సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 13వ భాగం


  • నానావలీ హనుమంతుని అవతారం
  • ఊదీ మహిమ - మోరేశ్వర్ ఆస్త్మా నయమగుట
  • సాయిబాబా స్పర్శతో అమృతంలా మారిన పుచ్చకాయ తొక్క


శ్రీసాయితో మరికొన్ని అనుభవాలు

ప్రియమైన పాఠకులారా! ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారు 17 సార్లు శిరిడీకి వెళ్ళారు. అలా వెళ్ళిన ప్రతిసారీ ఆయన అక్కడ, ఒక వారం రోజుల నుంచి నెల రోజుల దాకా ఉండేవారు. ఆయన అక్కడున్న కాలంలో ఎన్నో ఆసక్తికరమైన బాబా లీలలను చూడటం జరుగుతూ ఉండటంతో వారికి శిరిడీని వదలి అసలు వెళ్ళాలనిపించేది కాదు. కానీ, బాబా వారిని శిరిడీ నుండి బయలుదేరమని ఆజ్ఞాపించిన వెంటనే వారు శిరిడీ నుంచి బయలుదేరి వెళ్ళేవారు. ఆయన శిరిడీలో ఉన్న సమయంలో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలను సేకరించారు కానీ, నాకు అవన్నీ గుర్తులేవు. శ్రీసాయిసచ్చరిత్రలో వివరింపబడని కొన్ని అనుభవాలను మాత్రం ఈ అధ్యాయంలో వివరించటానికి ప్రయత్నిస్తాను. మిగిలిన సాయిభక్తులకు కూడా అటువంటి అనుభవాలు ఎన్నో కలిగే వుంటాయని, వాటిని వారు తమకు ప్రియమైనవారికి చెప్పే వుంటారని నాకు బాగా తెలుసు. బాబాపై నాకున్న స్వచ్ఛమైన భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడానికే వాటిని నేను మీకు వివరిస్తున్నాను.

నానావలీ హనుమంతుని అవతారం

శిరిడీలో నానావలీ అనే ఒక వింతైన సాయిభక్తుడుండేవాడు. అతడు చేసే వింత చేష్టల వలన నేనతనిని చంచల స్వభావి అంటాను. అతడి చేష్టలు భక్తులకు కోపం తెప్పిస్తుండటంతో, వారు అతడిపై బాబాకు ఫిర్యాదు చేస్తుండేవారు. బాబా అప్పుడు నానావలీని మందలించి అతడితో, అతడు కనుక అందరితో అలా అనుచితంగా ప్రవర్తిస్తూవుంటే భక్తులు శిరిడీ విడిచి వెళ్ళిపోతారని అనేవారు. మా నాన్నగారికి నానావలీ అంటే ఎంతో పూజ్యభావం ఉండేది. నానావలీ హెర్నియాతో బాధపడుతూ ఒకవిధంగా నడుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అతడు గుడ్డపీలికలను తన పైజమాకు వెనకాల పొడవైన తోకలాగా కట్టుకొని కోతిలాగా గెంతుతూ ఉండేవాడు. గ్రామంలోని పిల్లలంతా అతడి కోతిచేష్టలకు వినోదిస్తూ అతడిని ఆట పట్టిస్తుండేవారు. ఆ పరిస్థితుల్లో అతడు బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, పిల్లల తాకిడి నుండి తనను రక్షించమని వేడుకునేవాడు. అంత పెద్ద హెర్నియా ఉండి కూడా అతడు అంత వేగంగా ఎలా పరిగెత్తగలిగేవాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. నానావలీ పిచ్చివాడని ఆయనెప్పుడూ అనుకోలేదు. నానావలీ మా నాన్నగారిని ఎప్పుడూ 'గవాల్యా' అని పిలుస్తూ ఉండేవాడు. అతడు మా నాన్నగారిని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు నానావలీని సగుణమేరు నాయక్ నడిపే హోటలుకు తీసుకువెళ్ళి, అతడికి కడుపునిండా భోజనం పెట్టించేవారు. మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా, నానావలీల జంట - శ్రీరాముడు, ఆయన పరమభకుడైన హనుమంతుని జంటలా ఉండేది

ఒకసారి బాబాను తన ఆసనం నుండి లేచి దానిపై తనను కూర్చోనివ్వాల్సిందిగా నానావలీ ఆజ్ఞాపించాడు. బాబా సానుకూలంగా స్పందించి, తమ ఆసనం నుండి లేచి, నానావలీని అక్కడ కూర్చోనిచ్చారు. నానావలీ, బాబా ఆసనం మీద కొంచెం సేపు కూర్చుని లేచి బాబాతో, “దేవా! ఈ ఆసనాన్ని అధిష్టించే యోగ్యత కేవలం మీకు మాత్రమే ఉంది, నా స్థానం ఎప్పడూ మీ పాదాల చెంత మాత్రమే!” అన్నాడు. బాబాను తన ఆసనం నుండి లేవమని ఆజ్ఞాపించడానికి నానావలీకి ఎంత ధైర్యం ఉందో, అలాగే తనకు ఎంతో ప్రియమైన నానావలీకి తన ఆసనాన్ని ఇచ్చేయడం ద్వారా బాబాకు అతడిపై గల అపరిమితమైన ప్రేమను మీరందరూ ఊహించుకోవచ్చు. కానీ, మా నాన్నగారు వారిద్దరినీ శ్రీరాముడు, హనుమంతుని జంటగా అనుకోవడానికి వేరే కారణమున్నది. 

ఒకసారి నానావలీ మా నాన్నగారితో, “హే గవాల్యా! నాతో పాటు రా! నీకొక తమాషా చూపిస్తాను” అన్నాడు. అతడు మా నాన్నగారిని మసీదుకు దగ్గరలోనే వున్న చావడికి తీసుకుని వెళ్ళాడు. బాబా చావడిలో కూర్చుని వున్నారు. కళ్ళు మూసి తెరిచేంతలో, నానావలీ తన శరీరాన్ని హండీలో (చావడిలో పైకప్పుకు చిన్న చిన్న తాళ్ళతో వ్రేలాడదీయబడివున్న గాజుగిన్నె) పట్టేంత చిన్నదిగా చేసుకొని, ఒక్క గెంతు పైకి గెంతి, చావడిలో వ్రేలాడదీసివున్న ఒక హండీలో కూర్చున్నాడు. అతడు హండీలో ఒక కోతిలా కూర్చుని మా నాన్నగారిని వెక్కిరించసాగాడు. అది నిజంగా ఒక అద్భుతం. భారీకాయుడైన నానావలీ అంతపైకి ఎలా గెంతగలిగాడు? అదేసమయంలో తన శరీరాన్ని హండీలో పట్టేంత చిన్నదిగా చేసుకుని ఎలా కూర్చోగలిగాడు? అది ఎంతో ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాకుండా ఉన్నది. శ్రీసాయిబాబా, నానావలీ ఇద్దరూ శిరిడీలో వెలసిన శ్రీరాముడు, హనుమంతుడి అవతారాలని అప్పుడాయనకు అర్థమయింది. వెంటనే ఆయన బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను పూజించారు. బాబా మహాసమాధి చెందినప్పుడు నానావలీ తీవ్ర విచారంలో మునిగిపోయి, బాబా మహాసమాధి చెందిన పదమూడవరోజున ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నానావలీ సమాధి లెండీబాగ్ ద్వారానికి తూర్పువైపున ఉన్నది. నేను శిరిడీకి వెళ్ళినప్పుడల్లా నానావలీ సమాధిని దర్శించి నమస్కారం చేసుకుంటాను. శ్రీసాయిబాబాకు, ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు.


ఊదీ మహిమ - మోరేశ్వర్ ఆస్త్మా నయమగుట

మోరేశ్వర్ ప్రధాన్ సాయిబాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన ముంబయి హైకోర్టు జడ్జి. ఆయన తీవ్రమైన ఆస్త్మాతో బాధపడుతుండేవారు. ఆయన మా తాతగారికి బ్రిడ్జ్ ఆటలో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్త్మా తగ్గడానికి మా తాతగారు ఆయనను శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోమని సలహా ఇవ్వడంతో, ఆయన ఒప్పుకున్నారు. మోరేశ్వర్ మొదటిసారి శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నప్పుడు, బాబా ఆయనకు స్వయంగా చిలిం ఇచ్చి పీల్చమన్నారుమోరేశ్వర్ మొదట కొంచెం ఖంగారుపడ్డారు, కానీ చిలిం పీల్చారు. అద్భుతం! ఆ క్షణం నుండి ఆయనకు తిరిగి ఆస్త్మా రాలేదు. ఒక వ్యక్తి వ్యాధిని నయంచేయడంలో బాబా అనుసరించే విధానం ఎంత అద్భుతం! మోరేశ్వర్ మా తాతగారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తుడయ్యారు.

అది 1918 సంవత్సరం. విజయదశమి రోజు మధ్యాహ్నం మోరేశ్వర్ గారికి హఠాత్తుగా మళ్ళీ ఆస్త్మా వచ్చింది. ఆయనకు ఆస్త్మా చాలా తీవ్రంగా ఉండటంతో, మా తాతగారిని శాంతాక్రజులో ఉన్న వారి ఇంటికి వెంటనే తీసుకురమ్మని తన సేవకుడిని బాంద్రా పంపారు. మోరేశ్వర్ సేవకుడు బాంద్రా వచ్చి మా తాతగారితో, తన యజమాని హఠాత్తుగా జబ్బుపడ్డారని, వెంటనే వచ్చి సహాయం చేయమని అభ్యర్థించాడు. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ వెంటనే బయలుదేరారు. మా నాన్నగారు తమతోపాటుగా ఆయన ఆఖరిసారి శిరిడీ వెళ్ళినప్పుడు బాబా స్వయంగా ఆయనకు ప్రసాదించిన ఊదీని కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ మోరేశ్వర్ ఆస్త్మాతో తీవ్రంగా బాధపడుతుండటం చూశారు. మా తాతగారు ఆయనను ఓదార్చి, ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం బాబా ఊదీని కలిపి మోరేశ్వర్ కిచ్చి త్రాగమన్నారు. మోరేశ్వర్ తన సన్నిహిత స్నేహితుడు చెప్పినట్టు చేశారు. ఆ నీటిని త్రాగిన క్షణం నుండి ఆయన ఆస్త్మా తీవ్రత తగ్గుతూ వచ్చి, కొంతసేపటికి ఆయనకు ఉపశమనం కలిగింది. తన ఆస్త్మా పూర్తిగా నయమయిందని బాబా చెప్పినా, మరలా ఎందుకు తిరగబెట్టిందని మోరేశ్వర్ మా తాతగారిని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దనీ, ఒకవేళ గనక ఆస్త్మా మళ్ళీ తిరిగి వస్తే, బాబా ఊదీనే మందులా తీసుకోమని చెప్పారు. ఏమైనప్పటికీ మోరేశ్వర్ ఇక అలా చేయాల్సిన అవసరం తిరిగిరాలేదు. ఊదీ తీసుకున్న తరువాత ఆయన ఆస్త్మా పూర్తిగా నయమయింది.

కానీ ఈ సంఘటన వెనుక వేరే సందేశం ఉందని వారికి తరువాత అర్థమయింది. అదేరోజు సుమారు మధ్యాహ్నం 2 గంటలకు శిరిడీలో శ్రీసాయిబాబా మహాసమాధి చెందారు. సమాధి చెందే సమయంలో ఆయన తనదైన ప్రత్యేక పద్దతిలో తమ అంకితభక్తులకు ఈ లీల ద్వారా వైర్ లెస్ సందేశం పంపించారు. మా తాతగారికి, మా నాన్నగారికి కూడా అటువంటి వైర్ లెస్ సందేశం అందింది. దాని గురించి మీకు తరువాతి అధ్యాయంలో వివరిస్తాను.

సాయిబాబా స్పర్శతో అమృతంలా మారిన పుచ్చకాయ తొక్క 

సాయిబాబా జీవించి ఉన్నకాలంలో శిరిడీ వెళ్ళిన కొంతమంది, ఆయన మీద నమ్మకం లేకపోవడంవలన అయితేనేమి, లేదా వారికి సహనం లేకపోవడంవలన అయితేనేమి బాబా ఆశీర్వాదాలను పొందలేకపోయారు. వీరిలో ఎక్కువమంది ధనికవర్గానికి చెందినవారు. అటువంటివారు శిరిడీకి వెళ్ళినప్పుడు, బాబా ఫకీరు జీవితవిధానాన్ని చూసి, ఈయన తమ సమస్యలను ఎలా తీర్చగలడా అని ఆలోచిస్తూ వుండేవారు. కానీ, సమస్యలను బాబా పరిష్కరించే విధానం ఎంతో వినోదంగా ఉండి, ఎవరికయినా తమ మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగానూ ఉండేది.

అది వేసవికాలం. ఒక బుట్టనిండా పుచ్చకాయలు పెట్టుకొని అమ్ముకునే ఒకామె మసీదుకు వచ్చింది. బాబా ఆమెవద్దవున్న పుచ్చకాయలన్నిటినీ కొనేసారు. ఆయన ఒక పుచ్చకాయను కోసి ముక్కలు చేసి, అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలుపెట్టారు. భక్తులందరూ పుచ్చకాయ ముక్కలు తిని ఆనందిస్తున్నారు. అక్కడే ఉన్న మా నాన్నగారికి మాత్రం బాబా పుచ్చకాయముక్క ఇవ్వలేదు.

అదే సమయంలో మంచి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక ధనికుడు, తన ఇద్దరు సేవకులు తోడు రాగా మసీదులోకి ప్రవేశించాడు. అతడు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరో సలహా ఇవ్వటం వల్ల అతడు శిరిడీకి వచ్చాడు. అప్పుడు బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కను తీసుకుని తొక్కని, గుజ్జుని వేరుచేశారు. గుజ్జుని మా నాన్నగారికి, తొక్కను ఆ ధనికుడికి ఇచ్చి తినమన్నారు. ఆ ధనికుడు కొంచెం కలవరపడి, తొక్కను తినటానికి తాను ఆవు, మేకల లాగా జంతువును కానని చెప్పాడు.

బాబా ఆ తొక్కనే మా నాన్నగారికి ఇచ్చి, “భావు ! దీనినిపుడు నువ్వే తినాలి” అన్నారు. మా నాన్నగారు దానిని కొంచెం కొరికినప్పుడు, ఆశ్చర్యకరంగా అది అరటిపండులాగా మెత్తగా వుండి, తాను ఇంతకుముందు తిన్న గుజ్జు కన్నా ఎంతో మధురంగా వుంది. తన జీవితంలో ఎప్పుడూ అంతటి మధురమైన పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెపుతూ వుండేవారు. ఆ ధనికవ్యక్తి తనకు అవమానం జరిగిందని తలచి అక్కడనుండి వెళ్ళిపోయాడు. అతడు బహుశా తన వ్యాధిని శాశ్వతంగా నయంచేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారికి తన 70వ యేట మరణించేంతవరకూ కనీసం డయాబెటిస్ వ్యాధి లక్షణాలు మచ్చుకైనా లేవు.

ప్రియమైన సాయిభక్తులారా! నిజమైన మందు ఆ పదార్థంలో లేదు, బాబా పవిత్రమైన హస్తాలలోనే వుంది. ఆయన పవిత్రమైన హస్తస్పర్శవల్ల ఆ పదార్థం అమృతంలా మారుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు మాత్రం బాబా నుండి ఎంతో లబ్దిని పొందారు. బాబా ఉపదేశించిన శ్రద్ధ, సబూరి' అనే రెండు మంత్రాలను ఆచరించినవారికి జీవితంలో ఎప్పుడూ విజయమే.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo