సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రామచంద్ర అంతిత్‌రామ్ దేశ్‌ముఖ్





రామచంద్ర అంతిత్‌రామ్ దేశ్‌ముఖ్ శిరిడీ నివాసి అయినప్పటికీ అతను బాబా భక్తుడు కాదు. 1918లో వృద్ధురాలైన అతని తల్లి కొడుకుతో కలిసి జీవించడానికి శిరిడీ వచ్చింది. ఒకసారి ఆమె బాబాను దర్శించి, అప్పటినుండి పూర్ణ భక్తివిశ్వాసాలతో బాబాను పూజించసాగింది. ప్రతిరోజూ ఊదీ ధరిస్తూ, తన వయసును కూడా లెక్కించక అన్ని ఆరతులకు హాజరవుతూ ఉండేది. బాబా సమాధి చెందాక కూడా ఆమె ద్వారకామాయికి వెళ్లడం, అక్కడ బాబా చిత్రపటాన్ని పూజించడం మానేదికాదు.

ఒకరోజు తెల్లవారుఝామున 4 గంటలకు ఆ వృద్ధురాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న ఒక బావిలో పడిపోయింది. జరిగిన దుర్ఘటన గురించి ఎవరికీ తెలియదు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక మహిళ నీళ్లకోసం వచ్చి బావిలో ఎవరో తేలుతున్నట్లు గమనించింది. మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి ఆ వృద్ధురాలిని బయటకి తీసి వైద్యుడికి కబురుపెట్టారు. వైద్యుడు ఆమెను చూసి, "బాబా దయవలన ఈమె సజీవంగా ఉంది. బావి లోతు సుమారు 48 అడుగులు, అందులో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. వయస్సు పైబడి, బలహీనంగా ఉన్న ఈ వృద్ధురాలు అంత ఎక్కువ సమయం చల్లని నీటిలో ఉన్నందున హైపోథెర్మియా (అల్పోష్ణస్థితి)కి గురికావొచ్చు. పర్యవసానంగా ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈమెకు వెచ్చదనం అందేలా చూస్తూ, ఎక్కువగా వేడి పానీయాలు ఇవ్వండి. శరీరమంతా ఊదీ రాయండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.

తరువాత తల నుండి పాదాల వరకు తడిసిపోయి ఉన్న వృద్ధురాలి బట్టలను మార్చే ప్రయత్నంలో వృద్ధురాలి శరీరంపై ఎక్కడా గాయాలుకానీ, గాట్లుకానీ లేకపోవడం చూసి ఆమె కోడలు ఆశ్చర్యపోయింది. తరువాత ఆమె వృద్ధురాలికి పొడి బట్టలు కట్టి, ఒక కప్పు వేడివేడి టీ ఇచ్చి, "ఈత కూడా రాని మీరు ఎలా అపాయం నుండి బయటపడ్డారు?" అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు, "నేను బావిలో పడినప్పుడు, 'సాయినాథా! మీరు మాత్రమే నన్ను నీటిలో మునిగిపోకుండా కాపాడగలర'ని నా సంరక్షకుడైన బాబాను పిలిచాను. వెంటనే నా సాయినాథుడు పరుగున వచ్చి, తమ వేయి చేతులతో నన్ను పట్టుకున్నారు. దాంతో నీళ్లకోసం ఆ స్త్రీ వచ్చేవరకూ నేను ఆ నీటిలో తేలుతూ ఉన్నాను" అని చెప్పింది. తరువాత వృద్ధురాలు ప్రశాంతంగా నవ్వుతూ, "అంత పొద్దున్నే నీళ్లకోసం బావి వద్దకు ఆ స్త్రీని పంపింది ఖచ్చితంగా బాబానే" అని అంది. టీ త్రాగిన కొద్దిసేపటికి ఆమెకి మంచిగా అనిపించి, తన రోజువారీ పనులలో నిమగ్నమైంది. అప్పటినుండి ఆమె, "బాబా దయవల్లే తాను ఆ అపాయం నుండి బయటపడ్డాన"ని తరచూ అందరితో చెప్తుండేది. ఆమెను కాపాడినట్లే సద్గురువు తన వెయ్యి చేతులతో జీవితమనే బావిలో మునిగిపోకుండా మనలను సదా రక్షిస్తుంటారు.

తరువాత ఒకసారి రామచంద్ర దేశ్‌ముఖ్ కుమార్తె అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తనని డాక్టర్ గోండ్కర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స మొదలుపెట్టి రక్త మరియు మూత్ర పరీక్షలు చేశాక అది టైఫాయిడ్ జ్వరమని నిర్ధారణ అయ్యింది. తనకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకీ తను నీరసించిపోసాగింది. బాబాకు అంకిత భక్తురాలైన తన తల్లి బాబా ఊదీని నీళ్లలో కలిపి రోజుకు రెండుసార్లు బిడ్డకు ఇస్తుండేది. 45 రోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత బిడ్డ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో తండ్రి చాలా బాధపడ్డాడు. తల్లి మాత్రం వేరే ఏ మందులూ ఇవ్వకుండా ఊదీ తీర్థం మాత్రమే బిడ్డకి ఇస్తూ ఉండేది. అది చూసిన ఆమె భర్త, "మందులే సహాయం చేయనప్పుడు, ఈ ఊదీ తీర్థం తనకి నయం చేస్తుందని అనుకుంటున్నావా?" అని ఆమెని తిట్టాడు. ఆమె సమాధానమేమీ ఇవ్వక మౌనంగా ఉండిపోయింది. కానీ ఊదీ తీర్ధం ఇవ్వడం కొనసాగించింది. మూడురోజుల తరువాత పాప పూర్తిగా కోలుకొని తినడం, ఆడటం కూడా ప్రారంభించింది. ఆ తల్లి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తన భర్తతో, "బాబా దయ, ఊదీ మహత్యం చూశారా?" అని అంది. అంతేకాదు, "ఇప్పటికైనా బాబాను నమ్మండ"ని బలవంతపెట్టింది.

దాంతో దేశ్‌ముఖ్ మరాఠీ సచ్చరిత్ర పుస్తకాన్ని కొని, పారాయణ మొదలుపెట్టాడు. అతను పారాయణ బిగ్గరగా చదువుతుండేవాడు. పారాయణ సమయంలో ఒక పెద్ద కప్ప వచ్చి, అతని ప్రక్కనే కూర్చుని అతను చదివేది వింటుండేది. ఇలా పారాయణ 7 రోజులు జరిగింది. పారాయణ పూర్తయిన తరువాత ఆ కప్ప మరి కనిపించలేదు. కప్ప ఆధ్యాత్మిక పరివర్తనకు సంకేతం.

అదే సంవత్సరం దేశ్‌ముఖ్ తన పెద్దకుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన అనారోగ్యం కారణంగా అనుకున్నట్లు చేయలేక ఒకరోజు అతను బాబా ఫోటో ముందు నిలబడి, "బాబా! నాకు మొదట్లో మీ మీద నమ్మకం లేకపోయినప్పటికీ మీరు నాకు, నా కుటుంబానికి అన్నిరకాల సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించారు. ఇప్పుడు నా పెద్దకుమార్తె పెళ్లి జరిపించమని, నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను" అని ఏడ్చాడు. మరుసటి సంవత్సరం జనవరి నెలలో ఒక అబ్బాయి తల్లిదండ్రులు దేశ్‌ముఖ్ గారి అన్నయ్యతో కలిసి దేశ్‌ముఖ్‌ను కలవడానికి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి దేశ్‌ముఖ్ కుమార్తెతో వివాహం జరపడానికి నిశ్చయమైంది. దేశ్‌ముఖ్ ఆ వివాహాన్ని సాదాసీదాగా చేయాలనుకున్నప్పటికీ తగినంతలో లోటుపాట్లు లేకుండా చేయాలని నిర్ణయించుకుని 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. కానీ అనుకోకుండా 800 మంది విందుకు హాజరయ్యారు. దేశ్‌ముఖ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడి ద్వారకామాయికి పరుగెత్తుకుని వెళ్లి "తనని రక్షించమ"ని బాబాను వేడుకున్నాడు. తరువాత కొంచెం ఊదీ తీసుకుని ఆహారపదార్థాలున్న అన్ని పాత్రలలో వేసి ధైర్యంగా వడ్డన ప్రారంభించాడు. బాబా దయవలన అతిథులందరూ తృప్తిగా తిన్నాక కూడా మరో రెండువందల మందికి సరిపడా ఆహారం మిగిలింది.

రిఫరెన్స్ : ఆంబ్రోసియా ఇన్ శిరిడీ, బై రామలింగస్వామి.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫొనీ బై విన్నీ చిట్లూరి.

7 comments:

  1. om sai ram baba mee daya aparam.chala bagundi sai.na alocanalu sakramamu ga undelaga coodu sai baba

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. 🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo