సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 601వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. కోవిడ్ నుండి సాయి రక్షణ
  2. బాబా దయవల్ల సాఫీగా సాగుతున్న ప్రాజెక్టు

కోవిడ్ నుండి సాయి రక్షణ   

ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం శ్రీసాయి సమర్థ.

ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను హైదరాబాదులోని షాద్‌నగర్ నివాసిని. సాయినాథునికి శరణాగతి చెంది సాయి ఆధీనంలో ఉన్నవారికి సాయి ఎలా రక్షణనిస్తారో అనేదానికి ఈ నా అనుభవం నిదర్శనం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా మహమ్మారి ఎవరినీ వదిలేటట్లు లేదు. ఇటీవల నేను, నా భార్య, నా కూతురు కూడా కరోనా బారినపడి బాబా కృపతో బయటపడ్డాము. మాకు కరోనా వచ్చేముందు నేను పూజ చేసే సమయంలో, 'మాకు కరోనా వస్తుంది' అని నా అంతర్వాణి పలుకుతున్నట్లు నాకనిపించేది. తరువాత మేము అద్దెకు ఉన్న ఇంటి యజమానికి, వాళ్ళ కుటుంబసభ్యులకు కరోనా వచ్చింది. అప్పుడు నేను, ‘బహుశా వాళ్లకు కరోనా వస్తుంద’ని నాకలా అనిపించి ఉంటుందని అనుకున్నాను. కానీ నాలుగురోజుల తర్వాతగానీ తెలియలేదు, ‘మాకు కూడా కరోనా వస్తుంద’ని!

నాకు, నా భార్యకు, నా కూతురికి జలుబు, తలనొప్పి మొదలయ్యాయి. కరోనా టెస్ట్ చేయించుకుందామంటే నా భార్య భయపడి వద్దని చెప్పింది. ఆమె భయపడటం వల్ల మేము హస్పిటల్‌కి వెళ్ళలేదు. కానీ మాకు కరోనా వచ్చినట్లే అనిపిస్తుండేది. నాకు షుగర్, నా భార్యకు ఆస్తమా, థైరాయిడ్ ఉన్నాయి. అందువలన రిస్కు చేయొద్దని మర్నాడు కరోనా పరీక్ష చేయించుకుంటే, మాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా నేను భయపడలేదు. కానీ, నా భార్యకు భయంతో జ్వరం వచ్చేసింది. నేను సాయిని తలచుకుని భారం ఆయన మీదే వేశాను. ఆరోజు నుంచి నాకు వాసన తెలియలేదు. మళ్ళీ నాకు వాసన తెలియడానికి నాలుగురోజులు పట్టింది. అంతలో నా భార్యకు, నా కూతురికి వాసన తెలియడం మానేసింది. మేము ప్రతిరోజూ మూడుపూటలా బాబా ఊదీ పెట్టుకుని, వేడినీటిలో కొద్దిగా ఊదీ వేసుకుని తీసుకుంటూ మందులు వాడసాగాము. అలా పదిహేనురోజులు గడిచాక మళ్ళీ పరీక్ష చేయించుకుంటే మాకు నెగెటివ్ వచ్చింది. ఇప్పుడు అందరమూ ఆరోగ్యంగా ఉన్నాము. ఇదంతా నా గురుదేవులైన శ్రీసాయినాథుని అనుగ్రహమే. అందుకే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, యజమాని, స్నేహితుడు అన్నీ సాయినాథుడే. నా సర్వమూ సాయే. సాయికి శరణాగతి చెందితే మనకు భయమనేదే ఉండదు. “బాబా! ఎల్లవేళలా మాకు రక్షణనిచ్చే మీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు”


బాబా దయవల్ల సాఫీగా సాగుతున్న ప్రాజెక్టు

సాయిభక్తురాలు శ్రీమతి శైలజ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు శైలజ. సాయిబాబా నన్ను ఎన్నిసార్లు కాపాడారో నేను చెప్పలేను. ఆయన నన్ను ఎల్లప్పుడూ ఇలా కాపాడుతూనే ఉన్నారు. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా మాకు ఎలా సాయం చేశారో మీతో పంచుకుంటాను. మా కంపెనీకి క్రొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దానికోసం ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు. వచ్చినవాళ్ళు కొన్ని రోజులు పని చేయడం, ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుండేది. ప్రాజెక్ట్ సరిగా సాగకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఇచ్చినవాళ్ళ దగ్గరనుండి చాలా ఒత్తిడి రావడం మొదలైంది. దానితో మావారు చాలా ఆందోళనకు గురయ్యారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మావారికి శ్రద్ధగా పనిచేసేవాళ్ళు లభిస్తే నేను ఈ అనుభవాన్ని నా సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. అప్పుడు బాబా సందేశంలాగా మనసులో అనిపించింది, ‘ఆదిత్యహృదయం మూడుసార్లు చదవ’మని. ఈ విషయం మావారికి చెప్పాను. తను అందుకు అంగీకరించి, మరుసటిరోజు ప్రొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి శ్రద్ధగా ఆదిత్యహృదయం మూడుసార్లు చదివారు. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు మా కంపెనీవాళ్ళకి చాలా మంచివాళ్లు లభించారు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వున్నప్పటికీ బాబా దయవల్ల ప్రాజెక్టు ఇప్పుడు సాఫీగా సాగుతోంది.

“బాబా! దయచేసి ఈ ప్రాజెక్టుని సాఫీగా పూర్తయ్యేట్టు చూడండి. ఇది మా కంపెనీకి మొదటి ప్రాజెక్ట్. మీ దయవల్ల మా కంపెనీ మంచి వృద్ధిలోకి వచ్చి మేము నలుగురికి సాయం చేసే పరిస్థితి కలిపించండి సాయీ!” 



4 comments:

  1. Om sai ram baba please help us

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo