సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 583వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహం వల్ల కరోనా లక్షణాలు మాయం - పరీక్షలో ఉత్తీర్ణత
  2. బాబా కృపతో క్షేమంగా సాగిన తిరుమల యాత్ర


బాబా అనుగ్రహం వల్ల కరోనా లక్షణాలు మాయం - పరీక్షలో ఉత్తీర్ణత

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. కారణం, ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర పారాయణ మరియు సాయిభక్తుల అనుభవాలు చదవటం నా దినచర్యలో భాగమైపోయింది. సాయిభక్తుల అనుభవాల మననం నాలో సాయిబాబా పట్ల మరింత దృఢవిశ్వాసం కలుగడానికి కారణమైనదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.

ఇటీవల మా బాబు FMGE (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) పరీక్షకు సిద్ధమవుతున్నాడు. పరీక్ష మరో పదిరోజులు ఉందనగా, జలుబు, పదార్థాల వాసన లేకపోవటం వంటి కరోనాకు సంబంధించిన కొన్ని లక్షణాలు తనలో బయటపడ్డాయి. దీనితో మా కుటుంబసభ్యులందరం చాలా బాధపడ్డాము. కారణం, అప్పటికే మా బాబు ఒకసారి ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడు కాకపోవటంతో ఇప్పుడు రెండవసారి ఆ పరీక్షకి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా ఎలాంటి ఇబ్బంది పెట్టి వాడి కెరీర్ని దెబ్బతీస్తుందోనని చాలా బాధపడ్డాము. బాబాను తలచుకొని బాబాపై భారం వేశాము. అంతే! 5 రోజులలోనే బాబా అనుగ్రహం వల్ల మావాడికి ఆ లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోయి పరీక్షకి హాజరయ్యాడు. పరీక్ష చాలా కఠినంగా ఉన్నప్పటికీ బాబా చల్లని చూపుతో మావాడు పరీక్ష బాగానే వ్రాశాడు. ఆ తరువాత బాబా అనుగ్రహంతో ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మా ఆనందానికి అవధులు లేవు. బాబా ఇలా ఎల్లవేళలా మా కుటుంబంపై తమ ప్రేమను కురిపిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. “ధన్యవాదాలు బాబా!” 

ఎప్పటినుండో మా కుటుంబాన్ని వేధిస్తున్న సమస్యను పరిష్కరించమని బాబాను వేడుకుని గత మార్చి నెల నుండి శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ నాలుగుసార్లు చేశాను. ఆ కోరికను బాబా త్వరలోనే తీరుస్తారని బాబాపై భారం వేసి సబూరీతో ఎదురుచూస్తున్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో క్షేమంగా సాగిన తిరుమల యాత్ర

సాయిభక్తుడు శ్రీనివాసరావు తనకి బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిబంధువులకు నమస్కారం. గతంలో నేను 3, 4 అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు పంచుకుంటాను. ఇటీవల మా కుటుంబసభ్యులందరం కలిసి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని అనుకున్నాము. కానీ కోవిడ్-19 కారణంగా తిరుమలకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. తరువాత టి.టి.డి వాళ్ళు చాలా తక్కువమందికి శ్రీవారి దర్శనానికి అనుమతిని కలిపించారు. మేము జులై, ఆగస్టు నెలల్లో తిరుమల వెళదామని రెండుసార్లు ప్రయత్నించాము. కానీ అవకాశం కుదరలేదు. సెప్టెంబరు నెలలో టి.టి.డి వాళ్ళు మరికొంతమందికి శ్రీవారి దర్శనం కొరకు స్పెషల్ టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ విషయం మా అపార్టుమెంటులో ఉంటున్న మిత్రుడు మాతో చెప్పి, అందరం కలసి తిరుమల వెళదామని అడిగారు. మేము వెంటనే అందరికీ 2020, సెప్టెంబరు 15వ తేదీన శ్రీవారి దర్శనం అయ్యేవిధంగా దర్శనం టిక్కెట్లు బుక్ చేశాము. సెప్టెంబరు 15వ తేదీన ఇంటి వద్ద నుండి బయలుదేరాల్సి ఉండగా, రెండు రోజుల ముందు నుండి భారీవర్షాలు ప్రారంభమయ్యాయి. ఇంత వర్షంలో ఎలా బయలుదేరాలా అని మేము భయపడుతూ, బాబా మీద భారం వేశాము. విచిత్రంగా 14వ తేదీ రాత్రి వరకు వర్షం పడి, 15వ తేదీ తెల్లవారుఝామునుండి తగ్గుముఖం పట్టి, మేము బయలుదేరే సమయానికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. మేము బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా అబ్బాయి డ్రైవ్ చేస్తుండగా మా కారులో తిరుమల వెళ్ళాము. మా అందరికీ 15వ తేదీ సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. తరువాత మేమందరం 16వ తేదీ ఉదయం బయలుదేరి కపిలతీర్థం, మంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి దర్శించుకుని ఇంటికి వద్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ 15వ తేదీ రాత్రి విపరీతమైన గాలులతో పెద్ద వర్షం పడింది. ఇంత వర్షంలో మేము మరుసటిరోజు ఎలా బయలుదేరాలా అని ఆందోళనపడ్డాము. అదీకాక, మా బాబు మొదటిసారిగా కొండపై కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంత వర్షంలో తను ఎలా డ్రైవ్ చెయ్యగలడోనని చాలా భయపడ్డాము. మేము బాబా సహాయం కోసం ప్రార్థిస్తూ, ఎటువంటి ఇబ్బందీ లేకుండా మాకు సహాయం చేసి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేరిస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. విచిత్రంగా అంత పెద్ద గాలివాన కూడా తెల్లవారేసరికల్లా తగ్గి, చక్కగా మేము అనుకున్న దేవాలయాలన్నీ దర్శించుకుని చాలా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. ముఖ్యంగా మా బాబు డ్రైవింగులో మొదటిసారి తిరుమల కొండకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చేర్చి, శ్రీవారి దర్శనం చేయించి, తిరిగి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతూ మేమందరం క్షేమంగా ఇంటికి చేరేలా సహాయపడిన నా తండ్రి బాబాకు మనసారా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. “ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ ఇలాగే నీ చల్లని చూపు మా అందరిపై ఉండాలని, మా అందరినీ ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మా పెద్దబాబు కోరుకుంటున్నది కూడా సవ్యంగా జరిగేటట్లు చూడండి తండ్రీ!”



13 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo