సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 163వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • జవానుగా వచ్చి ఆకలి తీర్చి, సంతానాన్ని ప్రసాదించిన శ్రీసాయి

నా పేరు మొహమ్మద్ అలీ రావు. నేనిప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

అది 2011 సంవత్సరం. అప్పటికి మా అభిజ్ఞా(మా అబ్బాయి) పుట్టలేదు. పిల్లలకోసం నా అర్థాంగి ఎక్కని మెట్టూ లేదు, మొక్కని దేవుడూ లేడు. హఠాత్తుగా ఒకరోజు నా భార్య శిరిడీ తీసుకువెళ్ళమని అడిగింది(నేను అంతకుముందు చాలాసార్లు శిరిడీ వెళ్ళాను). అప్పటికే కోర్టు కేసుల విషయంగా చేతిలో డబ్బంతా ఆవిరైపోయింది. నెలజీతం మీదే సంసారం నడుపుకోవాల్సిన పరిస్థితి. అదేదో సామెత చెప్పినట్లు, వెళ్ళొద్దంటే పాపం చుట్టుకుంటుందని భయం, పోనీ వెళదామంటే చేతిలో డబ్బులు లేవు. నేను బాగా ఆలోచించిన తరువాత తెగించి నేను పనిచేసే చోట యజమానిని అడ్వాన్సుగా కొంత మొత్తం ఇమ్మని అడుగుదామని నిర్ణయించుకున్నాను. శిరిడీకి రానూ పోనూ టిక్కెట్లకి, అక్కడ రూం అద్దెకు, మా తిండికి ఇలా ప్రతిదానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకొనిమరీ మూడువేల రూపాయలు ఇమ్మని నా యజమానిని అడిగాను. ఆయన ఎంతో ఉదారంగా 'తిరిగి ఇవ్వనక్కరలేద'ని చెబుతూ నాలుగువేల రూపాయలు నా చేతిలో పెట్టారు.

ఆ డబ్బులు పట్టుకొని మైత్రీవనంలో ఉన్న రైల్వే బుకింగ్ కౌంటరుకు వెళ్లి నాకు, నా భార్యకు మన్మాడ్ వరకు రానూ, పోనూ టికెట్లు బుక్ చేసాను. నా భార్య రైల్లో అమ్మే ఆహారపదార్థాలు తింటే ఆరోగ్యం చెడిపోతుందని(ఉట్టిదే... రైల్లో అమ్మే పదార్థాల ధర ఎక్కువగా ఉంటుందనే ముందుచూపుతో నా భార్య చేసిన ఆలోచన) రెండురోజులకు సరిపోయేలా చపాతీలు, తడి తగలకుండా చేసిన ఆలూ కుర్మా, చిన్న స్టీల్ డబ్బాలో ఆవకాయ, చింతపండు పులిహోర, మరో చిన్న డబ్బాలో పెరుగు(ప్రయాణంలో వేడి చేయకుండా), అలాగే మా అమ్మ ఇచ్చిన మరచెంబు నిండా నీళ్ళూ(అవి పూర్తిగా చాలవని తెలిసినా!) వంటివన్నీ ఒబ్బిడిగా ఓ చేతిసంచీలో సర్దిపెట్టింది. మా ఇద్దరికీ చెరో నాలుగు జతల బట్టలు వేరే బ్యాగులో సర్దింది. ఇద్దరమూ బస్సులు మారుతూ కాచిగూడ స్టేషన్ చేరుకున్నాం. అక్కడ ట్రైన్ ఎక్కి మన్మాడ్ చేరుకున్నాము. అక్కడినుండి శిరిడీ వెళ్ళే బస్సు పట్టుకుని మొత్తానికి శిరిడీ చేరుకున్నాం.

ఇప్పట్లా ఆన్‌లైన్ బుకింగ్ అప్పట్లో లేనందున సంస్థానం వారి గదుల కోసంగా వాళ్ళని, వీళ్ళని వాకబు చేస్తూ రెండుగంటలు తిరిగాము. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక చివరికి తప్పని పరిస్థితిలో బయట గది తీసుకున్నాం. గదిలో ఉదయాదికాలు కానిచ్చుకుని, తెచ్చుకున్న చపాతీలు తినేసి మందిరానికి వెళ్ళాం. దర్శనమయ్యాక కొంతసేపు మసీదులోనూ, మరికొంతసేపు చావడిలోనూ కూర్చుని గడిపాము. తరువాత సంస్థాన్ వారి అన్నప్రసాదాలయానికి వెళ్లి బాబా ప్రసాదాన్ని(లంచ్) తిని, మళ్ళీ వచ్చి మందిరం క్యూలైన్ లోకి వెళ్లి మరోసారి బాబా దర్శనం చేసుకున్నాము.

రాత్రికి మేము తెచ్చుకున్న రొట్టెలు మిగిలుంటే వాటితోటే సరిపెట్టుకున్నాము. ఉదయం ఆరతి పూర్తయ్యేవరకూ ఉంటే మరో రోజుకు అద్దె చెల్లించాలని చెప్పినందువల్ల తెల్లవారుఝామునే కాకడ ఆరతికి వెళ్తూ గది ఖాళీ చేసేశాము. బ్యాగులు క్లోక్ రూములో పెట్టి కాకడ ఆరతికి వెళ్ళాము. ఆరతి అయ్యాక మా బ్యాగులు తీసుకొని శనిశింగణాపూర్ వెళ్ళాము. అక్కడినుండి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికప్పుడు బయలుదేరితేగాని ట్రైన్ అందదని ఎవరో చెప్పినందువలన భోజనాలు చెయ్యకుండానే మన్మాడ్ బస్సు ఎక్కేశాము. బస్సు ఎంత రద్దీగా ఉందంటే, మన్మాడ్ చేరుకునేవరకూ ఇద్దరం నిలబడే ఉన్నాము. ఉదయంనుండి నీళ్ళు తప్ప ఘనపదార్థం ఏదీ మా కడుపులో పడలేదు. నేనంటే తట్టుకోగలను కానీ, నా భార్య ఆకలికి తట్టుకోలేక బాగా డీలాపడిపోయింది. బ్యాగులు రెండూ నేనే మోస్తూ స్టేషన్లోకి చేరుకున్నాం. ఇంకా ట్రైన్ రావడానికి సమయం ఉండడంతో తినడానికి ఏదైనా తీసుకుందామని రిఫ్రెష్మెంట్ స్టాల్ కి వెళ్ళి నా జేబు చూసుకొని షాకయ్యాను. బస్సులో ఎవరో నా పర్సు కొట్టేశారు. వెంటనే నా భార్య వద్దకు ఎలా పరుగెత్తానో, ఎంత స్పీడుగా పరుగెత్తానో నాకే తెలియదు. ఎందుకంటే, పర్సుతోపాటు డబ్బు ఒకటే కాదు, టిక్కెట్లు కూడా పోయాయేమోననే బెంగ, భయం. 

నేను, "సత్యా! మన టిక్కెట్లు పోయాయి" అన్నాను ఖంగారుగా. తను, "అదేంటి, టిక్కెట్లు పోవడమేమిటి?" అంటూ తన హేండ్ బ్యాగులో చూసింది. అదృష్టం! టిక్కెట్లు అందులోనే ఉన్నాయి. అసలు విషయమేమిటంటే, శనిశింగణాపూరులో స్నానం చేసేటప్పుడు తడిసిపోతాయని టిక్కెట్లు, పర్సు నా వద్దనుండి తీసుకొని ఆవిడ తన బ్యాగులో పెట్టుకుంది. అక్కడినుండి శిరిడీ తిరిగొచ్చాక టెంపో వాడికి డబ్బులు ఇవ్వడానికి పర్సు మాత్రం నా చేతిలో పెట్టింది తను. కాబట్టి టిక్కెట్లు సురక్షితంగా మా వద్దే ఉన్నాయి. ఇకపోతే నా భార్యకు పరిస్థితి అర్థమై, మంచినీళ్ళతోటే కడుపు నింపుకోవడం మొదలుపెట్టింది. నాదీ అదే పరిస్థితి.

అలాగే ఒక గంట సమయం గడిచింది. ప్లాట్‌ఫారం మీద మా పక్కబెంచీ మీద కూర్చున్న ఒక మిలటరీ ఆయన మెల్లిగా వచ్చి మా పక్కన కూర్చున్నాడు. ఆయన తెలుగులోనే మాట్లాడుతూ, తాను లఢక్ లో పహారా సైనికుడనని, తాను కూడా మేం ఎక్కాల్సిన ట్రైన్ కోసమే ఎదురుచూస్తున్నట్లుగా చెప్పాడు. పదినిమిషాల తరువాత బయటకు వెళ్ళి ముగ్గురికీ ఇడ్లీ పార్సిల్ చేయించుకొని వచ్చి, "ఇక్కడ స్టేషన్లో ఇడ్లీలు దొరకవండీ, మీది ఆంధ్రానే అన్నారుగా, అందుకే మీకూ తెచ్చేశా" అని నవ్వుతూ అన్నాడు. మేము వద్దని అంటున్నా వాటిని బలవంతంగా మా చేతుల్లో పెట్టేశాడు. ఇక అది ఆ దేవుడే పంపిన ప్రసాదమని భావించి తినేశాము. కాసేపటికి ట్రైన్ వచ్చింది. ఆయనది వేరే కంపార్ట్మెంట్, మాది వేరే కంపార్ట్మెంట్. ట్రైన్ నడుస్తుండగా రాత్రి భోజనవేళకు భోజనాలు పట్టుకొని కేటరింగ్ బాయ్ మా బోగీలోకి వచ్చాడు. బెర్త్ నెంబర్లు అడుగుతూ మాక్కూడా భోజనం ప్లేట్లు అందించి, 'మిగిలిన చిల్లర' అంటూ మూడువందల రూపాయలు కూడా మా చేతిలో పెట్టాడు. ఏమి జరుగుతుందో అర్థంకాని స్థితిలో నేను ఆశ్చర్యపోతూ, 'ఇదంతా ఏమిట'ని అడిగితే, "మీరు డిన్నర్ బుక్ చేయమన్నారని ఐదువందల రూపాయలిచ్చి, మిగిలిన చిల్లర డబ్బులు మీకే ఇమ్మని ఒక మిలట్రీ ఆయన చెప్పారు" అన్నాడు ఆ అబ్బాయి. నేను, "ఆయన ఏ బోగీలో ఉన్నారు?" అని అడిగితే, "ఆయన ముందు స్టేషన్లో దిగిపోయార"ని చెప్పి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న మా కడుపు నింపడమేకాక, మేము ఇంటికి చేరుకునేందుకు సాయం చేసిన ఆ అజ్ఞాత మిలిటరీ జవానుగారికి అశ్రునయనాలతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాక ఇటీవలే(2019 ఆగస్టులో) పది, పదిహేను రోజుల క్రితం ఈ  సంఘటనను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాను. అది చూసిన సాయిభక్తుల కామెంట్స్ చదివాకగానీ, "మాకు సహాయం చేసిన మిలటరీ జవాను బాబాయే అయి ఉంటార"న్న ఆలోచన నాకు తట్టలేదు. 'నేను మీతోనే వస్తున్నా'ని తెలుగులో మాట్లాడిన వ్యక్తి మహారాష్ట్రలోనే ఎందుకు దిగిపోయారనేది ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది. ఆనాడు నేను గుర్తుపట్టలేకపోయినా ఇన్నేళ్ల తరువాత బాబా దయవలన గుర్తుపట్టగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

మరో ముఖ్య విషయం, శిరిడీ నుండి ఇంటికి వచ్చాక పరీక్ష చేయించుకుంటే నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. మా ఆనందానికి అవధుల్లేవు. అందుకే బాబా అనుగ్రహచిహ్నంగా మా అబ్బాయికి 'అభిజ్ఞా(జ్ఞాపకం) సాయి' అని పేరు పెట్టుకున్నాం. "బాబా! మీరు మాపై చూపిన కృపకు చాలా చాలా ధన్యవాదాలు".

6 comments:

  1. చాలా బాగుంది. శతసహస్రకోటి ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. శ్రీవాణిSeptember 12, 2019 at 1:13 PM

      నిన్ననే మీ అనుభవాన్ని చదివి చాలా ఆనంద పడ్డాను స్పందన పంపడానికి చాలా ఆరాటమనిపించినా, నిన్నంతా బిజీ వల్ల ఇవ్వలేకపోయాను.
      మీ పేరు చూస్తే మహమ్మదీయుడనిపించింది. అదే నిజమయితే,సాయిభక్తుడిగా నిలిచినందుకు మీకు అభినందనలు.మరియు వందనాలు. Belated మొహర్రం శుభాకాంక్షలు. సర్వమత సామరస్యాన్ని, దేశభక్తి ని భోధించిన సాయి ఆశయాన్ని మనమంతా నెరవేర్చాలి. సాయి సర్వమతాలు ఒక్కటే, అందరి దేవుడొక్కడే (సబ్ కా మాలిక్ ఏక్ )అని అన్నారు. మీరు దీన్ని మీ శక్తి మేర వ్యాపింపచేయగలరు.
      సాయి ప్రేమ ని పొందిన మీరు నిజంగా అదృష్టవంతులు.

      Delete
  2. నిజానికి మీ అనుభవం అమోఘం సాయి. తన బిడ్డలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేని ఆ అమృత మూర్తి ప్రేమకు శత కోటి జోహార్లు.

    ReplyDelete
  3. Mee anubavam maku anandam kaliginchindi

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo