళదామ"ని చెప్పి బయలుదేరాను. నేను మా వీధి దాటి ఆటోస్టాండ్ సమీపంలో ఎడమవైపు తిరిగాను. ఆశ్చర్యం! అక్కడొక పెద్ద రైతుబజారు ఏర్పాటు చేయబడివుంది. నేను వాళ్ళని విచారిస్తే, "ప్రతి గురువారం ఇక్కడ మార్కెట్ పెట్టాలని  ప్రణాళిక చేసుకున్నామ"ని చెప్పారు. సాయి చేసిన సహాయం చూడండి! ఇంటి సమీపంలోనే తాజా కూరగాయలు నాకు దొరికేలా చేసారు. అదికూడా సబ్సిడీ ధరలకే. కళ్ళనిండా కన్నీళ్లు నిండిపోగా మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

అక్కడితో ఆగలేదు బాబా కృప. మరుసటిరోజు కూడా ఎవరి సహాయం లేకుండా పదిమందికి వంట పూర్తి చేయగలిగాను. వంటకాలన్నీ రుచికరంగా వచ్చాయి. పండితులందరికీ బాగా నచ్చాయి. సాయి దయతో పూజ బాగా జరిగింది. మరుసటిరోజు సొంత ఊరిలో పూజలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరిగాయి. "ధన్యవాదాలు సాయీ! దయచేసి ఎల్లప్పుడూ మాతో ఉండండి. అందరినీ మంచి ఆరోగ్యంతో, శాంతిసౌఖ్యాలతో, ఆనందంతో ఉండేలా ఆశీర్వదించండి".

పిలిచినంతనే మాకు ఏ హానీ జరగకుండా కాపాడారు బాబా

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


కొన్నిసంవత్సరాల క్రిందట ఒకరోజు వేకువఝామున 5 గంటల సమయంలో నేను, మావారు వాకింగ్ కి వెళ్ళాం. ఆ సమయంలో చిమ్మచీకటిగా ఉండి, అక్కడక్కడ కొన్ని వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. మేము నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఒక బైకు మా వద్దకి వచ్చి ఆగింది. ఆ బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తుల మొహమంతా గుడ్డతో కప్పబడివుండి, కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. వాళ్ళు బైకు దిగి ఏదో అడ్రస్ చెప్పి దానిగురించి అడిగారు. మాకు తెలియదని చెప్పి మేము మా నడక కొనసాగించాము. వాళ్ళు మా వెనకే వచ్చారు. హఠాత్తుగా వాళ్లలో ఒకతను నా గొంతుపై పదునైన కత్తి పెట్టి నా మెడలోని గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. ప్రక్కనున్న మావారు నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఏ మాత్రం అవకాశం దొరికినా పరుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అనుకోని సంఘటన కారణంగా భయంతో నాకు నోటమాట రావడం లేదు. అంతలో మావారు చాలా బిగ్గరగా "సాయిరామ్, సాయిరామ్" అని అరవడం మొదలుపెట్టారు. ఒక్కక్షణం వాళ్ళు అలాగే స్తబ్ధుగా నిలబడిపోయారు. ఇంతలో మావారి అరుపులకి ఆ దగ్గరలో ఉన్న ఒక ఇంటివాళ్ళు లైట్లు వేయడంతో ఆ ఇద్దరూ బైకు స్టార్ట్ చేసి పారిపోయారు. నేను భయంతో వణికిపోతుండగా ఆ ఇంటివాళ్ళు మమ్మల్ని తమ ఇంటి లోపలకి తీసుకుని వెళ్లారు. ముందుగదిలోకి అడుగుపెడుతూనే, “నేను ఇక్కడ ఉండగా భయమెందుకు?" ("WHY FEAR WHEN I AM HERE”) అనే అక్షరాలతో ఉన్న సాయిబాబా ఫోటోను చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆనందంతో నేను ఏడ్చేశాను. వాళ్ళు మాకు పాలు, బాబా ఊదీని ఇచ్చారు. తరువాత మేము మా ఇంటికి తిరిగి వచ్చేశాము. అంతా బాబా దయ. పిలిచినంతనే మాకు ఏ హానీ జరగకుండా కాపాడారాయన. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీ మేలు ఎప్పటికీ మరువలేము".

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo