సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 167వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • నాలుగేళ్లు దూరమైన బిడ్డను బాబా తిరిగి అక్కున చేర్చుకున్నారు

యు.ఏ.ఇ. నుండి సాయిభక్తురాలు సునీత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాలుగేళ్ళక్రితం నాకు బాబా అంటే అమితమైన నమ్మకం. హఠాత్తుగా సంభవించిన మా అమ్మగారి మరణంతో నేను బాబాపట్ల విశ్వాసాన్ని కోల్పోయాను. మళ్ళీ ఆ విశ్వాసాన్ని నేనెలా పొందానో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 

సరిగ్గా మా అమ్మగారు మరణించిన నాలుగేళ్ళ తరువాత 2018, ఆగష్టు 31న మా విమల ఆంటీ నన్ను, అలెన్ ను శిరిడీ, మధ్యప్రదేశ్, గుజరాత్ సందర్శించమని చెప్పారు. శిరిడీ అన్న పేరు వింటూనే నాలో ఏదో తెలియని భావావేశం కలిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అన్నాళ్ళుగా నిద్రాణంగా ఉన్న భావావేశం ఉవ్వెత్తున పైకి ఎగసినట్లు అనిపించింది. కానీ ఈ నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఆ కాలంలో నేను బాబాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన నన్నెక్కడ శిక్షిస్తారోనని భయపడుతూనే, అయిష్టంగానే శిరిడీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, 'ఆయన ఆగ్రహానికి గురవుతానేమోనని, ఆయన నన్ను తన ప్రపంచంలోకి ఆహ్వానిస్తారో, లేదో?' అనే ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోయాను. తరువాత నేను సెలవుకోసం దరఖాస్తు చేస్తే వెంటనే ఆఫీస్ వాళ్ళు ఆమోదించారు. నేను ఆదివారంనాడు ఫ్లైట్స్ గురించి ఇంటర్నెట్‌లో చూశాను. ఫ్లైట్ ఇక్కడినుండి జైపూర్ వరకు, అక్కడినుండి శిరిడీ వరకు తక్కువ ప్రయాణ సమయం ఉన్నట్లు గుర్తించాను. సోమవారంనాడు టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే, ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. మాములుగా AED 3500 ఉండాల్సింది, ఇప్పుడు AED 5000 పైనే చూపిస్తున్నాయి. అంత ఖర్చు పెట్టడం ఇష్టంలేక టికెట్స్ బుక్ చేయకుండా ఊరుకున్నాను. ఆ వారమంతా ఛార్జీలు అలానే ఉన్నాయి, ఏమాత్రం తగ్గడంలేదు. వెంటనే 'నేను ఆయనకు ప్రాముఖ్యత ఇస్తానా? లేక డబ్బుకా? అని బాబా నన్ను పరీక్షిస్తున్నారేమో' అని నా మనసుకు అనిపించింది. మరుక్షణం 'ఒకవేళ నన్ను శిరిడీ తీసుకుని వెళ్లడం ఆయన సంకల్పమే అయినప్పుడు నేను ఖర్చు చేసినదానికన్నా రెండు, మూడింతలు ఆయన నాకు తిరిగిస్తార'ని అనిపించి టికెట్స్ బుక్ చేసేశాను. తరువాత ఫ్రెండ్స్ సహాయంతో హోటల్ బుక్ చేసుకున్నాను. ఆన్లైన్‌లో కాకడ ఆరతి బుక్ చేయడానికి చూస్తే, 15 రోజులలోపు అందుబాటులో లేవు. దానితో 'నేను శిరిడీకి వెళ్లడం బాబాకు ఇష్టం లేదా?' అని ఆందోళనగా అనిపించింది. ఎందుకంటే, కాకడ ఆరతి దర్శనం తప్పకుండా చేసుకోవాలని నా మనసుకు అనిపించింది.  

మనసులో ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ మొత్తానికి శిరిడీ నేలపై నేను, అలెన్ అడుగుపెట్టాము. ఆ నేలపై అడుగుపెట్టగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. తరువాత హోటల్ కి వెళ్తూ నా ఫ్రెండ్ చెప్పిన ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడాను. అతని పేరు రామ్ దహలే. తరువాత మేము ఫ్రెషప్ అయ్యి రెస్టారెంటుకి వెళ్ళాము. రామ్ కి ఫోన్ చేసి, లంచ్ చేద్దాం రమ్మని చెప్పాను. అతను మమ్మల్ని కలిసి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడి సాయంత్రం దర్శనానికి ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నేను సరేనన్నాను. లంచ్ చేశాక నేను కాఫీ త్రాగబోతుండగా రామ్, "మీరు గేట్ నెంబర్ 3 వద్దకు వస్తే దర్శనానికి వెళదామ"ని చెప్పాడు. 'గురువారంనాడు దర్శనాన్ని మిస్ కావడమా!' అని మేము వెంటనే గేట్ నెంబర్ 3 వద్దకు వెళ్ళాము. రామ్ వేరే ఒక జంటతోపాటు మమ్మల్ని వి.ఐ.పి దర్శనానికి పంపాడు. 'నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఈ బిడ్డను ఆహ్వానిస్తున్నారా?' అన్నట్లు మంచి అనుభవం అయ్యింది నాకు. సమాధిమందిరంలోకి అడుగుపెట్టి బాబాను చూస్తూనే భావోద్వేగానికి లోనయ్యాను. కట్టలు తెంచుకొస్తున్న కన్నీళ్లతో మౌనంగా నిలబడిపోయాను. వెనకనుండి ఒక సేవకురాలు నా వీపు తట్టి, "బాబా అందరి ప్రార్థనలు వింటారు, నీవి కూడా" అని చెప్పి, మళ్ళీ, "నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలీదు. కానీ నీ సమస్యలు త్వరలో తీరిపోతాయి" అని హిందీలో చెప్పింది. తరువాత నన్ను ఒక కిటికీ వద్దకు తీసుకుని వెళ్లి, "కొన్ని నిమిషాలపాటు తనివితీరా బాబాని చూడు!" అని చెప్పి పూజారినడిగి నాకొక పుష్పగుచ్ఛాన్ని కూడా అందించింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

తరువాత రూముకి వెళ్లి రాత్రంతా ప్రయాణం వలన నిద్రలేని కారణంగా కాసేపు పడుకుందామని అనుకున్నాము. నేను నిద్రకు ఉపక్రమించబోతుండగా రామ్ ఫోన్ చేసి, "6 గంటల ఆరతికి టికెట్స్ తీసుకోమ"ని చెప్పాడు. అప్పటికే నిద్రలోకి జారుకున్న అలెన్‌తో "టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నా"ని చెప్పి పి.ఆర్.ఓ కార్యాలయానికి వెళ్ళాను. నేను మరుసటిరోజు కాకడ ఆరతి టికెట్స్ కూడా ఇవ్వమని వాళ్ళని అభ్యర్థించాను. కానీ వాళ్ళు అవి అందుబాటులో లేవని, వాటిని ఆన్లైన్ లోనే బుక్ చూసుకోవాలని చెప్పారు. నాకు చాలా బాధగా అనిపించి వాళ్లతో, "మేము దుబాయి నుండి కేవలం రెండురోజుల కోసం శిరిడీ వచ్చామ"ని చెప్పి మా ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించి కాకడ ఆరతి టికెట్స్ ఇవ్వమని ప్రాధేయపడ్డాను. వాళ్ళు రాత్రి 7 గంటల తరువాత రమ్మన్నారు. నేను, "బాబా! నాకు కాకడ ఆరతి దర్శనాన్ని ప్రసాదించండి" అని దీనంగా బాబాను ప్రార్థించాను. తరువాత అలెన్ కి, రామ్ కి ఫోన్ చేసి పదినిమిషాల్లో సంధ్య ఆరతికి సిద్ధంగా ఉండమని చెప్పాను. అలా మాకు రెండో దర్శనాన్ని ఏర్పాటు చేశారు బాబా. సంధ్య ఆరతి అయ్యాక మళ్ళీ పి.ఆర్.ఓ ఆఫీసుకు వెళ్లి కాకడ ఆరతికి టిక్కెట్లు అడిగాను. ముందు లేవని చెప్పినా తరువాత బాబా అనుగ్రహంతో టికెట్స్ ఇచ్చారు. ఆ టికెట్స్ నా చేతిలో పడగానే బాబా మా ఈ ట్రిప్ ని అద్భుతంగా మలచారని నాకు సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. తెల్లవారి 2.30 కల్లా ఆరతికోసం వెళ్ళాలి కాబట్టి త్వరగా డిన్నర్ ముగించేస్తే నిద్రపోవడానికి సమయం దొరుకుతుందని ఉద్దేశ్యంతో డిన్నర్ కి వెళ్ళాము. మేము భోజనం చేస్తూ ఉండగా రామ్ ఫోన్ చేసి, "శేజారతికి సిద్ధంగా ఉన్నారా?" అని అడిగాడు. నేను మరో ఆలోచన చేయకుండా వెంటనే "ఎస్" అన్నాను. మరి నిద్ర? నా మిగిలిన జీవితమంతా నిద్రపోవడానికి ఉంది. రోజు ముగియడానికి ముందు మేము మరో దర్శనం చేసుకోవాలని బాబా కోరుకుంటే, మాకెందుకు అభ్యంతరం ఉంటుంది? ఆ రాత్రి కూడా నాకు సరైన నిద్ర ఉండదని తెలుసు, అయినా నేను సంతోషంతో గాలిలో తేలిపోయాను. ఆరోజు చివరి దర్శనభాగ్యాన్ని మనసారా అనుభవించి, బాబాను నిద్రపుచ్చి మేము కూడా కొంతసమయం నిద్రపోవడానికి రూముకి వెళ్ళాము.

ఉదయాన అద్భుతమైన కాకడ ఆరతి దర్శనంతో మనసుకెంతో తృప్తిగా అనిపించింది. తరువాత రూముకి వెళ్లి నిద్రపోయాము. 11.30 కి ప్రసాదాలయానికి వెళ్లి భోజనం చేసి ద్వారకామాయి, చావడి, శని, దత్త, గణేష్, ఈశ్వర మందిరాలు, నందదీపం, లెండీబాగ్ దర్శించుకుని రూముకి వెళ్ళాము. రూములో ఉన్న సమయంలో, మరిన్ని దర్శనాలు చేసుకోకుండా రూములో నిద్రపోవడం నేరమని నా మనసుకనిపించింది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణంలో రామ్ ఫోన్ చేసి, "సంధ్య ఆరతి సమయంలో ద్వారకామాయికి వెళ్ళండి, అక్కడే బాబా తమ జీవితకాలంలో ఎక్కువ సమయం గడిపారు" అని చెప్పాడు. వెంటనే నేను ద్వారకామాయికి వెళ్ళాను. ఆరతి మొత్తం పుస్తకంలో చూస్తూ పాడాను. ద్వారకామాయిలో కూర్చుని నేను చాలా గొప్ప అనుభూతిని పొంది పట్టలేని ఆనందంతో రూముకి వెళ్ళాను. తరువాత డిన్నర్ చేస్తుండగా ఎందుకో తెలీదు గానీ, 'ఇది దర్శనానికి మంచి సమయం' అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. సరేనని దర్శనానికి వెళితే బాబా కృపవలన కేవలం పది నిమిషాల్లో దర్శనం అయ్యింది.

మరుసటిరోజు శనివారం, మళ్ళీ మా ప్రాపంచిక జీవితంలోకి వెళ్లాల్సినరోజు, అంటే ఆరోజే మా తిరుగు ప్రయాణం. చివరిగా శిరిడీ నుండి వెళ్లిపోయేముందు మరోసారి బాబా దర్శనం చేసుకోవాలనిపించింది. వెంటనే టికెట్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము. తీరా లోపలికి వెళ్తే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇక నా మనస్సులో, "ఇప్పుడు దర్శనానికి గంట సమయం పడితే మా పరిస్థితి ఏమిటి? ఫ్లైట్ పది గంటలకి అహ్మదాబాదులో ఉంది కాబట్టి రూముకి వెళ్తూనే ఫలహారమేమీ తీసుకోకుండానే మేము వెళ్ళిపోవాలి" అని ఆలోచనలు మొదలయ్యాయి. ఆశ్చర్యం! మరుక్షణంలో టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు వేరే క్యూ ఏర్పాటు చేసి అందులోకి రమ్మని పిలిచారు. మేము వెంటనే అందులోకి మారిపోయాము. ఎక్కడో వెనుక ఉన్నవాళ్ళం ఒక్కసారిగా బాబాకి చాలా దగ్గరగా చేరుకున్నాము. అయితే మేమున్న ఎడమవైపు క్యూలో ముందుకుసాగితే వెంటనే బయటకు నెట్టివేయబడతాం. కుడివైపు క్యూలో వెళితే చివరిసారి బాబాను కాసేపు తృప్తిగా చూసుకుని వెళ్లొచ్చు అనిపించింది. అంతలోనే కుడివైపు క్యూలోకి జంప్ చేసే అవకాశం రావడంతో అందులోకి దూకేశాను. తరువాత నెమ్మదిగా అలెన్ ను కూడా ఆ క్యూలోకి లాక్కున్నాను. చివరిసారిగా బాబాకి నమస్కరించుకుని, అలెన్ ని కూడా అలా చేయమని చెప్పాను. తనివితీరా బాబా పూర్తి రూపాన్ని కన్నుల్లో నింపుకుని, ఆయన ముందు శిరస్సు వంచి నమస్కరించి, టన్నుల కొద్దీ ఆయన ఆశీస్సులు మూటకట్టుకుని తృప్తిగా బయటకు వచ్చాము. మేము మందిరం నుండి బయటకు వస్తూనే ఒక స్త్రీ సత్యనారాయణస్వామి ప్రసాదం మా చేతిలో పెట్టింది. మా ట్రిప్ ముగింపులో ఇంతకన్నా మంచి ఆశీస్సులు ఏముంటాయి? అంతులేని ఆనందంతో శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యాము. అహ్మదాబాద్ చేరుకున్నాక ఫ్లైట్ గంట ఆలస్యమని తెలిసింది. శిరిడీలోనే నా ఆత్రుతలన్నీ వదిలిపెట్టి వచ్చిన నాకెంతో ప్రశాంతంగా ఉంది. ఫ్లైట్ ఆలస్యమన్నా కూడా ఏ మాత్రం కలవరపడలేదు. బాబా ఇచ్చిన ఆశీస్సులతో సంతృప్తిగా తిరిగి దుబాయి చేరుకున్నాను. బాబా ఆయన పట్ల పూర్తి విశ్వాసాన్ని మళ్ళీ నాలో నింపారు. "చాలా చాలా ధన్యవాదాలు దేవా!" 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo